Tuesday, September 29, 2015

బోస్ వివాదం-3: పత్రాలలో దాగిన 'రహస్యం' ఏమిటి?

బోస్ కు పెరిగిన మద్దతు
అహింసతో సహా గాంధీ విధానాలు, వ్యూహాలు అన్నీ విఫలమై కాంగ్రెస్ లోనే కాక దేశం మొత్తంలోనే ఆయన దాదాపు ఒంటరిగా మారిన సందర్భం ఇది. ఒకపక్క జనంలో బ్రిటిష్ వ్యతిరేకత తారస్థాయికి చేరగా, ఆసియా దేశమైన జపాన్ చేతిలో పాశ్చాత్యశక్తులు చిత్తుగా ఓడిపోతుండడం ఆ దేశంపట్ల వారిలో అనుకూలభావాన్నీ అదే స్థాయిలో పెంచింది. ఈ మధ్యలో 1941లో బోస్ తన కలకత్తా నిర్బంధం నుంచి నాటకీయంగా తప్పించుకుని అప్ఘానిస్తాన్ మీదుగా జర్మనీ పారిపోయి, బెర్లిన్ నుంచి చేసిన రేడియో ప్రసంగాలు దానికి మరింత ఊతమిచ్చాయి. కాంగ్రెస్ లో ఎక్కువమంది నాయకులు, కార్యకర్తలు బోస్ వైపు తిరిగారు. జర్మనీనుంచి ఆయన జపాన్ చేరుకుని జలాంతర్గాములను సేకరించబోతున్నట్టు వార్తవచ్చింది. బోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ సేనలతో కలసి భారత-బర్మా సరిహద్దుల్లో వీరోచితపోరాటం చేసింది. అయితే ఓటమిని మూటగట్టుకున్న సందర్భాలే ఎక్కువ. పరిస్థితి పూర్తిగా తన పట్టు జారిపోతోందనుకున్న గాంధీ ప్రజలమనోభావాలకు అనుగుణంగా క్విట్ ఇండియా నినాదాన్ని అందుకున్న తర్వాతే మళ్ళీ జనం ఆయనవైపు మళ్ళడం ప్రారంభించారు.
హిట్లర్ మరణం-జపాన్ లొంగుబాటు
అంతవరకూ యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా, పెరల్ హార్బర్ పై జపాన్ దాడిచేసేసరికి యుద్ధంలోకి అడుగుపెట్టింది. దాంతో బ్రిటన్ యుద్ధపాటవం అనేకరెట్లు పెరిగి బలాబలాలు తారుమారయ్యాయి. 1945 నాటికి హిట్లర్ మరణించడం, అణుబాంబు ప్రయోగంతో జపాన్ లొంగిపోవడం, ఆ వెనువెంటనే తైవాన్ లో జరిగిన విమానప్రమాదంలో బోస్ మరణించినట్టు వార్త రావడం సంభవించాయి. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయపరిణామాల మబ్బులు తొలగిపోయి జాతీయరాజకీయాలు తిరిగి తేటపడడం ప్రారంభించాయి. ఇప్పుడు బోస్ లేకపోవడం ఒక్కటే తేడా.
ఎవరు ఎంత బాధ్యులు?
జాతీయరంగస్థలినుంచి బోస్ నిష్క్రమణ రెండు అంచెలలో జరిగింది. మొదటిది, కాంగ్రెస్ నుంచి నిష్క్రమణ. రెండోది, మరణం లేదా అంతర్ధానం రూపంలో జరిగిన నిష్క్రమణ. ఎలాంటి బాధ్యులన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే; కాంగ్రెస్ నుంచి బోస్ నిష్క్రమణకు గాంధీ, నెహ్రూ తదితరులే బాధ్యులవుతారు. అదే, ఆయన మరణం లేదా, అంతర్ధానానికి బాధ్యులెవరన్నప్పుడు అంతర్జాతీయశక్తులు తప్పనిసరిగా అడుగుపెడతాయి. జర్మనీ, జపాన్ లతో తలపడుతున్న బ్రిటిష్ కు, ఆ రెండు దేశాల నుంచి సాయం పొందుతున్న బోస్ కదలికలపై నిఘావేయాల్సిన అవసరం స్పష్టమే. ఆయన కుటుంబసభ్యులపైకి దానిని పొడిగించడమూ సహజమే. రహస్యపత్రాలు బయటపెడితే  కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బతినచ్చని ఇప్పటి కేంద్రప్రభుత్వం వినిపిస్తున్న వాదన కూడా; బోస్ మరణం’, లేదా అంతర్ధానం వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర గురించిన అనుమానాన్ని బలోపేతం చేసేలానే ఉంది.
