Wednesday, December 24, 2014

గ్రీకు పురాణాలలోనూ అప్సరసలు ఉన్నారు!

సిర్సే నిన్ను మంత్రదండంతో తాకడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఆమె మీదికి కత్తి దూయి. అప్పుడామె వెనక్కి తగ్గి తనతో పడక సుఖాన్ని అనుభవించమని కోరుతుంది. అందుకు సందేహించకు. తన అందచందాలతో ఆమె నిన్ను అలరించి సుఖపెడుతుంది. అయితే నీపట్ల ఎలాంటి మోసానికీ పాల్పడనని ముందే దేవుడి సాక్షిగా ఆమె చేత ప్రమాణం చేయించు. ముఖ్యంగా ఆమె నిన్ను పూర్తి నగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు ససేమిరా ఒప్పుకోకు” అన్నాడు.

Wednesday, December 17, 2014

నలుడితో దమయంతి ఆడిన 'మైండ్ గేమ్'

నలదమయంతుల కథ ఇదీ...

దమయంతి గురించి నలుడూ, నలుడి గురించి దమయంతీ విన్నారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఓ రోజు దమయంతి గురించే తలపోస్తూ నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అంతలో ఒక హంసల గుంపు ఎగురుతూ వచ్చి అతని ముందు వాలింది. వాటిలో ఒక హంసను అతను పట్టుకున్నాడు. నన్ను విడిచిపెడితే నీ గుణగణాలను దమయంతికి చెప్పి నీ మీదే ఆమెకు ప్రేమ కలిగేలా చేస్తానని హంస అంది. నలుడు దానిని విడిచి పెట్టాడు.


గుంపుతో కలసి హంస విదర్భపురానికి వెళ్ళి ఉద్యానవనంలో చెలికత్తెలతోపాటు విహరిస్తున్న దమయంతి ముందు వాలి, కావాలని ఆమె చేతికి చిక్కింది. నీ ప్రియతముడైన నలుడి దగ్గరనుంచి వచ్చాను. నేను ఎంతోమంది రాజుల్ని చూశాను. సకలగుణసౌందర్యంలో నలుడికి ఎవరూ సాటి రారు. నువ్వు నారీరత్నం, అతను పురుషరత్నం. మీ కలయిక ఇద్దరికీ మరింత శోభనిస్తుంది అంది. 

Wednesday, December 10, 2014

అర్జునుని 'నరుడు' అనడంలో మర్మమేమిటి?

పురాణ, ఇతిహాసాలలో నరుడు అనే వాడిని సిద్ధసాధ్యయక్షకిన్నర కింపురుష గంధర్వదేవతాదులతో కలిపి చెప్పడం చూస్తుంటాం. అంటే, నరుడు వేరు, పైన చెప్పిన మిగిలిన వారంతా వేరు అనే అర్థం అందులో ధ్వనిస్తూ ఉంటుంది. కానీ నేటి సాధారణ హేతుబుద్ధితో ఆలోచిస్తే పైన చెప్పిన పేర్లు అన్నీ నరుడికి ఉపయోగించిన జాతి, తెగ, లేదా వృత్తి వాచకాలే ననీ; కనుక వారు కూడా నరులే ననీ అనిపిస్తుంది. అలాంటప్పుడు, నరుడు వేరు, పైన చెప్పినవాళ్లు వేరు అన్నట్టుగా ఎందుకు చెప్పినట్టు?

Thursday, December 4, 2014

స్త్రీ-పురుష సంబంధాలలో చొరవ స్త్రీదా, పురుషుడిదా?

మహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం మరేం లేదు...అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలు, వివాహసంబంధాలు కనిపిస్తాయి. నలదమయంతుల కథ దగ్గరికి వచ్చేసరికి అది భిన్నమైన కథగా అనిపిస్తుంది. అందులోనే స్త్రీ-పురుష సంబంధాలలో మొదటిసారిగా మనసు, ప్రేమ, విరహం మొదలైన సుకుమారభావనలు అడుగుపెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/12/04/%E0%B0%86%E0%B0%AE%E0%B1%86%E0%B0%AE%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A6%E0%B1%87-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%82/  లో చదవండి)

Thursday, November 27, 2014

ఏకలవ్యుడికి అంత విలువిద్య అవసరమా?



ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? అంత విద్యను అతను ఏం చేసుకుంటాడు?! ఈ ప్రశ్నలను ఇంతవరకు ఎవరూ ముందుకు తెచ్చినట్టు లేదు. 

Wednesday, November 19, 2014

స్త్రీ సంబంధం లేకుండా సంతానం సాధ్యమా?!

ద్రోణుని సంహరించగల కొడుకుకోసం ద్రుపదుడు హోమ సన్నాహాలు అన్నీ చేసుకున్నాడు. యాజుడు ఋత్విక్కుగా,అతని తమ్ముడైన ఉపయాజుడు సహాయకుడిగా హోమం మొదలైంది. క్రమంగా పూర్తి కావచ్చింది. 

ఆ దశలో యాజుడు,

“త్వరగా నీ భార్యను యజ్ఞవేదిక దగ్గరికి రప్పించు. ఆమె హవిస్సును స్వీకరించాలి. ఆమెకు కొడుకు, కూతురూ కూడా కలగబోతున్నారు” అంటూ ద్రుపదుని తొందరపెట్టాడు. యాజుడికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉంది.

ద్రుపదుని భార్యకు కబురు వెళ్లింది. కానీ ఆమె రాలేదు.


“నేను రజస్వలనయ్యాను. ఇలాంటి అస్పృశ్యస్థితిలో వెంటనే యజ్ఞస్థలికి రాలేను. స్నానం చేసి వస్తాను. అంతవరకూ ఆగండి” అని కబురు చేసింది. 

Thursday, November 13, 2014

ఋగ్వేదంలో పేర్కొన్న 'పణులు' ఫొనీషియన్లు?!

 ఋగ్వేదంలో పేర్కొన్న పణులు ఫొనీషియన్లే నన్న కోశాంబీ ఊహ సరైనదే ననుకుంటే, దానికి సంబంధించిన చారిత్రక మూలాలు పై వివరాలలో దొరుకుతాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, హీరామ్ అనే ఫొనీషియన్ రాజుకు, యూదుల రాజులు డేవిడ్, సోల్మన్ లతో ఏర్పడిన స్నేహ సంబంధాలలో దొరుకుతాయి. 

అప్పటికి ప్రపంచ వర్తకం అంతా సెమిటిక్కులైన ఫొనీషియన్ల చేతుల్లోనే ఉండేదని, వారి వర్తక నౌకలు బ్రిటన్, అట్లాంటిక్ ల వరకు; ఎర్ర సముద్రం మీదుగా అరేబియాకు, బహుశా భారత దేశానికీ వెళ్ళేవని వెల్స్ అంటారు. అలా వెళ్ళిన సందర్భంలోనే పణులు లేదా ఫొనీషియన్లు ఋగ్వేదంలోకి ప్రవేశించి ఉంటారు. 

తాము వర్తకం జరిపే దేశాలలో వారు కాలనీలు ఏర్పాటుచేసుకునే వారు. మిగతా చోట్లలో సెమెటిక్కులకు, ఆర్యులకు ఘర్షణలు జరుగుతున్నట్టే ఇక్కడా జరగడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఘర్షణలే ఋగ్వేదానికి ఎక్కి ఉండవచ్చు. 

Friday, November 7, 2014

స్వచ్చ భారత్...చెత్త మనుషులు...

 ఇలాంటి 'అస్వచ్చ' మనుషుల్ని నమ్ముకుని మోడీ  'స్వచ్చ భారత్' ను తీసుకురాగలరా?!

మొన్న ఢిల్లీలో ఏం జరిగిందో చూడండి. లోడీ రోడ్డు ఢిల్లీలో తుడిచిన అద్దంలా ఉండే ప్రాంతాలలో ఒకటి. అక్కడ ఒక ఇస్లామిక్ సంస్థ ఉంది. దాని దగ్గర మనవాళ్లు స్వచ్చ భారత్ ను అభినయించారు. దానికి ఢిల్లీ బి‌జే‌పి అధ్యక్షుడు ముఖ్య అతిథి అట. అందులో మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న షాజియా ఇల్మీ కూడా పాల్గొన్నారు. కొందరు బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. అందరూ పొడవాటి చీపురు కర్రలు పట్టుకున్నారు. తుడవడం ప్రారంభించారు. మీడియా కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయి.

మీడియా కెమెరాలు అదొక్కటే చిత్రీకరించి ఊరుకోలేదు. అంతకు ముందు ఇంకో దృశ్యాల్ని కూడా చిత్రీకరించాయి. అది, తోపుడు బండిలో కొందరు చెత్త తీసుకొచ్చి అక్కడ పోస్తున్న దృశ్యం. ఆ దృశ్యమే అసలు ఫార్స్ ను ప్రదర్శించింది. ఈ వీఐపీలు స్వచ్చ భారత్ ను అభినయించడానికి అక్కడికి చెత్త తీసుకొచ్చి పోయించారన్న మాట. అంటే చెత్త దగ్గరకు వీళ్ళు వెళ్లలేదు. వీళ్ళ దగ్గరకే చెత్త వచ్చింది.

ఇంకో వింత చూడండి...అందరూ పక్క పక్కనే నిలబడి ఒకేచోట చెత్త తుడుస్తున్నట్టు అభినయించారు. అవును మరి గ్రూపుగా ఉంటేనే కదా ఫోటోలో పడేది!

బహుశా ఈపాటికి వీఐపీలకు చెత్త పోగుచేసి అమ్మి డబ్బులు చేసుకునే వాళ్ళు కూడా రంగప్రవేశం చేసి ఉంటారు. అలా చెత్త కూడా ఓ వ్యాపార సరుకుగా మారిపోయి ఉంటుంది.

ఇందులో పార్టీ తేడాలు లేవు చూడండి...బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ఆప్ మాజీ నేత ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ చేయరు.

ఇదేం దారుణం అని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుని అడిగితే, చిన్న విషయాలు పెద్దవి చేస్తున్నారని ఆయన కోప్పడ్డారు. ఇది చిన్న విషయమా?! ఆయన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్నారు తప్ప దానిని ఆయన నిర్వహించలేదని బీజేపీ ప్రతినిధులు సమర్థించబోయారు.

మొత్తానికి ఇలా స్వచ్చ భారత్ కొంతకాలం జరుగుతుంది. దేశంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. కానీ స్వచ్చ భారత్ నటులకు మాత్రం రాజకీయంగా గుర్తింపు వస్తుంది.

ఇలాంటి చెత్త మనుషులు ఉన్నప్పుడూ దేశం లోని మొత్తం చెత్త నంతనీ తుడవడం మోడీ ఒక్కరి వల్లే అవుతుందా? 

