Thursday, January 10, 2013

అక్బరుద్దీన్ కేసు: మెజారిటీ ప్రజల ప్రేక్షకపాత్ర ఎంతకాలం?

"ధర్మరాజు తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా?" అని కౌరవసభలో శత్రుపక్షానికి చెందిన ద్రౌపది అడిగిన ప్రశ్న న్యాయమేనన్నవాడు మహాభారతంలో వికర్ణుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. రెండు పక్షాలు కలబడుతున్నప్పుడు మధ్యలో నలిగి చచ్చేవి  న్యాయమూ ధర్మమేనని ఆనాడే నిరూపించిన పాత్ర వికర్ణుడు.

ఇప్పుడూ అదే జరుగుతోంది.

న్యాయ, ధర్మాలు, నిష్పాక్షికత  అనే ఒక తటస్థస్థితినుంచి నేటి ఆధునిక ప్రజాస్వామిక భారతీయ సమాజమూ దూరంగా జరిగిపోతోంది. రాజకీయాలు మతీకరణ చెందుతున్నాయి. మతాలు రాజకీయీకరణ చెందుతున్నాయి. బుద్ధిజీవులు రాజకీయీకరణ చెందుతున్నారు. నిజానికి న్యాయస్థానాలు, చట్టాలు అనేవి ఉన్నది సమాజంలో తటస్థభూమికను పోషించడానికే. అవి మనదేశంలో మనం తెచ్చుకున్న లౌకిక, ప్రజాస్వామిక రాజ్యాంగనిర్దేశాలను అమలు చేస్తాయి. రాజ్యాంగం కూడా తటస్థ ప్రాతిపదికపై రూపొందినదే. అది కుల, మత, ప్రాంత, భాషా, లింగ భేదాలకు అతీతంగా ఒక సమక్రీడాస్థలి(లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్)ని ఏర్పాటుచేసింది.

విచిత్రం, అంతకంటే విషాదం ఏమిటంటే, మనం చాలా వివాదాల సందర్భంలో తటస్థ రాజ్యాంగం ఉనికినీ, దాని వెలుగులో అవతరించిన చట్టాల ఉనికినీ మరచిపోతుంటాం. 1950(రాజ్యాంగం అవతరించిన సంవత్సరం)కి వెనకటి కాలంలోకి వెళ్ళిపోయి, అప్పటి వివాదాలను, అంతకంటే చాలాముందునుంచీ ఉన్న వివాదాలను 2013లోకి కూడా తీసుకొస్తుంటాం. ఆనాటి మైండ్ సెట్ తో మాట్లాడుతూ ఉంటాం. చట్టాలను చేతుల్లోకి తీసుకుంటుంటాం. అలా తీసుకోవడాన్ని సమర్థిస్తుంటాం. ఎవరో నిరక్షరులు సమర్థించడం కాదు, బుద్ధిజీవులు అనబడేవారు కూడా.

అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటనలు చేసినవారు, రోడ్లమీద ప్రదర్శనలు చేసినవారు; అక్బరుద్దీన్ లానే మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఇతరుల మీద కూడా చర్య తీసుకోవాలని అనడం లేదు. చర్య తీసుకోవలసిన అవసరం లేదా అని అడిగితే జవాబు దాటవేస్తున్నారు. ఒకవేళ వారిపై కూడా చర్యకు సిద్ధమైతే అందుకు వ్యతిరేకంగా వీరే మరోసారి రోడ్ల మీద నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతారు. అంటే ఏమిటన్న మాట? అక్బరుద్దీనా, ఇంకొకరా అన్నదానితో నిమిత్తం లేకుండా చట్టాన్ని అమలు చేయాలన్న మాట ఆ పక్షం నుంచీ, ఈ పక్షం నుంచీ కూడా వినిపించడం లేదు. రెండూ చట్టం ఉనికిని గుర్తించడం లేదు. లేదా చట్టాన్ని సెలక్టివ్ గా అమలు చేయాలని కోరుకుంటున్నాయి.

చట్టం ఉనికిని గుర్తించని ఈ దేశంలో, చట్టాన్ని సెలక్టివ్ గా అమలు చేయాలని కోరుకునే ఈ దేశంలో మరో పక్క ఉన్న చట్టాలు చాలవనీ, కఠిన చట్టాలు తేవాలనే డిమాండ్ వినిపిస్తోంది! ఎంత తమాషా!

ఒక హిందుత్వ అభిమాని నాతో మాట్లాడుతూ ప్రవీణ్ తొగోడియా, వరుణ్ గాంధీ లాంటివారు అక్బరుద్దీన్ అంత తీవ్రమైన ప్రసంగాలు చేస్తే చర్య తీసుకోవచ్చునన్నాడు. 'తీవ్రత'ను ఎలా అంచనా వేయాలి? ఎవరు అంచనా వేయాలి? నిజంగానే వారిపై చర్య తీసుకోవడమే జరిగితే, వారు అక్బరుద్దీన్ అంత 'తీవ్రం'గా మాట్లాడలేదు కనుక చర్య అన్యాయమని మళ్ళీ వారి అనుకూల వర్గాలే రోడ్ల మీదికి వస్తాయి. షరా మామూలుగా చట్టాల ఉనికి మరోసారి గల్లంతు అయిపోతుంది.

ఆ హిందుత్వ అభిమానే మరో మాట అన్నాడు. ముంబైలో ముస్లిం లు రోడ్ల మీద సామూహికంగా నమాజు చేసుకోడాన్ని బాల్ థాక్రే వ్యతిరేకించారట. దానికి పోటీగా రోడ్ల మీద దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారట.

"రోడ్ల మీద నమాజు వల్ల వాహనదారులకు, పాదచారులకు, ఇళ్ళలో వారికి ఇబ్బంది కలుగుతుంటే ఆ ఇబ్బంది తొలగించమని కోరుతూ చట్టాలను ఆశ్రయించాలి కానీ పోటీ కార్యక్రమం వల్ల ఇబ్బంది ఎలా తొలగుతుంది?" అని అడిగాను.

 "ముస్లిం సంతుష్టీకరణ విధానాలను అనుసరించే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేస్తుందా?" అని ఆయన అడిగాడు.

"అప్పుడు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయాలి. అంతే కానీ, చట్టం ఉనికిని అవతలివారు కూడా విస్మరించి పోటీ కార్యక్రమం నిర్వహించడం సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది?" అని అడిగాను.

ఒకవేళ ముస్లిం ల కంటే ముందే ఎవరైనా  రోడ్ల మీద దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తే దానిపై కూడా థాక్రే, ఆయన భావజాలాన్ని సమర్థించే వారి స్పందన ఇలాగే ఉంటుందా?! ఉండదని చెప్పడానికి ఎవరూ సందేహించనవసరం లేదు. పొద్దుటే గుళ్లలో లౌడ్ స్పీకర్లు, రోడ్లమీద అయ్యప్ప భజనలు, గణేశ ఉత్సవాల పందిళ్ళు, బాణాసంచా పేలుళ్లు వగైరాలు వీరికి అభ్యంతరకరం కావడంలేదు. ముస్లింల నమాజే ఎందుకు అభ్యంతరకరం అవుతోంది? రెండిటినీ కూడా అసౌకర్య కోణం నుంచే చూసి నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరే సివిక్ సెన్స్ ఎందుకు లోపిస్తోంది?

తటస్థ రాజ్యాంగం వెలుగులో చట్టాలు చర్యకు ఉపక్రమించే లోపలే అటు వారూ, ఇటువారూ కూడా చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం జరిగిపోతోంది. శాంతియుత, సామరస్య జీవనానికి కొన్ని తరాలపాటు మాపుకోలేని నష్టం జరిగిపోతోంది. ఎవరూ రాజ్యాంగం ఉనికినీ, చట్టాల ఉనికినీ గుర్తించడంలేదు. స్వతంత్ర ప్రజాస్వామిక భారతం అవతరించడానికి ఎంతో ముందునాటి చారిత్రక కక్షలనూ కార్పణ్యాలనూ తీర్చుకోడానికి అటూ ఇటూ కూడా ఉన్న అల్పసంఖ్యాకులు మొత్తం సమాజాన్నే యుద్ధరంగంగా మార్చివేయడం జరుగుతోంది. దీనికి మెజారిటీ ప్రజానీకం ఇలా నిశ్శబ్ద ప్రేక్షపాత్ర చిత్తగించడం ఎంతకాలం?

మతవిద్వేషాలను రాజకీయ పెట్టుబడిగా మలచుకునే శక్తుల వెనుక గుడ్డిగా జెండాలు మోసే వెట్టి చాకిరీ నుంచి విముక్తులై జనాలు రాజ్యాంగం వెలుగులో చట్టబద్ధ పాలనను కోరే ఒక మెజారిటీ పార్టీగా ఎప్పటికీ అవతరిస్తారు?!
                                                                ***
సంబంధిత పోస్ట్: అక్బరుద్దీన్ కేసు: చట్టం తన పని తాను చేస్తోందా?





Wednesday, January 9, 2013

హైదరాబాద్ కాకపోతే బెంగళూరు!...రెండో రాజధాని అవసరమే

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయడం వల్ల కలిగే లాభనష్టాలను విశ్లేషిస్తూ ఈ రోజు(9-1-13)ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్తావ్యాసం నన్ను ఆకర్షించింది. అయితే, అది 'తెలంగాణ' నేపథ్యంలో రాసినది. అందులోకి వెళ్ళను. దక్షిణభారతంలో రెండో రాజధాని అవసరమా, కాదా  అన్న అంశానికే పరిమితమవుతాను.

నా ఉద్దేశంలో దక్షిణాదిలో ఒక జాతీయ రాజధాని ఉండడం అవసరం. ఉత్తర,దక్షిణాలకు మధ్యలో ఉంది కనుక అందుకు హైదరాబాద్ ఎక్కువ అనుకూలం కావచ్చు. అది కాదనుకుంటే రెండో పక్షంగా బెంగళూరును, మూడో పక్షంగా చెన్నైని పరిశీలించవచ్చు.