కాంగ్రెస్ నుంచి బోస్ నిష్క్రమణకు గాంధీ, నెహ్రూ తదితరులు ఎలాంటి బాధ్యులన్న ప్రశ్న చూద్దాం. అందుకు కారణం వ్యక్తిగత రాగద్వేషాలు, అధికారంలో పోటీ అవుతాడన్న భావనే అన్న నిర్ధారణకు అవకాశంలేకుండా భావజాల పరమైన వ్యత్యాసాలు ఉండనే ఉన్నాయి. బోస్-గాంధీలది హింస-అహింసల మధ్య పెనుగులాట. బోస్-నెహ్రూలది ఫాసిస్టు-ఫాసిస్టు వ్యతిరేకశక్తుల మధ్య స్పర్థ. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి నెహ్రూకు ఇచ్చిన అవకాశాన్ని బోస్ కు గాంధీ నిరాకరించడాన్నీ, బోస్ కు నెహ్రూ మద్దతు ఇవ్వకపోవడాన్నీ అర్థం చేసుకోడానికి ఇదొక కోణం. ఒకవేళ గాంధీ, నెహ్రూలను బోస్ విషయంలో ముద్దాయిలుగా పరిగణించాల్సివచ్చినా పెద్ద ముద్దాయి గాంధీ అవుతాడు కానీ, నెహ్రూ అవడు. బోస్ తో గాంధీకి ఉన్నంత విభేదం నెహ్రూకు లేదని చెప్పుకున్నాం. అయితే, నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ కుటుంబ సభ్యులపై నిఘా ఎందుకు కొనసాగించాయన్న ప్రశ్న వస్తుంది. పరిపాలనా కోణం నుంచి చూస్తే అదేమంత విశేషం అనిపించదు. సంఘపరివార్ వర్గాలు, వామపక్ష తీవ్రవాదులతో సహా కొన్ని రకాల భావజాలాలవారిపై ఇంటెలిజెన్స్ నిఘా ఎప్పుడూ ఉంటూనే ఉంది.  
బోస్ మరణం’, లేదా అంతర్ధానం వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర ఉన్నట్టు కేంద్రం వద్ద ఉన్న రహస్యపత్రాలు వెల్లడిస్తూ ఉంటే, ఆ విషయం నెహ్రూ ఎందుకు బయటపెట్టలేదనే ప్రశ్న వస్తుంది. అందులో కూడా ఆయనను మొదటి ముద్దాయిగా నిర్ధారించాలంటే, ప్రస్తుత ప్రభుత్వం తన దగ్గరున్న అన్ని రహస్యపత్రాలనూ బయటపెట్టాలి!
బోస్ ప్రతిష్టను మసగబార్చారనీ, స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్రను తక్కువచేశారనే ఆరోపణలు, అనుమానాలు  సహజమే కానీ; పూర్వాపరాల అవగాహన లోపించినప్పుడు అవి కేవలం సొంత అభిమాన ప్రకటనలుగానో, రాజకీయఫ్రేరితాలుగానో తేలిపోతాయి. గాంధీకి బోస్ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. తమిద్దరివీ రెండు భిన్నమార్గాలుగానే చూశాడు. బోస్ దేశభక్తిని, సాహసప్రవృత్తిని ఆకాశానికి ఎత్తాడు. నీ మార్గంలో నువ్వు విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తానని కూడా ఒకసారి బోస్ కు రాశాడు. ఒకవేళ జపాన్-జర్మనీ కూటమే గెలిచి ఉంటే ఆ విజయం బోస్ మార్గానికే దక్కి, భారత్ చరిత్రే భిన్నమైన మలుపు తిరిగేది. కానీ అలా జరగలేదు. జపాన్-జర్మనీ ఓటమి బోస్ ను శాశ్వతంగా తెరమరుగు చేసి గాంధీ-నెహ్రూ భావజాలాన్ని విజయతీరం చేర్చింది.
ఒకవేళ కేంద్రం వద్ద ఉన్న రహస్యపత్రాలు కూడా వెల్లడై, అన్నివిధాలా నెహ్రూనే విలన్ గా స్థాపించిన పక్షంలో, అప్పుడది వేరే కథ! 
                                                                                     (అయిపోయింది)

Monday, September 28, 2015

బోస్ వివాదం-2: నెహ్రూ-బోస్ సంబంధాలు ఎలా ఉండేవి?

