Sunday, December 27, 2015

మహాభారతం మరియు గాన్ విత్ ద విండ్

దేశం మొత్తాన్ని కుదిపేసే ఒక మహాయుద్ధం మనదేశంలో సంభవించి ఎంతకాలమైంది?! వీరోచితంగా స్వాతంత్ర్యం తేవాలనుకున్న సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల పట్ల ఇప్పటికీ జనసామాన్యంలో గూడుకట్టుకున్న ఆరాధన ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఒక వీరుడికోసం, ఒక మహాయుద్ధం కోసం ఈ జాతి ఎంతగా  మొహం వాచిందో అనిపిస్తుంది. కళింగయుద్ధం లాంటి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగి, జనజీవితాన్ని అల్లకల్లోలం చేసి ఉండవచ్చు. వాటిలో గొప్ప ఇతిహాసంగా పరిణమించిన యుద్ధాలున్నాయా? ఈ స్థితిలో ఈక్షణాన నా చూపుల్ని ఆక్రమించుకుంటున్న మహాయుద్ధ ఇతిహాసం మహాభారతం.  

('సాక్షి' దినపత్రిక సాహిత్యం పేజీలో 28, డిసెంబర్, 2015 న ప్రచురితమైన  నా వ్యాసం http://epaper.sakshi.com/677001/Hyderabad-Main/28-12-2015#clip/7831579/aa76deea-f697-4147-8209-fd7223714a9b/1162:916.6180758017491 ఈ లింక్ లో చదవగలరు)


Tuesday, December 22, 2015

హైదరాబాద్ కు ఏమైంది?!

డిసెంబర్ కూడా గడిచిపోతోంది. సాధారణంగా  డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో రగ్గులు కప్పుకునే చలి ఉంటూ ఉంటుంది. కానీ ఈసారి పలచని దుప్పటి కప్పుకునేంత చలి కూడా లేదు. పైగా ఫ్యాన్ వేసుకోవలసివస్తోంది. డిసెంబర్ లో హైదరాబాద్ లో ఫ్యాన్ వేసుకుని పడుకోవడమా!!! ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత ఆశ్చర్యం! ఇదేదో వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ముచ్చటలా లేదూ?
ఆశ్చర్యాన్ని మించి చాలా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కే కాదు; దక్షిణాది రాష్ట్రాలకే ఏదో అయింది. చెన్నైలో ఆ జలప్రళయమేమిటి? బెంగళూరులో కూడా చలి లేదట.  

Friday, December 4, 2015

స్లీమన్ కథ-19: టర్కీ ప్రభుత్వంతో అతని 'ట్రోజన్ వార్'

ఎటు తిరిగినా అడ్డంకులే. మైసీనియా చుట్టుపక్కల బందిపోట్ల బెడద ఎక్కువగా ఉందన్న కారణం చూపించి అక్కడ తవ్వకాలకు గ్రీకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఫ్రాంక్ కల్వర్ట్ ను చూస్తే, తీవ్ర అనారోగ్యంతో తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సాయం చేయగల స్థితిలో లేడు. సోఫియా ఇంకా అస్వస్థంగానే ఉంది.  స్లీమన్ ఈలోపల ట్రయాడ్ లో తన పది రోజుల సాహసం గురించి కొల్నిషో సైతూంగ్ కు రాశాడు. యజమానుల అనుమతి లేకుండానే ఆ దిబ్బ మీద తను తవ్వకాలు జరిపిన సంగతిని కూడా బయటపెట్టాడు. టర్కిష్ అధికారులు ఆ కథనాన్ని చదివారనీ, తన చర్యను తప్పు పట్టారనీ అతనికి తెలిసింది. ఎథెన్స్ లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం తప్ప ప్రస్తుతానికి చేయగలిగిందేమీ అతనికి కనిపించలేదు. 
(పూర్తి రచన 'టర్కీ ప్రభుత్వంతో 'ట్రోజన్ వార్' శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/12/03/%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%80-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C/ లో చదవండి)

Thursday, November 26, 2015

స్లీమన్ కథ-17: ట్రాయ్ లో నగ్నంగా ప్రదక్షిణలు చేసిన అలెగ్జాండర్

ట్రాయ్ గడ్డ మీద అడుగుపెట్టగానే, ఆసియా మొత్తం తమ చేజిక్కిందని గ్రీకులు అనుకున్నారు. హెల్స్ పాంట్ మీదుగా అలెగ్జాండర్ పర్షియన్లపై దండయాత్రకు వెడుతూ సెజియమ్(ఒక పురాతన నగరం)లోని ఓ గుట్టమీద ఉన్న అఖిలెస్ (ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న గ్రీకు వీరుడు) సమాధిని దర్శించుకున్నాడు. ఒంటి నిండా నూనె పట్టించి ఆ సమాధి చుట్టూ నగ్నంగా ప్రదక్షిణ చేశాడు. ఎథెనా ఆలయంలో భద్రపరచిన కొన్ని ఆయుధాలను తను ధరించాడు. ఆ నగరాన్ని తీర్చిదిద్దడానికి బ్రహ్మాండమైన ప్రణాళికలు వేసుకున్నాడు.
(పూర్తి రచన 'సీజర్ ను భయపెట్టిన ప్రేతాత్మాల నగరం...ట్రాయ్' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/11/26/%E0%B0%B8%E0%B1%80%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AD%E0%B0%AF%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87/ లో చదవండి)

Friday, November 20, 2015

స్లీమన్ కథ-16: పురావస్తు ప్రదేశాలలో వాళ్ళ హానీమూన్

కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. చాలా గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. స్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు. మధ్యలో ఉన్నట్టుండి సోఫియావైపు తిరిగి, “నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?” అని అడిగాడు. ఇష్టమేనని ఆమె చెప్పింది. “రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?” అని అడిగాడు. సోఫియా తేదీతో సహా ఠకీమని చెప్పింది. “హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?” అని అడిగాడు. గడగడా అప్పజెప్పింది. పరీక్ష నెగ్గింది.
(పూర్తి రచన 'హోమర్ ను చదువుకుంటూ అతడు-ఆమె' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/11/19/%E0%B0%B9%E0%B1%8B%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%82-%E0%B0%85%E0%B0%A4%E0%B0%A1%E0%B1%81/ లో చదవండి)

Thursday, November 5, 2015

స్లీమన్ కథ-15: గ్రీకు పెళ్లి కూతురి అన్వేషణలో పడ్డాడు

ప్రముఖులకు, హోదాలో ఉన్నవారికి ఇచ్చే పురస్కారాలు స్లీమన్ కు ఎంతో విలువైనవిగా కనిపిస్తూ వచ్చాయి. అతనికి కూడా బిరుదులు, సత్కారాల యావ పట్టుకుంది. తనను ఎవరైనా “హెర్ డాక్టర్” అని సంబోధిస్తేచాలు, అంతకన్నా తను కోరుకునేదేమీ ఉండదనుకున్నాడు. సొంతకథను రాసి రాష్టాక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. తన పేరుకు ముందు ఎవరైనా ‘డాక్టర్’ తగిలించకపోయినా, తనను ‘డాక్టర్ స్లీమన్’ అని సంబోధించకపోయినా  చాలా బాధ పడేవాడు.

(పూర్తి రచన 'గ్రీకు పెళ్లి కూతురి అన్వేషణలో...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/11/05/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B1%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B0%E0%B1%81-%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D/ లో చదవండి)

Thursday, October 29, 2015

స్లీమన్ కథ-14: ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...

స్లీమన్ గ్రామస్తులను కలసి, ఆ కొండ మీద ఇంతకుముందు ఎవరికైనా నిధినిక్షేపాలు దొరికాయా అని వాకబు చేశాడు. ఎప్పుడో 1811-14 ప్రాంతంలో కెప్టన్ గితారా అనే వ్యక్తి అక్కడ గాలింపులు జరిపాడనీ, అతనికి బంగారు చెవిపోగులు, మురుగులు దొరికినట్టు విన్నామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ కొందరు చెప్పారు.
తను ‘లయర్టిస్ పొలం’ అనుకున్నచోట నిలబడి ఒడిస్సేలోని చివరి అధ్యాయాన్ని వల్లిస్తూ, దానిని వాళ్ళ మాండలికంలో గ్రామస్తులకు అనువదించి చెప్పడం ప్రారంభించాడు. అతని చుట్టూ మూగిన గ్రామస్తులు, ఒక విదేశీయుడు తమ పురాణకథల్ని తమ భాషలో అలా అనర్గళంగా అప్పజెబుతుంటే ఆశ్చర్యానందాలతో తలమునకలైపోయారు. తన ఇథకా మకాంలో అత్యంత మహత్తర క్షణాలు ఇవే ననుకుంటూ ఆ అనుభవాన్ని స్లీమన్ ఇలా గుర్తుచేసుకున్నాడు:
(పూర్తి రచన 'ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/10/29/%E0%B0%8E%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%95%E0%B1%87%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6/ లో చదవండి)

Thursday, October 22, 2015

స్లీమన్ కథ-13: తొలి తవ్వకాలలో చితాభస్మం దొరికింది!

అది పెద్దగా ఖర్చులేని చిన్న ప్రారంభం. వెంట నలుగురు పనివాళ్లు, ఒక గాడిద. ఏడాది మొత్తంలోనే ఎండలు బాగా మండే కాలం కనుక, ఉదయం అయిదుకే బయలుదేరాలని ఉత్తర్వు చేశాడు. తను నాలుగుకే లేచి, సముద్రస్నానం చేసి, ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగి బయలుదేరాడు. కొండ ఎక్కడానికి రెండు గంటలు పట్టింది. పైకి వెళ్ళాక పెలొపనీసెస్ పర్వతాలను ఆనుకుని ద్రాక్షమద్యం రంగులో ఉన్న సముద్రం కనిపిస్తుందనుకున్నాడు(హోమర్ తన ఇలియడ్ లో అలా వర్ణించాడు). ఆ ఎత్తునుంచి గ్రీస్ మొత్తాన్ని చూడచ్చేమో నని కూడా అనిపించింది.

Friday, October 16, 2015

స్లీమన్ కథ-12: నడివయసులో ప్రేమలేఖ అందుకున్నాడు

అస్థిమితంగా, అశాంతిగా రోజులు గడుస్తుండగా; ఏకకాలంలో హఠాత్తుగా జరిగిన రెండు ఘటనలు అతని జీవనగమనాన్ని మార్చేశాయి. మొదటిది, అతను సర్బాన్ యూనివర్సిటీలో పురాతత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని తరగతులకు హాజరయ్యాడు. రెండోది, అతని దగ్గరి బంధువైన సోఫీ స్లీమన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమెకు యాభై ఏళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాననీ, నీతో కలసి ప్రపంచయాత్ర చేయాలని ఉందనీ ఆమె రాసింది. దానికతను జవాబు రాస్తూ, చిన్నప్పుడు కల్కోస్ట్ లో ఇద్దరూ కలసి ఆడుకున్న రోజుల్ని నిరాసక్తంగా గుర్తుచేసుకున్నాడు. ఆపైన ప్రష్యా రాయబారికి రాసిన ఉత్తరంలోలానే ఎత్తిపొడుపులు జోడిస్తూ పరుషవాక్యాలు గుప్పించాడు. ఒకప్పుడు నీ ప్రేమను అర్థిస్తే తిరస్కరించావనీ, ఇప్పుడు వయసులో నా కంటే పెద్ద అయిన నీతో అవారాలా తిరిగే ఉద్దేశం లేదనీ అన్నాడు.  
(పూర్తి రచన 'ఒంటినిండా ఒంటరితనాన్ని కప్పుకుంటూ...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/10/15/%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95/ లో చదవండి)

Wednesday, October 7, 2015

రాజధానిప్రాంతంగా విజయవాడపై ఫోకస్ ఏదీ?

(జాన్సన్ చోరగుడి రాసిన 'మన విజయవాడ' అనే పుస్తకంపై సాక్షి దినపత్రిక(4 అక్టోబర్ 2015)లో వచ్చిన నా సమీక్ష)