దక్షిణాదిలో ఒక జాతీయ రాజధాని ఉండాలనడానికి నా కారణాలు ఇవీ:

1. రాజధాని నగరమంటే  ప్రభుత్వశాఖలు; మంత్రులు, అధికారుల నివాసాలు, దౌత్యకార్యాలయాలు వగైరాలకు వసతులు, హంగులు సమకూర్చే ఒక భౌగోళిక ప్రదేశం అనుకుంటారు.  రాజధాని అంటే రాజకీయాధికారం కేంద్రీకృతమయ్యే చోటని కూడా అనుకుంటారు. ఇవి నిజమే కానీ మరికొన్ని నిజాలు కూడా ఉన్నాయి. రాజధాని అనేది  భౌగోళికప్రదేశం మాత్రమే కాదు,  మానసిక ప్రదేశం కూడా.  ఇంకాస్త తేలికగా చెప్పాలంటే రాజధానికి దేహమే కాక ఆత్మ కూడా ఉంటుంది.  కనిపించే రూపమే కాక కనిపించని వ్యక్తిత్వం కూడా ఉంటుంది. రాజకీయ అధికారంతోపాటు, ఒక జాతికి లేదా ఒక జనసమూహానికి చెందిన సమకాలీన సాంస్కృతిక ధోరణులు, మేధో వ్యాసంగాలు, వైజ్ఞానిక సంస్థలు, మీడియా కూడా రాజధానిలో కేంద్రీకృతమై దానికి  ఆత్మను, వ్యక్తిత్వాన్ని కల్పిస్తుంటాయి. ఇవి దేశం మొత్తాన్నే కాక, తమ దగ్గరలో ఉన్న రాజకీయాధికారాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉంటాయి. రాజకీయాధికారం విధాన నిర్ణయాలు చేయడానికి తోడ్పడే మేధో వనరులు వీటి ద్వారా కూడా అందుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని అనేది అధికార కేంద్రమే కాక ఆలోచనా కేంద్రం కూడా.

2. ఇటువంటి జాతీయ రాజధాని దేశం మొత్తానికి ఇప్పుడు ఢిల్లీ ఒక్కటే ఉంది. జాతీయ స్థాయినుంచి ఒకసారి దేశాన్ని చూడండి... భారతదేశం అంటే ఉత్తరభారతం మాత్రమే నన్న అభిప్రాయం మీకు కలిగితీరుతుంది. ఉత్తరభారతం  ప్రస్ఫుటంగా కనిపించే సింహం ముఖం లానూ, దక్షిణభారతం సన్నని తోక లానూ కనిపిస్తాయి. ఉత్తరభారతం వెలుగులో ఉన్నట్టు, దక్షిణభారతం చీకటి ఖండంలానూ కనిపిస్తాయి(ఈశాన్య భారతానికి కూడా ఈ తేడా  వర్తిస్తుంది కానీ ప్రస్తుతానికి దక్షిణభారతం గురించే మాట్లాడుకుందాం).  ఎంతో వైవిధ్యం ఉన్న ఈ సువిశాలభారతదేశం మొత్తాన్ని శాసించే జాతీయరాజకీయాధికారం మొత్తం ఢిల్లీలోనే కేంద్రీకృతమైంది. దానితోపాటే జాతీయరాజకీయ కార్యకలాపాలు, విధాన కల్పన వనరులు, మీడియా సహా అన్నీ ఢిల్లీలోనే కేంద్రీకృతమయ్యాయి. ఢిల్లీలో పాతుకుపోయినవాళ్ళే దేశచక్రం తిప్పుతుంటారు. దేశం అజెండాను వాళ్ళే రూపొందిస్తుంటారు. దేశం నాడి వాళ్ళకే బాగా తెలుస్తుంది. జాతీయస్థాయి అవగాహనే కాక, జాతీయ నుడికారం(నేషనల్ ఇడియం)పై పట్టు వాళ్ళకే ఉంటుంది. దక్షిణాదికి వస్తున్నకొద్దీ ఇది పలచబడి పోతుంది. ఏ విషయంలోనైనా సరే ఢిల్లీ గుండె చప్పుడు దక్షిణాది గుండెల్లో ధ్వనించడానికి ఎన్నో 'వింధ్యపర్వతాలు' అడ్డుపడుతుంటాయి. దక్షిణాది నాయకులు ఉత్తరాది నాయకుల వెనుక తద్దినం పెట్టేవాడి తమ్ముడి పాత్రనే సాధారణంగా పోషిస్తుంటారు తప్ప జాతీయ అజెండా కూర్పులో చురుకైన భాగస్వాములు కాలేరు. అలాగే దక్షిణాది ప్రజలు కూడా.

3. మీడియా గురించే చూద్దాం. జాతీయ మీడియాలో ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలు ఫోకస్ అయినంతగా దక్షిణ భారత రాష్ట్రాలు కావు. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలలోని మామూలు ఘటనలు కూడా జాతీయ మీడియా లో విశేష వార్తలు అవుతుంటాయి. దక్షిణభారత రాష్ట్రాలలోని చెప్పుకోదగిన ఘటనలు కూడా సింగిల్ కాలం వార్తలవుతుంటాయి. ఎప్పుడోకానీ అక్బరుద్దీన్ వ్యవహారం లాంటివి జాతీయమీడియాలో ప్రాధాన్యం పొందవు.  చిన్న రాష్ట్రమైన ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ జాతీయస్థాయి కల ఢిల్లీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఫోకస్ అయినంతగా యూపీ లాంటి  పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి ఫోకస్ అయ్యే అవకాశమే లేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయం చెప్పనే అవసరం లేదు. సామీప్యం కూడా ఇందుకు ఒక కారణం. ఉదాహరణకు, మన రాష్ట్రంలో హైదరాబాద్ లోనే మీడియా కేంద్రీకృతం అయినందువల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితిని గమనించండి. ఇందులో హైదరాబాద్, దాని చుట్టుపక్కల వారే ఎక్కువ ఫోకస్ అవుతారు. వారి గొంతే గట్టిగా వినిపిస్తుంది. చిన్న నాయకులకు కూడా పెద్ద  ప్రచారం లభిస్తుంది. రాష్ట్రానికి ఆ చివర ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ నేతల గొంతు కూడా మీడియాలో వినిపించదు. ఇదే పరిస్థితిని ఢిల్లీలోని జాతీయమీడియాకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్వయించి చూడండి.

4. ఉత్తర/దక్షిణాల మధ్య అందరూ తేలిగ్గా గుర్తించగలిగిన ఒక వ్యత్యాసం, దేశ ప్రధానమంత్రిత్వం  ఉత్తరాదివారి అప్రకటిత హక్కుగా చలామణి అవుతుండడం.  ఈ అరవై ఏడేళ్ళ స్వతంత్ర ప్రజాస్వామ్య భారతంలో దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అయి అయిదేళ్లూ అధికారంలో ఉండగలిగింది పీవీ నరసింహారావు ఒక్కరే(దక్షిణాది నుంచి రెండో ప్రధాని దేవెగౌడ గురించి పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు). అటువంటి పీవీ కి ఢిల్లీలో స్మృతి నిర్మాణం చేయకుండా హైదరాబాద్ కు తరిమేసిన దందా ఉత్తరాదివారిది. అయినా సరే, దక్షిణాది వారికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం భారతదేశంలో వారి బలహీనమైన ఉనికికి నిదర్శనం.

5. కనుక ఉత్తర, దక్షిణాల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు తగ్గాలంటే, దక్షిణాదిన రెండో రాజధాని ఉండవలసిందే. అప్పుడే జాతీయ అజెండా రూపకల్పనలో చురుగ్గా పాల్గొనే అవకాశం దక్షిణాదివారికి కూడా లభిస్తుంది. దక్షిణాదివారి గొంతు జాతీయస్థాయిలో వినిపిస్తుంది. ఇంకో చిత్రం గమనించండి...విద్య, విజ్ఞానం, మానవాభివృద్ధి, పురోగమనం మొదలైన అనేక విషయాలలో ఎన్నో ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాది రాష్ట్రాలే మెరుగ్గా ఉంటాయి. కానీ ఎన్నో వెనుక బడిన రాష్ట్రాలు ఉన్న ఉత్తరాదిన దేశ రాజధాని ఉంది. ఫలితంగా ఆయా రంగాలలో  దక్షిణాది రాష్ట్రాల పురోగమన అనుభవాన్ని దేశం మొత్తం పంచుకునే అవకాశం లోపించింది. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడినప్పుడు ఆ అవకాశం కలుగుతుంది.

6. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. దక్షిణాదిన అఖిల భారత ప్రసిద్ధి కలిగిన విశ్వవిద్యాలయం ఒక్కటీ లేదు. ఇందుకు భిన్నంగా ఢిల్లీలో జేఎన్ యూ లాంటివి ఉన్నాయి. దేశానికి అవసరమైన థింక్ ట్యాంక్ జేఎన్ యూలోనే  తయారవుతుందని కూడా అంటారు. రాజధానిలో ఉండడమే అందుకు కారణం. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడితే, అందుకు తగిన స్థాయిలో ఉన్నత విద్యాసంస్థలూ అభివృద్ధి చెందుతాయి.

7. దక్షిణాదిన రాజధాని అవతరిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్య రాకపోకలు అనూహ్యంగా పెరుగుతాయి. దక్షిణాది భాషల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఒక భాషా సాహిత్యం ఇంకో భాషలోకి తర్జుమా అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సినిమా, నాటకం తదితర కళారూపాల మధ్య సామీప్యం, పరస్పర ప్రభావం ఇనుమడిస్తాయి. ఉత్తర, దక్షిణాల మధ్యా  సాన్నిహిత్యం పెరుగుతుంది.  కళా, భాషా, సాహిత్య, సాంస్కృతిక, ఆలోచనా  సమ్మేళనం ప్రజల ఆలోచనా సరళిపై ఆరోగ్యకరమైన ప్రభావం చూపుతుంది. సమైక్యతకు దోహదం చేస్తుంది.


Sunday, January 6, 2013

వర్ణవ్యవస్థకు మూలం ఆర్యులా, సింధు నాగరికులా?