నెహ్రూ-బోస్
బోస్ కన్నా నెహ్రూ ఆరేళ్లు పెద్ద. పటేల్ తో ఆయన విభేదాలు ప్రసిద్ధాలే. గాంధీతో కూడా ఆయనకు భావజాల, వ్యూహపరమైన విభేదాలుండేవి. కొన్ని సందర్భాలలో, ఇద్దరం తెగతెంపులు చేసుకుందామా అనేవరకూ వెళ్లారు. విచిత్రం ఏమిటంటే, మిగతా ఎవరి మధ్యా లేనంత భావసమైక్యత నెహ్రూ, బోస్ ల మధ్యే ఉండేది. ఇద్దరూ కాంగ్రెస్ లో రాడికల్స్ గా గుర్తింపు పొంది, ఆ వర్గానికి నాయకత్వం వహించారు. ఇద్దరూ కూడబలుక్కుని గాంధీకి నచ్చని తీర్మానాలు తెచ్చి నెగ్గించుకున్న సందర్భాలున్నాయి. కాంగ్రెస్ నియమించిన మోతీలాల్ నెహ్రూ కమిటీ అధినివేశప్రతిపత్తిని కోరాలని సూచించినప్పుడు 1927లో మద్రాసు కాంగ్రెస్ లో దానిని తోసిపుచ్చి, సంపూర్ణస్వరాజ్యాన్ని డిమాండ్ చేస్తూ వీరు తెచ్చిన తీర్మానం ఒక ఉదాహరణ. 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ ను వీరిద్దరూ కలసి తమ రాడికల్ భావాలతో ఒక ఊపు ఊపారు. అప్పుడు కూడా అధినివేశప్రతిపత్తికి బదులు సంపూర్ణస్వరాజ్యానికి ఇద్దరూ పట్టుబట్టారు. గాంధీ మెట్టు దిగి రాజీకి వచ్చాడు. గాంధీ ఇష్టానికి విరుద్ధంగా బ్రిటిష్ తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని బోస్ సవరణ ప్రతిపాదిస్తే నెహ్రూ దానిని సమర్ధించాడు. గాంధీ అస్పృశ్యతా నివారణపై మరీ ఎక్కువగా దృష్టి పెట్టడాన్నీ ఇద్దరూ వ్యతిరేకించారు. అలాగే బ్రిటిష్ పట్ల గాంధీ సామరస్యవైఖరిని వ్యతిరేకించడంలోనూ ఇద్దరిదీ ఏకీభావమే.
అయితే ఇద్దరిలోనూ కొన్ని తేడాలూ ఉన్నాయి. గాంధీతో నెహ్రూ ఒక్కోసారి తెగతెంపులవరకూ వెళ్ళినా వెనక్కి తగ్గేవాడు. ఆయన మౌలికంగా కాంగ్రెస్, గాంధీల మనిషి. ఆ రెండు గొడుగుల అంచుల్లో వేళ్లాడేవాడే కానీ పూర్తిగా బయటికి వచ్చేవాడు కాదు. బోస్ కు కాంగ్రెస్, గాంధీల పట్ల అంత నిబద్ధతలేదు. నెహ్రూ కాంగ్రెస్ గుంపులో ఉంటూనే కొన్ని సందర్భాలలో అలీనతను పాటించేవాడు. బోస్ పూర్తిగా ఒక వైపు ఒరిగిపోయేవాడు.  1923లోనే కాంగ్రెస్ ప్రో-ఛేంజర్స్గా, నో-ఛేంజర్స్గా చీలిపోయి, తన తండ్రి ప్రో-ఛేంజర్స్ శిబిరంలో చేరినా నెహ్రూ రెండు శిబిరాలకూ దూరంగా ఉండడం ఆయన అలీనతకు ఒక చిత్రమైన ఉదాహరణ. బోస్ రెండోసారి అధ్యక్షుడైనప్పుడు ఆయనతో అర్ధాంతరంగా రాజీనామా చేయించే ప్రయత్నాలలోనూ నెహ్రూ అలీనంగానే ఉండిపోయాడు. ఇంతకు ముందు పలు సందర్భాలలో