Monday, December 31, 2012

'అన్నపూర్ణ' రాష్ట్రంలో... పోషకాన్నమో రామచంద్రా!

నా బ్లాగు వీక్షకులకు, నేను రాసిన వివిధ అంశాలపై స్పందించినవారికి, చర్చలో పాల్గొన్నవారికి, నా బ్లాగును ఎక్కువమంది వీక్షకుల దృష్టికి తెచ్చిన కూడలి, మాలిక అగ్రిగేటర్లకు...అందరికీ 2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

                                                                            ***

ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ పెద్ద రాష్ట్రం. జనాభాలో 5వది. తలసరి ఆదాయంలో 4వది. పారిశ్రామికాభివృద్ధిలో 4వది. 100మంది అత్యంత సంపన్న భారతీయులలో 7గురు ఈ రాష్ట్రానికి చెందినవారు. 'అన్నపూర్ణ' అని ఈ రాష్ట్రానికి పేరు. ఇక్కడ 77 శాతం వరి పండిస్తారు.

కానీ మానవాభివృద్ధి సూచిలో ఈ రాష్ట్రం ఎక్కడుందో మీరు గమనించారా? 11వ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 9, గుజరాత్ 8, తమిళ నాడు 6, హర్యానా 5, మహారాష్ట్ర 4, పంజాబ్ 2, కేరళ 1వ స్థానంలో ఉన్నట్టు ప్రణాళికా సంఘం కిందటి ఏడాది విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక వెల్లడిస్తోంది. ఆదాయం, విద్య, ఆరోగ్యం, అక్షరాస్యత, పోషకాహారం, పారిశుద్ధ్యాలను మానవాభివృద్ధి సూచికి కొలమానాలుగా తీసుకుంటారు.

మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉండడమే కాదు, జాతీయ సగటు(0.467%)కన్నా తక్కువ మానవాభివృద్ధి ఉన్న బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, అస్సాం ల గ్రూపులో చేరింది.

"ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం కీలకమైన సవాళ్ళు" అని, నివేదికను విడుదల చేస్తూ ప్రణాళికాసంఘం హెచ్చరించింది.

'అన్నపూర్ణ' రాష్ట్రంలో మీరు ఏ ఊరికైనా వెళ్ళి చూడండి...ఆడా, మగా, పిల్లా, పెద్దా అందరిలో పోషకాహారలోపం మామూలు కంటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ఎస్సీ జనాభాలో మరీ ఎక్కువగా ఉంది. అయితే,  ఇతర సామాజికవర్గాల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదు. ఊళ్లలో పండ్లు, కూరగాయలు తక్కువ ధరకు లభిస్తాయనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది కానీ, ఇప్పుడు అక్కడ కూడా వాటి ధరలు నగరాల ధరలతో పోటీ పడుతున్నాయి. కనుక పండ్లు, కూరగాయల ద్వారా పోషకాహారాన్ని పెంచుకునే అవకాశం ఊరి జనానికి లేదు.

ఈ రాష్ట్రంలో ఎనభై దశకం నుంచీ(మధ్యలో కొంతకాలం రద్దు, రేటు మార్పుతో)కిలో 2 రూ. బియ్యం పథకం అమలు జరుగుతోంది. భారీ మొత్తాల్లో సబ్సిడీ భారాన్ని మోస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. ఇటీవల కిలో 1రూ. కే బియ్యం పథకాన్ని అమలు చేస్తోంది. అయినా సరే, పోషకాహార లోపం ఇంతగా ఎందుకుందో తెలియదు. బడి పిల్లలకు పుష్టికరమైన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ ఊళ్లలో పిల్లల వాలకాలలో ఆ పథకం ఆనవాళ్ళు కనిపించడంలేదు. అసలు ఏం జరుగుతోంది?

ఈ రోజు ఒక వార్త వచ్చింది. రంగారెడ్డి జిల్లా కులకచర్ల గ్రామంలో సరస్వతీ విద్యామందిరంలో 5వ తరగతి చదువుతున్న శ్రావణి అనే బాలిక సరస్వతీ విద్యామందిరాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని-పాఠశాల భవన ప్రారంభానికి వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. అందువల్ల బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గుతుందని కూడా చెప్పింది. మంత్రి ఆ మేరకు హామీ ఇచ్చింది. ఎప్పుడు? అయిదేళ్ళ క్రితం! శ్రావణి పట్టు వీడకుండా ఈ అయిదేళ్లలో మరో రెండుసార్లు స్కూలుకు వచ్చిన మంత్రికి అదే విజ్ఞప్తి చేసింది. చివరికి మంత్రి ముఖ్యమంత్రిని ఆ మేరకు ఒప్పించింది. జనవరి 1 నుంచీ 480 సరస్వతీ విద్యాలయాలలో ఆ పథకం అమలుకాబోతున్నట్టు వార్త. మంత్రీ, అంతకంటే ఎక్కువగా శ్రావణీ అభినందనీయులు! ఇంతకీ ప్రశ్న ఏమిటంటే, శ్రావణి విజ్ఞప్తి నెరవేరడానికి అయిదేళ్లు పట్టినప్పుడు, 'పోషకాన్నమో రామచంద్రా' అని నోరు తెరిచి అడగని ఊళ్ళలోని  మూగ జనానికి పోషకాహారం అందడానికి ఎన్నేళ్లు పడుతుంది?

దేశంలోని చిన్నారుల పోషకాహార లోపం పై 12వ పంచవర్ష ప్రణాళిక 'ప్రత్యేకంగా' దృష్టి సారించిందట! ఇది కూడా ఈరోజు వార్తే. దేశంలో 18 ఏళ్ల లోపు ఉన్న 43 కోట్లమంది సంక్షేమానికి నడుం కట్టాలంటూ ప్రణాళికాసంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందట. దేశంలో 22 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారనీ, మూడేళ్ళ లోపు పిల్లలలో 40.4 శాతం మంది ఉండవలసినంత బరువు ఉండడంలేదనీ చెప్పిందట. పిల్లలకు విటమిన్-డి పంపిణీ సక్రమంగా జరగడం లేదట. గ్రామస్థాయి వరకు పోషకాహార మండళ్లను, బాలల అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయడం ప్ర.సం. సూచనలలో కొన్ని. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటి? బాలల పోషకాహారలోపం పై ప్రభుత్వం ఇప్పుడిప్పుడే యుద్ధం ప్రకటిస్తోందని! మరి మిగిలిన వాళ్ళ సంగతి ఎప్పటికీ?! పోషకాహారలోపం అందరిలోనూ అంతరించడానికి ఎన్ని పంచ వర్ష ప్రణాళికలు గడవాలి?

కిందటి సంవత్సరం అంతా ఆహారభద్రతపై చర్చతోనే గడచిపోయింది. ఆహారభద్రతలో పోషకాహారభద్రత భాగం కావాలని ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి జాతీయ సలహా మండలి(ఎన్.ఏ.సీ)లోని నిపుణులకు తల ప్రాణం తోకకు వచ్చింది. చివరికి ఏదో అంగీకారానికి వచ్చారన్నారు. బిల్లు పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు వెళ్లింది. ఏడాది గడచినా దాని అతీ గతీ లేదు.

ఈ లోపల నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేసింది. దాని మీద సవాలక్ష అభ్యంతరాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి.

అదలా ఉంచి అన్నపూర్ణ రాష్ట్రపాలకులు ఊరి జనానికి పోషకాన్నం అందించడానికి ఏం చేస్తున్నారు? మానవాభివృద్ధి సూచిలో ఒకటో స్థానంలో ఉన్న కేరళతో పోటీ పడే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నట్టు ఎలాంటి ఆధారాలూ కనిపించడం లేదు.





Sunday, December 30, 2012

ఢిల్లీ యువతి విషాదాంతం: కనెక్టెడ్ జనాలు, డిస్కనెక్టెడ్ పాలకులు

పేరు తెలియని ఒక యువతి మృతి ఒక జాతీయ విషాదం అయింది. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. పేరు తెలియని ఒక యువతి మృతి ఆదివారం నాడు పత్రికలన్నిటిలో పతాకశీర్షిక అయింది. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. పేరు తెలియని ఒక యువతి మృతికి ప్రధాననగరాలలోని పౌరులనేకులు వీధుల్లోకి వచ్చి కోప సంతాపాలను ప్రకటించారు. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. ఢిల్లీ సామూహిక మానభంగ ఘటన జరిగినప్పటినుంచీ ఈ దేశంలో ఎప్పుడూ జరగనివి జరుగుతున్నాయి. స్పందనారాహిత్యం కరడుగట్టిన పాషాణవ్యవస్థపై జనం ఎన్నడూ లేనంత మహోద్రిక్తస్థాయిలో, ఎన్నడూ ఎరగని కొత్త పద్ధతుల్లో ఆగ్రహావేదనలు కుమ్మరించుకుంటున్నారు. ఇంతటి విషాదభరిత వాతావరణంలోనూ రేపటికి అది ఒకింత భరోసా!

"అమ్మా నాకు బతకాలని ఉంది" అని ఆ మానభంగ బాధితురాలు తల్లితో అన్నట్టు వార్తల్లో చదివాం. అంతా ముందే ఉన్న జీవితం గురించి పచ్చని కలలు కనే ఓ ఇరవై మూడేళ్ళ యువతి బతకాలని తపించడంలో ఆశ్చర్యంలేదు. చివరికి ఆమె ప్రాణాలతోపాటు ఆమె కోరికా అనంతవాయువుల్లో కలసిపోయింది. "నాకు బతకాలని ఉందమ్మా" అన్న కూతురు మాట తలచుకుని తల్లి బతికినంతకాలం కుమిలిపోతూనే ఉంటుంది. "నాకు బతకాలని ఉం"దన్న ఆ అభాగ్యురాలి మాట గుర్తొచ్చినప్పుడల్లా బతికి ఉన్నవాళ్ల గుండె కలుక్కుమంటూనే ఉంటుంది.

అయితే ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. ఈ పాషాణవ్యవస్థ ఢిల్లీ వీధుల్లో పోలీసులతో పెనుగులాడిన జనసందోహం కంటే ఎన్నో రెట్లు బలవత్తరమైనది. వారితోపాటు ఇతర నగరాలలో కొవ్వొత్తి దీపాలతో నిరసన తెలిపిన జనసమూహాలు అన్నీ కలసి ప్రతిఘటించినా లొంగనంత బలవత్తరమైనది. ఈ పాషాణవ్యవస్థ పది ముఖాలు ఉన్న దశకంఠ రావణుడి లాంటిది. మానభంగాలు దాని ఒకానొక ముఖం మాత్రమే. ఖాఫ్ పంచాయితీలు ఒక ముఖం. వోటు బ్యాంక్ కోసం ఖాఫ్ పంచాయితీలను సమర్థించే సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ యువ పార్లమెంట్ సభ్యులతో సహా రాజకీయనాయకులు ఒక ముఖం. ఆడ శిశువులను కడుపులోనే కడతీర్చే కటికతనం ఒక ముఖం. అవినీతి అక్రమాలు ఒక ముఖం. స్పందనా గుణం లోపించిన ప్రభుత్వాలు ఒక ముఖం. తమ పని తాము చేయని పోలీసులతో సహా అంచెలంచెల ఉద్యోగవ్యవస్థ ఒక ముఖం. వరకట్నపు చావులు ఒక ముఖం. న్యాయప్రదానంలో జరుగుతున్న అసాధారణ జాప్యం ఒక ముఖం...

