Thursday, January 30, 2014

కోసల, మగధ...ఓ సినిమా కథ!


ఓ రోజున టీవీలో అలెగ్జాండర్ సినిమా వస్తోంది. ఆ సినిమా చూస్తుంటే,  అలెగ్జాండర్-పురురాజుల యుద్ధం గురించి ప్లూటార్క్ ను ఉటంకిస్తూ కొశాంబీ రాసిన వివరాలు గుర్తొచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుని ఉంటారనిపించి ఆసక్తిగా చూశాను. అయితే, నిరాశే మిగిలింది. ఆ యుద్ధాన్ని ఒకటి రెండు దృశ్యాలతోనే  తేల్చేశారు. గడ్డంతో ఉన్న పురురాజు ఏనుగు మీద యుద్ధానికి వస్తున్నట్టు మాత్రం చూపించారు.

మిగతావాళ్ళ సంగతి ఎలా ఉన్నా మనకు మాత్రం చరిత్ర కిటికీ తెరచుకున్నది అలెగ్జాండర్ తోనే. అలెగ్జాండర్ ప్రధానంగా కాకపోయినా ఆ పాత్రతో కొన్ని చారిత్రక సినిమాలు మనవాళ్లు తీశారు. అవి చరిత్రకు ఎంత దగ్గరగా ఉన్నాయనేది వేరే విషయం. అలాగే, బుద్ధుడి కథతో తీసిన కొన్నింటిని వదిలేస్తే, నేను గమనించినంతవరకు మన చారిత్రక సినిమా మగధను, చాణక్యుని, చంద్రగుప్తుని, అశోకుని దాటి ఎప్పుడూ వెనక్కి వెళ్లలేదు. ఒకవేళ నా అభిప్రాయం తప్పని విజ్ఞులెవరైనా సోదాహరణంగా చెబితే సవరించుకోడానికి సిద్ధమే. కనీసం, మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి పూర్వరంగంలో ఏం జరిగిందో చెప్పే సినిమాలు మాత్రం రాలేదు. మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడానికి ముందు కోసల అనే రాజ్యంతో పోటీ పడిన సంగతిని చెప్పే సినిమా రాలేదు.

నాకు సినిమా పరిజ్ఞానం తక్కువ. అయినాసరే, మగధ ఒక మహాసామ్రాజ్యం కావడానికి పూర్వరంగంలో సినిమాకు పనికొచ్చే కథ ఒకటి ఉందని నాకు అనిపించింది. పైగా నా సొమ్మేం పోయింది, అది హాలీవుడ్ స్థాయిలో భారీవ్యయంతో తీయదగిన సినిమా అని కూడా అనిపించింది. ఒక సినిమా విజయవంతం కావాలంటే కథకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో, అందులో ఎలాంటి దినుసులు ఉండాలో నాకు తెలియవన్న సంగతిని ఒప్పుకుంటూనే ఆ కథను ఒక సినిమా కథగా మలచే ప్రయత్నం చేశాను.

(పూర్తి వ్యాసం  http://magazine.saarangabooks.com/ లో చదవండి)   

Friday, January 24, 2014

అక్కినేని అస్తమయం: నా జీవన కుడ్యంపై ఒక స్మృతిపటం బద్దలైంది

అక్కినేని నాగేశ్వరరావుగారి అస్తమయంపై ఆలస్యంగా స్పందిస్తున్నందుకు బాధగానే ఉంది. మరీ ఆలస్యం కానందుకు ఒకింత ఓదార్పుగానూ ఉంది.