(ఆర్యులు, ద్రావిడుల గురించి చాలా రకాల ఊహలు, లేదా అపోహలు వాస్తవాలుగా ప్రచారం పొందుతున్నాయని కొందరు ప్రామాణిక చరిత్రకారుల రచనలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అలాంటి ఊహల మీద ఆధారపడి రాసిన ఒక వ్యాసంపై నా స్పందన ఇది. ఇటువంటి అంశాలపై ఆసక్తి గల పాఠకుల కోసం దీనిని  పోస్ట్ చేస్తున్నాను. స్పందననూ ఆహ్వానిస్తున్నాను. ఆర్యులు, ద్రావిడుల గురించి ఉన్న ఇతరేతర వాదాలు, వివాదాలలోకి మరీ అంత లోతుగా వెళ్లకుండా  ఈ వ్యాసానికి పరిమితమై స్పందిస్తే బాగుంటుందని మనవి) 

సింధు నాగరికత- ఆర్యులు- ద్రావిడులు- హిందూ ధర్మం- వర్ణవ్యవస్థ మొదలైన వాటి గురించి చాలాకాలంగా చాలా రకాల ఊహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఊహల మీద ఆధారపడి కొన్ని రాజకీయపక్షాలు పనిచేస్తున్నాయి. ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ ఊహలనుంచి స్ఫూర్తిని పొంది, ‘ప్రస్తుత బహుజనుల ఉద్యమాలకు చేయూతనివ్వడం’ లక్ష్యంగా ‘మూలవాసీ సమూహాల చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను పునర్నిర్మించుకునే’ ప్రయత్నానికి కొందరు పూనుకుంటున్నారు(‘సింధు’ స్ఫూర్తి ఆవాహన, ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 2 వ్యాసం).

‘ఊహల మీద ఆధారపడి’ అని ఎందుకు అంటున్నానంటే, గార్డన్ చైల్డ్, డీ.డీ. కోశాంబి, జోసఫ్ క్యాంప్ బెల్, ఇర్ఫాన్ హబీబ్, (పై వ్యాసకర్తలు పేర్కొన్న) రొమీలా థాపర్ వంటి ప్రామాణిక చరిత్రకారులు, పురాసంస్కృతీ, మత విశ్లేషకుల రాతలు పై ఊహలను సమర్థించడంలేదు. సమర్థించకపోగా వాటికి పూర్తి భిన్నమైన అభిప్రాయాలను అందిస్తున్నాయి.

 పై వ్యాసంలోని ఊహలను ప్రస్తావించుకుని, ప్రామాణిక అధ్యయనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం:

1   .  ‘ఈ దేశ మూలవాసులు ద్రావిడులు. వారు అద్భుతమైన సింధు నాగరికతను సృష్టించారు’:  
ద్రావిడులు ఈ దేశ మూలవాసులు అనే ముందు ఈ వివరాలు దృష్టిలో ఉంచుకోవాలి. సింధు శిథిలాలలో కొన్ని అస్థిపంజరాలు దొరికాయి. అవి ప్రోటో-ఆస్ట్రలాయిడ్, మెడిటరేనియన్(మధ్యధరాప్రాంత) కవళికలను సూచించాయి. ప్రోటో-ఆస్ట్రలాయిడ్ కవళికలు దక్షిణ, మధ్యభారతాలలోని ఆదివాసులలోనూ; హిందూ సమాజంలోని ‘వెలి కులాల’లోనూ కనిపిస్తాయి. ఇక మెడిటరేనియన్ కవళికల జనం స్పెయిన్, పోర్చుగల్, మడగాస్కర్ మొదలుకుని భారత్ వరకూ వ్యాపించి పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. క్రీ. పూ. 7500-5500 నాటికే ఈ జాతివారు పాలస్తీనాలో ఉన్నారు. ఉత్తరభారతంలోనూ, ఇతర చోట్లా ఉన్నత సామాజిక వర్గాలలో ఈ కవళికలవారే అధికసంఖ్యాకులు. మొహంజదారో తవ్వకాలలో బయట పడిన ఒక ఆకృతిని పురోహితుడిగా గుర్తించారు. ఇతడిలో మెడిటరేనియన్ కవళికలు ఉన్నాయి. ఇప్పటికీ పురోహితులు దాదాపు ఇతని ఆహార్యాన్నే అనుకరిస్తున్నారు. ఇటువంటి పురోహితుని ఆకృతులే సుమేరియా, మెసపొటేమియా శిల్పాలలోనూ కనిపిస్తాయి. పశ్చిమాసియాలో తొలినాటి వ్యవసాయ జనావాసాలు అంతటా మెడిటరేనియన్ జనం వ్యాపించి ఉండేవారు. చరిత్రపూర్వకాలంలోనే మెడిటరేనియన్ జనం పశ్చిమం నుంచి భారత్ కు వలస వచ్చినట్టు కనిపిస్తుంది. ఆర్యులు భారత్ లోకి అడుగుపెట్టేనాటికే ఈ వలస సంభవించింది. కొంతవరకు ఆర్యులు వీరిని తమలో కలుపుకోవడమూ జరిగింది(ఓరియంటల్ మైథాలజీ: జోసఫ్ క్యాంప్ బెల్). కనుక ప్రోటో-ఆస్ట్రలాయిడ్ జనమే మూలవాసులు అనడానికి అవకాశముంది. వారినీ, మెడిటరేనియన్ వలస జనాన్నీ కలుపుకుని ద్రావిడులు అనదలచుకుంటే, ద్రావిడులలో కొందరే మూలవాసులు, అందరూ కాదు. ‘ద్రావిడులు అద్భుతమైన సింధు నాగరికతను సృష్టించారు’ అనేటప్పుడు జాగ్రత్త పాటించాలి. పట్టణాలు, తీర్చిదిద్దిన వీథులు, గృహాలు, స్నానశాలలు, మురుగునీటిపారుదల వ్యవస్థ వగైరాలు ఉండడం వరకూ అది అద్భుతమే. కానీ చాలా విషయాల్లో అది అద్భుతమూ కాదు, ‘స్ఫూర్తి’ని పొందవలసింది అంతకంటే కాదు. ఏమైనా అది వస్తుగత దృష్టినుంచి చూడవలసిన ఒక చారిత్రక వాస్తవికత.

2.   ‘ఆర్యులు సింధు నాగరికతను అంతమొందించారు’:  
ఈ మాట భారతదేశ చరిత్రా, సమాజాల గురించి కనీస అధ్యయనాన్ని, అవగాహనను కూడా ప్రతిబింబించదు. ఈ దేశంలో ఏదీ ఇంకొక దానిని అంతమొందించిన దాఖలా లేదు. బౌద్ధం సంగతేమిటని అనచ్చు. బౌద్ధ తాత్వికతలోని కొన్ని అంశాలను హైందవం లీనం చేసుకున్న సంగతి తెలిసినదే.  బౌద్ధం బహుశా ఈ దేశ స్వభావానికి భిన్నంగా వ్యవస్థీకృత, ఏకశిలాసదృశ మతాన్ని ప్రతిపాదించడం భారత్ లో దాని ఉనికి పలచబడడానికి కారణం కావచ్చు. చరిత్ర పొడవునా ఇక్కడ జరిగింది భిన్న విశ్వాసాలు, ఆచారాల మధ్య అతుకు పెట్టడం; ఒకదానినొకటి లీనం(ఎసిమిలేషన్) చేసుకోవడమే. దీని గురించి విస్తారంగా చర్చించిన కోశాంబి, ఈ దేశ భౌగోళిక అమరికే అందుకు కారణమని అంటాడు. ‘సంథింగ్ వర్సెస్ సంథింగ్’ కు ఈ దేశంలో అవకాశం తక్కువ. ఈ కోణంనుంచి చెప్పుకోవలసిన అంశాలు అనేకం ఉన్నాయి.