ఇంత పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికినా దేశంలో మానభంగాలు ఆగలేదు. ఢిల్లీ ఘటన తర్వాత ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే అరడజను మానభంగాలు వార్తలకు ఎక్కాయి. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్న జనాలు తక్షణమే స్పందిస్తూ రోడ్ల మీదికి వస్తున్నారు కానీ, ప్రభుత్వాలు ఎప్పటిలా జనంతో డిస్కనెక్ట్ అయ్యే ఉన్నాయి. సోషల్ మీడియా వ్యాప్తి, సమాచార హక్కు మొదలైన పరిణామాల వెలుగులో ప్రభుత్వాలు జనంతో డిస్కనెక్ట్ అయిన దృశ్యం మరింత ప్రముఖంగా మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కామన్ వెల్త్ క్రీడలపై ఆరోపణలప్పుడూ అదే జరిగింది. 2జీ స్పెక్ట్రమ్ పై  ఆరోపణలప్పుడూ అదే జరిగింది. అన్నా హాజరే ఉద్యమమప్పుడూ అదే జరిగింది. కేజ్రీవాల్ ఉద్యమమప్పుడూ అదే జరిగింది. ప్రతి టామ్ డిక్ అండ్ హారీ రాసే లేఖలకూ ప్రధాని జవాబు ఇవ్వరని సుబ్రమణ్యం స్వామిని ఉద్దేశించి కపిల్ సిబల్ అన్నప్పుడే ప్రభుత్వం జనంతో ఎలా డిస్కనెక్ట్ అయిందో రూపు కట్టింది. ఇవాలిటికి ఇవాళ, "అప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో జనం రోడ్ల మీదికి వచ్చే పరిస్థితిని ప్రభుత్వం ఊహించలేదు. ఇటువంటి పరిణామాన్ని కూడా ఇక ముందు దృష్టిలో పెట్టుకుంటాం" అని మంత్రి చిదంబరం ఢిల్లీ ఘటన నేపథ్యంలో అనడం కూడా ప్రభుత్వం జనంతో, క్షేత్రవాస్తవికతతో ఎంత డిస్కనెక్ట్ అయిందో చెప్పకనే చెప్పింది.

ప్రభుత్వం చట్టాలను బలోపేతం చేస్తామంటోంది...చేస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామంటోంది...చేస్తుంది. పోలీసు బలగాలను పెంచుతామంటోంది...పెంచుతుంది. కానీ పనికి అంకితమై పని చేసేవారిని ఎక్కడినుంచి తీసుకొస్తుంది? పని సంస్కృతిని ఎలా తీసుకురాగలుగుతుంది? ఇదే ప్రశ్న నేను వెనకటి బ్లాగులో ముందుకు తెచ్చాను. ఈ రోజు హిందూ తన మొదటి పుట సంపాదకీయంలో అన్నది కూడా అదే. "Laws to deal with rape and sexual assault exist but not the police, judiciary, and leaders to work them. It is this leaderless vacuum that ordinary citizens must step into in order to affirm the rights of women."

పేరు తెలియని ఆ యువతి విషాదాంతం పది తలల పాషాణ వ్యవస్థతో ముఖా ముఖీ ఢీకొనవలసిన అవసరాన్ని ప్రబోధిస్తూనే ఆ వ్యవస్థ ఎంత బలవత్తరమైనదో కూడా చెబుతోంది. అనేక ప్రశ్నలూ, సవాళ్ళ రూపంలో అది చాచే విషపు కోరలనూ బయట పెడుతోంది.

(సంబంధిత బ్లాగ్: ఢిల్లీ మానభంగం: చిత్తశుద్ధి లేని చట్ట శుద్ధి ఏల?)

Saturday, December 29, 2012

యువపాఠకులకు ఎలాంటి తెలుగు ఇస్తున్నాం?

నేటి యువతకు ఆకర్షణీయమైన తెలుగును 'ప్యాక్' చేసి ఇస్తున్నామా అని కిందటి వ్యాసంలో ప్రశ్నించాను. దాని గురించి నా అభిప్రాయాలు మీతో ఇప్పుడు పంచుకుంటాను. అయితే, ప్రస్తుతానికి ఇవి ఏకపక్ష అభిప్రాయాలు మాత్రమే. ఇవి మీ అభిప్రాయాల గీటురాయికి కూడా సరైనవే ననిపిస్తే అప్పుడు అందరం కలసి ఏకాభిప్రాయానికి రావచ్చు.

యువత సంగతి కాసేపు అలా ఉంచుదాం. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటికీ నూరేళ్ళను మించిన చరిత్ర ఉంది. ఆయా ప్రక్రియలలో అత్యుత్తమమైన రచనలూ వచ్చాయి, ఉత్తమమైనవీ వచ్చాయి, అంత ఉత్తమం కానివీ వచ్చాయి. ఈ వందేళ్లలోనూ వచ్చిన ఓ ఇరవై  నవలలను, ఓ వంద కవితా సంపుటాలను, ఓ వంద కథలను, ఓ వంద వ్యాసాలను వివిధ కోణాల నుంచి అత్యుత్తమమైనవిగా/ఉత్తమమైనవిగా ప్రామాణీకరించి పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నదా? వ్యక్తుల స్థాయిలో అది జరుగుతూ ఉండచ్చు. కానీ నేను అనేది ఆ పని వ్యవస్థల స్థాయిలో జరగాలి. ఉదాహరణకు విశ్వవిద్యాలయాల స్థాయిలో. తెలుగు విశ్వవిద్యాలయం పేరిట మనకో విశ్వవిద్యాలయం ఉంది. ఏటా పురస్కారాలు ఇవ్వడం, ప్రచురణలకు ఆర్థిక సాయం చేయడం వగైరాలు మినహా ఆ విశ్వవిద్యాలయంలో ఇటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? పోనీ వివిధ ఇతర విశ్వవిద్యాలయాలలోని తెలుగు పీఠాలు కనీసం ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయా? కేవలం సాహిత్యాన్ని ప్రచురించి ఇవ్వడం కాదు. ఆ సాహిత్యంలో ప్రతిఫలించిన నూరేళ్ళ తెలుగు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చరిత్రను దానికి జతపరుస్తూ ఇవ్వాలి. నూరేళ్ళ భావ పరిణామ చరిత్రనూ నిర్మించి ఇవ్వాలి. ఇదే సూచన నేను ఎనభై దశకంలో చేశాను. మళ్ళీ 2004 లో చేశాను. ఈ సూచనపై 'పేటెంట్' నాదేనని కూడా చెప్పాను. నిజానికి ఇదేమీ కొత్తది కాదు. సంస్కృతంలో పంచకావ్యాలు, తెలుగులో పంచ ప్రబంధాలు మొదలైన వర్గీకరణలు ఉన్న విషయం మనకు తెలిసినదే.

అసలు విషయమేమిటంటే, నూరేళ్ళ తెలుగు సాహిత్యం ఒక అడవిలా పెరిగిపోయింది. దాని గురించి ఒక అవగాహన ఇచ్చే కొన్ని ప్రాతినిధ్య రచనలు మనం నేటి తరానికి, ముందు తరాలకు అందించాలి. సాహిత్యాభిమానులు వాటిని కొనుక్కుని దగ్గర పెట్టుకునేలా ఉండాలి.

 ఏదైనా పెద్ద పని చేసేటప్పుడు, దానికి ఒక ఇతివృత్తాన్ని, ఒక కాన్ సెప్ట్ ను ఇచ్చే అలవాటు, క్రమశిక్షణ మనకు అలవడలేదని నాకు అనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమ వారు 75 ఏళ్ల తెలుగు సినిమా  పండుగ జరిపారు. అందులో 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రా, పరిణామాలు ఏవీ ప్రతిఫలించలేదు. కనీసం వెనకటి నటీ నటులను ఎక్కువమందిని రప్పించడం కానీ, వారిని ఫోకస్ చేయడం కానీ, వారితో మాట్లాడించడం కానీ జరగలేదు. అది పూర్తిగా నేటి సినిమా పండుగలానే జరిగింది. ఇప్పటి నటీనటులే వేదిక మొత్తాన్ని కమ్మేశారు. అవే ఐటెమ్ డ్యాన్సులు, అవే వెకిలి హాస్య ప్రదర్శనలతో మోతెక్కించేశారు.

కొంతకాలం క్రితం మిత్రుడు కె.పి. అశోక్ కుమార్ నాతో మాట్లాడుతూ, తెలుగు కథల సూచి తయారు చేసే పని తెలుగు విశ్వవిద్యాలయం నాకూ, 'అంపశయ్య' నవీన్ గారికి అప్పగించిందని చెప్పాడు. ఏం చేస్తారని అడిగాను. కథ పేరు, ప్రచురితమైన సంవత్సరం, పత్రిక పేరు ఇస్తామన్నాడు. దానివల్ల ఉపయోగమేముంటుంది, కథ పేరు తెలిస్తే కథ గురించి తెలిసినట్టు కాదు కదా, కనీసం అందులోని ఇతివృత్తాన్ని రెండు వాక్యాలలోనైనా ఇస్తే బాగుంటుందని నేను సూచించాను. మీ సూచన బాగుంది, నేను ఆ ప్రతిపాదన చేస్తానని అశోక్ కుమార్ అన్నాడు.

ఇప్పుడు యువత విషయానికి వద్దాం. బీటెక్ చదువుతున్న మా రెండో అబ్బాయి సెలవలకు ఇంటికి వచ్చినప్పుడు వాడిలో పాఠనాసక్తి పెరుగుతోందని గమనించాను. వాడి చేత తెలుగు సాహిత్యం చదివించాలని ఉత్సాహపడ్డాను. అయితే, అందులో పడితే వాడి చదువు దెబ్బతినే ప్రమాదాన్ని శంకించి అప్పటికి ఊరుకున్నాను. కానీ, నా షెల్ఫ్ లో ఉన్న ఇంగ్లీష్ నవలలు, కథల సంపుటాలు రోజుకొకటి చొప్పున వాడి మంచం మీద కనబడడం ప్రారంభించాయి. 'ది ఓల్డ్ మన్ అండ్ ది సీ' చదివి చాలా థ్రిల్ అయ్యానని వాడు చెప్పాడు. అలాగే చెఖోవ్ కథలు కూడా బాగున్నాయన్నాడు. ఇలాంటి పాఠనాసక్తి ఉన్న ఈ తరం వారికి మనం ఎలాంటి తెలుగు కథలను, నవలలను అందించాలి? ఇది నాకు ఎదురైన ప్రశ్న. అవి వాళ్ళ ఇమాజినేషన్ కు అందాలి. వాళ్ళలో ఆసక్తి కలిగించాలి. మొదటే నిర్దిష్ట భావజాలం నుంచో లేదా నిర్దిష్ట దృక్పథం నుంచో ఆయా సామాజికపరిణామాలను ప్రతిఫలించే కథలను, నవలలను కాక ఒక తటస్థ స్థితి నుంచి యువత తెలుగు సాహిత్యంలోకి అడుగుపెట్టి ఆసక్తిని పెంచుకునేందుకు తోడ్పడే రచనలను కూర్చి అందించలేమా? అంటే, కేవలం నూతన తరాన్ని మాత్రమే లక్ష్యం చేసుకుని కొన్ని ప్రచురణలు తీసుకు రావలసి ఉంటుంది. అందుకు పూర్వరంగంలో చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. తెలుగును బతికించుకోడం కోసం ఆ శ్రమ తీసుకోవలసిందే. జీవితాన్ని కేవలం ఒక తటస్థ స్థితినుంచి వ్యాఖ్యానించే రచనలు మనకు పాశ్చాత్య సాహిత్యంలో అనేకం కనిపిస్తాయి. తెలుగులోనూ అలాంటివి ఏరి పట్టుకోగలం. ఇలా అన్నానని భావజాల/దృక్పథ ప్రధానమైన రచనలను పక్కన పెట్టమంటున్నాననుకుని అపార్థం చేసుకోవద్దు. యువ పాఠకుడు అభిరుచి పెరిగిన కొద్దీ వాటిలోకి క్రమంగా ప్రవేశిస్తాడు. అన్నట్టు ఇలా యువతను లక్ష్యం చేసుకుని కథా, కవితా,వ్యాస సంపుటాలను; నవలలను తీసుకురావాలన్న సూచనపైనా  పేటెంట్ నాదే.

వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఒక ప్రచురణను ముందుకు తెస్తున్నప్పుడు దాని వెనుక ఎలాంటి  థీమ్ ఉంది, ఎలాంటి పాఠకులను లక్ష్యం చేసుకుంటున్నామని ఆలోచించే అలవాటు చేసుకుంటే పాఠకులలో ఉండే తేడాలు స్పష్టంగా అర్థమవుతాయి. వేర్వేరు పాఠకులకు వేర్వేరు తరహాలో రచనలను అందించాలనే అవగాహన అప్పుడు ఏర్పడుతుంది.

ఇంగ్లీష్ మీడియం యువతను ఒక స్టీరియో టైప్ లో ఊహించుకోవడం సరికాదు. మా తమ్ముడి కొడుకు ఇంగ్లీష్ మీడియంలో హింది ప్రథమ భాషగా చదువుకున్నాడు. ఒకసారి, "పెదనాన్నా, నాకు రామాయణం, భారతం చదవాలని ఉంది" అన్నాడు. "నీకు తెలుగు అంత నడవదు కదా, ఇంగ్లీష్ లో చదువుకోవలసిందే" అన్నాను. దానిపై వాడిచ్చిన జవాబు నాకు ఆశ్చర్యం కలిగించింది. "లేదు. నేను తెలుగులోనే చదువుతాను. తెలుగు ఇంప్రూవ్ చేసుకుంటాను" అన్నాడు.

ఇలాంటి యువ పాఠకుల్లో తెలుగు పట్ల అభిరుచి, ఆకర్షణ పెరగడానికి మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి.

కొసమెరుపుగా ఒక ముచ్చట చెబుతాను. కొడవటిగంటి కుటుంబరావు గారి మునిమనవడు ఒకతను మా అబ్బాయికి పరిచయమయ్యాడు. "మీ ముత్తాతగారి రచనలు ఏవైనా చదివావా?" అని మా అబ్బాయి అతన్ని అడిగాడు. "లేదు. నాకు తెలుగు రాదు" అని ఆ అబ్బాయి జవాబిచ్చాడు. చందమామ లాంటి చక్కని తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించిన వ్యక్తి ముని మనవడికి ఆ పిల్లల పత్రికలోని కథలను చదువుకుని తెలుగు కథా దాహాన్ని పెంచుకునే అవకాశం లేకపోయింది.

ఇలాంటివారు తెలుగుపై అభిమానం, రుచీ పెంచుకుని ఇటువైపు చూస్తే, ముందు ఇవి చదవండి అని వారి చేతికి అందించ దగిన ప్రచురణల దిశగా తెలుగు సంస్థలు ఇప్పటికైనా ఆలోచన చేయవద్దా?

(సంబంధిత రచనలు: 1. నిజాల నేల విడిచి తెలుగు సాము 2. తెలుగు సభలు...నిరసనలు...శ్రీశ్రీ...)


Friday, December 28, 2012

నిజాల నేల విడిచి 'తెలుగు' సాము?!

తెలుగు భాష అస్తిత్వంపై ఉన్న భయాలు, అనుమానాల గురించి రాద్దామని కూర్చుంటే, ఇంతలో ఒక ముచ్చట గుర్తొచ్చింది. సీనియర్ పాత్రికేయులు, ఇండియా టుడే(తెలుగు) మాజీ సంపాదకులు ఎం. రాజేంద్ర గారు చెప్పారు. 1975 తెలుగు సభల వేదిక మీద 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి ఆలపిస్తున్నారు. ఆ గీతం పాడడానికే ఆమెను లండన్ నుంచి రప్పించారు. తనూ, మరికొందరు పాత్రికేయులూ వెనక వరసలో కూర్చుని ఉన్నారు. అంతలో ప్రవేశద్వారం వద్ద ఏదో వాదులాట వినిపించింది. మాసిపోయి మాసికలు పడిన దుస్తులతో ఆ పరిసరాలలో ఏమాత్రం ఇమడనట్టుగా కనిపించే ఒక వ్యక్తి, "ఆ పాట నేను రాసిందే, నన్ను లోపలికి వెళ్లనివ్వండి" అని అడుగుతున్నాడు. ద్వారం దగ్గర ఉన్నవారు ఒప్పుకోవడం లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన రాజేంద్ర గారు, ఆ జిల్లాలోని మదనపల్లెలో ఉంటున్న ఆ వ్యక్తిని గతంలో చూశారు కనుక వెంటనే గుర్తుపట్టి సభల నిర్వాహకులకు చెప్పారు. అప్పుడు వారు ఆయనను తీసుకు వెళ్ళి వేదిక ఎక్కించి శాలువా కప్పి పంపించారు. ఆయనే శంకరంబాడి సుందరాచారి!

(ఆయన గురించి సి. పూర్ణచంద్ ఈ రోజు(డిసెంబర్ 28) ఆంధ్రజ్యోతి, నవ్యలో రాసిన వ్యాసం కూడా వీలైతే చూడండి)

ప్రభుత్వం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. గీతం పాడడానికి ఎక్కడో ఉన్న టంగుటూరి సూర్యకుమారిని రప్పిస్తారు. కానీ అంతటి మహత్తర గీతానికి జన్మ నిచ్చిన కవి తమకు దగ్గరలోనే ఉన్నా పట్టించుకోరు.  అసలాయన  ఉన్నాడో లేడో కూడా ఆరా తీయరు. ప్రస్తుత సభల సందర్భంలో కూడా ఇలాంటి ముచ్చట్ల రికార్డులు ఎన్ని తయారవుతున్నాయో!  వేచి చూడవలసిందే.

ఇక తెలుగుభాష అస్తిత్వ భయాల గురించి...

1994లో ఒక వ్యక్తి, "మీతో మాట్లాడాలి" అంటూ నాకు ఫోన్ చేసి మరీ నా దగ్గరకు వచ్చారు. గుర్తుపెట్టుకోండి...అప్పటికి నూతన ఆర్థిక విధానాలు అడుగుపెట్టి రెండేళ్ళు మాత్రమే అయింది. విదేశీ ఉద్యోగాలు ఇంతగా పెరగలేదు. తెలుగు చానెళ్లు ఇన్ని లేవు.  అందులోనూ వార్తా చానెళ్లు అసలే లేవని చెప్పచ్చు. దూరదర్శన్ ఒక్కటే రాజ్యం ఏలుతోంది. సెల్ ఫోన్లు రాలేదు. ఇప్పటిలా ప్రపంచీకరణ విస్తరించి ప్రపంచం ఒక గ్రామం అయిపోలేదు. ఆ వ్యక్తి వస్తూనే, "తెలుగు భాషను కాపాడుకోవాలండీ" అన్నారు. "సరే, ఏం చేయాలని మీ ఉద్దేశం?" అని నేను అడిగాను. ఆయన దానికి నిర్దిష్టంగా జవాబు చెప్పలేదు. తెలుగు వాడకం ఎలా తగ్గిపోతోందో చెప్పి, "తెలుగును కాపాడుకోవలసిందే నండీ" అని మరోసారి నొక్కి చెప్పారు. "మీ ఊహలో ఉన్న ప్రణాళిక ఏమిటో చెప్పండి. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఎత్తేయలా? హిందీ దూరదర్శన్ ప్రసారాలు తెలుగువాళ్ళ మీద రుద్దవద్దని చెప్పదలచుకున్నారా? తెలుగు దూరదర్శన్ లో తెలుగు కార్యక్రమాల సమయాన్ని పెంచాలని అడగదలచుకున్నారా? నేటి తరంవారిలో తెలుగు మీద అభిరుచి పెంచే కార్యక్రమాలు ఇవ్వాలా? పుస్తకాలు ప్రచురించాలా?..." ఇలా నేనే ఆయనకు ఆలోచన అందించడానికి శతవిధాల ప్రయత్నించాను. కానీ ఆయన ప్రతిదానికీ తల అడ్డంగా ఊపారు. "మనకు ఇతర భాషా ద్వేషం ఏమీ లేదండీ. ఇంగ్లీషు ఉండవలసిందే, హిందీ ఉండవలసిందే. మన తెలుగును మనం కాపాడుకోవాలండీ" అని మరోసారి ఉద్ఘాటించారు. 'రావణుడితో రామునికి ఎలాంటి శత్రుత్వమూ అవసరం లేదు, కానీ సీత చెరవీడవలసిందే' అన్నట్టుగా ఆయన మాటలు ధ్వనించాయి. నిజం చెప్పాలంటే, 'తెలుగును కాపాడుకోవాలన్న' ఒక్క ముక్క తప్ప ఆయన ఏం చెప్పదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. చూడండి చిత్రం, ఆయనా, నేనూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నాఇలా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే, నేను మాట్లాడింది తెలుగే కానీ ఆయన మాట్లాడింది 'ఉద్యమం' అనే భాషలో! 'ఉద్యమం' అనేది దానికదే ఒక భాష అన్న అభిప్రాయం నాలో అప్పటినుంచీ బలపడింది.

1994 సంగతి చెప్పాను కానీ తెలుగు భాషా పరిరక్షణోద్యమం ఇంకా ముందే మొదలయ్యుంటుంది. 1994 తర్వాత, నేను పైన చెప్పినవన్నీ వచ్చాయి. అంటే ఏమిటన్నమాట? తెలుగు వాడకం ఇంకా తగ్గింది. తెలుగు వాడకం తగ్గినకొద్దీ సహజంగానే తెలుగు పరిరక్షణోద్యమం  ఇంకా పుంజుకుంది. అంటే తెలుగు వాడకం తగ్గడమూ, తెలుగు పరిరక్షణోద్యమమూ కలవని రైలు పట్టాలలా సమాంతరంగా పయనిస్తున్నాయన్న మాట. ఈ సమాంతరపయనం ఇలా ఎంతకాలం సాగుతుంది? ఎంతకాలమైనా సాగుతుంది సరే, చివరికి ఏ గమ్యానికి చేరుకుంటుంది?

ఈ సమాంతర పయనం ఎందుకు సంభవించింది అంటే, ఒక రైలు పట్టా పూర్తిగా కటిక వాస్తవికత అయితే, రెండో రైలు పట్టా, భాష బతకాలన్న కేవల ఆకాంక్ష కావడం వల్ల. ఆ రెండింటి మధ్యా వైరుధ్యం ఉంది. కటిక వాస్తవికత ఏమిటంటే, జీవన పోరాటం తొలి అంకంలో ఉన్న తరం చదువుల్లో, ఉద్యోగ విపణిలో పోటీని తట్టుకోడానికి అవసరమైన అన్ని వనరులను, అవకాశాలనూ వాడుకుంటూ మునుముందుకు వెళ్లిపోవడానికే ప్రాధాన్యమిస్తుంది. తెలుగు ఏమైపోవాలని మీరు వారిని గుచ్చి అడిగితే ఏమీ ప్రయోజనం ఉండదు.

ఒక తమాషా చూడండి...తెలుగు భాషోద్యమ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్న డా. సామల రమేశ్ బాబు గారి పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం లోనే చదివినట్టు నాకు ఈ రోజే తెలిసింది. తెలుగు భాషా పరిరక్షణోద్యమంలో క్రియాశీలంగా ఉన్న ఎంతోమంది పిల్లలు అదే చేసి ఉంటారనడంలోనూ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, అది కటిక వాస్తవికత. నేను ఉద్యమంలో లేకపోయినా(అలాగని తెలుగు పరిరక్షణ పట్ల నాకు ఆసక్తి లేదని దయచేసి అపార్థం చేసుకోవద్దు) మా పెద్దబ్బాయిని పాఠశాల స్థాయిలో తెలుగు మీడియం లో చదివించాను. అప్పుడు నా అంచనా ఒకటే. తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీష్ వస్తుందని!  నా అనుభవాన్ని అబ్బాయి మీద ప్రయోగించాను. కానీ ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం లోకి మారి మావాడు చాలా ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే పొరపాటు గుర్తించి మా రెండో అబ్బాయిని స్కూలు స్థాయినుంచీ ఇంగ్లీష్ మీడియం లోనే చదివించాను.

