Wednesday, October 2, 2013

మహాభారతంలో కుల, ప్రాంత నింద

కర్ణుడు : నువ్వు పాపదేశంలో పుట్టావు. దుర్బుద్ధి తప్ప నీకు సద్బుద్ధి ఎలా వస్తుంది? క్షత్రియాధముడివి. నీచుడివి. లోకంలో ఆబాలగోపాలం చెప్పుకునే వాక్యం ఒకటుంది. మద్రదేశంవాడు కుటిలబుద్ధి, దేనికీ కలసిరాడు, స్నేహానికి అపకారం చేస్తాడు, చెడే మాట్లాడతాడు, దుష్టుడు, అతి కష్టుడు. ఈ వాక్యం ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువవుతోంది.

మీలో ఆడా, మగా వావీ వరసా లేకుండా కలుస్తారు. అది మీకు తప్పుకాదు. మీరు మొదట కల్లు, ఆ తర్వాతే తల్లిపాలు తాగి పెరుగుతారు. మీ రెంత గుణవంతులో ప్రత్యేకించి చెప్పాలా?

అనేకమందికి పుట్టి, కల్లు తాగుతూ పెరిగే మీకు శీలమూ, సభ్యమైన మాటా ఎలా అబ్బుతాయి? మాటలు కట్టిపెట్టి యుద్ధానికి పద. 

(మరికొంత సంభాషణ జరిగాక)

శల్యుడు: ఈ పనికిమాలిన మాటలెందుకు? విను కర్ణా...వేయి మంది కర్ణులైనా సరే, కిరీటిని గెలవగలరా?

కర్ణుడు: (కోపంతో ఎర్రబడిన కళ్ళతో నవ్వుతూ) ఒకసారి ధృతరాష్ట్రుని కొలువులో ఉత్తములైన పండితుల గోష్ఠిలో సకల దేశాచారాలూ తెలిసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. బాహ్లిక దేశీయులు గోమాంసం నంజుకుంటూ మద్యపానం చేస్తూ అసందర్భ ప్రేలాపన చేస్తూ నగ్నంగా తిరుగుతూ ఉంటారట. ఇలా అనేకవిధాలుగా బాహ్లిక దేశీయులను నిందిస్తూ ఆయన మాట్లాడాడు. నువ్వు అలాంటి బాహ్లికులకు దగ్గరివాడివి. కనుక వాళ్ళు చేసే పుణ్యపాపాలలో ఆరోవంతు నీకు సంక్రమిస్తుంది. వాళ్ళ అనాచారాన్ని నువ్వు వారించలేదు కనుక పూర్తి పాపం నిన్నే చుట్టుకుంటుంది. బాహ్లికుల కంటే మద్రదేశీయులు మరింత అనాగరికులని పెద్దలు చెబుతుంటారు. నీ గురించి చెప్పేదేమిటి? నోరుమూసుకో.

శల్యుడు: బలాబలాలను, రథ, అతిరథ సంఖ్యను నిర్ణయించే సందర్భంలో భీష్ముడు (నీ గురించి) చెప్పలేదా? ఆ మాటలు ఓసారి గుర్తు చేసుకో. కోపమెందుకు? అంగదేశం వాళ్ళు డబ్బు కోసం ఆప్తుల్ని, బంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. కులకాంతల్ని అమ్ముకుంటారు. అలాంటి జనానికి రాజువైన నువ్వు ఇంకొకళ్ళ ప్రవర్తనను ఎంచడం దేనికిలే…        

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో  'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)                                                                        

No comments:

Post a Comment