Monday, July 15, 2013

తనే దుర్వార్తగా మారిపోయిన టెలిగ్రామ్!

నిజమే, కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది. కానీ ఇంత త్వరగా మారిపోతుందని అనుకోలేదు. మన సంగతి అలా ఉంచి మన పూర్వులు అస్సలు అనుకుని ఉండరు .

163 ఏళ్ల క్రితం ప్రారంభమైన టెలిగ్రాఫ్ వ్యవస్థ నిన్నటితో కాలగర్భంలో కలసిపోయింది.  'టెలిగ్రామ్' అనే కేక ఇక వినిపించదు. ఆ వాస్తవాన్ని తలచుకున్నకొద్దీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవేదనగా ఉంటుంది. జీవితంలో హఠాత్తుగా ఏదో వెలితి ఏర్పడినట్టు అనిపిస్తుంది. గతంతో, గతజ్ఞాపకాలతో ఉన్న ఒక లింక్ ఒక్కసారిగా తెగిపోయినట్టు అనిపించి మాటలకు అందని విషాదంతో మనసు బరువెక్కిపోతుంది.

టెలిగ్రామ్ దుర్వార్తలనే కాదు శుభవార్తలనూ మోసుకొచ్చేది. కానీ ఎందుకో టెలిగ్రామ్ అనే కేక వినగానే దుర్వార్తనే శంకించేవాళ్ళం. ఎప్పుడైనా టెలిగ్రామ్ వస్తే మా అమ్మ చాలా ఆందోళన పడేది. ఎక్కడి పని అక్కడే ఆపేసి వంటింట్లోంచి బయటకు వచ్చేసేది. సంతకం పెట్టి టెలిగ్రామ్ తీసుకుని అందులో ఏముందో చదివి చెప్పడానికి పట్టే ఆ అయిదారు నిమిషాల వ్యవధిలోనే ఎక్కడలేని టెన్షన్ నూ అనుభవించేది. "నా కాళ్ళూ చేతులూ ఆడడం లేదు, త్వరగా చదివి చెప్పరా" అనేది.

దుర్వార్తాహరిగా అనుకునే టెలిగ్రామ్ ఇప్పుడు తనే ఒక దుర్వార్తగా మారిపోయింది.

టెలిగ్రామ్ కాలధర్మం చెందినా దుర్వార్తలు ఉంటూనే ఉంటాయి. అయితే దుర్వార్తకూ, టెలిగ్రామ్ కూ ఉన్న ప్రత్యేకమైన ముడి ఇంకే సమాచార సాధనానికీ ఉండకపోవచ్చు. సెల్ ఫోన్ శుభ/అశుభ వార్తల మధ్య తేడాను చెరిపేసింది. సెల్ మోగగానే దుర్వార్తలను శంకించేవాళ్లు ఎవరూ ఉండరు.

నేను టెలిగ్రామ్ ను, అది కూడా ఒక అశుభవార్తను మోసుకొచ్చిన టెలిగ్రామ్ ను చివరిసారి అందుకున్నది... నాకు గుర్తున్నంతవరకూ 1995 మార్చ్ లో!

ఒక జీవిత కాలంలోనే మనం అనేక మార్పులు చూస్తున్నాం. కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేస్తుందని అంటారు కానీ అది మనకు ప్రత్యక్షంగా కనబడదు. కానీ కొత్త టెక్నాలజీ వచ్చి పాత టెక్నాలజీని పక్కకు తోసేయడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పదేళ్ళ కాలంలో ఒక్క  సెల్ ఫోన్ లలోనే ఎన్ని మార్పులు? 2జీ, 3జీ కూడా పాతబడి ఇప్పుడు 4జీ అంటున్నారు. 2జీ కుంభకోణం కేసు ఒక కొలిక్కి వచ్చేలోపల ఇంకా ఎన్ని జీలు వస్తాయో?

మన పూర్వులకీ మనకీ ఇదే తేడా. వారు తమ జీవితకాలంలో ఇన్ని మార్పులు చూసి ఉండరు. టెలిగ్రాము, పోస్ట్ కార్డ్ ల సాహచర్యంతోనే వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయి. మన కళ్ళముందే ఒక్కొక్కటే కనుమరుగైపోతూ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతున్న విషాదం ప్రత్యేకంగా మనదే.

