Wednesday, November 13, 2013

పెళ్లి ఒకరితో...ప్రేమ ఒకరిపై...

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న అతిశయ రూప లావణ్య సుందరి అయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. 

అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు అంది.  

1 comment: