Thursday, November 26, 2015

స్లీమన్ కథ-17: ట్రాయ్ లో నగ్నంగా ప్రదక్షిణలు చేసిన అలెగ్జాండర్

ట్రాయ్ గడ్డ మీద అడుగుపెట్టగానే, ఆసియా మొత్తం తమ చేజిక్కిందని గ్రీకులు అనుకున్నారు. హెల్స్ పాంట్ మీదుగా అలెగ్జాండర్ పర్షియన్లపై దండయాత్రకు వెడుతూ సెజియమ్(ఒక పురాతన నగరం)లోని ఓ గుట్టమీద ఉన్న అఖిలెస్ (ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న గ్రీకు వీరుడు) సమాధిని దర్శించుకున్నాడు. ఒంటి నిండా నూనె పట్టించి ఆ సమాధి చుట్టూ నగ్నంగా ప్రదక్షిణ చేశాడు. ఎథెనా ఆలయంలో భద్రపరచిన కొన్ని ఆయుధాలను తను ధరించాడు. ఆ నగరాన్ని తీర్చిదిద్దడానికి బ్రహ్మాండమైన ప్రణాళికలు వేసుకున్నాడు.
(పూర్తి రచన 'సీజర్ ను భయపెట్టిన ప్రేతాత్మాల నగరం...ట్రాయ్' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/11/26/%E0%B0%B8%E0%B1%80%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AD%E0%B0%AF%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87/ లో చదవండి)

Friday, November 20, 2015

స్లీమన్ కథ-16: పురావస్తు ప్రదేశాలలో వాళ్ళ హానీమూన్

కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. చాలా గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. స్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు. మధ్యలో ఉన్నట్టుండి సోఫియావైపు తిరిగి, “నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?” అని అడిగాడు. ఇష్టమేనని ఆమె చెప్పింది. “రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?” అని అడిగాడు. సోఫియా తేదీతో సహా ఠకీమని చెప్పింది. “హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?” అని అడిగాడు. గడగడా అప్పజెప్పింది. పరీక్ష నెగ్గింది.
(పూర్తి రచన 'హోమర్ ను చదువుకుంటూ అతడు-ఆమె' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/11/19/%E0%B0%B9%E0%B1%8B%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%82-%E0%B0%85%E0%B0%A4%E0%B0%A1%E0%B1%81/ లో చదవండి)

Thursday, November 5, 2015

స్లీమన్ కథ-15: గ్రీకు పెళ్లి కూతురి అన్వేషణలో పడ్డాడు

ప్రముఖులకు, హోదాలో ఉన్నవారికి ఇచ్చే పురస్కారాలు స్లీమన్ కు ఎంతో విలువైనవిగా కనిపిస్తూ వచ్చాయి. అతనికి కూడా బిరుదులు, సత్కారాల యావ పట్టుకుంది. తనను ఎవరైనా “హెర్ డాక్టర్” అని సంబోధిస్తేచాలు, అంతకన్నా తను కోరుకునేదేమీ ఉండదనుకున్నాడు. సొంతకథను రాసి రాష్టాక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. తన పేరుకు ముందు ఎవరైనా ‘డాక్టర్’ తగిలించకపోయినా, తనను ‘డాక్టర్ స్లీమన్’ అని సంబోధించకపోయినా  చాలా బాధ పడేవాడు.

(పూర్తి రచన 'గ్రీకు పెళ్లి కూతురి అన్వేషణలో...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/11/05/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B1%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B0%E0%B1%81-%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D/ లో చదవండి)

Thursday, October 29, 2015

స్లీమన్ కథ-14: ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...

స్లీమన్ గ్రామస్తులను కలసి, ఆ కొండ మీద ఇంతకుముందు ఎవరికైనా నిధినిక్షేపాలు దొరికాయా అని వాకబు చేశాడు. ఎప్పుడో 1811-14 ప్రాంతంలో కెప్టన్ గితారా అనే వ్యక్తి అక్కడ గాలింపులు జరిపాడనీ, అతనికి బంగారు చెవిపోగులు, మురుగులు దొరికినట్టు విన్నామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ కొందరు చెప్పారు.
తను ‘లయర్టిస్ పొలం’ అనుకున్నచోట నిలబడి ఒడిస్సేలోని చివరి అధ్యాయాన్ని వల్లిస్తూ, దానిని వాళ్ళ మాండలికంలో గ్రామస్తులకు అనువదించి చెప్పడం ప్రారంభించాడు. అతని చుట్టూ మూగిన గ్రామస్తులు, ఒక విదేశీయుడు తమ పురాణకథల్ని తమ భాషలో అలా అనర్గళంగా అప్పజెబుతుంటే ఆశ్చర్యానందాలతో తలమునకలైపోయారు. తన ఇథకా మకాంలో అత్యంత మహత్తర క్షణాలు ఇవే ననుకుంటూ ఆ అనుభవాన్ని స్లీమన్ ఇలా గుర్తుచేసుకున్నాడు:
(పూర్తి రచన 'ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/10/29/%E0%B0%8E%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%95%E0%B1%87%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6/ లో చదవండి)

Thursday, October 22, 2015

స్లీమన్ కథ-13: తొలి తవ్వకాలలో చితాభస్మం దొరికింది!