3.      ‘సింధు నాగరికతలో వర్ణవ్యవస్థ లేదు, ఆర్యులు వర్ణవ్యవస్థను ప్రవేశపెట్టారు. సింధు నాగరికతలో పూజారివర్గానికి ప్రత్యేకస్థానం లేదు’:  
చరిత్రకారులు, పురామానవశాస్త్రజ్ఞుల పరిశీలనలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వర్ణవ్యవస్థ(కనీసం బీజరూపంలోనైనా) ఉన్నది సింధు నాగరికతలోనే. ఆర్యులలో మొదట వర్ణవ్యవస్థ లేనేలేదు. వారు సింధు నాగరికత నుంచే వర్ణవ్యవస్థ నమూనా తెచ్చుకున్నారు. దానిని మరింత అభివృద్ధి చేసి వాడుకున్నది మాత్రం వారే. కోశాంబి ప్రకారం, ఆర్యులు పురుషపరంపరకు చెందినవారు. పురుషదేవతారాధకులు. స్త్రీ దేవతలు చాలా తక్కువ. జన్యు, ఆకృతుల రీత్యా ఆర్యులు ఒకే కుదురువారు కారు. అనేక తెగలను తమలో కలుపుకున్నారు. వారికి జాతిస్వచ్ఛత గురించి పట్టింపు లేదు.   వారికి ప్రత్యేకమైన పురోహితవ్యవస్థ కూడా లేదు. ఎవరికివారే దేవతారాధన చేసేవారు. ఆర్యసంప్రదాయానికి చెందిన గ్రీస్, రోమ్ లలో కూడా ఇదే కనిపిస్తుంది. మిగిలిన ఆర్య సంప్రదాయాలలో ఎక్కడా బ్రాహ్మణుల వంటి వృత్తి పురోహితులు లేరు. ‘బ్రాహ్మణ’శబ్దం పూర్తిగా భారతీయం. వీరితోనే వర్ణవిభజన ప్రారంభమైంది(ఏన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ: డీ.డీ. కోశాంబి). ఇతర ఆర్యసంప్రదాయాలలో  లేని ఈ పరిణామం భారత్ లోనే సంభవించడానికి కారణం, సింధు నాగరికతతో సంపర్కం. సింధు నాగరికతకు; మెసపొటేమియా, సుమేరు సంస్కృతులకు చాలా సంబంధాలున్నాయి. నేటి మన కులవ్యవస్థతో పోల్చదగిన వ్యవస్థ మెసపొటేమియాలో ఉండేది. అక్కడ రెండు రకాల బానిసలు ఉండేవారు. యుద్ధఖైదీలు, రుణం తీర్చలేకపోయినవారు, బానిస సంతానం మొదటి రకం. వీరి బానిసత్వం శాశ్వతం కాదు. డబ్బు చెల్లించో, స్వతంత్రులు దత్తు చేసుకోవడం ద్వారానో బానిసత్వం నుంచి వీరు విముక్తులు కావచ్చు. దేవాలయ బానిసలు రెండో రకం. వీరిని ‘సిర్కుతు’ లనేవారు.  వీరు శాశ్వత బానిసలు. వీరిలో ఆస్తిపరులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులూ కూడా ఉండచ్చు. అయినా సరే వీరు బానిసలే. మన దేశంలోని పట్టువిడుపులు లేని కులవ్యవస్థతో దీనిని పోల్చవచ్చు. మెసపొటేమియా తరహా బానిసత్వం సింధులో కూడా ఉండేదనుకుంటే, తాము ‘కృష్ణవర్ణులు’గా పేర్కొన్న దాసులను, లేదా దస్యులను ఆర్యులు సేవకులను చేసుకోవడం సహజపరిణామమేనని కోశాంబి అంటాడు. ఆర్యులలో బానిసత్వం లేకపోగా, బానిసత్వాన్ని వారు వ్యతిరేకించారని కూడా ఆయన అంటాడు. ఆర్యులు భారతదేశానికి వచ్చేనాటికే సింధు నాగరికతలో అభివృద్ధి చెందిన పురోహితవ్యవస్థ ఉంది. అంతవరకూ ప్రత్యేకపురోహితవ్యవస్థ లేని ఆర్యులు సింధు పురోహితవ్యవస్థను సొంతం చేసుకున్నారు. క్యాంప్ బెల్ ప్రకారం కూడా ఆర్యులు సాదాసీదా రకం. వారిది సంక్లిష్ట సామాజికవ్యవస్థ కాదు. వారిలో అప్పటికి రాజ్యభావన పుట్టలేదు. అధికారం చెలాయించడం, బలప్రయోగం, దోచుకోవడం వారి ప్రధానవ్యాపకాలు. నాటి దేవాలయ కేంద్రిత నగర రాజ్యాలలోని పురోహితవ్యవస్థను అరువు తెచ్చుకుని స్వప్రయోజనాలకు వాడుకున్నారు.

4.   ‘వైదిక మతాన్ని జాతీయమతంగా చిత్రించి, భారతీయసంస్కృతికి హైందవాన్ని అంటగట్టి, ఆర్యేతర, ముఖ్యంగా ద్రవిడ సంస్కృతీ, నాగరికతలను తృణీకరించడం హిందూత్వ తాత్విక భావజాలంలో ప్రధానాంశం. సింధు నాగరికతలో సతి లాంటి దురాచారాలు ఉన్నట్టు కనిపించదు’:
ఇవి కూడా వాస్తవాలను పూర్తిగా తలకిందులు చేస్తున్న ఊహలు. నిజానికి ఇప్పుడు హిందూమతంగా చెప్పుకుంటున్న మతంలోని దాదాపు ప్రతి అంశమూ వైదిక సంబంధమైనది కాదు, ద్రవిడ సంస్కృతికి చెందినది.  క్యాంప్ బెల్ స్పష్టంగా ఇలా అంటాడు: ‘అనంతరకాలంలో భారతదేశంలో అభివృద్ధి చెందిన పురాణగాథలన్నీ సారాంశంలో వేదాలకు సంబంధించినవి కావు. ద్రవిడ సంబంధమైనవి. ఇంకా చెప్పాలంటే, కంచు యుగానికి చెందిన సింధు సంస్కృతినుంచి ఉద్భవించినవి.’  గార్డన్ చైల్డ్ ఏమంటున్నాడో చూద్దాం: ‘మట్టితో చేసిన చిన్న స్త్రీ విగ్రహాలు, పూజావస్తువుల మీదా, సీళ్ళ మీదా చిత్రించిన బొమ్మలు, ముఖ్యంగా లింగం, యోని ఆకారం కలిగిన పెద్ద రాతి బొమ్మలు అనేకం ఈ (సింధు) శిథిలాల్లో లభించాయి. ఇవి వంశచిహ్నాల సంప్రదాయం, సృష్టికి గర్భధారణకు సంబంధించిన ఆచారాలు ఇంకా బతికి ఉన్నాయని నిరూపిస్తాయి. ఇంతేగాక వీటినుంచి కొంతమంది దేవతలు కూడా ఉద్భవించారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా తరువాత కాలంలో హిందూమతంలోని కొన్ని ముఖ్యాచారాలను సూచిస్తాయి. లింగం, యోని రూపాలతో తరువాత కాలంలో హిందూ దేవతలు కొందరు చిత్రించబడడం మనం గమనిచవచ్చు(చరిత్రలో ఏం జరిగింది?: గార్డన్ చైల్డ్, అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య).  వామాచారానికి చెందిన తాంత్రిక పూజలు సింధు వారసత్వమని కోశాంబి అంటాడు. సింధు చిత్రాలతో, లిపితో తాంత్రిక చిహ్నాలకు సంబంధం ఉందని కూడా అంటాడు.  సింధు సీళ్ళపై కనిపించే చిత్రాల సరళి హిందూ దేవతావిగ్రహాలలో ఇప్పటికీ కనిపిస్తుందంటాడు. సింధు సంస్కృతిలో మాతృదేవతారాధనలో భాగంగా లింగ పూజ ఉండేదనీ; మాతృదేవతారాధన భారత్ లో అభివృద్ధి చెందినట్టుగా ప్రపంచంలో మరెక్కడా అభివృద్ధి చెందలేదనీ క్యాంప్ బెల్  అంటాడు. భారత్ లో నేటికీ రెండురకాల మాతృదేవతారాధనా పద్ధతులు కొనసాగుతున్నాయి. మొదటిది ప్రోటో-ఆస్ట్రలాయిడ్ వారసత్వం అయితే, రెండోది నూతన శిలాయుగ వారసత్వం. ఈ దేశంలోని భిన్న ఆరాధనా విధానాల మధ్య సహజీవనానికీ, లేదా సంలీనానికీ ఇదొక ఉదాహరణ.  సింధు సంస్కృతిలోని మాతృదేవతారాధనకూ;  మెసపొటేమియా, సమీప ప్రాచ్యం, ఈజిప్ట్, యూరప్ లతో సహా ఇంచుమించు ప్రపంచమంతటా ఒకప్పుడు ఉన్న మాతృదేవతారాధనకూ దగ్గరి సంబంధం ఉంది.  మాతృదేవతారాధన ఉన్న ప్రతిచోటా నరబలి ఉండేదన్న క్యాంప్ బెల్ మాటను గుర్తుపెట్టుకోవాలి. 1835లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించేవరకూ భారత్ లో నరబలి ఆచారం కొనసాగిందని ఆయన అంటాడు. హరప్పాలో లభించిన సీళ్ళు నరబలి ఆచారమూలాలు సింధు సంస్కృతిలో ఉన్నట్టు చెబుతున్నాయి. ఒక సీలుపై ఒక స్త్రీని బలి ఇస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మరో సీలుపై ఒక పురుషుని బలి ఇస్తున్న దృశ్యమూ,  ఏడుగురు స్త్రీల మూర్తులూ కనిపిస్తాయి. ఇది ఆనాడు ఈజిప్ట్ మొదలైన చోట్ల కూడా పాటించిన  ‘రెగిసైడ్’(రాచబలి)ను సూచిస్తుందని క్యాంప్ బెల్ అంటూ, ఆ ఏడుగురు స్త్రీ మూర్తులూ సతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండచ్చంటాడు. ఇలాంటి దృశ్యాలున్న సీళ్లే మెసపొటేమియాలోనూ కనిపించాయి. తెలుగునాట ‘ఏడుగురు అక్కలు’, ‘సప్తమాతృకలు’ అనే పేర్లు ఇప్పటికీ ప్రసిద్ధమే.  మన మతవిశ్వాసాల మూలాలు సింధు సంస్కృతిలో ఉన్నాయనడానికి ఇదొక ఉదాహరణ.  సింధు శిథిలాలలోనే లభించిన అరడజను సీళ్లపై యోగముద్రలో ఉన్న ఒక పురుషుని ఆకృతి కనిపిస్తుంది. ఇది పశుపతి, లేదా శివుని రూపానికి మాతృక.  మెసపొటేమియా దేవాలయవ్యవస్థకూ, మన దేవాలయవ్యవస్థకూ చాలా పోలికలున్నాయి. సింధు సంస్కృతి మీదుగా అందిన వారసత్వం అది. మెసపొటేమియాలోని ఇష్టార్ దేవాలయంలో ‘పవిత్ర వ్యభిచారం’ జరుగుతూ ఉండేది. మన దేశంలో దేవదాసీ వ్యవస్థకు ఇదే మూలం కావచ్చు.

5.  ‘సింధు నాగరికతలో వ్యక్తి స్థానం వృత్తి, ప్రావీణ్యతలను బట్టి నిర్ణయించబడింది కానీ పుట్టుక మీద కాదు’: వాస్తవాలలోకి వెడితే ఇది కూడా నిరాధారమైన ఊహ గానే తేలిపోతుంది. నిజానికి సింధు సమాజం వ్యత్యాసాలు నిండిన వర్గ సమాజమని కోశాంబి అంటాడు. అంతేకాదు, ఎటువంటి మార్పూ లేకుండా వెయ్యీ, పదిహేను వందల ఏళ్లపాటు గడ్డ కట్టుకుపోయిన శిథిల సమాజమని కూడా అంటాడు. జనంలో తిరగబడే ప్రవృత్తిని కూడా అణచివేసి సమాజాన్ని జడీభూతంగా మార్చింది కూడా మతవిశ్వాసాలూ, మతాధిపత్యమే నంటాడు.