టెలిగ్రామ్ పోయినా టెలిగ్రామ్ అనే కేక మన చెవుల్లో మరికొంతకాలం గింగురు మంటూనే ఉంటుంది. ఆ తర్వాత ఆ కేక కూడా ఆగిపోతుంది.

టెలిగ్రాముకు కన్నీటి వీడ్కోలు!

Saturday, July 13, 2013

పేరులో అక్షరం మారితే జాతకం మారుతుందా?!

"మీ పేరులో ఒక దుష్టాక్షరం ఉంది. అందుకే మీరు ఏది తలపెట్టినా జరగడంలేదు. మీ పేరులో ఒక్క అక్షరాన్ని మార్చుకుంటే చాలు మీరు ఏది ముట్టుకున్నా బంగారమవుతుంది"

ఇలా చెప్పే జ్యోతిష్కులు చాలామంది టీవీ చానెళ్లలో కనిపిస్తున్నారు. టీవీ చానెళ్లు వాళ్ళతో ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకే చానెల్ ఇలాంటి ముగ్గురు, నలుగురితో కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. అంతేకాదు, వాళ్ళ అపాయింట్ మెంట్ తీసుకోడానికి ఫోన్ నెంబర్లు ఇస్తోంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ ఊళ్ళల్లో ఉండేదీ చెబుతోంది. వాళ్ళ పర్యటన వివరాలు ఇస్తోంది. ఇవి వాణిజ్య ప్రకటనల లానూ,  వీరితో ప్రసారం చేసే ప్రశ్నోత్తరాల కార్యక్రమం వీరికి ప్రాచుర్యం కల్పించడానికి ఉద్దేశించిన 'టీజర్ల' లానూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా రుద్రాక్ష వ్యాపార ప్రకటనల లాంటివే. ఈ రకమైన జ్యోతిషంతో ఎంత వ్యాపారం జరుగుతోందో తెలియదు. దీనిపై ఎవరూ దృష్టి పెట్టినట్టు కనిపించదు.

జ్యోతిషం అనేసరికి చాలామందికి ఉత్సుకత ఉంటుంది. పెద్దగా నమ్మనివారు కూడా తమ గురించి ఏం చెబుతారో నన్న ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పోయేదేముంది, ఒక ఫోన్ కాలే కదా అనుకుని ప్రయత్నిస్తారు. కానీ ఎన్నిసార్లు డయల్ చేసినా చానెల్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ దొరకదు. గాఢంగా నమ్మేవాళ్లు అక్కడినుంచి నేరుగా ఆ జ్యోతిష్కుని కాంటాక్ట్ చేస్తారు. బహుశా ఆ నెంబర్ తేలిగ్గా కలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలిపే జవాబుదారీ ఆ టీవీ చానెల్ కు సహజంగానే ఉండదు.

ఇక్కడ కూడా విశ్వాసాన్ని ప్రశ్నించనవసరం లేదు. మనిషికి ఏదో ఒక విశ్వాసం ఉండడం సహజం. అయితే అదే సమయంలో వివేకమూ ఉండాలి. పేరులో ఒక అక్షరం మార్చుకున్నంత మాత్రాన జీవితం బాగుపడిపోతుందా, కష్టనష్టాలనుంచి అవలీలగా బయటపడగలుగుతామా అని క్షణకాలం ఆగి ఆలోచించాలి. తన పేరే ఉన్నవారు అంతా తమలానే ఇబ్బందుల్లో ఉన్నారా అని ఆలోచించాలి, వారిలో ఎంతమంది మంచి స్థితిలో ఉన్నారో చూడాలి. తల్లిదండ్రులు చేసిన నామకరణంలో, లేదా వాళ్ళు చిన్నప్పటినుంచీ పిలిచిన ముద్దు పేరులో వాళ్ళ ఆశీస్సులు కూడా కలిసి ఉంటాయి. అంతకుమించిన గొప్ప ఆశీస్సులు ఎవరినుంచీ అందే అవకాశం లేదు. మన శ్రేయస్సును తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆశించేవారూ ఉండరు. కనుక వారు పెట్టిన, పిలిచిన  పేర్లు చెరుపు చేస్తాయా అని  ఆలోచించాలి.

