వయసుతో సంభవించే కొన్ని సహజమరణాలు కూడా ఒక్కోసారి కుదుపునిస్తాయి. సి. నారాయణరెడ్డిగారి మరణం నాకు అలాంటి కుదుపునే ఇచ్చింది. ఎందుకని ఆలోచిస్తే రెండు కారణాలు కనిపించాయి. ఒక కవికి తగిన నిండైన, పరిశుభ్రమైన ఆహార్యంతో ఎప్పుడూ తాజాగా కనిపించే ఆయనను ఇటీవలివరకూ సభలు సమావేశాలలో నిరంతరం చూస్తూ ఉండడం, ఆయన నిరంతరాయంగా కవిత్వం రాస్తూనే ఉండడం! ఇవి ఆయనను నిత్యయవ్వనుడిగా సుప్తచేతనలో ముద్రవేసినట్టున్నాయి. అందుకే ఆయన మరణవార్త ఆకస్మికంగా తోచి ఒక కుదుపు కుదిపింది.
నేను చదువుకునే రోజుల్లో ఆయన పట్ల ఒకవిధమైన అడ్మిరేషన్ ఉండేది. అప్పట్లో ఆయన హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఉండేవారు. గంగ యమున సరస్వతి అనే నామఫలకం ఉన్న ఆయన నివాసం మీదుగా వెళ్ళేటప్పుడు ఇదే కదా నారాయణరెడ్డిగారి ఇల్లు అనుకుని కుతూహలంగా లోపలికి తొంగి చూసేవాణ్ణి.
ఆయనతో నాకు గొప్ప పరిచయం ఏమీలేదు. కాకపోతే ఆయనతో ముడిపడిన కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి. వాటిని రికార్డ్ చేయడానికి ఇదొక సందర్భం.
పాటిబండ్ల మాధవశర్మగారి షష్టిపూర్తి సందర్భంలో చిక్కడపల్లిలోని ఆయన మేడ మీద విశ్వనాథ సత్యనారాయణగారు రామాయణ కల్పవృక్ష గానం చేశారు. అది రెండు మూడు రోజులు జరిగినట్టు జ్ఞాపకం. జంటనగరాలలోని సాహితీదిగ్గజాలు అందరూ ఆ కార్యక్రమానికి విచ్చేశారు. అప్పుడప్పుడే ఏకవీర సినిమా విడుదలైంది. దానికి సినారె సంభాషణలు రాశారు. విశ్వనాథవారు ఏకవీర సినిమా గురించి ప్రస్తావించి, "నా నవలను సినిమాగా తీస్తున్నా దానికి సంభాషణలు రాయడానికి నేను పనికిరానట. వాడెవడితోనో రాయించారు" అంటూ తమ సహజశైలిలో ఆక్రోశం ప్రకటించారు. సరిగ్గా ఆయన ఎదురుగా ముందువరసలో కూర్చున్న సినారె చిరునవ్వు చిందిస్తూ ఉండిపోయారు.
నారాయణరెడ్డిగారికి మంచి లౌక్యుడు అని పేరు. నొప్పించక తా నొవ్వక అన్నట్టు ఉంటారన్న భావన చాలామందికి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా ఆయన సభాముఖంగా కోపప్రకటన చేసిన సందర్భం ఒకటి నాకు గుర్తుండిపోయింది. అది కాకినాడలో శ్రీశ్రీ సప్తతి జరిగిన సందర్భం. ఆ సభకు ఆయన అధ్యక్షుడని జ్ఞాపకం. ఆ సభలో శ్రీశ్రీ, పురిపండ అప్పలస్వామి, గజ్జెల మల్లారెడ్డి వంటి సాహితీ ప్రముఖులు, సాయంత్రం జరిగిన మరో సభలో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పాల్గొన్నారు. ఉదయం జరిగిన సభలో శ్రీశ్రీ కవిత్వంపై మిరియాల రామకృష్ణ రచించిన పరిశోధనాగ్రంథాన్ని ఆవిష్కరించారు. అందులో 'ఆధునికకవిత్వం: సంప్రదాయం-ప్రయోగం' తన పరిశోధనా గ్రంథంలో చేసిన కొన్ని ప్రతిపాదనలను మిరియాల రామకృష్ణ పూర్వపక్షం చేయడాన్ని ప్రస్తావిస్తూ నారాయణరెడ్డిగారు చిర్రుబుర్రు లాడారు, అది ఆయన స్వభావవిరుద్ధంగా కనిపించి నన్ను ఆశ్చర్యపరచింది.
