Wednesday, October 30, 2013

దేవయానిని కచుడు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?

రక్తసంబంధాలనూ; ప్రేమ, కరుణ, కడుపుతీపి, వాత్సల్యం వంటి మానవీయ సహజాతాలనూ కాలరాసే బానిసత్వపు కర్కశరూపాన్ని మన దాశరథి రంగాచార్యగారు కూడా చిల్లర దేవుళ్ళు నవలలో కళ్ళకు కట్టిస్తారు. అందులో రామారెడ్డి అనే దొరకు మంజరి అధికారిక సంతానమైతే, వనజ అడబాపకు కలిగిన సంతానం. అంటే, గర్భదాసి. రామారెడ్డి మంజరినే తన కూతురుగా భావిస్తాడు. ఆమె మీదే ప్రేమాభిమానాలు చూపిస్తాడు. వనజను అడబాపగానే ఉంచుతూ గడీకి వచ్చిన అతిథులకు అప్పగిస్తూ ఉంటాడు.

ప్రాచీన గ్రీకు, రోమన్ సమాజాలలో; ఇటీవలి అమెరికాలో ఉన్నట్టు మన దేశంలో ప్రామాణిక బానిసవ్యవస్థ లేకపోవచ్చు. అందుకు భౌగోళిక కారణాలతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని కొశాంబీ తదితరులు అంటారు. అయితే, మన దేశంలో దాస, దాసీ వ్యవస్థ ఉంది. పుట్టింటి అరణంగానో, విజేతలైన రాజులకు కప్పంగానో, కానుకగానో; పండిత సత్కారంగానో దాస,దాసీలను ఇవ్వడం మన పురాణ, ఇతిహాసాలలో కనిపిస్తుంది. ఇలాంటి దాస,దాసీలు కలిగిన గృహ ఆర్థికవ్యవస్థ మన దేశంలో ఎలా అవతరించి అభివృద్ధి చెందిందో రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో ఆసక్తికరంగా వివరించారు. గృహ ఆర్థికవ్యవస్థలోని యజమానికీ, బానిసల యజమానికీ పోలికలు ఉంటాయి.

 ప్రస్తుతానికి వస్తే, తనను పెళ్లాడమని యయాతిని కోరబోతున్న దేవయాని, అందమైన తన దాసీలను కూడా అతనికి ఎర వేయబోతోంది. అంతేకాదు, తనకు సంతానం ప్రసాదించమని యయాతిని అడగబోతున్న శర్మిష్ట; భార్య, దాసి, కొడుకు అనేవి వారించలేని ధర్మాలు సుమా అని అతనికి గుర్తుచేయబోతోంది.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Wednesday, October 23, 2013

స్త్రీకి సొంత గొంతు లేదని చెప్పే గొప్ప కథ...The Lady

శర్మిష్ట మితభాషిత్వం నిగమశర్మ మితభాషిత్వం లాంటిది కాదు. అది సమాజం ఆమెపై రుద్దిన మితభాషిత్వం. నిజానికి  స్త్రీ అతిభాషిత్వమూ, మితభాషిత్వమూ రెండూ ఒకలాంటివే. ఆమె మాటకీ మౌనానికీ ఒకే విలువ ఉంటుంది. రేకు డబ్బాలో గులకరాళ్ళు చప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, విలువ మారదు.  

స్త్రీకి తనదైన భాష లేదు. పురుషుడి భాష మాట్లాడుతుంది, పురుషుడిలా ఆలోచిస్తుంది, పురుషుడి హృదయంతో స్పందిస్తుంది.

ఈ మాటలు అంటున్నప్పుడు, నాకు ఎంతో ఇష్టుడైన ఒక కథకుడూ, ఆయన రాసిన ఒక కథా గుర్తుకొస్తున్నా(రు-యి). ఆ కథకుడు, చెఖోవ్...ఆ కథ పేరు, The Lady.

 స్త్రీకి సొంత గొంతు లేదు, సొంత సమస్యలు లేవు; ఆమె పురుషుడి గొంతునూ, పురుషుడి సమస్యలనూ వినిపించే సౌండ్ బాక్స్ మాత్రమే నన్న సత్యాన్ని ఇంత గొప్పగా చెప్పిన మరో రచన ప్రపంచసాహిత్యంలో ఉందని నేను అనుకోను. ఆ కథ ఇదీ:

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Tuesday, October 22, 2013

మంత్రులు ఎక్ ష్ట్రా పాత్రలు వేయడం బాగుంటుందా?!

ఎప్పుడైనా బాగుంటుందేమో కానీ ఎప్పుడూ బాగుండదని నాకు అనిపిస్తుంది.

బాగుండకపోగా రోత పుడుతుంది, ఈ మంత్రులు మరీ ఇంత insensitive ఏమిటి, వీళ్ళ వల్ల జనానికి ఏం మేలు జరుగుతుందనిపిస్తుంది.

కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ నే తీసుకోండి. ఇటు రాజకీయాలను, అటు క్రికెట్ రాజకీయాలను ఆయన చాలాకాలంగా సవ్యసాచిలా నిర్వహిస్తున్నారు. రాజకీయనాయకులకు క్రికెట్ వ్యవహారాలమీద ఇంత ఆసక్తి ఎందుకన్నది ఓ జవాబు లేని ప్రశ్న. కాసులు కురిపించే ఆట కావడం ఆ ఆసక్తికి కారణమో, లేక ఆట మీద ఇష్టం కారణమో తెలియదు. ఆట మీద ఇష్టముంటే ఎప్పుడైనా ముఖ్యమైన మ్యాచ్ లకు వెళ్ళి చూసి ఆనందించ వచ్చు. క్రికెట్ బోర్డు నాయకత్వం దేనికి? రాజకీయనాయకులు చేయడానికి అంతకన్నా ముఖ్యమైన పనులు ఎన్ని లేవు?

శరద్ పవార్ నే అనుకోనక్కరలేదు. క్రికెట్ కిరీటాలపై మోజు పడే వారు  చాలా పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్ కు చెందిన రాజీవ్ శుక్లా,  బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ, అనురాగ్ ఠాకూర్,  నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఫారూఖ్ అబ్దుల్లా తదితరులు...

ఒక పక్క ఉల్లి పాయల ధర కిలో వందరూపాయలు దాటిపోయిందని వార్తలు హోరెత్తుతున్నాయి. ఆ వార్తల మధ్యలోనే మన వ్యవసాయమంత్రి గారికి సంబంధించిన ఓ క్రికెట్ వార్త! ముంబైలో ఒక ఆటమైదానానికి సచిన్ టెండూల్కర్ పేరు పెట్టడానికి ఆయన నాయకత్వంలోని ముంబై క్రికెట్ బోర్డ్ నిర్ణయించిందట. ఉల్లి ధరల ఘాటుతో ఒళ్ళు మండి పోతున్న జనానికి వ్యవసాయమంత్రి క్రీడా వార్తలు చూసినప్పుడు ఎలా ఉంటుంది? సచిన్ పేరు పెట్టడం గురించిన ఆ వార్తను మరొకరి చేత ప్రకటింపజేయచ్చు కదా! జనం ఏమనుకుంటారన్న వెరపుకు నాయకులు పూర్తిగా నీళ్ళు వదిలేశారు.

నాలుగేళ్లుగా ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహార-వ్యవసాయమంత్రిగా ఉన్న శరద్ పవార్ గారు తన మీద విమర్శల వడగళ్ళు పడుతున్నాసరే క్రికెట్ ను వదలకుండా వార్తల కెక్కుతూనే ఉన్నారు. చివరికి విమర్శలకు విసిగిపోయి వ్యవసాయశాఖను మాత్రమే తను ఉంచుకుని ఆహార శాఖను వదిలేశారు కానీ, క్రికెట్ ను మాత్రం వదిలిపెట్టలేదు.

ఆయనకోసం ప్రత్యేకంగా క్రికెట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే ఆయన ఎంత సంతోషిస్తారో! ప్రధానికి ఆ ఆలోచన ఎందుకు రాలేదో! 

Wednesday, October 16, 2013

మహాభారతంలో హింసావాదులు, అహింసావాదులు


మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ.  ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి, తాతలను, అన్నదమ్ములను ఎలా  చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. నేను విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను అని ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Monday, October 14, 2013

తుపాను వదిలేసింది, తొక్కిసలాట చంపేసింది!

ఈ దేశం ఎంత చిత్ర విచిత్ర దేశమో చూడండి!

పద్నాలుగేళ్ల తర్వాత అత్యంత తీవ్రమైన తుపాను ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ లను భయపెట్టింది.

వెనకటి అనుభవాల దృష్ట్యా ప్రాణనష్టం విపరీతంగా ఉండచ్చని దేశమంతా ఆందోళన చెందింది.

టీవీ చానెళ్లు రోజంతా మిగతా వార్తలను పక్కన పెట్టేశాయి.

తుపాను గమనాన్ని దాదాపు ప్రత్యక్షప్రసారం స్థాయిలో చూపించాయి.

దేశమంతా ఊపిరి బిగపట్టుకుని ఆ ప్రసారాన్ని చూసింది.

కానీ...

కనీస ప్రాణనష్టంతో తుపాను గండం నుంచి దేశం బయటపడింది.

జనం తేలికపడి ఊపిరి పీల్చుకున్నారు.

ఎంతో సమన్వయంతో పనిచేసిన కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను మనసులోనే అభినందించుకున్నారు.

ఇంకోవైపు చూడండి...

మధ్యప్రదేశ్ లో ఒక దేవాలయానికి వెళ్ళే మార్గంలో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోగా, 100 మంది గాయపడ్డారు.

తుపానును ఎదుర్కోవడంలో కనబరచిన తెలివీ, దక్షతా  తొక్కిసలాటను ఎదుర్కోవడంలో ఏమైపోయాయో తెలియదు.

అంతమంది జనం చీమల్లానో దోమల్లానో చనిపోవడానికి ఎందుకు అవకాశమిచ్చారో తెలియదు.

తరచు సంభవించే ఇలాంటి తొక్కిసలాటలను కూడా ఒక విపత్తుగా ఎందుకు గుర్తించలేదో తెలియదు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కోడానికి జాతీయస్థాయిలో ఏర్పాటుచేసిన సంస్థ పరిధిలోకి వీటిని కూడా ఎందుకు చేర్చలేదో తెలియదు.

గుంపుల నియంత్రణలో మన ప్రభుత్వాలు, పోలీసుల చేతకానితనాన్ని ఒక సమస్యగా గుర్తించి దానిని పరిష్కరించే ఆలోచనలు ఎందుకు చేయడంలేదో తెలియదు.

ఇప్పుడైనా ఆ దిశగా ఆలోచనా, చర్యలూ ప్రారంభిస్తారన్న హామీ లేదు.

ప్రకృతి వల్లనే కాక మనుషులవల్ల కూడా విపత్తులు సంభవిస్తాయన్న సంగతిని గుర్తించని ప్రభుత్వాల బుర్రలు ఉండవలసిన చోటే ఉన్నాయా, మోకాల్లో ఉన్నాయా?!

Wednesday, October 9, 2013

ఇప్పటికీ పాటిస్తున్న భీష్ముడి రాజనీతి

 పాకిస్తాన్-అప్ఘానిస్తాన్ ల మధ్య ఉన్న గిరిజనప్రాంతాలు అర్థ-స్వయంపాలితాలు. వాటిని Federally Administered Tribal Areas (FATA) అంటారు. వీటిలో ఏడు గిరిజన జిల్లాలు, ఆరు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. Frontier Crimes Regulations (FCR) అనే ప్రత్యేక నిబంధనల ద్వారా ఇవి నేరుగా పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయి. తెగల ముఖ్యు(nobles)లకు వీటిలో పలుకుబడి ఉంటుంది. మూడు ఆంగ్లో-అప్ఘాన్ యుద్ధాలతో తల బొప్పి కట్టిన బ్రిటిష్ ప్రభుత్వం తన అవసరాలకు కలసివచ్చే షరతుపై ఈ తెగల ముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చింది. ఇప్పటికీ ఇదే ఏర్పాటు కొనసాగుతోంది.

ఈ వివరాలలో, చరిత్రకందని కాలానికి చెందిన భీష్ముని మాటల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఎంతటి వాళ్ళనూ లెక్క చేయని గణజనాలను మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలని భీష్ముడు అనడంలో ఉద్దేశం, వాళ్లపై కత్తి కడితే ప్రయోజనం లేదనే.  అప్ఘాన్లతో మూఢు యుద్ధాలు చేసిన నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ,  నిన్నటి సోవియట్ యూనియన్, నేడు అమెరికా నేర్చుకున్న గణపాఠం కూడా అదే.  తన అవసరాలకు కలసివచ్చే షరతుపై గణముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం రాజీ పడడం, గణముఖ్యులను ఆదరించి వారితో పనులు చేయించుకోవాలన్న భీష్ముని సూచనకు అనుగుణమే. 