జ్యోతిషం శాస్త్రమా కాదా అన్న చర్చలోకీ లోతుగా వెళ్ళనవసరం లేదు. శాస్త్రం కాదని ఇట్టే తీర్పు ఇవ్వనూ అవసరం లేదు. జ్యోతిషం శాస్త్రమే అయుండచ్చు. అయితే, "రెండురెళ్ళు నాలుగు" అన్నంత కచ్చితంగా జాతకం చెప్పగలిగినవారు తారసపడేవరకూ మీరు ప్రతివారినీ నమ్మనవసరం లేదు. ఏ ఇద్దరు జ్యోతిష్కులు చెప్పేదీ కలవనంతకాలం, ఏ ఒక్కరు చెప్పిన జాతకఫలం నిజం కానంత కాలం జ్యోతిష్కులను అనుమానంగా చూడక తప్పదు. ఫలానా జ్యోతిష్కుడు చెప్పింది నిజమైంది, ఎందుకు ఆయనను నమ్మకూడదని మీరు అనుకోవచ్చు. అదే జ్యోతిష్కుడు మీ విషయంలో చెప్పిన వాటిలో నిజం కానివీ ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. "అయితే మగ లేదా ఆడ" అన్నట్టుగా కొన్ని నిజమవుతుంటాయి. నమ్మకానికి వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు.

నా స్వానుభవం ఒకటి చెబుతాను. నేను పనిచేసిన ఒక దినపత్రికలో ఒక సిద్ధాంతిగారు వారఫలాలు, సంవత్సర ఫలాలు రాస్తూ ఉండేవారు.  ఆ ఏడాది తను సంవత్సరఫలాలు రాసిన సంచిక తీసుకుని ఓ రోజు ఆయన  నా దగ్గరకు వచ్చారు. "చూడండి, కేంద్రంలో అధికారపరివర్తన జరుగుతుందని రాశాను, అదే జరిగింది" అంటూ నా ముందు  ఆ సంచిక ఉంచారు. యథాలాపంగా తెరచి చూశాను. నిజమే, ఆయన ఆ మాట రాశారు. ఆయనను అభినందించాను. "ఒక రిక్వెస్ట్. నా జోస్యం నిజమైనట్టు చెబుతూ ఒక వార్త ప్రచురించాలి మీరు" అని ఆయన అడిగారు. "సరే ప్రచురిస్తాం. అయితే ఒక షరతుతో" అని నేను అన్నాను. "ఏమిటో చెప్పండి" అని ఆయన అన్నాడు. "మీరు చాలా ఏళ్లుగా సంవత్సరఫలాలు రాస్తున్నారు కదా...మీ జోశ్యాలు ప్రతిసారీ నిజం అయ్యాయా?" అని అడిగాను. ఆయన ముఖంలో రంగులు మారాయి. "ప్రతిసారీ ఎందుకు నిజమవుతాయి. ఏ జ్యోతిష్కుడి అంచనాలైనా ఒక్కొక్కసారి తప్పుతాయి" అని ఆయన అన్నాడు. అదీ వాస్తవం! "ఈ ఏడాది మీ జోస్యం నిజమైందని ప్రకటించడానికి అభ్యంతరం లేదు. దాంతోపాటు మీ విఫల జోశ్యాలను కూడా ప్రకటించాలి. అదే న్యాయం. అవునా, కాదా చెప్పండి?" అన్నాను. "అదెలా కుదురుతుంది?" అని ఆయన అని అక్కడితో సంభాషణ ఆపేశారు.

ఆయన కోరినట్టు వార్త ప్రచురిస్తే ఆయనకు మరింత  పేరు వచ్చి డిమాండ్ పెరగచ్చు. కానీ జ్యోతిషానికీ,  జ్యోతిష్కులను నమ్మేవారికీ ఆ వార్త వల్ల న్యాయం జరగుతుందా? ఆలోచించండి.  