తనూ, బోస్ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నా; కాంగ్రెస్ లో బోస్ ఒంటరి అయ్యే క్లిష్టపరిస్థితిలో మాత్రం ఆయన నోరు తెరిచి మద్దతు అడిగినా నెహ్రూ ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయాడు. అయితే, నెహ్రూ గతంలోనూ అలా అలీనంగా ఉండిపోయిన సందర్భాలున్నాయి కనుక, బోస్ అడ్డు తొలగించుకోడానికే మద్దతు ఇవ్వలేదని చటుక్కున నిర్ధారణకు రావడానికి వీల్లేదు. మొత్తంమీద నెహ్రూ-బోస్ సంబంధాలను పరిశీలిస్తే వారు విరోధించుకుని వీధికెక్కిన ఉదంతాలు లేవనే చెప్పవచ్చు.
అప్పటికి పద్దెనిమిదేళ్లుగా బోస్ తనతో మాటిమాటికీ విభేదిస్తున్నా, తన నాయకత్వం విఫలమైందని ప్రకటించినా ఆయనతో సర్దుబాటు చేసుకుంటూ రావడమే కాక; పట్టుబట్టి ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి చేసిన గాంధీ-- రెండో విడత ఆయన అధ్యక్షుడైనప్పుడు దింపేవరకూ ఎందుకు నిద్రపోలేదు? అలాగే, తనున్న క్లిష్టపరిస్థితిలో బోస్ నోరు తెరిచి మద్దతు కోరినా నెహ్రూ ఎందుకు ఇవ్వలేదు? ఇవీ ఇక్కడ వేసుకోవలసిన ప్రశ్నలు.
అంతర్జాతీయదృక్కోణాలు
ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలంటే జాతీయరాజకీయాలనుంచి అంతర్జాతీయరాజకీయాల్లోకి వెళ్ళాలి.
గాంధీ, నెహ్రూ, రాజగోపాలాచారి, బోస్ తదితరులకు తమవైన అంతర్జాతీయ దృక్కోణాలున్నాయి. గాంధీది బ్రిటిష్ పట్ల మిత్రవైరుధ్యమైతే, బోస్ ది శత్రువైరుధ్యమని చెప్పుకున్నాం. నెహ్రూ సోవియట్ యూనియన్ ను అభిమానించేవాడు. 1938-42 మధ్యకాలంలో యూరప్ లో సంభవించిన కల్లోలం భారత్ ను, తదనుగుణంగా జాతీయనాయకుల అంతర్జాతీయదృక్కోణాలనూ కూడా ప్రభావితం చేస్తూ వచ్చింది.  జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు కలగలిసిపోయిన సందర్భమది. 1938లో జర్మనీ(హిట్లర్), ఇటలీ(ముసోలినీ), బ్రిటన్, ఫ్రాన్స్ ల మధ్యజరిగిన మ్యూనిక్ ఒప్పందం చెకొస్లవేకియా విషయంలో హిట్లర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి అవకాశమిచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ ఆత్మగౌరవాన్ని హిట్లర్ కు తాకట్టు పెట్టిన ఒప్పందంగా దానిని గర్హించిన గాంధీ; చెక్, యూదు జాతీయుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు మద్దతు తెలిపాడు. ఇందుకు భిన్నంగా బోస్ ను జర్మనీ తెగువా’, ఇటలీ ఆత్మవిశ్వాసం ఆకట్టుకున్నాయి. బ్రిటిష్-కాంగ్రెస్ పొత్తును, కాంగ్రెస్ మంత్రివర్గాలను అంతమొందించి సామూహిక శాసనోల్లంఘన చేపట్టడానికి ఇదొక అవకాశంగా కనిపించింది. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నది అందుకే. ఆయనకు భిన్నంగా నెహ్రూ అన్ని రకాల ఫాసిస్ట్ శక్తులనూ వ్యతిరేకించే వైఖరి తీసుకున్నాడు.