 ఇంకా విశేషం ఏమిటంటే, పైన చెప్పుకున్న FATA లాంటి ఏర్పాట్లే మన పురాణ ఇతిహాస కాలం లోనూ ఉండడం! ఉదాహరణకు, పౌరాజానపద పరిషత్తు’.  ఆనాటికి రాజు సర్వస్వతంత్రుడు కాదు. కొన్ని అధికారాలను పౌరాజానపదులతో పంచుకునేవాడు. రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుడు పౌరజానపదపరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. పౌర జానపదులలో మ్లేచ్చులు, ఆర్యులు, వనశైలాంతవాసులు; అంటే అడవుల్లోనూ, కొండల్లోనూ ఉండేవాళ్లు కూడా ఉన్నారు. మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టాలనుకుని పౌరజానపదపరిషత్తును సంప్రతించినప్పుడు, పెద్ద కొడుకు యదువు ఉండగా చిన్నకొడుక్కి పట్టం ఎలా కడతావని పౌర జానపదులు ప్రశ్నించారు. అప్పుడు యయాతి వారిని సమాధానపరచి అనుమతి తీసుకున్నాడు. భీష్ముడు పేర్కొన్న గణముఖ్యులను వాల్మీకి గణవల్లభులన్నాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)
  

మెట్రో రైలులో మొయిలీ ప్రయాణం

పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ పెట్రోలు పొదుపును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజు(9-10-13) తన కార్యాలయానికి మెట్రో రైలులో వెళ్లారు. ఆయన వెంట సిబ్బందీ, సెక్యూరిటీ, మీడియా కూడా ఉన్నారు.

ఓ మంత్రి ఇలా మందిని వెంటబెట్టుకుని రైల్లో వెళ్ళడం ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది అవదా, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదా, లాంఛనప్రాయం కాదా అని కొన్ని వార్తా చానెళ్లు ప్రశ్నిస్తున్నాయి. ఓ చానెల్ వీక్షకుల స్పందన కోరింది. వీక్షకులు కూడా దీనిని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు. నిజంగా పొదుపు చర్యలు తీసుకోవాలనే అనుకుంటే ఇంతకన్నా మంచి మార్గాలే ఉన్నాయన్నారు. దేశం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ప్రజలే పెట్రోల్ వాడకం మానేస్తారని, మంత్రి ప్రత్యేకంగా పొదుపు తత్వాన్ని బోధించనక్కరలేదని ఒక వ్యాఖ్యాత అన్నారు.

కొన్ని రోజుల క్రితం మొయిలీ ఇదే విధంగా పొడుపును ప్రతిపాదించారు. అప్పుడు కూడా మీడియా, కొన్ని రాజకీయపక్షాలు ఎద్దేవా చేశాయి.

నిజమే, రాజకీయనాయకుల చిత్తశుద్ధినీ, పబ్లిసిటీ యావనూ ప్రశ్నించవలసిందే. పొదుపు చేయడానికి ఇంతకన్నా మెరుగైన మార్గాలూ ఉన్నమాట కూడా నిజమే. మంత్రులు చేయవలసింది చేయకుండా ఇలా జిమ్మిక్కులతో జనాన్ని మోసం చేస్తున్నారన్న అభిప్రాయంలో నిజం ఉండదనీ చెప్పలేం. నాయకులలో ఉన్న సవాలక్ష లోపాలను ఎత్తి చూపి కడిగేయండి, తప్పులేదు. దాంతోపాటే, మెట్రో రైలు వాడకాన్ని ప్రోత్సహించే మంత్రి చర్యపై పాజిటివ్ గా స్పందించ నవసరమూ లేదా?

throwing the baby with bath water అన్నట్టుగా ఒక మంచి మెసేజ్ నీ తోసిపుచ్చడం సరైనదేనా?

