Wednesday, October 31, 2012

మీడియా విశ్వసనీయత మాటేమిటి?



 రాజకీయనాయకులు, వ్యాపారవర్గాలు వగైరాల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాం. అందులోనూ మీడియా చాలా చురుకైన పాత్ర నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇండియా అగెనెస్ట్ కరప్షన్(ఐఏసీ) చేస్తున్న పనినే మీడియా చాలాకాలంగా చేస్తోంది. అది కూడా ప్రచారానికి దూరంగా. అవినీతి తీవ్రతను ప్రజల దృష్టికి తెచ్చింది మీడియానే. అందులోంచి పుట్టిన ప్రజాగ్రహమే ఐఏసీ ఉద్యమానికి ఇంధనం అందించింది.
మరి అటువంటి మీడియా విశ్వసనీయత మాటేమిటి?
కొంతకాలంగా, ముఖ్యంగా టీవీ చానెళ్లు విస్తరించినప్పటినుంచీ మీడియా ప్రమాదకరమైన మార్గంలో వెడుతోంది. అది ఆత్మహత్యా మార్గం అన్నా తప్పులేదు. విస్తరణతోపాటే పోటీ పెరగడం అందుకు కారణం. పోటీని తట్టుకోడానికి తగిన ఉపాయాలను ఆశ్రయించడాన్ని ఎవరూ ఆక్షేపించనవసరం లేదు. కానీ ఆ ప్రయత్నంలో విశ్వసనీయతను బలి పెడుతుండడమే ఆక్షేపణీయం. మీడియా చేస్తున్నది అదే. ప్రజాక్షేత్రంలో ఉన్నవారికి ఎవరికైనా విశ్వసనీయతే ప్రాణం. మీడియా మినహాయింపు కాదు.
మీడియా విశ్వసనీయత ఎంతగా పలచబడుతోందంటే, ఏదైనా ఒక ఘటన జరుగుతున్న క్రమంలో దానికి సంబంధించిన సమాచారం కోసం చానెళ్లపై ఆధారపడలేని పరిస్థితి వస్తోంది. ఒక ఉదాహరణ చూడండి. ఆ మధ్య శ్రీకాకుళం జిల్లాలో ఒకచోట రైతులపై కాల్పులు జరిగినప్పుడు ముగ్గురు చనిపోయారని చానెళ్లు మొదట ఫ్లాష్ న్యూస్ అందించాయి. తర్వాత హతుల సంఖ్య రెండుకీ, ఆ తర్వాత ఒకటికీ తగ్గింది. వాస్తవాలను ధృవీకరించుకోకుండా ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడానికి కారణం-పోటీ! ఏదో ఒక చానెల్ ముగ్గురు చనిపోయారంటూ  కాల్పుల ఘటనను సంచలనాత్మకం చేయడానికి ప్రయత్నిస్తుంది. మిగిలిన చానెళ్లు దానిని అనుసరిస్తాయి. వాస్తవాల ధృవీకరణ వరకూ ఆగితే తమ రేటింగ్ ఎక్కడ పడిపోతుందోనని వాటి భయం. నిజాలు ఇవ్వడంలో పోటీ పడే బదులు అవాస్తవాలు ఇవ్వడంలో చానెళ్లు పోటీ పడుతున్నాయి. అదీ సమస్య.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఊహాగానాలు తాజా ఉదాహరణ.
మంత్రివర్గ వ్యవస్థీకరణకు ముందు మీడియా వార్తలను గమనిస్తే అసాధారణమైనదేదో జరగబోతోందనే అభిప్రాయమే అందరికీ కలుగుతుంది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ జ్యోతిరాదిత్య సిందియా, సచిన్ పైలట్, పురందేశ్వరి తదితర యువ సహాయమంత్రులకు క్యాబినెట్ హోదా కల్పించబోతున్నారన్నాయి. పురందేశ్వరి ఆ వార్తలు నమ్మి ప్రధానికి కృతజ్ఞతలు కూడా చెప్పినట్టు వార్త వచ్చింది. చివరికి పల్లంరాజు, అజయ్ మాకెన్ లకు మాత్రమే క్యాబినెట్ హోదా లభించింది. యువ సహాయమంత్రులలో పలువురికి ఇండిపెండెంట్ చార్జి మాత్రమే కల్పించారు. అలాగే, జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పిస్తారన్న మీడియా సమాచారం నిజమైనా, ఆయనకు మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖ ఇస్తారన్న ఊహ అబద్ధమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను ఇచ్చారు. ఆనంద్ శర్మ విషయంలోనూ అదే జరిగింది. ఆయనకు విదేశాంగశాఖ ఇవ్వచ్చన్నారు. కానీ ఆయన శాఖ మార్చలేదు.
మీడియా సమాచారంలో కొన్ని నిజాలూ ఉన్న మాట నిజమే. అయితే, అసత్యాలుగా తేలిపోయినవే జనం దృష్టికి ఎక్కువగా ఆనతాయన్న సంగతిని మరచిపోకూడదు. విశ్వసనీయతను దెబ్బ తీసేవి అవే. ఊహించగలిగిన బలమైన ఇతరేతర కారణాలు ఉంటే తప్ప సహాయమంత్రిగా రెండు మూడేళ్ళ అనుభవం మాత్రమే ఉన్నవారికి;  మొదటిసారి, లేదా రెండవసారి పార్లమెంట్ సభ్యులైనవారికి క్యాబినెట్ హోదా కల్పించడం సర్వసాధారణంగా జరగదు. కనుక ఊహాగానాలు చేసేటప్పుడు మీడియా విజ్ఞత, జాగ్రత్త పాటించాలి.
చివరగా ఇంకో సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.  రాజకీయవ్యవస్థపై మీడియా దాడి ఇటీవలికాలంలో బాగా పెరిగింది. అవినీతి, అక్రమాల గుట్టు రట్టు చేయడం ద్వారా తన విశ్వసనీయతారాహిత్యాన్ని వేలెత్తి చూపిస్తున్న మీడియాపై  రాజకీయవ్యవస్థ కక్ష పెంచుకోవడం సహజం. ప్రతీకారంగా మీడియా విశ్వసనీయతను దెబ్బ తీయడానికీ అదీ ప్రయత్నిస్తుంది. కనుక అభిజ్ఞవర్గాలు కావాలనే మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశమూ ఉంది. మీడియా, రాజకీయవ్యవస్థల మధ్య ఒకరకమైన యుద్ధవాతావరణం నెలకొన్న సంగతిని గుర్తించినప్పుడు; యుద్ధంలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయన్న సంగతినీ అంగీకరించవలసిందే.




Friday, October 26, 2012

గడ్కరీ వ్యవహారం: పారదర్శకతా లోపమే అసలు విలన్

మనం చాలాకాలంగా అవినీతి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య మరీ ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవలసిందే.
అలాగే, అవినీతినే అసలు విలన్ గా భావిస్తున్నాం. అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు కూడా అదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. అయితే అవినీతి విలనే కానీ అసలు విలన్ కాదు. అసలు విలన్ పారదర్శకత లోపించడం. అవినీతి చెట్టు అయితే పారదర్శకతా లోపం దానికి వేరు. వేళ్ళు వదిలేసి చెట్టు గురించి ఎంత చర్చించుకున్నా ఉపయోగం లేదు.
అందుకే నేను వెనకటి బ్లాగులలో పారదర్శకత అవసరాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నించాను. దానిని కొంతమంది అపార్థం చేసుకున్నారు కూడా. గడ్కరీ వ్యవహారమూ; బీజేపీ శ్రేణులూ, ఆర్.ఎస్.ఎస్. ఆయనను వెనకేసుకొస్తున్న తీరూ చర్చను పరోక్షంగా  అవినీతి వైపు కాక పారదర్శకతా లోపం వైపే నడిపిస్తూ నా అభిప్రాయానికి మరింత బలం కలిగిస్తున్నాయి.
గడ్కరీ వ్యాపారపు గుట్లు వాయిదాల పద్ధతిలో రోజుకొకటి చొప్పున  రట్టవుతున్నాయి చూడండి, అదే ఒక పెద్ద సాక్ష్యం. పూర్తీ గ్రూప్ గురించిన నిజాలను మీడియా ఒకటొకటిగా 'తవ్వి తీస్తే' తప్ప జనానికి తెలియలేదు. 120 కోట్ల జనాభాకు అన్నీ తెలియడం సాధ్యమా అని అనుకోవచ్చు. కానీ అవసరమైనప్పుడు 'తవ్వి' తీయనవసరం లేకుండానే తెలుసుకునే అవకాశం ఉండాలి. అదే పారదర్శకత. అది లోపించిందనడానికి అంతకంటే కొట్టొచ్చినట్టు కనిపించే సాక్ష్యం, మీడియా గుచ్చి గుచ్చి అడిగినా అన్నీ వివరాలనూ గడ్కరీ అందించకపోవడం, తనను 'వ్యాపారి' అన్నందుకే మొదట ఆయన ఆక్షేపించారు. ఆరోపణలను తీసిపారేస్తూ ఏ విచారణకైనా సిద్ధమన్నారు. పూర్తీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన  కంపెనీల చిరునామాల గురించి, డైరక్టర్ల గురించి అడిగినా ఆయన చెప్పలేదు. పదివేలమంది చిరునామాలు వెల్లడించడం ఇప్పటికిప్పుడు సాధ్యమా అని ప్రశ్నించారు. షెల్ కంపెనీలుగా తేలిన 18 కంపెనీల గురించి అడిగినా ఆయన నోరు విప్పలేదు. ప్రతి అంచెలోనూ పలుగూ, పారా పుచ్చుకుని మీడియాయే శ్రమపడవలసి వచ్చింది. పూర్తీ గ్రూప్ డైరక్టర్లలో గడ్కరీ డ్రైవరూ, బేకరూ, జ్యోతిష్కుడూ కూడా ఉన్నారనీ; ఒక్కొక్కరూ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారనే ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగు చూసింది. ముందు ముందు ఇంకెన్ని నిజాలు బయటపడతాయో తెలియదు. గమనించండి... తీవ్ర ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఈ వివరాలు అన్నీ వెల్లడించి తన వ్యాపార లావాదేవీలను తెరచిన పుస్తకంలా జనం ముందు ఉంచాలని గడ్కరీ అనుకోలేదు.
కారణం, పారదర్శకత గురించిన ఖాతరు లేకపోవడం!
ప్రజాక్షేత్రంలో పారదర్శకత అవసరాన్ని కొద్దో గొప్పో మనం గుర్తిస్తున్నాం కానీ, వ్యాపార వ్యవహారాలలో 'గుట్టు' పాటించడాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం. వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యవహారంగా చూస్తున్నాం. వ్యాపారమే వృత్తిగా ఉన్నవారు అలా అనుకోవడాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ 'రాజకీయ వ్యాపారుల' విషయంలో అదెలా చెల్లుతుందన్నది ప్రశ్న. పబ్లిక్ జీవితంలో ఉన్నవారు తమ ప్రైవేట్ లావాదేవీలలోకి ఎవరూ తొంగి చూడడానికి వీలు లేదంటే కుదరదు. సగం వెలుగులో, సగం చీకట్లో ఉంటామంటే వీలు పడదు.
గడ్కరీ, ఆయన సమర్థకులు చేస్తున్నది ఆ అసాధ్యమైన ఫీటే. షెల్ కంపెనీలు, తప్పుడు చిరునామాలు, తమ చేతికింది మనుషుల్ని డైరక్టర్లుగా నియమించుకోవడం వగైరాలన్నీ నేటి వ్యాపారరంగంలో సహజమే నని వారు భావిస్తున్నారు. అవన్నీ 'కార్పొరేట్ ప్రాక్టీసెస్' లో భాగమే నంటూ ఒక పెద్దమనిషి గడ్కరీని వెనకేసుకు వచ్చాడు. ఏ వ్యాపారసంస్థ ఇలాంటి వాటికి అతీతమో చెప్పండని ఒక ప్రొఫెసర్ ఆవేశపడ్డాడు. పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చడం ముఖ్యం కానీ మిగిలిన వాటిని పట్టించుకోనవసరం లేదని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తేల్చాడు. ఇక్కడ ఒక చిన్న ఔచిత్యాన్ని వీరందరూ విస్మరించడమే ఆశ్చర్యం. గడ్కరీని సాధారణ వ్యాపారులతో పోల్చడానికి వీలులేదు. ఆయన గతంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ తిరిగి అధికారం లోకి వస్తే మరోసారి మంత్రి కాగల అవకాశమూ ఆయనకు ఉంది. అంటే, 'కార్పొరేట్ ప్రాక్టీసెస్' పేరిట తప్పుడు పద్ధతులను, గోప్యతను  తలవంచుకుని అనుసరించే స్థితిలో కాక; వాటిని మార్చగలిగిన రాజకీయస్థానంలో ఉన్నారు. కనుక సాధారణ వ్యాపారులకు వర్తించే ప్రమాణాలు ఆయనకు వర్తించవు. ఇది గుర్తించడానికి కామన్సెన్స్ చాలు.
విలువలకు ప్రాధాన్యమిచ్చేదిగా చెప్పుకునే  పార్టీ స్పందనలో కూడా ఆ కామన్సెన్స్  లోపించడమే వింత. 'శీలనిర్మాణమే' లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పే ఆర్.ఎస్.ఎస్. గడ్కరీపై వచ్చిన ఆరోపణలు చిన్నవంటూ తీసిపారేయడం అంతకంటే విచిత్రం. అందరు వ్యాపారులూ చేసే పనే గడ్కరీ కూడా చేస్తే ఎందుకింత అల్లరి చేయాలని వాళ్ళ ఉద్దేశం. గోప్యతను బద్దలు కొడుతున్నందుకే మీడియా పై అంత అక్కసు. 'కార్పొరేట్ ప్రాక్టీసెస్' పేరిట తప్పుడు పనులను కూడా సహించాలన్న సందేశాన్నే తాము పరోక్షంగా అందిస్తున్నామన్న గ్రహింపు కూడా వీరికి లేదు.  నైతిక భ్రష్టత ఎంత దూరం వెళ్ళిందంటే, గడ్కరీ మంత్రి పదవిలో లేరు సరికదా, పార్లమెంటు సభ్యుడు కూడా కారనీ; అలాంటి ఒక ప్రైవేట్ వ్యక్తిని అల్లరి పెట్టడం న్యాయం కాదనీ రాజ్ నాథ్ సింగ్ అంటారు. మేము అధికారంలో ఉంటే నీతినియమాలను పాటిస్తామని ఆయన చేసిన మరో హాస్యాస్పదవ్యాఖ్య. అలాగే, గడ్కరీ వ్యవహారంలో ప్రజాధనం పాత్ర లేదు కనుక ఆయనను తప్పు పట్ట కూడదని చందన్ మిత్రా ఉవాచ. 'ప్రభువా, ఈ వాచాలతను క్షమించు, తాము ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు' అనడం కన్నా ఏమనగలం?
ఒకవేళ గడ్కరీ అమలులో ఉన్న 'కార్పొరేట్ ప్రాక్టీసెస్' నే గుడ్డిగా అనుసరించారనుకున్నా, ఐడియల్ రోడ్ బిల్డర్స్ నుంచి పెట్టుబడిని, రుణాన్ని తీసుకోవడంలో క్విడ్ ప్రోకోను అనుమానించే అవకాశం ఉండనే ఉంది. నిజంగానే గడ్కరీ వ్యాపార లావాదేవీలలో అవినీతి లేదనుకుందాం. మరి, ఉన్నట్టు అనుమానాలు వ్యాపించడానికి కారణం ఏమిటి?పారదర్శకతా లోపం. అవినీతి జరగడానికీ, జరిగిందన్న అనుమానం కలగడానికీ కూడా కారణం పారదర్శకతా లోపమే.  రాజకీయపార్టీలు ఆ దిశగా చర్చను నడిపించకపోవడానికి కారణం, పారదర్శకతా లోపంలోనే రాజకీయవ్యాపారుల స్వప్రయోజనాలు ఇమిడి ఉండడమా?!

Tuesday, October 23, 2012

హౌ ‘ఐడియల్’ దిస్ ‘రోడ్’ మిస్టర్ గడ్కరీ?