నాటకాలు పురాతన కాలం నుంచీ ఉన్నాయి. సినిమా ఆధునిక కాలంలో వచ్చింది. ఏ ఆధునిక కళా రూపానికి లేని ప్రత్యేకత సినిమాకు ఉంది. ఎలాగంటే, సినిమా మన జీవితంలో భాగమవుతుంది. సినిమా నటులు మన జీవితంలో మన కుటుంబసభ్యులంత పరిచయమవుతారు. సన్నిహితులు అవుతారు. మనతోపాటే శారీరకంగా, మనకు తెలియకపోయినా మానసికంగా పరిణామం చెందుతారు. వాళ్ళు నటించిన పాత సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ మనకు కనిపిస్తుంటాయి. మనం బాల్యం నుంచీ గడిచివచ్చిన జీవితం తాలూకు స్మృతులను, అప్పటి పరిసరాలు, వాతావరణం గురించిన జ్ఞాపకాలను రేపుతూ ఉంటాయి. నాటకం తదితర కళారూపాలకు ఈ అవకాశం లేదు. నాటకాల కంటే సులువుగా మనం సినిమా చూస్తాం. ఒకే సినిమాను మళ్ళీ మళ్ళీ చూడగలం. ఇప్పుడు ఇంట్లోనే ఎప్పుడనుకుంటే అప్పుడు సినిమా చూసే అవకాశం వచ్చింది. టీవీ తదితర సదుపాయాలు వచ్చాక సినిమా మనకు ఒకవిధంగా లోకువైపోయింది. అతి కూడా అయిపోయినట్టుంది. ఇప్పుడు సినిమాల సంఖ్య ఎంతో పెరిగింది కానీ, నటీ నటుల పేర్లు గుర్తుండడం లేదు. నాగేశ్వరరావు వగైరాలలా దశాబ్దాలపాటు చెప్పుకోదగిన నటజీవితం జీవిస్తున్న నటులు తగ్గిపోయారు. ఓ పదేళ్ళపాటు నిలకడైన నటజీవితం ఇప్పుడు గొప్పే.

నేను కొన్నేళ్ళ క్రితం, సినిమా పేజీకి ఇంచార్జిగా ఉన్న ఓ జర్నలిస్టు మిత్రుడి దగ్గర ఓ సందేహాన్ని వ్యక్తం చేశాను...ఇదివరకు, ఘంటసాల, సుశీల, జానకి, లీల, పిఠాపురం, మాధవపెద్ది వంటి నేపథ్యగాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉండేవి. ఇప్పుడు అలా గుర్తుండిపోయేలా నేపథ్య గాయకుల పేర్లేవీ ఎందుకు వినబడడం లేదని? అందుకాయన, ఘంటసాలలాంటి వాళ్ళు మహానుభావులు, అంతటి వాళ్ళు మళ్ళీ పుట్టరన్నాడు. నా సందేహాన్ని మరింత అర్థమయ్యేలా ఆయనకు పదే పదే వివరించినాసరే, ఆయన అదే సమాధానం చెబుతూ వచ్చారు. నేనిక విసుగొచ్చి ఊరుకున్నాను. నా ఉద్దేశం ఏమిటంటే, ప్రతిభ ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయేది కాదు. పై పరిస్థితికి ఇంకేవైనా కారణాలు ఉండచ్చు. సినిమా పేజీ చూసే మనిషి కనుక ఆయనేమైనా వాటిని వివరించగలరేమో అనుకున్నాను.

నాగేశ్వరరావు గారి గురించి ప్రారంభించి ఇదంతా ఏమిటని అనుకుంటూ ఉంటారు. ఇది ఆయనలాంటి నటుల ప్రత్యేకత గురించి చెప్పడమే.

అరవైలలో నాకు సినిమా ఊహ తెలిసినప్పటినుంచీ నాకు నాగేశ్వరరావుతో పరిచయం(నాకే కాదు, నా వయసున్న చాలామందికి). అక్కినేని, ఎన్టీఆర్, కాంతారావు, అంజలి, సావిత్రి, జమున, ఎస్వీరంగారావు, రమణారెడ్డి, రేలంగి...ఇంటింటి  పేర్లుగా ప్రతి చోటా వినిపించే వాతావరణంలో నా బాల్య, కౌమారాలు గడిచాయి (ఆ తర్వాత ఇంకో తరం నటులు వచ్చారు).  వీరిలో (జమున మినహా) అంతా కనుమరుగయ్యారు. నా బాల్య, కౌమారాలే కాలగర్భంలో కలిసిపోతున్నాయన్న మాట.

చిన్నప్పటినుంచీ తెరమీద చూసిన నటుల్ని ఆ తర్వాత చాలాకాలానికి ప్రత్యక్షంగా చూడడం ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో నేను అనేకసార్లు అనుభవించాను. నేను ఒక సినీ నటుని అతి దగ్గరగా ప్రత్యక్షంగా చూసింది, నాకు గుర్తున్నంతవరకు రాజమండ్రిలో. అది కాంతారావును. ఆ తర్వాత చాలా ఏళ్ళకు నేను పాత్రికేయుణ్ణి అయిన తర్వాత, కాంతారావుగారినే, ఆయన అన్నివిధాలా చితికిపోయిన తర్వాత, నల్లకుంట కూరగాయల మార్కెట్ దగ్గర ఒక చిన్న ఇంట్లో ఉండగా కలిసి, తెరమీద చూసిన కాంతారావును క్షణక్షణం గుర్తుచేసుకుంటూ ఆయనను చూస్తూ కాసేపు మాట్లాడాను. అలాగే, మాట్లాడే అవకాశం రాలేదు కానీ ఏయన్నార్, ఎన్టీఆర్ లను కూడా చూశాను. నటుడు పద్మనాభంతో కలసి ఒకే రైలు పెట్టె లో ప్రయాణం చేశాను.