పౌరరవాణా వ్యవస్థలపై ఆధారపడాలనీ, కార్ పూలింగ్ వంటి పద్ధతులను పాటించాలనీ, వ్యక్తిగత మోటార్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే మాట చాలాకాలంగా వినిపిస్తున్నదే. ముందు ముందు ఈ అవసరాన్ని మరింతగా గుర్తించాల్సి వస్తుంది. పౌరరవాణా సదుపాయాలను తగినంతగా అభివృద్ధి చేయలేదన్న విమర్శ మన ప్రభుత్వాలమీదా ఉంది. హైదరాబాద్ లాంటి నగరాలలో మెట్రో రైలు వల్ల కలిగే లాభాలలో  ప్రైవేట్ వాహనాల వినియోగమూ తద్వారా  కాలుష్యం తగ్గడం వంటివి కూడా ఉంటాయని మనకు తెలిసినదే.

ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు అత్యవసర వస్తువులు మినహా ఇతర వస్తువుల కొనుగోలును కొన్ని రోజులపాటు విరమించడం కూడా ధరల పెరుగుదలపై ఒక నిరసన ప్రకటన లేదా ధరలను కిందికి దింపే ఒక మార్గం కాబోదా?


Wednesday, October 2, 2013

మహాభారతంలో కుల, ప్రాంత నింద

కర్ణుడు : నువ్వు పాపదేశంలో పుట్టావు. దుర్బుద్ధి తప్ప నీకు సద్బుద్ధి ఎలా వస్తుంది? క్షత్రియాధముడివి. నీచుడివి. లోకంలో ఆబాలగోపాలం చెప్పుకునే వాక్యం ఒకటుంది. మద్రదేశంవాడు కుటిలబుద్ధి, దేనికీ కలసిరాడు, స్నేహానికి అపకారం చేస్తాడు, చెడే మాట్లాడతాడు, దుష్టుడు, అతి కష్టుడు. ఈ వాక్యం ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువవుతోంది.

మీలో ఆడా, మగా వావీ వరసా లేకుండా కలుస్తారు. అది మీకు తప్పుకాదు. మీరు మొదట కల్లు, ఆ తర్వాతే తల్లిపాలు తాగి పెరుగుతారు. మీ రెంత గుణవంతులో ప్రత్యేకించి చెప్పాలా?

అనేకమందికి పుట్టి, కల్లు తాగుతూ పెరిగే మీకు శీలమూ, సభ్యమైన మాటా ఎలా అబ్బుతాయి? మాటలు కట్టిపెట్టి యుద్ధానికి పద. 

(మరికొంత సంభాషణ జరిగాక)

శల్యుడు: ఈ పనికిమాలిన మాటలెందుకు? విను కర్ణా...వేయి మంది కర్ణులైనా సరే, కిరీటిని గెలవగలరా?

కర్ణుడు: (కోపంతో ఎర్రబడిన కళ్ళతో నవ్వుతూ) ఒకసారి ధృతరాష్ట్రుని కొలువులో ఉత్తములైన పండితుల గోష్ఠిలో సకల దేశాచారాలూ తెలిసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. బాహ్లిక దేశీయులు గోమాంసం నంజుకుంటూ మద్యపానం చేస్తూ అసందర్భ ప్రేలాపన చేస్తూ నగ్నంగా తిరుగుతూ ఉంటారట. ఇలా అనేకవిధాలుగా బాహ్లిక దేశీయులను నిందిస్తూ ఆయన మాట్లాడాడు. నువ్వు అలాంటి బాహ్లికులకు దగ్గరివాడివి. కనుక వాళ్ళు చేసే పుణ్యపాపాలలో ఆరోవంతు నీకు సంక్రమిస్తుంది. వాళ్ళ అనాచారాన్ని నువ్వు వారించలేదు కనుక పూర్తి పాపం నిన్నే చుట్టుకుంటుంది. బాహ్లికుల కంటే మద్రదేశీయులు మరింత అనాగరికులని పెద్దలు చెబుతుంటారు. నీ గురించి చెప్పేదేమిటి? నోరుమూసుకో.

శల్యుడు: బలాబలాలను, రథ, అతిరథ సంఖ్యను నిర్ణయించే సందర్భంలో భీష్ముడు (నీ గురించి) చెప్పలేదా? ఆ మాటలు ఓసారి గుర్తు చేసుకో. కోపమెందుకు? అంగదేశం వాళ్ళు డబ్బు కోసం ఆప్తుల్ని, బంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. కులకాంతల్ని అమ్ముకుంటారు. అలాంటి జనానికి రాజువైన నువ్వు ఇంకొకళ్ళ ప్రవర్తనను ఎంచడం దేనికిలే…        

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో  'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)