కిందటి బ్లాగ్ కు నేను రాబర్ట్ సల్మాన్ గడ్కరి అని పీరు పెట్టాను. అది ఆరోపణల వరసక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని. అయితే, ఆరోపణల విలువను దృష్టిలో పెట్టుకున్నప్పుడు సల్మాన్ ను గడ్కరీ కంటే ముందు పేర్కొనడం అన్యాయమనిపించింది. పాపం, పూర్ సల్మాన్ మీద వచ్చిన ఆరోపణ విలువ 71 లక్షలే. గడ్కరీపై వచ్చిన ఆరోపణ విలువ కోట్లలో ఉంది. ఆ విధంగా చూసినప్పుడు రాబర్ట్ గడ్కరీ సల్మాన్ అనడమే న్యాయం.
రాజకీయనాయకుడు వ్యాపారి కావడం గురించి పై బ్లాగ్ లో చెప్పుకున్నాం. రాజకీయనాయకుడు వ్యాపారి కావడమే కాదు; వ్యాపారమంటే సంఘసేవ అన్న కొత్త నిర్వచనాన్ని అందించి, రాజకీయ వ్యాపారిని సంఘసేవకుడు గానూ మార్చగలడు.  రాజకీయం మహిమ అలా ఉంటుంది. తిమ్మిని బమ్మి చేయడం అంటారు చూడండి, అది ఇదే. వెనకటి కొకాయన రాజకీయనాయకులు ఎలాంటి వారో చెబుతూ, నీళ్ళు లేని కాలువ మీద వంతెన కట్టిస్తామని చెప్పగల సమర్థులంటాడు. తాము ఏం చెప్పినా జనం నమ్మేస్తారన్న నమ్మకంతో రాజకీయనాయకులు అలా చెబుతారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. జనం నమ్మడం లేదని తెలిసిన తర్వాత కూడా రాజకీయనాయకులు నమ్మశక్యం కాని మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అలాగే, ఈ విద్యలో నూరేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘనాపాటి అని చాలామంది అనుకుంటారు. అదీ అర్థసత్యమే. పార్టీ ఆఫ్ డిఫరెన్స్ గా తనను అభివర్ణించుకునే బీజేపీ ఈ విద్యలో కాంగ్రెస్ కంటె నాలుగు పన్నాలు ఎక్కువే చదువుతోంది. కావాలంటే శని, ఆదివారాలు(20, 21 అక్టోబర్) ఎన్.డీ.టీ.వీ ప్రసారం చేసిన గడ్కరీ-శ్రీనివాస్ జైన్ ముఖాముఖీ చూడండి.
పార్టీ ఆఫ్ డిఫరెన్స్ జాతీయ అధ్యక్షుడు తనపై వచ్చిన ఆరోపణలకు సాహసోపేతంగా సమాధానం చెప్పడంలోనే డిఫరెంట్ గా వ్యవహరించారు. కాకపోతే ఆ సాహసం బరితెగింపు గా ధ్వనించడమే ఆందోళన కలిగించే విషయం. నేను చేసేది వ్యాపారం కాదు, సంఘసేవ అనడమే కాదు; తన కంపెనీ షేర్లు ఎవరు కొన్నా తనకు అభ్యంతరం లేదనీ; రాజకీయనాయకులకు వ్యాపారులతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నా తప్పులేదనీ కుండ బద్దలు కొట్టారు. తన వ్యాపార లావాదేవీలలో భిన్న ప్రయోజనాల మధ్య ఘర్షణ(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటెరెస్ట్స్) ఎక్కడా లేదని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. నిజంగానే ఆయన విదర్భ పేద రైతులకు సాయం చేయడానికే చక్కెర కర్మాగారాన్ని స్థాపించారనీ, దానిని లాభసాటి వ్యాపారంగా కాకుండా సంఘసేవ గానే భావించారనీ మాట వరసకు అనుకుందాం. అయితే,  ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించడమే కాదు; వ్యవహరిస్తున్నారన్న విశ్వాసాన్ని జనానికి కలిగించాలన్న ప్రాథమిక నీతిని విస్మరించడమే ఆశ్చర్యకరం. అందులోనూ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి!
ఆరోపణల తీరు చూడండి:
1.     1995-99 మధ్యకాలంలో గడ్కరీ మహారాష్ట్రలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడే ఐడియల్ రోడ్ బిల్డర్స్ అనే కంపెనీ వ్యాపారం 41 కోట్ల నుంచి 67 కోట్లకు పెరిగింది. మంత్రిపదవి ముగిసిన తర్వాత గడ్కరీ పూర్తీ గ్రూప్ కంపెనీలను స్థాపించారు. 2001లో ఐడియల్ బిల్డర్స్ పూర్తీ గ్రూప్ కంపెనీలలో 1.85 కోట్ల విలువైన షేర్లు తీసుకుంది. అంటే, ప్రజాపనుల శాఖ మంత్రిగా గడ్కరీ సొంతపనులు చక్కబెట్టుకోడానికి ముందే పూర్వరంగాన్ని నిర్మించుకున్నారని ఆరోపణ.
2.    ఐడియల్ బిల్డర్స్ యజమాని డీ.పీ. మహిస్కర్  గ్లోబల్ సేఫ్టీ విజన్ పేరుతో ఇంకో కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ 2010లో పూర్తీ గ్రూప్ కు 165 కోట్లు రుణం ఇచ్చింది. అప్పటికి గ్లోబల్ సేఫ్టీ విజన్ ఖాతాలో ఉన్న సొమ్ము లక్ష రూపాయిలు మాత్రమే!
3.    పూర్తీ గ్రూప్ కంపెనీలకు ఛైర్మన్ గా ఉన్న గడ్కరీకీ ఆ కంపెనీలలో ఉన్నది కేవలం 200 షెర్లే! పేరుకి ఆ కంపెనీలలో వాటాదారులు పది వేలమంది ఉన్నా 70 శాతం యాజమాన్యం 18 కంపెనీలకే ఉంది. తీరా ఎన్.డీ.టీ.వీ విలేఖరులు కోల్కతా, ముంబై లలో ఉన్న ఈ కంపెనీల చిరునామా వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే, 20 ఏళ్లుగా అదే చిరునామాలో కాపురం ఉంటున్న వాళ్ళు కూడా అక్కడ ఎలాంటి కంపెనీ లేదని చెప్పారు. దానిపై గడ్కరీని ప్రశ్నిస్తే, కంపెనీలు తరచు చిరునామా మార్చుకుంటూ ఉంటాయని చెప్పారు.  పదివేల మంది వాటాదారులు ఉన్నప్పుడు అందరి చిరునామాలు నా కెలా తెలుస్తాయని బుకాయించారు. ఈ కంపెనీల డైరెక్టర్ల ఆచూకీని కూడా ఎన్.డీ.టీ.వీ విలేఖరులు కనిపెట్టలేకపోయారు.  తమాషా ఏమిటంటే, ఒకే వ్యక్తి చాలా కంపెనీలకు డైరక్టర్ గా ఉన్నాడు. అంతకంటే తమాషా ఏమిటంటే, గడ్కరీ డ్రైవర్ పూర్తి డైరక్టర్లలో ఒకడట!
ఈ దేశంలో కంపెనీల వ్యవస్థ పారదర్శకతకు ఎంత దూరంగా ఉందో పైన పేర్కొన్న ప్రతి వివరమూ కళ్ళకు కట్టిస్తుంది. అంతేకాదు, అలా ఉండడంలో అన్ని పార్టీలకూ ఒకే విధమైన వెస్టెడ్ ఇంటరెస్ట్ ఉంది. హర్యానా ప్రభుత్వం రాబర్ట్ వద్రాకు అసాధారణ వేగంతో ఉపకారాలు చేసిపెట్టలేదా అని డెవిల్స్ అడ్వకేట్ లో కరణ్ థాపర్ ప్రశ్నిస్తే, అందులో ఎక్కడైనా చట్ట విరుద్ధత ఉందా అంటూ దిగ్విజయ్ సింగ్ పదే పదే రెట్టించి అడిగారు. అలాగే, ప్రజాపనుల మంత్రిగా మీరు ఐడియల్ బిల్డర్స్ కు ఉపకారాలు చేశారనీ, అందుకే ఆ కంపెనీ మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిందనీ, ఇందులో క్విడ్ ప్రోకో ఉందనే ఆరోపణకు మీరేమంటారని శ్రీనివాసన్ జైన్ అడిగితే; మంత్రిగా నేను తీసుకున్న చర్యల్లో చట్ట విరుద్ధత ఎక్కడైనా ఉంటే చూపించండని గడ్కరీ అన్నారు. పార్టీలు వేరైనా దిగ్విజయ్, గడ్కరీల భాష ఒకటే...గమనించండి.
రాజకీయనాయకులకు, చివరికీ మంత్రులకు కూడా వ్యాపారులతో, కాంట్రాక్టర్లతో స్నేహ సంబంధాలు ఉండడంలో తప్పులేదని గడ్కరీ అనడం ఆశ్చర్యం కాదు, దిగ్భ్రాంతి కలిగిస్తుంది. న్యాయమూర్తులు ఏదైనా కేసు విచారణలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉందని భావించే అవకాశం ఉంటే, ఆ విషయం వెల్లడించి సంబంధిత బెంచ్ నుంచి తప్పుకోవడం చూస్తుంటాం. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవద్దనీ, పార్టీలు వగైరాలకు వెళ్లవద్దనీ సుప్రీంకోర్ట్ ప్రధానన్యాయమూర్తి జడ్జీలను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ ఆఫ్ డిఫరెన్స్ జాతీయ అధ్యక్షుడి ప్రవర్తనా నియమావళిని అనుసరించి జడ్జీలు కూడా వ్యాపారులతో, కాంట్రాక్టర్లతో, రాజకీయనాయకులతో పూసుకు తిరగచ్చు! బ్యూరోక్రాట్లు మాత్రం ఏం పాపం చేశారు? వాళ్ళూ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయనాయకులతో చెట్టపట్టాలు వేసుకోవచ్చు!
రాజకీయనాయకులు ఎంత దూరం వెళ్లారో చూడండి. వాళ్ళ ప్రవర్తనా నియమావళిలో ఔచిత్యం అనే మాట పూర్తిగా అదృశ్యమైపోయింది. చట్టబద్ధంగా ఉంటేచాలు, ఏం చేసినా తప్పులేదు! మళ్ళీ చట్టాలు చేసేదీ వాళ్లే నన్న సంగతిని మరచిపోకూడదు.
అంతవరకు మహారాష్ట్రకు మాత్రమే తెలిసిన గడ్కరీ ఒక్కసారిగా బీజేపీ జాతీయ అధ్యక్ష స్థాయికి ఎదిగిన తీరు అప్పట్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఔట్ ఆఫ్ బ్లూ అనే ఆంగ్ల నుడికారం గుర్తొచ్చింది. గతంలో ప్రచారక్ గా పనిచేసిన గడ్కరీ బీజేపీ అధ్యక్షుడు కావడంలో ఆర్.ఎస్.ఎస్. పాత్ర ఉందనీ, ఆయన ఆ సంస్థకు చాలా ఇష్టుడనీ వినిపించింది. శీలనిర్మాణానికి ప్రాధాన్యమిచ్చేదిగా భావించే ఆర్.ఎస్.ఎస్; గడ్కరీ ప్రవచించిన దుశ్శీల ప్రవర్తనా నియమావళిని ఎంతవరకు ఆమోదిస్తుందన్నది శేషప్రశ్న.






నాయకన్, యశ్ చోప్రా వగైరా...


విజయదశమి శుభాకాంక్షలు
ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి సహజమైనవంటారు.
ఇరవయ్యో శతాబ్దపు మనిషి వీటికి అదనంగా ఇంకొకటి చేర్చుకోవాలి...అది, సినిమా. వెనకటి శతాబ్దాలలో అది నాటకం. ప్రతి కాలంలోనూ మనిషి ఏదో ఒక కళారూపాన్ని సృష్టించుకుని దానితో తాదాత్మ్యం చెందుతూనే ఉంటాడు. అందులో తన ప్రతిబింబాన్ని వెతుక్కుంటూనే ఉంటాడు.
 కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్యేకాదు; మనం సినిమాల మధ్య కూడా పెరుగుతాం. సినిమాల వెలుగులో మన ఊహాప్రపంచాన్ని నిర్మించుకుంటాం.  వ్యక్తిత్వాన్ని దిద్దుకుంటాం. వేషభాషలు అలవరచుకుంటాం. సినిమా మన మీద చూపించే పరోక్ష ప్రభావం గురించి చెప్పడం ప్రారంభిస్తే అదొక ఉద్గ్రంథమవుతుంది. వానకు తడవని వాడు ఉండనట్టే ఈ రోజుల్లో సినిమా చూడనివాడూ ఉండడు. ఇరవయ్యో శతాబ్దానికి చెందిన దాదాపు ప్రతి వ్యక్తి జీవితచరిత్రలోనూ సినిమా ఒక ముఖ్య అధ్యాయమవుతుంది. అయితే మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి.
ఇంకో విషయం...సినిమా మన సామాజిక పరిణామ చరిత్రను కూడా నమోదు చేస్తుంది.
అప్పుడప్పుడు నా సినిమా ప్రపంచాన్ని మీతో పంచుకునే ప్రయత్నానికి ఇదో చిన్న ఉపోద్ఘాతం.
                                                 *                                                                           
ఆదివారం(అక్టోబర్ 21) పొద్దుటే హిందూ పత్రిక తెరిచేసరికి అందులో నాకు ఆనందం కలిగించే అంశాలు రెండు కనిపించాయి. మొదటిది, నాయకన్(తెలుగులో నాయకుడు’) సినిమాపై కమల్ హాసన్ గతస్మృతులు. రెండోది, వంద కోట్ల వ్యయంతో, రామాయణం ఆధారంగా, రావణుడి కోణం నుంచి  ఒక సినిమా తీస్తున్నామనీ, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనీ మంచు విష్ణు చెప్పడం. ఇది ఆనందంతోపాటు భయమూ కలిగించింది. తెలుగు సినిమా కొత్త వస్తువు వేటలో (వస్తువు పాతదే అయినా కొత్తగా చెబుతారనే ఉద్దేశంతో)పడినట్టు అనిపించి ఆనందం. తగినంత పరిశోధన, లోతు వగైరాలు లేకుండా దానిని కూడా ఓ మూస సినిమాలా ఎక్కడ తయారుచేస్తారోనని భయం.
ఇంతలో ఆదివారం సాయంత్రమే ఒక విషాదవార్త! యశ్ చోప్రా మరణం.
ముందుగా నాయకన్ సినిమా గురించి. తెలుగులో ఆ సినిమా చూసి నేను ఎంత ముగ్ధుణ్ణి అయ్యానో చెప్పలేను. తెలుగులో మన బుద్ధినీ, హృదయాన్నీ కూడా స్పృశించే సినిమాలు చాలా తక్కువ. నాయకుడు ఇందుకు భిన్నం. అథోజగత్తుకు చెందిన నేరస్తులను తెర మీద చూపించడంలో సినిమాలు అనుసరించే మూస పోకడలను అది బద్దలు కొట్టింది. హింస నుంచి హింస ఎలా పుడుతుందో, హింస ఒక జీవిత అనివార్యంగా ఎలా మారుతుందో; హింసాత్మక జీవితం గడిపే వ్యక్తిలో కూడా మానవీయ సంవేదనలు ఎలా ఉంటాయో చాలా వాస్తవికంగా, అద్భుతమైన అవగాహనతో చిత్రీకరించిన సినిమా అది. తండ్రి హింసాత్మక జీవితాన్ని మొదటిసారి చూసిన కూతురు అతనిని అసహ్యించుకుంటుంది. నాన్నా, ఈ హింస మానలేవా?’ అని అడుగుతుంది. మానేస్తే నేను బతకలేనమ్మా అని తండ్రి సమాధానం చెబుతాడు. మధ్యతరగతి విద్యావంత వర్గం విశ్వసించే విలువలకు, ప్రాపంచిక అవగాహనకు; అథో జగత్ జీవితానికి మధ్య నున్న అంతరాన్ని ఆ ఒక్క సంభాషణే బయటపెడుతుంది. అలాగని ఆ సినిమా హింసను సమర్థిస్తుందని కాదు.  హింస పుట్టుక వెనుక నున్న సామాజిక నేపథ్యాన్ని ఎంతో లోతుగా గొప్ప అవగాహనతో మన ముందు ప్రదర్శిస్తుంది.  ప్రధానస్రవంతికి చెందిన ఒక కమర్షియల్ సినిమాలో కూడా మంచి లోచూపును, మేధస్సును రంగరించగలిగిన దర్శకుడు మణిరత్నం మామూలు దినుసు కాదని అప్పుడే అనిపించింది. ఈ సినిమా ప్రత్యేకతను విశ్లేషిస్తూ అప్పట్లోనే నేను ఓ పత్రికలో వ్యాసం రాశాను. తెలుగులో ఇంకెవరైనా రాశారో లేదో నాకు గుర్తులేదు.
టైమ్ మ్యాగజైన్ 100 గొప్ప సినిమాల జాబితాలో నాయకన్ ను చేర్చడం నా అంచనాకు ధృవీకరణ.
మనం సినిమాల మధ్య పెరుగుతామని పైన అన్నాను. కొన్ని సినిమాలు మన హృదయానికి మరీ దగ్గరవుతాయి. మన గతజీవన జ్ఞాపకాల పందిరిని మల్లె పొదలా అల్లుకుంటాయి. వక్త్, దీవార్ లాంటి యశ్ చోప్రా సినిమాలు అలాంటివి. నాకు సంగీతజ్ఞానం తక్కువ. సినిమా పాట విలువ కట్టగల నేర్పు ఉందని చెప్పలేను. అయినాసరే,  మీకు బాగా ఇష్టమైన పాట లేవని అడిగితే మొదట కభీ కభీ అని చెబుతాను. నిజానికి ఆ పాటలోని చాలా మాటలకు నాకు అర్థం తెలియదు. ఆ పాట వింటున్నప్పుడు పాటను మించి అందులో ఇంకేదో ఉందని  అనిపిస్తూ ఉంటుంది. శ్రావ్యతతోపాటు ఆ పాట ఏకాంతాన్ని ధ్వనిస్తూ అర్థం తెలియని ఏదో మధురమైన విషాదాన్ని గుండెల్లో నింపుతుంటుంది.  నాలాంటి ఎంతోమంది గతస్మృతులను నిరంతరం పరిమళ భరితం చేసే పారిజాతాలను సృష్టించిన యశ్ చోప్రాకు నివాళి.


Wednesday, October 17, 2012

'రాబర్ట్ సల్మాన్ గడ్కరీ'

భమిడిపాటి రాధాకృష్ణ రాసిన 'కీర్తిశేషులు' నాటకంలో ఒక 'పంచ్' డైలాగ్ ఉంది.
కవిగారికి సన్మానం చేస్తానంటూ ఓ వ్యక్తి వస్తాడు.
కవిగారికి ఓ  అన్న ఉంటాడు. అతని పేరు మురారి. అతను నటుడు, తాగుబోతు కూడా.  సన్మానం చేస్తానన్న వ్యక్తితో మురారి అంటాడు:
'ఓహో! మీది సన్మానాల వ్యాపారమన్న మాట'
అతనిలా అంటాడు:
'భలేవారే...నాకు పొలం పుట్రా, గొడ్డు గోదే ఉన్నాయండీ'
మురారి అంటాడు:
'అయితే ఇంకేం? బాగా లాభాలు గడించారన్నమాట'

అరవింద్ కేజ్రీవాల్ బృందం నితిన్ గడ్కరీ పై చేసిన ఆరోపణల వెలుగులో పై సంభాషణను ఇలా చెప్పుకోవచ్చు:
మురారి: ఓహో! మీది రాజకీయ వ్యాపారమా?
గడ్కరీ: భలేవారే...నాకు ప్రభుత్వం ఇచ్చిన నూరెకరాల భూమీ, అయిదు పవర్ ప్లాంట్లూ, మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నాయండీ.
మురారి: అయితే ఇంకేం? బాగా లాభాలు గడించారన్నమాట.

తనను వ్యాపారి అన్నందుకు గడ్కరీ అరవింద్ టీం ను ఆక్షేపించారు.
కానీ తనకు పవర్ ప్లాంట్లూ, చక్కెర కర్మాగారాలు లేవని అనలేదు. గడ్కరీ, ఆయన పార్టీ సహచరుల దృష్టిలో అది వ్యాపారం కాదు. విదర్భ రైతులకు ఆయన లాభాపేక్ష లేని సాయం చేస్తున్నారు. అంటే ఎన్.జీ.ఓ తరహా పని చేస్తున్నారన్న మాట.
సామ్యం చూడండి...సల్మాన్ ఖుర్షీద్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటారు...ఉంటూనే ఒక ప్రభుత్వేతర ట్రస్టుకు అధ్యక్షుడిగా ఉండి కొన్ని శారీరక సామర్థ్యాలు లోపించిన వారికి సాయం చేస్తుంటారు. అలాగే, గడ్కరీ ప్రభుత్వంలో గతంలో మంత్రిగా ఉన్నారు. అవకాశాలు కలిసొస్తే భవిష్యత్తులో కూడా మంత్రి అవుతారు. ఒకప్పుడు కేంద్రంలో, ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్టీకి అధ్యక్షుడుగా ఉంటారు. మరోవైపు కాంగ్రెస్ సల్మాన్ లానే ఎన్.జీ.వో తరహా పని చేస్తూ ఉంటారు. విచిత్రం చూడండి, ప్రభుత్వంలో ఉన్న, లేదా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నవాళ్లే ప్రభుత్వేతర సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వాలకన్నా బాగా అవే పనిచేస్తాయన్న మెసేజ్ ఇస్తుంటారు.
 ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం మనం చూస్తుంటాం. ఇది కూడా అచ్చంగా ఇలాగే ఉంటుంది.

ప్రభుత్వం రైతులనుంచి సేకరించిన భూమిని ఇంకొకరికి ఇవ్వడం చట్టవిరుద్ధం కాదా, అదనంగా సేకరించిన భూమిని తిరిగి రైతులకే అప్పగించాలని నిబంధనలు చెప్పడం లేదా, మరి గడ్కరీ ప్రభుత్వ భూమిని ఎలా తీసుకున్నారని అడిగితే; బీజేపీ అధికారప్రతినిధి నిర్మలా సీతారామన్ జవాబు గమనించండి: ఆ భూమిని ఆయన సొంతానికి వాడుకోడంలేదట...విదర్భ పేదరైతులకు సాయం చేస్తున్నారట...అంటే ఏమిటన్నమాట?  గడ్కరీ లాంటి రాజకీయనాయకులు ప్రభుత్వంలో ఉండి చట్టాలు చేస్తుంటారు. వాళ్ళే మళ్ళీ 'పేదల కోసం' రాబిన్ హుడ్ అవతారమెత్తి చట్టాన్ని ఉల్లంఘిస్తుంటారు!
ప్రజల వివేచనాశక్తి మీద వీళ్ళకెంత చులకనభావమో!