మాట్లాడిన అనుభవం మళ్ళీ గుమ్మడి గారితో ఉంది. నేను ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు ఓ కొత్త కాలమ్ కు రూపకల్పన చేశాను. వివిధరంగాల ప్రముఖులను వాళ్ళ రంగం గురించి తప్ప ఇతరరంగాల గురించి, ఇతర అనుభవాల గురించి మాట్లాడించడం ఆ కాలమ్. ఓ వారం అందుకు గుమ్మడి గారిని ఎంచుకున్నాను. సినిమా మినహా ఇతర జీవితానుభవాల గురించి, ఇతర రంగాల గురించి ఆయన ఎన్నో విలువైన అంశాలను చెప్పుకొచ్చారు. నేను ఇంటికి తిరిగివచ్చిన కాసేపటికి, ఆయన దగ్గరనుంచి నాకు ఫోన్ వచ్చింది. మీరు మీ పుస్తకం ఒకటి నా దగ్గర మరిచిపోయారు. వీలైనప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. చిన్నప్పటినుంచీ సినిమాలలో చూస్తున్న గుమ్మడి గారు నాకు ఫోన్ చేయడం! చాలా థ్రిల్ అయ్యాను. ఆయన అద్భుత జ్ఞాపకశక్తి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. పై సందర్భం తర్వాత చాలా ఏళ్ళు గడిచాయి. ఓ సాహిత్యసభలో నేను మాట్లాడాలి. గుమ్మడి గారు కూడా అందులో పాల్గొంటున్నారు. నేను వెళ్ళేసరికి ఆలస్యమైంది. దాంతో ఆయనను పలకరించే అవకాశం రాలేదు. వేదిక మీదికి పిలుస్తున్నారు. గుమ్మడిగారు ఆ చివరి నుంచి వేదిక ఎక్కారు. నేను ఈ చివరి నుంచి వేదిక ఎక్కాను. గుమ్మడి గారు నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి బాగున్నారా అని ఆయనే నన్ను పలకరించారు. నాకు సిగ్గు, ఆశ్చర్యమూ కూడా కలిగాయి.

నాగేశ్వరరావు గారిని సభలు, సమావేశాల్లో చాలాసార్లు చూశాను, విన్నాను. మా పాత్రికేయ సహచరులు, ప్రముఖ సినీ జర్నలిస్టు పి.ఎస్.ఆర్ ఆంజనేయశాస్త్రి గారు కాలంచేసినప్పుడు ఆయన శాస్త్రిగారి ఇంటికి వచ్చినప్పుడు దగ్గరగా చూశాను. కానీ నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం రాలేదు. నాకు చాలా కాలంగా ఒక కోరిక ఉండేది. అలాంటి పెద్ద నటులతో సినిమాయేతర విషయాలు మాట్లాడించి జనానికి తెలియని వారి ఇతర ఆలోచనాసరళిని పరిచయం చేయడం. కాలం మన కోరికలనెన్నింటినో తన ఇనపచక్రాలకింద చిదిమేస్తూ ముందుకు పోతూనే ఉంటుంది. మనం నిస్సహాయులం.

నాగేశ్వరరావు గారి మరణంతో నా జీవనకుడ్యంపై బాల్యం నుంచీ వేలాడుతున్న స్మృతిపటాలలో ఒకటి కింద పడి భళ్ళున బద్దలైంది. నాలాంటివాళ్లే ఇంకా చాలామంది...

Thursday, January 23, 2014

రామాయణ, భారతాలలో ఏది ముందు?