అది పెద్దగా ఖర్చులేని చిన్న ప్రారంభం. వెంట నలుగురు పనివాళ్లు, ఒక గాడిద. ఏడాది మొత్తంలోనే ఎండలు బాగా మండే కాలం కనుక, ఉదయం అయిదుకే బయలుదేరాలని ఉత్తర్వు చేశాడు. తను నాలుగుకే లేచి, సముద్రస్నానం చేసి, ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగి బయలుదేరాడు. కొండ ఎక్కడానికి రెండు గంటలు పట్టింది. పైకి వెళ్ళాక పెలొపనీసెస్ పర్వతాలను ఆనుకుని ద్రాక్షమద్యం రంగులో ఉన్న సముద్రం కనిపిస్తుందనుకున్నాడు(హోమర్ తన ఇలియడ్ లో అలా వర్ణించాడు). ఆ ఎత్తునుంచి గ్రీస్ మొత్తాన్ని చూడచ్చేమో నని కూడా అనిపించింది.

Friday, October 16, 2015

స్లీమన్ కథ-12: నడివయసులో ప్రేమలేఖ అందుకున్నాడు

అస్థిమితంగా, అశాంతిగా రోజులు గడుస్తుండగా; ఏకకాలంలో హఠాత్తుగా జరిగిన రెండు ఘటనలు అతని జీవనగమనాన్ని మార్చేశాయి. మొదటిది, అతను సర్బాన్ యూనివర్సిటీలో పురాతత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని తరగతులకు హాజరయ్యాడు. రెండోది, అతని దగ్గరి బంధువైన సోఫీ స్లీమన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమెకు యాభై ఏళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాననీ, నీతో కలసి ప్రపంచయాత్ర చేయాలని ఉందనీ ఆమె రాసింది. దానికతను జవాబు రాస్తూ, చిన్నప్పుడు కల్కోస్ట్ లో ఇద్దరూ కలసి ఆడుకున్న రోజుల్ని నిరాసక్తంగా గుర్తుచేసుకున్నాడు. ఆపైన ప్రష్యా రాయబారికి రాసిన ఉత్తరంలోలానే ఎత్తిపొడుపులు జోడిస్తూ పరుషవాక్యాలు గుప్పించాడు. ఒకప్పుడు నీ ప్రేమను అర్థిస్తే తిరస్కరించావనీ, ఇప్పుడు వయసులో నా కంటే పెద్ద అయిన నీతో అవారాలా తిరిగే ఉద్దేశం లేదనీ అన్నాడు.  
(పూర్తి రచన 'ఒంటినిండా ఒంటరితనాన్ని కప్పుకుంటూ...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/10/15/%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95/ లో చదవండి)

Wednesday, October 7, 2015

రాజధానిప్రాంతంగా విజయవాడపై ఫోకస్ ఏదీ?

(జాన్సన్ చోరగుడి రాసిన 'మన విజయవాడ' అనే పుస్తకంపై సాక్షి దినపత్రిక(4 అక్టోబర్ 2015)లో వచ్చిన నా సమీక్ష)