6.     ‘ద్రవిడ సంస్కృతిలోని మతవిధానం సమాజశ్రేయస్సుకు దోహదం చేసింది’:  
ఈ మాటలో ఎంత నిజముందో పై అంశాల వెలుగులో ఎవరికి వారే అంచనాకు రావచ్చు. ఏదిఏమైనా అది మన గతం. చెరుపుకోలేని గతం. అందులోని మంచి, చెడులను కూడా వస్తుగత దృష్టినుంచి చూడాలి. బర్బరదశలో ఉన్న ఆర్యుల కంటె, వ్యవసాయాధారిత పట్టణ నాగరికతను నిర్మించిన సింధు ప్రజలు నిస్సందేహంగా ఉన్నతదశకు చెందినవారు. అయితే ఆ ఉన్నతికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అది కాలంలో ఘనీభవించి అనేకానేక ఆంతరిక లోపాల వల్ల క్షీణదశకు లోనై సహజమరణానికి చేరువైన నాగరికత. ఆర్యుల రాక దానిని మరింత త్వరితం చేసింది. సింధు సమాజ పరిస్థితిని బ్రిటిష్ ఆధిపత్యానికి ముందునాటి భారతదేశ పరిస్థితితో పోల్చవచ్చు. బ్రిటిష్ తో పోల్చితే భారత్ వేల సంవత్సరాల  సాంస్కృతిక, నాగరిక అస్తిత్వం గల దేశం. అయినా సరే, అనేక అంతర్గత వైరుధ్యాలతో బలహీనపడిన కారణంగా పరాధీనతకు తలవంచవలసివచ్చింది. అటువంటి క్షీణ భారతం స్ఫూర్తి దాయకమని ఎవరూ అనరు. అలాగే సింధు స్ఫూర్తికి ఆవాహన అనేటప్పుడూ మెలకువ పాటించాలి.

ఈ దేశంలో కులవ్యవస్థ నిజం. కులదాష్టీకం నిజం. శతాబ్దాలపాటు ఆత్మన్యూనతకు, అణచివేతకు గురైనవారు జరిపే ఆత్మగౌరవ, అస్తిత్వ పోరాటాలను సమర్థించాలనడంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. వారు తమ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను పునర్నిర్మించుకునే ప్రయత్నాన్ని ఆహ్వానించవలసిందే. అయితే ఆ నిర్మాణం ఊహల పునాది మీద జరగకూడదు. చారిత్రక వాస్తవాలు చారిత్రక అనుభవాలను ప్రతిఫలిస్తాయి. వాస్తవాలను మరుగు పుచ్చినా, లేదా వక్రీకరించినా  ఆ అనుభవాలనుంచి పొందవలసిన ఉమ్మడి ప్రయోజనాలను నష్టపోతాం.  కులపీడన గురించి చెప్పుకోవలసిన వాస్తవాలు, చర్చించుకోవలసిన అంశాలు  ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా కులపీడనలో గల తారతమ్యాల గురించీ, కులవ్యవస్థకు, వ్యవసాయార్థికతకు పడిన పీటముడి గురించీ ప్రస్తావించుకోవలసిన అంశాలు అసంఖ్యాకం.
                                              (ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6-1-2013న ప్రచురితం)                                        




Saturday, January 5, 2013

భారత్ భారత్ గానే ఉంది...ఇంకా ఇండియా కాలేదు

"భారత్ లో రేపులు జరగడం లేదు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం వల్ల భారత్ ఇండియా గా మారిపోతున్న పట్టణ ప్రాంతాలలోనే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భారత్తే కాపాడుతోంది" అన్న ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాటికి  ఇచ్చిన టీకా టిప్పణీ మరింత ఆశ్చర్యం కలిగించింది. ఇదే సమయంలో, "మహిళలు గీత దాటితే సీత గతే" అని మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్య నిజానికి పై వ్యాఖ్యలలా ఆశ్చర్యం కలిగించలేదు. అయినా సరే, బీజేపీ శ్రేణులు పాపం ఆ మంత్రిని  సమర్థించలేదు. దాంతో ఆయన  ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నారు.

భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయనడానికి నా కారణాలు ఇవీ:

1. భారత్ ఇప్పటికీ భారత్ గానే ఉంది. ఇంకా ఇండియా కాలేదు. ఈ భారత్ అనే మహాసముద్రంలో 'ఇండియా' అనేది అక్కడక్కడ చిన్న చిన్న దీవులుగానే ఉంది. గ్రామాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ అనీ; పట్టణాలనూ, నగరాలనూ దృష్టిలో ఉంచుకుని ఇండియా అనీ అనడం చూస్తున్నాం. నేను అనేది ఏమిటంటే, భారత దేశం మొత్తం ఇప్పటికీ ఒక మహాగ్రామమే. మనం ఇప్పుడు గ్రామంగా గుర్తిస్తున్నది చిన్న గ్రామం. పట్టణంగా గుర్తిస్తున్నది అంతకంటే కొంచెం పెద్ద గ్రామం. నగరంగా గుర్తిస్తున్నది ఇంకా పెద్ద గ్రామం. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై లాంటి మహానగరాలు చాలా పెద్ద గ్రామాలు. ఇవన్నీ కలిగిన భారత్ ఒక మహాగ్రామం. కనుక భారతీయుల మందరమూ భారత్ అనే గ్రామంలోనే నివసిస్తున్నాం. జనం చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామానికి, మరింత పెద్ద గ్రామానికి, ఇంకా పెద్ద గ్రామానికి వలస వస్తున్నారు. తమతోపాటు తమ 'సంస్కృతీ, సంప్రదాయా'లను కూడా తీసుకొస్తున్నారు. ఏతావతా చెప్పేదేమిటంటే మానభంగాలు, హత్యలు వగైరాలు అన్నీ భారత్ అనే మహాగ్రామంలోనే జరుగుతున్నాయి. కనుక భారత్/ఇండియా అన్న భాగవత్ గారి వర్గీకరణ వాస్తవిక దృష్టిపై ఆధారపడి చేసింది కాదు. ఆయన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించడానికి అదీ కారణం.  వాస్తవికతను ఏమాత్రం ప్రతిబింబించని ఆ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు  సమర్థించడానికి తంటాలు పడడం రెట్టింపు ఆశ్చర్యం కలిగించడం సహజమే.

భాగవత్ గారి వ్యాఖ్యలతో పోల్చితే మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలో 'భారత్/ఇండియా' గంద్రగోళం ఏమీ లేదు. అది సూటిగా ఉండి, మనకు బాగా తెలిసిన ఓ 'మైండ్ సెట్'ను సూచిస్తోంది, అంతే! కనుక అది ఎలాంటి ఆశ్చర్యమూ కలిగించలేదు. అయినా సరే, పాపం ఆయనకు బీజేపీ నుంచి మద్దతు లభించలేదు.

2. భారత్ లో ఇప్పుడు 'గ్రామం'గా గుర్తించే చిన్న గ్రామంలో రేపులు, బలాత్కారాల లాంటివి ఢిల్లీ లాంటి చాలా పెద్ద గ్రామంలో జరిగినట్టు జరగవు. ఎందుకంటే మరీ చిన్న గ్రామం అవడం వల్ల తప్పించుకోడానికి వీలుండదు. కనుక వేరే పద్ధతుల్లో లొంగదీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. భాగవత్ గారు 'భారతీయ సంస్కృతీ సంప్రదాయా'లను కాపాడేవిగా భావించే భారత్ లోని చిన్న గ్రామాలలో ఖాఫ్ పంచాయతీలు 'పరువు' హత్యలను అమలు చేస్తుంటాయి. ఢిల్లీ లాంటి పెద్ద గ్రామాలలోని పొలిటీషియన్లు ఆ ఖాఫ్ పంచాయతీలను ఖండించే సాహసం చేయరు. భారత్ లోని చిన్న గ్రామాలలో కూడా వరకట్నపు వేధింపులూ, హత్యలూ జరుగుతుంటాయి. భారత్ లోని చిన్న గ్రామం నుంచి యువత పెద్ద గ్రామానికి వెళ్ళడం ఒకవిధంగా ఆటవిడుపుగా ఉంటుంది. పెద్ద గ్రామంలో తమ గ్రామంలో కన్నా విశాలమైన, పరస్పర పరిచయాలు తక్కువగా ఉండే విశాల సమాజాన్ని చూస్తారు కనుక స్వేచ్చకు కళ్లేలు విప్పెస్తారు. ఈవ్ టీజింగ్ లకు వగైరాలకు ఎక్కువగా పాల్పడేది ఇలా చిన్న గ్రామం నుంచి కొత్తగా పెద్ద గ్రామంలోకి అడుగుపెట్టినవారే. రేపులు, ఐటెమ్ డ్యాన్సులు, అశ్లీల సంభాషణలు, హీరో ఓరియెంటెడ్  మసాలా సినిమాలను ఈల వేసి ప్రోత్సహించే మహారాజపోషకులు చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామానికి కొత్తగా  ప్రవహించే  జనాలే. అంతేకాదు, రాష్ట్రాల రాజధానులనే పెద్ద గ్రామాలలోని శాసనసభలను, ఢిల్లీ అనే చాలా పెద్ద గ్రామంలోని పార్లమెంట్ ను ఎక్కువ సంఖ్యలో భర్తీ చేసేది కూడా భాగవత్ గారు చెప్పిన  'భారత్' మహాగ్రామవాసులే.