Thursday, November 6, 2014

సూర్యుని పండుగే క్రిస్టమస్ అయింది!

శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది...
ఆయన ఓ సినిమా పాటలో బతుకు బరువు అని కాబోలు, రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు చూసేవారికి తెలిసిన పేరే. బతుకు బరువు అనే మాట వినగానే ఆయన భారంగా నిట్టూర్చి, బతుకు మా సెడ్డ బరువు అంటే ఇంకా బాగుంటుం దన్నారట. ఆ మాట శ్రీశ్రీకి నచ్చి అలాగే ఉపయోగించారు. దీనికి ఓ బరువైన ముగింపు కూడా ఉంది.  ఆ మరునాడే చదలవాడ కన్నుమూశారు!

Saturday, November 1, 2014

విదేశాల్లో దాచుకున్న నల్లధనం 10 శాతమే?!


ఈ రోజు(1 నవంబర్ 2014) నల్లధనం మీద హిందూ లో ఒక  ఆర్టికల్ వచ్చింది. దాని ప్రకారం:

1. ఏటా ఉత్పత్తి అయ్యే నల్లధనం జిడిపిలో 50 శాతం. అంటే, 65 లక్షల కోట్లు. ఇందులో విదేశాలకు చేరేది 10 శాతం. మిగతాది దేశంలోనే ఉంటుంది. ఇందులో మళ్ళీ కొంత హవాలా, తప్పుడు వాణిజ్య మార్గాలలో విదేశాలకు పోతుంది. 

2. 1948-2012 మధ్యకాలంలో ఉత్పత్తి అయిన నల్లధనం 1.2 ట్రిలియన్ డాలర్లు. 

3. విదేశీ బ్యాంకులలో భారతీయులు దాచుకున్న నల్లధనం నగదు రూపంలో ఎంతన్నది అంచనా వేయడం దాదాపు అసాధ్యం. స్విట్జర్లాండ్ లో హెచ్‌ఎస్‌బి‌సి ఒక్కటే కాక చాలా బ్యాంకులు ఉన్నాయి. మన దగ్గర ఉన్న జాబితాలో ఉన్న 627 పేర్లకు చెందిన అకౌంట్లు కేవలం హెచ్‌ఎస్‌బి‌సి కి చెందినవి మాత్రమే. 

4. అకౌంట్లు బినామీ పేర్ల మీద ఉంటాయి. కనుక అసలు ఖాతాదారులు ఎవరన్నది తెలుసుకోవడం చాలా కష్టం. 

5. ద్వంద్వపన్నుల నివారణ ఒప్పందం(DTAA) వెల్లడించిన ఆదాయానికి సంబంధించినది. దాని ద్వారా నల్లడబ్బు 
వెల్లడి కాదు. ప్రభుత్వం విదేశాలతో ఇంతవరకు చేసుకున్న ఇటువంటి ఒప్పందాలతో ఏ కొంచెం సమాచారం రాలేదు.

6. ఫాన్స్, జర్మనీలు సమాచారం ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. (యూపీఏ) ప్రభుత్వం తీసుకోడానికి తిరస్కరించింది. కోర్టు ఒత్తిడి చేసాకే తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది.

7. అమెరికా స్విస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, బెదిరించి యూబీయెస్ బ్యాంక్ నుంచి 4,500 పేర్లు సంపాదించడమే కాక, దానినుంచి 780 మిలియన్ డాలర్ల జరిమానా వసూలుచేసింది. మనదేశం అలా దృఢంగా వ్యవహరించడం లేదు.

8. మన దేశంలోని అనేక బ్యాంకులు హవాలా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు

http://www.thehindu.com/opinion/lead/lead-article-secrecy-in-the-name-of-privacy/article6553153.ece

Thursday, October 30, 2014

జయలలిత అమ్మ, దేవత ఎలా అయ్యారు?

తమిళనాడు, పురాచరిత్రకోణంనుంచి నాలో ప్రత్యేకమైన కుతూహలం రేకెత్తిస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రం పురాచరిత్రకు స్పష్టమైన వర్తమాన ప్రతిబింబంలా అనిపిస్తుంది. అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రెండోసారి జైలుకు వెళ్ళి పదిహేనురోజులు ఉండిరావడమే చూడండి... ఆమె జైలుకు వెళ్లినప్పుడు అభిమానులు, అనుయాయుల నిరసనతో రాష్ట్రం అట్టుడికింది. ఆ నిరసనలో కోపమే కాక, దుఃఖం కూడా ఉంది. భవిష్యత్తు గురించి భయం కూడా ఉండచ్చు. తమ నాయకుడు/నాయకురాలు ఇలాంటి విషమపరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అభిమానులు ఆత్మహత్యకు సైతం పాల్పడడం తమిళనాడులోనే ఎక్కువగా చూస్తుంటాం. ఈసారి కూడా ఆత్మహత్యలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని జయలలిత విజ్ఞప్తి కూడా చేశారు. సరే, రాజకీయనాయకులు చేసే అలాంటి విజ్ఞప్తిలో, తనకు ఇంత అభిమానుల బలం ఉంది సుమా అని ఇతరులకు చేసే ఒక హెచ్చరికా ఇమిడి ఉంటుంది, అది వేరే విషయం.

Wednesday, October 29, 2014

నల్లధనం రప్పించడం దేవుడెరుగు...కనీసం నల్లధనంపై నికరమైన సమాచారానికైనా ప్రజలు నోచుకోలేదా?

మనం సమాచారయుగంలో ఉన్నామంటారు...ప్రపంచంలోని ఏమూల సమాచారమైనా ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్ దూరంలో ఉందంటారు. 24 X 7 న్యూస్ చానెళ్ల సంగతి సరేసరి. కానీ నిజంగానే మనకు అందవలసినంత సమాచారం అందుతోందా???

లేదనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. నల్లధనం గురించిన విషయాలే తాజా ఉదాహరణ.

1. విదేశాలనుంచి అందిన ఖాతాదారుల పేర్లు బయటపెట్టడానికి ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందాలు అడ్డు వస్తాయని కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పింది.

2. దాంతో సుప్రీం కోర్టు కోప్పడింది. సరే నని ప్రభుత్వం మూడుపేర్లు బయటపెట్టింది.

3. మూడు పేర్లేమిటి, మొత్తం పేర్లన్నీ మాకు ఇవ్వండని అంటూ సుప్రీం కోర్టు మళ్ళీ అంది. సరేనని కేంద్రం ఈసారి 627 పేర్లతో ఒక జాబితా సీల్డు కవర్ లో పెట్టి సుప్రీం కోర్టుకు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆ జాబితాను సిట్ కు ఇచ్చి నెల రోజుల్లో దానిపై ఏం చేశారో నివేదిక ఇమ్మని అడిగింది. ఈసారి పేర్లు వెల్లడించమని కోర్టు అనలేదు.

4. విచిత్రంగా ఇంకో మాట వినిపించింది. సిట్ కు ప్రభుత్వం ఆ జాబితాను జూన్ లోనే ఇచ్చిందట. అంటే ఏం జరిగిందన్నమాట? సిట్ దగ్గర ఇప్పటికే ఉన్న జాబితానే సుప్రీం కోర్టు మళ్ళీ సిట్ కి ఇచ్చిందన్న మాట.

5. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న సిట్ కు జూన్ లోనే జాబితా ఇచ్చామన్న సంగతి కోర్టుకు ప్రభుత్వం ముందే చెప్పినట్టు లేదు. సిట్ కూడా చెప్పినట్టు లేదు. ఎందుకు చెప్పలేదో తెలియదు. మరచిపోయిందా?

6. ఆపైన ఇంకో ప్రశ్న. జూన్ లోనే జాబితా తీసుకున్న సిట్ దాని మీద ఇన్ని మాసాల్లో ఏం చేసింది? తెలియదు.

7. ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో పేర్లు ఒప్పందంలో భాగంగా విదేశాలనుంచి అందినవి కావు. ఒక HSBC బ్యాంక్ ఉద్యోగినుంచి ఫ్రాన్స్ అడ్డదారిలో సంపాదించి మనదేశానికి ఇచ్చిన పేర్లు. అంటే వాటికి ఒప్పందాలు వర్తించవు. అయినా ప్రభుత్వం ఒప్పందాలు అడ్డువస్తాయని ఎందుకు అంది? తెలియదు.

8. తాజాగా మరో వార్త. ఆ జాబితాలోని 150 పేర్లవారి కేసులు ఇప్పటికే ప్రభుత్వం సెటిల్ చేసేసిందనీ, వారిమీద ఇప్పుడు కొత్తగా తీసుకునే చర్యలు ఏవీ లేవని ఆదాయం పన్ను శాఖ అధికారులు అన్నారట. మరో 120 మంది తమకు విదేశంలో ఖాతా లేదని చెప్పారట. అలాంటప్పుడు ఖాతా ఉందని నిరూపించడం కష్టమట. ఎందుకంటే, ఆ జాబితా అడ్డదారిలో అందింది కనుక బ్యాంక్ సహకరించదట.

9. అన్నింటికన్నా పెద్ద షాక్ కు మనం సిద్ధంగా ఉండాలి. ఆదాయం పన్ను శాఖ అధికారుల ప్రకారం, నల్లధనం మహా ఉంటే 3వేల కోట్లను మించదట. దాన్ని దేశానికి రప్పించడం కూడా కష్టమట. మనం ఏళ్ల తరబడిగా వింటున్నది, లక్షల కోట్లలో ఉంటుందని! ఈ మాత్రం సమాచారం ఆదాయం పన్ను శాఖవారు ఇన్నేళ్లలోనూ ఎప్పుడూ ఇవ్వకుండా ఎందుకు ఊరుకున్నారో తెలియదు. ఇప్పుడు ఈ భోగట్టా వారినుంచి తీసుకున్న మీడియా వారు ఇంతకాలం ఎందుకు ఆ పని చేయలేదో తెలియదు.

దీనంతటిని బట్టి ఏమనిపిస్తోంది? నల్లధనం బయటపడడం సంగతి దేవుడెరుగు...నల్లధనం గురించిన పూర్తి సమాచారమైనా ఎప్పటికైనా బయటపడుతుందా అనిపించడం లేదా???





Monday, October 27, 2014

నల్ల కుబేరుల దగ్గర రాజకీయ పార్టీలే విరాళాలు మెక్కినప్పుడు నల్లధనంపై యుద్ధం చేసేది ఎవరు?

నల్లధనం తిమింగలాలనో, మొసళ్ళనో బయట పెడుతుందనుకుంటే ప్రభుత్వం మూడు చిరు చేపల్ని బయటపెట్టింది. అయితే నాకిది అంత ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కిందటి ప్రభుత్వం కూడా ఇలాంటి చిరుచేపల్నే బయటపెట్టింది. కనుక అద్భుతాలను ఊహించలేదు. అదీగాక, ప్రభుత్వం బయటపెట్టబోయే పేర్లలో పెద్ద పేర్లు ఏవీ ఉండకపోవచ్చని మీడియా ముందే ఉప్పు అందించింది.