Thursday, July 11, 2013

ఆఫ్రికన్ వ్యాసవాల్మీకులు

‘శిశువు చిత్రనిద్రలో ప్రాచీనస్మృతులూచే చప్పుడు’

అన్న శ్రీశ్రీ కవితా వాక్యం నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది.  పురాచరిత్రలో, పురావస్తువులలో ‘ప్రాచీనస్మృతులూచే చప్పుడు’ వినగలిగే చెవి ఉన్నవారందరికీ ఎలెక్స్ హేలీతో చుట్టరికం కలుస్తుంది.  అతని కథ సొంత కథలానే అనిపిస్తుంది. రోసెట్టా శిలను చూసినప్పుడు అతని కళ్ళలో తళుక్కుమన్న మెరుపునూ, అతని హృదయస్పందననూ వారు పోల్చుకోగలరు. న్యూయార్క్ లో అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి వెళ్ళినప్పుడు, వేల సంవత్సరాల క్రితం శిలగా ఘనీభవించిపోయిన ఒక వృక్షఖండాన్ని చూసి నేను అటువంటి సంచలనానికే లోనయ్యాను. అక్కడే బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి శిక్షాస్మృతిని చెక్కిన శిలను చూశాను. ఆధునిక చరిత్రకారులను ప్రామాణికంగా తీసుకుంటే హమ్మురాబి(క్రీ.పూ. 1750) మన మహాభారత కాలానికి కూడా వెనకటి వాడన్న సంగతి గుర్తొచ్చి కన్నార్పకుండా దానినే చూస్తూ ఉండిపోయాను. 

ఇప్పటికీ ఎలెక్స్ హేలీ మన బంధువే నన్న విశ్వాసం మీకు కలగకపోతే ఇంకో విషయం చెబుతాను.  అతను తన పూర్వీకుడైన కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్లింది ఎక్కడికో కాదు; మనమూ, మనతోపాటు ప్రపంచమంతా ఒకనాడు జీవించిన గతంలోకి! గణసంస్కృతిలోకి!  గణదశలో ప్రపంచ మానవాళి ఒకే అనుభవాలను, ఒకే విధమైన సెంటిమెంట్లను, చివరికి ఒకే విధమైన పురాణగాథలను పరస్పరం పంచుకున్నారు.

ఇంకో విషయం చెబుతాను, ఆశ్చర్యపోకండి... ఎలెక్స్ హేలీ  తన పూర్వీకుని జన్మస్థలానికి వెళ్ళి అక్కడ దర్శించినది మరెవరినో కాదు;  మన వాల్మీకినీ, వ్యాసునీ, వైశంపాయనునీ; గ్రీకుల హోమర్ ను, హెసియాడ్ నే! పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో 1966లో అతను దర్శించిన ఆ వ్యాస/వాల్మీకి/ హోమర్ పేరు:  కెబ్బా కంజీ పొఫానా!

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Saturday, July 6, 2013

ఔట్ సోర్సింగ్ పూజలు, కొరియర్ ప్రసాదాలు!

నా దగ్గరి బంధువు ఒకామెకి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ అమ్ముకోవాలనుకుంది.  చాలాకాలంగా తెలిసిన ఓ స్నేహితురాలు అమ్మి పెడతానని చెప్పి డాక్యుమెంట్లు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని మాసాలకు తన సంతకం ఫోర్జరీ చేసి ఫ్లాటును ఎవరికో అమ్మేసినట్టు తెలిసింది. వాళ్ళు ఫ్లాట్ ను ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది, కోర్టుల సంగతి తెలిసిందే కదా. ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఇప్పటికే వేల రూపాయిలు ఖర్చు పెట్టింది.

అదలా ఉండగా, తిరుపతిలో ఉండే ఒకాయన పూజలు చేసి ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తారని తెలిసి ఆయన ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడింది. నా పూజతో మీ సమస్య ఇట్టే పరిష్కారమై పోతుందనీ, నేను తిరుపతిలోనే ఉండి పూజ చేస్తాననీ, డబ్బు ఖర్చు పెట్టుకుని మీరు కూడా రావలసిన అవసరం లేదనీ, తర్వాత కొరియర్ లో ప్రసాదం పంపిస్తాననీ, మీరు చేయవలసిందల్లా 15వేల రూపాయిలు చెక్కు పంపించడమే ననీ ఆయన చెప్పాడు. ఆమె క్షణకాలం సంశయించడం గమనించి, అందులో నేనేమీ తీసుకోననీ, అంతా పూజలకే ఖర్చవుతుందనీ, పని జరిగాక మీ సంతోషం కొద్దీ ఏమైనా ఇస్తే తీసుకుంటాననీ అన్నాడు. ఆలోచించి చెబుతానని ఆమె అంది,

నాతో ఈ విషయం చెప్పి డబ్బు పంపనా అని అడిగింది. వద్దు, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, మరికొన్ని వేలు నష్టపోవద్దని చెప్పాను. దాంతో ఆమె ఊరుకుంది.