రాజకీయనాయకులు తెర మీద రాజకీయాలు చేస్తుంటారు. తెరవెనుక వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వెనకటి రోజుల్లో నెహ్రూ, పటేల్, టంగుటూరి ప్రకాశం లాంటి వాళ్ళు ఎంతో లాభసాటి వృత్తులు, వ్యాపారాలు విడిచిపెట్టి రాజకీయాలలోకి వచ్చారు. ఇప్పటి వాళ్ళు వ్యాపారాలు చేసుకోడానికీ, ఉన్న వ్యాపారాలను పెంచుకోడానికీ రాజకీయాలలోకి వస్తున్నారు.  అయితే, వీళ్ళు తెర మీద చేసే రాజకీయాలే ప్రజలకు తెలుస్తాయి. తెర వెనుక చేసే వ్యాపారాలు తెలియవు. తెలియాలని రాజకీయనాయకులు అనుకోరు. చంద్రుడిలా ఈ రాజకీయచంద్రులు కూడా జనానికి తమ ఒక ముఖాన్నే చూపిస్తారు. ఇది ఇంకానా, ఇకపై చెల్లదన్న హెచ్చరికను అరవింద్ బృందం తాజా చర్య అందించగలిగితే అదే పదివేలు.

అసలు వ్యాపారాలు చేసుకునేవాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొస్తారు; లేదా రాజకీయాలలోకి వచ్చి వ్యాపారులుగా ఎందుకు మారుతుంటారన్నది ఎంతో కాలంగా జవాబుకు, చర్చకు దూరంగా ఉన్న ప్రశ్న. ఆ చర్చను ముందుకు తీసుకువెళ్లినా అరవింద్ ప్రభృతులు అభినందనీయులే. నిజానికి 'రాజకీయం-వ్యాపారం' కాంబినేషన్ చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. పారదర్శకత లోపించినప్పుడు అది మరింత అసహ్యంగా ఉంటుంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వస్తున్నారంటే, రాజకీయాలలో ఖర్చు పెట్టడానికి కావలసినంత 'మిగులు' వ్యాపారంలో, పరిశ్రమల్లో సంపాదిస్తూ ఉండాలి. అలాగే, తెర వెనుక వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోడానికి రాజకీయ బుల్లెట్ ప్రూఫ్ ధరిస్తూ ఉండాలి. ఇంతకన్నా ఊహించగలిగిన కారణాలు కనిపించవు.

ఈ రాజకీయ-వ్యాపార లింకును ఛేదించడం దీనికి ఒక పరిష్కారమా? ఎలాగంటే, రాజకీయాలలో ఉంటూ వ్యాపారాలు చేయకూడదనే నిబంధన తేవచ్చు. అప్పుడు రాజకీయనాయకులు బతకడమెలా అన్న ప్రశ్న వస్తుంది. పార్టీల  ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలన్న సూచనలా, రాజకీయనాయకులకు జీతం ఏర్పాటు చేయాలన్న సూచనను పరిశీలించచ్చు. ఇవి ఆచరణయోగ్యం కావనుకుంటే మరో ఉపాయాన్ని చూడచ్చు. సమస్యను గుర్తించడమంటూ జరిగితే పరిష్కారమార్గంలో సగం దూరం వెళ్ళినట్టే.

కాంగ్రెస్ సల్మాన్ తోనే కాదు, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన రాబర్ట్ వద్రాతో కూడా బీజేపీ గడ్కరీకి ఎంత బాగా పోలిక కుదిరిందో చూడండి... రాబర్ట్ వద్రాకు కావలసిన అనుమతులను హర్యానా ప్రభుత్వం రెండు రోజుల్లోనే ఇస్తే, గడ్కారీకి కావలసిన పనులను ఎన్సీపీకి చెందిన మంత్రి అజిత్ పవార్ నాలుగు రోజుల్లోనే చేసి పెట్టారు!

అరవింద్ టీం ను బీజేపీ బీ-టీం అని ఆరోపిస్తున్నారు కానీ; పై పోలికల దృష్ట్యా చూస్తే బీజేపీని కాంగ్రెస్ బీ-టీం గా అభివర్ణించడం ఎంతైనా న్యాయంగా ఊంటుంది.

రాజా లాంటి కాంగ్రెస్ ఏ-టీం ఉండగా బీజేపీ బీ-టీం దేనికన్నది ఎప్పటినుంచో జనం ముందు వ్రేలాడుతున్న ప్రశ్న!


Saturday, October 13, 2012

ఖుర్షీద్ వివాదం: సర్కారీ సొమ్ముతో సొంత ట్రస్టులా?

రాజకీయ పార్టీలలో అన్ని రకాల వాళ్లూ ఉంటారు. ఉదాహరణకు మర్యాదస్తులూ, నీతిమంతులూ ఉంటారు; లేదా మర్యాదస్తుల్లా, నీతిమంతుల్లా కనిపించేవాళ్లూ ఉంటారు; గూండాలూ, ఫోర్ ట్వంటీలూ ఉంటారు. ఎందుకింత 'వైవిధ్యాన్ని' రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తూ ఉంటాయో తెలియదు. ఎప్పుడు ఎలాంటివాళ్లతో అవసరమవుతుందో నన్న ముందుచూపుతో కాబోలు అన్ని రకాల వాళ్ళనూ రాజకీయ పార్టీలు చేర్చుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు నూరేళ్ళకు పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో టోల్ కట్టమన్నందుకు తుపాకీ చూపించి బెదిరించిన పోర్ బందర్ ఎం.పీ తరహా రౌడీ ఎలిమెంట్లూ ఉంటాయి; మన్మోహన్ సింగ్, ఆంటోనీ, ప్రణబ్ ముఖర్జీ(ఇప్పుడు కాంగ్రెస్ మనిషని అధికారికంగా అనలేకపోయినా)లాంటి పెద్దమనుషులూ ఉంటారు.  బీజేపీలో కూడా డిటో.
కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గురించి ఎక్కువ తెలియదు కానీ, ఆయనకూడా ఎంతో మర్యాదస్తుడిలా, పెద్దమనిషిలా, సౌమ్యుడిలా, సంస్కారవంతుడిలా కనిపిస్తాడు. ఆయనను చూస్తే, అవినీతికి అక్రమాలకు పాల్పడగల మనిషని ఎంతమాత్రం అనిపించదు. ఇప్పుడు ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయనా, ఆయన భార్యా కొన్ని రకాల శారీరక సామర్థ్యాలు లోపించినవారి సహాయార్థం ఉత్తరప్రదేశ్ లో ఒక ట్రస్టు నిర్వహిస్తున్నారు. కేంద్ర సామాజిక, సాధికార మంత్రిత్వశాఖ ఆ ట్రస్టుకు 70 లక్షల రూపాయిలకు పైగా గ్రాంటు ఇచ్చింది. ఆ గ్రాంటు వినియోగంలో అవకతవకలు జరిగాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ) ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఎన్.డీ.టీ.వీ అనే ఇంగ్లీష్ వార్తా చానెల్ తనకందిన ఆ నివేదికను బయట పెట్టింది. 17 జిల్లాలలో ట్రస్టు శిబిరాలు నిర్వహించవలసి ఉండగా, కొన్ని జిల్లాలలో నిర్వహించకుండానే నిర్వహించినట్టు చూపించిందనీ; అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిందనీ, ముందిచ్చిన గ్రాంటు ఎలా వినియోగమైందో చూడకుండానే పైన చెప్పిన మంత్రిత్వశాఖ మరో 60 లక్షలకు పైగా గ్రాంటు ఇచ్చిందనీ... ఆరోపణలలో కొన్ని.  ఇంతకు ముందే ఒక హిందీ చానెల్ ఖుర్షీద్ దంపతుల ట్రస్టులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించింది. అవి నిరాధారమైన ఆరోపణలంటూ ఖండించిన ఖుర్షీద్ దంపతులు ఆ చానెల్ పై కోర్టుకు వెడతామని కూడా హెచ్చరించారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటం నేపథ్యంలో ఈ ఆరోపణలు మళ్ళీ తెరమీదికి రావడం వల్ల యావద్దేశం దృష్టినీ మరింతగా ఆకర్షించే అవకాశం ఏర్పడింది.
ఇందులో చెప్పుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అలాగే ప్రశ్నించుకోవలసినవీ ఉన్నాయి.
మొదటిదేమిటంటే, ఇటీవలి కాలంలో  సీఏజీ నివేదికలు తరచు సంచలనాత్మకం కావడం, చర్చలోకి రావడం, అవినీతికి ధృవీకరణ పత్రాలుగా గుర్తింపు పొందుతుండడం! టూ జీ వ్యవహారం ఇందుకు ప్రారంభం. ఇది ఒక విధంగా ఆశ్చర్యం, ఒక విధంగా సంతోషం కలిగించే పరిణామం. ఆశ్చర్యం ఎందుకంటే, ఆయా ప్రభుత్వశాఖలు నిధుల్ని ఎలా వ్యయం చేస్తున్నాయో పరిశీలించి, లోటు పాట్లను బయటపెడుతూ సీఏజీ నివేదికలు ఇవ్వడం ఆ వ్యవస్థ పుట్టినప్పటినుంచీ జరుగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఏటా అందే సీఏజీ నివేదికల కాపీలు మీడియాకు కూడా అందుతూ ఉంటాయి. వాటిలోకి ఓసారి అలవోకగా తొంగిచూసినా చాలు గుండె గుభేలు మంటుంది. కోట్లాది రూపాయిల ప్రజాధనం వృథా, దుర్వినియోగం అవుతున్న దృశ్యమే కళ్ళకు కడుతుంది. ప్రభుత్వం ప్రజాధనంపై ఎంత  బాధ్యతారహితంగా, ఎంత బేఫర్వాగా వ్యవహరిస్తోందో అనిపిస్తుంది. విచిత్రమేమిటంటే ప్రభుత్వాలు సీఏజీ నివేదికలను మొక్కుబడిగా చట్టసభలో పెట్టి ఊరుకుంటూ ఉంటాయి. వాటిని సీరియస్ గా తీసుకునే సందర్భాలు, వాటిపై చర్చ జరిగే సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ ప్రతిపక్షాలు నివేదిక ఎత్తిచూపించిన లొసుగులు, అవకతవకల గురించి ప్రశ్నిస్తే;  అది ఖరారు నివేదిక కాదనీ,  దానిపై వివరణ ఇచ్చామనీ, లేదా ఇస్తున్నామనీ ప్రభుత్వం చెబుతుంది. అంతటితో ఆ చర్చకు తెరపడుతుంది.  ప్రభుత్వం వివరణ ఇచ్చిందో లేదో, ఇస్తే ఏమని ఇచ్చిందో ఎవరికీ తెలియదు. ఎవరూ అడగరు.
సంతోషం దేనికంటే, ఇప్పుడు సీఏజీ నివేదికలు కూడా చర్చలోకి వస్తున్నాయి, సంచలనాత్మకం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలే. అది వాళ్ళ ప్రభుత్వమే. కానీ ఆ ప్రభుత్వంలో ఏవి ఎలా పనిచేస్తున్నాయో, ఏ పనిచేస్తున్నాయో వాళ్ళకు తెలియదు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సీఏజీ లాంటి వ్యవస్థలను ప్రభుత్వాలు ఏ మేరకు పట్టించుకుంటున్నాయో తెలియదు. అంతకంటే ముఖ్యం, ప్రభుత్వం ఏది ఎందుకు చేస్తోందో తెలియకపోవడం.
 ఖుర్షీద్ దంపతుల ట్రస్టుకు కేంద్రమంత్రిత్వశాఖ గ్రాంటు ఇవ్వడమే తీసుకోండి. ఇది వింటే మీకు అత్త సొమ్ము అల్లుడు ధారపోసాడన్న సామెత గుర్తురావడం లేదా? వ్యక్తులు నిర్వహించే ట్రస్టుకు అసలు ప్రజల సొమ్ము ఎందుకివ్వాలి? ఇవ్వడంలోని హేతుబద్ధత ఏమిటి? శారీరక సామర్థ్యాలు లోపించినవారికి ఉద్దేశించిన ఆ సాయాన్నిప్రభుత్వం తన అధికారుల ద్వారానే అందించే ఏర్పాటు చేయచ్చుకదా? అధికారులపై ఇప్పటికే పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కనుక ఆ పని చేయలేమనుకుంటే, పూర్తిగా సేవారంగంలోనే ఉన్నవారికి, అది కూడా వాళ్ళ ప్రతిష్టను, చరిత్రను పరిశీలించి మరీ, ఆ గ్రాంటు ఇవ్వడంలో కొంత అర్థముంటుంది. ఖుర్షీద్ అలా కాదు, ఆయన రాజకీయాలలో ఉన్నారు. ట్రస్టు ద్వారా లభించే గుర్తింపు, పేరు ఆయనకు రాజకీయమైన పెట్టుబడిగా మారదా?  వ్యక్తులు రాజకీయంగా 'క్యాష్' చేసుకోడానికి ప్రజల సొమ్మును ప్రభుత్వం ధారదత్తం చేయడం ఎంత హాస్యాస్పదంగా, ఎంత ఆక్షేపణీయంగా ఉంటుంది? ఖుర్షీద్ కేంద్రంలో మంత్రిగా ఉంటారు! ఆ కేంద్రం ఆయనా, ఆయన భార్యా నడిపే ట్రస్టుకు లక్షలాది రూపాయలు గ్రాంటుగా ఇస్తుంది! ఇది ఎలాంటి సంకేతాలిస్తుంది? ప్రభుత్వంలో ఉన్న, లేదా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఒక ప్రత్యేక వర్గం ఆ ప్రభుత్వంనుంచి అన్ని రకాల సాయాన్ని పొందుతూ ఉంటుందన్న అభిప్రాయాన్ని జనంలో కలిగించదా?  అంతేకాదు, ప్రభుత్వం ఒక పెద్ద గూడుపుఠాణీ కేంద్రంలా కూడా కనిపిస్తుంది.
ఖుర్షీద్ ట్రస్టు ఒక్కటే కాదు, ప్రభుత్వం సాయం పొందే అలాంటి రాజకీయగోత్రీకుల ట్రస్టులు ఇంకా చాలా ఉంటాయి. క్రోనీ క్యాపిటలిజంతోపాటు ఇలాంటి క్రోనీ పోలిటికలిజం కూడా  చర్చలోకి  రావాలి. ఆశ్రిత రాజకీయవాదులకు ప్రజాధనం ధారపోయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాలి. ప్రజల దృష్టికి అంతగా రాని,  చట్టం ముసుగులోనే జరిగే ఇలాంటి లోపాయికారీ వ్యవహారాలకు ప్రభుత్వం ఇంతకాలం అలవాటుపడింది. పారదర్శకతకు రోజు రోజుకీ ప్రాధాన్యం పెరుగుతున్న నేటి దశలో ఆ అలవాటును మార్చుకోవాలి. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఇంధనం అందిస్తున్న వాటిలో ప్రభుత్వంలో వేళ్ళుదన్నుకున్న పారదర్శకతా రాహిత్యం ఒకటన్న సంగతిని మరచిపోకూడదు.
అయితే రాజకీయవాదుల చర్మం దబ్బనం పోట్లకు కూడా లొంగనంతగా గిడసబారిపోయింది. ఖుర్షీద్ దంపతుల ఎదురుదాడే చూడండి. అంతా, తెలిసిన రాజకీయ సినిమా స్క్రిప్ట్ లానే సాగుతోంది. మరో రాబర్ట్ వద్రా తరహా ఘట్టం తయారవుతోంది. ట్రస్టులో అవకతవకలు జరిగాయో లేదో తెలుసుకోవడం మేడీజీ అయ్యే బదులు క్రమంగా  మేడ్ డిఫికల్ట్  అవుతుంది. అవకతవకలు జరగలేదనీ, ఆరోపణలు దురుద్దేశపూరితమనీ నొక్కి చెప్పడంలో చూపించే పూనకం తమ వాదనకు సంబంధించిన ఆధారాలను అప్పటికప్పుడు వెల్లడించడంలో కనబడదు. అది మరో రోజు ఎప్పటికో వాయిదా పడుతుంది. వివాదం చూస్తుండగానే చిక్కుముడులు పడిపోతుంది. జనానికి అసలు నిజం ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎవరు ఎలా ఘర్షణ పడ్డా అంతిమ క్షతగాత్రులు జనాలూ, నిజాలే!

  