 మహాభారత, రామాయణాల కాలం ఎప్పుడు?  వీటి గురించి వేర్వేరు లెక్కల మీదే కాక, విశ్వాసం మీద కూడా ఆధారపడిన కాలనిర్ణయాలు చాలా కనిపిస్తాయి. శ్రీ రామ్ సాఠె అనే పండితుడు రామాయణ కాలం గురించి రాస్తూ, ప్రస్తుతం నడుస్తున్నది వైవస్వత మన్వంతరం కాగా, ఇంతకుముందు అనేక మన్వంతరాలు గడిచాయనీ; ప్రతిమన్వంతరంలోనూ నాలుగు యుగాలు వస్తుంటాయనీ, రామాయణం జరిగింది వేరొక మన్వంతరంలోని త్రేతాయుగంలోననీ అంటూ రామాయణ కథను లక్షల సంవత్సరాల వెనక్కి జరిపిన సంగతి ఎప్పుడో చదివిన గుర్తు.

మహాభారతకాలం మీద కూడా రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. మరీ మన్వంతరాలలోకి వెళ్లకుండా మన సాధారణ బుద్ధికి అందేమేరకు చూస్తే, కోశాంబీ అనుసరించిన కాలనిర్ణయం ప్రకారం, మహాభారతం జరిగి ఉంటే అది క్రీ.పూ. 1000లో జరిగింది. అలాగే, భాతం ముందా, రామాయణం ముందా అనే ప్రశ్న కూడా వస్తుంది.  రాముడు కోసలకు చెందిన కౌసల్య కొడుకు కనుక; వాయవ్య, పశ్చిమాలనుంచి తూర్పు దిశగా, హస్తినాపురం మీదుగా వలసలు జరిగాయనుకుంటే, కోసల తూర్పున చాలా చివర ఉంది కనుక మహాభారతం తర్వాతే రామాయణం అనిపిస్తుంది.


ఇంకో కోణం నుంచి చూసినా మహాభారతం తర్వాతే రామాయణం అనే అభిప్రాయం కలుగుతుంది. అది; చంద్ర, సూర్యవంశ రాజులకు సంబంధించిన కోణం. మహాభారత రాజులు చాలావరకూ చంద్రవంశీయులు. రాముడు సూర్యవంశీకుడైన ఇక్ష్వాకు రాజు.  జోసెఫ్ క్యాంప్ బెల్  రాసిన Occidental Mythology లో ఈ చంద్ర, సూర్యవంశాలకు సంబంధించి ఆసక్తికరమైన వివరణ ఉంది. అది ప్రత్యేకంగా, చాలా వివరంగా చెప్పుకోవలసిన అంశం కనుక వాయిదా వేయక తప్పదు.

(పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2014/01/23/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%97%E0%B0%A7%E0%B0%95%E0%B1%81/లో చదవండి. మీ స్పందన అందులో పోస్ట్ చేయండి)

Thursday, January 16, 2014

యయాతి కథలో చరిత్రను ఎలా చూడచ్చు!

యజ్ఞం, దానం, అధ్యయనం, దస్యుహింస, జనరంజకపాలన, యుద్ధంలో శౌర్యం రాజధర్మాలు. వీటన్నిటిలోనూ యుద్ధం మరింత ఉత్తమధర్మం
                                                     (శ్రీమదాంధ్రమహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం)


ధర్మరాజుకు రాజనీతిని బోధిస్తూ భీష్ముడు ఏమంటున్నాడో చూడండి... యజ్ఞం, దానం, జనరంజకపాలన, యుద్ధంలానే దస్యు హింస కూడా రాజు(లేదా యజమాని) నిర్వర్తించవలసిన ధర్మాలలో ఒకటి అంటున్నాడు. దస్యులు-దాసులు అనే రెండు మాటలకు ఏదో సంబంధం ఉన్నట్టు కనిపిస్తుందని రాంభట్ల(జనకథ) అంటారు. దస్యులు ఆలమందలను, వాటిని కాచుకునే మనుషులను అపహరించేవారనీ; మందలను, మనుషులనూ కూడా వ్యవసాయదారులకు అమ్మేసేవారనీ, అలా కొనుక్కున్న మనుషులను దాసులు అనేవారనీ ఆయన వివరణ. వ్యవసాయం పనులకు మంద-మంది ఎప్పుడూ అవసరమే.  ఆవిధంగా వ్యవసాయం పనులకు సహకరించే పశువుకూ, మనిషికీ పోలిక కుదిరింది. అందుకే పని చేసిన తర్వాత  వారికి కూలి రూపంలో ఇచ్చే తిండికీ  పోలిక కుదిరింది. దాని పేరు: గ్రాసం. గ్రాసం అంటే గడ్డి, లేదా తృణసంబంధమైన ఆహారం. విశేషమేమిటంటే, గ్రాసం అనే మాట నిన్నమొన్నటి వరకు జీతం అనే అర్థంలో వాడుకలో ఉంది. 

(పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2014/01/16/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%9A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5 చదవండి. మీ స్పందనను అందులోనే పోస్ట్ చేయండి)

Monday, January 6, 2014

ఉదయ కిరణం అప్పుడే ఎలా అస్తమించింది?!

మామూలు మనుషులకన్నా కళాకారుడు ఎక్కువ సంతోషంగా జీవిస్తాడు. ఎక్కువ సంతృప్తితో జీవిస్తాడు. ఆ కారణాల వల్ల ఎక్కువ కాలం జీవిస్తాడు!

మరి ఉదయకిరణ్ అనే ఆ అబ్బాయి 34 ఏళ్లకే ఎందుకు చచ్చిపోయాడు??!!

ఎక్కడో లోపముంది. ఎక్కడో తీగ తెగింది. ఏదో అవుతోంది.. ఏమవుతోంది?

బళ్ళారి రాఘవ...స్థానం నరసింహా రావు...పీసపాటి నరసింహమూర్తి...షణ్ముఖి ఆంజనేయరాజు...నిన్నటి కాలానికి చెందిన ఈ రంగస్థల నటులూ నటులే. ఉదయకిరణ్ అనే ఆ అబ్బాయీ నటుడే. కానీ పై నటులు దరిద్రమే అనుభవించారో, సంపన్నతే అనుభవించారో...నటులుగా ఒక జీవిత కాలం తృప్తిగా జీవించారు. ఈ రంగస్థల నటుల్లో కొందరు నటిస్తూనే స్టేజి మీద గుండె ఆగి మరణించినవారూ ఉన్నారు. వీరికి ఉన్న సంతోషకరమైన, సంతృప్తి కరమైన నట జీవితం ఉదయకిరణ్ కు ఎందుకులేకుండా పోయింది? ఉదయకిరణం మధ్యాహ్న కాలానికి కూడా ఇంకా చేరుకోకుండానే ఎందుకు ఆరిపోయింది?

రంగస్థల నటులే దేనికి? వెనకటి తరం సినీ నటులు మాత్రం? చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం మొదలైన వాళ్ళు అంతా సహజమరణమే పొందారు తప్ప అర్థాయుష్కంగా చనిపోలేదు. ఉదయ కిరణ్ ఎందుకు చనిపోయాడు?

వెనకటి నటులకు డబ్బు అంతగా దొరకకపోయినా చిన్నదో పెద్దదో వేదిక దొరికేది. జీవితానికీ, జీవించాలనే కోరికకూ ధనమో ఇంధనమో దొరికేది. మరి ఉదయకిరణ్ కు ఏమి లోపించాయి? అవకాశాల నిచ్చెన మీంచి పైకి పాకే అతని ప్రయత్నాలకు ఏ కనబడని కాలనాగులు అడ్డుపడి కిందికి తోసేసాయి? అతను ఎందుకు డిప్రెషన్ లో పడిపోయాడు? మూడో నాలుగో హిట్ సినిమాలు చేసిన అతనికి కనీసం సినిమా కార్యక్రమాలకు ఆహ్వానాలు రావడం కూడా ఎందుకు మానేశాయి?

ఉదయకిరణ్ ఆత్మహత్య తెలుగు సినీరంగం వర్తమాన స్థితిగతుల పై ఒక విషాదభరిత క్రూరవ్యాఖ్య కావచ్చు. తెలుగు సినీ వేదిక అప్పుడప్పుడే వికసించే కళా జీవితాలకు వధ్యస్థలిగా మారిపోయి ఉండచ్చు. కళ మినహా ఇతరేతర దుష్టశక్తుల స్వైరవిహారానికి ఆటపట్టు అయిన ఒక రుద్రభూమిగా తెలుగు సినీ రంగం మారి ఉండచ్చు.

ఉదయ కిరణ్ అస్తమయం కేవలం తెలుసు సినీరంగ సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్య. లేత తీగలు ఆరోగ్యంగా, ఆనందంగా పైపైకి పాకి పందిరిని అల్లుకునే అవకాశం లేకుండా మూలంలోనే ఏదో చీడ వాటిని తినేస్తోంది. అవకాశాలు, కాసుల వెతుకులాటలో అడుగడుగునా అడ్డుపడే కొండచిలువలను తప్పించుకునే ప్రయత్నంలోనే మనిషి శారీరకంగా, మానసికంగా అలసిపోయి అకాల మరణంలోనే సమాధానాన్ని వెతుక్కుంటున్నాడు.

ఉదయకిరణ్ మరణం ఈ సమాజదేహాన్ని లోలోపలనుంచి తినేస్తున్న భయానక రోగానికి బాహ్యచిహ్నం మాత్రమే!


Sunday, January 5, 2014

కాంగ్రెస్-బీజేపీ(జనసంఘ్)-ఆమ్ ఆద్మీ: నేను

ఈ శీర్షికను బట్టి ఈ పార్టీలతో నాకు ప్రత్యేక సంబంధం ఏదో ఉందని అనుకోకండి. ఈ పార్టీలలో ఉన్న సభ్యులను, నాయకులను మినహాయిస్తే వీటితో మిగతా అందరికీ ఎంత సంబంధం ఉందో నాకూ అంతే ఉంది. పార్టీలతో  ఇంకెలాంటి సంబంధం లేకపోయినా ఈ దేశ ప్రజలు దశాబ్దాలుగా రక రకాల  పార్టీల పేర్లు వింటున్నారు. వాటిలో  ఒక పార్టీకి వోటు వేస్తున్నారు(సరే, అసలు వోటు వేయని వాళ్ళూ ఉన్నారనుకోండి). బాల్యం నుంచి పెద్దరికం వరకు  మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఈ పార్టీలు (ఏడాది వయసు మాత్రమే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతానికి  మినహాయింపు) మన జీవితకాలంలోని అనేకానేక జ్ఞాపకాలలో భాగం అయిపోయాయి. కాదంటారా?!

అలాంటి నా  చిన్నప్పటి జ్ఞాపకాలలో ఒకటి...

60 దశకంలో విజయవాడలో మేమున్న సత్యనారాయణపురంలో  చాలా చోట్ల గోడల మీద ఒక దీపం గుర్తు, పక్కనే జనసంఘ్ అనే పేరు కనిపించేవి. జనసంఘ్ అనే ఆ పేరు పక్కనే ఎవరో కొంటె పిల్లలు 'భో' అనే అక్షరం చేర్చేవారు. అప్పుడది 'భోజనసంఘ్' అయ్యేది. అలా ఒక్క అక్షరం చేరితే అర్థం మారిపోవడం నాకు వింతగానూ, ఆసక్తికరంగానూ ఉండేది.

కాంగ్రెస్ గురించి నాకు ఇటువంటి చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవీ లేవు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా  ఉన్నా దాని గురించి అప్పటికి నాకు పెద్దగా ఏమీ తెలియదు. తెలిసింది కూడా నెగిటివ్ గానే తెలుసు. 63లోనో 64లోనో కానీ, ఒక వేసవి కాలంలో విజయవాడలో చాలా చోట్ల కొంపలు అంటుకుపోయేవి.  దగ్గరలో ఇళ్ళు అంటుకున్నాయన్న వార్త రావడం, అంతా బక్కెట్లతో, బిందెలతో నీళ్ళు సిద్ధం చేసుకుని ఇంటికి  కాపలా కాయడం కొన్ని రోజులపాటు సాగింది. అలా ఇళ్ళు అంటుకుపోవడానికి ఏవో క్షుద్రశక్తులు కారణమని చెప్పుకునేవారని నాకు లీలగా జ్ఞాపకం. ఆ తర్వాత అది కమ్యూనిష్టుల పని అని కూడా ప్రచారమయింది. అందులో నిజం ఎంతో అబద్ధమెంతో తెలుసుకునే వయసు నాకు లేదు కానీ, మొత్తానికి ఆ ప్రచారం కమ్యూనిష్టులంటే భయాన్ని మాత్రం పుట్టించింది. దానికితోడు నా సామాజికవర్గం రీత్యానూ, మేమున్న ప్రాంతం రీత్యానూ కమ్యూనిష్టుల గురించి నాకు ఎక్కువగా తెలిసే అవకాశం కూడా లేదు.

మిగిలింది కాంగ్రెస్... ఉన్నది ఒక్క కాంగ్రెస్సే కనుక దాని గురించి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగిన జ్ఞాపకాలు ఏవీ లేవు. మన ఇంట్లో చిరకాలంగా చూస్తున్న మనుషులు, టేబులు, కుర్చీ,  గోడ గడియారం లానే అదీ ఒక పరిచితమైన పేరు మాత్రమే. ఎన్నికలొచ్చినప్పుడు మా అమ్మ, నాన్న వెళ్ళి వోటు వేసిరావడం; కాంగ్రెస్ కు వేశామని చెప్పడం లీలగా గుర్తు.

అయితే, మా సామాజికవర్గంలో కాంగ్రెస్ మీదా, గాంధీ, నెహ్రూల మీదా; తర్వాత తర్వాత ఇందిరాగాంధీ మీదా చాలా వ్యతిరేకతా, తీవ్ర తృణీకారభావం గూడుకట్టుకున్నాయన్న సంగతి నాకు క్రమంగా అర్థమవుతూ వచ్చింది. ప్రైవేట్ సంభాషణాల్లో వాళ్ళను చెడ తిట్టడం కూడా నాకు తెలుసు. అయినా సరే, కాంగ్రెస్ కే వోటు వేసేవారంటే ప్రత్యామ్నాయం లేకనే కాబోలు. వాళ్ళలో కొందరికి జనసంఘ్ పట్ల అనుకూలత ఉండేది కాబోలు. కానీ దానిని వ్యక్తీకరించే మార్గం లేదు. ఆ పార్టీకి అంగబలం, అర్థబలం, కనీసం ఇంకొకరు డిపాజిట్ కడతామని బతిమాలినా ఎన్నికల్లో నిలబడడానికి ముందుకొచ్చే అభ్యర్థులు లేరు. అయితే,  రాష్ట్రంలో ఆ పార్టీని నిర్మించే పని ఆర్.ఎస్.ఎస్. వైపునుంచి ఒక దీర్ఘకాలిక ప్రణాళికలా అప్పటినుంచీ జరుగుతూనే ఉన్నట్టుంది.  ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలను జనసంఘ్ కు అందిస్తూ ఉండడం నాకు ఒకింత సాధికారికంగా తెలుసు. విశేషమేమిటంటే, జనసంఘ్ భవిష్యరూపమైన బీజేపీ అవతరించిన తర్వాత కూడా ఆ ప్రణాళిక పూర్తి అయినట్టు లేదు.

70 దశకం వచ్చేసరికి నాకు రాజకీయాలు ఒకింత బోధపడుతూవచ్చాయి. ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీ విధింపు నాకే కాదు, నా తరం వారు అందరి  ప్రాథమిక రాజకీయ అవగాహనకూ ఎంతోకొంత దోహదం చేశాయి. అప్పటికే ఒక వర్గం దృష్టిలో విలన్లుగా ముద్రపడిన కాంగ్రెస్, గాంధీ, నెహ్రూలు ఇందిరాగాంధీ రాకతో మరింత విలన్లుగా మారడమే కాక, వాళ్లలోనూ ఇందిరాగాంధీ అతి పెద్ద విలన్ గా అవతరించారు. మన రాష్ట్రంలో బలపడకపోయినా ఉత్తరాది రాష్ట్రాలలో కొంత బలపడిన  జనసంఘ్ జనతా పార్టీలో విలీనం కావడం ద్వారా కేంద్రంలో అధికారానికి దగ్గరగా వచ్చింది. మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో అప్పటికే ఆ పార్టీ అధికారం చవి చూసింది. అప్పట్లో మా ఊరు వచ్చిన ఉత్తరభారత స్వామీజీ ఒకరు మధ్యప్రదేశ్ లోని వీరేంద్రకుమార్ సక్లేచా ప్రభుత్వం అంత అవినీతి భూయిష్టమైన ప్రభుత్వం మరెక్కడా లేదని మా ఊళ్ళో గోదావరి స్నానానికి వెళ్లినప్పుడు ఒక పెద్దాయనతో అనడం నాకు బాగా గుర్తు.