ఈ పేర్ల వెల్లడి కన్నా నన్ను ఆశ్చర్యపరిచింది, షాక్ ఇచ్చింది ఏమిటంటే; వీళ్లలో ఇద్దరు కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ విరాళాలు ఇచ్చిందన్న సంగతి. ఇందులో ఒక కంపెనీ బిజెపీకి 9 సార్లు మొత్తం కోటి రూపాయలకు పైగా విరాళం ఇస్తే, కాంగ్రెస్ కు 3 పర్యాయాలుగా 60 లక్షలకు పైగా విరాళం ఇచ్చిందట.

ఆ లెక్కన ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉందని అంటున్న 800 మంది జాబితాలోని నల్లధనస్వాములలో ఎంతమంది, ఎంత మొత్తాల్లో ఈ పార్టీలకు విరాళాలు ఇచ్చి ఉంటారు?! వీళ్లలో ఎంతమందిని చట్టాన్ని అప్పగించి, ఎంతమందిని దొడ్డి దోవన వదిలేసే ప్రయత్నం చేస్తారు? వాళ్ళు ఇచ్చిన మొత్తాలను బట్టి, రేపు ఇవ్వగలిగిన స్తోమతను బట్టి చట్టానికి అప్పగించడం, లేదా వదిలేయడం ఉంటాయేమో!

నల్లధనంపై ప్రభుత్వాల యుద్ధం ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిపోవడం లేదా?

నల్లధనం, రాజకీయం ఇలా పాలు, నీళ్లలా కలసి పోయినప్పుడు, రెండింటినీ విడదీసి ప్రజలకు చూపించి, శిక్షించడానికి సరికొత్త రాజకీయహంసను ఏ మానససరోవరం నుంచి తీసుకొస్తారు?

నల్లధనం కొండచిలువల పేర్ల వెల్లడి ఇంకా ఎలాంటి చిత్రవిచిత్రాలను సృష్టిస్తుందో చూస్తూ ఉందాం. 

Sunday, October 26, 2014

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు?

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి?!

దీని మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

1953, అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పటికి తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో భాగం కాదు.

1956లో తెలంగాణ కూడా కలసిన తర్వాత నవంబర్ 1న ఏటా అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.

ఇప్పుడు తెలంగాణ వేరుపడింది. కనుక ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తింది.

తెలంగాణాను కూడా కలుపుకుని ఆంధ్రప్రదేశ్ అవతరించిన నవంబర్  1కి, తెలంగాణ వేరుపడడంతో రెలెవెన్స్ పోయింది. కనుక ఆ రోజున అవతరణ దినోత్సవం జరుపుకోవడంలో సాంకేతికంగానూ, ఔచిత్యపరంగానూ కూడా అర్థంలేదు.

ఇక మిగిలింది ఆంధ్రరాష్ట్ర అవతరణ తేదీ అయిన అక్టోబర్ 1. ఆరోజున జరుపుకోవడం కన్నా మరో మార్గం కనిపించడంలేదు.

ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ అనే పేరు అప్పటికి లేదుకనుక అదెలా కుదురుతుందనే ప్రశ్న రావచ్చు.

మొత్తం మీద ఇది చిక్కు ప్రశ్నే.




Friday, October 24, 2014

జార్జి ఫెర్నాండెజ్...అబ్దుల్ కలాం...వాజ్ పేయి...ఎలా ఉన్నారు?

మాజీ రక్షణమంత్రి, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, బరోడా డైనమైట్ కేసు నిందితుడు జార్జి ఫెర్నాండెజ్ ఎలా ఉన్నారు? ఆయన గురించి ఈ మధ్య ఎలాంటి వార్తా లేదు. బెంగళూరులో ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్టు మాత్రం చాలా కాలం క్రితం ఒక వార్తా విన్నాం. అంతే. మళ్ళీ ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదు.

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి కూడా ఈ మధ్య వార్తలు లేవు. ఆయన ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో? ఆ మధ్య వరకు ఆయన విద్యార్థులతో అప్పుడప్పుడు ఇంటెరాక్ట్ అవుతూ వార్తలలో ఉండేవారు. ఇప్పుడు ఆయన గురించి ఏ సమాచారమూ లేదు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గురించి  గట్టిగా ఏదైనా వార్త వచ్చిఅయిదేళ్లు అయిందేమో! ఈ మధ్య మోడి ప్రధాని అయిన తర్వాత వాజ్ పేయి ఇంటికి వెళ్ళి ఆయనను సందర్శించినట్టు వార్త వచ్చింది. అదొక్కటే ఆయనతో ముడిపడిన  చిట్టచివరి వార్త.

బొత్తిగా వార్తలలోలేని ఈ ముగ్గురు ప్రముఖులే ప్రస్తుతానికి నాకు గుర్తొస్తున్నారు. ఇంకా చాలామందే ఉండచ్చు. ఇలాంటి వార్తలలోలేని ప్రముఖులు/ లేదా ఒకమాదిరి ప్రముఖులు  పదిమందితో ఒక జాబితా తయారు చేయచ్చా?

మీరూ ప్రయత్నించండి. 

Thursday, October 23, 2014

మోడి ప్రభుత్వం ధరలు ఎలా తగ్గించగలిగింది?

నాకు గుర్తు ఉన్నంతవరకు 2010 నుంచీ ద్రవ్యోల్బణం ఎక్కువవడం ప్రారంభించింది. ఇన్నేళ్లలోనూ అది తగ్గిన దాఖలా లేదు. అప్పుడప్పుడు ఏ కొంచెమో తగ్గినట్టు అనిపించినా అది లెక్కలోది కాదు. ధరలు తగ్గాయి అనుకునేటంతగా ఎప్పుడూ తగ్గలేదు.

యూపీఏ ప్రభుత్వం అందుకు రకరకాల కారణాలు చెబుతూ వచ్చింది. ఆహారపదార్థాల ద్రవ్యోల్బణానికే వస్తే, ఆర్థిక స్తోమత పెరుగుతుండడం వల్ల ఇప్పుడు అన్ని తరగతుల వారూ పప్పులు, కూరగాయలు ఎక్కువగా వాడుతున్నారనీ, ఆవిధంగా ఆహారపదార్థాల వినియోగం పెరిగిందనీ, అందుకు తగ్గట్టు వాటి ఉత్పత్తి పెరగలేదనీ ఒక కారణం. ధరలు తగ్గించడం ఎక్కువగా రాష్ట్రప్రభుత్వాల పరిధిలోకి వస్తుందనీ, అవి తీసుకోవలసిన చర్యలు తీసుకోవడం లేదనీ ఇంకొక కారణం.

కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాగానే కొన్ని మాసాలలోనే ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయగలిగినట్టు చెబుతున్నారు. ఇదెలా జరిగిందో నిజంగా ఆశ్చర్యం. అయితే, యూపీఏ ప్రభుత్వం అన్నేళ్లలోనూ ఆ పని ఎందుకు చేయలేకపోయిందో, మోడీ ప్రభుత్వం ఎలా చేయగలిగిందో, అందుకు ఏం చేసిందో ఎవరైనా విశ్లేషించినట్టు నా దృష్టికి రాలేదు. అలాగే యూపీఏ లో సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్న శరద్ పవార్ ఎక్కడ విఫలమయ్యారో కూడా ఎవరూ రాసినట్టు లేదు.

ఇంత అవసరమైన విషయం మీద పెద్దగా చర్చ కనిపించకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా విశ్లేషించి ఉంటే సంబంధిత లింక్ ఇవ్వగలరని కోరుతున్నాను. 

Wednesday, October 22, 2014

పురాతన దేవాలయాలు కొండల మీదా, గుట్టల మీదా ఎందుకు ఉంటాయి?

ప్రసిద్ధ దేవాలయాలు అనేకం కొండలు, గుట్టలు, అడవుల్లో ఉండడానికి కూడా అనేక కారణాలను చెప్పుకోవచ్చు. వ్యవసాయ విస్తరణలో భాగంగా ఆటవిక, గిరిజన తెగలు ఉన్న కొత్త కొత్త ప్రదేశాలకు జనావాసాలను విస్తరించేవారు. వ్యవసాయ విస్తరణ, జనావాసాల విస్తరణ అంటే రాజ్యవిస్తరణే. శ్రీశైలంలోని ఆలయమే కాక, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో కూడా పురాతన దేవాలయాలు అనేకం ఎత్తైన, పటిష్టమైన ప్రాకారాలతో, ద్వారాలతో, బురుజులతో అక్షరాలా కోటలను తలపిస్తూ ఉంటాయి. ఆవిధంగా పుణ్యక్షేత్రం రాజులకు రెండవ రాజధానిగా ఉండేదనుకోవచ్చు. దేవుడికి చేసే ఉపచారాలు కూడా రాజోపచారాలే.

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/10/22/%E0%B0%88%E0%B0%9C%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%88%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%82%E0%B0%9C/ లో చదవండి) 

Tuesday, October 21, 2014

ఇందిరా గాంధీ, మోడీల పోలిక గురించి మరోసారి...

ప్రతివారికీ రూపాయిలలో తూచడానికి ఏమాత్రం విలువ లేని చిన్న చిన్న సంతోషాలు ఉంటూఉంటాయి. సాధారణంగా ఆ సంతోషం విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికైనా అది చెబితే, 'ఓస్, అంతేనా? అదో గొప్ప విషయమా' అనేయచ్చు. ఎవరూ గుర్తించని పరిస్థితిలో వాళ్ళే దానిని వెల్లడించుకుని వాళ్ళ భుజం వాళ్ళే తట్టుకోవలసి వస్తుంది.

ఇప్పుడు నేను చేయబోతున్నది అదే!

నాకు కూడా చిన్న చిన్న సంతోషాలు ఉన్నాయి. అవి మరేం కాదు, ఆయా అంశాలలో నా అంచనాలు గురికి చాలా దగ్గరగా వెళ్లినప్పుడు కలిగే సంతోషాలు. అటువంటివి ఇదే బ్లాగులో కొన్ని ఇంతకుముందు పాఠకులతో పంచుకున్నాను. అది కూడా ఏడాది పైనే అయినట్టుంది. వాటిలో ఒకటి, నరేంద్ర మోడీ వ్యవహారశైలి ఇందిరాగాంధీ వ్యవహారశైలికి చాలా దగ్గరగా ఉంటుందన్నది. తెలంగాణవాదులు చాలా అదృష్టవంతులనీ, కేంద్రంలో యూపీఏ కాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండి ఉంటే, తెలంగాణ ఇప్పట్లో వచ్చేది కాదనీ కూడా అన్నాను. ఎందుకు వచ్చేది కాదో కూడా చెప్పాను. అందుకు కారణం నరేంద్ర మోడీ స్వభావంలోనే ఉందని చెప్పాను. సరిగ్గా ఇందిరా గాంధీది కూడా అదే స్వభావం అన్నాను.