Friday, October 12, 2012

బంగారు-సుఖ్ రామ్-బోఫోర్స్ మరియు రూల్ ఆఫ్ లా

బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తీహార్ జైలునుంచి బెయిల్ మీద విడుదలయ్యారన్న వార్త చూసి ఆశ్చర్యపోయాను. ఆయన  అరెస్టయిన సంగతి నాకు తెలియకపోవడం అందుకు ఒక కారణం. పూర్తి వివరాలలోకి వెళ్లినప్పుడు ఆయనను ఏప్రిల్ 27న అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అంత ముఖ్యమైన వార్తను మిస్ అయినందుకు ఆశ్చర్యంతోపాటు సిగ్గు కూడా కలిగింది. నేను అప్పుడప్పుడే దేశం విడిచిపెట్టి, ఇప్పటివరకూ దూరంగానే ఉండడం ఇందుకు ఎంతవరకు ఎక్స్యూజ్ అవుతుందో చెప్పలేను.
బంగారు లక్ష్మణ్ విడుదల వార్త చూడగానే మానవ కాలమానం, బ్రహ్మగారి కాలమానం గురించిన ఓ ముచ్చటా గుర్తొచ్చింది. భూలోకంలో రావణాసురుని ఆగడాలు భరించలేక దేవతలు, మునులు వెళ్ళి బ్రహ్మ దగ్గర మొర పెట్టుకున్నారట. నేనిప్పుడే బహిర్భూమికి వెళ్లొచ్చి రావణాసురుని విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పి బ్రహ్మ వెళ్లిపోయాడట. తిరిగి వచ్చి, ఇప్పుడు చెప్పండి రావణాసురుని కథా కమామిషూ అని అడిగాడట. ఇంకెక్కడి రావణాసురుడు అంటూ, దశరథుడి పుత్రకామేష్టి తో ప్రారంభించి రాముడు రావణాసురుని చంపడం వరకు జరిగిన రామాయణమంతా బ్రహ్మగారికి చెప్పారట. దాంతో, 'పోనీలెండి, అల్పాయుష్కుడు' అంటూ బ్రహ్మ పెదవి విరిచాడట.
మనదేశంలో నేరం బ్రహ్మ కాలమానంలో జరుగుతుంది. నేర విచారణ మానవ కాలమానాన్ని అనుసరిస్తుంది. శిక్ష మళ్ళీ బ్రహ్మ కాలమానంలో అమలు జరుగుతుంది. అది కూడా శిక్ష పడడమంటూ జరిగితే.
బంగారు లక్ష్మణ్ కేసు ఏనాటిది! పదేళ్ళు గడిచిపోయాయి. ఆయన వయసు కూడా పదేళ్ళు పెరిగి, వృద్ధాప్యం, అనారోగ్యం వగైరా కారణాలతో బెయిలు కోరుకునే అవకాశం కూడా చిక్కింది. ఆయన ఎవరినుంచో లక్ష రూపాయిలు తీసుకుంటున్న దృశ్యాన్ని తెహల్కా డాట్ కామ్ రహస్య కెమెరాకు చిక్కడం, టీవీ చానెళ్లు దానిని చూపించడం అప్పట్లో పెద్ద సంచలనం. దానిపై చానెళ్లలో, పత్రికల్లో ఎంతో డిబేటు జరిగింది. స్టింగ్ ఆపరేషన్ ఎంతవరకూ నీతిమంతం అన్న మీమాంసా తలెత్తింది. తెహల్కాపై వేధింపుల గురించిన వార్తలూ వచ్చాయి. క్రమంగా తెహల్కా ప్రచురణ మాధ్యమంలోకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు ఒకరి 'అవినీతి'ని ఇంకొకరు కడుక్కునే సందర్భాలలో బంగారు ఉదంతం ప్రస్తావనకు రావడం పరిపాటిగా మారింది. టీవీ డిబేట్లలో తెలుగు రాని మనీష్ తివారీ లాంటి కాంగ్రెస్ అధికార ప్రతినిథులు 'బంగారూ లక్ష్మణ్' అంటూ అదోరకం ఉచ్చారణతో పలకడం ఇప్పటికీ చెవుల్లో ధ్వనిస్తూనే ఉంది.
అలాంటి బంగారు లక్ష్మణ్ ఇలా జైలుకు వెళ్ళినట్టే వెళ్ళి బెయిల్ మీద తిరిగిరావడం ఆశ్చర్యంగానే ఉంటుంది.
మన దేశంలో రూల్ ఆఫ్ లా గురించీ, నేరవిచారణకు పట్టే అసాధారణ కాలం గురించీ ఇంతకంటే ఆశ్చర్యకరమైన ప్రశ్న ఇంకోటి ఉంది...లక్ష రూపాయిలు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన కేసు శిక్ష వరకు రావడానికే పదేళ్ళు పడితే, అలాంటి ప్రత్యక్ష ఆధారాలు ఏవీ లేని కేసుల్లో ఇంకెంత కాలం పడుతుంది?! అసలు శిక్ష పడడమంటూ ఎప్పటికైనా జరుగుతుందా?!
బోఫోర్స్ కేసు చూడండి. ఎనభై దశకం నుంచీ ఆ కేసు వార్తల్లో ఉంది. మామూలు జనంకంటే ఎక్కువగా మీడియా జనం ఇలాంటి కేసులతో సహజీవనం చేస్తుంటారు. బోఫోర్స్ కేసు ఒక కొలిక్కి రాకుండానే ఒక మీడియా తరం వెళ్లిపోయింది. ఎంతోమంది సంపాదకులు రిటైరైపోయారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకుడిగా బోఫోర్స్ కేసు విషయంలో కురుక్షేత్ర యుద్ధం స్థాయిలో అక్షరపోరాటం చేసిన అరుణ్ శౌరి ఇప్పుడు పాత్రికేయ వృత్తిలోనే లేరు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, కేంద్రంలో మంత్రిగా కూడా కొంతకాలం ఉన్నారు. బోఫోర్స్ తో పోటీపడి ఆయన అక్షర శతఘ్నులు పేల్చిన ఎనభై దశకంలో అప్పటికింకా పత్రికా కార్యాలయాలు పూర్తిగా కంప్యూటరైజ్ కాలేదు. ఏ సాయంత్రానికో బోఫోర్స్ పై అరుణ్ శౌరి ఉద్బోధలూ, మేలుకొలుపులూ, ప్రశ్నలూ వ్యాసరూపంలో టేకులకొద్దీ టెలీప్రింటర్ మీద వచ్చేవి. అవి సమరాంగణంలో సైన్యాధికారి సైనికులను ఉత్తేజపరిచే ప్రసంగ శైలిలో ఉండేవి. మధ్య మధ్య భగవద్గీత నుంచి, మహాత్మా గాంధీ నుంచి గంభీరమైన ఉటంకింపులు ఉండేవి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సోదర పత్రిక ఆంధ్రప్రభ డెస్క్ వాటిని అనువదించి ఫస్ట్ ఎడిషన్ కు అందించడం కూడా 'యుద్ధప్రాతిపదిక'పై జరిగేది. చివరికి ఏమైంది? బోఫోర్స్ పార్లమెంటులో అసాధారణ సంఖ్యాధిక్యత ఉన్న ఒక ప్రభుత్వాన్ని కూల్చి, ఇంకో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తీసుకురాగిలిగింది కానీ ఒక కేసుగా ఇప్పటికీ ఒక కొలిక్కి రాకుండానే; నిందితులలో ఒకడైన ఆ ఇటలీ వ్యాపారిని కత్రోకీ అనాలో, కత్రోచీ అనాలో  తేల్చుకోకుండానే  అటకెక్కింది.
కాంగ్రెస్ సుఖ్ రామ్ కేసు బంగారు కేసు కన్నా ఏడెనిమిదేళ్ళ పాతది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావడం, మంత్రివర్గం నుంచి ఆయనను తొలిగించడం జరిగాయి. ఆరోపణలపై విచారణ ఇటు గూడ్సు బండిలా పాకుతుండగానే, ఆయన సొంతరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఒక ప్రాంతీయ పార్టీని పెట్టడం, ఎన్నికలలో తగినన్ని సీట్లు గెలుచుకోవడం, మిశ్రమ ప్రభుత్వంలో మంత్రి కావడం వగైరాలు అటు ఎక్స్ ప్రెస్ వేగంతో జరిగిపోయాయి. పూర్తిగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి, కాళ్ళూ చేతులూ బుద్ధీ స్వాధీనంలో లేని దశలో కేసు కొలిక్కి వచ్చి ఆయనకు శిక్ష పడింది. 'న్యాయం జరిగింది' అనడానికి ఆయన ఇంతకాలం జీవించి ఉండడమే కారణం కానీ, మన న్యాయవిచారణ వ్యవస్థ కాదు.
రూల్ ఆఫ్ లా అమలు జరగడంలో ఆలస్యం జరిగే ఉదంతాలే కాదు, అసలు దేశంలో రూల్ ఆఫ్ లా ఉందా అన్న సందేహాన్ని రేకెత్తించే ఉదంతాలూ కోకొల్లలు. ఆమధ్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఢిల్లీ లోని ఆంధ్రాభవన్ లో పనిచేసే ఒక ఎస్సీ అధికారిని దుర్భాషలాడుతూ చేయి చేసుకున్న దృశ్యం టీవీలో ప్రసారమైంది. మనిషి సాటి మనిషిపై చేయి చేసుకోవడమే నేరం. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగిపై చేయి చేసుకోవడం ఇంకా పెద్ద నేరం. అందులోనూ ఒక ఎస్సీ ఉద్యోగిపై చేయి చేసుకోవడం చట్ట రీత్యా మరింత తీవ్రమైన నేరం. అందులోనూ శాసన నిర్మాణప్రక్రియలో పాలు పంచుకునే శాసన సభ్యుడు ఆ పని చేయడం(దాని వెనుక ఎంత న్యాయమైన కారణమైనా ఉండవచ్చుగాక) మరింత తీవ్రాతి తీవ్రమైన నేరం. కానీ విచిత్రం... కేసు ఏ దశలో ఉందో, అసలు ఉందో లేదో మనకు తెలియదు. దాని గురించిన వార్తలు మీడియాలో కనబడవు. తన అధికారిపై టీవీ కెమెరా సాక్షిగా చేయిచేసుకున్న ఎమ్మెల్యేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యకూ ఉపక్రమించిన దాఖలాలు కనిపించవు. ఆ అధికారి కేసు పెట్టారా లేదా అన్న సాంకేతిక ప్రశ్న ఇక్కడ వర్తించదు.  ఇది ప్రజాజీవితంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ప్రవర్తనాసరళికి సంబంధించిన సామాజికాంశం. కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలు సూ మోటో గా విచారణను చేపడుతుంటాయి. ఈ కేసులో అలా ఎందుకు చేయలేదో తెలియదు. ఇది కేవలం ఒక ఎమ్మెల్యేకు, ఒక అధికారికి సంబంధించిన అంశం కాదు. ఈ దేశంలో అసలు  రూల్ ఆఫ్ లా ఉందా లేదా అన్నమౌలిక ప్రశ్నను లేవనెత్తుతున్న సందర్భం.
అంతకంటే వెనక్కి వెడితే, ప్రకాశం జిల్లాలో  ఒక ఎమ్మెల్యే మందిని వెంటబెట్టుకుని కలెక్టరాఫీసులోకి దౌర్జన్యంగా చొరబడి, మహిళా కలెక్టర్ ను దుర్భాషలాడుతుంటే, ఆమె నిశ్చేస్టురాలై ఏడుస్తూ ఉండిపోయిందని వార్త వచ్చింది. ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టారో లేదో తెలియదు. పెడితే అది ఏ దశలో ఉందో తెలియదు. ఇక సినీ నటి ప్రత్యూష హత్య/ఆత్మహత్య వంటి కేసుల సంగతి చెప్పనే అవసరం లేదు.
అరుణ్ శౌరి అప్పుడు బోఫోర్స్ పై పత్రికా యుద్ధం చేస్తే అరవింద్ కేజ్రీవాల్ ప్రభృతులు ఇప్పుడు రాబర్ట్ వద్రా ఆస్తులపై ప్రత్యక్షయుద్ధం చేస్తున్నారు. రేపు రాజకీయంగా బోఫోర్స్ చూపించిన ప్రభావమే ఇదీ చూపించవచ్చుననుకున్నా, బోఫోర్స్ లానే ఎప్పటికీ తెమలని కేసులా మిగిలిపోదన్న గ్యారంటీ లేదు. మన దేశంలో రూల్ ఆఫ్ లా మహిమ అలా ఉంటుంది. దొంగ ఇంటికి కన్నం వేసి ఇల్లు చక్కబెట్టడం బ్రహ్మ కాలమానంలో జరుగుతుంది. దానిపై దర్యాప్తు, విచారణ మానవకాలమానాన్ని అనుసరిస్తాయి.  చట్టం అమలు జరగడానికి ప్రభుత్వమే  ఒక పెద్ద బ్రేకు కావచ్చు, దానితోపాటు జనానికి కనిపించని బ్రేకులు చాలా ఉంటాయి. జనాభా నిష్పత్తిలో జడ్జీలు లేకపోవడం వంటి బ్రేకులూ వాటిలో ఉంటాయి.  ఈ దేశంలో చట్టం తన పని తాను చేస్తోందన్ననమ్మకం చాలా తక్కువ. అందుకే రాజకీయనాయకులు అనేకానేక అబద్ధపు హామీల బాణీ లోనే  'చట్టం తన పని తను చేస్తుం'దన్న హామీ ఇస్తుంటారు కాబోలు!

Wednesday, October 10, 2012

అరవింద్ 'అన్నా' కేజ్రీవాల్ చర్చ మరికొంత...

అరవింద్ 'అన్నా' కేజ్రీవాల్ అండ్ కో వ్యాసంపై చాలామంది ఆసక్తి చూపించినట్టు గణాంకాలు సూచించాయి. పలువురు రాతపూర్వకంగా స్పందించారు. అందరికీ కృతజ్ఞతలు.

మధ్యతరగతి విద్యావంత వర్గం అన్నా ఉద్యమంతో కొంతవరకు మమేకమైన సంగతి తెలిసినదే. అలాంటివారు నా వ్యాసం చదివి నేను ఆ ఉద్యమాన్ని సమర్థించడంలేదనే నిర్ణయానికి చటుక్కున రావచ్చు. నిజానికి ప్రజాజీవనాన్ని అన్నివిధాలా కలుషితం చేసి, కొన్ని తరాలపాటు నష్టం కలిగించే అవినీతిని అంతమొందించడం లక్ష్యంగా జరిగే ఏ పోరాటాన్ని అయినా బాధ్యతగల ప్రతి పౌరుడు సమర్థించవలసిందే. అలాగే నేనూ సమర్థిస్తాను. నేను పై వ్యాసంలో చేసిందల్లా ఆ ఉద్యమ గమనాన్ని విశ్లేషించడమే. అందులోని కొన్ని లోపాలను ఎత్తి చూపడమే. ఒక మంచి కారణం తో మొదలైనంత మాత్రాన ఒక ఉద్యమం దానికదే మంచిదీ, ప్రశ్నించడానికి వీలు లేనిదీ అయిపోదని చెప్పడమే నా ఉద్దేశం. దాని మంచి చెడులపై ఒక కన్ను వేసే ఉంచాలి. అవసరమైన హెచ్చరికలు చేస్తూనే ఉండాలి. లేకపోతే ఆ ఉద్యమానికే కాదు, భవిష్యత్తులో అదే అంశం మీద చేపట్టే ఉద్యమాలకు కూడా తీరని నష్టం జరుగుతుంది.

నేనేదో ఉద్యమానికి వక్రభాష్యం చెబుతున్నాననీ, మనం చేయలేని పనిని ఎవరో చేస్తున్నందుకు సంతోషించకుండా అడ్డు చెప్పే నైచ్యానికి పాల్పడుతున్నానని ఒక పాఠకుడు లుంపెన్ భాషలో ఆవేశాన్ని కుమ్మరించుకున్నారు. అంతేకాకుండా విశ్లేషణనూ, లాజిక్కునూ కూడా అవహేళన చేశారు. వర్తమాన రాజకీయాలపై, అవినీతిపై ఉన్న ఏవగింపే ఆ అసహనంలో ఆవేశంలో వ్యక్తమవుతోందనుకున్నా విద్యావంతులు కూడా విశ్లేషణను, లాజిక్కును ఆక్షేపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దగా చదువు సంధ్యలు, అవగాహనాశక్తి ఉండవనుకునే జనసామాన్యంలో కూడా విశ్లేషణ, లాజిక్కు అంతర్లీనంగా ఉంటాయి. వాళ్ళు కూడా గుడ్డిగా ఏ పనీ చేయరు, ఎవరినీ సమర్థించరు. దానినే మనం కామన్సెన్స్ అంటాం. ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపించడంలో ఆ కామన్సెన్స్ వ్యక్తమవుతూనే ఉంటుంది. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి వగైరా కొన్ని మంచి పనులు చేశారనుకుంటాం. అయినా సరే, వరసగా రెండుసార్లు జనం ఆయనను అధికారానికి దూరంగా ఉంచారంటే, తమకు నచ్చనివేవో ఆయనలో ఉన్నట్టు కనిపెట్టడమే కారణం. అప్పటి ఆ  జనహృదయానికి అక్షరరూపం ఇస్తే అందులో విశ్లేషణా, లాజిక్కే కనిపిస్తాయి. ప్రజాక్షేత్రంలో ఉన్న కేజ్రీవాల్ కైనా మరొకరికైనా థింక్ ట్యాంక్, ఆలోచనా వనరులు అవసరమవుతాయి. ఆవేశం అడుగు వేయించచ్చు కానీ ఆ తర్వాత ముందుకు నడిపించవలసింది ఆలోచనే. కామన్సెన్స్  మీద పనిచేసే ప్రజాభిప్రాయమూ;  విశ్లేషణ, లాజిక్కు తప్పనిసరిగా ఉండే మీడియా, ఇతర వర్గాలు సపోర్ట్ బేస్ గా ఉన్నాయి కనుకే అన్నా ఉద్యమం శక్తిమంతమైన ప్రభుత్వాన్ని ఢీ కొనగలిగిందన్న సంగతిని మరచిపోకూడదు. తాము సపోర్ట్ బేస్ గా ఉన్న ఒక ఉద్యమం దారి తప్పుతోందనుకున్నా, తప్పుడు సంకేతాలిస్తోందనుకున్నా ఆ విషయం వెల్లడించి హెచ్చరించే హక్కూ, బాధ్యతా కూడా వాటికి ఉంటాయి. జనాన్ని మైనస్ చేసి ఉద్యమం మొత్తాన్ని వ్యక్తులకు ఆపాదించి వాళ్ళు నిప్పుల్లోకి దూకుతుంటే చప్పట్లు కొట్టి, ఆ తర్వాత  అమరవీరుల్నిచేసి మెడలో దండ వేసే మనస్తత్వమూ మంచిది కాదు.

నా వ్యాసాన్ని మరోసారి నిదానంగా చదివితే, నేను 'పిల్లి' అన్న చోట మీరు 'మార్జాల' మంటున్న సంగతిని మీరే పోల్చుకుంటారు. నేను ఉద్యమం విఫలమార్గం పట్టిందని అంటూ ఎలా పట్టిందో చెబితే, ఉద్యమం తొలి ప్రయత్నాలలో విఫలమైందని మీరూ అంటున్నారు. అలాగే, (రాజకీయ)వ్యవస్థలో స్తబ్దత ఏర్పడినప్పుడు బాహ్యశక్తులు జోక్యం చేసుకుని దానిని వదిలించే ప్రయత్నం చేయాలని మీరంటే; రాజకీయేతరంగా కొంత జాగాను సృష్టించుకోవాలని నేనన్నాను. లోక్ సత్తా కానీ, అన్నా ఉద్యమం కానీ  రాజకీయ పార్టీ గా మారి అదే రాజకీయ మేళంలో చేరడంలోని ప్రయోజకత్వమూ, ఔచిత్యమూ ఏమిటన్నవి ఇప్పటికీ నా ఓపెన్ ప్రశ్న. చటుక్కున నిర్ణయానికి రాకుండా  ఇలాంటి వాటిపై అభిప్రాయాలు కలబోసుకోవచ్చు. అయితే అది ఆవేశాలకు దూరంగా ఆలోచనా సహితంగా జరగాలి.

మరింత స్పష్టత కోసం నా వ్యాసంలోని అంశాలను క్రోడీకరిస్తూ, అవసరమైన చోట అదనపు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

1. అన్నా టీం తాము ఎంత దూరం వెళ్లగలరో ముందుగా అంచనా వేసుకోలేదు. ఉద్యమం రూపురేఖల్ని స్వభావాన్ని నిర్వచించుకోలేదు. అడహాక్ పద్ధతిలో ట్రయల్ అండ్ ఎర్రర్ విధానంలో ముందుకు వెళ్లారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అప్పటికే అనుభవం ఉన్న అన్నా హజారేకు మొదట్లో కొంత స్పష్టత ఉండి ఉండచ్చు. అవతలనుంచి ఎలాంటి దాడి ఎదురవుతుందో, దానిని ఎలా ఎదుర్కోవాలో కొంత అవగాహన ఉండి ఉండచ్చు. అయితే ఢిల్లీ చేరేటప్పటికి అక్కడి అనుచరబృందం వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకుంది. చూస్తుండగానే ఉద్యమం అనుమానాలు, అపోహల మార్గం పట్టింది. రాజకీయేతరంగా ప్రారంభమైనట్టు కనిపించిన ఉద్యమం చివరికి రాజకీయ పార్టీగా పైకి తేలాలనుకోవడం దీని పర్యవసానం.

2. అన్నా ఉద్యమంపట్ల తొలి విశేష స్పందనకు కారణం అది ఫ్రెష్ గా రాజకీయేతర స్వభావంతో అడుగుపెట్టడమే. అప్పటి నేపథ్యం కూడా అందుకు కారణం. కానీ అన్నా బృందం రాజకీయ ధ్వనులు చేయడం ప్రారంభించింది. బీజేపీకి బీ-టీం గా ముందుకొచ్చిందన్న అనుమానాలకు తావిచ్చింది. నేననడం కాదు, ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా మద్దతు ఇచ్చిన మీడియా కూడా మధ్య మధ్య దీనిని ప్రశ్నిస్తూనే వచ్చింది. అన్ని పార్టీలకూ సమాన దూరం పాటిస్తుందని జనం ఊహించుకున్న అవినీతి వ్యతిరేక పోరాటం కాంగ్రెస్-సెంట్రిక్ గా మారడం కొట్టొచ్చినట్టు కనిపించింది. 'ప్రజాపక్షం' అనుకున్న ఉద్యమం 'ప్రతిపక్షం' గా మారిపోయింది. ఇప్పటికే ప్రతిపక్షాలు చాలా ఉన్నాయి కనుక కొత్త ప్రతిపక్షం దేనికని జనం అనుకోవడం సహజం.  ఈ స్థితిలో ఉద్యమానికి మద్దతు పలచబడడంలో ఆశ్చర్యం లేదు. .

3. ఉద్యమంపై రాజకీయ సంబంధమైన ఆరోపణల్లో వాస్తవం ఉండకపోవచ్చు కూడా. ఆ మాట నా వ్యాసంలో కూడా అన్నాను. అయినా అనుమానాలకు కారణం ఇమేజ్ మేనేజ్ మెంట్ లో వైఫల్యం కావచ్చు. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నవారికి ఇమేజ్ మేనేజ్ మెంట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాకలు దీరిన రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో పరాకు చిత్తగించి చిక్కుల్లో పడుతుంటారని మనకు తెలుసు. అద్వానీ ఒక ఉదాహరణ. ఆయన పాకిస్తాన్ వెళ్లినప్పుడు జిన్నా అనుకూల వ్యాఖ్యలు చేసి ఆర్.ఎస్.ఎస్. మద్దతునూ, పార్టీ అధ్యక్షపదవినీ కోల్పోయారు.