బోస్ జర్మన్ సంబంధాలు
ఇదే సమయంలో బోస్ కలకత్తాలోని జర్మన్ కాన్సూల్ తో సంబంధం పెట్టుకుని ఏవో ఏర్పాట్లలో ఉన్నట్టు కేంద్ర గూఢచారి విభాగం వద్ద ఉన్న సమాచారాన్ని బొంబాయిలో న్యాయశాఖమంత్రిగా ఉన్న కె.ఎం. మున్షీ సంగ్రహించి గాంధీకి ఇచ్చాడు. ఇటలీ నియంత ముసోలినీపట్ల కూడా బోస్ ప్రశంసాభావంతో ఉన్నట్టు అప్పటికే ఆధారాలు కనిపించాయి. గాంధీకి ఇవి సహజంగానే కలవరం కలిగించాయి. హిట్లర్ కారణంగా యూరప్ మొత్తాన్ని యుద్ధ మేఘాలు ఆవరించడం, జర్మనీ-రష్యాల మధ్య సంధిజరగడం, హిట్లర్ సేనలు పోలండ్ లో అడుగుపెట్టడంతో జర్మనీతో బ్రిటన్ యుద్ధానికి దిగడం, భారతీయులు వేల సంఖ్యలో యుద్ధంలో చేరడం, 1941లో హిట్లర్ సోవియట్ యూనియన్ పై దాడి చేయగానే భారత్ లోని కమ్యూనిష్టులు కూడా బ్రిటన్ కు మద్దతు ఇవ్వడం వగైరా పరిణామాలు వరసగా జరిగిపోయాయి.
జపాన్ విస్తరణదాహం
ఇదే సమయంలో జర్మనీకి మిత్రరాజ్యంగా ఉన్న జపాన్, ఆసియా అంతటా కమ్ముకోవడం ప్రారంభించింది. చైనాపై దాడి చేసి, ఆ తర్వాత భారత్ లోకి కూడా చొచ్చుకువస్తున్నట్టు కనిపించింది. 1939-44 మధ్యకాలంలో జపాన్ విస్తరణదాహం మనదేశంలో పెద్ద చర్చనీయాంశంగా ఉంటూవచ్చింది. కాంగ్రెస్ సదస్సులలో తరచు ఇది చర్చలోకి రావడం, జపాన్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం, జపాన్ ను అహింసాయుతంగా ఎదుర్కోవాలని గాంధీ నొక్కి చెప్పడం జరుగుతూవచ్చాయి. 1942లో బ్రిటిష్ స్థావరమైన సింగపూర్ ను, రంగూన్ ను జపాన్ చేజిక్కుంచుకుని భారత్ గుమ్మంలోకి అడుగుపెట్టింది. బోస్ మద్దతుదారులు జపాన్ సేనలకు సహకరిస్తారన్న వదంతి గాంధీ చెవిన పడింది. జపాన్ కు వ్యతిరేకంగా అహింసాయుత ప్రతిఘటనను గాంధీ నొక్కిచెబితే; గెరిల్లా యుద్ధతంత్రాన్ని అనుసరించాలన్న వైఖరిని నెహ్రూ, కమ్యూనిష్టులు తీసుకున్నారు. తూర్పు బెంగాల్ మొదలైన చోట్ల భూదహనవిధానంతో జపాన్ సేనల్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. 
                                                                                (రేపు చివరి భాగం)
 