మొన్నటి వరకూ తెలుగువాళ్ళకు తమదంటూ చెప్పుకోదగిన ఓ మహానగరం లేదు. నగరం లేకపోతే నాగరికత ఎలా వస్తుంది?” అనేవారు రాంభట్ల కృష్ణమూర్తి. ఇప్పుడు తెలుగువాళ్ళకు రాజధాని రూపంలో మరో మహానగరం రాబోతోంది. దానిని అమరావతి అనే అందమైన, చారిత్రక స్ఫురణ కలిగిన పేరుతో పిలవబోతున్నా దానికి విశాలమైన దేహాన్ని కల్పించబోయేది మాత్రం విజయవాడే. ఇక్కడో విచిత్రం ఉంది. అమరావతి అనే రాజధానిలో విజయవాడ వెళ్ళి కలసిపోవడం లేదు. రాజధాని నగరమే విజయవాడలో కలిసిపోబోతోంది. ఈవిధంగా విజయవాడ రెండు త్యాగాలు చేయబోతోంది. రాజధాని అని ఘనంగా చెప్పుకునే అవకాశాన్ని అమరావతికి ధారపోస్తోంది. ఇంద్రుడికి ఆయుధం కావడం కోసం దధీచి వెన్నెముకను అర్పించినట్టుగా, రాజధాని కోసం విజయవాడ తన దేహాన్ని అర్పిస్తోంది.
అయితే, తను చేయబోతున్న త్యాగాల గురించీ; రాజధాని ప్రాంతంగా తను సరికొత్త రూపురేఖల్ని తెచ్చుకోబోవడం గురించీ విజయవాడనగరానికి ఇప్పటికీ తెలిసినట్టులేదు. పూర్వం బాల్యవివాహాలు చేసేవారు. పెళ్లన్నా, పెళ్లికూతురు ముస్తాబన్నా ఏమీ తెలియని వయసు కనుక; అలంకారానికి యాంత్రికంగా ఒళ్ళు అప్పగించడం తప్ప రేపు తన రూపు ఎలా మారుతుందో, పెళ్లి తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో బాలవధువుకి ఏమీ తెలియదు. పైగా మన  పెళ్లిళ్లు చాలావరకూ అర్థరాత్రి ముహూర్తాల్లోనే కనుక ఆ చిన్నారి నిద్రలో జోగుతూ ఉంటుంది. రాజధానీ అవతరణ పూర్వసంధ్యలో ఇప్పుడు విజయవాడ కూడా అలాగే జోగుతున్నట్టుంది.
ఏ జాతిచరిత్రలో నైనా రాజధాని నిర్మాణం ఒక ఉజ్వలఘట్టం. ఒక ఉత్తేజకరసందర్భం. ఎన్నో కలలు, ఊహలు, ప్రణాళికలతో మనసులు కిక్కిరిసిపోయి తబ్బిబ్బు పడాల్సిన సమయం. రాజధాని నిర్మాణమంటే కేవలం భూసేకరణ  కాదు. రియల్ ఎస్టేట్ పుంజాలు తెంచుకోవడం కాదు. ప్రభుత్వం ఏదో చేసేస్తుంటే జనం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన ఘట్టం అసలే కాదు. సమాజం తాలూకు సర్వాంగాలూ కొత్త రక్తం నింపుకుని సరికొత్త ఉత్సాహంతో పాలుపంచుకోవలసిన సన్నివేశం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ సందడి కనిపించడంలేదు. రాజధాని కేవలం భౌతికం కాదు, దానికో మానసికపార్శ్వం కూడా ఉంటుంది. రాజధాని కేవలం రాజకీయ సంబంధి కాదు, దానికి సాంస్కృతిక కోణం  ఉంటుంది. రాజధానిసుందరికి దేహపుష్టితోపాటు చక్కని నడక, నాజూకూ కూడా అవసరమే. కానీ మీడియా, ఇతర మేధావివర్గాలకు సైతం ఇది పూర్తిగా అర్థమైనట్టులేదు.
అర్థమయ్యుంటే ఈ వర్గాల దృష్టి ఇప్పటికే విజయవాడమీద ఫ్లడ్ లైట్ కాంతితో పడి ఉండేది. ఈ నగర చరిత్రేమిటి, దీని కథేమిటి, దీని ప్రస్తుత స్థితి గతులు ఏమిటి, దీనికున్న హంగులూ, అవకాశాలూ ఎలాంటివి, రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి దీనికి ఇంకా ఏమేం కావాలి సహా అనేక ప్రశ్నల్లోకి ఇప్పటికే లోతుగా తలదూర్చి ఉండేవి. కనీసం విజయవాడ మీద చిన్నవో, పెద్దవో పుస్తకాలైనా ఈపాటికి మార్కెట్ ను ముంచెత్తి ఉండేవి. ఆ దాఖలాలు లేవు. అయితే, ఇంత ఎడారిలోనూ ఒక ఒయాసిస్... అది, జాన్సన్ చోరగుడి వెలువరించిన మన విజయవాడ.
తెలుగునాట అభివృద్ధి-సామాజిక అంశాలను కాలికస్పృహతో విశ్లేషించి వ్యాఖ్యానించే కొద్దిమంది సీరియస్ రచయితల్లో  జాన్సన్ చోరగుడి ఒకరు. విజయవాడపై తను చేసిన రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ  మన విజయవాడ పేరుతో తొలి ముద్రణను ఆయన 2000 సంవత్సరంలోనే ప్రచురించారు. ప్రస్తుత రాజధాని సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, దానికే మరికొన్ని అంశాలు జోడిస్తూ పునర్ముద్రించారు. ఆవిధంగా ఈ పుస్తకానికి ఒక వైతాళిక’(మేలుకొలుపు) స్వభావం వచ్చింది.
విజయవాడను కలర్ ఫుల్ గా కాకుండా బ్లాక్ అండ్ వైట్ లో చూపించడానికి జాన్సన్ ప్రయత్నించారు. నేటి తీరుతెన్నులను ఎత్తిచూపుతూ మెత్తని వాతలూ పెట్టారు. నైసర్గికంగా విజయవాడ ఉత్తర,దక్షణాలకు కూడలి అవడంవల్ల మొదటినుంచీ వర్తకకేంద్రంగానే ఉంటూవచ్చిందనీ, ఆ విధంగా వెచ్చాలవాడ అయి, క్రమంగా వెచ్చవాడ’, బెజవాడ అయిందని ఆయన అంటారు. క్రీ.శ. 10-11 శతాబ్దులలో విజయవాడ వేంగీ చాళుక్యుల ఏలుబడిలో ఉన్నప్పుడు రాష్ట్రకూటులు, వారి వత్తాసుతో రెండవ యుద్ధమల్లుడు జరిపిన దండయాత్రలతో విజయవాడ ఓ పెద్ద రణరంగంగా మారి అరాచక శక్తులకు ఆటపట్టు అయిందనీ; అప్పటినుంచీ ఆ అరాచక స్వభావం కొనసాగుతూ ఉండడం విజయవాడ ప్రత్యేకత అనీ అంటారు. పంచాయతీగా ఉన్నప్పుడు విజయవాడ రూపురేఖలేమిటి, అది ఎప్పుడు మునిసిపాలిటీ అయింది, విజయవాడకు ఎప్పుడు రైలొచ్చింది-- మొదలైన వివరాలను ఎంతో ఆసక్తి భరితంగా అందిస్తూనే; వ్యవసాయ ఆర్థికతనుంచి సినిమా, ఆటో మొబైల్ రంగాలకు;  రక రకాల మోసాలతో సహా డబ్బు సంబంధ వ్యాపారాలకూ ఎలా పరివర్తన చెందుతూ వచ్చిందో ఒక సామాజికశాస్త్రవేత్తకు ఉండే లోచూపుతో విశ్లేషించారు. సామాజికవర్గాల అమరికను, ఊర్ధ్వచలనాన్ని స్పృశించారు. విజయవాడ పుస్తక ప్రచురణ కేంద్రంగా మారిన నేపథ్యాన్నీ తడిమారు. నాణ్యమైన చదువుల స్పృహ ఫలితంగా విస్తరించిన విద్యాసంస్థలతో, మేధోవలసలతో విజయవాడ గ్లోబలైజేషన్లో భాగమవుతున్నా; “ఇప్పటికీ వెరపు లేకుండా బహిరంగంగా బూతులు(సెక్సు కాదు, తిట్లు) మాట్లాడడం బెజవాడలో సహజ దృశ్యశ్రవణ”మనీ, “పొలం నగరంలోకి రావడం అంటే ఇదే” ననీ అంటూ ఆ చిన్న వ్యాఖ్యా దర్పణంలోనే కొండంత బెజవాడను చూపించారు.  “మానసిక కాలుష్యం లేని ఒక తరం కనుక ఆవిర్భవిస్తే...ఇక్కడ అన్ని విధాల ఆరోగ్యవంతమైన రాష్ట్రరాజధాని రూపు దిద్దుకోవడం ఇప్పటికీ సాధ్యమే” నన్న చారిత్రక ఆశాభావాన్నీ వ్యక్తం చేశారు.
76 పేజీల ఈ సచిత్ర రచన పరిమాణంలో చిన్నదే కానీ విషయవైశాల్యంలో, లోతులో చిన్నది కాదు. రేపు ఒక సమగ్ర రచనకు అవకాశమిచ్చే అన్ని రకాల ప్రాతిపదికలూ ఇందులో ఉన్నాయి. రాజధాని నిర్మాణ నేపథ్యంలో రావలసిన అనేక రచనలకు ఇది వేగుచుక్క అనడం అతిశయోక్తి కాదు.
                                                           ***
మన విజయవాడ(బొమ్మ కలర్ కాదు బ్లాక్ అండ్ వైట్), రచన: జాన్సన్ చోరగుడి, పబ్లిషర్స్: కృష్ణవేణి ప్రచురణలు, విజయవాడ-8, ప్రతులకు: కృష్ణవేణి ప్రచురణలు, 54-19-10A, జయప్రకాష్ నగర్, విజయవాడ-520008; అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలు, వెల: 60రూ. 

Friday, October 2, 2015

'గాంధీ భారత్'(1915-2015)కు నూరేళ్ళు!

(అక్టోబర్ 2, 2015 గాంధీ జయంతి రోజున ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన నా వ్యాసం)