4. లోక్ పాల్ అవసరం పట్ల జనంలో చైతన్యం కలిగించడం వరకూ బాగానే ఉంది. అన్నా ఉద్యమం అంతటితో ఆగకుండా లోక్ పాల్ కు సంబంధించిన శాసన ప్రక్రియలో కూడా జోక్యం చేసుకోడానికి ప్రయత్నించింది. పార్లమెంట్ లో క్రిమినల్స్ ఉన్నారా, స్వచ్చచరితులు ఉన్నారా అన్నది వేరే విషయం. అమలులో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రకారం ఒక శాసనం ఎలా ఉండాలన్నది పార్లమెంట్ సమష్టి వివేకమే నిర్ణయిస్తుంది. అది పార్లమెంట్ కు గల రాజ్యాంగ హక్కు. అయితే,  ఆ హక్కును కూడా ప్రశ్నించే భావ ప్రకటనా స్వేచ్ఛ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం లేదని ప్రకటించే వాక్ స్వాతంత్ర్యమూ అన్నా ఉద్యమానికే కాక ఎవరికైనా ఉంటుందనుకుంటే ఆ విషయం చెప్పాలి. కానీ అన్నా ఉద్యమం ఆ పని చేయలేదు. దాంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై అన్నా ఉద్యమ వైఖరేమిటన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోవడమే కాదు, దాని అపరిణత స్వభావాన్ని ఎత్తి చూపించే అవకాశం ప్రత్యర్థులకు ఇచ్చింది.

5. ప్రజాస్వామ్యంలో ఆయా సమస్యలపై జరిగే ఉద్యమాలు అమూర్త(యాబ్స్త్రాక్ట్) పోరాటాలుగా, నినాద ప్రాయాలుగా, ప్లేయింగ్ టు గేలరీ గా, వెలుతురు కాక వేడి మాత్రమే పుట్టించేవిగా మారి తేలిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అవినీతి వ్యతిరేక పోరాటం ఇందుకు మినహాయింపుగా కనిపించడం లేదు. అవినీతి ఉన్న మాట నిజమే, అవినీతిని చూసి ఆవేశ పడవలసిన మాటా నిజమే. అయితే మూలలోకి వెళ్ళి, అవినీతికి అవకాశాలు కల్పిస్తున్న వ్యవస్థాగతమైన లొసుగుల మీదా దృష్టి సారించాలి. టూ జీనే తీసుకోండి. అందులో అవినీతి ఎంత జరిగిందో నికరంగా మనకు తెలియదు. జరిగింది అవినీతా కాదా అన్న విషయంలో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ అవినీతి జరిగిందనడానికి అవకాశమిచ్చిన మంత్రి రాజా వ్యవహార సరళి గురించి మాత్రం నికరంగా తెలుసు. లేదా తెలుసుకోడానికి ఎక్కువ అవకాశముంది. ఉదాహరణకు, ఆయన కొన్ని విధివిధానాలను పాటించలేదు. పారదర్శకంగా వ్యవహరించలేదు. స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి మంత్రుల బృందం సూచనలను, ప్రధానమంత్రి సలహాను పరిగణనలోకి తీసుకోలేదు. పైగా 2000 సంవత్సరం నాటి ధరకు 2007 సంవత్సరంలో స్పెక్ట్రమ్ కేటాయించడం ఇంకో దారుణం. ఆరోపణలపై స్పందించడంలో ప్రధానమంత్రి చేసిన తాత్సారం మరో ఆక్షేపణీయాంశం.  చర్య తీసుకోమని కోరుతూ సుబ్రమణ్యం స్వామి రాసిన లేఖ ప్రధానమంత్రి కార్యాలయంలో ఎన్ని నెలలపాటు, ఎన్ని టేబుళ్ల చుట్టూ తిరిగిందో స్వయంగా ఆ కార్యాలయమే పూస గుచ్చినట్లు కోర్టుకు విన్నవించింది. కనుక మూలాలలోకి వెడితే అవినీతి వెనుక వ్యవస్థాగత వైఫల్యం కళ్ళకు కడుతుంది. జవాబుదారీ, పారదర్శకత లోపించిన ఫలితమని అర్థమవుతుంది. కానీ  లక్షా డెబ్భై వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందన్నదే ఎక్కువ ఫోకస్ అయింది. వ్యవస్థాగతమైన లొసుగులు ఉన్నంతకాలం టెలీ కమ్యూనికేషన్ల శాఖలోనే కాదు ఏ ప్రభుత్వ శాఖలోనైనా అవినీతి జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ కోణం ఎక్కువగా చర్చలోకి రావడం లేదు.

6. అన్నా ఉద్యమం సాటి పౌరసమాజ సంస్థలు, వ్యక్తుల మద్దతును ఎందుకు సమీకరించలేకపోయింది, ఉద్యమానికి విస్తృత ప్రాతిపదికను ఎందుకు కల్పించలేకపోయిందన్న ప్రశ్నలూ ఎదురవుతాయి. అది ఒంటెత్తు పోకడలు పోతోందన్న అభిప్రాయమూ కలుగుతుంది.

ఒక ఉద్యమం మంచిదైతే సరిపోదు. అనుమానాలకు, అపోహలకు తావివ్వకుండా అది సాగినప్పుడే ప్రయోజనం ఉంటుంది. అది విఫలమైతే అవుతుంది, కానివ్వండని మనం అనుకున్నా యుద్ధక్షేత్రంలో ఉన్న వాళ్ళు అనుకోలేరు.  ఆలస్యంగానైనా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోవలసివస్తుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రియాంకా గాంధీని గృహనిర్మాణానికి అనుమతించడం విషయంలో కాంగ్రెస్ తోపాటు బీజేపీకి  కూడా కేజ్రీవాల్ గురి పెట్టడం ఉద్యమానికి నిష్పాక్షిక స్వభావాన్ని తిరిగి ఆపాదించే ప్రయత్నం కావచ్చు. మీడియా ఊహాగానమే నిజమైతే ఈసారి రాబర్ట్ వద్రా తరహా ఆరోపణలను ఎదుర్కోవడం ప్రతిపక్షం వంతు కావచ్చు. ఆవిధంగా కోల్పోయిన విశ్వసనీయతను ఉద్యమం ఎంతో కొంత కూడదీసుకోవచ్చు. అయినా సరే, ఈ మార్గంలో తన పోరాటాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలుగుతుంది , ఏ మేరకు అవినీతి ముసుగు తొలగించగలుగుతుందన్న ప్రశ్నలు వ్రేలాడుతూనే ఉంటాయి. కాలమే వాటికి జవాబు చెప్పాలి.



  

Sunday, October 7, 2012

అరవింద్ 'అన్నా' కేజ్రీవాల్ అండ్ కో

అరవింద్ కేజ్రీవాల్ అనే యువకుడు కొంతకాలంగా జాతీయ వార్తల్లో చాలా ప్రముఖంగా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు  సమాచార హక్కు కార్యకర్తగా అప్పుడప్పుడు వార్తల్లో కనిపించిన ఈ మాజీ కేంద్రప్రభుత్వోద్యోగి అన్నా హజారే చెప్పుల్లో కాళ్ళు పెట్టిన తర్వాత చూస్తుండగానే జాతీయ వార్తల్లో వ్యక్తిగా ఎదిగిపోయాడు. అన్నా హజారే కు లేని సౌలభ్యం ఒకటి ఇతనికుంది. అది, ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడగలగడం. దక్షణ భారతీయుల దృష్టికి ఎవరైనా జాతీయ వ్యక్తిగా ఆనాలంటే, అతడు ఢిల్లీ చుట్టు పక్కల ఉంటూ ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలిగి ఉంటే చాలు. ఎందుకంటే దక్షణ భారతీయులు జాతీయస్థాయి వార్తలను, వ్యాఖ్యలను తెలుసుకోడానికి ప్రధానమైన సాధనాలు ఆంగ్ల పత్రికలు, ఢిల్లీ నుంచి పనిచేసే ఇంగ్లీష్ వార్తా చానళ్లే. మిగిలిన రాష్ట్రాల సంగతేమోకానీ ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు పత్రికలు, చానెళ్లు 'ప్రాంతీయ పార్టీ'లుగా మారిపోయాయి. ఇక్కడ చంద్రబాబు పాద యాత్ర, జగన్ అక్రమాస్తులు, రాంచరణ్ తేజ్ పెళ్లి ఏర్పాట్లు, ఇంకో తార నిశ్చితార్థం వగైరాలే ప్రధాన వార్తలు.

అరవింద్ కేజ్రీవాల్ లానే ఇంగ్లీష్ దంచి మాట్లాడగలిగిన కిరణ్ బేడి, ప్రశాంత్ భూషణ్ లాంటి మరికొందరు హజారేకు ఇంగ్లీష్ గొంతుగా మారి ఈ మధ్య ఢిల్లీ ఎత్తున చాలా హడావుడి చేశారు. హజారే మరాఠీ హృదయానికి సరైన టీకా టిప్పణి అందించడంలో వీళ్లు ఎక్కడ విఫలమయ్యారో కానీ మధ్య మధ్య ఆయనకూ వీళ్ళకూ మధ్య అపోహలకు సంబంధించిన వార్తలూ వస్తూనే ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనుకోవడంతో దూరం మరింత పెరిగినట్టు వార్తలు వచ్చాయి. అదేమీ లేదనీ, అన్నా అడుగుజాడల్లోనే నడుస్తున్నామనీ, ఆయన ఆశీస్సులు మాకున్నాయనీ ప్రకటించిన కేజ్రీవాల్ అన్నా టోపీతో 'అరవింద్ అన్నా కేజ్రీవాల్' అవతారం కూడా ఎత్తాడు.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం రాజకీయేతర స్వభావంతో ప్రారంభమైందని మనకు తెలుసు. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో అది జనాన్ని ఆకట్టుకుని విశేష ప్రచారాన్ని పొందగలిగింది.  కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతిపై నిష్క్రియత్వాన్నిసాగదీస్తోందని, అవినీతిపరులకు గొడుగు పడుతోందనే భావన ఒకవైపు; ప్రభుత్వాన్ని దారికి తేగల నైతికబలం బీజేపీ సహ ప్రతిపక్షాలలో లోపించిందన్న భావన ఇంకో వైపు  జనం ముందు ఒక రాజకీయ శూన్యాన్ని ఆవిష్కరించాయి. దాంతో రాజకీయేతరంగా కనిపించిన అన్నా ఉద్యమం ఆ జాగాను సునాయాసంగా భర్తీ చేసింది. అయితే క్రమంగా అదీ దారి తప్పుతున్న సూచనలు కనిపిస్తూ వచ్చాయి.  ఉదాహరణకు, పటిష్ట లోకపాల్ అవసరాన్ని ఎత్తి చూపించి, దానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించడానికి పరిమితం కావలసిన ఉద్యమం నిర్దిష్ట ఫలితం కోసం పట్టుబట్టి ప్రభుత్వంతో పంతానికి పోయింది. ఆ విధంగా ప్రభుత్వం జాగాలోకి దురాక్రమణ చేయబోయింది. అలాగే రాజకీయేతరం అనుకున్నది కాస్తా రాజకీయ ధ్వనులు చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా అవినీతి ఆరోపణల వెల్లువలో యూపీఏ ప్రభుత్వం మునగానాం తేలానాం గా ఉన్న పరిస్థితిని రాజకీయ రాజమార్గంలో సొమ్ము చేసుకోవడంలో బీజేపి విఫలమవుతున్న దశలో అన్నా టీం 'ప్రచ్చన్న'బీజేపీ లా తెర మీదికి వచ్చిందన్న అనుమానం జనంలో బలపడుతూ వచ్చింది. అది వాస్తవమా కాదా అన్నది వేరే విషయం. అటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఉద్యమం నడపడంలో అన్నా టీం విఫలమైంది. హిస్సార్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారానికి దిగడం ఉద్యమంపై జనస్పందనను మరింత పలచన చేసింది.  ఉద్యమంలో చేరిన ఇంగ్లీష్ కోతులు ఢిల్లీ వేదికపై కిష్కింధ కాండను సృష్టిస్తుంటే, పాపం ఇంగ్లీష్ రాని అన్నా హజారే ఏమీ అనలేక, ఏమనాలో తోచక ఇరకాటంలో పడిపోయాడు.

భారత రాజకీయాలు, ముఖ్యంగా అవినీతి ఆరోపణల్లాంటి విషయాలు సాధారణంగా ఇదిగో పులి అంటే అదిగో తోక అనే పద్ధతిలో సాగుతూ ఉంటాయి. అనుమానాల పులినీ, తోకనూ సృష్టించి అవతలి వాళ్ళను డిఫెన్స్ లో పడేయడానికీ, సాధ్యమైనంత వాక్కాలుష్యాన్ని వ్యాపింపజేయడానికీ  దాదాపు అన్నీ రాజకీయ పక్షాలూ కొంతమందిని బరి లోకి దింపుతుంటాయి. కాంగ్రెస్ లో కొంతకాలంగా దిగ్విజయ్ సింగ్ ఆ పాత్రనే దిగ్విజయంగా పోషిస్తున్నాడు. చటుక్కున స్ఫురించే మరో పేరు అమర్ సింగ్.  ఉద్యమాన్నిలాఫింగ్ స్టాక్ గా మార్చే ఢిల్లీ కోతుల కిష్కింధ కాండను  కాకలు తీరిన కాంగ్రెస్ శ్రేణులు వాటంగా వాడుకున్నాయి. ఆ విద్యలో అనుభవమూ, నేర్పూ లేని అన్నా బృందం డిఫెన్స్ లో పడింది. ఉద్యమం చింపిన విస్తరి అయ్యే ప్రమాదం ప్రతి దశలోనూ కనిపించింది. అన్నా క్రమంగా దూరంగా జరుగుతూ రావడంతో అన్నా బృందానికి ఉద్యమం పులి మీద స్వారీగా మారింది. దానిని వెనకటి రాజకీయేతర స్వభావానికి మళ్లించే అవకాశం ఇప్పుడు లేదు. తీసుకెళ్లి రాజకీయ వైతరణిలో ముంచడం ఉన్నంతలో సులభోపాయం. అరవింద్ అండ్ కో చేసింది అదే.

ఉద్యమాన్ని ప్రారంభించడమే కాదు, దానిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో,  ఎలా నిలబెట్టాలో, ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి. అది లోపించడమే అన్నా ఉద్యమాన్ని నీరు గార్చింది. అందువల్ల వ్యక్తులకు జరిగే నష్టం కన్నా ఉద్యమానికి జరిగే నష్టం ఎక్కువ. అవినీతికి వ్యతిరేకంగా ఇకముందు ఉద్యమించేవారెవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి వస్తుంది. పటిష్ట లోక్ పాల్ నినాదంతో అన్నా ఉద్యమం ముందుకొచ్చింది. జనంలో ఆ స్పృహ కలిగించడం వరకే అది చేయవలసింది. ఆ తర్వాత జనమే దానిని సాధించుకుంటారు. ప్రభుత్వం మీద సూపర్ ప్రభుత్వం జనమే. కనుక అన్నా ఉద్యమం  అడ్రస్ చేయవలసింది జనాన్ని. అందుకు భిన్నంగా అది ప్రభుత్వాన్ని అడ్రస్ చేయడం ప్రారంభించింది. తనే సూపర్ ప్రభుత్వంలా వ్యవహరించబోయింది. ప్రభుత్వంతో ఘర్షణకు దిగింది. ప్రభుత్వం జాగాలోకి చట్టవిరుద్ధంగా అడుగుపెట్టడానికి ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఎలాంటి ప్రభుత్వమైనా ఊరుకోదు. మీడియా కూడా అనేక అంశాలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఏదో ఒక సామాజికాంశాన్ని తలకెత్తుకుని పోరాడడం వ్యక్తులు, సంస్థల స్థాయిలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే, సమస్య పరిష్కారానికి ఉద్దేశించిన ప్రక్రియ కూడా మా చేతుల మీదుగానే జరగాలని, మేము చెప్పినట్టే ప్రభుత్వం చేయాలనీ వ్యక్తులు, సంస్థలు పట్టుబట్టిన ఉదాహరణలు లేవు. అన్నా టీం అదే చేయబోయింది.

అదీగాక 'అవినీతికి వ్యతిరేకంగా' ఉద్యమించడంలోనే పెద్ద అవగాహనా లోపం ఉంది. దేశంలో అవినీతి కచ్చితంగా ఉంది, లేదని ఎవరూ అనరు. సమస్యేమిటంటే, అవినీతి పరిమాణం ఎంతో మనకు తెలియదు. టూ జీనే తీసుకుంటే ఖజానాకు వచ్చిన నష్టం లక్షా డెబ్భై వేల కోట్లనీ, అరవై వేల కోట్లనీ, ముప్పైవేల కోట్లనీ(అది కూడా ఊహాప్రాయమైన నష్టమనీ)...రక రకాల లెక్కలు వినిపించారు. అంతే కాదు, అవినీతి ఉందని అంతా అనుమానించే చోట నిజంగా  ఉండకపోవచ్చు. అనుమానించని చోట ఆశ్చర్యకరమైన ప్రమాణంలో ఉండచ్చు.  అవినీతి లోతు, వ్యాప్తి నికరంగా తెలియక పోవడం అవినీతిని మించిన సమస్య. కనుక పరిపాలనలో పారదర్శకత ఒక్కటే అవినీతికి విరుగుడు. అన్నా ఉద్యమమైనా, మరొకటైనా డిమాండ్ చేయవలసింది పారదర్శకతను తీసుకు రావాలనే! లోక్ పాల్ అవినీతిని శిక్షించడానికి అవసరం కావచ్చు, అంతకంటే ముందు అవినీతికి అవకాశాలను కనిష్ట స్థాయికి తగ్గించడానికి పారదర్శకతే సాయపడుతుంది. యూపీఏ ప్రభుత్వంలో జరిగిన పొరపాటు అదే. మీడియా గతంలో లేనంత వ్యాప్తినీ, క్రియాశీలతనూ సంతరించుకుని కెమెరాను నేరుగా ప్రభుత్వ శాఖల్లోకి ఫోకస్ చేస్తోందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గమనించలేకపోయింది. తనే తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం అంతఃపుర కుట్రలను కూడా బట్టబయలు చేయగలదన్న వాస్తవాన్ని విస్మరించింది. ప్రజల అవగాహనలో సమూలమైన మార్పు వస్తున్న సంగతిని పసిగట్టలేకపోయింది. అన్నిటినీ కార్పెట్ కిందికి తోసేసే అధికార రహస్యాల సంస్కృతినీ; చట్టాన్నీ, సాంకేతికాంశాలనూ అడ్డుపెట్టుకుని తప్పించుకునే ధోరణినీ పట్టుకుని వేళ్లాడుతూ వచ్చింది. అవినీతి ఆరోపణలపై చర్యలో ఇంతకాలం అలవాటుపడిన దాటవేసే ధోరణినే మొండిగా బండగా సాగదీసింది. ఆ విధంగా ప్రభుత్వంపై జనంలో ఏర్పడిన అవిశ్వాసం, ప్రతిపక్షాల నిర్వీర్యత కలసి ఒక రాజకీయ శూన్యాన్నిసృష్టించాయి. అన్నాఉద్యమంపై తొలి విశేష స్పందనకు కారణం,  ఆ శూన్యాన్ని అది కొంతవరకు  కళ్ళకు కట్టించగలగడమే.