Sunday, September 27, 2015

సుభాష్ చంద్ర బోస్ వివాదం: చరిత్ర ఏం చెబుతోంది?

[27-9-2015, ఆదివారం సాక్షి దినపత్రిక ఫోకస్(10వ పేజీ)లో, 'బోస్ వివాదం...చరిత్ర ఏం చెబుతోంది?' అనే శీర్షికతో వచ్చిన  నా వ్యాసం ఇది. పెద్దది అవడంవల్ల మూడు భాగాలుగా బ్లాగ్ లో carry చేస్తున్నాను. మొత్తం వ్యాసాన్ని ఒకేసారి చదవదలచుకున్నవారు సాక్షిలో చదవచ్చు]

సుభాష్ చంద్రబోస్ విమానప్రమాదంలో నిజంగా మరణించారా అన్న చర్చ 1945 నుంచి ఇప్పటివరకూ మధ్య మధ్య తలెత్తుతూనే ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ చర్చ మరింత ఉధృతితో ముందుకొచ్చింది.  కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం, గాంధీ-నెహ్రూ వారసత్వాన్ని ప్రజల మనోఫలకం మీంచి పూర్తిగా తుడిచి పెట్టే ప్రయత్నాలు ఈ చర్చకు సరికొత్త రూపును, ఊపును ఇచ్చాయి. బోస్ దగ్గరి బంధువులు కొందరు గట్టిగా గళం విప్పారు. కేంద్రప్రభుత్వం వద్ద ఉన్న బోస్ తాలూకు రహస్యపత్రాలను బయటపెట్టాలన్న డిమాండ్ అలా ఉండగా, పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన వద్ద ఉన్న రహస్యపత్రాలను బయటపెట్టింది. నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాతి కాంగ్రెస్ ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ బంధువులపై, ఆయన నాయకత్వం వహించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యులపై నిఘా ఉంచిన సంగతిని అవి వెల్లడిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ పత్రాలలో ఏముందో వాటిని బయటపెడితే తప్ప తెలియదు. ఎన్నికలముందు వీటి వెల్లడికి హామీ ఇచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడంత ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినచ్చన్న వాదాన్ని సన్న సన్నగా వినిపిస్తోంది.
బోస్ మరణం లేదా అంతర్ధానం గురించి నడుస్తున్న చర్చమొత్తంలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. అది, నెహ్రూకు గురి పెట్టడం! నెహ్రూ, బోస్ ల మధ్య బద్ధశత్రుత్వం ఉండేదనీ, అధికారానికి తనతో బోస్ పోటీ పడతాడనే భయంతో నెహ్రూ ఆయన అడ్డు తొలగించుకునేందుకు కుట్ర చేశాడనే భావనను కలిగించే దిశగా చర్చ సాగుతోంది. నెహ్రూ కన్నా ఎక్కువ ప్రజాదరణ బోస్ కే ఉండేదనీ, బోస్ సజీవంగా దేశానికి తిరిగి వచ్చి ఉంటే నెహ్రూ అధికారపీఠం కదిలిపోయి ఉండేదనీ బోస్ బంధువులు కొందరు నొక్కి చెబుతున్నారు. ఇక మమతా బెనర్జీ బోస్ తాలూకు రహస్యపత్రాలను బయటపెట్టడం వెనుక బెంగాల్ ఆత్మగౌరవకోణాన్ని ఒడుపుగా వాడుకోవాలన్న ఆలోచన ఉండడంలో ఆశ్చర్యంలేదు.
అయితే, బోస్ ను నెహ్రూ తన అధికారానికి పోటీగా నిజంగానే భావించాడా; ఆయన కుట్రదారేనా అన్నది కచ్చితంగా తేల్చి చెప్పగల ఆధారాలు ఏవీ ఇంతవరకు మన ఎదురుగా లేవు. ఈ పరిస్థితిలో చర్చ మొత్తం కొన్ని కాంగ్రెసేతర పక్షాల రాజకీయ లక్ష్యాలూ, బోస్ బంధువుల భావోద్వేగ స్పందనల కలగలుపుగా మారి వాస్తవాలకు పూర్తిగా దూరమై ఊకదంపుడు చర్చగా పరిణమించే ప్రమాదం సహజంగానే ఉంటుంది. కనుక అటో ఇటో ఒరిగిపోవడం కాకుండా అసలు చరిత్ర ఏం చెబుతోందో తెలుసుకుని ఎవరికి వారు ఒక అభిప్రాయానికి రావడం ఒక మార్గం.  రాజ్ మోహన్ గాంధీ రాసిన గాంధీ జీవిత చరిత్ర మోహన్ దాస్ ఆధారంగా ఆ చరిత్ర ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
గాంధీ-బోస్
సుభాష్ చంద్ర బోస్ ది పాతికేళ్ళ(1920-1945) రాజకీయజీవితం. ఇందులో పద్దెనిమిదేళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నాడు. పటేల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి, కృపలానీ, అబుల్ కలామ్ ఆజాద్ లాంటి ఎందరో నాయకుల్లానే ఆయన కూడా మొదట్లో గాంధీ ప్రభావితుడే. సహాయనిరాకరణ సందర్భంలో స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెట్టాడు. గాంధీ ఆయనకు అప్పగించిన పని, మరో బెంగాల్ ప్రముఖ నాయకుడు చిత్తరంజన్ దాస్ కు కుడిభుజంగా ఉండడం. అయితే, గాంధీ అనుకూలుర శిబిరంలో బోస్ ఎప్పుడూ లేడు. 1923లో, మార్పుకు వ్యతిరేకులు(నో-ఛేంజర్స్), మార్పుకు అనుకూలురు(ప్రో-ఛేంజర్స్)గా కాంగ్రెస్ చీలిపోయినప్పుడు, గాంధీ మొగ్గు ఉన్న నో-ఛేంజర్స్ శిబిరంలో కాక, ప్రొ-ఛేంజర్స్ శిబిరంలో చేరి చట్టసభల్లో ప్రవేశాన్ని బోస్ సమర్ధించాడు.