“మొన్నటి వరకూ తెలుగువాళ్ళకు తమదంటూ చెప్పుకోదగిన ఓ మహానగరం లేదు. నగరం లేకపోతే నాగరికత ఎలా వస్తుంది?” అనేవారు రాంభట్ల కృష్ణమూర్తి. ఇప్పుడు తెలుగువాళ్ళకు రాజధాని రూపంలో మరో మహానగరం రాబోతోంది. దానిని ‘అమరావతి’ అనే అందమైన, చారిత్రక స్ఫురణ కలిగిన పేరుతో పిలవబోతున్నా దానికి విశాలమైన దేహాన్ని కల్పించబోయేది మాత్రం విజయవాడే. ఇక్కడో విచిత్రం ఉంది. ‘అమరావతి’ అనే రాజధానిలో విజయవాడ వెళ్ళి కలసిపోవడం లేదు. రాజధాని నగరమే విజయవాడలో కలిసిపోబోతోంది. ఈవిధంగా విజయవాడ రెండు ‘త్యాగాలు’ చేయబోతోంది. ‘రాజధాని’ అని ఘనంగా చెప్పుకునే అవకాశాన్ని అమరావతికి ధారపోస్తోంది. ఇంద్రుడికి ఆయుధం కావడం కోసం దధీచి వెన్నెముకను అర్పించినట్టుగా, రాజధాని కోసం విజయవాడ తన దేహాన్ని అర్పిస్తోంది.
అయితే, తను చేయబోతున్న త్యాగాల గురించీ; రాజధాని ప్రాంతంగా తను సరికొత్త రూపురేఖల్ని తెచ్చుకోబోవడం గురించీ విజయవాడనగరానికి ఇప్పటికీ తెలిసినట్టులేదు. పూర్వం బాల్యవివాహాలు చేసేవారు. పెళ్లన్నా, పెళ్లికూతురు ముస్తాబన్నా ఏమీ తెలియని వయసు కనుక; అలంకారానికి యాంత్రికంగా ఒళ్ళు అప్పగించడం తప్ప రేపు తన రూపు ఎలా మారుతుందో, పెళ్లి తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో బాలవధువుకి ఏమీ తెలియదు. పైగా మన  పెళ్లిళ్లు చాలావరకూ అర్థరాత్రి ముహూర్తాల్లోనే కనుక ఆ చిన్నారి నిద్రలో జోగుతూ ఉంటుంది. రాజధానీ అవతరణ పూర్వసంధ్యలో ఇప్పుడు విజయవాడ కూడా అలాగే జోగుతున్నట్టుంది.
ఏ జాతిచరిత్రలో నైనా రాజధాని నిర్మాణం ఒక ఉజ్వలఘట్టం. ఒక ఉత్తేజకరసందర్భం. ఎన్నో కలలు, ఊహలు, ప్రణాళికలతో మనసులు కిక్కిరిసిపోయి తబ్బిబ్బు పడాల్సిన సమయం. రాజధాని నిర్మాణమంటే కేవలం భూసేకరణ  కాదు. రియల్ ఎస్టేట్ పుంజాలు తెంచుకోవడం కాదు. ప్రభుత్వం ఏదో చేసేస్తుంటే జనం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన ఘట్టం అసలే కాదు. సమాజం తాలూకు సర్వాంగాలూ కొత్త రక్తం నింపుకుని సరికొత్త ఉత్సాహంతో పాలుపంచుకోవలసిన సన్నివేశం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ సందడి కనిపించడంలేదు. రాజధాని కేవలం భౌతికం కాదు, దానికో మానసికపార్శ్వం కూడా ఉంటుంది. రాజధాని కేవలం రాజకీయ సంబంధి కాదు, దానికి సాంస్కృతిక కోణం  ఉంటుంది. రాజధానిసుందరికి దేహపుష్టితోపాటు చక్కని నడక, నాజూకూ కూడా అవసరమే. కానీ మీడియా, ఇతర మేధావివర్గాలకు సైతం ఇది పూర్తిగా అర్థమైనట్టులేదు.
అర్థమయ్యుంటే ఈ వర్గాల దృష్టి ఇప్పటికే విజయవాడమీద ఫ్లడ్ లైట్ కాంతితో పడి ఉండేది. ఈ నగర చరిత్రేమిటి, దీని కథేమిటి, దీని ప్రస్తుత స్థితి గతులు ఏమిటి, దీనికున్న హంగులూ, అవకాశాలూ ఎలాంటివి, రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి దీనికి ఇంకా ఏమేం కావాలి సహా అనేక ప్రశ్నల్లోకి ఇప్పటికే లోతుగా తలదూర్చి ఉండేవి. కనీసం విజయవాడ మీద చిన్నవో, పెద్దవో పుస్తకాలైనా ఈపాటికి మార్కెట్ ను ముంచెత్తి ఉండేవి. ఆ దాఖలాలు లేవు. అయితే, ఇంత ఎడారిలోనూ ఒక ఒయాసిస్... అది, జాన్సన్ చోరగుడి వెలువరించిన ‘మన విజయవాడ’.