స్వతంత్రభారతంలో పుట్టినవాళ్ళు గాంధీ శిలా విగ్రహాలు, గాంధీ చౌక్ లు, గాంధీ నగర్లు, గాంధీ జయంతులు, గాంధీ వర్ధంతుల మధ్య పెరిగారు. అవి లేని భారతదేశాన్ని వాళ్ళు ఊహించలేరు. అలాగే వాళ్ళలో చాలామందికి ఇప్పుడవి పెద్దగా స్పందనా కలిగించవు. కానీ, చరిత్ర కోణం నుంచి చూస్తే ఈ గాంధీ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది  గాంధీ భారతం జరుపుకుంటున్న శతజయంతివత్సరంలో వచ్చిన గాంధీ పుట్టినరోజు.  గాంధీ సరిగ్గా వందేళ్ల క్రితం, 1915లో, తన నలభై ఆరో ఏట దక్షిణాఫ్రికానుంచి భారత్ కు శాశ్వతంగా తిరిగివచ్చాడు. వస్తూనే భారత రాజకీయ, సామాజిక కార్యక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టాడు. అప్పటినుంచీ 1948లో హత్యకు గురయ్యేవరకూ వంచిన నడుము ఎత్తకుండా నిర్విరామంగా పనిచేశాడు. 1948 తర్వాత కూడా శిలావిగ్రహాలు, స్థలనామాలు, స్మారకనిర్మాణాలు వగైరాల రూపంలో దేశంలో మూల మూలలకు వ్యాపించిపోయాడు. మంచికీ, చెడ్డకూ; ఆరాధనకూ, ద్వేషానికీ అన్నింటికీ తనే లక్ష్యంగా మారాడు. కానీ ఇప్పుడిప్పుడు ఒక విచిత్రమైన పరిణామం సంభవిస్తోంది. ఒక పక్క గాంధీ ప్రాతినిధ్యం వహించిన భావజాలవిగ్రహాలపైనా, ఆయన ముఖ్య అనుయాయుల విగ్రహాలపైనా గునపం పోట్లు పడుతున్నాయి. మరోపక్క ఆ చేతులతోనే గాంధీ మెడలో పూలదండలు పడుతున్నాయి. గాంధీ ఈ రోజున ధృతరాష్ట్రకౌగిలిలో చిక్కుకున్న భీముడి విగ్రహం అవడం స్పష్టంగా కనిపిస్తోంది.
వందేళ్లు సుదీర్ఘకాలమే. సాధారణంగా అంత నిడివికి చూపుల్ని విస్తరించే ఓపిక, ఆసక్తి చాలామందికి ఉండదు. విస్తరిస్తే మాత్రం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు! అలవాటైన చరిత్రా, పరిసరాల మీదుగా కాలంలోకి వెనక్కి వెడుతున్న కొద్దీ పాత గతమే కొంగొత్తగా కనిపిస్తూ మనల్ని విస్మితుల్ని చేస్తుంది. మన అవగాహనకు కొత్త కోణాలను, మెరుపులను అద్దుతుంది. అంతేకాదు, ఒక్కోసారి చరిత్ర వినూత్న వేషంలో పునరావృతమవడమూ కనిపిస్తుంది.
తిలక్, గోఖలేల భారతం
వందేళ్ల గాంధీ భారతానికి ముందు, అంటే 1914 వరకూ ఉన్నది గాంధీ భారతం కాదు. అది, బాలగంగాధర తిలక్, గోపాల కృష్ణ గోఖలే, లాలా లజపతిరాయ్, మదన మోహన మాలవీయ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సావర్కర్, జిన్నాల భారతం. వీరిలో చిత్తరంజన్ దాస్, సావర్కర్, జిన్నాలు గాంధీ కంటే చిన్న. అయినా భారత్ కార్యక్షేత్రంలో గాంధీకి సీనియర్లు. భారత్ కు వచ్చేనాటికి గోఖలేతోనే గాంధీకి సన్నిహితపరిచయం. గాంధీకి ఆయన గురుతుల్యుడు. తిలక్, లజపతిరాయ్, మాలవీయ, సావర్కర్ లు హిందువుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ముద్రపడ్డారు. బ్రిటిష్ ఛత్రచ్ఛాయలోనే ముస్లిం ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని జిన్నా భావిస్తున్నాడు. మళ్ళీ నాటి నేతల మధ్య సాత్విక, తీవ్రవాద భేదాలూ ఉన్నాయి. కుల ప్రాతిపదికపై రాజకీయాలు నడిపేవారూ ఉన్నారు. అలాగే, బ్రిటిష్ పాలకులకు మహజర్లు సమర్పించుకునే శిష్టవర్గం ఉంది. ఇక అనుయాయుల్ని చూస్తే, వాళ్లలోనూ కులం, మతం వగైరాల రూపంలో రకరకాల చీలికలు. ఆపైన నిద్రాణంగా అసంఖ్యాక సామాన్యజనం.
దక్షిణాఫ్రికాలో 20 ఏళ్లపాటు పోరాడిన అనుభవాన్నీ, విజయాలనూ వెంటబెట్టుకుని గాంధీ 1915, జనవరి 15న వచ్చి వీళ్ళమధ్య పడ్డాడు. అప్పటికాయన పేరు దేశంలోని నాయకులకే తప్ప, జనసామాన్యానికి అంతగా తెలియదు. బొంబాయిలో ఓడ దిగగానే గాంధీ, కస్తూర్బాలకు ఘనస్వాగతమే లభించింది. ఆరోగ్యం బాగులేకపోయినా గోఖలే కూడా పూనా నుంచి వచ్చి స్వాగతం చెప్పాడు. బొంబాయిలో వరసపెట్టి గాంధీ స్వాగతసభలు జరిగాయి. ఒక సభకు తిలక్, ఇంకో సభకు జిన్నా అధ్యక్షత వహించారు. భారత్ లో ఎలా ఉండాలో, ఏం చేయాలో గాంధీ ప్రణాళికతో వచ్చాడు. అప్పటివరకూ వేసుకున్న కాంట్రాక్టు కార్మికుల దుస్తులు వదిలేసి, గుజరాతీ సాంప్రదాయిక ఆహార్యంలోకి మారిపోయాడు. సభలలో ఇంగ్లీష్ పొగడ్తలకు గుజరాతీ ధన్యవాదాలు చెప్పి ఆశ్చర్యచకితం చేశాడు. ఈ పిచ్చివాడు త్వరలోనే ఇక్కడి అడవిమాలోకంలో కలసిపోయి అదృశ్యమైపోతాడని చాలామంది అనుకున్నారు.
అనుయాయిగా ఒక దర్జీ
కలసిపోయాడు కానీ అదృశ్యం కాలేదు. వస్తూనే గోఖలే ఆదేశంపై, అది కూడా థర్డ్ క్లాస్ బోగీలో, దేశమంతా చుట్టేశాడు. అప్పటికే అస్పృశ్యతా నివారణ, హిందూ-ముస్లిం ఐక్యత, స్వాతంత్ర్య సాధన అన్న అజెండా ఆయన దగ్గర ఉంది. తను పనిలోకి దిగడానికి ఒక స్థావరం, కొంత డబ్బు, మెరికల్లాంటి అనుయాయులు, ఓ పత్రిక అవసరమన్న అవగాహన ఉంది. క్రమంగా ఒకటొకటే సమకూడాయి. భారత్ లో ఆయనకు తొలి అనుయాయిగా చెప్పదగిన వ్యక్తి ఓ దర్జీ. అతనిపేరు మోతీలాల్. రైల్లో పరిచయమయ్యాడు. తమ విరమ్ గావ్ రైల్వే స్టేషన్ చుట్టూ కస్టమ్స్ వలయం ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉంది, తీయించకూడడా అని గాంధీని అడిగాడు. సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లడానికి మీరు సిద్ధపడితే ప్రయత్నిస్తానని గాంధీ అన్నాడు. మోతీలాల్ ఒప్పుకున్నాడు. గాంధీ వైస్రాయి దాకా వెళ్ళి ఆ చిన్న సమస్యను పరిష్కరించాడు.  అదే భారత్ లో తొలి సత్యాగ్రహ యోచనకు నాంది పలికింది.
'నాతో చేరి చరిత్ర సృష్టించు'
ఆయన ముఖ్య సహచరశ్రేణిలో మొదట చేరింది కృపలానీ.  శాంతినీకేతన్ లో ఉండగా గాంధీని కలసి, చరిత్ర అధ్యాపకుడిగా తనను పరిచయం చేసుకున్నప్పుడు, నాతో కలసి పనిచేస్తూ చరిత్ర సృష్టించు అని గాంధీ ఆయనతో అన్నాడు. ఆ తర్వాత పటేల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి తదితరులు ఆయన ప్రభావపరిధిలోకి వచ్చారు. ఒకపక్క హిందూ తీవ్రవాదులు, ఇంకోపక్క ముస్లిం తీవ్రవాదులు, వేరొక పక్క కులవ్యతిరేక విప్లవకారులు—ఇదీ గాంధీ వచ్చేటప్పటికి ఇక్కడి పరిస్థితి. దక్షిణాఫ్రికాలో అప్పటికే అహింస, సత్యాగ్రహాలతో గాంధీ ప్రయోగాలు జరిపి ఉన్నాడు. హింసను వ్యతిరేకిస్తూ, అది పాశ్చాత్యమే కానీ భారతీయం కాదంటూ హిందువులనూ, హింసావాదులనూ కూడా ఆకట్టుకునే వ్యూహంతో గుజరాతీలో హింద్ స్వరాజ్ అనే పుస్తకం రాసి పెట్టుకున్నాడు. 1915లోనే కలకత్తాలో తీవ్రవాదపంథాకు చెందిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ, హింసావాదంతో ఎవరైనా దేశాన్ని భయభ్రాంతంచేయాలనుకుంటే వారికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా ఉద్యమిస్తాననీ, ఒకవేళ తనే హింసాత్మకంగా తిరగబడదలచుకుంటే బహిరంగంగా చెప్పి మరీ చేస్తానన్నాడు. అలీసోదరులుగా ప్రసిద్ధులైన షౌకత్ అలీ, మహమ్మద్ అలీలు ఆ సమావేశంలోనే గాంధీ ప్రభావంలోకి వచ్చారు. భవిష్యత్తులో  హిందూ-ముస్లిం సమైక్యతా యత్నాలలో ఒక ముఖ్యపాత్ర పోషించి, అనంతర పరిణామాల వల్ల క్రమంగా ఆయనకు దూరమయ్యారు.
