Thursday, September 19, 2013

సముద్రతీరం వెంబడి నరసాపురం నుంచి మచిలీపట్నానికి...

 నే నోసారి నరసాపురం(ప.గో.జిల్లా) వెళ్లినప్పుడు తెలిసిన ఓ సంగతి నన్నెంతో విస్మితుణ్ణి చేసింది. మత్స్యకారులు నరసాపురానికి దగ్గరలో ఉన్న సముద్రతీరం వెంబడే సైకిళ్ళమీద కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగొస్తారట!  నేటి రైలు, రోడ్డుమార్గాలలో సైకిల్ కంటే వేగంగా పయనించే ఏ వాహనం మీద వెళ్ళినా అది సాధ్యం కాదు. మా ఊరి గోదావరి గట్టు మీద నిలబడి చూస్తే, ఎదురుగా నదికి ఆవలి గట్టున తూర్పు గోదావరి జిల్లా ఊళ్ళు ఉంటాయి. కరణంగారు పొద్దుటే గొడుగు పుచ్చుకుని బయలుదేరి పడవలో గోదావరి దాటి తూ.గో. జిల్లా ఊళ్ళకు వెళ్ళి సాయంత్రం చీకటి పడే లోపల తిరిగొస్తూ ఉండేవారు.

భౌగోళిక రేఖాపటాలతో నిమిత్తం లేకుండా నదీతీర గ్రామాల వాళ్ళు ఒకే గుండెతో స్పందించడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. పాపికొండలలో పేరంటపల్లి అనే ఓ గిరిజన గ్రామంలో బాలానంద స్వామి అనే ఒక సాధువు ఉండేవారు. పాపికొండలు నేడు మనం కొత్తగా గీసుకున్న ఖమ్మం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడలి కావడం నాకో అద్భుతంగా తోస్తుంది. బాలానంద స్వామి గిరిజనులకు ఎంతో సేవ చేశారు. గోదావరి జిల్లా గ్రామాల వారందరికీ ఆయనమీద భక్తి. ఆయన వృద్ధాప్యంలో అస్వస్థులై రాజమండ్రిలో కాలం చేసినప్పుడు భౌతికకాయాన్ని లాంచీలో రాజమండ్రి నుంచి పేరంటపల్లి తీసుకెళ్లారు. లాంచీ వస్తున్న సంగతి తీరగ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ప్రతి ఊరి రేవులోనూ లాంచీ ఆపారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపాతో గోదావరి గట్టుకు కదలి వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించుకుని కన్నీటి తర్పణం విడిచి వచ్చాయి. లాంచీ మా ఊరి రేవుకి వచ్చినప్పుడు గోదావరి గట్టుకు పరుగెత్తిన జనంలో నేను కూడా ఉన్నాను. 

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను అందులో పోస్ట్ చేయండి)



No comments:

Post a Comment