బ్రిటిష్ పట్ల వైఖరిలో కూడా గాంధీ-బోస్ ల మధ్య విభేదాలున్నాయి. బ్రిటిష్ తో గాంధీది మిత్రవైరుధ్యమైతే బోస్ ది శత్రువైరుధ్యం. కాంగ్రెస్ చర్చల్లో, తీర్మానాల్లో గాంధీ కనబరిచే బ్రిటిష్ అనుకూల వైఖరులను బోస్ అడుగడుగునా అడ్డుకునేవాడు. అలాగే హింస-అహింసల విషయంలో కూడా అభిప్రాయభేదాలుండేవి. 1930లో వైస్రాయి ఇర్విన్ ప్రయాణిస్తున్న ప్రత్యేకరైలు కింద బాంబు పేలినప్పుడు దానిని ఖండించాలని గాంధీ ప్రతిపాదించగా బోస్ వ్యతిరేకించాడు. 1933లో శాసనోల్లంఘనకు పాల్పడి కాంగ్రెస్ ప్రముఖనేతలందరూ జైలుకెళ్లినప్పుడు, సర్దార్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ తో కలసి ఆస్ట్రియాలో ఉన్న బోస్, గాంధీ నాయకత్వం విఫలమైందంటూ అక్కడినుంచే ప్రకటన చేశాడు. అయితే, తనతో భావజాల విభేదాలున్న నెహ్రూతో అనుసరించినట్టే బోస్ తో కూడా గాంధీ సర్దుబాటు వైఖరిని అనుసరిస్తూ ఆయన కాంగ్రెస్ గొడుగు కింద కొనసాగేలా వీలైనంతవరకు జాగ్రత్తపడేవాడు. 
1936లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన లక్నో కాంగ్రెస్ సందర్భంలో వర్కింగ్ కమిటీ ఎంపిక బాధ్యతను తనకు అప్పగించినప్పుడు కొందరు సోషలిష్టు నాయకులతోపాటు బోస్ పేరును కూడా గాంధీ చేర్చాడు. 1938లో నెహ్రూ స్థానంలో ఎవరిని అధ్యక్షుని చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, పటేల్ గట్టిగా వ్యతిరేకించినాసరే బోస్ నే చేసితీరాలని గాంధీ పట్టుబట్టి నెగ్గించుకున్నాడు. అయితే, ఇంతకుముందు నెహ్రూ వరసగా రెండు విడతలు అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక, తనకు కూడా మరో విడత అవకాశమివ్వాలని బోస్ అన్నప్పుడు గాంధీ వ్యతిరేకించి, మొదట ఆజాద్ ను; ఆయన తప్పుకోవడంతో భోగరాజు పట్టాభి సీతారామయ్యను ముందుకు తెచ్చాడు. ఆ ఎన్నికలో బోస్ నెగ్గినప్పుడు ఖిన్నుడైన గాంధీ పట్టాభి ఓటమి నా ఓటమి అని ప్రకటించాడు. గాంధీ ఆ తర్వాత పటేల్, రాజగోపాలాచారి తదితరులను ప్రయోగించి బోస్ రాజీనామా చేసే పరిస్థితిని కల్పించాడు. బోస్ కాంగ్రెస్ జీవితానికి దానితో తెరపడింది. 1939లో బోస్ కు గాంధీ ఉత్తరం రాస్తూ, “ఇప్పుడు నా నుంచి నువ్వు దూరమైనా; నేను చేసింది న్యాయమూ, నా ప్రేమ స్వచ్ఛమూ అయితే ఎప్పటికైనా మళ్ళీ నా దగ్గరికి వస్తావు” అన్నాడు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు.
పటేల్-బోస్
మితవాదులుగా పటేల్, రాజగోపాలాచారిల మధ్య భావసారూప్యత ఉండేది. ఇద్దరూ నెహ్రూ, బోస్ ల సోషలిజాన్ని,  రాడికలిజాన్ని వ్యతిరేకించేవారు. ఆపైన బోస్ నిలకడలేని మనిషన్న అభిప్రాయం పటేల్ కు ఉండేది. పటేల్, రాజగోపాలాచారి మొదట్లో నో-ఛేంజర్స్ శిబిరంలో ఉంటే; ప్రో-ఛేంజర్స్లో శిబిరంలో మోతీలాల్, చిత్తరంజన్ దాస్, బోస్ లతోపాటు పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ ఉండేవాడు. బోస్ తో ఆస్ట్రియాలో ఉన్నప్పుడే విఠల్ భాయ్ కన్నుమూశాడు. తన అన్నను బోస్ తప్పుదారి పట్టించాడన్న కోపం పటేల్ కు ఉండేది. బోస్ ను కాంగ్రెస్ అధ్యక్షుని చేయాలన్న గాంధీ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించినా గాంధీ పట్టుబట్టడంతో ఎప్పటిలా శిరసావహించాడు. 
                                                                                                                                 (రేపు 2వ భాగం)