నిప్పులు చెరిగిన ప్రసంగం
గాంధీ ఎందుకోగానీ భారత్ లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదిలో కొంత అస్థిమితంగానూ, అశాంతిగానూ ఉన్నట్టున్నాడు. మాట కూడా పరుషంగానూ, దూకుడుగానూ ఉన్నట్టు కొందరికి అనిపించింది. 1916 ఫిబ్రవరి 6న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకదినోత్సవానికి ఆహ్వానితుడుగా హాజరై ఆయన చేసిన ప్రసంగం ఇంకో ఉదాహరణ. ఎక్కడలేని మురికీ ఈ నగరంలోనే ఉందన్నాడు. ఒంటి మీద జిగేలుమనే ఆభరణాలతో వేదికమీద కూర్చున్న సంస్థానాధీశులను చూపించి, ఆ నగలు తీసి పక్కన పెడితే తప్ప ఈ దేశానికి విముక్తి లేదన్నాడు. ఈ దేశాన్ని రక్షించగలిగింది రైతులే తప్ప న్యాయవాదులో, డాక్టర్లో, జమీందార్లో కాదని తెగేసి చెప్పాడు. ఉత్సవానికి వైస్రాయి రాక సందర్భంగా నగరమంతటా పోలీస్ పటాలాల్ని దింపడాన్ని ప్రస్తావించి ఇలా భయంతో చస్తూ బతకడం కన్నా చావే నయమని అనేశాడు. అంతా దిగ్భ్రాంతి చెందారు. అధ్యక్షస్థానంలో ఉన్న అనిబిసెంట్ కలవరపడి గాంధీ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించింది. ఈ సమావేశంలో ఉన్న ఇద్దరు మాత్రం గాంధీ ఆకర్షణలో పడిపోయారు. ఒకరు ఘనశ్యామ్ దాస్ బిర్లా, ఇంకొకరు వినోబా భావే. భవిష్యత్తులో వీరిద్దరూ గాంధీ ముఖ్యసహచరుల్లో భాగమయ్యారు.
పాత-కొత్తల వారధి
పై రెండు ప్రసంగాలూ, వీటి మధ్యలో 1915 డిసెంబర్ లో జరిగిన బొంబాయి కాంగ్రెస్ లో చేసిన ప్రసంగం గాంధీని మిగతా నాయకులకు భిన్నంగా జనానికి చూపించాయి. ఈయన తమ తరపున, తమలో ఒకడుగా, తమ భాష మాట్లాడుతున్నాడనుకున్నారు. అంతేకాదు, అన్ని పక్షాలవారినీ అధిక్షేపిస్తూనే వాళ్ళకు మద్దతు పలుకుతూ ఈయన వాళ్ళకో పజిల్ లానూ తోచాడు. గడియారం ముల్లైనా ఆగుతుందేమో కానీ గాంధీ ఆగే ప్రశ్నలేదు. ఆయన నిర్విరామంగా తిరిగే ఓ పని యంత్రం. దానికితోడు ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళిక ఉంటుంది. 1917లో చంపారన్, 1918లో ఖెడా రైతు ఉద్యమాలు, ఆ ఏడాదే అహ్మదాబాద్ జవుళిమిల్లు కార్మికుల పక్షాన జరిపిన సత్యాగ్రహం  విజయవంతమై గాంధీ ప్రతిష్టను పెంచాయి. 1918లోనే రౌలట్ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన సత్యాగ్రహం ఆయనను యావద్భారత నేతగా ప్రతిష్టించింది. ఒకపక్క తిలక్, లజపతిరాయ్, మాలవీయ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్, జిన్నా(గాంధీ భారత్ కు వచ్చిన కొన్ని వారాలకే గోఖలే కన్ను మూశాడు)లాంటి పాత కాపులతో స్నేహవారధి కట్టుకుంటూనే తన సహచరశ్రేణిని నిర్మించుకుంటూవచ్చాడు. ఘర్షణ తలెత్తినప్పుడు సహచరుల బలంతో తన పంథాను నెగ్గించుకుంటూ, వీలు కానప్పుడు రాజీ పడుతూ ముందుకు వెళ్ళాడు. పాత, కొత్త నేతలతో; వారి భావజాలాలతో తను స్నేహవారధి కట్టుకోవడమే కాదు; క్రమంగా తనే వారధి అయ్యాడు. ఇటు హిందూ వాదులైన లజపతి రాయ్, మాలవీయ, స్వామీ శ్రద్ధానంద; అటు ముస్లిం ప్రతినిధులైన జిన్నా, అలీ సోదరులు ఆయన ప్రణాళికలో విడదీయలేని భాగాలు అయ్యారు. ఖిలాఫత్ ఉద్యమరూపంలో హిందూ-ముస్లిం ఐక్యత గట్టిపడుతున్నట్టే కనిపించింది. కానీ 1920 సహాయనిరాకరణ ఉద్యమం దరిమిలా ఐక్యత బీటలు వారింది. ఆ పగులు పెద్దదవడమే తప్ప మళ్ళీ అతుక్కోలేదు. కాకపోతే గాంధీ ప్రభావంతో హిందూ-ముస్లిం ఐక్యతను నొక్కి చెప్పే ఒక బలమైన వర్గం రూపొందింది.
సవాలుగా మారిన సావర్కర్, జిన్నా
ఈ నేపథ్యంలో 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.)అవతరించింది. అటు ముస్లిం శ్రేణులు కూడా వివిధపద్ధతుల్లో సంఘటితమవుతున్నాయి. వివిధ భావజాలాలకు వారధి కాగలిగిన గాంధీ నాయకత్వ సరళి అప్పటికీ చెదిరిపోలేదు. సుభాష్ చంద్రబోస్ వంటి రాడికల్స్ తో; ఆచార్య నరేంద్ర దేవ, జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టులతో ఒక మేరకు పని చేయగలుగుతున్నాడు. అలాగే, ఇంతకు ముందు లజపతిరాయ్, మాలవీయ వంటి పాతకాపులైన హిందూవాదులను కూడా కలుపుకోగలిగాడు. కానీ, ఈ కొత్త హిందుత్వ వర్గాలను కలుపుకోవడం ఆయనకు చేతకాలేదు. బ్రిటిష్ కన్నా ఎక్కువగా ఆయనకు ఇద్దరు పెద్ద సవాలు అయ్యారు: ఒకరు సావర్కర్, ఇంకొకరు జిన్నా. విశేషమేమిటంటే జిన్నాను కలసుకోవడం కన్నా చాలా ముందే, 1909లో లండన్ లో గాంధీ, సావర్కర్ ఒక సమావేశంలో కలసుకున్నారు. అంతే, వాళ్ళ మధ్య ఎప్పుడూ మాటా మంతీ జరగలేదు. జిన్నాతో చర్చలు జరిగినా ఫలించలేదు. అలాగే, గాంధీ సనాతనవాదులతోనూ తలపడ్డాడు. ఈ వర్గం నుంచి ఆయనపై దాడులు, హత్యాప్రయత్నాలూ జరిగాయి. చివరికి వీరి భావజాల బంధువుల చేతిలోనే హత్యకు గురయ్యాడు.
అనేక కారణాల చేత గాంధీని తప్పు పట్టేవారు అన్ని రకాల భావజాలాలవారిలోనూ ఇప్పుడున్నారు. ఇందులో రెండు తేడాలు ఉన్నాయి. మొదటిది, చరిత్రను ఒక స్థిరస్థితినుంచి చూడడం. రెండవది, చలనశీలతనుంచి చూడడం. ఈ రెండు రకాల చూపులూ రెండు రకాల తీర్పునకు దారి తీయచ్చు. తటస్థంగా చూస్తే, అంతవరకూ శిష్టవర్గం ఆక్రమించుకుని ఉన్న రాజకీయవేదిక మీదికి జనసామాన్యాన్ని తీసుకురావడం, ఐక్యపోరాటాల నిర్మాణం వగైరాలలో ఈ వందేళ్ల భారతరాజకీయాలపై గాంధీ ముద్ర కనిపించవచ్చు. అదలా ఉంచితే, నూరేళ్ళ కాలచక్రం ఒక ఆవృత్తిని పూర్తి చేసుకున్నాక ఇప్పుడు గమనిస్తే; గాంధీ 1915లో భారత్ లోకి అడుగుపెట్టడానికి ముందు, అంటే 1914 నాటికి ఉన్న హిందూవాదుల తరహా రాజకీయాలే ప్రబల స్థితిలో ఉన్నాయి. గాంధీ భారతం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి బిక్క చూపులు చూస్తోంది. చరిత్ర పునరావృతికి ఇదొక ఆసక్తికరమైన ఉదాహరణ. 