ఇందిరా గాంధీ, నరేంద్ర మోడీల స్వభావం ఎలాంటిదంటే, తమ ఎజెండాలను ఇతరులతో అమలు చేయించడమే తప్ప ఇంకొకరి ఎజెండాలను వారు స్వీకరించే ప్రశ్నే లేదు. తెలంగాణకానీ, ఇంకొకటి కానీ వాళ్ళ ఎజెండాలో ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. అంతే. అవతలి వాళ్ళది ఎంత బలవత్తరమైన ఎజెండా అయినా సరే.

ఇంకొకటి ఏమిటంటే, ఈ స్వభావం వాళ్ళకి తాము చేయదలచుకున్నదానిపై ఒక కచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. దానిని ముందుకు తీసుకెళ్లే తెగువ ఉంటుంది. అది మంచిదే కావచ్చు, కాకపోవచ్చు. ఆ ప్రణాళికకు కలసివచ్చే మేరకే వారు ఇతరుల ఎజెండాకు సందు ఇస్తారు. కలసి రాకపోతే ఇవ్వరు.

అలాగే, వీరు తమ ఎజెండాలో ఉంటే తప్ప స్టేటస్ కొ ను చెరపడానికి ఇష్టపడరు. అవతలి వాళ్ళ ఎజెండా సంక్షోభస్థాయికి వెళ్ళి తమ మీద ఒత్తిడిని పెంచిన కొద్దీ, ఆ ప్రమాణంలోనే వీరు దానిని ఎదుర్కొని తమ విధానాన్నే నెగ్గించుకోడానికి చూస్తారు.

ఇతరులు తమ వైఫల్యాలనో, లోపాలనో ఎత్తి చూపుతూ విమర్శలను తీవ్రం చేసిన కొద్దీ ఒక మాదిరి వాళ్లైతే జంకి కనీసం చూపులకైనా దిద్దుబాటుకు పూనుకున్నట్టు కనిపిస్తారు. కానీ ఈ స్వభావం ఉన్న వాళ్ళు అలా కాదు. విమర్శల తీవ్రత పెరుగుతున్న కొద్దీ తమలో ఎత్తి చూపే లోపాలను, వైఫల్యాలను సరిదిద్దుకోకూడదన్న పట్టుదల వీళ్లలో పెరుగుతూ ఉంటుంది. ఇందిరా గాంధీ స్వభావంలోని ఆ లక్షణమే ఆమెను ఎమెర్జెన్సీ వైపు అడుగు వేయించింది. జయప్రకాశ్ నారాయణ్ వంటి వారిని కూడా జైల్లోకి తోయించింది.

మోడీ విషయానికి వస్తే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గంలోఅవినీతి ఆరోపణలున్న ఇద్దరిని తప్పించలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాసరే,  ఆయన వారిని తప్పించలేదు. విమర్శలు రావడమే అందుకు కారణం. ఒకవేళ విమర్శలు రాకపోతే తప్పించేవారేమో. అమిత్ షా పై అంతకంటే ఎక్కువ విమర్శలు వచ్చినప్పటికీ ఆయనను బిజెపి అధ్యక్షుని చేయడం కూడా అలాంటిదే. కళ్లేలు తమ చేతుల్లో ఉన్నప్పుడు గుర్రం ఎలా పరిగెడితే ఏం లే అన్న ధీమా వీళ్లలో ఉంటుంది.

ప్రశంసనీయమైన పనులు  చేయడంలోనూ ఈ స్వభావం ఉన్నవాళ్ళు అంతే తెగువను, పట్టుదలను ప్రదర్శిస్తారు. ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ అవతరణలో నిర్వహించిన పాత్ర అలాంటిదే. నరేంద్ర మోడీ మీద కూడా చాలామందికి అలాంటి ఆశలే ఉన్నాయి. నికరంగా ఆయన ఏం చేస్తారో ముందు ముందు చూడవలసిందే.

ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు ఏకరవు పెడుతున్నానంటే, నేను నరేంద్ర మోడీని ఇందిరాగాంధీతో పోల్చే నాటికి తెలుగు మీడియాలో కానీ, జాతీయ మీడియాలో కానీ ఎవరూ ఆ పోలిక తేగా నేను చూడలేదు. మోడీ ప్రధాని అయ్యాక రెండు నెలలకు కాబోలు జాతీయ మీడియాలో ఆ పోలిక ఒకే ఒకసారి ప్రస్తావనకు వచ్చింది. తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంలో ఒక టీవీ చానెల్ చర్చ సందర్భంలో ఇందిరాగాంధి మార్గంలో మోడి వెడుతున్నారా? అనే ప్రశ్నను ముందుకు తెచ్చింది.

శివసేన విషయంలో gambling కు మోడీ సాహసించడంలో కూడా పైన చెప్పిన స్వభావమే ఉంది. శివసేనతో ఆయనకు ప్రధాని కావడానికి ముందునుంచీ వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలలో వాటి పాత్ర ఉండే తీరుతుంది. ఇక్కడ కూడా శివసేనే తన దారికి రావాలి తప్ప తను దాని దారికి వెళ్ళే ప్రశ్న లేదు. ఎంత రిస్కు కైనా సిద్ధపడే తెగింపు స్వభావం అది.

ఇక్కడ తెలంగాణ లానే అక్కడ విదర్భ ఉంది. విదర్భను ప్రత్యేకరాష్ట్రం చేయడానికి తాము సుముఖమే నన్న భావనను ఆ ప్రాంత ప్రజల్లో బిజెపి కలిగించింది. కానీ మోడి దగ్గర అలాంటివేమీ కుదరవు. .చిన్న రాష్ట్రాల నినాదాన్ని బిజెపి ఇక వదలుకోవచ్చు. నా అంచనాలో మోడీ ఇక ఏ రాష్ట్రాన్ని విభజించడానికి ఒప్పుకోరు, ఉత్తర ప్రదేశ్ లాంటి మరీ పెద్ద రాష్ట్రమైతే తప్ప. అసలు అలాంటి నినాదమే తల ఎత్తకుండా చూసే వ్యవహారశైలి ఆయనది.


Sunday, October 19, 2014

ఎన్సీపీ ముక్త్ మహారాష్ట్ర నినాదం ఎందుకు ఇవ్వలేదో?!

ఎగ్జిట్ పోల్స్ వచ్చాక , అందులోనూ అవి ఫలితాలను చాలావరకూ accurateగా  అంచనా వేయడం మొదలెట్టాక ఎన్నికల అసలు ఫలితాల మీద ఆసక్తి తగ్గిపొతోంది. ఎలక్ట్రానిక్ మీడియా దీనిని ఎందుకు గమనించడం లేదో తెలియదు. అసలు ఫలితాల రోజున రోజంతా టివి చానెళ్ళ ముందు జనాన్ని కదలకుండా కూర్చోబెట్టాలన్న  దాని లక్ష్యానికి ఇది   పనికొచ్చేది కాదు. అయినా ఎగ్జిట్ ఫలితాల పేరుతొ ఒకసారి , అసలు ఫలితాల పేరుతో  రోజంతా మరోసారి అవి ఎందుకు హడావుడి చేస్తున్నాయో అర్థం కాదు .

మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎగ్జిట్ ఫలితాలు ముందే చెప్పేశాయి. అన్ని సర్వేలు ఇంచుమించు ఒకే ఫలితాన్ని ఇచ్చాయి కనుక అసలు ఫలితాల సరళి కూదా అలాగే ఉండబోతున్నట్టు  మొదట్లోనే తెలిసిపోయింది కనుక బిజెపీ రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. 

నాకైతే నిజంగా ఆశ్చర్యాన్ని మించి అసహ్యాన్ని కలిగించినది ఎన్సీపీ బిజెపీకి ఏకపక్షంగా బేషరతుగా బయటినుంచి మద్దతు ప్రకటించడం! ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ అభివృద్ధిని, మహారాష్ట్ర ప్రయోజనాలను కోరి సింగల్ లార్జెస్ట్ పార్టీగా గెలుపొందిన బీజెపీకి బయటి నుంచి మద్దతు ప్రకటిస్తున్నామని-ఒక పక్క ఫలితాలు వెలువడుతుండగానే హడావిడిగా ప్రకటించారు. ఆ హడావిడి ఆ పార్టీ నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా ప్రకటించిందన్న అభిప్రాయాన్ని కలిగించలేదు సరి కదా,  స్వప్రయోజనాల కోసమన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఎందుకంటే అజిత్ పవార్ లాంటివారు చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిజెపి ప్రభుత్వం వాటిని తిరగదోడుతుందన్న భయమే ఆ ప్రకటన వెనుక కనిపించింది. అలాంటి భయమే లేకపోతే ఆ ప్రకటన అంత అత్యవసరంగా చేయవలసిన అవసరం లేదు. అందులో రాజకీయమైన విజ్ఞత అసలే లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే, అటునుంచి అభ్యర్థన వచ్చే వరకూ ఆగవచ్చు. అంతలో కొంప లేమీ మునిగిపొవు. అభ్యర్థన రాకపోతే తన మానాన తను ప్రతిపక్ష పాత్ర నిర్వహించవచ్చు. 

ఆ తర్వాత  ఎండి టివి లో మాట్లాడుతూ ప్రఫుల్ పటేల్ సమర్థించుకున్న తీరు కూదా అంతే పేలవంగానూ, చీదరింపుగానూ అనిపించింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు తెరచాటున ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వదంతులు వినిపించాయి కనుక, ఆ అనైతిక ప్రయత్నాల వదంతులకు తెరదించడానికి, జనంలో అయోమయం ఏర్పడకుండా నివారించడానికే ముందస్తు మద్దతును ప్రకటించామని ఆయన ఇచ్చుకున్న ఒక సమర్థన. నేటి రాజకీయ ప్రమాణాలలో ఎన్సీపీ లాంటి పార్టీలో అలాంటి రాజకీయాలకు అతీతమైన సద్భావన హఠాత్తుగా మేలుకుందంటే రాజకీయాలు బొత్తిగా తెలియని అమాయకులు కూదా నమ్మరు. నమ్మరని తెలిసినా అలా సమర్థించుకున్నారంటే, తమ అవినీతిపై బిజెపి ప్రభుత్వం చర్య తీసుకుంటుందన్న భయం తప్ప ఇంకో కారణం కనిపించదు. 