నేను ఆంధ్రప్రభ దినపత్రికలో ఉన్నప్పుడు అనుకోకుండా ఆయనతో పరిచయం కలిగింది. ఆయన పాల్గొన్న ఒక సినీ కార్యక్రమానికి ప్రముఖ సినీ జర్నలిస్టు దివంగత పి. ఎస్. ఆర్. ఆంజనేయశాస్త్రిగారు వెడుతూ నన్ను కూడా రమ్మన్నారు. ఆంజనేయశాస్త్రిగారు పూర్వపరిచితులే కనుక సమావేశానంతరం తిరిగి వెడుతున్నప్పుడు నారాయణరెడ్డిగారు ఆయనకు, ఆయనతో ఉన్న నాకు తన కారులో లిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు ఆంజనేయశాస్త్రిగారు నన్ను ఆయనకు పరిచయం చేయగానే ఆయన వెంటనే నా పేరు గుర్తుపట్టి అంతకు కొన్ని రోజుల ముందే ఉదయం దినపత్రిక సాహిత్యం పేజీలో వచ్చిన నా వ్యాసాన్ని ప్రస్తావించి, అది నేను చదివాననీ చాలా మౌలికమైన ప్రతిపాదనలు ఉన్నాయనీ, రాస్తూ ఉండమనీ అన్నారు. ఆయన దినపత్రికలో వచ్చిన ఒక వ్యాసం చదవడమేకాక, దానినీ, రాసిన నాలాంటి ఒక అప్రసిద్ధునీ గుర్తుపెట్టుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
ఆ తర్వాత కొన్నేళ్లకు నేను ఆంధ్రప్రభ సాహిత్యం పేజీని నిర్వహిస్తున్నప్పుడు ఆయన కవితల్ని ప్రచురించే అవకాశం కలిగింది. ఆవిధంగా ఆయన నిరంతర కవితావ్యాసంగాన్ని ఒకింత దగ్గరగా చూసే అవకాశమూ కలిగింది. ఒక కవిత ప్రచురించిన వెంటనే ఇంకొక కవిత పంపించేవారు. పెండింగ్ లో ఉన్న కవిత గురించి తన సహాయకులతో ఫోన్ చేయించి అడిగించేవారు. ఎప్పుడైనా తనే ఫోన్ చేసి అడిగేవారు. ఒకసారి ఆయన కుమార్తె కూడా ఫోన్ చేసినట్టు గుర్తు.
ప్రముఖ కవి, ఆంధ్రప్రభ దినపత్రిక మాజీ సహాయ సంపాదకులు అజంతాకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిన సందర్భంలో అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులు వాసుదేవ దీక్షితులుగారి పూనికతో హైదరాబాద్ లోఏర్పాటు చేసిన అభినందనసభలో సినారె కూడా ఉన్నారు. అది ఒకవిధంగా చిరస్మరణీయసభ. ఎందుకంటే జంటనగరాలలో ఉన్న వివిధ పంథాలకు, తరాలకు చెందిన కవి రచయితలు ఎందరో ఆ సభకు హాజరయ్యారు. ఈ విశేషాన్ని గమనించిన సినారె పసిపిల్లవాడిలా పొంగిపోయారు. ఈ అరుదైన క్షణాలు గాలిలో కలసిపోవడానికి వీలులేదంటూ నన్ను పిలిచి సభకు వచ్చిన కవిరచయితలు అందరితో గ్రూప్ ఫోటో తీయించమన్నారు.
పార్లమెంటు సభ్యత్వం కూడా ముగిసి ఖాళీగా ఉన్న రోజుల్లో ఆయన హైదరాబాద్ బొగ్గులకుంటలో ఉన్న ఆంధ్రసారస్వత పరిషత్ పునర్వికాసంపై దృష్టి పెడుతూ వచ్చారు. అక్కడ సభలు, సమావేశాలు నిర్వహింపజేసేవారు. ఒకసారి ఆయనను కలసినప్పుడు సారస్వతపరిషత్ గురించే ముచ్చటించారు.
కవితాస్రష్టగానే కాక వ్యక్తిగా కూడా రెండు మూడు తరాలకు చెందిన సాహితీబంధువులకు బాగా తెలిసి, వారి నాలుకలపై ఆడుతూ వచ్చిన సినారెకు ఈ కాసిని జ్ఞాపకాలతో నా నివాళి.