ఇంతకీ కావలసినదేమిటి? ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కూడా తెలుగును నిర్బంధం చేయడం, పాలనా వ్యవహారాలు తెలుగులో జరగడం, మీడియాలో అనవసరంగా  ఇంగ్లీష్ వాడకం మానేయడం వగైరాలు. ఇవేమీ అన్యాయమైన కోరికలు కావు. బుర్ర ఉన్న ఏ ప్రభుత్వమైనా పాఠశాల స్థాయిలో మాతృభాషను నిర్బంధం చేయకుండా ఉండదు. అందుకోసం కూడా ఉద్యమం చేయవలసి రావడమే మన ఖర్మ. ఇలాంటి ఆచరణాత్మకపార్స్వానికి తెలుగు సంస్కృతి, తెలుగు చరిత్ర, తెలుగు ఐక్యత, తెలుగువారి ఆత్మగౌరవం లాంటివి కూడా కలిపేసి అన్నింటినీ భావోద్వేగాల స్థాయికి తీసుకు వెళ్ళి సరళం చేయవలసింది కాస్తా సంక్లిష్టం చేస్తున్నామా అని నాకో అనుమానం. వాస్తవికత మరోలా ఉన్న పరిస్థితిలో తెలుగు వాదాన్ని భావోద్వేగాల స్థాయికి పెంచేసి అదే పనిగా రుబ్బుతూ ఉండడం వల్ల యువతలో ఒకవిధమైన అయోమయం, అపరాధభావం ఏర్పడే అవకాశం లేదా?

పిల్లల్ని విదేశీ ఉద్యోగాలకు పంపేసి, ఇక్కడ తమ లాంటి తల్లిదండ్రులు ఒంటరి జీవితం గడపవలసి రావడం గురించీ, మృగ్యమవుతున్న మానవసంబంధాల గురించీ, వెనకటి పల్లె జీవితంలో పరిఢవిల్లిన అనుబంధాల గురించీ సెల్ఫ్ పిటీతో కవిత్వం రాసే కవులు నాకు తెలుసు. పిల్లలు తెచ్చే డాలర్లు తీసుకుంటూ మనం ప్రతిగా ఏమిస్తున్నాం? మీరు మానవ సంబంధాలకు దూరమైపోయారనే అపరాధ మనస్తత్వాన్ని ఇస్తున్నాం. నిజం చెప్పాలంటే మన తరం వాళ్ళ కన్నా ఇప్పటి తరం వారు ఉదారంగా, విశాలంగా ఆలోచిస్తున్నారు.

అదలా ఉంచి పాఠశాల స్థాయి వరకూ తెలుగును నిర్బంధం చేస్తే తెలుగు బతుకుతుందన్న వాదనపై నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే, పాఠశాల విద్య తర్వాత ఒక వ్యక్తి తన చదువులోనూ, ఉద్యోగజీవితంలోనూ తెలుగేతర భాషా సాహచర్యంలోనే ఎక్కువ కాలం గడుపుతాడు. అదీగాక, పాఠశాల విద్య తర్వాతే అతడు మరింత విశాల ప్రపంచంలోకి ప్రభావాలలోకి అడుగుపెడతాడు. సొంత బుద్ధితో ఆలోచించడం కూడా అప్పుడే ప్రారంభిస్తాడు. ఈ పరిస్థితిలో అతడు పాఠశాల స్థాయిలో నేర్చుకున్న తెలుగు మిగులుతుందని చెప్పలేం. కనుక పీజీ వరకూ, చివరికి వైద్య, సాంకేతిక కళాశాల స్థాయిలో కూడా తెలుగు ఏదో ఒక పరిమితిలో కొనసాగవలసిందే. కావాలంటే, వైద్య, సాంకేతిక అంశాలు తెలుగులో ఎలా చెప్పాలో కసరత్తు చేసే అవకాశం వారికే ఇవ్వచ్చు. దానిని ఒక పరీక్షాంశం చేయచ్చు.

కావలసినవి నిర్దిష్టమైన చర్యలు.

యువతకు తెలుగును ఆకర్షణీయంగా 'ప్యాక్' చేసి ఇవ్వడానికి ఇంకా మరికొన్ని చేయచ్చు. ఇప్పటికే వ్యాసం పెద్దదైంది కనుక వాటి గురించి మరోసారి.





Thursday, December 27, 2012

తెలుగు సభలు...నిరసనలు...శ్రీశ్రీ...

ఈ రోజు నుంచీ మూడు రోజులపాటు తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సభలూ సమావేశాలూ జరుగుతున్నప్పుడు గుంపులో గోవిందం లా అనేకమందితో పాటు నాకు కూడా ఆహ్వానపత్రం అందుతూ ఉంటుంది. ఈసారి రాలేదు. కనుక సభల అజెండా ఏమిటో, ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎవరెవరు పాల్గొంటున్నారో నాకు తెలియదు. కార్యక్రమాల ఖరారు కూడా ఆదరాబాదరగా చివరి క్షణంలో జరిగిందని పత్రికలు రాశాయి కనుక ఆహ్వానపత్రాలు అచ్చుకావడంలో, పంపిణీ చేయడంలో కూడా అదే సంభవించి ఉండాలి. ఎవరెవరు వెడుతున్నారో తెలియక పోయినా; ఏ ఏ సంస్థలవారు వెళ్ళడం లేదో మాత్రం పత్రికల ద్వారా కొంత సమాచారం అందుతోంది. చివరికి తెలుగు భాషోద్యమ సమాఖ్యవారు కూడా సభలకు నిరసన తెలుపుతున్నారు.

జరిపేది ప్రపంచ స్థాయి సభలైనా ఏర్పాట్లు ఆఖరి క్షణం వరకూ డేకుతూనే ఉంటాయి. అదేమిటో తెలియదు. సభలు  ప్రారంభం కాకముందే ఏర్పాట్లపై విమర్శలు జోరందుకుంటాయి. సభలు జరుగుతున్నప్పుడూ, ముగిసిన తర్వాతా కూడా విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే వాటిలో వస్తువు మారుతుంది. అందులో సర్కారీ ఆధ్వర్యంలో జరుగుతున్నసభలైతే  ఇక చెప్పనే అవసరం లేదు. ఏర్పాట్లలోనేకాదు, కార్యక్రమాల నిర్వహణలో కూడా  త్వరగా తెమిల్చివేసే ధోరణి ఇలాంటి సభలలో తరచు కనిపిస్తుంటుంది.  తిరుపతి వరకూ వెళ్ళి మూడు రోజులూ గడిపి ఏమి వెంటబెట్టుకుని వెడుతున్నామని ఒకసారి సమీక్షించుకుంటే ఏమీ కనిపించదు. ప్రభుత్వం ఖాతాలో మాత్రం కోట్ల రూపాయిల ఖర్చు కొట్టొచ్చినట్టు(తిరుపతి సభల వ్యయం 40 కోట్లు అంటున్నారు) కనిపిస్తుంది.

ఈ సభలు కూడా నామ్ కే వాస్తే గా, ఆషామాషీగా జరిగిపోతాయా అన్న అనుమానాన్ని పెంచే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఈ నెల 28నే తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరగబోతోంది కనుక ముఖ్యమంత్రి చెప్పుల్లో కాళ్లు పెట్టుకునే సభల్లో పాల్గొనక తప్పదు. లేదా ఆయనతోపాటు రాజకీయప్రముఖులందరూ భౌతికంగా సభల్లో ఉన్నా మానసికంగా ఢిల్లీలో ఉండడం అనివార్యమవుతుంది. ప్రపంచ తెలుగు సభలు జరుపుకుంటున్నాం కనుక అఖిలపక్షాన్ని సభలకు ముందో, తర్వాతో ఏర్పాటు చేయమని మనవారు ఎందుకు ఢిల్లీని కోరలేదో తెలియదు. అదే తమిళులైతే ఏం చేసి ఉండేవారో!

తెలుగువారు అంతా కలసి ఇలాంటి సభలు జరుపుకోవలసిందే. అయితే అదేం చిత్రమో కానీ తెలుగు సభలు అనే సరికి భాష, సంస్కృతీ, సాహిత్యం, కళలు, సన్మాలు, సత్కారాలు,  కవిసమ్మేళనాలు వగైరాలు అజెండా మొత్తాన్ని కబ్జా చేసేస్తాయి.  వాటిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. వాటితోపాటు, తెలుగువారి వ్యవసాయపరిస్థితులు, తెలుగువారి పరిశ్రమలు, తెలుగువారి జాబ్ మార్కెట్, తెలుగువారి పర్యాటక రంగం వగైరాలపై కూడా ఫోకస్ చేస్తే సభలు మరింత ప్రయోజనాత్మకం అవుతాయి. అన్నట్టు పారిశుద్ధ్యలోపం, పోషకాహార లోపంతో సహా అనేకానేక వికృతులతో కళావిహీనంగా మారిన తెలుగు పల్లెలపై దృష్టి పెట్టడం అత్యవసరాలలో ఒకటని నేను కొన్ని రోజులుగా రాస్తున్నాను.

ఇలాంటి సభల్లో కనిపించే మరో వింత ఏమిటంటే, భాష, సంస్కృతి, సాహిత్యం గురించి ఏమాత్రం తెలియని రాజకీయప్రముఖులు, ఇతర ప్రముఖులు వాటి గురించి మాట్లాడుతూ ఎక్కువ సమయం మింగేస్తారు. తీరా వాటి గురించి మాట్లాడవలసిన వక్తలను అయిదు నిముషాలలోనే ముగించమని నిర్వాహకులు తొందర పెడుతుంటారు. ప్రముఖ చరిత్రపరిశోధకుడు వకుళాభరణం రామకృష్ణ గారు ఒకసారి తన అనుభవాన్ని నాకు చెప్పారు. చెన్నైలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్ సభలకు అనుకుంటాను, ఆయనను ఆహ్వానించారట. ఆయన ప్రసంగపాఠాన్ని తయారు చేసుకుని పదిహేను గంటలపాటు రైలు ప్రయాణం చేసి చెన్నై సభలకు వెడితే, మీరు అయిదు నిముషాలలో ముగించాలని సభాధ్యక్షుడు ఆదేశించాడట. ఇదేం పద్ధతని రామకృష్ణ గారు వేదికమీదే గొడవపడ్డారట. అప్పటినుంచీ ఎక్కువమంది వక్తలున్న సభలకు నేను వెళ్ళడం లేదని ఆయన చెప్పారు.