ఇలాంటి వ్యాపారమూ, బేరసారాలు ఎక్కడైనా ఉంటాయా చెప్పండి? ఆయన తిరుపతిలోనే ఉండి పూజలు చేస్తాడట! పూజ చేయించుకునే మనిషి కూడా రావలసిన అవసరం లేదట! డబ్బు పంపితే చాలట! ఆయన పూజ చేశాడని నమ్మకమేమిటి? అదే విశ్వాసం మహిమ. మీరు పూజ చేశారో లేదో మాకు ఎలా తెలుస్తుందని సమస్యల్లో ఉన్నవారు అడగరనీ, ఏం చెప్పినా నమ్మేస్తారనీ ఆయన నమ్మకం. నిజంగానే అలా అడగని వాళ్ళు, డబ్బు పంపేసేవాళ్లూ ఉంటారు. ఏదో విధంగా సమస్య పరిష్కారం అయిపోతే బాగుండునన్న ఆతృత వారిని అలా నమ్మేలా చేస్తుంది. ఆ నమ్మకాన్ని కొల్లగొట్టి సొమ్ము చేసుకోవడమే అవతలివాళ్ళకు బతుకుతెరువు. తిరుపతి మనిషి లాంటివారు ఒకరు కాదు లక్షల్లో ఉంటారు.

చిట్ ఫండ్ కంపెనీల మోసాల గురించి వింటుంటాం. నిజానికి విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని చేసే వ్యాపారాలు, మోసాలు అంతకన్నా పెద్దవి. మోసపూరిత చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళు డబ్బుతో పరారీ అయ్యే ముందు కొంతకాలమైనా మన ఎదురుగా ఉంటారు. వాళ్ళకో ఆఫీసూ, చిరునామా ఉంటాయి. మనిషి కనిపించకుండా పోస్ట్ ద్వారా లావాదేవీలు జరిపే వారి కన్నా ఆమేరకు వారు నయమే కదా!

ముందు పూజలు చేయండి, పని జరిగిన తర్వాత డబ్బు ఇస్తామని అంటే ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు ముందుకొస్తారా? రారు. ఎందుకంటే తమ పూజ వల్ల పని జరుగుతుందన్న నమ్మకం వాళ్లకూ ఉండదు కనుక. మరి పూజా సామగ్రికీ, ఆయన వెచ్చించే కాలానికీ, శ్రమకీ ప్రతిఫలం ఇవ్వద్దా అన్న ప్రశ్న రావచ్చు. అందుకు కావాలంటే కొంత మొత్తం పంపచ్చు. మిగతాది పని జరిగాక ఇస్తామని చెప్పచ్చు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా?  అదీగాక ఎక్కడో ఉండి పూజలు చేస్తాం, మీరు నమ్మండి అనడం ఎలా కుదురుతుంది?

విశ్వాసం తప్పుకాదు. వివేకం లోపించిన విశ్వాసంతోనే ముప్పు. 

Friday, July 5, 2013

రుద్రాక్షలు ఇంత పెద్ద వ్యాపారమా?!

రుద్రాక్షల మహిమ గురించి టీవీ చానెళ్లలో చాలాకాలంగా వాణిజ్య ప్రకటనలు వస్తున్నాయి కానీ, ఆ వ్యాపారం ఇంతగా ఊహించని రేంజికి చేరుకుంటుందని అనుకోలేదు. ఈ మధ్య హైదరాబాద్ లో ఒకచోట రుద్రాక్షల వ్యాపారానికి సంబంధించిన ఒక పెద్ద హోర్డింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఆ వ్యాపారం కార్పొరేట్ వ్యాపార స్థాయిని అందుకున్నట్టుందని దానిని చూడగానే అనిపించింది.

