Friday, September 27, 2013

'నెగిటివ్' వోటు ఒక పాజిటివ్ పరిణామం

వోటర్ల కోణం నుంచి చెప్పుకుంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు చరిత్రాత్మకం. ఈ తీర్పును బట్టి, ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేనప్పుడు ఆ విషయాన్ని వోటరు బ్యాలెట్ పేపర్ మీద నమోదు చేయచ్చు. అంటే none of the above అనే ఆప్షన్ ఇకముందు బ్యాలెట్ పేపర్ మీద ఉంటుందన్నమాట. దీనినే నెగిటివ్ ఓటు అని కూడా అనచ్చు.

పార్లమెంట్ లో ఏ బిల్లు మీద అయినా లేదా ఏ తీర్మానం మీద అయినా ఓటు వేయడం ఇష్టం లేనప్పుడు వోటింగ్ కు గైరు హాజరయ్యే హక్కు సభ్యులకు ఉంది. అలాంటి హక్కు వోటర్లకు మాత్రం ఎందుకు ఉండకూడదనే అభిప్రాయం ఈ తీర్పు సందర్భంలో వ్యక్తమైంది. అందులో న్యాయం ఉంది.

ఉన్నత, మధ్యతరగతి వర్గాలు; ముఖ్యంగా నగరాలు, మహానగరాలలో ఉన్నవాళ్ళు వోటు వేయరనీ, వారిలో పౌరస్పృహ లోపించిందనే విమర్శ వినిపిస్తూ ఉంటుంది. దానికి సాధారణంగా బాధ్యతారాహిత్యం, బద్ధకం వంటి కారణాలను ఆపాదించడమూ చూస్తుంటాం. ఇలాంటి కారణాలతో వోటు వేయనివారు ఉండరని కాదు. వీరితోపాటు, ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థీ నచ్చక వోటు వేయని వారూ ఉంటారన్న సంగతి ఈ చర్చలో ఫోకస్ కావడం లేదు. దీంతో ఓటు వేయడాన్ని నిర్బంధం చేయాలనే నినాదం రాజకీయపక్షాలనుంచి,రాజకీయేతరవర్గాలనుంచీ చాలాకాలంగా గట్టిగా వినిపిస్తోంది.

సుప్రీం కోర్టు తాజా తీర్పు ఈ చర్చలోని ఏకపక్షధోరణిని, అసమగ్రతను ఎత్తి చూపేలా ఉంది. ఏ అభ్యర్థీ, ఏ పార్టీ నచ్చకపోయినా సరే పౌరస్పృహ పేరుతో మొక్కుబడిగానైనా వోటు వేయాలనడంలో అర్థం లేదు. ఆ మొక్కుబడి లక్షణం ప్రజాస్వామ్యానికి ఎలాంటి మేలూ చేయదు. వోటింగ్ లో వోటర్లు అందరూ చైతన్యంతో పాల్గొన్నప్పుడే ఎన్నికలు అర్థవంతమవుతాయి. తిరస్కార వోటు కూడా వోటే. అది కూడా వోటరు choice ను సూచించేదే. దానికి ఉండే ప్రయోజనాలు, అది నేర్పే రాజకీయపాఠాలూ దానికీ ఉంటాయి. అభ్యర్థులను నిలబెట్టడంలో రాజకీయపక్షాలు ఇక మీద జాగ్రత్త పడతాయి. ఎన్నికలప్రక్రియ దీనివల్ల ఎంతోకొంత ప్రక్షాళనమవుతుంది.

నిజానికి తిరస్కార వోటుకు ఎప్పుడో అవకాశం కల్పించి ఉండవలసింది. ఇప్పటికైనా సుప్రీం కోర్టు ద్వారా అది జరుగుతున్నందుకు సంతోషించాలి. అయితే, సుప్రీం కోర్టు తీర్పులను తిరగదోడే పనికీ రాజకీయపక్షాలు పూనుకుంటున్నాయి. ఈ విషయంలో పార్టీ భేదాలకు తావులేని అపూర్వ సయోధ్య రాజకీయపక్షాలలో వ్యక్తమవుతోంది. కనుక తాజా తీర్పు అమలుకు పార్లమెంటు ద్వారా అవి చక్రం అడ్డేయడానికి ప్రయత్నిస్తే ఆశ్చర్యం లేదు.

 ఎన్నికల సంస్కరణలను కానీ మరో సంస్కరణను కానీ రాజకీయనాయకత్వాల నుంచి ఆశించలేమనీ, ఏ సంస్కరణ జరగాలన్నా సుప్రీం కోర్టు కొరడా అందుకోవలసిందేననీ తాజా తీర్పు మరోసారి స్పష్టం చేస్తోంది.