1975 నాటి ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో నిరసన దళానికి, గళానికి మహాకవి శ్రీశ్రీ నాయకత్వం వహించాడు. అప్పటి నిరసన ఉధృతికీ, ఇప్పటి నిరసనకూ  పోలిక లేదు. ఇప్పుడూ నిరసన వ్యక్తమవుతోంది కానీ, దానికి శ్రీశ్రీ లాంటి ఉత్తేజభరిత నాయకత్వం లేదు. అప్పట్లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనను ఉద్దేశించి 'బానిసకొక బానిసకొక బానిసా' అంటూ శ్రీశ్రీ తన సహజ శైలిలో చెప్పిన కవిత నాటి శ్రీశ్రీ అభిమాన యువత నాలుకలపై నర్తించింది. తెలుగు సభల సందర్భంలోనే శ్రీశ్రీని, మరికొందరు కవి రచయితలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఆ సమయంలో నేను అంత్యప్రాసలతో రాసిన ఒక ఔత్సాహిక కవిత పూర్తిగా గుర్తులేదు కానీ నాలుగు పంక్తులు గుర్తున్నాయి. అవి ఇవీ:

కటకటాలలోనె జరిగెను
భారత స్వాతంత్ర్య శిశూదయం
మరల అదే చోట ప్రభవించును
సమసమాజ ఉషోదయం

ఇక్కడే ఒక చిన్న వ్యక్తిగత అంశాన్ని ప్రస్తావిస్తాను. అరెస్ట్  తర్వాత కొన్ని రోజులకు శ్రీశ్రీ రాజమండ్రి వస్తున్నట్టు తెలిసి ఆయనపై నేను రాసిన కవిత తీసుకుని రాజమండ్రి పరుగెత్తాను. వీరేశలింగం టౌన్ హాల్ లో సమావేశం. శ్రీశ్రీ ఇంకా రాలేదు. అంతవరకు నేను శ్రీశ్రీ ని చూడలేదు కనుక ఆయన రాకకోసం ఉత్కంఠతో ఎదురుచూస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్నాను. మా పక్కనుంచే విస్త్రీ కూడా లేని ముతక పైజమా, మోచేతుల చొక్కా ధరించిన ఒక బక్క పలచని ఆకారం వేదికవైపు నడిచి వెళ్లింది. సమావేశం మొదలై వేదిక మీదికి పిలిచిన తర్వాత ఆయనే మహాకవి శ్రీశ్రీ అని తెలిసింది. ఆయనే ఆ సమావేశానికి అధ్యక్షుడు కూడా. నాకు ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగించిన మరో విశేషం ఏమిటంటే, వేదిక మీదకి పిలిచినవారిలో ప్రముఖ దిగంబర,విప్లవ కవి చెరబండరాజు కూడా ఉన్నారు. ఆయనతో నాకు హైదరాబాద్ లో పరిచయం. ఆయన ద్వారా శ్రీశ్రీ మీద రాసిన కవితను శ్రీశ్రీ సమక్షంలోనే చదవచ్చనుకుని ఆశపడి వేదిక పక్కనే నిలబడి చెరబండరాజు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాను. చెరబండరాజు నన్ను చూసి ఆశ్చర్యపోతూ లేచి నా దగ్గరకు వచ్చారు. "నువ్వేమిటి ఇక్కడున్నావు?" అని అడిగారు. "మా ఊరు ఇక్కడికి దగ్గరే" నని చెప్పి, "శ్రీశ్రీ మీద రాసిన ఈ కవిత చదవాలని ఉంది. నాకు అవకాశం ఇప్పించా"లంటూ కవిత ఆయన చేతికి ఇచ్చాను. అది చదివిన చెరబండరాజు, "ఇలా రాసావేమిటి? మా ఉద్దేశంలో మనకింకా స్వాతంత్ర్యం రాలేదు కదా!" అన్నారు. నాకు ఏం చెప్పాలో తోచలేదు. "సరే, నువ్వు ఇక్కడే  ఉండు. శ్రీశ్రీ తో చెబుతాను. పిలిచినప్పుడు వద్దువుగాని" అని చెప్పి ఆయన వేదిక మీదికి వెళ్ళి నన్ను చూపించి శ్రీశ్రీ తో ఆ మాట చెప్పారు. శ్రీశ్రీ తల ఊపారు. అందరి ప్రసంగాలూ అయి శ్రీశ్రీ అధ్యక్షుడి మలి పలుకులు ప్రారంభించేసరికి చెరబండరాజు నొచ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి"ఆయన మలి పలుకులు ప్రారంభించేశాడు. నీ కవిత విషయం మరచిపోయినట్టున్నాడు. ఏమీ అనుకోకు. ఆయన మీద రాసిన కవితే కదా, ఆయనకే ఇస్తాను, ఇటివ్వు" అని తీసుకుని వెళ్ళిపోయారు.

చెప్పొచ్చేదేమిటంటే, అప్పటికీ ఇప్పటికీ వంతెన కింద చాలా నీరు ప్రవహించింది. కానీ ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభల తీరు మారలేదు. జోరు తగ్గినా వాటిపై నిరసనల తీరూ మారలేదు.




Wednesday, December 26, 2012

ఢిల్లీ మానభంగం: చిత్తశుద్ధిలేని చట్టశుద్ధి ఏల?

ఢిల్లీలో మానభంగ ఘటన జరిగి పదిరోజులు అయినా దాని మీద ఎందుకు స్పందించలేకపోతున్నానన్న ప్రశ్న నన్ను అప్పటినుంచీ సలుపుతూనే ఉంది. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బిక్క చచ్చిపోతాం. మాటలు రావు, దొరకవు కూడా. ఢిల్లీ ఘటన కేవలం అలాంటిది మాత్రమే కాదు. ఆ ఘటన తీవ్రతను, దానిపై దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ధర్మాగ్రహాన్ని తక్కువ చేస్తున్నానని దయచేసి అపార్థం చేసుకోకండని కోరుతూనే ఒక మాట అంటాను. దేశంలో రోజూ ఎన్నెన్ని మానభంగాలు జరుగుతున్నాయి!  ఇరవై నిమిషాలకు ఒకటి చొప్పున జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. చివరికి పసికందులను కూడా మగ మృగాలు విడిచిపెట్టడం లేదు. వావి వరసలను కూడా చూడడంలేదు. ఎంతకాలం నుంచీ ఇలాంటి ఘటనల్ని ఖండిస్తున్నాం? ఆవేశాగ్రహాలూ, ఆవేదనా కుమ్మరించుకుంటున్నాం? ఆగ్రహపూరిత ఖండనలూ, శాపనార్థాలూ, పరుష విమర్శల వల్ల ప్రయోజనం ఉంటుందనుకుంటే ఈపాటికి ఈ సమస్య కొంచెమైనా తగ్గుముఖం పట్టాలి కదా! కనుక మాటల ఈటెల వల్ల ఏమీ జరగదు. అవసరమైనవి చేతలు.

దేశంలో మానభంగ ఘటన జరిగిన ప్రతిసారీ ఢిల్లీలోలా జనం స్పందించడం లేదు. రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు జరపడం లేదు. రాజధానిని ముట్టడించడం లేదు. మీడియా పెద్ద ఎత్తున ప్రత్యక్షప్రసారం జరపడం లేదు. చర్చలు నిర్వహించడం లేదు. ఇప్పుడే ఎందుకివి జరుగుతున్నాయన్న  ప్రశ్నఅక్కడక్కడ వినిపిస్తున్న మాట నిజమే. ఆలోచించవలసిన ప్రశ్నే కానీ,  ప్రస్తుతానికి ఇలా అనుకుందాం:  ఢిల్లీ ఘటన జనం ఇమాజినేషన్ ను బాగా ఆకర్షించి ఉండచ్చు. లోపల్లోపల కుత కుత లాడుతున్న ఆగ్రహపు అగ్నిపర్వతం ఇప్పుడు ఒక్కసారిగా బద్దలై ఉండచ్చు. ఎలా జరిగినా ఈ చైతన్యం సమస్య పరిష్కారానికి ఏ కొంచెం దారితీసినా అదే పదివేలు.

ఏం చేయాలన్న చర్చ జరుగుతోంది. సూచనలు వినిపిస్తున్నాయి. పటిష్టమైన చట్టాలు తేవడం, సత్వర విచారణ న్యాయస్థానాల ఏర్పాటు, పోలీస్ బలగాలనూ, పోలీస్ నిఘానూ పెంచడం వగైరా వాటిలో ఉన్నాయి. సంబంధిత చట్టం ఒకటి ఏడేళ్లుగా పెండింగ్ లో ఉండడం కూడా ఆక్షేపణీయం అవుతోంది. మానభంగ నేరస్తునికి ఉరిశిక్ష విధించాలన్న అభిప్రాయం ఒకవైపున వినిపిస్తుండగా; అందువల్ల సమస్య పక్కదారి పట్టి, శిక్ష పడే కేసుల సంఖ్య ఇంకా తగ్గిపోతుందన్న వాదం మరోవైపున వినిపిస్తోంది. ఉరిశిక్ష కన్నా రసాయనిక ప్రక్రియలో అవయవాన్ని నిర్వీర్యం చేయడం మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

పటిష్ట చట్టాలు తేవలసిందే, సత్వర విచారణ న్యాయస్థానాలను ఏర్పాటు చేయవలసిందే, పోలీస్ బలగాలను, నిఘాను పెంచవలసిందే. ఇంకా అవసరమైన చర్యలన్నీ తీసుకోవలసిందే. అదే సమయంలో కొన్ని అనుబంధప్రశ్నలనూ వేసుకోకుండా ఉండలేం. చట్టాలు లేకనే నేరాలు జరుగుతున్నాయా? ఉన్న చట్టాలు అయినా సక్రమంగా అమలు జరుగుతున్నాయా? సత్వరవిచారణ న్యాయస్థానాల సంఖ్య పెరిగితే, కేసులు త్వరగా పరిష్కారమై నేరస్తులకు శిక్ష పడుతుందని నమ్మడమెలా? రాజస్థాన్ లో సామూహిక అత్యాచారానికి గురైన ఒక ఎనిమిదేళ్ళ బాలిక కేసు సత్వర విచారణ న్యాయస్థానంలోనే నాలుగు నెలలుగా స్తంభించిపోయిందని ఈ రోజు వార్త.  మామూలు న్యాయస్థానాలలో కూడా ఉండవలసినంతమంది న్యాయమూర్తులు లేక కేసులు పెండింగ్ లో పడిపోతున్నప్పుడు సత్వర విచారణ న్యాయస్థానాలకు జడ్జీలను ఎలా అందిస్తారు? ఇక,  చట్టాలూ, కోర్టులూ, ఇతరేతర హంగులూ ఉన్న కేసుల్లోనే శిక్ష పడే కేసుల శాతం అత్యంత హీనంగా ఉందన్న సంగతిని ఎంతమంది గమనిస్తున్నారు?

పోలీస్ బలగాలను పెంచుతారు సరే, పోలీసుల చేత పని ఎలా చేయిస్తారు? వారిని పౌర మిత్రులుగా ఎలా తీర్చిదిద్దుతారు? వారిలో ప్రజారక్షణకు అవసరమైన నిబద్ధతను ఎలా తీసుకొస్తారు? ఈ దేశంలో జనం పిలుపుకు తక్షణమే స్పందించే పోలీస్ వ్యవస్థను మీరు ఎక్కడైనా చూసారా? మహిళలను అలా ఉంచండి, ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే మగవాళ్ళను సైతం మీరు ఎక్కడైనా చూసారా?  ఇంట్లో దొంగతనం జరిగితే పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోయిన సొత్తు దొరుకుతుందని నమ్మే వారిని ఎక్కడైనా చూసారా? తన కళ్ల ముందు నేరం జరుగుతుంటే జోక్యం చేసుకున్న పోలీసులను మీరు ఎంతమందిని చూశారు? ఈ దేశంలో పోలీస్ సంస్కరణలనే మాట ఎంతకాలంగా వినిపిస్తోంది? ఇంతవరకు అవి ఎందుకు కార్యరూపం ధరించలేదు?