బిజెపి సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది కనుక, ఏదో ఒక పార్టీ మద్దతు ఇవ్వనిదే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందనీ, అందుకే తాము ముందుకు వచ్చామని ఆయన చెప్పుకున్నారు. ఇది కూదా అతి తెలివి వాదనె. బిజెపికి సహజ మిత్రమైన శివసేన ఎలాగూ ఉండనే ఉంది. ఒకవేళ శివసేన కాదంటే అప్పుడే తాము మద్దతు ప్రకటించవచ్చు. ఇంతలోనే ఎందుకు తొందర? ఎందుకంటే, అందుకే!

బిజెపి కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ఇచ్చింది కానీ, ఎన్సిపీ ముక్త మహారాష్ట్ర అని ఎందుకు నినాదం ఇవ్వలేదో!

Thursday, October 16, 2014

'సెజ్' లూ, రైతుల భూముల్ని లాక్కోవడం రోమ్ గణతంత్రం లోనూ ఉండేవి!

విశేషమేమిటంటే, రోమన్ గణతంత్రం ఎంత దూరం విస్తరించినా సరే, విస్తరించిన మేరా అది ఒక పెద్ద నగరం మాత్రమే. క్రీ. శ, 212 నాటికి రోమన్ గణతంత్రంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి స్వంతంత్ర పౌరుడితో సహా అందరికీ రోమ్ నగరంలో పౌరసత్వం ఉంది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి టౌన్ హాల్ లో జరిగే వోటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే, ఒక షరతు... వాళ్ళు అక్కడికి వెళ్లగలిగి ఉండాలి!

రోమ్ గణతంత్రంలో సంభవించిన రైతుల సంక్షోభం నేడు మన దేశంలో చూస్తున్న రైతుల సంక్షోభంలానే ఉండేది.  రోమ్ లో అప్పటి ఎస్టేట్లు, రైతులు భూముల్ని కోల్పోవడం  నేటి సెజ్ లనూ, భూసేకరణ రూపంలో నేటి భారతీయ రైతులు కోల్పోతున్న భూముల్ని గుర్తుచేయచ్చు. అలాగే వ్యవసాయంలో పోటీని ఎదుర్కోలేక చితికిపోతున్న నేటి రైతులూ, వాళ్ళ రుణ మాఫీ డిమాండ్లూ, ఆమేరకు ప్రభుత్వాల హామీలూ వగైరాలు కూడా అప్పుడు రోమ్ లో ఉండేవి. 

Wednesday, October 8, 2014

ఒంటరి దీవి భారత్!

క్రీస్తుపూర్వ దశకు చెందిన బహురూప ఆస్తికతలో ఇప్పటికీ అధికారికంగా కొనసాగుతున్న దేశం ఒక్క మనదేశం తప్ప ఈ క్షణాన నాకు ఇంకొకటి స్ఫురించడం లేదు. క్రీస్తుపూర్వ కాలంలో బహురూప ఆస్తికతనుంచి తనను కాపాడుకోడానికి ఏకరూప ఆస్తికత ఎంతో పెనుగులాడవలసివచ్చింది. అజ్ఞాతజీవితం కూడా గడపవలసివచ్చింది. అలాంటిది, చరిత్ర తిరగబడి, ఏకరూప ఆస్తికత దాడిని కాచుకుంటూ నేడు బహురూప ఆస్తికత బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది.

నేటి సువిశాల ఏకరూప ఆస్తిక సాగరంలో బహురూప ఆస్తికతను కాపాడుకుంటున్న ఒంటరి దీవి మనదేశం!

                                                          
(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/10/08/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%85%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5/  లో చదవండి)

Friday, October 3, 2014

విద్యావంతులలో కూడా పారిశుద్య స్పృహ కలిగించడం అంత తేలిక కాదు!

ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి స్వచ్చభారత్ పేరుతో దేశాన్ని పరిశుభ్రం చేసే పనిని చేపట్టినందుకు కోట్లాది మందికి సంతోషంగా ఉంది. అలాంటి కోరిక నాతో సహా చాలామందికి ఉంది. కానీ ప్రధానమంత్రి  చేపట్టినందువల్ల దానికి విశేష ప్రచారం లభించి కొన్నేళ్ళకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయనే అన్నట్టు జనంలో (సాధారణ జనంలో కాదు సరికదా, విద్యావంతులలో కూడా) ఆ మేరకు చైతన్యం తేవడం అంత తేలిక కాదు.

ఈ సందర్భంలో నా అనుభవాలు ఒకటి రెండు పంచుకోవాలనిపిస్తోంది.

మాది పశ్చిమగోదావరి జిల్లా. కొవ్వూరు నుంచి గోదావరిగట్టు మార్గంలోనూ, వేరే రోడ్డు మార్గంలోనూ పోలవరానికి వెళ్ళే దారిలో మా ఊరు ప్రక్కిలంక వస్తుంది. గోదావరి గట్టు దారిలో ఎప్పుడు వెళ్ళినా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆడా, మగా చాలామంది గోదావరి గట్టును బహిరంగ పాయిఖానాగా వాడుకుంటూ ఉంటారు. వ్యక్తిగత మరుగుదొడ్ల స్పృహ నేటి 21 వ శతాబ్దిలో కూడా ఈ జనంలో ఏర్పడలేదు. మళ్ళీ గోదావరి జిల్లాలు వెనకబడినవి ఏమీ కావు. ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు కనీసం వ్యక్తిగత మరుగుదొడ్ల అవసరంపై కూడా దృష్టి పెట్టలేకపోయాయి.

దీని మీద మనం ఏమైనా చేయాలనిపించేది. ఇలా ఉండగా మేము చాలాకాలం కొవ్వూరులో కూడా ఉన్నాం కనుక చిరకాలంగా తెలిసిన కొవ్వూరు మిత్రుడు ఒకరు మన కొవ్వూరు వాళ్ళం అంతా కలసి ఒక సంఘంగా ఏర్పడదామని ప్రతిపాదన తెచ్చాడు. చాలామంది హైదరాబాద్ లో ఉన్నారు కనుక మొదట హైదరాబాద్ లో ఒక గుళ్ళో సమావేశమూ, భోజనాలూ ఏర్పాటు చేశాడు. గుళ్ళో సమావేశం అనేసరికే నేను సగం నీరుగారి పోయాను. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం వారు ఇలాంటి సమావేశాలను గుళ్ళల్లో జరుపుతూ ఉంటారు. అందులోని ఔచిత్యం నాకు అర్థం కాదు. గుళ్ళు అన్ని సామాజికవర్గాలకూ చెందినవి. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం తన సమావేశాలకు ఆలయాలను ఉపయోగించుకోవడంలో అవి "మాకు చెందినవి" అన్న ఒక తప్పుడు సందేశాన్ని ఇతరులకు ఇచ్చినట్టు అవుతుంది. ఆలయాలలో ఆలయాలకు చెందిన సమావేశాలు, ఆధ్యాత్మిక సమావేశాలు తప్ప ఇతర సమావేశాలు జరగకూడదన్న నిబంధన ఇప్పటికైనా చేయడం అవసరం.

గుడిలో సమావేశం అన్నందుకు సగం నీరుగారిపోయినా, మొత్తానికి మరికొందరిని కూడా వెంటబెట్టుకుని నేను సమావేశానికి వెళ్ళాను. అందులో నేను మాట్లాడుతూ పారిశుధ్యం గురించీ, వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి, గోదావరి గట్టును పరిశుభ్రంగా ఉంచడం గురించి మనం ఏమైనా చేయాలని ప్రతిపాదించాను. అంతా విన్నారు కానీ నా ప్రతిపాదనకు మద్దతు లభించలేదు. ఆ తర్వాత ఆ సమావేశం చేసిన తీర్మానం నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలూ, లక్షపత్రి పూజలూ చేయాలన్నదే ఆ తీర్మానం. మొత్తం మీద పారిశుధ్యం అవసరంగా ఎవరికీ అనిపించలేదు.

మరో అనుభవం. ఆమధ్య భక్తి చానెల్ వాళ్ళు భక్తి గురించి ఒక చర్చా కార్యక్రమానికి నన్ను పిలిచారు. అందులో నాతోపాటు ఒక స్వామీజీ, ఒక పండితుడు, ఒక రచయిత పాల్గొన్నారు. వాళ్ళందరూ భక్తి ఎంత అవసరమో చెప్పారు. నేను బాహ్యశుద్ధి, పర్యావరణ రక్షణ ఎంత అవసరమో చెప్పాను. పరిసరాలను, పర్యావరణను కాపాడడం కూడా భగవంతుని పూజించడం లాంటిదే నన్నాను. అది విన్నవాళ్లు మీరొక్కరే భిన్నంగా మాట్లాడారన్నారు. చానెల్ వాళ్ళు కూడా అదే అన్నారు. మన భక్తిలో బాహ్యశుద్ధి భాగం కాకపోవడం,  టీవీ చానెళ్లలో ప్రవచనాలు చేసే స్వామీజీలు, పండితులూ కూడా బాహ్యశుద్ధిని నొక్కి చెప్పకపోవడం మీరు గమనించవచ్చు.

చెప్పొచ్చేదేమిటంటే, పరిసరాల పరిశుభ్రత ఎంత అవసరమో విద్యావంతులచేత గుర్తింపజేయడం కూడా అంత తేలిక కాదు.

నేను పారిశుధ్యం అవసరం గురించి ఈ బ్లాగులో రాసిన వాటి వివరాలను ఇస్తున్నాను. ఆసక్తికలవారు చదువుతారని ఆశిస్తున్నాను.

1. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్ కావాలి?- నవంబర్, 29, 2012

2. తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి- డిసెంబర్, 1, 2012

3. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది?- డిసెంబర్, 11, 2012

4. తెలుగు సభలలో 'తెలుగు బహిర్భూమి' గురించి చర్చిస్తారా?- డిసెంబర్, 17, 2012

5. బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు- (నేను ఇండియా టుడే లో రాసింది. డిసెంబర్, 25, 2012

6. మన నదుల పేర్లు ఎంత అందమైనవి!- జూన్, 30, 2013

Thursday, October 2, 2014

రాముడిలానే సముద్రం మీద కోపగించిన ఓ పర్షియన్ చక్రవర్తి

రాముడు వానరసైన్యంతో రావణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. సముద్రం దాటి లంకకు వెళ్ళాలంటే వారధి కట్టాలి. అందుకు సహకరించమని సముద్రుని ప్రార్థించాడు రాముడు. కానీ సముద్రుడు ఎంతకీ ప్రసన్నుడు కాలేదు. రాముడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు. దాంతో సముద్రుడు భయపడి వారధి కట్టడానికి దారి ఇచ్చాడు.

ఇలాగే గ్రీకులపైకి యుద్ధానికి బయలుదేరి సముద్రాన్ని దాటబోయిన ఒక పర్షియన్ చక్రవర్తికి  సముద్రుడు సహకరించకలేదు. దాంతో అతనికి కోపం వచ్చి సముద్రాన్ని శిక్షించాడు.

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/10/02/%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%AF%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%B9/ లో చదవండి)


Wednesday, October 1, 2014

గాంధీజీ తర్వాత చీపురు పట్టిన మోడీ

గాంధీ జయంతి సందర్భంగా స్వయంగా చీపురు పట్టి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు.

నాకు గుర్తు ఉన్నంతవరకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాక, స్వయంగా చీపురు పట్టినవారు, కలరా వ్యాపించినప్పుడు పాయిఖానాలు కూడా శుభ్రం చేసిన నాయకుడు గాంధీజీ ఒక్కరే. ఇన్నేళ్లకు గాంధీజీ చేసిన పనిని మోడీజీ తలకెత్తుకున్నందుకు పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభినందించాలి.

ఈ సందర్భంలో కిందటి ఏడాది జనవరి 30 న గాంధీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక  బ్లాగును  ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.

కాంగ్రెస్ సభల్లో చీపురు పట్టిన గాంధీ

గాంధీ కన్నా సుభాస్ చంద్ర బోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గొప్ప నాయకులని కొన్ని రోజుల క్రితం ఎం.ఐ.ఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆ ముగ్గురూ గొప్ప నాయకులని అనడం వరకు బాగానే ఉంది. కానీ మధ్యలో గాంధీని తీసుకొచ్చి ఆయన గొప్ప నాయకుడు కాడని అనడం ఎందుకో తెలియదు. సందర్భం, అవసరం లేకపోయినా గాంధీని రెక్క పుచ్చుకుని మరీ మధ్యలోకి  లాగి ఆయన మీద ఓ రాయి వేయడం చాలామందికి  పరిపాటిగా మారింది. పాపం ఆయన పువ్వులూ, రాళ్లూ రెంటినీ స్వీకరించక తప్పడం లేదు.

ఎవరు గొప్ప నాయకులో నిర్ణయించడానికి ఎవరి కొలమానాలు వాళ్లకుంటాయి. ఆ జోలికి పోకుండా చెప్పుకోవాలంటే గాంధీ ఎవరితోనూ పోల్చలేని నాయకుడు. ఆధునిక భారతదేశంలో ఆ చివరినుంచి ఈ చివరివరకు యావన్మందీ నాయకుడిగా గుర్తించిన ప్రథమ నాయకుడు ఆయనే. ఒక మహాసేనానిగా ఎంతో చాకచక్యంగా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేసిన ప్రథమ నాయకుడు కూడా ఆయనే. ఆచి తూచి సహచరులను ఎంపిక చేసుకోవడంలో, వారిని నేర్పుగా వాడుకోవడంలో, వారితో రాజకీయ సంబంధాలే కాక వ్యక్తిగత ఆత్మీయ సంబంధాలను పెంచుకోవడంలో, సహచరుల మధ్య పరస్పర మైత్రిని ప్రోత్సహించడంలో గాంధీ తనకు తనే సాటి అనిపించుకోగల నాయకుడు. గాంధీ గురించి అన్నీ పార్స్వాలనూ తెలుసుకుని ఆయన నాయకత్వ దక్షతను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బుద్ధినీ, హృదయాన్నీ కూడా అంచనా వేయాలంటే ఆయనపై వచ్చిన పుస్తకాలు చదవాలి.

గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ రచించిన 'మోహన్ దాస్' అలాంటి పుస్తకాలలో ఒకటి. నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో తెలుసుకోడానికి అదొక పాఠ్య గ్రంథం. నేటి నాయకులందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.

ఆ పుస్తకం ఆధారంగా గాంధీ గురించి కొన్ని ముచ్చట్లు...

గాంధీ 1901లో కలకత్తాలో జరిగిన ఏ.ఐ.సీ.సీ సమావేశాలలో పాల్గొన్నాడు. వెళ్ళేటప్పుడు నాటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రయాణిస్తున్న రైలులోనే తనూ ఎక్కాడు. మధ్యలో, ముందుగానే నిర్ణయించుకున్న స్టేషన్ లో దిగి అగ్రనేతల బోగీలోకి వెళ్ళి వాళ్ళను పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన బోగీలోకి వెళ్లిపోయాడు.

కలకత్తా సదస్సులో ఆయన రెండు పాత్రలు నిర్వహించాడు. గోఖలే సాయంతో దక్షిణాఫ్రికా పోరాటంపై తీర్మానం ప్రతిపాదించి అయిదు నిమిషాలు దానిపై మాట్లాడడం మొదటిది. ఒక చీపురు తీసుకుని సమావేశస్థలిని తుడిచి శుభ్రం చేయడం రెండవది. ఆయన ఆ పని చేస్తుంటే అంతా కళ్ళప్పగించి చూశారు తప్ప అందులో పాలుపంచుకోడానికి  ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత, కాంగ్రెస్ కార్యదర్శులలో ఒకడైన జానకీనాథ్ ఘోశాల్ గుట్టలా పోగుబడిన ఉత్తరాలకు సమాధానం రాయడంలో సతమతమవుతుంటే గాంధీ వెళ్ళి ఆయనకు సహకరించాడు. ఇన్ని చేస్తూనే చాలామంది నాయకులను కలసి మాట్లాడాడు. కాంగ్రెస్ పనితీరు గురించి మొత్తం సమాచారం రాబట్టాడు.

                                                                      *

Wednesday, September 24, 2014

తొలి విమాన నిర్మాణం పురాతన క్రీటు ద్వీపంలో జరిగిందా?

క్రీటు వాసులు ఎంతో అందమైన కళాత్మకమైన జీవితం గడిపేవారనడానికి వారి దుస్తుల తీరేకాక, తవ్వకాలలో బయటపడిన మృణ్మయపాత్రలు, శిల్పాలు, చిత్రాలు, నగలు, దంతపు వస్తువులే సాక్ష్యం. వారికి లిపి కూడా ఉండేది. గృహ బానిసలు, పారిశ్రామిక బానిసలు ఉండేవారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, డేడలస్ అనే ఒక క్రీటు వాసి విమానం లాంటి ఒక ఎగిరే వాహనాన్ని తయారు చేశాడనీ, అది సముద్రంలో కూలిపోయిందనే వివరం, అనంతర కాలంలో క్రీటును ఆక్రమించుకున్న గ్రీకుల పురాగాథలలోకి ఎక్కింది. మన రామాయణంలో చెప్పిన పుష్పక విమానానికి మూలం ఇదేనేమో తెలియదు. క్రీటులకు ఉల్కాపాతం ద్వారా లభించిన ఇనుము మాత్రమే తెలుసు. గాడిదలే తప్ప గుర్రం తెలియదు.

Monday, September 22, 2014

మోడీ అమెరికా పర్యటనను మీడియా అతి చేయాలా?

ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ సందర్శించారు. అయినా మీడియా ఆ పర్యటనకు ముందు అంత హడావిడి చేయలేదు. పోనీ నేపాల్ చిన్నదేశం అనుకుందాం.

మోడీ జపాన్ సందర్శించారు. ఆ సందర్శనకు ముందు మీడియా అంత హడావుడి చేయలేదు.

ప్రస్తుతం ఆ అవకాశం లేదుకానీ, మోడి పాకిస్తాన్ సందర్శనకే వెడతారనుకుందాం. దానికి ముందు మీడియా అంత హడావుడి చేయదు.

మోడీ అమెరికా సందర్శనకు ముందే ఎందుకు అంత హడావుడి చేస్తోంది?

ఈ అమెరికా సెంట్రిక్ గ్లోరిఫికేషన్ ఎందుకు? అవసరమా? జనానికి ఉందో లేదో కానీ మీడియాకు ఈ అమెరికా పిచ్చి ఇంత ఉండాలా? ఇది ఒకవిధమైన దాస్యం కాదా?

మోడీ అమెరికా సందర్శనను మీడియా అతి చేయడంలో నాకైతే ఎలాంటి ఔచిత్యం కనిపించడం లేదు. మరి మీకు?

Sunday, September 21, 2014

ఇది విన్నారా? వీవీఐపీ లకు ప్రత్యేకంగా శ్మశానమట!!!

నిన్న పొద్దుటే ఈ వార్తను ఒక టీవీ చానెల్ లో చూసి నా కళ్ళను, చెవులను నేనే నమ్మలేకపోయాను...

ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా అనుకున్నాను. ఇంత దిక్కు మాలిన, దరిద్రపు ఆలోచనలు అసలు ఈ రోజుల్లోనే వస్తాయేమో. అందులోనూ మాటి మాటికీ ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడుతూ వచ్చిన యూపీఏ ప్రభుత్వం చేసిన ఆలోచన ఇది. 

బాధ కలిగిందని చెప్పను. చాలా కోపం వచ్చింది.  కంపరం కలిగింది. అసహ్యం వేసింది. 

ఢిల్లీలో వీవీఐపీలకోసం ప్రత్యేకంగా ఒక శ్మశానం నిర్మిస్తున్నారట. దీనిని యూపీఏ తలపెట్టిందట. 80 శాతం పని పూర్తయిందట. ఎన్డీయే ప్రభుత్వం బుద్ధిగా మిగతా పనిని పూర్తి చేస్తుందట.

 చావును equalizer గా చెబుతారు. అందులో పేద, ధనిక; రాజు, బంటు లాంటి తేడాలు ఉండవని ప్రతి దేశంలోనూ, ప్రతి సంస్కృతీ బోధిస్తుందని అనుకుంటాను. 'చివరిగా మనిషికి కావలసింది ఆరడుగుల నేల, అంతే కదా!' అనడమూ వింటుంటాం. 'పోయినప్పుడు ఏం పట్టుకు పోతారు?' అనే నానుడి కూడా వింటుంటాం. అలెగ్జాండర్ చనిపోయినప్పుడు రెండు అరచేతులూ తెరచుకుని ఉన్నాయట. పోయేటప్పుడు ఏమీ పట్టు కెళ్లడం లేదని సూచించడమని దానికి అర్థం చెబుతారు. చావుతో అన్ని రకాల హెచ్చుతగ్గుల తేడాలు అంతమైపోతాయని ప్రతి సంస్కృతీ నూరిపోసిన భావన.

అలాంటిది, వీవీఐపీలకు ప్రత్యేక శ్మశానం అనేది ఊహించడానికే సాధ్యం కాని విషయం. అసలీ విషయం వార్తలలోకి మొదటే ఎందుకు రాలేదో ఆశ్చర్యం. 24 గంటల వార్తా చానెళ్ల దృష్టికి కూడా ఈ వార్త ఎందుకు రాలేదో తెలియదు. రాజకీయపార్టీలు ఏంచేస్తున్నాయో తెలియదు. ఎన్డీయే ప్రభుత్వం దీనిని ఎందుకు నిశ్శబ్దంగా పూర్తి చేయాలనుకున్నదో తెలియదు. ఇప్పుడు దీనినే ఆదర్శంగా తీసుకుని దేశమంతా రెండు గ్లాసుల వ్యవస్థలా రెండు శ్మశానాల వ్యవస్థ ఏర్పడే పరిస్థితిని ఒకసారి ఊహించుకుని చూడండి. కంపరం పుట్టుకు రాకుండా ఉంటుందా?