Friday, September 18, 2015

స్లీమన్ కథ-10: భారత్ ను చూసి భయపడ్డాడు!

భార్య ఎకతెరీనాతో అన్యోన్యక్షణాలు మళ్ళీ వెనకబెట్టాయి. ఎప్పటిలా ఎడమొహం, పెడమొహం. వాళ్ళ కాపురం చాలావరకూ భోజనం బల్లకు, ముక్తసరి మాటలకు పరిమితమవుతోంది. అయినా 1858లో రెండో సంతానం కలిగింది. ఈసారి ఆడపిల్ల, పేరు నతాల్య.  భార్యనుంచి దూరంగా పారిపోవాలన్న తహతహ ఆ ఏడాది వేసవిలో అతన్ని మరీ ఊపిరాడనివ్వకుండా చేసింది. మళ్ళీ సంచారానికి సిద్ధమయ్యాడు. ఈసారి తను చూడాలనుకున్న దేశాలన్నీ చూసిరావాలనుకున్నాడు.
( పూర్తి రచన  'భారత్ ను చూసి భయపడ్డాడు...' శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/09/18/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%AD%E0%B0%AF%E0%B0%AA%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-%E0%B0%9A/ లో చదవండి)

Sunday, September 13, 2015

స్లీమన్ కథ-9: విధ్వంసం అంచుల దాకా వెళ్ళాడు!

1854 శిశిరంలో ఏమ్ స్టడామ్ లో జరిగిన నీలిమందు వేలంలో పాల్గొని అతను రష్యాకు తిరిగొస్తున్నాడు. అప్పుడే క్రిమియా యుద్ధం బద్దలైంది. రష్యన్ రేవులను దిగ్బంధం చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరాల్సిన సరకును నౌకల్లో కోనిగ్స్ బర్గ్ కు, మేమల్ కు తరలించి అక్కడినుంచి భూమార్గంలో పంపిస్తున్నారు. ఏమ్ స్టడామ్ లో ఉన్న స్లీమన్ ఏజెంట్ నీలిమందు నింపిన వందలాది పెట్టెల్ని, భారీ పరిమాణంలో ఉన్న ఇతర సరకుల్ని నౌకలో మేమల్ కు పంపించాడు.
(పూర్తి రచన 'గ్రీకు మద్యం సేవించి మత్తెక్కిపోయాడు' శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/09/13/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A4%E0%B1%8D/ లో చదవండి)

Thursday, September 3, 2015

స్లీమన్ కథ-8: విషాదం మిగిల్చిన వివాహం

గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, అష్ట్రఖాన్ కాలర్ తో లాంగ్ కోటు, తార్తార్ తరహా మీసకట్టు, చేతిలో నల్లమద్దికర్రతో చేసిన బెత్తం…విజయశిఖరాలకు ఎగబాకిన ఒక వ్యాపారవేత్తకు ముమ్మూర్తులా సరిపోయే వేషం అతనిది!
[అష్ట్రఖాన్ కాలర్:  నైరుతి రష్యాలో, ఓల్గా డెల్టాలోని ఒక నగరం అష్త్రఖాన్. ఇక్కడి ‘కేరకుల్’ గొర్రెలు మంచి బిగువైన, వంకీలు తిరిగిన ఉన్నికి ప్రసిద్ధి. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉన్న గొర్రెనుంచి తీసిన ఉన్ని మరింత శ్రేష్ఠం.  పిండదశలో ఉన్నప్పుడే ఉన్ని తీయడమూ జరుగుతుంటుంది. అలాంటి ఉన్నితో చేసిన కాలర్ ను అష్ట్రఖాన్ కాలర్ అంటారు. ఆ కాలర్ తో కోటు ధరించడాన్ని సంపన్నవర్గాలు హోదాకు, ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తాయి]
(పూర్తి రచన  'వివాహం జరిగింది...విషాదం మిగిలింది' శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/09/03/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%82-%E0%B0%9C%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82-%E0%B0%AE/ లో చదవండి)