సందర్భం అలాంటిది కనుక పోలీసుల గురించి చెప్పుకుంటున్నాం కానీ, వాళ్ళను మాత్రమే వేలెత్తి చూపించనవసరం లేదు. అసలు ఏ ఇతర విభాగాలలోనైనా పని మీద వచ్చిన పౌరుల పట్ల మర్యాదగా, కర్తవ్యపరాయణతతో స్పందించే ఉద్యోగులను మీరు ఎంతమందిని చూస్తున్నారు?  సింపుల్ గా చెప్పాలంటే మిత్రులారా, మనదేశంలో పని సంస్కృతి అనేది ఇంతవరకు ఏర్పడలేదు. మేము ప్రజాసేవకులం, వారి బాగోగులు చూడడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికే మేము జీతాలు తీసుకుంటున్నామన్న భావనను ఉద్యోగులలో చొప్పించే ప్రయత్నం ఎక్కడా జరగడం లేదు.  ఉన్న పోలీసులలో పని చేసే ప్రవృత్తిని రంగరించలేనప్పుడు సంఖ్య పెంచితే ఉపయోగమేమిటి?

ఒక కిరాణా కొట్టు యజమాని, ఒక బట్టల వ్యాపారి తమ వద్దకు వచ్చే వినియోగదారుని పట్ల చూపించే మర్యాద ప్రజాధనం నుంచి జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వోద్యోగి ప్రజలపట్ల ఎందుకు చూపించడం లేదు?

మానభంగం వంటి అతి హేయమైన నేరానికి ప్రేరేపించే సామాజిక పరిస్థితులు ఎలాంటివన్నది సామాజికశాస్త్రవేత్తలు పట్టించుకోవలసిన వేరొక ముఖ్యమైన పరిశీలనా కోణం. అది అలా ఉంచి, ఢిల్లీ మానభంగం ఘటన ఎంత కలచివేసేదో, నిరసనప్రదర్శనల సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించడమూ అంతే బాధాకరం. ఆ మరణం ఏ పరిస్థితులలో సంభవించిందన్న విషయంలో భిన్న వాదాలు వినిపిస్తున్నాయి కనుక వాస్తవం ఏమిటో నిర్ధారణ కాకుండా అందులోకి వెళ్లలేం. నాయకత్వం అంటూ ఒకటి లేకుండా అసంఘటితంగా అప్పటికప్పుడు ఉవ్వెత్తున లేచిన ధర్మాగ్రహప్రదర్శనలో విచిన్నకర శక్తులు అడుగుపెట్టి ప్రదర్శనను అవాంఛనీయమైన మలుపు తిప్పే  ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ మరణం పై వచ్చిన ఆరోపణలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్నే హెచ్చరిస్తున్నాయి.

మళ్ళీ అసలు సమస్యలోకి వెడితే, ప్రజలపట్ల సానుకూలంగా సానుభూతితో స్పందించవలసిన వ్యక్తులలోనే స్పందనాగుణం లోపించినప్పుడు ఉన్న వ్యవస్థలను పటిష్టం చేసినందువల్లా, కొత్తవి సృష్టించడంవల్లా ప్రయోజనం ఉంటుందా? వ్యక్తులలో పని చేసే సంస్కృతిని తీసుకురావడానికి ఏం చేస్తారు??





Tuesday, December 25, 2012

బాహ్య శుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు


 ఈ మధ్య అమెరికాలో, చికాగో దగ్గరలోని బ్లూమింగ్టన్ లో కొన్ని మాసాలు ఉన్నాను. మా పొరుగునే ఉన్న ఒక తమిళ జంట ఇక్కడ ప్రతి గురువారం షిర్డీ సాయి సత్సంగ్, భజన ఉంటాయని చెప్పి ఒక గురువారం మమ్మల్ని తీసుకు వెళ్లారు.  మేము వెళ్లేటప్పటికే ఆ ప్రాంగణం కార్లతో నిండిపోయింది. ఒక విశాలమైన హాలులో సాయి చిత్రపటం ఉంచారు. భజన జరుగుతోంది. సాఫ్ట్ వేర్ నిపుణులుగా పని చేసే యువతీ యువకులే అధికసంఖ్యలో ఉన్నారు. వారి చేతుల్లో తెలుగు, ఇంగ్లీష్ లిపుల్లో ఉన్న భజన గీతాలు, హారతి పాటల పుస్తకం ఉంది. హారతి కూడా అయిన తర్వాత అందరూ వరసలో నిలబడి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చివరగా భక్తులు ఇళ్ళలో వండి తెచ్చిన ప్రసాదాలు, పండ్లు ప్లాస్టిక్ బాక్స్ లలో పెట్టి పంపిణీ చేశారు. ఆ హాలూ, ఆ పరిశుభ్రత, భక్తుల క్రమశిక్షణ, ప్రసాద వితరణ అన్నీ అమెరికా ప్రమాణంలో ఉన్నాయి.

అన్నట్టు చెప్పడం మరచిపోయాను...భక్తులలో ఎక్కువమంది తెలుగువారే. బ్లూమింగ్టన్ లోని భారతీయుల్లో  తెలుగు జనాభాయే ఎక్కువ.  సత్సంగ్ లో పాల్గొన్న వాళ్ళలో యువతే అధిక సంఖ్యలో ఉండడం కూడా నా దృష్టిని ఆకర్షించింది. బహుశా పది పదిహేనేళ్లుగా ఈ పరిణామాన్ని చూస్తున్నట్టున్నాం. ఆర్థిక సంస్కరణలకు ముందునాటి యువతలో భక్తిప్రపత్తులు ఇంత ప్రస్ఫుటంగా, బాహాటంగా వ్యక్తమయ్యేవని చెప్పలేను. అప్పటి యువతలో నిస్పృహా, నైరాశ్యాలు ఎక్కువగా ఉండేవి. నిరుద్యోగం లాంటి సమస్యలవల్ల కావచ్చు. ‘కృష్ణా రామా’ అనుకోవడం, గుడుల చుట్టూ తిరగడం వయసు మీరిన వాళ్ళు చేసేపని అన్న అభిప్రాయమూ, అలా తాము కూడా చేయడంలో ఒకవిధమైన నామోషీ, ముఖ్యంగా చదువుకున్న యువతలో ఉండేవనుకుంటాను. దాంతోపాటు, వామపక్ష/వామపక్ష తీవ్రవాద/నాస్తికవాద ఉద్యమాల ప్రభావమూ ఉండేది. ఆర్థిక సంస్కరణల అనంతరకాలంలో భక్తి ప్రపత్తుల ప్రకటనలో వయోభేదాలు అంతరించాయి. మళ్ళీ సాంప్రదాయిక దేవీదేవతలందరూ యువతను ఆకట్టుకుంటున్నారనీ చెప్పలేం. బహుశా వేంకటేశ్వరస్వామి మినహాయింపు. యువతను అత్యధికంగా ఆకర్షిస్తున్న దైవం షిర్డీ సాయి.

ఆ తర్వాత కూడా రెండు, మూడుసార్లు సత్సంగ్ కు వెళ్ళాం.  సత్సంగ్ నిర్వాహకులు బ్లూమింగ్టన్ లో షిర్డీ సాయి మందిర నిర్మాణం సంకల్పించి విరాళాల సేకరణ ప్రారంభించారు. బ్రేక్ ఫాస్ట్ ల ఏర్పాటు, సినిమా ప్రదర్శనలు వగైరాలు విరాళాల సేకరణలో భాగం. మరో ఏడాదిలో మరోసారి నేను బ్లూమింగ్టన్ కు వెళ్ళడమంటూ జరిగితే అప్పటికి అక్కడ షిర్డీ సాయి మందిరం తయారై ఉంటుందని నిశ్చయంగా అనిపించింది. భక్తి మహిమ అలాంటిది. సత్వర నిర్మాణాలు ఏమైనా జరుగుతున్నాయంటే అది ఆధ్యాత్మికరంగంలోనే. హైదరాబాద్ కు ఇదిగో అదిగో అంటున్న మెట్రో రైలు రావడానికి పదేళ్ళు పట్టచ్చు. ముందే కాలువలు తవ్వి కూర్చున్న పోలవరం ప్రాజెక్టుకు ఇరవయ్యేళ్లు పట్టచ్చు. దేవాలయ నిర్మాణం ఎప్పుడూ కాలంతో పోటీ పడుతుంది.

భగవంతుడి మహిమ మూగతో మాట్లాడిస్తుందనీ, కాలు స్వాధీనంలోలేని వ్యక్తిచేత పర్వతాలను లంఘింపజేస్తుందనీ అంటారు. దేశం కాని దేశంలో భారతీయులచేత కూడా భారీ నిర్మాణాలు చేయిస్తుంది. చికాగో దగ్గరలోని అరోరాలో వేంకటేశ్వరస్వామి ఆలయం చూసినప్పుడు అలాగే అనిపించింది. ఎన్నో ఎకరాల విస్తీర్ణం గల పచ్చని ప్రాంగణంలో ఎత్తుగా ఠీవిగా పాలరాయితో కట్టిన భారీ కట్టడం అది. అమెరికా సంపన్నతకు తులదూగేలా ఉంది. అమెరికాలో హిందూ దేవాలయాలకు అనుబంధంగా భోజన, ఫలహార విక్రయశాల కూడా ఉంటుంది. శని, ఆదివారాలలో దూర దూర ఆలయాలకు కూడా కారులో వెళ్ళి దైవదర్శనం చేసుకుని, భోజన ఫలహారాలు చేసి తిరిగి రావడం తెలుగు యువతతో సహా అక్కడి భారతీయులకు పరిపాటిగా మారింది. మన దేవాలయ నిర్మాణవ్యవస్థను అమెరికాకు తీసుకువెళ్లి, ఆ దేశాన్ని విస్తరించిన మన ఆధ్యాత్మిక నడవగా మార్చుతున్న మన వాళ్ళు, అక్కడి పద్ధతులను తిరిగి మన దేశానికి తీసుకువస్తారనడంలోనూ సందేహం లేదు.

అమెరికానుంచి వచ్చాక పశ్చిమగోదావరిజిల్లాలోని సొంతవూరికి, అత్తవారి ఊరికి వెళ్లాల్సివచ్చింది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో చేబ్రోలు వెళ్ళే రైలు కోసం ఎదురుచూస్తున్నాం. ఓ డెబ్భై, ఎనభై ఏళ్ల వృద్ధుడు మా పక్కన కూర్చున్నాడు. తను యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లో పుట్టపర్తి వెడుతున్నానని చెప్పాడు. సత్య సాయి జన్మదినం సందర్భంగా సేవాకార్యక్రమంలో పాల్గొనడానికి వెడుతున్నాడట. ఆ వయసులో అంత దూరం వెళ్ళి ఈయన ఎటువంటి సేవలు అందిస్తాడనిపించి ఆశ్చర్యం కలిగింది. అంతలో మరో వృద్ధుడు వచ్చి ఆ పెద్దమనిషిని పలకరించాడు. ఆయనా పుట్టపర్తికే. అయితే రిజర్వేషన్ దొరకలేదట. ఎలా అని అడిగితే, ఏముంది, జెనరల్ కంపార్ట్ మెంట్ ఎక్కేస్తానన్నాడు. అంత దూరం...ఆ వృద్ధుడి ధీమా ఆశ్చర్యం కలిగించింది. ఆ సమీపంలోనే మరో అరడజను మంది సత్యసాయి భక్తులు కనిపించారు. వాళ్లూ పుట్టపర్తికే. సత్యసాయి ట్రస్టు మీద ఆరోపణల సంగతేమిటి, భక్తుల రాకపై వాటి ప్రభావం పడిందా అని అడిగితే, అన్నీ సర్దుకున్నాయి, భక్తుల సంఖ్య ఇంకా పెరిగిందని మొదటి వృద్ధుడు చెప్పాడు.