అలాంటి ఉద్యమం తను కూడా వెళ్ళి వెళ్ళి అదే రాజకీయ గంగలో మునగాలని నిర్ణయించుకోవడం 'పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్' అనడానికి చక్కని ఉదాహరణ. రాజకీయపక్షం అన్నాక అది అమలులో ఉన్న రాజకీయ పద్ధతులను, గ్రామర్ ను అనుసరించక తప్పదు. కింది స్థాయికి వెడుతున్న కొద్దీ ఆదర్శాలు పలచబారి అమాంబాపతు పార్టీలలో ఒకటిగా మారిపోవచ్చు. మన రాష్ట్రంలో లోక్ సత్తా పార్టీనే చూడండి. జయప్రకాష్ నారాయణ్ రాజకీయ స్వచ్చతపట్ల ఎంత అంకితభావాన్ని చాటుకుంటున్నా, ఆ పార్టీకి ఎంతో కొంత మద్దతు ఉంటుందనుకునే హైదారాబాద్ నగరంలోనే ఆ మధ్య కార్పొరేషన్ ఎన్నికలలో జనసమీకరణకు వాహనాలు, డబ్బు ఉపయోగించిన సంగతి ఆయన దృష్టికి వెళ్ళి ఉండక పోవచ్చు. రేపు అరవింద్ 'అన్నా' కేజ్రీవాల్ పార్టీ కూడా ఇలాగే పరిణమించడంతోపాటు  ఏ ప్రధానపక్షానికో చెలికత్తెగా మారినా ఆశ్చర్యంలేదు. రాజకీయపక్షాలను, రాజకీయకార్యాచరణను తృణీకరించడం ఇక్కడ ఉద్దేశం కాదు. రాజకీయ రుగ్మతలను ఎత్తి చూపిస్తూ, దానికి ముక్కు తాడు వేసే ప్రయత్నం రాజకీయేతరంగా జరుగుతూనే ఉండాలనీ, అందుకు తగిన జాగాను సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటూనే ఉండాలనీ చెప్పడమే.

ఏమైతేనేం, కాంగ్రెస్ జాతకం బాగున్నట్టుంది. దాదాపు రెండేళ్లుగా అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరవుతూ, నిష్క్రియతను  చిత్తగించిన యూపీఏ ప్రభుత్వం క్రమంగా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ప్రజాజీవితంలో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవనడానికి  మరో ఉదాహరణ కాబోయే మార్గాన్ని అన్నా ఉద్యమం ఎంచుకోవడం కూడా అందుకు ఒక కారణం అనడంలో ఆశ్చర్యం లేదు.  

Thursday, October 4, 2012

మిథ్యా పోరాటాలతో సాధించేదేమిటి?

చిల్లర వ్యాపారంలోకి 51 శాతం మేరకు విదేశీ పెట్టుబడు(ఎఫ్.డీ.ఐ)లను అనుమతించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. దానిపై జరిగే చర్చ కూడా షరా మామూలుగా వ్యతిరేక, అనుకూల రూపాలను తీసుకుంది. నిజానికి ఏ అంశం పై చర్చకైనా అనేక పార్స్వాలు ఉంటాయి. వర్తమానానికి సంబంధించిన అనేక సమస్యలు, అంశాల మూలాలు దశాబ్దాల, ఇంకా చెప్పాలంటే శతాబ్దాల కాలగర్భంలోనూ, చరిత్రగర్భంలోనూ ఉంటాయి. ఏ వివాదమైనా స్వయంభువు కాదు. దానికి తవ్విన కొద్దీ లోతు, చూడగలిగిన కొద్దీ దూరదూరాలకు విస్తరించే విరివీ ఉంటాయి. కనుక అనేక కోణాలనుంచి చూసి, మూలాలను తరచి  వస్తుగత దృష్టినుంచి చర్చించుకుంటే తప్ప దేనిపైనైనా అవుననీ కాదనీ చటుక్కున సమాధానం చెప్పడం సాధ్యంకాదు. అలాగే, నిశ్చలస్థితినుంచి కాక చలనశీలనతనుంచి ఒక సమస్యను పరిశీలించి అర్థం చేసుకోకుండా  దాని మంచి చెడులపై వెంటనే  తీర్పు చెప్పడం ఆత్మవంచన, మేధో వంచన అవుతుంది.
అయితే, ప్రజాస్వామ్యంలో చర్చ అలా ఉండదు. వస్తుగతచర్చా వేదికను రాజకీయ అవసరాలు, వ్యూహాలు తక్షణమే ఆక్రమించుకుంటాయి. ఆ సంకులసమరంలో సమస్య మూలాలను తరచే ఓపిక, తీరిక రెండూ ఉండవు. అంతకంటే ముఖ్యంగా అలా తరచి చూడడం స్వప్రయోజనాలకు ఉపయోగపడదు. వాస్తవాల జోలికి పోకుండా చర్చ ఎంత ఉపరితలంలో జరిగితే అంత మంచిది. అది కూడా తునకలు తునకలుగా (పీస్ మీల్) జరిగితే మరీ మంచిది. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రప్రథమంగా బలయ్యేది వాస్తవమూ, వాస్తవిక దృష్టే. ఇక్కడ దేనిపైనైనా అవుననీ కాదనీ చటుక్కున తేల్చి చెప్పడం చాలా అవసరం. అలాగని   ప్రజాస్వామ్యం పనికిమాలినదని చెప్పడం లేదు. చంద్రుడిపై  ఉన్నట్టే,  ప్రజాస్వామ్యచంద్రుడి పైనా కొన్ని మచ్చలుంటాయి.
 చిల్లర వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతిపై చర్చ కూడా యథావిధిగా ఉపరితలంలోనూ, పీస్ మీల్ గానే జరుగుతోంది. తొంభై దశకంలోనే ఆర్థిక సంస్కరణల రైలు బండి ఎక్కిన మనదేశం దాని తార్కిక గమ్యానికి చేరనవసరం లేదా అన్న ప్రశ్నను రాజకీయపక్షాలు కన్వీనియెంట్ గా దాటవేస్తాయి. చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు ఆ వ్యాపారంపై ఆధారపడిన ఇరవై శాతం మంది పొట్ట కొడతాయని, ప్రభుత్వం చెబుతున్నట్టు ఉపాధి అవకాశాలు పెరగకపోగా ఉన్న ఉపాధి కూడా ఊడిపోతుందని,  400 బిలియన్ డాలర్ల చిల్లర వర్తకం విదేశీ శక్తుల హస్తగతం అయిపోతుందని విపక్షాలు అంటున్నాయి. 10లక్షల జనాభా దాటిన నగరాలలోనే బహుళజాతి చిల్లర కంపెనీలను అనుమతిస్తామనీ, వాటి కనీస పెట్టుబడి కూడా 10 కోట్ల డాలర్లు ఉండాలనీ, వాటిని అనుమతించాలా, మానాలా అన్నది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రప్రభుత్వాలకే ఉంటుందనీ ప్రభుత్వం అంటోంది.  కేవలం 20 శాతం చిల్లర వ్యాపారంలోకే బహుళజాతి సంస్థలు అడుగుపెడతాయనీ అంటోంది. ఆ వాదనను ఖండిస్తూ ఒక్కో శాతానికి ఇన్ని లక్షల ఉద్యోగాలు పోతాయని ప్రతిపక్షాలు లెక్కలు విప్పుతున్నాయి. దేశీయ వస్తు తయారీ రంగంలో తగినన్ని సంస్కరణలు జరగలేదు కనుక, బ్యాంక్ రుణాల వడ్డీరేట్లు ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తుల ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక, కార్మిక చట్టాలూ కఠినం కనుక చిల్లర వర్తకం లోకి ఎఫ్.డీ.ఐ అనుమతీస్తే చైనా లాంటి దేశాలు తమ  ఉత్పత్తులతో దేశాన్ని  ముంచెత్తి లాభ పడతాయని బీజేపీ నుంచి వినిపిస్తున్న వాదం. అయితే, చవకధరల చైనా ఉత్పత్తులు ఇప్పటికే దేశంలో పుష్కలంగా ఉన్నాయని దీనిపై వినిపిస్తున్న ఆక్షేపణ. మరోవైపు ఎఫ్.డీ.ఐని అనుమతించచ్చు కానీ రెండేళ్ళు వాయిదా వేయమని దేశీయంగా చిల్లర వ్యాపారంలో ఉన్న గొలుసు సంస్థలు అడుగుతున్నాయి. ఈ లోపల ఈ సంస్థలకు ఇప్పటికే అనుమతించిన విదేశీ సంస్థాగత పెట్టుబడుల పరిమాణాన్ని 51 శాతానికి పెంచితే, బహుళజాతి సంస్థలతో పోటీ పడే సామర్థ్యాన్ని అవి తెచ్చుకుంటాయని ఆ వర్గాల వాదం. దేశంలో 40 శాతం మేరకు పండ్లు, కూరగాయల ఉత్పత్తులు వినియోగదారులకు చేరేలోపలే పాడైపోతున్నాయనీ, ఎఫ్.డీ.ఐ  వల్ల శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరిగి, సరఫరా వ్యవస్థ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బలపడి ఇలాంటి సమస్యలను నివారిస్తుందని ప్రభుత్వం అంటోంది. పండ్లు, కూరగాయలు చెడిపోవడం ఎక్కడైనా ఉందనీ, ప్రపంచవ్యాప్తంగా ఇది 34 శాతం ఉందనీ వ్యతిరేకుల వాదం.
ఈ మధ్యలోనే, 65 శాతం ఆహోరోత్పత్తులను ప్రభావితం చేసే ఎఫ్.డీ.ఐ నిర్ణయం రైతులకు ఏవిధంగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలంటే ఏం చేయాలనే చర్చా జరుగుతోంది. బహుళజాతి చిల్లర వ్యాపారసంస్థలు నేరుగా రైతులతోనే లావాదేవీలు జరిపే వ్యవస్థను నిర్మించుకోకుండా దళారులపై ఆధారపడితే, ఈ నిర్ణయం వల్ల చిన్న,సన్నకారు రైతులకు ఎలాంటి లాభమూ ఉండదనీ; రైతులు నేరుగా బహుళజాతి సంస్థలతో లావాదేవీలు జరపాలంటే ముందుగా వారు ఒక సమాఖ్యగా సంఘటితం కావడం చాలా ముఖ్యమనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నిజానికి సంస్కరణల తాకిడిని తట్టుకోడానికి ఆయా వర్గాలను తగినంత బలోపేతుల్ని చేయాలన్న ఇలాంటి సూచనలకు చర్చలో ప్రాధాన్యమిస్తే ఆ దారి వేరు. ఆ కోణాన్ని తరచు విస్మరిస్తున్నాయనే ప్రభుత్వాలపై మొదటినుంచీ వినిపించే విమర్శ. కానీ రాజకీయ అనుకూల, వ్యతిరేక ఉద్ఘాటనల హోరు మధ్య ఈ చర్చ అణగారిపోతుంది. అలాగే, చిల్లర వర్తకంలో నూరు శాతం ఎఫ్.డీ.ఐని అనుమతించిన చైనా తదితర దేశాల్లో బహుళజాతి సంస్థల పని తీరూ చర్చలోకి వస్తోంది. వాల్ మార్ట్, టెస్కో, కర్రేఫోర్ లాంటి బహుళజాతి సంస్థలలో కొన్ని  గొప్పగా లాభాలు ఏమీ మూటగట్టడం లేదనీ, ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నాయనీ అంటున్నారు.
దేనిపైనైనా మంచి, చెడుల చర్చ జరగాల్సిందే. అయితే ఆ చర్చ తలా తోకా వదిలేసిన చర్చ కాకూడదు. నిజాల నేల విడిచిన సాము కాకూడదు. ఒకే బ్రాండ్ వస్తువుల చిల్లర వ్యాపారంలోకి 51 శాతం ఎఫ్.డీ.ఐకి ఎప్పుడో గేట్లు తెరిచారు. ఇప్పుడు చేయదలచుకున్నదల్లా దానిని బహుళ బ్రాండ్ల వ్యాపారంలోకి కూడా పొడిగించడమే. భార్తి అనే దేశీయ కంపెనీ భాగస్వామ్యంతో 'బెస్ట్ ప్రైస్' అనే పేరుతో వాల్ మార్ట్  మూడేళ్ళ క్రితమే చిల్లర వ్యాపారంలోకి అడుగుపెట్టి కొన్ని రాష్ట్రాల్లో దుకాణాలు నడుపుతోందన్న సంగతిని మరచిపోకూడదు. ఎంతో కాలంగా మన ఆహార సంస్కృతి విదేశీ వామనుడి మూడో పాదం కింద నలుగుతున్న సంగతినీ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లాంటి నగరాల్లో సబ్ వే, మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, డామినోస్, పిజ్జా హట్, టేకోబెల్, పనేరాబ్రెడ్, చిపోట్లే వంటి బహుళజాతి గొలుసు ఆహారశాలలు; మన ఇడ్లీ, సాంబార్, దోస, పెసరట్, ఉప్మా ఆహారశాలలను ఏమేరకు దెబ్బ తీసాయో, ముందు ముందు దెబ్బ తీయబోతున్నాయో ఎవరైనా లెక్కలు కడుతున్నారా? వాటికి వ్యతిరేకంగా పోరాటాలు లేవదీస్తున్నారా? బర్గర్, పిజ్జాలే కాక  ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్, బీకే వెజ్జీ, చలూపా, బరీటాబౌల్.. ఇలా అనేక కొత్త కొత్త పేర్లు మన ఆహార నిఘంటువులోకి ప్రవేశించి నేటి మన యువత నాలుకలపై నానుతున్న సంగతిని గమనిస్తున్నారా? బహుళజాతి ఆహారశాలలు ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ నే కాదు, మనది కాని రుచుల సంస్కృతినీ చక్కగా 'ప్యాక్' చేసి ఇస్తున్నాయి.
చిన్న చిన్న కిరాణా, కూరగాయల వర్తకుల ఉపాధికి బిగ్ బజార్, రిలయెన్స్ ఫ్రెష్ వంటి దేశీయ గొలుసు సంస్థల వల్లా నష్టం జరుగుతూనే ఉంది. మొన్నటివరకు పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం కూడా ఈ గొలుసు దుకాణాలకు గొడుగు పట్టిందన్న ఆరోపణ ఉంది. విదేశీ తిమింగలాల కంటె దేశీయ తిమింగలాలు నయమని వాదిస్తూ ఇక్కడ కూడా  'స్వదేశీ' 'విదేశీ' తేడాలు తీసుకొచ్చి చర్చను 'దేశభక్తి' వైపు మళ్లించేవారూ ఉంటారు. వాళ్ళకో నమస్కారం.
వాల్ మార్ట్ లాంటి బహుళజాతి చిల్లర సంస్థలు మనదేశంలోకి పెద్ద ఎత్తున అడుగుపెడితే మన ఆహారసంస్కృతితోపాటు షాపింగ్ అలవాట్లు మారి పోయే మాట నిజమే. దేశం పాశ్చాత్యప్రపంచానికి థర్డ్ రేటు అనుకరణగా మారి వ్యక్తిత్వాన్నిమరింత కోల్పోయే మాట అంతకంటె వాస్తవం. అయితే ఈ ప్రక్రియ మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైందన్నసంగతిని విస్మరించకూడదు. మన సాంప్రదాయిక విద్యలు అంతరించాయి. విద్య అందరికీ అందుబాటులోకి రావడం దాని సానుకూల పరిణామం అనుకున్నా అప్పుడు అడుగంటిపోయిన చేతివృత్తులు ఇంతవరకూ పైకి లేవలేదు. బ్రిటిష్ విద్య, ఉద్యోగ విధానం ఎందరిని భూమికి, చేతువృత్తులకు దూరం చేసిందో, వారంతా క్రమంగా నిరుద్యోగం కోరల్లో చిక్కుకుని ఎలా నలిగిపోయారో, ఇంకా ఎలా నలిగి పోతున్నారో మనకు తెలుసు ఇంగ్లీష్ కాన్వెంట్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ, మునిసిపల్, జిల్లాపరిషత్ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేశాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాటకరంగాన్నిసినిమాలానే, టీవీ సినిమా థియేటర్లను మింగేస్తోంది. ప్రతి మార్పూ ఎంతోమంది బతుకు తరువుపై గొడ్డలి వేటు అవుతూనే ఉంది. ఎవరు ఆపగలిగారు?   కాలువ మీద వంతెన కడితే తన ఉపాధి పోతుందని పడవ నడిపేవాడు దిగులు పడతాడు. అయినా వంతెన కడుతూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కడితే వందలాది గిరిజనగ్రామాలు మునిగిపోతాయి. అయినా ప్రాజెక్ట్ ఆగడంలేదు.
మన కాళ్ళ కింద నేలను ఏ పరాయి శక్తులో పెళ్లగించడానికి ప్రయత్నిస్తే సర్వశక్తులూ ఒడ్డి ప్రతిఘటించవలసిందే. అయితే అది మిథ్యా పోరాటం అయితే ప్రయోజనం లేదు. ఉపరితలంగా, పీస్ మీల్ గా, రాజకీయ తక్షణ ప్రయోజనమే లక్ష్యంగా జరిగే ఉత్తుత్తి పోరాటం నవ్వు తెప్పిస్తుంది తప్ప నమ్మకం పుట్టించదు. విపక్షాలు చేస్తున్నది అదే. 1991 నుంచి అవి ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కానీ ఆపలేకపోయాయి. ఇవే పక్షాలు తాము అధికారంలో ఉన్నచోట సంస్కరణ మార్గం పడుతూనే ఉన్నాయి.  ప్రజల సమాచార లోపాన్ని,  భావోద్వేగాలను ఆసరా చేసుకుని పార్టీలు సాగించే రాజకీయ క్రీడ జనంలో గంద్రగోళాన్నిమాత్రమే పెంచుతోంది. పోరాటాలు మిథ్యా పోరాటాలుగా మారి పరువు కోల్పోతున్నాయి.
  మరి దీనికి పరిష్కారమేమిటి? తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచే పరిస్థితినుంచి బయటపడి మన గతిని మనమే శాసించుకునే పరిస్థితి వచ్చే వరకూ ఎదురుచూడడమే కనిపించే పరిష్కారం. ఏ రూపంలోనైనా  దేశం ఆర్థికంగా బలోపేతమైతే అప్పుడు బలాఢ్యస్థ్తితి(పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్)నుంచి మన సొంత అస్తిత్వాన్ని తిరిగి గెలుచుకోగలుగుతామేమో!


Tuesday, October 2, 2012

మహాభారతంలో నేటి కాలపు కథ



మహా భారతం గురించి మనలో చాలా మందికి నిర్దిష్టాభిప్రాయాలు ఉంటాయి. కుల భేదాలు, అవగాహనా స్థాయి, సామాజిక చైతన్యం వగైరా తేడాలను బట్టి ఆ రచనపై గౌరవమో, పూజ్యభావమో, వ్యతిరేకతో ఏర్పరచుకుంటాం. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే బ్రాహ్మణ, బ్రాహ్మణేతర మేధావులు మహాభారతం బ్రాహ్మణీయ రచన అనుకుంటారు. అది బ్రాహ్మణీయ భావజాలాన్ని, బ్రాహ్మణాధిక్యతను, వర్ణాశ్రమ వ్యవస్థ పునాదిగా ఉన్న సమాజాన్ని చిత్రిస్తుందని భావిస్తారు. స్ర్తీవాదులు అది పితృస్వామ్య భావజాలాన్ని, స్త్రీ అణచివేతను ప్రతిపాదించే రచన అనుకుంటారు. అంతేకాదు, రామాయణం, అష్టాదశ పురాణాలు వగైరా ఇతర సాంప్రదాయిక వాజ్మయం లానే మహాభారతం కూడా చర్చకు, పరస్పరం అభిప్రాయాలు కలబోసుకోవడానికి అవకాశమివ్వని ఏకపక్ష భావజాలాన్ని రుద్దే రచన అన్న అభిప్రాయమూ సమకాలీన భావజాలానికి చెందినవారిలో ఉంది.  నిజానికి ఇవన్నీ నిరాధారమైన అభిప్రాయాలేమీ కావు.