రుద్రాక్షలకు మహిమ ఉంటుందన్న విశ్వాసం అనాదిగా ఉన్నదే. రుద్రాక్షమాలలు చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. వాటిని ధరించే వాళ్ళూ చాలామందే కనిపిస్తారు. ఏకముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష వగైరా పేర్లు టీవీ చానెళ్లలో ప్రచారానికి చాలా ముందునుంచే; టీవీ కూడా లేని రోజులనుంచే పూజాపునస్కారాలు చేసే  కుటుంబాలలో వినబడుతూ ఉండేవి. హిమాలయప్రాంతాలవైపు వెళ్లినప్పుడు వాటిని తెచ్చుకోవడమూ ఉండేది. కానీ రుద్రాక్ష ధారణ జరుగుతున్న ఇన్నేళ్లలోనూ అది ఒక భారీ వ్యాపారంగా ఎప్పుడూ మారలేదు. ఇప్పుడే మారడం చూస్తున్నాం.

భారీవ్యాపారం అన్నాక అన్ని వ్యాపారాలకూ వర్తించే ప్రమాణాలు, సూత్రాలు, పారదర్శకత మొదలైనవి ఈ వ్యాపారానికి కూడా వర్తించవలసిందే కదా? వర్తిస్తున్నాయా? వినియోగదారులు మోసపోకుండా చూసే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మేము మోసపోయామని వారు ఫిర్యాదు చేస్తే పరిహారం ఇప్పించడం వగైరా చర్యలు తీసుకునే వ్యవస్థ ఏమైనా ఉందా?

"రుద్రాక్షలకు మహిమ ఉంటుందన్న్దది  కేవలం విశ్వాసం మాత్రమే, ఆ మహిమ కొందరికి అనుభవంలోకి రావచ్చు; కొందరికి రాకపోవచ్చు, దానికి హామీ ఎలా ఇస్తాం?  రుద్రాక్ష వినియోగదారులను ఇతర వినియోగదారులతో ఎలా జమ కడతాం? కనుక వారికి consumer protection ఎలా ఇస్తాం?" అని రుద్రాక్ష వ్యాపారులు వాదించవచ్చు. లేదా ఇతరులకే అలాంటి సందేహాలు కలగచ్చు.

అయితే ఇక్కడ ఒక తేడా గమనించాలి. రుద్రాక్షలు ఇలా భారీ వ్యాపారంగా మారని రోజుల్లో వాటి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు తమంతట తాము కొనుక్కుని లేదా సంపాదించుకుని తెచ్చుకునే వాళ్ళు. టీవీ చానెళ్లు, లేదా భారీ హోర్డింగ్ ల ప్రచారానికి ప్రభావితులై కాదు. వాటిని అమ్మే వ్యక్తులో లేదా చిన్నపాటి దుకాణాలవారో వాటి మహిమ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు కాదు. కనుక అటువంటి సందర్భాలలో కొనుక్కున్న వారిదే పూర్తి బాధ్యత.

ఇంకొంచెం తేలిగ్గా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తిరుపతి వేంకటేశ్వరస్వామి మీద విశ్వాసం ఉన్న భక్తులు ఆయనను దర్శిస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో స్వచ్ఛందంగా తిరుమలకు వెడతారు. అందుకు వెచ్చించే శ్రమకు, ఖర్చులకు, అక్కడ హుండీలో వేసే డబ్బులకు పూర్తి బాధ్యత వాళ్ళదే.

అలా కాకుండా తిరుమలేశునికి గొప్ప మహిమలు ఉన్నాయనీ, ఆయనను  దర్శిస్తే మీకు ఫలానా ఫలానా మంచి జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వారే భారీ ఎత్తున ప్రకటనలను ప్రసారం చేస్తే, హోర్డింగ్ లను ఏర్పాటు చేస్తే, వాటిని చూసి భక్తులు ఆకర్షితులై ఇప్పటి కంటే పెద్ద సంఖ్యలో తిరుమలకు వెడితే అప్పుడు బాధ్యత టీ.టీ.డీ వారిదే అవుతుంది. వారు అలా చేయడం లేదు కనుక తమ తిరుమల యాత్రకు భక్తులే బాధ్యత వహించాలి. తిరుమలకే కాదు, ఏ గుడి కైనా, జ్యోతిషం వగైరా ఏ విశ్వాసాలకైనా ఇదే వర్తిస్తుంది.