ఏవో రోగాలతో తీసుకుంటూ, కుటుంబ సమస్యలతో నలుగుతూ, మంచి-చెడుల కలబోతగా కనిపించే మనుషుల్లో కూడా గుప్తంగా తమదైన భక్తి, ఆధ్యాత్మిక జగత్తు ఉంటుంది. విశ్వాసం వయసునీ, అనారోగ్యాన్ని అవలీలగా జయించి పుట్టపర్తివరకూ నడిపిస్తుంది. ఆ విశ్వాసానికి ఆలంబనం సత్యసాయి కావచ్చు, అయ్యప్పస్వామి కావచ్చు, మరో దైవం కావచ్చు. సత్య సాయి ట్రస్టు మీద, ఆయన ఉండగా ఎన్నడూ రాని స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. పత్రికలు ధారావాహికంగా కథనాలు ప్రచురించాయి. అయినా సరే, సాయి భక్తులలో విశ్వాసదీపం కొంచెం కూడా చలించలేదని ఆ వృద్ధుడితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. భక్తి రహస్యం అదే. ఆ సామ్రాజ్యంలోకి లౌకికమైన దేదీ అడుగుపెట్టలేదు.

చేబ్రోలులో రైలు దిగి నడుచుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాం. మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుతూ మా పక్కనుంచే లారీలు, ఒకటి రెండు కార్లు వెళ్లిపోయాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనిపించిన ఓ దృశ్యం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఏణ్ణర్థం క్రితం అక్కడ ఒంటి అంతస్తుతో షిర్డీ సాయి మందిరం ఉండేది. ఇప్పుడక్కడ  దాదాపు అన్ని హంగులతో రెండంతస్తుల మందిరం ఉంది. ఆ పక్కనే ఓ తాటాకు కప్పు కింద వంట సామగ్రి ఉంది.  ఇంటికి వెళ్ళాక మందిర నిర్మాణం గురించి చెప్పిన మా అత్తగారు, అక్కడ ప్రతి గురువారం అన్నదానం జరుగుతోందని కూడా చెప్పారు. మొదట్లో అన్నదానానికి పదిహేనువందలు తీసుకునేవారట, సంఖ్య పెరగడంతో ఇప్పుడు మూడువేలు తీసుకుంటున్నారట. ఒకవారం ఖర్చు తను భరిస్తానంటే; మూడు మాసాల దాకా ఖాళీ లేదు, ముందే రిజర్వు చేసేసుకున్నారని మందిర నిర్వాహకులు చెప్పారట.

ఊళ్లలోకి అడుగుపెట్టగానే కుంగదీసే భయం, దోమలు. చుట్టూ పొలాల వల్ల, ఓపెన్ డ్రైనేజ్ వల్ల దోమల దాడి ఎక్కువ. దానికి కరెంట్ కోత కూడా తోడైతే ఇక చెప్పనక్కరలేదు. అయితే అదృష్టం కొద్దీ ఈ మధ్య కరెంట్ ఉంటోందట. అయినాసరే, ఆల్ ఔట్ వంటి దోమల విధ్వంసకాల రక్షణ తప్పదు. తెల్లవారు జామునే మైకు శబ్దంతో భళ్ళున మెలకువచ్చింది. షిర్డీ సాయి మందిరం నుంచి భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపున గాయత్రీదేవి ఆలయం నుంఛీ స్తోత్రాలు మొదలయ్యాయి. మరోవైపున అయ్యప్ప దీక్షలో ఉన్నవారు కూడా మైకు ఆన్ చేశారు. ఒక్కోసారి అన్ని మైకుల శబ్దాలూ కలసిపోయి అస్పష్ట రణగొణధ్వనులను ప్రసారం చేస్తున్నాయి. ఈ మైకు శబ్దాలు క్షణకాలం ఆగితే, దూరంగా ఉన్న శివాలయం మైకు సన్న సన్నగా చెవిన పడుతోంది.  కొన్నేళ్లుగా ఊళ్ళు భక్తి గీతాలతో, దేవతా స్తోత్రాలతో మేలుకుంటున్నాయి. స్తబ్ధుగా, నిశ్శబ్దంగా ఉండే ఊళ్ళ ఉనికిని చాటే శాబ్దిక సాధనాలుగా గుడి మైకులు మారాయి.  హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు  ఊళ్ళకు మైకు సెట్లు ఇచ్చినప్పటినుంచీ ఇది ప్రారంభమైనట్టు జ్ఞాపకం.

గుడి కంటే ముందే లేచి చన్నీటిస్నానం చేసిన మా అత్తగారు ఈ రోజు ఉపవాసమనేవరకూ ఆ రోజు కార్తీక సోమవారమన్న సంగతి గుర్తురాలేదు. లేచి, కాస్త అలా నాలుగు వీధులు తిరిగొద్దామని బయలుదేరాను. స్తబ్ధ వాతావరణమే కాదు, అక్కడక్కడ పాడుబడినట్టున్న ఇళ్లూ కనిపించాయి. మట్టి రోడ్లు. చాలాచోట్ల గతుకులు. వాహనాలు, షాపులతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి మరింత అధ్వాన్నం. అదీ మట్టి రోడ్డే. గోతుల మయం. కొన్నిచోట్ల ఆ మధ్య కురిసిన తుపాను వర్షాల తాలూకు నీరు ఇంకా నిలిచి ఉంది. ఆ బురదనీటిని పాదచారుల మీద చిమ్ముతూ వాహనాలు వెడుతున్నాయి. దానికితోడు రోడ్డు పొడవునా  అటూ ఇటూ చెత్త పోగులు. అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. ఆ రోడ్డు మీదే శివాలయం ఉంది. దానికి కొన్ని అడుగుల దూరంలోనే మాంసవిక్రయం జరుగుతోంది. ఆ దృశ్యం, ఆధ్యాత్మిక సామ్రాజ్యంపై ఆధిపత్యం చాటుతూవచ్చిన ఒక సామాజికవర్గం పట్టు సడలిన సంకేతాలు ఇస్తోందా అనిపించింది.  అదే రోడ్డు మీద ముందుకు వెడితే ఒక చర్చి కనిపిస్తుంది.

క్రమంగా కార్తీక సోమవార సంరంభం పుంజుకుంది. ఆలయాల దగ్గర సందడి కనిపిస్తోంది. ఆడా, మగా పూలు, పండ్లు పుచ్చుకుని గుళ్ళకు చేరుతున్నారు. ఉండి ఉండి గుడిగంటలు మోగుతున్నాయి. ఒకటిమాత్రం చాలామందిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది, పోషకాహారలోపం! ఊళ్ళో జనం చేతుల్లో సెల్ ఫోన్లు, ఇళ్ళల్లో టీవీలు ఉన్నమాట నిజమే. కానీ తాము జీవించే పరిసరాలు అంత మురికి మురికిగా, అనారోగ్యకరంగా ఉన్నాయే అన్న స్పృహ కానీ; అందుకు బాధ్యత వహించవలసిన వ్యవస్థల ఉనికి గురించిన పట్టింపు కానీ ఉన్నట్టు కనిపించలేదు. గుడి, భక్తి ప్రకటన...ఈ రెండే సామాజిక అభివ్యక్తులుగా కనిపించాయి. ఊరికీ, బాహ్యప్రపంచానికీ మధ్య  కనిపించని ఉక్కుతెరలు ఉన్నాయనిపించింది. శతాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ గ్రామజీవనం నమూనా ఇప్పటికీ చెక్కుచెదరలేదన్న భావన కలిగింది. అపరిశుభ్రత, అసౌకర్యాలు నిండిన పరిసరాలలో వారు జీవిస్తున్న మాట నిజమే. అదే సమయంలో వారు తమదైన భక్తి సామ్రాజ్యంలో జీవిస్తున్నారు. కేవలం విశ్వాసమే వారిని జీవింపజేస్తోంది. అయితే ఆ విశ్వాసం పాలకుల మీద కాదు. తమ భక్తి సామ్రాజ్య అధిపతి అయిన భగవంతుడి మీద.

రెండు రోజుల తర్వాత మా సొంత ఊరికి బయలుదేరాం. నిడదవోలు వెళ్లడానికి చేబ్రోలు స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్నాం.  ఫ్లాట్ ఫారం మీద భవానీదీక్ష పుచ్చుకున్న ఓ పదిమంది కాషాయం దుస్తులతో, ముఖాన గంధం కుంకుమలతో కనిపించారు. అందరూ చిన్న చిన్న వ్యాపారాలో వృత్తులో చేసుకుంటున్నవాళ్లు. అయ్యప్ప దీక్ష పుచ్చుకున్నవారు ఇద్దరో ముగ్గురో కనిపించారు. ఇలాంటి దీక్షావిధానం ఇటీవలికాలంలో అయ్యప్పదీక్షలతోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. భవానీ దీక్షలే కాక అన్నవరం సత్యనారాయణస్వామి దీక్షలు, సింహాచల నరసింహస్వామి దీక్షలు, తిరుమల గోవింద దీక్షలు కూడా మొదలయ్యాయి. ఆధ్యాత్మిక సామ్రాజ్యంపై ఒక సామాజికవర్గం పట్టు సడలిందనడానికీ, ఆధ్యాత్మికరంగంలో జరుగుతున్న వికేంద్రీకరణకూ ఈ పరిణామం మరో స్పష్టమైన సూచన అనిపించింది. పూజారి జోక్యం లేకుండా ఎవరికి వారే నేరుగా భగవంతుని పూజించుకునే సౌలభ్యం ఉండడం ఈ దీక్షల ప్రాచుర్యానికి ఒక కారణమని కొంతమంది భక్తులతో మాట్లాడినప్పుడు అర్థమైంది. అయితే భిన్న విధానాలు, భిన్న సామాజికవర్గాల మధ్య ఎలాంటి పోటీ కానీ, శత్రువైఖరి కానీ లేదు. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అధికార వికేంద్రీకరణే కాదు, అద్భుతమైన ప్రజాస్వామ్యమూ వెల్లివిరుస్తోంది. ఎవరూ ఎవరినీ కాదనడం లేదు. ఊళ్లలో చీకటితోనే మేలుకొలిపే గుడి మైకులూ, టీవీ చానెళ్లలో రోజంతా వినిపించే ప్రవచనాల ‘సౌండ్ బైట్స్’ లోనే కాదు; తిరువణ్ణామలై రమణాశ్రమం, పుట్టపర్తి ప్రశాంతినిలయం మొదలైనచోట్ల  కనిపించే ప్రశాంత మౌన వాతావరణంలోనూ అన్ని వర్గాలవారూ ఆధ్యాత్మిక శాంతిని ఆస్వాదిస్తున్నారు.

రైలు ఎక్కగానే నా సెల్ లో మెసేజ్ మోగింది. హైదరాబాద్, పంజగుట్టలోని జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఓ మిత్రుడు, ‘మీరు హైదరాబాద్ ఎప్పుడొస్తున్నారు, ఒకసారి వచ్చి సెంటర్ ను చూడా’లని అడుగుతున్నాడు. మౌనంలో ఉండడం వల్ల మెసేజ్ ఇచ్చాడట. నిడదవోలులో రైలు దిగి బస్టాండ్ వైపు నడిచాం. గుళ్ళ దగ్గర కార్తీకమాసం హడావుడి కనిపించింది.  బస్టాండ్ చూడగానే కడుపులో దేవినట్టు అయింది. వెలిసిపోయిన గోడలతో  ఇక్ష్వాకుల కాలంనాటిదిలా కనిపిస్తోంది. ప్రయాణికుల షెల్టర్ ను ఆనుకునే పాచి పట్టిన ఒక పెద్ద మురుగు నీటి వైతరణి ఉంది. దానిమీద దోమలు గుంపులుగా విహరిస్తున్నాయి. బస్సులాగే చోటు మిట్టపల్లాలతో ఉంది. ‘పోలవరం బస్సు ఉందా?’ అని కంట్రోల్ రూమ్ లో కూర్చున్న ఉద్యోగిని అడిగితే, ‘వస్తుంది’ అని శూన్యంలోకి చూస్తూ జవాబిచ్చాడు. ‘ఎన్నింటికి?’ అని అడిగితే, చూపు తిప్పకుండానే, ‘ఇప్పటికే రావా’లన్నాడు. అంతలో తాళ్ళపూడి బస్సు వచ్చింది. అందులో వెడితే తాళ్ళపూడిలో దిగి మా ఊరు ప్రక్కిలంకకు మళ్ళీ ఆటో చేసుకోవాలి. పోలవరం బస్సు కోసం ఎదురుచూడడం కన్నా అదే నయమనుకుని బస్సు ఎక్కాం. బస్సు ఊళ్ళోంచి వెడుతుండగా రోడ్డువైపు దృష్టి సారించాను. రోడ్డు పొడవునా చెత్త కుప్పలు. ఒక చోట వెయ్యి గజాల ప్రదేశం అంతటా చెత్త పరచుకుని ఉంది. అక్కడే బహిరంగ కాలకృత్యాలు జరుగుతున్నాయి. దాని పక్కనే ప్రభుత్వాసుపత్రి ఉంది.