ఈ తీర్పు అమలులో కొన్ని ప్రశ్నలు లేదా సమస్యలు ఎదురయ్యే మాట నిజమే. ఉదాహరణకు. తిరస్కార వోటు అభ్యర్థులు తెచ్చుకున్న వొట్ల శాతం కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించాల్సి రావచ్చు. సమస్యలు ఉంటే ఉండచ్చు, కానీ తిరస్కార వోటు వోటర్ల పక్షాన జరిగే ప్రజాస్వామిక న్యాయం. ప్రస్తుతం ఉన్న వోటింగ్ పద్ధతిలో వోటర్లు పోషిస్తున్నది passive పాత్ర మాత్రమే. అంటే ఉన్న అభ్యర్థులలో ఎవరినో ఒకరిని ఎన్నుకోవడం మాత్రమే. తాజా తీర్పు అమలు జరిగితే వోటర్లు active పాత్రలోకి మారతారు. తమ తీర్పుకు మూడో కోణం ఉందని చెబుతారు. తిరస్కార వోటు కూడా వోటే నన్న సంగతిని మరచిపోకూడదు. 

4 comments:

  1. ఒకవేళ తిరస్కర ఓట్లే ఎక్కవ గ ఉంటె, మల్లి ఎలేచ్షన్స్ పెట్టి అప్పుడు నుంచున్న వక్తులను అనర్గులగా ప్రకటిస్తే మంచిది, లేకుంటే మల్లి మల్లి వాళ్లే నుంచే నే ప్రమాదం ఉంది.

    ReplyDelete
    Replies
    1. ఒకసారి ఓటర్లు తిరస్కరించిన అభ్యర్థులు అదే సందర్భంగా జరిగే ఎన్నికలో పాల్గొనకుండా నిషేధించవచ్చు,

      కానీ, సుప్రీంకోర్టు ఆదేశాన్ని మన వాళ్ళు నిలబడనీయరు. రాజ్యాంగాన్ని మార్చి అయినా సరే, బాలెట్ కాగితం మీద సూచించబడిన క్రూరమృగాలూ, గుంటనక్కలూ వగైర అమానుషవ్యక్తిల్లో ఎవరో‌ ఒకరిని చచ్చినట్లు ఎన్నుకోవలసిందే నని తీర్మానిస్తారు. సందేహం అక్కర్లేదు.

      Delete
    2. నేర చరిత్రులలో రెండు రకాల వారు ఉంటారు: నేరస్తులుగా రుజువైన లేదా విచారణను ఎదుర్కొన్నవారు ఒక రకం. విచారణను ఎదుర్కొన్నవారు అందరూ విధిగా నేరస్తులుగా రుజువు కావలసిన అవసరం లేదు. సాక్ష్యాలు లేవనో, లేదా ఏవో సాంకేతిక కారణాలతోనో వారు శిక్షను తప్పించుకోవచ్చు. రాజకీయ పార్టీలు ఇలాంటి కారణాలను అడ్డుపెట్టుకుని తమ అభ్యర్థుల కొమ్ము కాస్తూ వారిని బరిలో నిలబెడుతూ ఉంటారు.
      ఇక నేరచరితులుగా జనంలో ముద్రపడినవారు రెండో రకం. వీరు దర్యాప్తు, విచారణ దశలకు ఎప్పుడూ చేరుకోక పోవచ్చు. చట్టానికి చిక్కకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు తిరస్కార వోటే అమలులోకి వస్తే మొదటి రకం వారినే కాక రెండో రకం వారిని కూడా తిరస్కరించే అవకాశం జనానికి కలుగుతుంది. అంటే, రాజకీయపార్టీలకు అభ్యర్థుల ఎంపికలో ఇంతవరకు ఉన్న స్వేచ్ఛ కుదించుకుపోతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు (బహుశా వామపక్షాలు, ఆమ్ ఆద్మీ లాంటివి మినహాయింపు) గెలుపు గుర్రాలనే బరిలో నిలబెడతామని బల్ల గుద్దిచెబుతుంటాయి. కనుక ఈ తీర్పు వాటికి ప్రాణ సంకటమే. ఈ గండం నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచన ఇప్పటికే ఉమ్మడిగా ప్రారంభించి ఉంటాయి.

      Delete
  2. మనదేశంలో అన్నిటి కంటే ముందుగా, ముఖ్యంగా సంస్కరణలు జరగవలసినది ఎన్నికలలోనే.
    ఆ దిశగా ఈ తీర్పు ఒక మంచి పరిణామం.

    ReplyDelete