ఇందుకు భిన్నంగా రుద్రాక్ష వ్యాపారులు రుద్రాక్షల మహిమ గురించి భారీ ఎత్తున ప్రచారం చేస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు కనుక వారికి జవాబుదారీ ఉండనవసరం లేదా? ఆ వ్యాపారానికి ఇతర వ్యాపారాలకు వర్తించే సూత్రాలు, ప్రమాణాలూ వర్తించనక్కరలేదా?

ఇవే ప్రశ్నలు జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం వగైరాలకూ వర్తిస్తాయి. అవునా? కాదా?


Wednesday, July 3, 2013

అమ్మమ్మలు బతికించిన చరిత్ర

‘నలుగురు కూచుని నవ్వే వేళల, నా పేరొకపరి తలవండి’ 
గుర్తొచ్చిన ప్రతిసారీ ఈ పంక్తి మాటల కందని మహా విషాదాన్ని మోస్తున్నట్టు, ఆ విషాదాన్ని చుక్క చుక్కలుగా మన గుండెల్లోకి జార్చుతున్నట్టు అనిపిస్తుంది. లోపల ఎక్కడో కలుక్కుమంటుంది. గురజాడవారి పూర్ణమ్మ కథలోని పంక్తి ఇది. తనను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు మనస్తాపం చెందిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. దుర్గగుడికి వెళ్ళే నెపంతో బయలుదేరుతూ తోబుట్టువులను చుట్టూ కూర్చోబెట్టుకుని అప్పగింతలు చెబుతుంది. ఆ సందర్భంలో పై మాట అంటుంది.
ఏళ్ల తరబడి మన మధ్య గడిపిన రక్తబంధువులు హఠాత్తుగా తిరిగిరాని లోకాలకు తరలిపోయి కనుమరుగు కావడం ఆదిమదశనుంచీ మనిషిలో విషాదాన్ని గిలకొట్టుతూనే వచ్చింది. వారి స్మృతిని సజీవం, చిరంజీవం చేసే ఆలోచనలు అప్పుడే పుట్టాయి. అందులో భాగంగానే పితృదేవతలు అనే భావనా, పితృకర్మలూ విశ్వాసంలో భాగమయ్యాయి. ప్రపంచ పురాణగాథల కెక్కాయి. రక్తబంధువులందరూ ఏకశరీరంగా జీవించిన గణసమాజంలో ఈ విషాదవిశ్వాసాలు మరింత బలీయంగా ఉంటాయి. లిపి ఏర్పడని, లేదా లిఖిత సంప్రదాయం వేళ్లూనుకోని కాలంలో గణబంధువుల జ్ఞాపకాలను, చరిత్రను తరం నుంచి తరానికి అందించే బాధ్యతను మనిషి గళమే నిర్వహించింది. అలా అందించడం ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఇది ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా జరిగింది.
 పైన పేర్కొన్న గురజాడ పంక్తిలోని విషాదం గణహృదయపు లోతుల్లోంచి పలుకుతున్న విషాదంలా నాకు అనిపిస్తూ ఉంటుంది. గణసమాజపు నుడికారం గురజాడ రచనల్లో ఎక్కువగా కనిపిస్తుందని  రాంభట్ల కృష్ణమూర్తి అనేవారు. కన్యాశుల్కం నుంచి అనేక ఉదాహరణలు ఎత్తి చూపేవారు.
అదలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, నలుగురూ కూర్చుని తమ పూర్వీకులను స్మరించుకునే గణ సంప్రదాయం రూట్స్ రచనలో 
రెండువందల ఏళ్ల క్రితం నాటి వంశ మూలాలను, మూలస్థానాన్ని కనిపెట్టే ఉత్కంఠభరిత ప్రయత్నానికి దారితీయించింది.  

(పూర్తి వ్యాసంhttp://www.saarangabooks.com/magazine/ లో 'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)


Monday, July 1, 2013

ముండే కేసు: స్టేట్ ఫండింగ్ ఎలా పరిష్కారం?!

 కిందటి (2009) లోక్ సభ ఎన్నికలలో తను ఎన్నికల కమిషన్ అనుమతించిన 25 లక్షల రూపాయల పరిమితి కంటే చాలా ఎక్కువగా , ఏకంగా 8 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టానని  ఒక సభలో బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ప్రకటించారు. ఆయన మాటలు రికార్డ్ అయ్యాయి. మీడియాలో ప్రసారమయ్యాయి. దాంతో ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీస్ ఇచ్చింది. తన లాయర్ ద్వారా ఆ నోటీసుకు సమాధానం పంపుతానని ముండే ప్రకటించారు. ఏం సమాధానం ఇస్తారో, ఎన్నికల కమిషన్ దానిపై ఎలా స్పందిస్తుందో చూడవలసిందే.

దీనిపై బీజేపీ అధికారప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ సమాధానం చెబుతూ, ముండే వ్యక్తిగతంగా 25 లక్షల పరిమితిలోనే ఖర్చు పెట్టారని, మిగతా మొత్తాన్ని ఆయన మద్దతుదారులు ఖర్చుపెట్టి ఉండచ్చని ఒక విచిత్ర భాష్యం చెప్పారు. ఆయన వివరణ ప్రకారం వ్యక్తిగతంగా నిర్దేశించిన పరిమితిలోనే ఖర్చు పెట్టాలి కానీ, ఆ అభ్యర్థి మీద ఇతరులు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఆ ఖర్చు 8 కోట్లు కావచ్చు, 80 కోట్లు కావచ్చు. తప్పులేదు! అటువంటప్పుడు ఇంత మొత్తమే ఖర్చుపెట్టాలన్న నిబంధన దేనికో?!

నిజానికి అనేక మంది చేసిందీ, చేస్తున్నదే ఆయనా చేశారు. ఎన్నికల్లో ఖర్చు పరిమితి నిబంధన కాగితాలకే పరిమితమని అందరికీ తెలుసు.  కాకపోతే ముండే  ఆ వాస్తవాన్ని బహిరంగంగా  ఒప్పుకున్నారు. అదే తేడా. అయితే,  ఆయన  'నిజం' చెప్పడంలో నిజాయితీ ఉందనుకోవాలో, లేకపోతే ఎన్నికల కమిషన్ ను కాగితం పులిగా పరిగణించి అదేం చేస్తుందిలే అన్న తెగింపు ఉందనుకోవాలో తెలియని పరిస్థితి. పైగా, ఏం చేస్తారో చేసుకోండని సవాలు చేస్తున్నట్టుగా  ఈ లోక్ సభ గడువు ఇంక ఆరునెలలే ఉందని కూడా అన్నారు.

అదలా ఉండగా, అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం ఇటువంటి సమస్యలకు పరిష్కారమనే అభిప్రాయాన్ని ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భమనేముంది, అతి కీలకమైన ఎన్నికల సంస్కరణలలో ఒకటిగా ఆ ప్రతిపాదన చాలాకాలంగా చర్చలో ఉంది. ఇక్కడ సందేహమేమిటంటే, ప్రభుత్వమే ఎన్నికల ఖర్చు భరిస్తే అభ్యర్థి సొంతంగా కోట్లు వెదజల్లడం మానేస్తాడా? అప్పుడు కూడా వోటర్లను ఏదో ఒక రూపంలో ప్రలోభపెట్టడానికి లోపాయికారీగా కోట్లు కుమ్మరించే అవకాశం లేదా? వెనకటికి ఒకావిడ మడి బట్ట తలుపుకి ఆరేసి ఏ దొంగ ఇంట్లోకి వస్తాడో చూస్తానని అందట! అలాగే, ప్రభుత్వం ఖర్చు పెడుతోంది కనుక  దానికి బుద్ధిగా కట్టుబడి అభ్యర్థి సొంతంగా ఖర్చు పెట్టకుండా ఉండిపోతాడా?!

ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని భరించాలన్న ప్రతిపాదన వెనుక  మామూలు బుద్ధికి అందని హేతుబద్ధత ఏదో ఉందనుకుంటే  దయచేసి అదేమిటో  విజ్ఞులు సెలవిస్తారా?