ప్రక్కిలంక చేరేసరికి పదకొండు దాటింది. ఊరు అన్ని ఊళ్ళలానే స్తబ్ధుగా ఉంది. మా ఇంటి గేటు తీసుకుని లోపలికి అడుగు పెడుతుంటే, లోపల ఖాళీ స్థలంలో తళతళా మెరిసిపోతున్న రేకులతో ఒక ఎత్తైన షెడ్డూ, అందులో రంగులు పెయింట్ చేసిన ఓ రథమూ కనిపించాయి. తలుపు కొట్టగానే అక్కయ్య తలుపు తీసింది. లోపల టీవీలో టీటీడీ చానెల్ నుంచి భక్తి కీర్తనలు వినిపిస్తున్నాయి. కుశల ప్రశ్నలు, భోజనాలు వగైరాల తర్వాత మాట్లాడుకుంటూ కూర్చుని ఉండగా, అంతలో అక్కయ్య ఏదో గుర్తొచ్చినట్టు లేచి టీవీ ఆన్ చేసి భక్తి చానెల్ పెట్టింది. చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం వస్తోంది. ఈ రోజు తెలుగు నాట ఇంటింటా తెలిసిన పేరు ఆయన. వివిధ చానెళ్లలో రోజుకు కనీసం నాలుగైదు సార్లు ఆయన కనిపిస్తారు, వినిపిస్తారు. నేటి టీవీ యుగం సృష్టించిన ఒక పౌరాణిక ‘సెలెబ్రటీ’ గా ఆయనను చెప్పుకోవచ్చు. సాంప్రదాయిక భక్తి, ఆధ్యాత్మికతలనే బోధిస్తున్నా; అసాధారణమైన శ్రావ్యత, తన్మయత ఆయనలో ఆకట్టుకునే ప్రత్యేకతలు. ఆయన ప్రవచనాలు సీడీ ల రూపంలో కూడా వ్యాప్తిలో ఉన్నాయి. ‘ఇదిగో రోజంతా ఈ భక్తి చానెళ్లతోనే కాలక్షేపం’ అంటూ అక్కయ్య టీవీ శ్రవణానికి ఒక చెవి అప్పగించి రెండో చెవిని మాకు అప్పగించింది. టీవీ వచ్చాక పురాణకాలక్షేపాలకూ, హరికథలకూ బయటికి వెళ్ళే అవసరమూ, అలవాటూ తప్పిపోయాయి.  అందులోనూ పిల్లల విదేశీ ఉద్యోగాలు వచ్చాకా, ఇతర బాధ్యతలు తీరిపోయిన తర్వాతా గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు టీవీ సాహచర్యంలోనే ఒంటరి తనాన్ని జయిస్తూ భక్తి, ఆధ్యాత్మికతలను పండించుకుంటున్నారు.  ప్రవచనాలూ, దేవతాస్తుతులూ వగైరాలే కాదు; జాతకాలు, గ్రహశాంతులు, జపాలు, వాస్తు, రుద్రాక్షలు, ఉంగరాలలో ధరించే రాళ్ళు సహా అన్ని రకాలకు సంబంధించిన సలహాలు టీవీ చానెళ్ల ద్వారా ఇళ్లలోనే ఉచితంగా లభిస్తున్నాయి. వయోభేదం లేకుండా ఎవరెవరో టీవీ తెర మీద ప్రత్యక్షమై ఉపదేశాలు, సలహాలు ఇస్తున్నారు. వారి అర్హతా, నర్హతల గురించి ఎవరూ అడగడం లేదు. అన్ని చానెళ్లూ రుద్రాక్షలు, ఉంగరాల రాళ్ళ వ్యాపారానికి సంబంధించిన వాణిజ్య కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వాటిలోని  నిజానిజాలను పరిశీలించేవారు కానీ, ఆ వ్యాపారంపై నిఘా పెట్టిన వ్యవస్థ కానీ ఉన్నట్టు లేదు. తెలుగువారి ఆధ్యాత్మిక సామ్రాజ్యం వికేంద్రీకృతం, ప్రజాస్వామికమే కాదు; విశృంఖలం కూడా.

మధ్యాహ్నం  అలా వీధిలోకి వెళ్లినప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండే కిరాణా వ్యాపారి కనిపించి పలకరించాడు. రేకుల షెడ్డు చూపించి రథం కోసం ఈ మధ్యనే చేయించామని చెప్పాడు. ఈ ఏడాది మాఘమాసంలో జరిపిన సౌర యాగానికి, సూర్య నమస్కారాలకు ఊళ్ళనుంచి బళ్ళు కట్టుకుని వచ్చారనీ, 70 వేలు మిగిలాయనీ, శివాలయానికి ఆ డబ్బు ఖర్చు పెడుతున్నామనీ సగర్వంగా చెప్పాడు.

ఉదయమే చీకటితోనే శివాలయం నుంచీ, గోదావరి గట్టునే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచీ వినిపించే మైకు శబ్దాలకు లేచి కూర్చున్నాను. వెలుగు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు వెంబడే గోదావరి గట్టుకు బయలుదేరాను. రోడ్డుకు అటూ ఇటూ అశుద్ధాలు! వాటి మధ్య నడవడానికి కంపరం కలిగింది. గట్టు మీద బాగుండచ్చన్న ఆశతో ఎలాగో ముందుకు నడిచాను. తీరా వెడితే అక్కడా అదే పరిస్థితి. శుభ్రమైన గోదావరి గాలి పీల్చుకోవచ్చునన్న ఆశకు నీళ్లొదిలి తిరుగుముఖం పట్టాను. వస్తుంటే ఒక పక్క నిర్మల్ గ్రామ్ పురస్కార్ కు సంబంధించిన బోర్డు కనిపించింది. బహిరంగ కాలకృత్యాలు నిషిద్ధమనీ, దానిని ఉల్లంఘించినవారిని శిక్షిస్తామనీ  దాని మీద రాసుంది. అంత బాధలోనూ నవ్వొచ్చింది. శిక్షించేదెవరు, శిక్షింపబడేదెవరు? అంతా మాయ!

అంతలో పూజారి మిత్రుడు ఎదురై పలకరించాడు. ఎలాగూ వచ్చారు, లక్షపత్రి పూజకు ఉండి వెళ్లండన్నాడు!

 చేబ్రోలు, ప్రక్కిలంకే ఏమిటి, ఆంధ్రదేశంలోని అన్ని ఊళ్లూ బాహ్య పరిసరాలను విస్మరించి భక్తిగంగలో మునకలేస్తున్న దృశ్యం కళ్ళకు కట్టింది.

ఆధ్యాత్మిక సామ్రాజ్యం అన్నప్పుడు దానికి ఒక రాజధానీ ఉండవలసిందే. ఆ విధంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధానులు రెండు.  హైదరాబాద్ రాజకీయ రాజధాని అయితే,  తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని. ముఖ్యమంత్రి పదవి తర్వాత ఆకర్షణ గల పదవి బహుశా టీటీడీ అధ్యక్ష పదవే. వార్తల్లో ఉండడంలో టీటీడీ అధ్యక్షుడు ముఖ్యమంత్రితో పోటీ పడుతుంటారు.  అలాగే, రాజధాని అన్న తర్వాత హైదరాబాద్  మీద పెట్టినంత ఫోకస్ నే మీడియా తిరుపతి మీదా పెట్టక తప్పదు. అందుకే మంచివీ, చెడ్డవీ సహా తిరుపతికి సంబంధించిన అన్ని వార్తలనూ  అందించడడంలో ఇటీవలి కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పోటీ పడుతున్నాయి. తిరుమల వేంకటేశ్వరస్వామి సంపన్న దైవం కనుక మీడియా నిఘా మరింత తప్పనిసరి. ఆధ్యాత్మిక రాజధాని అన్నాక తిరుపతిపై  అధికారాన్ని స్థాపించుకోడానికి ఆధ్యాత్మిక నేతలు ప్రయత్నించడమూ సహజమే. వెయ్యి కాళ్ళ మండపం, బంగారపు తొడుగు మొదలైన వివాదాస్పద నిర్ణయాలలో, ఆగమోక్తవిధానాల ఉల్లంఘన వంటి ఆరోపణల సందర్భంలో చిన జియ్యర్, స్వరూపానందేంద్ర సరస్వతి వంటి స్వాముల జోక్యం, వారు తరచు వార్తలకెక్కడం చూస్తున్నాం. అలాగే, రాజకీయ సామ్రాజ్యంలోని ఊళ్లలానే, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోని  ఎన్నో  బడుగు గుడులు వెల వెల పోతుంటాయి. ఎన్నో ఆలయాలలో తగిన వ్యవస్థలు లేక భక్తులు అవస్థల పాలవుతుంటారు. శిఖరాలు, రాజగోపురాలు కుప్ప కూలుతుంటాయి. పర్వదినాలలో భక్తసమూహాల నియంత్రణలో  కనీసం అధునాతన పద్ధతులను కూడా అమలుచేయలేని నిర్వీర్యస్థితిలో ఆలయవ్యవస్థ ఉంటుంది.  

రాజకీయప్రజాస్వామ్యంలో జనం ఓటు మీద ఆధారపడే ప్రభుత్వాలైనా అప్పుడప్పుడు ప్రజలను నొప్పించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంలో స్వాములు అంతకు మించిన గడుసరులు. అనుచరబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ప్రజల వ్యక్తిగత నడవడిలోకి తొంగి చూడకుండా జాగ్రత్త పడుతుంటారు. రోడ్లు, వీధులు సరే, కనీసం నదీతీరాలలో బహిరంగ కాలకృత్యాలు వద్దని, హృదయాలలానే పరిసరాలను కూడా పరిశుద్ధంగా ఉంచుకోమనీ భక్తులకు ప్రబోధించే స్వాములు, పౌరాణికులు ఎవరైనా ఉన్నారా?!

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అన్నాక అందులో అనుమానాస్పద శక్తులూ ఉంటాయి. భూ కబ్జా వంటి ఆరోపణలు స్వాముల మీదా ఉన్నాయి. అన్నిటా పోలికలు చక్కగా కుదిరాయి. జనంలో రాజకీయ ప్రజాస్వామ్యంపట్ల ఉన్నంత నిర్లిప్తతే ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మీద కూడా. తిరుపతి హుండీ నిండుతూనే ఉంది. రికార్డులు తిరగ రాస్తూనే ఉంది.

కార్తీక మాసంలో మూడువంతులు ఊళ్లలో భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత, ఇక్కడా కార్తీక మాహాత్మ్యం వెల్లివిరుస్తున్న వాతావరణం కనిపించింది. నగరానికి శృంగేరి పీఠాధిపతులు వచ్చి ఉన్నారు!
                                                                ****
                                (ఇండియా టుడే, 4వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలో ప్రచురితం)