సరే, ఈ చరిత్రంతా చెప్పడానికి దీనిని మొదలుపెట్టలేదు. అదలా ఉంచితే, నాకు గుర్తున్నంతవరకు  తెలిసీ తెలియని ఆ వయసులో జనసంఘ్ నాకు కాంగ్రెస్ కంటే భిన్నంగా, admirable గా కనిపించిన మాట నిజం. అయితే అందుకు కారణం అది హిందువుల పార్టీ అని కాదు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న, కొన్ని విలువల గల పార్టీ అనే ఊహ ఉండేది. 70 దశకంలో మేము పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరులో ఉండేవారం. కొవ్వూరులో జనసంఘ్ కు sole representative ఒకే ఒకరు ఉండేవారు. ఆయన పేరు రావి విశ్వేశ్వరరావు. ఆ పార్టీ నిర్మాణానికి సొంత ఖర్చు మీద కాలికి బలపం కట్టుకుని తిరిగేవారు. ఓడిపోతారని తెలిసినా సరే,  రాజమండ్రి లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎమర్జెన్సీలో జైలుకెళ్లి వచ్చిన చాపరాల సుబ్బారావు అనే ఆయనని పోటీ చేయించారు. చెప్పొచ్చేదేమిటంటే, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రాంతంలో కూడా జనసంఘ్ ప్రస్తుతరూపమైన బీజేపీ తన ఉనికిని పెంచుకోవడం ప్రారంభించింది. రాజమండ్రి నియోజకవర్గం నుంచి రెండుసార్లు, నరసాపురం నియోజకవర్గం నుంచి ఒకసారి ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. కానీ నాకు రావి విశ్వేశ్వర రావు, చాపరాల సుబ్బారావులు ఏమయ్యారో తెలియలేదు. వాళ్ళ పేర్లు మళ్ళీ వినిపించలేదు.

పంచాంగం ఒక ఆవృత్తిని పూర్తి చేసుకుంది, ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చి ఆశ్చర్యచకితం చేసింది. అవినీతి లేని నిజాయితీతో కూడిన స్వచ్చమైన పాలనను అందించడం అనే ధ్యేయంతో ఆ పార్టీ అవతరించిన సంగతి తెలిసిందే.

 జనసంఘ్(బీజేపీ)ను మా చిన్నప్పుడు మేము  అచ్చంగా ఇలాంటి పార్టీగానే ఊహించుకున్నామని పైన చెప్పాను కదా. అటువంటి బీజేపీకి ఆమ్ ఆద్మీ చెమటలు పట్టిస్తుండడం, ఆ పార్టీని బదనాం  చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుండడం  నాకు ఆశ్చర్యంగానే కాక  వినోదంగా కూడా ఉంది.

ఇప్పుడు 15-20 ఏళ్ల వయసు ఉన్నవారు, మా తరం వాళ్ళు జనసంఘ్ లేదా బీజేపీని ఊహించుకున్నట్టే, ఆమ్ ఆద్మీని ఊహించుకుంటూ ఉంటారనడంలో సందేహం లేదు. ఈవిధంగా పంచాంగం మరో ఆవృత్తిని ప్రారంభించిందని అనుకోవచ్చు.

ఈ ఆవృత్తి అయినా వెనకటి ఆవృత్తిని రిపీట్ చేయకూడదని కోరుకోవడంలో తప్పేముంది? మనిషి ఆశాజీవి కదా!








Thursday, January 2, 2014

సంపన్న 'దాసు'లు, 'అసుర' దేవతలు

ఇంతా చెప్పుకున్న తర్వాత కూడా, యయాతి కథ పశ్చిమాసియాలో జరిగిందనేది ఒక ఊహా లేక వాస్తవమా అన్న సందేహం అలాగే ఉండిపోతుంది. 

ఇందుకు కచ్చితమైన సమాధానాన్ని రాబట్టడం కష్టం. మహా అయితే మనం ఒకటి చేయగలం. అది: నిరంతర సంచారజీవితమూ, సమూహాల మధ్య ఘర్షణలు, వలసల నేపథ్యంలో పశ్చిమాసియా-భారతదేశాల మధ్య ఒక సంబంధాన్ని ఊహించడం. అప్పుడు వ్యక్తులు లేదా పాత్రల స్థానంలో పరిస్థితులు ప్రాధాన్యం వహిస్తాయి. 

ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ From Lineage to State అనే రచనలో క్రీ. వె. ప్రథమ సహస్రాబ్ది మధ్యలో గంగానదీ లోయలోని సమాజపు అమరికలను పురావస్తుఆధారంగా చర్చించారు. నాటి పరిస్థితుల అవగాహనకు  ఆ చర్చ ఏమైనా తోడ్పడవచ్చేమో... 

(పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2014/01/02/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0-%E0%B0%A6/లో చదవండి. మీ స్పందనను అందులో పోస్ట్ చేయండి)