Thursday, October 1, 2015

స్లీమన్ కథ-11: చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు

చీకటి పడుతున్న సమయానికి గోడనుంచి ఓ ఇటుకను జాగ్రత్తగా వేరుచేసి దానిని ఓ తాడుతో ఎలాగో వీపుకి కట్టుకున్నాడు. ఆ తర్వాత పొట్టను గోడకానించి నెమ్మదిగా కిందికి జారాడు. దిగిన వెంటనే ఇటుకను చూసుకున్నాడు. అది భద్రంగా ఉన్నందుకు పొంగిపోయాడు. విపరీతమైన దాహంతో మంచినీళ్ళకోసం కేకలు పెట్టేటప్పటికి అక్కడి రైతులు పరుగుపరుగున నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకు తను తెచ్చిన ఇటుకను సగర్వంగా చూపించాడు. ఆ ఒక్క ఇటుక కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడాలా అనుకుంటూ వాళ్ళు పగలబడి నవ్వేశారు. “నేను మంచినీళ్లు అడగ్గానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చిన ఔదార్యం, దయా కలిగిన ఈ జనం కచ్చితంగా తమ జీవితంలో ఎప్పుడూ నల్లమందు సేవించి ఉండ”రని డైరీలో రాసుకున్నాడు.

(పూర్తి రచన 'చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు' అనే శీర్షికతో http://magazine.saarangabooks.com/2015/09/27/%E0%B0%9A%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A1-%E0%B0%AE%E0%B1%80%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%87%E0%B0%9F%E0%B1%81%E0%B0%95-%E0%B0%A4%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A/లో చదవండి)

Tuesday, September 29, 2015

బోస్ వివాదం-3: పత్రాలలో దాగిన 'రహస్యం' ఏమిటి?

బోస్ కు పెరిగిన మద్దతు
అహింసతో సహా గాంధీ విధానాలు, వ్యూహాలు అన్నీ విఫలమై కాంగ్రెస్ లోనే కాక దేశం మొత్తంలోనే ఆయన దాదాపు ఒంటరిగా మారిన సందర్భం ఇది. ఒకపక్క జనంలో బ్రిటిష్ వ్యతిరేకత తారస్థాయికి చేరగా, ఆసియా దేశమైన జపాన్ చేతిలో పాశ్చాత్యశక్తులు చిత్తుగా ఓడిపోతుండడం ఆ దేశంపట్ల వారిలో అనుకూలభావాన్నీ అదే స్థాయిలో పెంచింది. ఈ మధ్యలో 1941లో బోస్ తన కలకత్తా నిర్బంధం నుంచి నాటకీయంగా తప్పించుకుని అప్ఘానిస్తాన్ మీదుగా జర్మనీ పారిపోయి, బెర్లిన్ నుంచి చేసిన రేడియో ప్రసంగాలు దానికి మరింత ఊతమిచ్చాయి. కాంగ్రెస్ లో ఎక్కువమంది నాయకులు, కార్యకర్తలు బోస్ వైపు తిరిగారు. జర్మనీనుంచి ఆయన జపాన్ చేరుకుని జలాంతర్గాములను సేకరించబోతున్నట్టు వార్తవచ్చింది. బోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ సేనలతో కలసి భారత-బర్మా సరిహద్దుల్లో వీరోచితపోరాటం చేసింది. అయితే ఓటమిని మూటగట్టుకున్న సందర్భాలే ఎక్కువ. పరిస్థితి పూర్తిగా తన పట్టు జారిపోతోందనుకున్న గాంధీ ప్రజలమనోభావాలకు అనుగుణంగా క్విట్ ఇండియా నినాదాన్ని అందుకున్న తర్వాతే మళ్ళీ జనం ఆయనవైపు మళ్ళడం ప్రారంభించారు.
హిట్లర్ మరణం-జపాన్ లొంగుబాటు
అంతవరకూ యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా, పెరల్ హార్బర్ పై జపాన్ దాడిచేసేసరికి యుద్ధంలోకి అడుగుపెట్టింది. దాంతో బ్రిటన్ యుద్ధపాటవం అనేకరెట్లు పెరిగి బలాబలాలు తారుమారయ్యాయి. 1945 నాటికి హిట్లర్ మరణించడం, అణుబాంబు ప్రయోగంతో జపాన్ లొంగిపోవడం, ఆ వెనువెంటనే తైవాన్ లో జరిగిన విమానప్రమాదంలో బోస్ మరణించినట్టు వార్త రావడం సంభవించాయి. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయపరిణామాల మబ్బులు తొలగిపోయి జాతీయరాజకీయాలు తిరిగి తేటపడడం ప్రారంభించాయి. ఇప్పుడు బోస్ లేకపోవడం ఒక్కటే తేడా.
ఎవరు ఎంత బాధ్యులు?
జాతీయరంగస్థలినుంచి బోస్ నిష్క్రమణ రెండు అంచెలలో జరిగింది. మొదటిది, కాంగ్రెస్ నుంచి నిష్క్రమణ. రెండోది, మరణం లేదా అంతర్ధానం రూపంలో జరిగిన నిష్క్రమణ. ఎలాంటి బాధ్యులన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే; కాంగ్రెస్ నుంచి బోస్ నిష్క్రమణకు గాంధీ, నెహ్రూ తదితరులే బాధ్యులవుతారు. అదే, ఆయన మరణం లేదా, అంతర్ధానానికి బాధ్యులెవరన్నప్పుడు అంతర్జాతీయశక్తులు తప్పనిసరిగా అడుగుపెడతాయి. జర్మనీ, జపాన్ లతో తలపడుతున్న బ్రిటిష్ కు, ఆ రెండు దేశాల నుంచి సాయం పొందుతున్న బోస్ కదలికలపై నిఘావేయాల్సిన అవసరం స్పష్టమే. ఆయన కుటుంబసభ్యులపైకి దానిని పొడిగించడమూ సహజమే. రహస్యపత్రాలు బయటపెడితే  కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బతినచ్చని ఇప్పటి కేంద్రప్రభుత్వం వినిపిస్తున్న వాదన కూడా; బోస్ మరణం’, లేదా అంతర్ధానం వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర గురించిన అనుమానాన్ని బలోపేతం చేసేలానే ఉంది.
కాంగ్రెస్ నుంచి బోస్ నిష్క్రమణకు గాంధీ, నెహ్రూ తదితరులు ఎలాంటి బాధ్యులన్న ప్రశ్న చూద్దాం. అందుకు కారణం వ్యక్తిగత రాగద్వేషాలు, అధికారంలో పోటీ అవుతాడన్న భావనే అన్న నిర్ధారణకు అవకాశంలేకుండా భావజాల పరమైన వ్యత్యాసాలు ఉండనే ఉన్నాయి. బోస్-గాంధీలది హింస-అహింసల మధ్య పెనుగులాట. బోస్-నెహ్రూలది ఫాసిస్టు-ఫాసిస్టు వ్యతిరేకశక్తుల మధ్య స్పర్థ. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి నెహ్రూకు ఇచ్చిన అవకాశాన్ని బోస్ కు గాంధీ నిరాకరించడాన్నీ, బోస్ కు నెహ్రూ మద్దతు ఇవ్వకపోవడాన్నీ అర్థం చేసుకోడానికి ఇదొక కోణం. ఒకవేళ గాంధీ, నెహ్రూలను బోస్ విషయంలో ముద్దాయిలుగా పరిగణించాల్సివచ్చినా పెద్ద ముద్దాయి గాంధీ అవుతాడు కానీ, నెహ్రూ అవడు. బోస్ తో గాంధీకి ఉన్నంత విభేదం నెహ్రూకు లేదని చెప్పుకున్నాం. అయితే, నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ కుటుంబ సభ్యులపై నిఘా ఎందుకు కొనసాగించాయన్న ప్రశ్న వస్తుంది. పరిపాలనా కోణం నుంచి చూస్తే అదేమంత విశేషం అనిపించదు. సంఘపరివార్ వర్గాలు, వామపక్ష తీవ్రవాదులతో సహా కొన్ని రకాల భావజాలాలవారిపై ఇంటెలిజెన్స్ నిఘా ఎప్పుడూ ఉంటూనే ఉంది.  
బోస్ మరణం’, లేదా అంతర్ధానం వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర ఉన్నట్టు కేంద్రం వద్ద ఉన్న రహస్యపత్రాలు వెల్లడిస్తూ ఉంటే, ఆ విషయం నెహ్రూ ఎందుకు బయటపెట్టలేదనే ప్రశ్న వస్తుంది. అందులో కూడా ఆయనను మొదటి ముద్దాయిగా నిర్ధారించాలంటే, ప్రస్తుత ప్రభుత్వం తన దగ్గరున్న అన్ని రహస్యపత్రాలనూ బయటపెట్టాలి!
బోస్ ప్రతిష్టను మసగబార్చారనీ, స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్రను తక్కువచేశారనే ఆరోపణలు, అనుమానాలు  సహజమే కానీ; పూర్వాపరాల అవగాహన లోపించినప్పుడు అవి కేవలం సొంత అభిమాన ప్రకటనలుగానో, రాజకీయఫ్రేరితాలుగానో తేలిపోతాయి. గాంధీకి బోస్ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. తమిద్దరివీ రెండు భిన్నమార్గాలుగానే చూశాడు. బోస్ దేశభక్తిని, సాహసప్రవృత్తిని ఆకాశానికి ఎత్తాడు. నీ మార్గంలో నువ్వు విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తానని కూడా ఒకసారి బోస్ కు రాశాడు. ఒకవేళ జపాన్-జర్మనీ కూటమే గెలిచి ఉంటే ఆ విజయం బోస్ మార్గానికే దక్కి, భారత్ చరిత్రే భిన్నమైన మలుపు తిరిగేది. కానీ అలా జరగలేదు. జపాన్-జర్మనీ ఓటమి బోస్ ను శాశ్వతంగా తెరమరుగు చేసి గాంధీ-నెహ్రూ భావజాలాన్ని విజయతీరం చేర్చింది.
ఒకవేళ కేంద్రం వద్ద ఉన్న రహస్యపత్రాలు కూడా వెల్లడై, అన్నివిధాలా నెహ్రూనే విలన్ గా స్థాపించిన పక్షంలో, అప్పుడది వేరే కథ! 
                                                                                     (అయిపోయింది)

