Monday, October 14, 2013

తుపాను వదిలేసింది, తొక్కిసలాట చంపేసింది!

ఈ దేశం ఎంత చిత్ర విచిత్ర దేశమో చూడండి!

పద్నాలుగేళ్ల తర్వాత అత్యంత తీవ్రమైన తుపాను ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ లను భయపెట్టింది.

వెనకటి అనుభవాల దృష్ట్యా ప్రాణనష్టం విపరీతంగా ఉండచ్చని దేశమంతా ఆందోళన చెందింది.

టీవీ చానెళ్లు రోజంతా మిగతా వార్తలను పక్కన పెట్టేశాయి.

తుపాను గమనాన్ని దాదాపు ప్రత్యక్షప్రసారం స్థాయిలో చూపించాయి.

దేశమంతా ఊపిరి బిగపట్టుకుని ఆ ప్రసారాన్ని చూసింది.

కానీ...

కనీస ప్రాణనష్టంతో తుపాను గండం నుంచి దేశం బయటపడింది.

జనం తేలికపడి ఊపిరి పీల్చుకున్నారు.

ఎంతో సమన్వయంతో పనిచేసిన కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను మనసులోనే అభినందించుకున్నారు.

ఇంకోవైపు చూడండి...

మధ్యప్రదేశ్ లో ఒక దేవాలయానికి వెళ్ళే మార్గంలో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోగా, 100 మంది గాయపడ్డారు.

తుపానును ఎదుర్కోవడంలో కనబరచిన తెలివీ, దక్షతా  తొక్కిసలాటను ఎదుర్కోవడంలో ఏమైపోయాయో తెలియదు.

అంతమంది జనం చీమల్లానో దోమల్లానో చనిపోవడానికి ఎందుకు అవకాశమిచ్చారో తెలియదు.

తరచు సంభవించే ఇలాంటి తొక్కిసలాటలను కూడా ఒక విపత్తుగా ఎందుకు గుర్తించలేదో తెలియదు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కోడానికి జాతీయస్థాయిలో ఏర్పాటుచేసిన సంస్థ పరిధిలోకి వీటిని కూడా ఎందుకు చేర్చలేదో తెలియదు.

గుంపుల నియంత్రణలో మన ప్రభుత్వాలు, పోలీసుల చేతకానితనాన్ని ఒక సమస్యగా గుర్తించి దానిని పరిష్కరించే ఆలోచనలు ఎందుకు చేయడంలేదో తెలియదు.

ఇప్పుడైనా ఆ దిశగా ఆలోచనా, చర్యలూ ప్రారంభిస్తారన్న హామీ లేదు.

ప్రకృతి వల్లనే కాక మనుషులవల్ల కూడా విపత్తులు సంభవిస్తాయన్న సంగతిని గుర్తించని ప్రభుత్వాల బుర్రలు ఉండవలసిన చోటే ఉన్నాయా, మోకాల్లో ఉన్నాయా?!

1 comment:

  1. మీ బ్లాగును బ్లాగ్ వేదికతో అనుసంధానం చేయండి.
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete