Wednesday, October 9, 2013

ఇప్పటికీ పాటిస్తున్న భీష్ముడి రాజనీతి

 పాకిస్తాన్-అప్ఘానిస్తాన్ ల మధ్య ఉన్న గిరిజనప్రాంతాలు అర్థ-స్వయంపాలితాలు. వాటిని Federally Administered Tribal Areas (FATA) అంటారు. వీటిలో ఏడు గిరిజన జిల్లాలు, ఆరు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. Frontier Crimes Regulations (FCR) అనే ప్రత్యేక నిబంధనల ద్వారా ఇవి నేరుగా పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయి. తెగల ముఖ్యు(nobles)లకు వీటిలో పలుకుబడి ఉంటుంది. మూడు ఆంగ్లో-అప్ఘాన్ యుద్ధాలతో తల బొప్పి కట్టిన బ్రిటిష్ ప్రభుత్వం తన అవసరాలకు కలసివచ్చే షరతుపై ఈ తెగల ముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చింది. ఇప్పటికీ ఇదే ఏర్పాటు కొనసాగుతోంది.

ఈ వివరాలలో, చరిత్రకందని కాలానికి చెందిన భీష్ముని మాటల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఎంతటి వాళ్ళనూ లెక్క చేయని గణజనాలను మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలని భీష్ముడు అనడంలో ఉద్దేశం, వాళ్లపై కత్తి కడితే ప్రయోజనం లేదనే.  అప్ఘాన్లతో మూఢు యుద్ధాలు చేసిన నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ,  నిన్నటి సోవియట్ యూనియన్, నేడు అమెరికా నేర్చుకున్న గణపాఠం కూడా అదే.  తన అవసరాలకు కలసివచ్చే షరతుపై గణముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం రాజీ పడడం, గణముఖ్యులను ఆదరించి వారితో పనులు చేయించుకోవాలన్న భీష్ముని సూచనకు అనుగుణమే. 

 ఇంకా విశేషం ఏమిటంటే, పైన చెప్పుకున్న FATA లాంటి ఏర్పాట్లే మన పురాణ ఇతిహాస కాలం లోనూ ఉండడం! ఉదాహరణకు, పౌరాజానపద పరిషత్తు’.  ఆనాటికి రాజు సర్వస్వతంత్రుడు కాదు. కొన్ని అధికారాలను పౌరాజానపదులతో పంచుకునేవాడు. రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుడు పౌరజానపదపరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. పౌర జానపదులలో మ్లేచ్చులు, ఆర్యులు, వనశైలాంతవాసులు; అంటే అడవుల్లోనూ, కొండల్లోనూ ఉండేవాళ్లు కూడా ఉన్నారు. మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టాలనుకుని పౌరజానపదపరిషత్తును సంప్రతించినప్పుడు, పెద్ద కొడుకు యదువు ఉండగా చిన్నకొడుక్కి పట్టం ఎలా కడతావని పౌర జానపదులు ప్రశ్నించారు. అప్పుడు యయాతి వారిని సమాధానపరచి అనుమతి తీసుకున్నాడు. భీష్ముడు పేర్కొన్న గణముఖ్యులను వాల్మీకి గణవల్లభులన్నాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)
  

No comments:

Post a Comment