సల్మాన్ ఖుర్షీద్ అనే కాంగ్రెస్ కేరక్టర్ ఈ వీవీఐపీ శ్మశానాన్ని సమర్థిస్తూ,  దేశం కోసం కష్టపడిన నాయకులు, సెలెబ్రటీలకు ఇంతకన్నా గొప్ప నివాళి లేదన్నట్టు మాట్లాడారు. ఛీ...ఛీ...అనడం తప్ప ఏం చేయగలం? 

Thursday, September 18, 2014

జమ్మి చెట్టుకు, ఆయుధాలకు సంబంధం ఏమిటి?

ఒకానొక చారిత్రక ఘటన అనంతరకాలంలో మంత్రరూపంలోకి, అభినయరూపంలోకి మారి తంతులో ఎలా భాగమవుతుందో చెప్పడానికి కోశాంబీ ఇంకో ఉదాహరణ ఇస్తారు. అది, సీమోల్లంఘన’.  పూర్వం ఆశ్వయుజమాసంలో, అంటే శరత్కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరేవారు. ఆ రోజుల్లోనే విజయదశమి పండుగ వస్తుంది. ఆ పండుగ పేరులోనే యుద్ధ సూచన ఉంది. ఈ సందర్భంలో ఆయుధాలను పూజిస్తారు. యుద్ధానికి వెళ్ళేముందు రాజులు ఒక తంతు రూపంలో సీమోల్లంఘన జరుపుతారు. అంటే తమ రాజ్యం సరిహద్దులను దాటతారు. అది యుద్ధానికి వెడుతున్నట్టు అభినయపూర్వకంగా సంకేతించడం. మహారాష్ట్ర మొదలైన చోట్ల ఇప్పటికీ దసరా సందర్భంలో సీమోల్లంఘనను అభినయిస్తారు. శమీపత్రాలను(జమ్మి ఆకులను) ఒకరికొకరు ఇచ్చుకోవడమూ ఉంది. పూర్వం శూలం, గద, విల్లు మొదలైన ఆయుధాలను జమ్మి కొయ్యతోనే తయారు చేసేవారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లబోయేముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదే దాచుకున్నారు...

Thursday, September 11, 2014

అక్కడ అంతా కవిత్వంలో మాట్లాడుకుంటారు

వారి దృష్టిలో కవిత్వానికి పుస్తకంతో పనిలేదు. వాళ్ళలో చాలామంది ఇటీవలి వరకు నిరక్షరాస్యులు. కవిత్వం వాళ్ళ పెదవుల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ కవిత్వాన్ని ప్రేమిస్తారు. వారి దైనందిన సంభాషణలో కూడా కవిత్వం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన ఘటన జరిగినప్పుడు దానిపై అప్పటికప్పుడు పాట కట్టి తమ అనుభూతిని ప్రకటించుకుంటారు. ఇటీవలివరకు అనేక ఐరిష్ గ్రామాలలో శిక్షణ పొందిన సాంప్రదాయిక గాయకుడు ఒక్కరైనా ఉండేవారు. ఆశువుగా కవిత్వం చెప్పే నేర్పు వారికి ఉంటుంది. ఆ క్షణంలో పొందిన ఉత్తేజాన్ని బట్టి అతను చెప్పే కవిత్వం, నేటి ఆధునిక ఇంగ్లీష్  కవిత్వం కన్నా కూడా ఎక్కువ వివరణాత్మకంగా ఉంటుంది.

నాకు బాగా తెలిసిన ఒక గ్రామంలో ఒక ప్రసిద్ధ కవి ఉండేవాడు. ఆయన చనిపోయి నలభై ఏళ్లయింది. ఆయన కవితలన్నీ చాలావరకూ ఆశువుగానూ, సందర్భానుసారంగానూ చెప్పినవే. ఆయన గురించి ఆయన కుటుంబ సభ్యులు ఒక విషయం చెప్పారు. ఆయన చనిపోయిన రోజు రాత్రి కూడా మంచం మీద పడుకుని మోచేతి మీద తల పెట్టుకుని ప్రవాహంలా కవిత్వం చెబుతూనే ఉన్నారట.

Wednesday, September 3, 2014

కొత్త జంటకు అరుంధతిని ఎందుకు చూపిస్తారు?

సప్తర్షి మండలంలో వశిష్టుని పక్కనే ఉన్న అరుంధతీ నక్షత్రాన్ని కొత్త దంపతులకు చూపిస్తారని మనకు తెలుసు. ఈ ఆచారం ఎప్పటినుంచి వస్తున్నదో తెలియదు. అరుంధతీ వశిష్టులు తమ తమ గణాలలో జంట మనువు కట్టి, జీవితాంతం ఆ మనువుకు కట్టుబడి ఉన్న తొలి జంట అన్న సంగతిని అది సూచిస్తూ ఉండచ్చు. ఆవిధంగా వారు ఆదర్శ దంపతులయ్యారు.


అయితే, ఆ మనువు సాధ్యం కావడానికి పూర్వరంగంలో పెద్ద కసరత్తు జరిగింది. ఎందుకంటే, వారిద్దరి గణాలూ అప్పటికి ఇంకా గణవివాహదశలో ఉన్నాయి. జంట మనువులతో వాటికి పరిచయం లేదు. అయినాసరే, ఒకరి మీద ఒకరు మనసు పడిన అరుంధతీ, వశిష్టులు జంట మనువు ఆడాలనుకున్నారు. అందుకు రెండు గణాలవారూ అనుమతించాలి. మామూలుగా అయితే అనుమతి అంత తేలిక కాదు. కానీ అప్పటికే కొన్ని తెలిసిన వ్రాతాల(మనువుకు యోగ్యమైన కొన్ని గణాలు కలసి వ్రాతంగా ఏర్పడతాయి)వారు జంట మనువుల్లోకి అడుగుపెట్టారు.  పులస్త్య, పులహవ్రాతాలు వాటిలో ఉన్నాయి. కనుక అరుంధతీ, వశిష్టుల గణాలవారు కాస్త మెత్తబడ్డారు. అయితే,  గణధర్మాన్ని భంగపరచి ఆ మనువును సాధ్యం చేయడం ఎలా?

Wednesday, August 27, 2014

'యోని'జులూ...అ'యోని'జులూ

ద్రౌపది తండ్రి ద్రుపదుడు. అతని తండ్రి పేరు పృషతుడు. పాంచాలరాజు అయిన పృషతుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అప్సరస అయిన మేనక పువ్వులు సేకరిస్తూ కనిపించింది. ఆమెను చూడగానే పృషతునికి స్కలనం జరిగింది. దానిని అతను తన పాదంతో కప్పాడు. అప్పుడు మరుత్తుల అంశతో దానినుంచి ద్రుపదుడు పుట్టాడు. పాదం నుంచి వచ్చాడు కనుక అతనికా పేరు వచ్చింది.

పృషతునికి భరద్వాజుడు మిత్రుడు. పృషతుడు తన కొడుకు ద్రుపదుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి తను పాంచాలరాజ్యాన్ని పాలించడానికి వెళ్లిపోయాడు. అంతకుముందు భరద్వాజునికీ పృషతునికి ఎదురైన అనుభవమే  ఎదురైంది. అతను గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఓ రోజున గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఘృతాచి అనే అప్సరస జలక్రీడలాడుతూ కనిపించింది. ఆమెను చూడగానే భరద్వాజుడికి కోరిక కలిగింది. స్కలనం జరిగింది. దానిని అతను ఒక ద్రోణి(దొప్ప)లోకి తీసుకున్నాడు. దానినుంచి శుక్రుని అంశతో ఒక శిశువు పుట్టాడు. ద్రోణినుంచి పుట్టాడు కనుక అతనికి ద్రోణుడనే పేరు వచ్చింది.

Wednesday, August 20, 2014

అమెరికాలో వేద కాలపు ఒక ఆనవాయితీ

 బార్బెక్యూ వేదకాలం నుంచీ కొనసాగుతున్న సాముదాయిక విందు కార్యక్రమం. దానిని మనవాళ్లు శూలమాంసం’ అన్నారు.

అమెరికాలో ఇళ్లముందు బార్బెక్యూ పొయ్యిలు ఇప్పటికీ కనిపిస్తాయి. దగ్గరలోని అడవుల్లోకో, తోటల్లోకో వెళ్ళి బార్బెక్యూ చేసుకోవడం కనిపిస్తుంది.

మాంసభోజన ప్రియులనే కాక, మద్యప్రియులను కూడా అలరించే సందర్భం బార్బెక్యూ. యవ్వనారంభంలో ఉన్న యువతీ, యువకుల్లో ప్రేమలూ, మోహాలూ పురివిప్పి నర్తించే సందర్భం కూడా.  న్యూ వరల్డ్ గా చెప్పుకునే అమెరికాలో అతి పురాతనమైన వేదకాలపు ఒక ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతున్న ఆ దృశ్యం ఒక్కసారిగా మనల్ని వేల సంవత్సరాల గతంలోకి తీసుకువెళ్లి ఆశ్చర్యచకితం చేస్తుంది. యూరోపియన్ల ద్వారానే ఈ ఆనవాయితీ అమెరికాకు బదిలీ అయిన సంగతి తెలుస్తూనే ఉంది. అదలా ఉంచితే, యూరోపియన్లకు వేదకాలపు సంస్కృతితో సంబంధముందనని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/08/20/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%82-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D/ లో చదవండి)


Wednesday, August 13, 2014

కన్యా సంపర్కం-గణసమాజం

కన్య అంటే అవివాహిత మాత్రమే తప్ప పురుష సంపర్కం లేనిది కాదు అన్న వాక్యం; కన్య గురించిన నేటి మన ఊహను తలకిందులు చేసి షాక్ ఇస్తున్న మాట నిజమే.  అప్పుడు షాక్ అబ్జార్వర్ గా పనిచేసేది తటస్థ దృష్టి మాత్రమే.

ఋతుమతి అయితే పురుష సంపర్క దోషం పోతుందన్న సూత్రం, ఆమె కన్యగా సంతానం కన్న అనంతర పరిస్థితికీ వర్తిస్తుంది. అంటే అప్పుడు కూడా ఆమె కన్యగానే ఉంటుంది. ఉన్నప్పుడు పరాశరుడు సత్యవతికి, దుర్వాసుడు(లేదా సూర్యుడు) కుంతికి ప్రత్యేకంగా కన్యాత్వ వరాన్ని ఇవ్వనవసరంలేదు. 


ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కన్యకు పురుష సంపర్కం గణసమాజానికి చెందిన నీతి. గణసమాజంలో దానిని దోషంగా కాదు సరికదా, గుణంగా కూడా భావించినట్టు కనిపిస్తుంది. గణసమాజం అంతరించినా ఆ సమాజం తాలూకు లక్షణాలు అనంతర కాలంలోకి ప్రవహిస్తూనే వచ్చాయి. అలా మన పురాణ ఇతిహాసాలకూ ఎక్కాయి. ఇప్పటికీ మన అనేక ఆచారాలలో, భాషలో, నుడికారంలో గణ సమాజ లక్షణాలు కనిపిస్తాయి. 

Friday, August 8, 2014

'కన్య' అంటే...?

స్త్రీ-పురుషుల మధ్య సయోధ్య తప్పనిసరి. లేకపోతే సృష్టి జరగదు. అయితే, లింగభేదం వల్ల వారి మధ్య సంఘర్షణా ఒక్కొక్కసారి అనివార్యమవుతూ ఉంటుంది. స్త్రీ పురుషుణ్ణి తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పురుషుడు ప్రతిఘటిస్తాడు. అలాగే స్త్రీని కట్టడి చేయాలని పురుషుడు ప్రయత్నిస్తాడు. స్త్రీ ప్రతిఘటిస్తుంది. ఇద్దరి మధ్యా ఒక వ్యూహాత్మక, నిశ్శబ్ద పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో వారి మధ్య సర్దుబాటు క్షణాలూ ఉంటూ ఉంటాయి. ఇలా చూసినప్పుడు స్త్రీ-పురుషుల చరిత్ర సమస్తం సయోధ్య-సంఘర్షణల చరిత్రే.

నాకీ సందర్భంలో ప్రసిద్ధ కథకుడు ఓ. హెన్రీ రాసిన ఒక కథ గుర్తొస్తోంది. పేరు గుర్తులేదు కానీ విషయం మాత్రం గుర్తుంది. కాకపోతే వివరాలలో ఒకింత తేడా వస్తే రావచ్చు:


కాయకష్టం చేసుకుని జీవించే ఒక పల్లెటూరి జంట. వారు ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉంటారు. భర్త ఓ ఉద్రేక క్షణంలో నీకు విడాకులు ఇచ్చేస్తానని భార్యతో అంటాడు. మరీ మంచిది, నేనూ అదే కోరుకుంటున్నానని భార్య అంటుంది. అయితే, విడాకులు మంజూరు చేసే జడ్జి దగ్గరకు వెడదాం పద అంటాడు. ఇద్దరూ బండి కట్టుకుని పట్నానికి బయలుదేరతారు. జడ్జి ఇంటికి వెడతారు. భార్య వల్ల తను ఎలా కష్టాలు పడుతున్నాడో భర్త చెబుతాడు. భర్త తనను ఎలా కాల్చుకుతింటున్నాడో భార్య చెబుతుంది. మాకు విడాకులు ఇప్పించండని ఇద్దరూ అడుగుతారు.

Sunday, August 3, 2014

పిల్లలపై పెద్దవాళ్ళ రుద్దుడు

పిల్లల పరిస్థితి చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది.

ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలపై తమ కోరికలు, సరదాలు రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందనుకుంటారు.

స్కూల్లో టీచర్లు తమ ఇష్టాలు, తమ నమ్మకాలు పిల్లలపై రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందనుకుంటారు.

పాఠ్యపుస్తకాలు రాసేవాళ్ళు తాము విశ్వసించే విషయాలనే పాఠాలుగా తయారు చేసి పిల్లలపై రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందను కుంటారు.

ప్రభుత్వాలు, న్యాయస్థానాలు...ఒకటేమిటి సమాజానికి చెందిన అన్ని అంగాలు పిల్లలను ఫలానా విధంగా తీర్చి దిద్దే బాధ్యత తమకు ఉందనుకుంటాయి. ఏ రంగానికి చెందినవారైనా సరే, పిల్లల పాలిట బెత్తం ఝళిపించే బడి పంతుళ్లే.

పెద్దవాళ్ళమనుకునే ప్రతివారూ పిల్లల్ని సొంత ప్రయోగశాలగా చూసే వాళ్ళే.

ఇంతకన్నా మరో ఛాన్స్ రాదన్నట్టు పెద్దవాళ్ళు తమకు తెలిసినవీ, తమకు ఇష్టమైనవీ, తాము నమ్మేవీ అన్నీ  పిల్లల నోరు బలవంతంగా తెరిపించి ఏకధారగా పోసేయాలనుకుంటారు. వారికి అవి జీర్ణమవుతాయా కావా అని కూడా ఆలోచించరు. మొత్తానికి పెద్దవాళ్ళు అందరూ కలసి స్కూలును ఒక concentrated camp గా మార్చివేస్తారు.

అరె..పిల్లలు స్కూల్లో ఎంతసేపు గడుపుతారో అంతకన్నా ఎక్కువసేపు తల్లిదండ్రులతోనూ, బయటి ప్రపంచంతోనూ గడుపుతారన్న స్పృహ వీళ్లలో ఎందుకు ఉండదు? పిల్లలకు మనం నేర్పే దానికంటే  వాళ్ళు సొంతంగా నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుందనే ఆలోచన వీళ్ళకు ఎందుకుండదు? ఇంకో సంగతి గమనించారోలేదో? పెద్దవాళ్ళ బుర్ర కన్నా పిల్లల బుర్ర షార్ప్ గా ఉంటుంది. గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది. వారు దేనినైనా వేగంగా నేర్చుకోగలుగుతారు. తల్లిదండ్రుల్లారా, టీచర్లలారా, పాఠ్యపుస్తకాలు రాసేవాళ్ళు లారా, ఇంకా వివిధ రంగాలకు చెందినవాళ్ళ లారా...మీ పిల్లలతోనే మిమ్మల్ని పోల్చి చూసుకోండి, మీకు తెలియని విషయాలు అనేకం వాళ్ళకు తెలుసున్న సంగతి మీకే అర్థమవుతుంది.

తనకే ఆ అధికారం ఉంటే పిల్లలకు పాఠశాల నుంచీ భగవద్గీత బోధించే ఏర్పాటు చేస్తానని ఒక జడ్జీగారు సెలవిచ్చినట్టు తాజా వార్త. పిల్లలకు భగవద్గీత బోధించాలన్న సంగతి తమరు స్కూల్లో భగవద్గీత చదువుకున్న అనుభవంతోనే అంటున్నారా స్వామీ? బహుశా మీరు పెద్దయ్యాక భగవద్గీత మిమ్మల్ని ఆకర్షించి ఉంటుంది. పెద్దయ్యాక స్వచ్ఛందంగా భగవద్గీతవైపు ఆకర్షితులయ్యే అవకాశం పిల్లలకు కూడా ఇచ్చే బదులు బలవంతంగా బోధించడం ఎందుకు మహాశయా?

మా అబ్బాయికి చిన్నప్పుడు స్కూల్లో భగవద్గీత శ్లోకాలు బట్టీ పట్టించేవాళ్ళు. ఇంట్లో వాటిని వల్లెవేస్తూ ఉండేవాడు.ఇప్పుడు వాణ్ని అడిగితే ఒక్క శ్లోకం కూడా చెప్పలేడు.  పిల్లలకు భగవద్గీత అనే గ్రంథం ఉందన్న సమాచారం ఇస్తే చాలు. లాంగ్వేజ్ స్కిల్స్ కోసం కొన్ని శ్లోకాలను బట్టీ పట్టించడంలో తప్పులేదు. కానీ బోధించడమా?! ఏం బోధిస్తారు? వారికి అది ఏమాత్రం అర్థమవుతుంది? ఏమాత్రం తమకు దానిని అన్వయించుకోగలుగుతారు?

స్కూల్లో బలవంతంగా మీరు ఎన్ని నేర్పినాసరే, పిల్లలు పెద్దవుతున్నకొద్దీ స్వచ్ఛందంగా వాటిని మించి ఎన్నో నేర్చుకుంటారు. బలవంతంగా నేర్పినదానికన్నా స్వచ్ఛందంగా నేర్చుకున్నదే ఎక్కువ నాటుకుంటుంది. స్కిల్స్ అనే మాటను పనులకు సంబంధించే ఎక్కువగా వాడుతూ ఉంటాం. లెక్కలు నేర్చుకోవడం, భాష నేర్చుకోవడం వగైరాలు కూడా స్కిల్స్ కిందికే వస్తాయి. ఒక వయసు వరకు పిల్లలకు స్కిల్స్ అందించడమే ప్రధానం కావాలి. తక్కువ నేర్పి ఎక్కువ నేర్చుకునే అవకాశం పిల్లలకు వదిలేయడమే నిజమైన చదువు.

పిల్లల్ని పెద్దవాళ్ళు సొంత ప్రయోగశాలగా వాడుకోవడం అనే దౌర్జన్యాన్ని గుర్తించినప్పుడు, పిల్లల చదువు ఎలా ఉండాలన్నది ఫ్రెష్ గా ఆలోచించడానికి వీలవుతుంది.

Thursday, July 24, 2014

పాండవులు నేటి టిబెట్ లో పుట్టారా?!

పాండవుల పుట్టుక గురించి సంప్రదాయవర్గాలలోనే ఎంతో చర్చ జరిగింది. ఆ వివరాలు చెప్పుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.  ఇటీవలి కాలంలో ఈ చర్చకు తెరతీసిన తెలుగువారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి, చారిత్రక దృష్టి నుంచి మహాభారతాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారే. వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన మహాభారతతత్త్వకథనములో పెండ్యాలవారి అభిప్రాయాలను ఖండించారు.

పెండ్యాలవారి వాదం ప్రకారం, పాండవుల జన్మస్థానమైన శతశృంగం నేటి టిబెట్టే. ఒక స్త్రీ అనేకులను పెళ్లాడే ఆచారం టిబెట్టులోనే ఉందని ఆయన అంటారు. అయిదుగురూ ద్రౌపదిని పెళ్ళాడడం ఎలా ధర్మబద్ధమని ద్రుపదుడు ప్రశ్నించినప్పుడు, మా పూర్వుల ఆచారాన్నే మేము పాటించదలచుకున్నామని ధర్మరాజు జవాబిస్తాడు. ఆ మాట టిబెట్టులోని ఆచారాన్నే సూచిస్తుందనీ పెండ్యాలవారు అంటారు. 

పాండవులు విదేశీయులే కాక, ధర్మరాజుకు విదేశీ భాష (టిబెట్ కు చెందిన భాష) తెలుసు నంటూ మహాభారతంలోని ఒక సందర్భాన్ని ఆయన ఉదహరించారు. అదేమిటంటే:-