ఆశ్చర్యమేమిటంటే, పై అభిప్రాయాలను తోసిపుచ్చే ఘట్టాలు కొన్ని మహా భారతంలోనే  ఉన్నాయి. పేరు లేని ఒక పతివ్రత, కౌశికుడనే ఒక బ్రాహ్మణుడు, ధర్మవ్యాధుడనే ఒక కిరాతకులస్థుడితో  ముడిపడిన ఘట్టం వాటిలో ఒకటి. అరణ్యపర్వం, పంచమాశ్వాసంలో(ఎఱ్ఱాప్రగడ అనువాదం) ఉన్న ఈ ఘట్టాన్ని నిర్మించిన తీరే ఎంతో విస్మయం కలిగిస్తుంది. అది హఠాత్తుగా పాఠకుల్ని మహాభారత ప్రపంచానికి భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెడుతుంది. వారి ముందు భిన్న సమాజాన్ని ఆవిష్కరిస్తుంది. ఇంకా చెప్పాలంటే, అది నేరుగా సమకాలీన సమాజంలోకి తీసుకొస్తుంది. పైగా లోతైన చర్చ, విమర్శ, ఆత్మవిమర్శ రూపంలో ఆ ఘట్టం సాగడం మరింత ఆశ్చర్య చకితం చేస్తుంది. అన్నింటికంటె విశేషం- అందులోని మూడు పాత్రలూ నేటి ఒక స్ర్తీవాదికి, ఒక అగ్రకులస్థునికి, ఒక నిమ్న కులస్థునికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఉండడం.

ఇదీ ఆ కథ:

కౌశికుడు వేదాధ్యయనం చేస్తున్నబ్రహ్మచారి. అతనొక రోజున ఒక చెట్టు కింద కూర్చుని వేదం వల్లె వేస్తుండగా చెట్టుపైనున్న ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు కోపంతో దానివైపు తీక్షణంగా చూసేసరికి అది చచ్చి కింద పడిపోయింది. అతనికి బాధ కలిగింది. ఆత్మవిమర్శ అంకురించింది. నా హృదయంలో ఇంత కాఠిన్యం ఎందుకుంది, నిష్కారణంగా కొంగను ఎందుకు చంపాను, దీని నుంచి నాకు మనశ్శాంతి ఎలా లభిస్తుందనుకున్నాడు. అంతలో మధ్యాహ్నం కావడంతో వికలమనస్సుతోనే భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. ఓ ఇంటిముందు నిలబడి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇల్లాలు భిక్ష ఇవ్వడానికి పాత్ర కోసం వెతుకుతుండగా ఆమె భర్త ఇంటికి వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాడు. ఆమె భర్తకు పీట వేసి అన్నం పెట్టి తాంబూలమిచ్చింది. అతను విశ్రాంతి తీసుకుంటుండగా పాదాలు ఒత్తింది. అప్పటికి కానీ,  బ్రాహ్మణుడు భిక్ష కోసం వచ్చి వాకిట్లో నిలబడి ఉన్నాడన్న సంగతి ఆమెకు గుర్తు రాలేదు. నొచ్చుకుంటూ భిక్ష తీసుకుని వచ్చింది.

కౌశికుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అడిగిన వెంటనే భిక్ష ఇవ్వకుండా నన్నింత సేపు నిలబెట్టి అవమానిస్తావా అని ప్రశ్నించాడు. ఆకలితో వచ్చిన భర్తకు అన్నం పెట్టి సపర్యలు చేయడంలో మునిగిపోయి నీ సంగతి మరచిపోయాను, తప్పుగా భావించద్దు, ఓరిమి వహించమని ఆమె అంది. బ్రాహ్మణుల కన్నా మొగుడు ఎక్కువా, కొవ్వెక్కి నీ కళ్ళు మూసుకుపోయాయని కౌశికుడు తూలనాడాడు. అవమానితుడైన బ్రాహ్మణుడి క్రోధాగ్నికి పర్వతాలు, అడవులు, ద్వీపాలు సహా భూమండలం సమస్తం బూడిదైపోతుందన్న సంగతి నీకు తెలియదా అన్నాడు.

 బ్రాహ్మణుల మహిమ నాకెందుకు తెలియదు, ఒకాయన సముద్ర జలాల్ని తాగేశాడు, ఇంకొకాయన దండకారణ్యాన్ని దగ్ధం చేశాడు. తెలిసి తెలిసి కొరివితో తల గోక్కునేంత వెర్రిదాన్ని కాను, అయినా సరే ఎందుకు ఆలస్యం చేశానంటావేమో, నాకు నా భర్తే దైవం, ఆయనను సేవించుకోవడమే నా ధర్మం, ఇతర ధర్మాలేవీ నా దృష్టిలో అంతకంటె ఎక్కువ కావు, నువ్వు అమిత కోపిష్టివన్న సంగతీ తెలుసు, నీ కోపానికి ఒక కొంగ ఆహుతవడాన్ని నా పాతివ్రత్య మహిమతో చూశానులే అని ఆమె అంది.

ఆ మాటతో కౌశికుడు ఆశ్చర్యపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆమె  కౌశికునికి ధర్మబోధ ప్రారంభించింది.  కోపాన్ని గొప్ప చేసి మాట్లాడడం మంచిదికాదు; కోపం, మోహం అనే రెండు శత్రువుల్ని జయించలేనివాడికి బ్రాహ్మణ్య గౌరవం ఎలా లభిస్తుంది, అయినా చదువుసంధ్యలు లేని స్త్రీలు తప్పు చేస్తే సహించవద్దా అని ప్రశ్నించింది. వేదాలు వల్లె వేయడమే తప్ప నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవని ఆక్షేపించింది. వెంటనే బయలుదేరి మిథిలా నగరం వెళ్ళు. అక్కడ జితేంద్రియుడు, సత్యవాది, మాతాపితృభక్తుడు అయిన ధర్మవ్యాధుడనే కిరాతకుడున్నాడు. అతడు నీకు అన్ని ధర్మాలూ వివరించి సందేహ నివృత్తి చేయగల మహాత్ముడంటూ అతని చిరునామా ఇచ్చింది.

 కౌశికునికి ఆశ్చర్యం మీద ఆశ్చర్యం. అతనెంతో గొప్పగా భావించే బ్రాహ్మణ్యం చదువు సంధ్యలకు దూరం చేసిన ఒక స్ర్తీ అతనికి ఉపదేశకురాలైంది. స్ర్తీలను జ్ఞానానికి దూరంగా ఉంచారన్న ఎత్తుపొడుపు కూడా ఆమె మాటల్లో ఉంది. బ్రాహ్మణ్యమనే ఇరుకు ప్రపంచంలో ఉన్న అతనిని ఆమె ఉపదేశం విశాల ప్రపంచంలోకి తీసుకొచ్చింది. అతని కోపానికి కొంగ ఆహుతవడాన్ని పాతివ్రత్య మహిమతో చూశానన్న ఆమె;  మహిమలు, మంత్రాలు బ్రాహ్మణాధీనాలన్న ఊహను పటాపంచలు చేసింది. ఆమె అభిశంసన అతనిలో కోపాన్ని పెంచలేదు సరికదా, అతని వికల మనస్సుపై అమృతపు జల్లులా పని చేసింది.

తల్లీ నీకు శుభ సమృద్ధులు లభించుగాక అంటూ ఆ క్షణంలోనే కౌశికుడు మిథిలా నగరానికి బయలుదేరాడు. ధర్మవ్యాధుని ఆచూకీ తెలుసుకుని మాంస ఖండాలు వేలాడదీసిన ఓ అంగడిని సమీపించాడు. మాంసం కొనడానికి నిరంతరాయంగా వస్తున్న జనాల మధ్య ధర్మవ్యాధుడు నిపించాడు. ఆ పరిసరాలు జుగుప్సాహవంగా తోచి కౌశికుడు దూరంగా నిలబడిపోయాడు.

కౌశికుని రాకను ధర్మవ్యాధుడు అతీంద్రియ దృష్టితో గమనించాడు. తనే అతనివద్దకు వెళ్ళి నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. ఆ పతివ్రతా తిలకం నా గురించి చెబితే నువ్వు వచ్చావు, ఏ కోరికతో వచ్చావో కూడా నాకు తెలుసునన్నాడు. ఇంతకు ముందు పతివ్రత ఎరుకకు ఆశ్చర్యపోయిన కౌశికుడు, ధర్మవ్యాధుని ఎరుక రెండో ఆశ్చర్యం అనుకున్నాడు.

 ధర్మవ్యాధుడు కౌశికుని తన ఇంటికి తీసుకువెళ్ళి యథోచిత మర్యాదలు చేశాడు. కాసేపు సాధారణ విషయాలు మాట్లాడుకున్న తర్వాత కౌశికుడు తన సందేహాన్ని బయటపెట్టాడు. ధర్మం తెలిసినవాడివి కదా, జీవ హింసతో గడపడం ఏ విధంగా యోగ్యం, ఆ ఘోర కర్మ చూడగానే నాకు దుఃఖం కలిగిందన్నాడు. ధర్మవ్యాధుడు సమాధానమిస్తూ, బ్రాహ్మణునికి తపస్సు, స్వాధ్యాయం; రాజులకు దండనీతి; వైశ్యులకు వ్యవసాయం, పశుపాలన; శూద్రులకు సేవ ఎలా పరమధర్మాలో మాకు జంతుమాంసం మీద ఆధారపడి జీవించడం అలాగే పరమ ధర్మం, పైగా అది మాకు తాత ముత్తాతలనుంచి వస్తున్న వృత్తి అన్నాడు. అయితే ఇతరులు జంతువులను చంపి తెచ్చిన మాంసాన్నే కొని, తగిన వెలకు అమ్ముతూ బతుకుతున్నాను తప్ప తానుగా ఎప్పుడూ జీవహింస చేయననీ, శాంతియే తన ధనమనీ అన్నాడు. మిథిల రాజు జనకుడికి వర్ణాశ్రమ ధర్మ నిర్వహణపై పట్టింపు ఎక్కువని కూడా అన్నాడు. తను తక్కువ కులంలో పుట్టినా వినయం, అతిథి సేవ, సత్యం, శౌచం, ఓరిమి, అసూయా రాహిత్యం, ఏకపత్నీవ్రతం, నిందాస్తుతుల పట్ల సమతుల్యత వంటి గుణాల వల్ల నిర్మలుడినయ్యానన్నాడు.

కుల ధర్మాన్ని పాటించడం పరమధర్మమని పెద్దలంటారు. అయితే, మనసులో కృప కలిగి ఉండడం ముఖ్యం. అలాగే ఓరిమి కూడా ఉండాలి. కోరికల విషయంలో విడుపు అవసరం. విడుపును మించిన గొప్ప గుణం మరొకటి లేదు. పరిత్యాగికి సాధ్యం కానిదేమీ ఉండదు. కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో మనసు మలినమవుతుంది. అయినా సరే ధర్మం తప్పకుండా జీవించడం ఉత్తమ మార్గం. క్రోధ, లోభాలు రెండూ అన్ని పాపాలనూ మించిన పాపాలు. ఆ రెండింటినీ జయించినవాడే పరమ ధార్మికుడు. దానం, తపస్సు, సత్యం, మితంగా మాట్లాడడం, దయార్ద్రత మొదలైన శిష్టాచారాలను పాటించడం వల్ల ప్రయోజనమేమిటంటావేమో, అది అంతఃకరణలో సంతోషం నింపుతుంది. అటువంటి సంతృప్తి మరే మార్గంలోనూ లభించదన్నాడు.

ఆ తర్వాత ధర్మవ్యాధుడు హింస- అహింసల చర్చలోకి వెడుతూ;  ఏది హింసో, ఏది అహింసో నిర్ణయించడం ఎవరి తరం? బ్రాహ్మణులు యజ్ఞాలలో పశువులను వధించడం లేదా? పితృకార్యాలలో మాంసం శ్రేష్టమనీ, ఆ పితృశేషాన్ని భుజించడం యోగ్యమనీ మునులు చెప్పలేదా? భూమి, నీరు, ఆకాశం సమస్తం ప్రాణిమయం కనుక ఆయా కర్మలు చేసేటప్పుడు హింస తప్పదు. హింస చేయనిదే దేహయాత్రసాగదు.ఇదేమీ ఆలోచించకుండా, అహింసావ్రతులమంటూ మునులు అడవుల్లో గడుపుతూ ఉంటారు. వారు కందమూల ఫలాలు కోసి తినడం కూడా హింసే. కనుక, హింస చేయనివాడంటూ ఈ ప్రపంచంలో ఒక్కడూ ఉండడు. సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉండడమే అహింస. ఈ విధంగా ధర్మం అనేక విధాలుగా ఉంటుంది. ధర్మ సూక్ష్మాలు గ్రహించడం అంత తేలిక కాదు. అందుకే శ్రుతులను, పెద్దల ఆచారాలను ప్రమాణంగా తీసుకోవాలి. ధర్మాచరణ వల్ల మనసు తేటపడి ప్రసన్నమవుతుంది. ఇంద్రియ సుఖాలు శుష్కమైనవన్న ఎరుక కలుగుతుంది. క్రమంగా పరిణతి లభిస్తుంది.

చివరగా... నువ్వడిగిన అన్ని ధర్మాలూ క్లుప్తంగా చెప్పాను,  ఇంకా వినవలసినదేమైనా ఉందా అని ధర్మవ్యాధుడు అడిగాడు. లేదు, అన్నీ వివరంగా తెలిశాయి. జ్ఞానసిద్ధి కలిగింది. నువ్వు సర్వజ్ఞుడివన్న సంగతి అర్ధమైందని కౌశికుడు అన్నాడు. దానిపై ధర్మవ్యాధుడు, నాకీ ఉత్తమ జ్ఞానం సిద్ధించడానికి మూలమైన ధర్మం వేరొకటి ఉంది, దానిని ప్రత్యక్షంగా చూపిస్తానంటూ అతన్ని తన అభ్యంతర గృహంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడున్నవృద్ధ దంపతులను చూపించి, వీరు నా తల్లిదండ్రులు. వీరిని సేవించుకుంటూ ఉండడం వల్లనే కానీ పరిజ్ఞానం సిద్ధించింది. అందరూ ఏవేవో కోరికలతో దేవతలను పూజిస్తారు. నాకు మరో దేవుడు లేడు. నా తల్లిదండ్రులే నా పాలి వేల్పులు. నా భార్యా, నేనూ వీరికి అన్న వస్త్రాలు, ఫల పుష్పాలు ఇచ్చి భక్తితో నిరంతరం సేవించుకుంటున్నాం. వేదాలు, యజ్ఞాలు, వ్రతాలు అన్నీ మాకు వీరే. అదలా ఉంచి, ఆ పతివ్రత పంపగా నువ్వు నా దగ్గరకు వచ్చావు కనుక ఆమె పట్ల అభిమానంతో నీకివన్నీ చెప్పాను కానీ; నీ మీద ఇష్టంతో కాదు. ఎందుకంటే నువ్వొక తప్పు చేశావు. వృద్ధాప్యంలో నువ్వు తమకు తెప్ప వవుతావన్న ఆశతో బతుకుతున్న తల్లిదండ్రులను విడిచిపెట్టి, వారి అనుమతి లేకుండా నిశ్చింతగా నువ్వు వేదాధ్యయనంతో గడుపుతున్నావు. ఇంతకంటె క్రూరత్వం ఉండదు. నీ కోసం దుఃఖించి దుఃఖించి భగ్న హృదయులై కంటి చూపు కోల్పోయి భారంగా రోజులు దొర్లిస్తున్న ఆ వృద్ధ దంపతుల వద్దకు వెళ్ళి వారి శోకాగ్నిని ఆర్పు. తల్లిదండ్రుల సేవ మరచి నువ్వు జరిపే అధ్యయనం వృథాప్రయాస- అని ధర్మవ్యాధుడు అన్నాడు.

కౌశికుడు అతనితో ఏకీభవిస్తూ, నువ్వు ఇలాంటి జన్మ ఎత్తడానికి కారణమేమిటని అడిగాడు. ధర్మవ్యాధుడు సమాధానమిస్తూ- గత జన్మలో తాను బ్రాహ్మణుడిననీ, ఒక రాకుమారునితో స్నేహం వల్ల ధనుర్వేదం అభ్యసించాననీ, ఒక రోజు అతనితో వేటకు వెళ్ళి మృగాలపై బాణం వేయబోగా అది ఒక ముని కుమారునికి తగిలిందనీ, అతను కోపించి, బ్రాహ్మణుడివై ఉండీ శూద్ర కర్మకు పాల్పడ్డావు కనుక ఎరుక కులంలో పుట్టమని శపించాడనీ, తను క్షమాపణ కోరి శాపాన్ని ఉపసంహరించమని ప్రాధేయపడేసరికి, ఎరుక కులంలో పుట్టినా ధర్మజ్ఞుడివవుతావనీ, మరు జన్మలో మళ్ళీ బ్రాహ్మణుడివవుతావని ముని శాప విముక్తిని అనుగ్రహించాడని చెప్పాడు.

 కౌశికుడు ఇక శెలవు తీసుకుంటానంటూ ధర్మవ్యాధునికి ప్రదక్షిణం చేసి, తన తల్లిదండ్రుల వద్దకు బయలుదేరాడు.
                                                                           ***

 ఈ కథలో ఒక  వైరుధ్యమూ ఉంది. అదేమిటంటే , జ్ఞాన సముపార్జన హక్కుకు దూరంగా సేవాధర్మానికి పరిమితం చేశారనుకునే ఒక స్ర్తీనీ, నిమ్నకులస్థునీ పైమెట్టు మీదా; ఒక బ్రాహ్మణుని కింది మెట్టుమీదా నిలుపుతూనే, మరోవైపు బ్రాహ్మణాధిక్యతను, వర్ణ వ్యవస్థను నొక్కి చెబుతుండడం!  పేరుతో గుర్తింపునకు కూడా నోచుకోని ఇందులోని స్ర్తీ పాత్రను పతివ్రతగా పేర్కొనడంలోనే- భర్తను సేవించడం తప్ప ఆమె జీవితానికి మరో సార్థకత లేదన్న కట్టడి ఉంది. పతిసేవ తప్ప నాకు మరే ధర్మమూ ఎక్కువ కాదని ఆమె కౌశికుడితో అనడంలో పతిసేవ పట్ల నిష్ట కన్నా తనకు విద్య, విజ్ఞానాలను నిరాకరించిన బ్రాహ్మణ్యం పై నిరసనే ధ్వనిస్తుంది. భర్తకు భోజనం పెట్టి, తాంబూలమిచ్చి, పాదసేవ చేయడం భక్తితోనా, భయంతోనా అన్న సందేహం కలుగుతుంది. బ్రాహ్మణుని మహిమ తెలియదా అని కౌశికుడు ప్రశ్నించినప్పుడు, తెలియకేమన్న ఆమె సమాధానంలో అవహేళన;  చదువు సంధ్యలు లేని స్త్రీలు చేసే తప్పులను సహించవద్దా అనడంలో ఎత్తిపొడుపు కనిపిస్తాయి. నీకు ధర్మసూక్ష్మాలు తెలియవనడంలో, కోపమోహాలు జయించనివాడు ఏం బ్రాహ్మణుడనడంలో- బ్రాహ్మణాధిపత్య, పురుషాధిపత్య వ్యవస్థపై ఆమెలో గూడు కట్టుకున్న అసమ్మతి, అసంతృప్తి బద్దలైన ఛాయలు కనిపిస్తాయి. ఆవిధంగా ఆమె నేటి స్ర్తీవాదానికి  సంపూర్ణ ప్రతినిధి అన్న అభిప్రాయం కలుగుతుంది.  తనలానే జ్ఞానాధికారానికి దూరమై సేవా ధర్మానికి కట్టుబడవలసి వచ్చిన నిమ్నకులస్థుడైన ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్ళి ధర్మసూక్ష్మాలు తెలుసుకొమ్మని ఆమె కౌశికుడికి చెప్పడం మరింత విస్మయం కలిగిస్తుంది. మడి, తడి పాటిస్తూ నాలుగు గోడలకు పరిమితమవుతుందనుకునే ఒక బ్రాహ్మణ స్ర్తీకీ, మాంసం దుకాణం నడుపుకునే ఒక నిమ్నకులస్థుడికీ మధ్య భావ వినిమయం ఎలా సాధ్యమైందో, ఉభయులూ ఒకే గుండె చప్పుడును ఎలా పంచుకోగలిగారో తలచుకున్నకొద్దీ ఆశ్చర్యం ముంచెత్తుతుంది.

