Saturday, August 10, 2013

ఇదే మీడియా అప్పుడు నవాజ్ షరీఫ్ ను హీరోను చేసింది!

ఒక్కసారి మూడు నెలలు వెనక్కి వెళ్ళి చూడండి...

భారతీయ మీడియా పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలను మనదేశంలో జరుగుతున్న ఎన్నికలా అన్నట్టుగా పూనకం పట్టినట్టు కవర్ చేసింది. నవాజ్ షరీఫ్ విజయాన్ని చెబుతూ హిందూ దినపత్రిక Lion of Punjab roars in Pak అని శీర్షిక ఇచ్చింది.  కాబోయే ప్రధానమంత్రిగా ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి ప్రతి ఇంగ్లీష్ న్యూస్ చానెల్ పోటీ పడ్డాయి. నవాజ్ షరీఫ్ ప్రధాని అయితే ఆ వైపునుంచి ఉగ్రవాదానికి ప్రోత్సాహం తగ్గిపోతుందనీ, భారత్-పాక్ సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించాయి. ఇంగ్లిష్ న్యూస్ చానెళ్ల శ్రుతిమించిన పాకిస్తాన్ fixation ఎప్పుడూ ఆశ్చర్యం  కలిగిస్తూనే  ఉంటుంది.

మూడు నెలల తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోందో చూడండి...

పాక్ సైన్యమూ, ఉగ్రవాదులూ దాడిచేసి అయిదుగురు భారత సైనికులను వధించారు. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నట్టు తాజా సమాచారం.  జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే నినాదం జనంలోంచి వినిపిస్తోంది. పాక్ దుర్మార్గానికి దీటైన జవాబు ఎలా చెప్పాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. పాకిస్తాన్ తో మాటలు కొనసాగించాలా వద్దా అన్న చర్చ మరోసారి తెర మీదికి వచ్చి ఏకాభిప్రాయానికి దూరంగా అదే పనిగా ఊదరగొడుతోంది. నవాజ్ షరీఫ్ ను గొప్ప ఆశాకిరణంగా మూడు నెలల క్రితం చూపించడానికి ప్రయత్నించిన ఇదే మీడియాలో ఇప్పుడు ఆయన భారతవిద్వేష గతం చర్చకు వస్తోంది. కిందటిసారి ఆయన ప్రధాని అయిన వెంటనే చైనాను సందర్శించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏవో నిర్మాణాలకు ఒప్పందం చేసుకున్న విషయం ప్రస్తావనకు వస్తోంది. సైన్యం మద్దతుతోనే ఆయన మొన్నటి ఎన్నికలలో విజయం సాధించాడు కనుక ఉగ్రవాదచర్యల్లో స్వయంగా భాగస్వామి అయిన సైన్యాన్ని ఆయన అదుపు చేయలేడన్న విమర్సా వినిపిస్తోంది.

మొత్తానికి  మీడియా ఆశాకిరణంగా చూపించడానికి ప్రయత్నించిన నవాజ్ షరీఫ్ ఇప్పుడు విలన్ గా పైకి తేలాడు.

ఆశాభావం తప్పు కాదు కానీ,  అందుకు కూడా కొంతకాలం ఓపిక పట్టి ఓ అభిప్రాయానికి రావడంలోనే విజ్ఞత, వివేకం ఉంటాయి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించడం మంచిది కాదు. అందులోనూ జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసే మీడియాలో అటువంటి ధోరణి అసలే మంచిది కాదు.  సున్నితమైన అంశాలలో విధాన రూపకల్పనలో మీడియాకు కూడా కొంత పరోక్ష భాగస్వామ్యం, బాధ్యత ఉంటాయి. జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలది కావడమే అందుకు కారణం.

పాక్ ఎన్నికలపై మీడియా అత్యుత్సాహాన్ని ప్రశ్నిస్తూ 5/13/13 న 'రెండు ఆశ్చర్యాలు-ఒక ఆవేదన' అనే శీర్షికతో ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు జరుగుతున్నది దానికి ధృవీకరణే. 

No comments:

Post a Comment