3. ఇప్పుడు పట్టణాలుగా, నగరాలుగా చెప్పుకునే పెద్ద, ఇంకా పెద్ద గ్రామాలలో కంటే; గ్రామంగా చెప్పుకునే చిన్న గ్రామం జనంలోనే లైంగిక 'చైతన్యం' కూడా ఎక్కువగా ఉంటుంది. నా అనుభవమే చెబుతాను. నేను పట్టణమనే ఒక పెద్ద గ్రామంలో హైస్కూలు చదువు చదువుకున్నాను. నా పది హేనో ఏట గ్రామానికి వెళ్లినప్పుడు, వయసులో చదువులో నాకంటే ఓ ఏడాది జూనియర్ అయిన ఒక మిత్రుడు స్త్రీ-పురుష సంబంధాల గురించి, అందులోనూ తనకు తెలిసిన అక్రమ సంబంధాల గురించీ చెబుతుంటే నేను నోరు వెళ్లబెట్టాను. అప్పటివరకూ నాకు అలాంటి విషయాలు ఏవీ తెలియవు. నేను మొదటిసారి (అదే  చివరిసారి కూడా)'...మేళా'న్ని గ్రామంలోనే చూశాను. రానంటున్నా బలవంతం చేసి ఓ మిత్రుడు తీసుకెళ్ళాడు. '...మేళం' అయిన తర్వాత ఊళ్ళో కామందులు ఒక్కో అమ్మాయిని తీసుకెడతారని కూడా చెప్పాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా నేను మొదటిసారి గ్రామంలోనే చూశాను. ఇక 'చింతామణి' బూతు నాటకం గ్రామాలలో మహాపాపులర్. ఇలాంటి చిన్నా, పెద్దా గ్రామాలతో నిండిన భారత్తే 'సంస్కృతీ సంప్రదాయా'లను కాపాడుతోందని భాగవత్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. పైగా అన్యాయంగా పాశ్చాత్యసంస్కృతీ ప్రభావంతో రేపులు ఎక్కువయ్యాయని ఆయన అభాండం వేశారు.

భారత్ లోని గ్రామాలు ఎలా ఉన్నాయో  'బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు' అనే నా పోస్ట్ లోనూ, మరికొన్ని పోస్ట్ లలోనూ  చెప్పడానికి ప్రయత్నించాను. దయచేసి వాటిని ఒకసారి చూడండి.

అలాగే, నేను గ్రామాలను ఏదో అన్నానని అపార్థం చేసుకోవద్దు. మనమందరం భారత్ అనే మహాగ్రామవాసులమే.

                                                                           ****    

సంబంధిత పోస్ట్ లు: 1. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీఎంసీల ఫినాయిల్ కావాలి? 2. తెలుగు భాషనే కాదు తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి 3.  తెలుగు సభల్లో 'తెలుగు బహిర్భూమి' గురించి చర్చిస్తారా? 4. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది ? 5. బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు.


Friday, January 4, 2013

అక్బరుద్దీన్ కేసు: చట్టం తన పని తాను చేస్తోందా?

ఇంతకీ ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ విషయంలో రూల్ ఆఫ్ లా అమలు జరుగుతోందా?

 'అమలు జరుగుతోందని' ప్రస్తుతానికి అంత కచ్చితంగా చెప్పలేం. అమలు జరిగీ జరగనట్టుగా ఉంది. పూర్తిగా అమలు జరగకపోవచ్చు. చివరికి, అసలే అమలు జరగలేదన్న అభిప్రాయం కలిగించినా ఆశ్చర్యంలేదు.

 భోపాల్ దుర్ఘటన కేసులో ఏం జరిగింది?  యూనియన్ కార్బైడ్ సీ ఈ ఓ వారెన్ యాండర్సన్ ను అరెస్ట్ చేసినట్టే చేసి మధ్యాహ్నానికి 'రూ.25 వేల'పూచీకత్తుతో బెయిల్ ఇచ్చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వవాహనంలో విమానాశ్రయంలో దిగబెట్టి దేశం దాటించేశారు. కనుక ఆయన విషయంలో రూల్ ఆఫ్ లా (అరెస్ట్ చేశారు కనుక)అమలు జరగలేదా అంటే జరగలేదని చెప్పలేం. కానీ యాండర్సన్ మళ్ళీ ఇండియాకు రాలేదు. 90 దాటిన వయసులో న్యూయార్క్ లో విశ్రాంతజీవితం గడుపుతున్నాడు. ఆవిధంగా చూస్తే యాండర్సన్ విషయంలో రూల్ ఆఫ్ లా అమలుకాలేదు.

బోఫోర్స్ ముడుపుల ఆరోపణ వెలుగుచూసిన పందొమ్మిదేళ్ళ తర్వాత,  నిందితులలో ఒకడైన ఆట్టోవియో కత్రోచీ విషయంలో 'రూల్ ఆఫ్ లా అమలుచేయడానికి' సీబీఐ శతవిధాల ప్రయత్నించింది. తీరా ఆయనను నిర్బంధంలోకి తీసుకోబోయేసరికి అంతవరకూ ఇండియాలోనే ఉన్న ఆయన కాస్తా మలేసియా జారుకున్నాడు. ఎలాగైనాసరే 'రూల్ ఆఫ్ లా అమలుచేయదలచుకున్న' సీబీఐ ఆయనను ఇండియా రప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. తగిన సాక్ష్యాలు లేవని మలేసియా ప్రభుత్వం ఆయనను అప్పగించడానికి తిరస్కరించింది. ఆ తర్వాత రూల్ ఆఫ్ లా అమలులో భాగంగా సీబీఐ ఇచ్చిన ఎలర్ట్ కు స్పందించిన ఇంటర్ పోల్ అర్జెంటీనా లో కత్రోచీని నిర్బంధంలోకి తీసుకుని సీబీఐ కి ఆ విషయం తెలియజేసింది. పదహారురోజుల ఆలస్యంగా సీబీఐ ఒక బృందాన్ని అర్జెంటినా పంపింది. కానీ ఆ బృందం తాజా వారెంట్ లాంటి అత్యవసర పత్రాలు తీసుకువెళ్లడం మరచిపోయింది. దాంతో కత్రోచీ అప్పగింతకు నిరాకరించిన కోర్టు, ఆయన కోర్టు ఖర్చులు కూడా ఇండియాయే భరించాలని ఆదేశించింది. కత్రోచీ కడుపులో చల్ల కదలకుండా క్షేమంగా ఉన్నాడు. చెప్పొచ్చేదేమిటంటే, ఎంత ప్రయత్నించినా కత్రోచీ విషయంలో రూల్ ఆఫ్ లా అమలుకాలేదు.

అక్బరుద్దీన్ ది భిన్నమైన కేసైనా రూల్ ఆఫ్ లా వర్తింపులో పై ఇరువురితో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ఆయన డిసెంబర్ 8న నిజామాబాద్ లో, డిసెంబర్ 22 న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపణ. డిసెంబర్ 9న...లేదా కనీసం 10న ఆయనపై కేసు దాఖలు చేసి ఉంటే రూల్ ఆఫ్ లా అమలుపై సందేహాలు వచ్చి ఉండేవికావు. కానీ అది జరగలేదు. ఈ లోపల ఆయన 22న మరోసారి అటువంటి ప్రసంగమే చేశారు. ఆ తర్వాతైనా వెంటనే కేసు దాఖలు చేసి ఉంటే రూల్ ఆఫ్ లా అమలు పట్ల సందేహాలు ముదిరి ఉండేవికావు. కానీ అదీ జరగలేదు. ఎట్టకేలకు కోర్టు చెబితే తప్ప రూల్ ఆఫ్ లా అమలుకు ప్రభుత్వం పూనుకోలేదు. 25 రోజుల తర్వాత కేసు దాఖలు చేశారు. ఈ లోపల అక్బరుద్దీన్ లండన్ వెళ్ళిపోయారు. ఆయన తిరిగి ఇండియాకు వచ్చిన మాట నిజమే. అయితే వచ్చి ఒక రోజు దాటిపోయినా ఆయనను అరెస్ట్ చేయలేదు. ఆయన కోర్టుకు హాజరు కావలసిన ఊళ్లలో 144 సెక్షన్ విధించారు తప్ప ఆయన ఇంటి ముందు జనం గుమి కూడకుండా నివారించలేదు. వైద్యపరీక్షల పేరుతో ఆయన కోరిన నాలుగు రోజుల గడువును ఇస్తున్నట్టే కనిపిస్తున్నారు. తేడా చూడండి...ఈ మధ్య మహారాష్ట్రలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాఖ్యను పురస్కరించుకుని ఆమెను ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు!

అంతకుముందు, అక్బరుద్దీన్ పై చర్య తీసుకోవడంలో దాదాపు నెల రోజులపాటు ఆలస్యం ఎందుకు జరిగిందని అడిగితే, న్యాయ సలహాదారు అభిప్రాయం మొన్ననే(జనవరి 2) అందిందని పోలీసులు చెప్పారు. అంటే, అక్బరుద్దీన్ ప్రసంగాలు మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయో లేదో చెప్పడానికి న్యాయసలహాదారుకు  అన్ని రోజులు పట్టింది.  ఎందుకని? ఆయన అక్బరుద్దీన్ కావడం తప్ప మరో కారణం కనిపించదు. కత్రోచీనీ నిర్బంధంలోకి తీసుకున్నట్టు ఇంటర్ పోల్ తెలియజేసిన తర్వాత కూడా 16 రోజుల పాటు ఎందుకు తాత్సారం చేశారని అడిగితే, అర్జెంటినా నుంచి అందిన పత్రాలు స్పానిష్ భాషలో ఉండడం వల్ల తర్జుమాకు సమయం పట్టిందని సీబీఐ జవాబిచ్చింది (నిజానికి ఇంగ్లీష్ లోనే పత్రాలు అందాయని మరో సమాచారం).  అక్బరుద్దీన్ విషయంలో కూడా, ఆయన ప్రసంగాలు ఉర్దూలో ఉండడం వల్ల తర్జుమాలో ఆలస్యం జరిగిందంటున్నారు.  కత్రోచీ దేశం దాటిపోతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత ఇంటర్ పోల్ ను ఎలర్ట్ చేసినట్టే; అక్బరుద్దీన్ విషయం లోనూ అవసరమైతే ఇంటర్ పోల్ సాయం తీసుకుంటామని పోలీసులు అన్నారు. గమనించారా, పోలికలు ఎంత బాగా కుదిరాయో! కేసు ఏమైనా కావచ్చు గాక, రూల్ ఆఫ్ లా అమలుపట్ల ఇలాంటివి జనంలో నమ్మకం కలిగించవు.

ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నది, అక్బరుద్దీన్ గురించో, యాండర్సన్, కత్రోచీల గురించో కాదు...రూల్ ఆఫ్ లా అమలు గురించి! అక్బరుద్దీన్ పార్టీ వాళ్ళు ఇదే రూల్ ఆఫ్ లా ను బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా తదితరుల విషయంలో ఎందుకు అమలు చేయలేదని అడగచ్చు. అలా అడగడం న్యాయమే. అలాగని అక్బరుద్దీన్ విషయంలో అమలు కాకూడదని వాళ్ళు అనకూడదు. అలాగే, బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా మద్దతుదారులు  అక్బరుద్దీన్ మీద చర్య తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పుడు, మరి బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా వంటి వ్యక్తుల  విషయంలో మీరేమంటారని అడిగితే, సమాధానం దాటవేయకూడదు.

కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు అదే జరుగుతోంది.  రూల్ ఆఫ్ లా అమలు డిమాండ్ కూడా పార్టీల ప్రాతిపదికన చీలిపోతోంది. ప్రభుత్వం ఇతరేతర ఇబ్బందులు, సానుకూలతలు, ప్రతికూలతల దృష్ట్యా రూల్ ఆఫ్ లా ను 'సెలెక్టివ్'గా అమలు చేయడం, లేదా కనిపించీ కనిపించనట్టుగా అమలు చేయడం మొదలైనవి దీనికి అదనం.

కనుక, ఈ దేశంలో ఇప్పుడు అత్యవసరంగా జరగవలసింది రూల్ ఆఫ్ లా అమలును కోరుకునేవారందరూ ఒక పార్టీగా ఏర్పడడం!

 చట్టాలను 'సెలెక్టివ్'గా అమలు చేసే అవకాశం ఎప్పుడైతే ఇచ్చారో, లేదా  ఎప్పుడైతే దానిని సమర్థించారో అక్బరుద్దీన్ లకు, ప్రవీణ్ తొగోడియాలకు, వరుణ్ గాంధీలకే 'న్యాయం' అందుతుంది తప్ప; ఒక సామాన్య హిందువుకు, ఒక సామాన్య ముస్లిం కు, ఒక సామాన్య క్రైస్తవునికి, ఒక సామాన్య దళితునికీ, ఒక సామాన్య ఆదివాసీకి ఎప్పటికీ న్యాయం జరగదు.

మానభంగ నేరాన్ని శిక్షించడానికి ఎంత కఠినమైన చట్టాన్నైనా తీసుకురండి. ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులనైనా ఏర్పాటు చేయండి. కానీ, చట్టాన్ని 'సెలెక్టివ్'గా అమలుచేయడాన్ని మీరు ఎప్పుడైతే మౌనంగా అంగీకరించారో  అప్పుడు పలుకుబడి, డబ్బు, అధికారం ఉన్నవారిని ఎంతటి కఠిన చట్టాలైనా ఏమీ చేయలేవు. అవేవీ లేనివారు మాత్రమే శిక్షించబడతారు.

కనుక పార్టీ లకు అతీతంగా అందరూ రూల్ ఆఫ్ లా అమలును కోరుకోవాలి. రూల్ ఆఫ్ లాను కోరుకునేవారందరూ ఒక పార్టీ కావాలి.

ఈ దేశంలో మెజారిటీగా ఉన్న సామాన్యుడు రూల్ ఆఫ్ లాను కోరుకోవడం, కేవలం తప్పు చేసినవారిని శిక్షించి తీరాలన్న ధర్మాగ్రహంతో కాదు సుమా, అంతకంటే ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం!


Wednesday, January 2, 2013

ముద్దులు, కౌగిలింతల 'ధ్యానం': భారతీయాత్మకు నొప్పి లేదా?

ముద్దులు, కౌగిలింతల ధ్యాన దృశ్యాలను కొన్ని తెలుగు పత్రికలు ప్రచురించి 24 గంటలు గడిచిపోయాయి. కానీ విచిత్రం చూడండి...రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు స్పందించిన జాడ లేదు. అంతకంటే చిత్రం, ఈ రాష్ట్ర మహిళా హోం మంత్రి కూడా స్పందించలేదు. ఒక న్యాయవాది మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం, అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు జరగడం మినహా ఎక్కడా భూమి కంపించలేదు. ఢిల్లీ ఘటన సృష్టించిన సంచలనంలో, స్పందనలో, ఆగ్రహావేశాలలో వెయ్యో వంతు కూడా ఈ దృశ్యాలు సృష్టించలేదు.

ఈ దేశంలో భారతీయ విలువల పరిరక్షణకే కంకణం కట్టుకున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆశ్చర్యం, అవీ వీధికెక్కిన ఆనవాళ్ళు లేవు. ఆధ్యాత్మికత ముసుగులో భారతీయ యువతులను  బహిరంగంగా కౌగిలించుకుని, ముద్దాడి, ఒడిలో కూర్చొబెట్టుకుని లాలిస్తున్నదృశ్యాలు పత్రికలకు ఎక్కిన తర్వాత కూడా భారతీయాత్మకు చీమ కుట్టినట్టు కూడా లేదు.

ఎందువల్ల ఇలా జరిగింది? ఇది నిజంగా చాలా లోతుగా  చాలా కోణాలనుంచి ఆలోచించవలసిన ప్రశ్న!

గుర్తుపెట్టుకోండి, యావద్దేశం ఢిల్లీ వైపు రోజుల తరబడి దృష్టి సారించిన రోజుల్లోనే ఇక్కడ ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో పై దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఘటనపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కూడా ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి దృశ్యాలకు బాధ్యులైనవారిలో భయం పుట్టించలేదు. ప్రభుత్వంలో మెలకువ కలిగించలేదు. ఢిల్లీ స్థాయి నిరసనలు ఎన్నెన్ని, ఎన్నెన్ని రోజులపాటు జరిగితే దేశవ్యాప్తంగా వ్యక్తులలో, వ్యవస్థలలో, ప్రభుత్వాలలో కదలిక వస్తుంది?!

ఈ స్పందనారాహిత్యం చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తోంది. ఈ దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక విలువల పరిరక్షణే ధ్యేయమని చెప్పుకునే సంస్థలు కూడా ఈ కౌగిలింతలను, చుంబనాలను, ఒడి లాలింపులను ఆధ్యాత్మిక 'ప్రయోగం'గానే  భావిస్తున్నాయా? వీటికి బాధ్యులైన ఆధ్యాత్మిక పురుషులకు కూడా-పాపం శమించుగాక-రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణమహర్షి, అరవింద ల సరసన పీట వేయదలచుకున్నారా? అదే నిజమైతే, వారే కాదు, అందరూ  భారతీయ విలువల కళేబరాన్ని నూరు గజాల లోతున పాతిపెట్టి కన్నీటి తర్పణం విడిచి రావచ్చు.

ఇప్పటికీ దీనిని ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసించే అమాయకులు ఎవరైనా ఉంటే వారికి నేను చెప్పేది ఒకటే...మనకు ఇంతకన్నా ఉదాత్తమైన, సభ్యతాసంస్కారవంతమైన, విలువైన ధ్యాన సంప్రదాయాలు ఉన్నాయి. ఇలాంటి తుచ్చమైన ప్రయోగాలు మనకు అవసరం లేదు.

నేను ఇంతకుముందే చెప్పినట్టు, రాజకీయ నాయకత్వానికి ఇటువంటి అవాంఛనీయశక్తులతో ఇతరేతర లాలూచీలు ఏవీ లేకపోతే, కేవలం ఆధ్యాత్మిక అజ్ఞానమే వాటిని అనుమతించడానికి కారణమైతే నాదొక సలహా...ప్రభుత్వానికి రకరకాల సలహాదారులు ఉంటారు. అలాగే అత్యవసరంగా ఒక ఆధ్యాత్మిక సలహాదారును అది ఏర్పాటు చేసుకోవాలి.

ఢిల్లీ స్థాయి ప్రకంపనలు ఇక్కడ పుట్టకపోవడానికి నాకు మరో కారణం కనిపిస్తోంది. అది మీడియా వైఫల్యం. మీరు గమనించారో లేదో, ఢిల్లీ నుంచి పని చేసే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలే ఫోకస్ అవుతుంటాయి. ఢిల్లీలోనే కాదు, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ల లో ఏం జరిగినా జాతీయ మీడియాలో వార్త అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలలో ఎంతటి ఘోరాలు జరిగినా ఎప్పుడో కానీ  అదొక  ప్రముఖ వార్త కాదు. దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరగవు. ఇక దక్షిణాది రాష్ట్రాలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు రెండూ ప్రాంతీయ మీడియాగానే పనిచేస్తుంటాయి. ఢిల్లీలోని ఎలక్ట్రానిక్ మీడియాలా జాతీయస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని రూపొందించే శక్తికానీ, ప్రభావితం చేసే శక్తి కానీ దక్షిణాది చానెళ్లకు లేదు. దక్షిణాది చానెళ్లలో ఒక అర్నబ్ గోస్వామి, ఒక రాజ్ దీప్ సర్దేసాయి, ఒక కరణ్ థాపర్, ఒక బర్ఖాదత్, ఒక నిధీ రాజ్దాన్ లాంటివారు కనిపించకపోవడం స్పష్టంగా కనిపించే ఒక తేడా. సమాచారం జాతీయ స్థాయిలో ఫోకస్ కావడానికి సంబంధించినంతవరకు దక్షిణాది రాష్ట్రాలు ఒక చీకటి ఖండం. అదే, ఇక్కడి ప్రభుత్వాలకు, రకరకాల సంఘవిద్రోహశక్తులకు పెద్ద రక్షణ కవచం.

ఢిల్లీ ఘటనపై మీడియా మరీ అతి చేసిందనే అభిప్రాయం ఎవరికైనా ఉండచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ మూల జరిగిన ఘటనల పై స్పందన  చూసినమీదట ఆ డోసు కూడా సరిపోదనే అభిప్రాయం కలుగుతోంది. జాతీయ చానెళ్ల కెమెరా ఫోకస్ ఇటు కూడా మళ్ళవలసిన  అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.



ముద్దులు, కౌగిలింతల 'ధ్యానం': ఆంధ్రలో ఓ దారుణం

ఢిల్లీలో 23 ఏళ్ల యువతి మానభంగం, హత్యలపై యావద్దేశంలో ఇప్పటికీ  ఆగ్రహం జ్వలిస్తూనే ఉంది. మహిళల పట్ల జరిగే ఘాతుకాలకు అడ్డుకట్ట పడేవరకూ ఆగ్రహాగ్ని అలా జ్వలిస్తూనే ఉండాలనీ, ఎత్తిన కత్తి దించడానికి వీలులేదనే పట్టుదల జనంలో కనిపిస్తోంది. మానభంగాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలను అరికట్టే దిశగా కేంద్రమూ, కొన్ని రాష్ట్రప్రభుత్వాలూ నిర్దిష్ట చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. సంతోషమే...

కానీ, ఇదే సమయంలో ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోందో గమనించారా?  ఈరోజు కొన్ని తెలుగు దినపత్రికలు ప్రచురించిన దృశ్యాలు చూస్తే, మహిళల మర్యాదను మంటగలపడంలో అవి ఢిల్లీ యువతి మానభంగ ఘటనకు ఏమాత్రం తీసిపోవనే అభిప్రాయం మీకు కలిగితీరుతుంది. కొన్ని దృశ్యాలలో నెరిసిన గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు కొందరు యువతులను ఆలింగనం చేసుకుంటున్నాడు! ఇంకో దృశ్యంలో, ఆయన శిష్యుడుగా చెబుతున్న ఒక నల్లని గడ్డం మనిషి ఒడిలో ఒక యువతి కూర్చుని ఉంది! మరో దృశ్యంలో ఆ మనిషే మరో యువతిని ముద్దాడుతున్నాడు! 'ఆధ్యాత్మిక ప్రేమతత్వా'న్ని పంచే ప్రక్రియలో ఆ ఆలింగనాలు, ఒడిలో కూర్చోబెట్టుకోవడాలూ, ముద్దాడడాలూ భాగమట!

ఇలాంటి బహిరంగ విశృంఖల దృశ్యాలు చూసిన తర్వాత కూడా మన రక్తం ఉడకకపోతే, మన సాంస్కృతిక విలువలకు అవి చేసే గాయాల నొప్పి అనుభవానికి రాకపోతే ఈ దేశాన్ని దాని ఖర్మానికి విడిచిపెట్టడం తప్ప చేయగలిగింది లేదు. ఈ దృశ్యాలు ఘనత వహించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి కదలిక తెచ్చాయో ప్రస్తుతానికి సమాచారం లేదు. మామూలు కదలిక కాదు, ఆ దృశ్యాలకు బాధ్యులైనవారిపై కఠినచర్య తీసుకోవడంతోపాటు, పిరమిడ్ ధ్యాన కేంద్రంగా ఇటీవలి కాలంలో  విశేషప్రచారం పొందుతున్న ఆ సంస్థపైనా చర్య తీసుకోవడం అవసరం. అయితే, ఆ సంస్థ ఇటీవల నిర్వహించిన ప్రపంచ ధ్యాన సభలకు ఎంతటి ప్రముఖులు హాజరయ్యారో గమనిస్తే, రాష్ట్రప్రభుత్వం చర్యకు సాహసిస్తుందనిపించదు. కడ్తాల్ అనే చోట ఆ ధ్యాన కేంద్రాన్ని సందర్శించినవారిలో తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, కేంద్రమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఉన్నారు. అక్కడ ధ్యానం చేశాక  నాకెంతో మనశ్శాంతి కలిగిందని జైపాల్ రెడ్డి చెప్పుకున్నారు. పత్రికలు ప్రచురించిన దృశ్యాలు చూసిన తర్వాత కూడా మీ మనస్సు అంతే శాంతిని అనుభవిస్తోందా జైపాల్ రెడ్డిగారూ?

ఆసియాలోనే అతి పెద్ద పిరమిడ్ గా దాని గురించి చెబుతున్నారు. పిరమిడ్ నిర్మాతపై అసైన్డ్ భూమిని కబ్జా చేశారన్న ఆరోపణ వినిపిస్తోంది. పిరమిడ్ నిర్మించిన ప్రాంతం చుట్టుపక్కల రియెల్ ఎస్టేట్ మంచి ఊపులో ఉందంటున్నారు. పిరమిడ్ నిర్మాణ వ్యూహాలలో అది కూడా భాగమంటున్నారు. వినిపించే ఆరోపణలను అలా ఉంచి కనిపించే దృశ్యాల గురించే మాట్లాడుకుందాం.

ఢిల్లీ యువతి మానభంగంతో ఈ దృశ్యాలను ఎలా పోల్చుతారన్న సందేహం ఎవరికైనా ఉండచ్చు.  ఢిల్లీ ఘటనకు భిన్నంగా పై దృశ్యాలలోని మహిళలు ఇష్టపూర్వకంగా ఆలింగనాలు, ముద్దులు, ఒడి లాలింపులు అంగీకరించారన్న వాదన ముందుకు తేవచ్చు. కానీ లోతుగా ఆలోచించి చూడండి...పై దృశ్యాలు ఢిల్లీ ఘటనకంటే కూడా దారుణమైనవని మీకే అనిపిస్తుంది. ఢిల్లీ ఘటనలో క్రౌర్యం ఉంది, పాశవికత్వం ఉంది, దౌర్జన్యం ఉంది. కానీ పై దృశ్యాలలో ఆధ్యాత్మికత ముసుగులో జరిగే బహిరంగ వంచన ఉంది. ప్రేమతత్వం అనే  మత్తు చల్లి  మహిళల్ని లొంగదీసుకుని వారి శరీరంపై ఆధ్యాత్మిక  అత్యాచారానికి పాల్పడే నికృష్టత ఉంది.

ఈ దృశ్యాలు ఈ దేశ సాంస్కృతిక విలువలకు చేసే గాయాల మాటేమిటి? ఇవి ఈ దేశప్రజలకు కలిగించే సాంస్కృతిక ఆఘాతాల సంగతేమిటి? ఇంత గొప్ప ఆధ్యాత్మికసంపన్నత ఉన్న ఈ దేశంలో మహిళల్ని ముద్దాడడం, ఆలింగనం చేసుకోవడం, ఒళ్ళో కూర్చొబెట్టుకోవడం లాంటి నీచమైన చర్యలను ఏ ఆధ్యాత్మిక సంప్రదాయమైనా బోధించిందా? ఎదిగిన కూతురును తాకడానికి కన్నతండ్రి కూడా సందేహించే ఈ దేశంలో పరపురుషుడు బహిరంగంగా యువతులను ఆలింగనం చేసుకునే దృశ్యాన్ని ఊహించగలమా? ఈ దేశంలో ధ్యాన సంప్రదాయాలకు ఎంత చరిత్ర ఉంది? బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్య, అధునాతన కాలంలో రమణమహర్షి, అరవిందుడిలాంటి ఎందరో ప్రవచించిన ఆరోగ్యకరమైన ధ్యాన సంప్రదాయాలు, నమూనాలు మనకు ఎన్ని లేవు? ఏ సంప్రదాయమైనా ఇలాంటి అత్యాచారాలకు తావిచ్చిందా? ఇంత గొప్ప ధ్యానవారసత్వం మనకు ఉండి కూడా ఇలాంటి వెర్రి మొర్రి, నీతిబాహ్య ప్రదర్శనలకు మనవారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఈ ఆధ్యాత్మిక దారిద్ర్యం, దిక్కులేని తనం జనానికి ఎలా దాపురించింది? సూటిగా అడగాలంటే,  ఈ దేశంలోని రకరకాల పురాతన పంథాలకు చెందిన పీఠాధిపతులు, స్వాములు ఏం చేస్తున్నారు?

ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులకు, శక్తులకు గొడుగు పట్టే రాజకీయనాయకత్వం- వారిని మించిన పెద్ద బెడద. ఎవరు, ఎలాంటివారు, వారి కార్యకలాపాలు ఏమిటన్నది చూడకుండా, పిలిచినదే తడవుగా పంచే, కండువాలు సర్దుకుంటూ వచ్చి వాలే గవర్నర్లు, మంత్రులే ఈ అవాంఛనీయ శక్తులకు కొండంత అండ. తమకు లోతుగా  తెలియని విషయాలు ఉంటాయన్న స్పృహ వీరికి ఉండదు. మహాద్భుత నిర్మాణం ఏదో చేసి, ప్రపంచ స్థాయి సభలు జరుపుతున్నారనేసరికి అక్కడ హాజరై పొగడ్తలతో ముంచెత్తడం ఒక్కటే వీరికి తెలుసు. అదే తమ రక్తబంధువులలో ఎవరైనా అలా ఆలింగన, చుంబనాలు అందుకుంటుంటే వీరి స్పందన ఎలా ఉంటుంది? అప్పుడు కూడా ఆ  పిరమిడ్ నిర్మాతను ప్రశంసలతో ముంచెత్తుతారా??

అన్నింటి కన్నా ఆశ్చర్యం...అంత పెద్ద పిరమిడ్ ఆంధ్రదేశం గుండెలపై ఎలా ప్రత్యక్షమైంది? దానికి ఎవరెవరు ఎలాంటి అనుమతులు ఇచ్చారు? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? అక్కడ జరగబోయే కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా ఆరా తీసిన తర్వాతే ఇచ్చారా? ఇప్పుడు ఆ ప్రదేశం నుంచి ఇలాంటి ఘోరమైన దృశ్యాలు దృష్టికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు?,,,ఇవన్నీ శేషప్రశ్నలు.

ఢిల్లీ వైపు దృష్టి సారించిన యావద్దేశం ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూపు మళ్లించవలసిన అవసరం లేదా అన్నది ఈ క్షణాన అసలు ప్రశ్న.