Monday, September 28, 2015

బోస్ వివాదం-2: నెహ్రూ-బోస్ సంబంధాలు ఎలా ఉండేవి?

నెహ్రూ-బోస్
బోస్ కన్నా నెహ్రూ ఆరేళ్లు పెద్ద. పటేల్ తో ఆయన విభేదాలు ప్రసిద్ధాలే. గాంధీతో కూడా ఆయనకు భావజాల, వ్యూహపరమైన విభేదాలుండేవి. కొన్ని సందర్భాలలో, ఇద్దరం తెగతెంపులు చేసుకుందామా అనేవరకూ వెళ్లారు. విచిత్రం ఏమిటంటే, మిగతా ఎవరి మధ్యా లేనంత భావసమైక్యత నెహ్రూ, బోస్ ల మధ్యే ఉండేది. ఇద్దరూ కాంగ్రెస్ లో రాడికల్స్ గా గుర్తింపు పొంది, ఆ వర్గానికి నాయకత్వం వహించారు. ఇద్దరూ కూడబలుక్కుని గాంధీకి నచ్చని తీర్మానాలు తెచ్చి నెగ్గించుకున్న సందర్భాలున్నాయి. కాంగ్రెస్ నియమించిన మోతీలాల్ నెహ్రూ కమిటీ అధినివేశప్రతిపత్తిని కోరాలని సూచించినప్పుడు 1927లో మద్రాసు కాంగ్రెస్ లో దానిని తోసిపుచ్చి, సంపూర్ణస్వరాజ్యాన్ని డిమాండ్ చేస్తూ వీరు తెచ్చిన తీర్మానం ఒక ఉదాహరణ. 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ ను వీరిద్దరూ కలసి తమ రాడికల్ భావాలతో ఒక ఊపు ఊపారు. అప్పుడు కూడా అధినివేశప్రతిపత్తికి బదులు సంపూర్ణస్వరాజ్యానికి ఇద్దరూ పట్టుబట్టారు. గాంధీ మెట్టు దిగి రాజీకి వచ్చాడు. గాంధీ ఇష్టానికి విరుద్ధంగా బ్రిటిష్ తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని బోస్ సవరణ ప్రతిపాదిస్తే నెహ్రూ దానిని సమర్ధించాడు. గాంధీ అస్పృశ్యతా నివారణపై మరీ ఎక్కువగా దృష్టి పెట్టడాన్నీ ఇద్దరూ వ్యతిరేకించారు. అలాగే బ్రిటిష్ పట్ల గాంధీ సామరస్యవైఖరిని వ్యతిరేకించడంలోనూ ఇద్దరిదీ ఏకీభావమే.
అయితే ఇద్దరిలోనూ కొన్ని తేడాలూ ఉన్నాయి. గాంధీతో నెహ్రూ ఒక్కోసారి తెగతెంపులవరకూ వెళ్ళినా వెనక్కి తగ్గేవాడు. ఆయన మౌలికంగా కాంగ్రెస్, గాంధీల మనిషి. ఆ రెండు గొడుగుల అంచుల్లో వేళ్లాడేవాడే కానీ పూర్తిగా బయటికి వచ్చేవాడు కాదు. బోస్ కు కాంగ్రెస్, గాంధీల పట్ల అంత నిబద్ధతలేదు. నెహ్రూ కాంగ్రెస్ గుంపులో ఉంటూనే కొన్ని సందర్భాలలో అలీనతను పాటించేవాడు. బోస్ పూర్తిగా ఒక వైపు ఒరిగిపోయేవాడు.  1923లోనే కాంగ్రెస్ ప్రో-ఛేంజర్స్గా, నో-ఛేంజర్స్గా చీలిపోయి, తన తండ్రి ప్రో-ఛేంజర్స్ శిబిరంలో చేరినా నెహ్రూ రెండు శిబిరాలకూ దూరంగా ఉండడం ఆయన అలీనతకు ఒక చిత్రమైన ఉదాహరణ. బోస్ రెండోసారి అధ్యక్షుడైనప్పుడు ఆయనతో అర్ధాంతరంగా రాజీనామా చేయించే ప్రయత్నాలలోనూ నెహ్రూ అలీనంగానే ఉండిపోయాడు. ఇంతకు ముందు పలు సందర్భాలలో తనూ, బోస్ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నా; కాంగ్రెస్ లో బోస్ ఒంటరి అయ్యే క్లిష్టపరిస్థితిలో మాత్రం ఆయన నోరు తెరిచి మద్దతు అడిగినా నెహ్రూ ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయాడు. అయితే, నెహ్రూ గతంలోనూ అలా అలీనంగా ఉండిపోయిన సందర్భాలున్నాయి కనుక, బోస్ అడ్డు తొలగించుకోడానికే మద్దతు ఇవ్వలేదని చటుక్కున నిర్ధారణకు రావడానికి వీల్లేదు. మొత్తంమీద నెహ్రూ-బోస్ సంబంధాలను పరిశీలిస్తే వారు విరోధించుకుని వీధికెక్కిన ఉదంతాలు లేవనే చెప్పవచ్చు.
అప్పటికి పద్దెనిమిదేళ్లుగా బోస్ తనతో మాటిమాటికీ విభేదిస్తున్నా, తన నాయకత్వం విఫలమైందని ప్రకటించినా ఆయనతో సర్దుబాటు చేసుకుంటూ రావడమే కాక; పట్టుబట్టి ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి చేసిన గాంధీ-- రెండో విడత ఆయన అధ్యక్షుడైనప్పుడు దింపేవరకూ ఎందుకు నిద్రపోలేదు? అలాగే, తనున్న క్లిష్టపరిస్థితిలో బోస్ నోరు తెరిచి మద్దతు కోరినా నెహ్రూ ఎందుకు ఇవ్వలేదు? ఇవీ ఇక్కడ వేసుకోవలసిన ప్రశ్నలు.
అంతర్జాతీయదృక్కోణాలు
ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలంటే జాతీయరాజకీయాలనుంచి అంతర్జాతీయరాజకీయాల్లోకి వెళ్ళాలి.