తెలుగునాట అభివృద్ధి-సామాజిక అంశాలను ‘కాలికస్పృహ’తో విశ్లేషించి వ్యాఖ్యానించే కొద్దిమంది సీరియస్ రచయితల్లో  జాన్సన్ చోరగుడి ఒకరు. విజయవాడపై తను చేసిన రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ  ‘మన విజయవాడ’ పేరుతో తొలి ముద్రణను ఆయన 2000 సంవత్సరంలోనే ప్రచురించారు. ప్రస్తుత రాజధాని సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, దానికే మరికొన్ని అంశాలు జోడిస్తూ పునర్ముద్రించారు. ఆవిధంగా ఈ పుస్తకానికి ఒక ‘వైతాళిక’(మేలుకొలుపు) స్వభావం వచ్చింది.
విజయవాడను ‘కలర్ ఫుల్’ గా కాకుండా ‘బ్లాక్ అండ్ వైట్’ లో చూపించడానికి జాన్సన్ ప్రయత్నించారు. నేటి తీరుతెన్నులను ఎత్తిచూపుతూ మెత్తని వాతలూ పెట్టారు. నైసర్గికంగా విజయవాడ ఉత్తర,దక్షణాలకు కూడలి అవడంవల్ల మొదటినుంచీ వర్తకకేంద్రంగానే ఉంటూవచ్చిందనీ, ఆ విధంగా ‘వెచ్చాలవాడ’ అయి, క్రమంగా ‘వెచ్చవాడ’, ‘బెజవాడ’ అయిందని ఆయన అంటారు. క్రీ.శ. 10-11 శతాబ్దులలో విజయవాడ వేంగీ చాళుక్యుల ఏలుబడిలో ఉన్నప్పుడు రాష్ట్రకూటులు, వారి వత్తాసుతో రెండవ యుద్ధమల్లుడు జరిపిన దండయాత్రలతో విజయవాడ ఓ పెద్ద రణరంగంగా మారి అరాచక శక్తులకు ఆటపట్టు అయిందనీ; అప్పటినుంచీ ఆ అరాచక స్వభావం కొనసాగుతూ ఉండడం విజయవాడ ప్రత్యేకత అనీ అంటారు. పంచాయతీగా ఉన్నప్పుడు విజయవాడ రూపురేఖలేమిటి, అది ఎప్పుడు మునిసిపాలిటీ అయింది, విజయవాడకు ఎప్పుడు రైలొచ్చింది-- మొదలైన వివరాలను ఎంతో ఆసక్తి భరితంగా అందిస్తూనే; వ్యవసాయ ఆర్థికతనుంచి సినిమా, ఆటో మొబైల్ రంగాలకు;  రక రకాల మోసాలతో సహా డబ్బు సంబంధ వ్యాపారాలకూ ఎలా పరివర్తన చెందుతూ వచ్చిందో ఒక సామాజికశాస్త్రవేత్తకు ఉండే లోచూపుతో విశ్లేషించారు. సామాజికవర్గాల అమరికను, ఊర్ధ్వచలనాన్ని స్పృశించారు. విజయవాడ పుస్తక ప్రచురణ కేంద్రంగా మారిన నేపథ్యాన్నీ తడిమారు. నాణ్యమైన చదువుల స్పృహ ఫలితంగా విస్తరించిన విద్యాసంస్థలతో, మేధోవలసలతో విజయవాడ ‘గ్లోబలైజేషన్’లో భాగమవుతున్నా; “ఇప్పటికీ వెరపు లేకుండా బహిరంగంగా బూతులు(సెక్సు కాదు, తిట్లు) మాట్లాడడం బెజవాడలో సహజ దృశ్యశ్రవణ”మనీ, “పొలం నగరంలోకి రావడం అంటే ఇదే” ననీ అంటూ ఆ చిన్న వ్యాఖ్యా దర్పణంలోనే కొండంత బెజవాడను చూపించారు.  “మానసిక కాలుష్యం లేని ఒక తరం కనుక ఆవిర్భవిస్తే...ఇక్కడ అన్ని విధాల ఆరోగ్యవంతమైన రాష్ట్రరాజధాని రూపు దిద్దుకోవడం ఇప్పటికీ సాధ్యమే” నన్న చారిత్రక ఆశాభావాన్నీ వ్యక్తం చేశారు.
76 పేజీల ఈ సచిత్ర రచన పరిమాణంలో చిన్నదే కానీ విషయవైశాల్యంలో, లోతులో చిన్నది కాదు. రేపు ఒక సమగ్ర రచనకు అవకాశమిచ్చే అన్ని రకాల ప్రాతిపదికలూ ఇందులో ఉన్నాయి. రాజధాని నిర్మాణ నేపథ్యంలో రావలసిన అనేక రచనలకు ఇది వేగుచుక్క అనడం అతిశయోక్తి కాదు.
                                                           ***
మన విజయవాడ(బొమ్మ కలర్ కాదు బ్లాక్ అండ్ వైట్), రచన: జాన్సన్ చోరగుడి, పబ్లిషర్స్: కృష్ణవేణి ప్రచురణలు, విజయవాడ-8, ప్రతులకు: కృష్ణవేణి ప్రచురణలు, 54-19-10A, జయప్రకాష్ నగర్, విజయవాడ-520008; అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలు, వెల: 60రూ.