ఉపరితల వర్ణాశ్రమ ధర్మానికి సమాంతరంగా, అంతర్లీనంగా, దానిని ధిక్కరిస్తూ అథోజగత్తు రూపొందుతూ వచ్చిందనీ, అందులోని సభ్యుల మధ్య రహస్యంగా భావవినిమయం జరుగుతూ ఉండేదన్న ఊహకు ఇది అవకాశమిస్తోంది. కౌశికుడి కోప దృష్టి కొంగను చంపిన సంగతిని తాను పాతివ్రత్య మహిమతో గమనించానని ఆమె చెప్పడం;  కౌశికుని రాకనూ, పతివ్రత అతనిని పంపిన సంగతినీ తన మనోదృష్టితో గమనించానని ధర్మవ్యాధుడు అనడం- తమ అజ్ఞాత సంబంధాలూ, సమాచార సేకరణా ఉపరితల సమాజం దృష్టికి రాకుండా తీసుకునే జాగ్రత్తలో భాగమనీ అనిపిస్తుంది. ధర్మవ్యాధుడు వర్ణధర్మాలను సమర్ధిస్తున్నట్టు, బ్రాహ్మణాధిక్యతను అంగీకరించినట్టు కనిపిస్తాడు. ఇది రాజభయంతోనా, వ్యవస్థాభయంతోనా; లేక అతడు వాటిని స్వచ్ఛందంగా విశ్వసిస్తున్నాడా అనే సందేహం కలుగుతుంది. వర్ణవ్యవస్థను, బ్రాహ్మణాధిక్యతను సమర్ధిస్తున్నట్టు కనిపిస్తూనే అతను తనదైన అజెండాను ముందుకు తెచ్చి బ్రాహ్మణ్యంపై పై చేయిని చాటుకునే ప్రయత్నం చేసినట్టూ కనిపిస్తాడు.

ఇంతకీ బ్రాహ్మణాధిక్యతను చాటేదిగా భావించే మహాభారతంలో బ్రాహ్మణుడిలో ఆత్మ విమర్శను ప్రేరేపించి అతనిపై స్ర్తీ, నిమ్నకులస్థుల ఆధిక్యతను స్థాపించే ఈ ఘట్టాన్ని ఎలా పొందుపరిచారు? ఈ ప్రశ్నకు, మహాభారతం కూర్చిన తీరులో సమాధానం దొరుకుతుంది.  చాలా కాలంపాటు మౌఖిక ప్రచారంలో ఉన్న కథల్నిమహాభారతం పేరిట గ్రంధస్థం చేశారు.  అయితే వివిధ కాలాలకు చెంది, రకరకాల వైరుధ్యాలు నిండిన కథలను అతుకుపెట్టి ఏకసూత్రత కల్పించడంలో, ఇప్పటి భాషలో చెప్పాలంటే ఎడిటింగ్‌లో అజాగ్రత్తవల్ల కొన్ని వైరుధ్యాలు అలాగే ఉండిపోయాయి. కులం అన్నది జన్మతో కాక, గుణంతో సిద్ధిస్తుందన్న సూచనను కౌశికుని ద్వారా అందిస్తూనే, ముందు జన్మలో బ్రాహ్మణుడైన ధర్మవ్యాధుడు ఈ జన్మలో కిరాతకుడు కావడానికి ఒక శాపాన్ని కారణంగా చూపించడం, తదుపరి జన్మలో అతను మళ్ళీ బ్రాహ్మణుడవుతాడని చెప్పడం బ్రాహ్మణత్వాన్ని ఉన్నతంగా చూపించే కృత్రిమ ప్రయత్నమే.

 అయితే, ఎడిటింగ్‌లో సంభవించిన ఈ లోపం చివరికి గుణమే అయింది. అతుకుల్ని గుర్తించే అవకాశాన్నీ,  అవి సూచించే ఖాళీలలోకి తల దూర్చి మహాభారతాన్ని సరికొత్త కోణాలనుంచి అర్ధం చేసుకునే వెసులుబాటునూ అది కల్పిస్తోంది.కౌశిక-ధర్మవ్యాధోపాఖ్యానం అందుకొక చక్కని ఉదాహరణ.

Monday, October 1, 2012

గాంధీ గురించి సరదాగా కొన్ని...

గాంధీజీతో ఈమధ్య నేను ఏణ్ణర్థంపాటు సహజీవనం చేశాను. అదెలా అనుకుని మీరు ఆశ్చర్య పోతున్నారేమో... మరేం లేదు, గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ రచించిన 'మోహన్ దాస్' అనే ఆంగ్ల రచనను తెలుగులోకి అనువాదం చేస్తూ...ఎమెస్కో ఆ అనువాదాన్ని ప్రచురించింది.

గాంధీ గురించిన ఆ ఉద్గ్రంథాన్నిఅనువాదం చేస్తూ గడపడమంటే, 'అక్షరాలా' గాంధీతో సహజీవనం చేయడమే. ఆ రచన గాంధీ జీవిత, వ్యక్తిత్వాలను అనేక కోణాల నుంచి ఆవిష్కరించింది. కొన్ని కొన్ని ఘట్టాలు నన్ను ఎంత ఆకట్టుకున్నాయంటే, ఇంట్లో పిల్లలతోనూ, ఇంటికొచ్చిన మిత్రులతోనూ అప్పటికప్పుడు వాటిని పంచుకోకుండా ఉండలేకపోయేవాణ్ణి. ఇవాళ అక్టోబర్ 2 కనుక  వాటిలో రెండు మూడు మీతో పంచుకోవాలనిపించింది.
                                                                    ***

గాంధీ నడకలో గొప్ప నాటకీయత ఉట్టిపడుతూ ఉండేది. ఓసారి ఆయన దక్షిణాఫ్రికా నుంచి లండన్ వెళ్ళిన సందర్భంలో జాతీయభావనతో ఉత్తేజితులవుతున్న అక్కడి భారతీయ యువ విద్యార్థి బృందం ఒకటి ఆయనను డిన్నర్ కు ఆహ్వానించింది. భారతీయ యువతను తీవ్రవాద పంథానుంచి తప్పించి తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న గాంధీ, వెంటనే వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. అయితే, నిర్ణీత సమయం కంటే చాలా ముందే అక్కడికి వెళ్ళాడు. అప్పటికి ఆ కార్యక్రమ బాధ్యులెవరూ రానే లేదు. లోపల వంటశాలలో వంటకాలు సిద్ధమవుతున్నాయి. గాంధీ నేరుగా వంట వాళ్ళతో చేరిపోయాడు. వంటలో వాళ్ళకు సాయం చేశాడు. ఆయనే ఆ విందు సమావేశంలో ముఖ్య అతిథి అని వాళ్ళకు తెలియదు.

అంతేకాదు, వంట అయిన తర్వాత భోజనం బల్లలు, కుర్చీలు సర్దడంలో కూడా గాంధీ  సాయం చేశాడు. నిర్వాహకులు వచ్చాక, ఆయనే గాంధీ అనీ, ఆనాటి కార్యక్రమంలో ఆయనే ముఖ్య అతిథి అనీ తెలిసి పనివారు విస్తుపోయారు.

విశేషమేమిటంటే, ఆ విందు సమావేశంలో వినాయక్ దామోదర్ సావర్కర్ కూడా పాల్గొన్నాడు. అంతకంటే విశేషమేమిటంటే, విద్యార్థి బృందాన్ని ఆ రోజున గాంధీ కంటే సావర్కరే ఎక్కువ ఆకట్టుకున్నాడు!
                                                                      ***

'ఉక్కుమనిషి'గా ప్రసిద్ధుడైన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వ్యక్తిత్వానికి మరో పార్శ్వం కూడా ఉందని ఈ తరం వాళ్ళకు ఎంతమందికి తెలుసు? నిజానికి ఆయన గొప్ప హాస్యచతురుడు కూడా. గాంధీని సైతం నిరంతరం నవ్వుల్లో ముంచి తేల్చిన చాతుర్యం ఆయనది. అందుకే జైల్లో ఉన్నప్పుడు పటేల్ తోడుకోసం గాంధీ పరితపించి పోయేవాడు. జైలు జీవితం మిమ్మల్ని కుంగదీయడం లేదా అని ఒక మిత్రుడు గాంధీని అడిగినప్పుడు, పటేల్ తోడున్నప్పుడు బయటి జీవితం కంటే జైలు జీవితమే బాగుంటుందని గాంధీ సమాధానం చెప్పాడు.

ఓసారి గాంధీ, ఆయన సహాయకుడు మహదేవ్ దేశాయ్, పటేల్-ముగ్గురూ జైలులో సహజీవనం చేస్తున్నప్పుడు గాంధీకి ఒక అపరిచితుడి నుంచి ఉత్తరం వచ్చింది. గాంధీని అనేక విధాలుగా ఆడిపోసుకున్న ఆ అపరిచితుడు, 'మీరు జీవిస్తున్న కాలంలో జీవించవలసి వచ్చిన ఒక దురదృష్టవంతుడు' అంటూ ఆ ఉత్తరాన్ని ముగించాడు.

ఈ ఉత్తరానికి జవాబు ఏమని రాయాలని గాంధీ, పటేల్ ను అడిగాడు.

ఇంత విషం పుచ్చుకోమని రాయండని పటేల్ సలహా ఇచ్చాడు.

అంతకంటే నాకే  అతనింత విష మిచ్చి చంపితే మంచిదేమో నని గాంధీ అన్నాడు.

అందువల్ల అతనికి ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఎందుకంటే, మిమ్మల్ని చంపినందుకు అతన్ని ఊరి తీస్తారు. అప్పుడు మీతోపాటే అతనూ మళ్ళీ పుట్టవలసి వస్తుందని పటేల్ అన్నాడు.
                                                                  ***

గాంధీ రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్ వెళ్లిన సందర్భంలో ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులను బ్రిటిష్ రాజు విందుకు ఆహ్వానించాడు. అయితే, మొదట్లో గాంధీని మాత్రం పిలవడానికి ఇష్టపడలేదు. బాగుండదని విదేశాంగ మంత్రి నచ్చజెప్పిన మీదట ఒప్పుకున్నాడు. గాంధీ తన ఎప్పటి వేషంలోనే విందుకు వెళ్ళాడు. మీరు ఈ చాలీ చాలని దుస్తులతోనే రాజును కలిశారా అని ఒక విలేకరి అడిగినప్పుడు, మా ఇద్దరికీ సరిపోయినన్ని దుస్తులు రాజే ధరించాడు కదా అని గాంధీ చమత్కరించాడు.



కవిత్రయ భారతం-కొన్ని అభిప్రాయాలు


ఈ మధ్య నేను కవిత్రయ భారతాన్ని పూర్తిగా చదివాను. ఇదే మాట నేను వెల్చేరు నారాయణ రావు గారితో అంటే,  కవిత్రయ భారతం మొత్తాన్ని చదివానని అన్నవారు నా కింతవరకు ఒక్కరూ కనిపించలేదు, మీ నోటే మొదటిసారి ఆ మాట వింటున్నానన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. అదలా ఉంచి, కవిత్రయ భారతం పై నాకు కలిగిన కొన్ని అభిప్రాయాలను మీతో పంచుకోడానికి ఈ చిన్న వ్యాసం.
 కవిత్రయ భారతంపై సంప్రదాయ పండితులు, విశ్వవిద్యాలయాలలో బోధన చేసే పండితులు, పరిశోధకులు ఇప్పటికే అనేక విశ్లేషణాత్మక పరిశీలనలు చేశారు. వ్యాసాలు వెలువరించారు. నేను ఈ క్రింద పేర్కొంటున్న అంశాలను వారు  ఎంతవరకు గమనించి చర్చించారో తెలియదు.  నాకు తెలిసినంతవరకు కవిత్రయ భారతాన్ని సంప్రదాయ పండితులు, వారు ఏర్పరచిన మార్గంలో దానిపై పరిశోధనలు చేసినవారు విమర్శలకు అతీతమైన ఒక ప్రశంసాత్మక దృష్టితో, ఇంకా చెప్పాలంటే ప్రశ్నించడానికి వీలులేని భక్తి ప్రపత్తులతో చూస్తారు. బహుశా కట్టమంచి రామలింగారెడ్డి ఇందుకు మినహాయింపు అనుకుంటాను.
సాంప్రదాయికంగా నన్నయ అక్షర రమ్యత, ప్రసన్న కథ కలితార్ధ యుక్తి; తిక్కన నాటకీయత, నన్నయ వరవడిలో ఎఱ్ఱన పూర్తి చేసిన అరణ్య పర్వ శేషం అనే అంశాలతో పాటు పాత్ర పోషణ, రసం, శిల్పం వగైరాలు చర్చలోకి వస్తుంటాయి.  అయితే,  కవిత్రయాన్ని తులనాత్మకంగా పరిశీలించినవారు ఎవరైనా వున్నారో లేదో తెలియదు.  నాకు కలిగిన అభిప్రాయాలు ఇవీ:
  1. నన్నయ అనువాదం తిక్కన అనువాదంతో పోలిస్తే ఒక పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా, పరిష్కరణ ప్రధానంగా జరిగినట్టు అనిపించింది. నన్నయ క్లుప్తతకు కూడా ప్రాధాన్య మిచ్చాడు. అయితే నన్నయలో మూలాతిక్రమణలూ వున్నాయి.
  2. నన్నయ అనువాదంతో పోలిస్తే తిక్కన అనువాదం అంత పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా జరిగినట్టు అనిపించలేదు. ముఖ్యంగా  కీచకవధాఘట్టాన్ని ఆయన విసుగు పుట్టించేటంతగా సాగదీశాడు. ఇతరత్రా  ఆయన చూపించిన దక్షత దృష్ట్యా ఇది ఆశ్చర్యం కలిగించింది. శాంతిపర్వానువాదం అంతకంటే ఎక్కువగా విసుగుపుట్టిస్తుంది. అందులో భావాలేకాదు, అక్కడక్కడ కథలు కూడా పునరుక్తమయ్యాయి. తిక్కన వాటిని ఎందుకు పరిహరించలేదో!  బహుశా నన్నయ ఆ పని చేసివుండేవాడనిపించింది.  తిక్కన నన్నయకంటే ఎక్కువ పర్వాలను అనువదించడంవల్ల, అనువాదానికే తప్ప, పరిష్కరణకు, ప్రణాళికకు ప్రాధాన్య మిచ్చి వుండకపోవచ్చు. నన్నయ, తిక్కనల మధ్య శైలీ భేదం కూడా ఎక్కువే. నన్నయది ప్రధానంగా పౌరాణిక శైలి అయితే తిక్కన దృశ్యకావ్య శైలిని అనుసరించాడు. నిజానికి మహాభారతానికి నన్నయ పౌరాణికశైలే ఎక్కువగా నప్పిందేమో ననిపించింది.
  3.  అయితే, తిక్కన విశ్వరూపం యుద్ధపర్వాలలో కనిపిస్తుంది. వాటిని ఆయన అత్యద్భుతంగా అనువదించాడు. తిక్కనలో 'నాటకీయ' శిల్పం ఎక్కువన్న అభిప్రాయాన్ని సవరించుకోవాలేమో నని కూడా అనిపించింది. ఎందుకంటే, ఆయన యుద్ధపర్వాల నిర్వహణ నేటి భాషలో చెప్పాలంటే పూర్తిగా  సినిమాటిక్. యుద్ధ సమయంలో వుండే ఉద్రిక్తత(టెన్షన్)ను, ఉద్విగ్నతను, ఆవేశ, కావేశాలను, భావావేశాలను తిక్కన అనితర సాధ్యంగా రక్తి కట్టించాడు. ద్రోణ పర్వంలో అది మరింత పరాకాష్టలో కనిపిస్తుది. తిక్కన ప్రతిభకు విరాటపర్వాన్ని ఎక్కువగా ఉదహరిస్తుంటారు. నా ఉద్దేశంలో ఆయన భారతానువాదంలో యుద్ధపర్వాలే హైలెట్.
  4. తిక్కన చిత్రించిన యుద్ధఘట్టాలు చదువుతుంటే మహాభారతయుద్ధాన్ని సినిమా తెరకు ఎక్కించే ప్రయత్నం ఇంతవరకు ఎవరూ ఎందుకు చేయలేదో నని కూడా అనిపించింది. (తెలుగులో వచ్చిన సినిమాలు తిక్కన చిత్రీకరణ స్థాయికి  వేల మైళ్ళ దూరంలో ఉన్నాయి. మహాభారతం లోతు తెలుగు సినిమా దర్శకులకు అంతుబట్టినట్టు తోచలేదు. బహుశా తెలుగు సినిమాకు గల కొన్ని పరిమితులు అందుకు కారణం కావచ్చు). హాలీవుడ్, కనీసం బాలీవుడ్ స్థాయిలో(వార్ ఆఫ్ ట్రాయ్ వగైరా సినిమాల తరహాలో) జరగవలసిన ప్రయత్నం అది. విశేష మేమిటంటే, తిక్కన అనువాదాన్ని యథాతధంగా స్క్రీన్ ప్లేగా వాడుకోవచ్చు. అంతేకాదు, 'స్క్రీన్ ప్లే రచయిత' గా  టైటిల్స్ లో ఆయన పేరు ఇచ్చి తీరాలి. 
  5. ఎర్రాప్రగడ అరణ్య పర్వశేషం నిజంగా నన్నయ అనువాద స్థాయిలో ఉండడమే కాదు, ఆయనను మించినదేమో నానిపించింది. ముఖ్యంగా కౌశిక-ధర్మవ్యాధోపాఖ్యానాన్ని ఆయన నిర్వహించిన తీరు అద్భుతం. దానిపై నేను చేసిన ఒక విశ్లేషణను ఈ బ్లాగులో చేర్చబోతున్నాను. 
 చాలామందికి కోపం రావచ్చేమోకానీ, మహాభారతాన్ని ఒక పేలవమైన రచనగా పరిగణించేవారూ ఉన్నారు. ఉదాహరణకు, అది విసుగుపుట్టించే ఒక రూపరహిత రచన అని ప్రముఖ చరిత్రకారుడు డీ.డీ. కోశాంబి అంటాడు. ఇష్టానుసారం ఉపాఖ్యానాలను చేర్చి అసలు కథారూపాన్ని దారుణంగా చెడగొట్టారని కూడా ఆయన వ్యాఖ్య. మహాభారతంతో పోల్చితే హోమర్ 'ఇలియడ్' కావ్యం అన్నివిధాలా ఉత్తమరచన అని కూడా కోశాంబి అంటాడు. కోశాంబి అభిప్రాయాలే ప్రామాణికాలని చెప్పడం నా ఉద్దేశం కాదు.  ఇలాంటి వివిధ దృక్కోణాలనుంచి మహాభారత పరిశీలన జరిపిన తెలుగు పండితులు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నను ముందుకు తేవడానికే ఈ ప్రస్తావన.   అలాగే, తెలుగు భారతాన్ని సంస్కృత భారతంతో ఎవరైనా తైపారా వేశారో లేదో కూడా తెలియదు. పై అభిప్రాయాలపై మీ స్పందనతోపాటు, మీకు తెలిసిన సమాచారాన్ని ఆహ్వానిస్తున్నాను.