Friday, January 24, 2014

అక్కినేని అస్తమయం: నా జీవన కుడ్యంపై ఒక స్మృతిపటం బద్దలైంది

అక్కినేని నాగేశ్వరరావుగారి అస్తమయంపై ఆలస్యంగా స్పందిస్తున్నందుకు బాధగానే ఉంది. మరీ ఆలస్యం కానందుకు ఒకింత ఓదార్పుగానూ ఉంది.

నాటకాలు పురాతన కాలం నుంచీ ఉన్నాయి. సినిమా ఆధునిక కాలంలో వచ్చింది. ఏ ఆధునిక కళా రూపానికి లేని ప్రత్యేకత సినిమాకు ఉంది. ఎలాగంటే, సినిమా మన జీవితంలో భాగమవుతుంది. సినిమా నటులు మన జీవితంలో మన కుటుంబసభ్యులంత పరిచయమవుతారు. సన్నిహితులు అవుతారు. మనతోపాటే శారీరకంగా, మనకు తెలియకపోయినా మానసికంగా పరిణామం చెందుతారు. వాళ్ళు నటించిన పాత సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ మనకు కనిపిస్తుంటాయి. మనం బాల్యం నుంచీ గడిచివచ్చిన జీవితం తాలూకు స్మృతులను, అప్పటి పరిసరాలు, వాతావరణం గురించిన జ్ఞాపకాలను రేపుతూ ఉంటాయి. నాటకం తదితర కళారూపాలకు ఈ అవకాశం లేదు. నాటకాల కంటే సులువుగా మనం సినిమా చూస్తాం. ఒకే సినిమాను మళ్ళీ మళ్ళీ చూడగలం. ఇప్పుడు ఇంట్లోనే ఎప్పుడనుకుంటే అప్పుడు సినిమా చూసే అవకాశం వచ్చింది. టీవీ తదితర సదుపాయాలు వచ్చాక సినిమా మనకు ఒకవిధంగా లోకువైపోయింది. అతి కూడా అయిపోయినట్టుంది. ఇప్పుడు సినిమాల సంఖ్య ఎంతో పెరిగింది కానీ, నటీ నటుల పేర్లు గుర్తుండడం లేదు. నాగేశ్వరరావు వగైరాలలా దశాబ్దాలపాటు చెప్పుకోదగిన నటజీవితం జీవిస్తున్న నటులు తగ్గిపోయారు. ఓ పదేళ్ళపాటు నిలకడైన నటజీవితం ఇప్పుడు గొప్పే.

నేను కొన్నేళ్ళ క్రితం, సినిమా పేజీకి ఇంచార్జిగా ఉన్న ఓ జర్నలిస్టు మిత్రుడి దగ్గర ఓ సందేహాన్ని వ్యక్తం చేశాను...ఇదివరకు, ఘంటసాల, సుశీల, జానకి, లీల, పిఠాపురం, మాధవపెద్ది వంటి నేపథ్యగాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉండేవి. ఇప్పుడు అలా గుర్తుండిపోయేలా నేపథ్య గాయకుల పేర్లేవీ ఎందుకు వినబడడం లేదని? అందుకాయన, ఘంటసాలలాంటి వాళ్ళు మహానుభావులు, అంతటి వాళ్ళు మళ్ళీ పుట్టరన్నాడు. నా సందేహాన్ని మరింత అర్థమయ్యేలా ఆయనకు పదే పదే వివరించినాసరే, ఆయన అదే సమాధానం చెబుతూ వచ్చారు. నేనిక విసుగొచ్చి ఊరుకున్నాను. నా ఉద్దేశం ఏమిటంటే, ప్రతిభ ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయేది కాదు. పై పరిస్థితికి ఇంకేవైనా కారణాలు ఉండచ్చు. సినిమా పేజీ చూసే మనిషి కనుక ఆయనేమైనా వాటిని వివరించగలరేమో అనుకున్నాను.

నాగేశ్వరరావు గారి గురించి ప్రారంభించి ఇదంతా ఏమిటని అనుకుంటూ ఉంటారు. ఇది ఆయనలాంటి నటుల ప్రత్యేకత గురించి చెప్పడమే.

అరవైలలో నాకు సినిమా ఊహ తెలిసినప్పటినుంచీ నాకు నాగేశ్వరరావుతో పరిచయం(నాకే కాదు, నా వయసున్న చాలామందికి). అక్కినేని, ఎన్టీఆర్, కాంతారావు, అంజలి, సావిత్రి, జమున, ఎస్వీరంగారావు, రమణారెడ్డి, రేలంగి...ఇంటింటి  పేర్లుగా ప్రతి చోటా వినిపించే వాతావరణంలో నా బాల్య, కౌమారాలు గడిచాయి (ఆ తర్వాత ఇంకో తరం నటులు వచ్చారు).  వీరిలో (జమున మినహా) అంతా కనుమరుగయ్యారు. నా బాల్య, కౌమారాలే కాలగర్భంలో కలిసిపోతున్నాయన్న మాట.

చిన్నప్పటినుంచీ తెరమీద చూసిన నటుల్ని ఆ తర్వాత చాలాకాలానికి ప్రత్యక్షంగా చూడడం ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో నేను అనేకసార్లు అనుభవించాను. నేను ఒక సినీ నటుని అతి దగ్గరగా ప్రత్యక్షంగా చూసింది, నాకు గుర్తున్నంతవరకు రాజమండ్రిలో. అది కాంతారావును. ఆ తర్వాత చాలా ఏళ్ళకు నేను పాత్రికేయుణ్ణి అయిన తర్వాత, కాంతారావుగారినే, ఆయన అన్నివిధాలా చితికిపోయిన తర్వాత, నల్లకుంట కూరగాయల మార్కెట్ దగ్గర ఒక చిన్న ఇంట్లో ఉండగా కలిసి, తెరమీద చూసిన కాంతారావును క్షణక్షణం గుర్తుచేసుకుంటూ ఆయనను చూస్తూ కాసేపు మాట్లాడాను. అలాగే, మాట్లాడే అవకాశం రాలేదు కానీ ఏయన్నార్, ఎన్టీఆర్ లను కూడా చూశాను. నటుడు పద్మనాభంతో కలసి ఒకే రైలు పెట్టె లో ప్రయాణం చేశాను.

మాట్లాడిన అనుభవం మళ్ళీ గుమ్మడి గారితో ఉంది. నేను ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు ఓ కొత్త కాలమ్ కు రూపకల్పన చేశాను. వివిధరంగాల ప్రముఖులను వాళ్ళ రంగం గురించి తప్ప ఇతరరంగాల గురించి, ఇతర అనుభవాల గురించి మాట్లాడించడం ఆ కాలమ్. ఓ వారం అందుకు గుమ్మడి గారిని ఎంచుకున్నాను. సినిమా మినహా ఇతర జీవితానుభవాల గురించి, ఇతర రంగాల గురించి ఆయన ఎన్నో విలువైన అంశాలను చెప్పుకొచ్చారు. నేను ఇంటికి తిరిగివచ్చిన కాసేపటికి, ఆయన దగ్గరనుంచి నాకు ఫోన్ వచ్చింది. మీరు మీ పుస్తకం ఒకటి నా దగ్గర మరిచిపోయారు. వీలైనప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. చిన్నప్పటినుంచీ సినిమాలలో చూస్తున్న గుమ్మడి గారు నాకు ఫోన్ చేయడం! చాలా థ్రిల్ అయ్యాను. ఆయన అద్భుత జ్ఞాపకశక్తి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. పై సందర్భం తర్వాత చాలా ఏళ్ళు గడిచాయి. ఓ సాహిత్యసభలో నేను మాట్లాడాలి. గుమ్మడి గారు కూడా అందులో పాల్గొంటున్నారు. నేను వెళ్ళేసరికి ఆలస్యమైంది. దాంతో ఆయనను పలకరించే అవకాశం రాలేదు. వేదిక మీదికి పిలుస్తున్నారు. గుమ్మడిగారు ఆ చివరి నుంచి వేదిక ఎక్కారు. నేను ఈ చివరి నుంచి వేదిక ఎక్కాను. గుమ్మడి గారు నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి బాగున్నారా అని ఆయనే నన్ను పలకరించారు. నాకు సిగ్గు, ఆశ్చర్యమూ కూడా కలిగాయి.

నాగేశ్వరరావు గారిని సభలు, సమావేశాల్లో చాలాసార్లు చూశాను, విన్నాను. మా పాత్రికేయ సహచరులు, ప్రముఖ సినీ జర్నలిస్టు పి.ఎస్.ఆర్ ఆంజనేయశాస్త్రి గారు కాలంచేసినప్పుడు ఆయన శాస్త్రిగారి ఇంటికి వచ్చినప్పుడు దగ్గరగా చూశాను. కానీ నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం రాలేదు. నాకు చాలా కాలంగా ఒక కోరిక ఉండేది. అలాంటి పెద్ద నటులతో సినిమాయేతర విషయాలు మాట్లాడించి జనానికి తెలియని వారి ఇతర ఆలోచనాసరళిని పరిచయం చేయడం. కాలం మన కోరికలనెన్నింటినో తన ఇనపచక్రాలకింద చిదిమేస్తూ ముందుకు పోతూనే ఉంటుంది. మనం నిస్సహాయులం.

నాగేశ్వరరావు గారి మరణంతో నా జీవనకుడ్యంపై బాల్యం నుంచీ వేలాడుతున్న స్మృతిపటాలలో ఒకటి కింద పడి భళ్ళున బద్దలైంది. నాలాంటివాళ్లే ఇంకా చాలామంది...

2 comments:

  1. భాస్కరం గారూ! అనుభవాలనైనా, మనో భావాలనైనా అందంగా అక్షరీకరించటం, విభిన్నకోణంలో వ్యాఖ్యానించటంలో మీ శైలి అసాధారణం అనిపిస్తుంది. ఈ పోస్టు అలాంటిదే!

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు చాలా థాంక్స్ వేణుగారూ...

      Delete