గాంధీ, నెహ్రూ, రాజగోపాలాచారి, బోస్ తదితరులకు తమవైన అంతర్జాతీయ దృక్కోణాలున్నాయి. గాంధీది బ్రిటిష్ పట్ల మిత్రవైరుధ్యమైతే, బోస్ ది శత్రువైరుధ్యమని చెప్పుకున్నాం. నెహ్రూ సోవియట్ యూనియన్ ను అభిమానించేవాడు. 1938-42 మధ్యకాలంలో యూరప్ లో సంభవించిన కల్లోలం భారత్ ను, తదనుగుణంగా జాతీయనాయకుల అంతర్జాతీయదృక్కోణాలనూ కూడా ప్రభావితం చేస్తూ వచ్చింది.  జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు కలగలిసిపోయిన సందర్భమది. 1938లో జర్మనీ(హిట్లర్), ఇటలీ(ముసోలినీ), బ్రిటన్, ఫ్రాన్స్ ల మధ్యజరిగిన మ్యూనిక్ ఒప్పందం చెకొస్లవేకియా విషయంలో హిట్లర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి అవకాశమిచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ ఆత్మగౌరవాన్ని హిట్లర్ కు తాకట్టు పెట్టిన ఒప్పందంగా దానిని గర్హించిన గాంధీ; చెక్, యూదు జాతీయుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు మద్దతు తెలిపాడు. ఇందుకు భిన్నంగా బోస్ ను జర్మనీ తెగువా’, ఇటలీ ఆత్మవిశ్వాసం ఆకట్టుకున్నాయి. బ్రిటిష్-కాంగ్రెస్ పొత్తును, కాంగ్రెస్ మంత్రివర్గాలను అంతమొందించి సామూహిక శాసనోల్లంఘన చేపట్టడానికి ఇదొక అవకాశంగా కనిపించింది. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నది అందుకే. ఆయనకు భిన్నంగా నెహ్రూ అన్ని రకాల ఫాసిస్ట్ శక్తులనూ వ్యతిరేకించే వైఖరి తీసుకున్నాడు.
బోస్ జర్మన్ సంబంధాలు
ఇదే సమయంలో బోస్ కలకత్తాలోని జర్మన్ కాన్సూల్ తో సంబంధం పెట్టుకుని ఏవో ఏర్పాట్లలో ఉన్నట్టు కేంద్ర గూఢచారి విభాగం వద్ద ఉన్న సమాచారాన్ని బొంబాయిలో న్యాయశాఖమంత్రిగా ఉన్న కె.ఎం. మున్షీ సంగ్రహించి గాంధీకి ఇచ్చాడు. ఇటలీ నియంత ముసోలినీపట్ల కూడా బోస్ ప్రశంసాభావంతో ఉన్నట్టు అప్పటికే ఆధారాలు కనిపించాయి. గాంధీకి ఇవి సహజంగానే కలవరం కలిగించాయి. హిట్లర్ కారణంగా యూరప్ మొత్తాన్ని యుద్ధ మేఘాలు ఆవరించడం, జర్మనీ-రష్యాల మధ్య సంధిజరగడం, హిట్లర్ సేనలు పోలండ్ లో అడుగుపెట్టడంతో జర్మనీతో బ్రిటన్ యుద్ధానికి దిగడం, భారతీయులు వేల సంఖ్యలో యుద్ధంలో చేరడం, 1941లో హిట్లర్ సోవియట్ యూనియన్ పై దాడి చేయగానే భారత్ లోని కమ్యూనిష్టులు కూడా బ్రిటన్ కు మద్దతు ఇవ్వడం వగైరా పరిణామాలు వరసగా జరిగిపోయాయి.
జపాన్ విస్తరణదాహం
ఇదే సమయంలో జర్మనీకి మిత్రరాజ్యంగా ఉన్న జపాన్, ఆసియా అంతటా కమ్ముకోవడం ప్రారంభించింది. చైనాపై దాడి చేసి, ఆ తర్వాత భారత్ లోకి కూడా చొచ్చుకువస్తున్నట్టు కనిపించింది. 1939-44 మధ్యకాలంలో జపాన్ విస్తరణదాహం మనదేశంలో పెద్ద చర్చనీయాంశంగా ఉంటూవచ్చింది. కాంగ్రెస్ సదస్సులలో తరచు ఇది చర్చలోకి రావడం, జపాన్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం, జపాన్ ను అహింసాయుతంగా ఎదుర్కోవాలని గాంధీ నొక్కి చెప్పడం జరుగుతూవచ్చాయి. 1942లో బ్రిటిష్ స్థావరమైన సింగపూర్ ను, రంగూన్ ను జపాన్ చేజిక్కుంచుకుని భారత్ గుమ్మంలోకి అడుగుపెట్టింది. బోస్ మద్దతుదారులు జపాన్ సేనలకు సహకరిస్తారన్న వదంతి గాంధీ చెవిన పడింది. జపాన్ కు వ్యతిరేకంగా అహింసాయుత ప్రతిఘటనను గాంధీ నొక్కిచెబితే; గెరిల్లా యుద్ధతంత్రాన్ని అనుసరించాలన్న వైఖరిని నెహ్రూ, కమ్యూనిష్టులు తీసుకున్నారు. తూర్పు బెంగాల్ మొదలైన చోట్ల భూదహనవిధానంతో జపాన్ సేనల్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. 
                                                                                (రేపు చివరి భాగం)
 

Sunday, September 27, 2015

సుభాష్ చంద్ర బోస్ వివాదం: చరిత్ర ఏం చెబుతోంది?

[27-9-2015, ఆదివారం సాక్షి దినపత్రిక ఫోకస్(10వ పేజీ)లో, 'బోస్ వివాదం...చరిత్ర ఏం చెబుతోంది?' అనే శీర్షికతో వచ్చిన  నా వ్యాసం ఇది. పెద్దది అవడంవల్ల మూడు భాగాలుగా బ్లాగ్ లో carry చేస్తున్నాను. మొత్తం వ్యాసాన్ని ఒకేసారి చదవదలచుకున్నవారు సాక్షిలో చదవచ్చు]

సుభాష్ చంద్రబోస్ విమానప్రమాదంలో నిజంగా మరణించారా అన్న చర్చ 1945 నుంచి ఇప్పటివరకూ మధ్య మధ్య తలెత్తుతూనే ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ చర్చ మరింత ఉధృతితో ముందుకొచ్చింది.  కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం, గాంధీ-నెహ్రూ వారసత్వాన్ని ప్రజల మనోఫలకం మీంచి పూర్తిగా తుడిచి పెట్టే ప్రయత్నాలు ఈ చర్చకు సరికొత్త రూపును, ఊపును ఇచ్చాయి. బోస్ దగ్గరి బంధువులు కొందరు గట్టిగా గళం విప్పారు. కేంద్రప్రభుత్వం వద్ద ఉన్న బోస్ తాలూకు రహస్యపత్రాలను బయటపెట్టాలన్న డిమాండ్ అలా ఉండగా, పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన వద్ద ఉన్న రహస్యపత్రాలను బయటపెట్టింది. నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాతి కాంగ్రెస్ ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ బంధువులపై, ఆయన నాయకత్వం వహించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యులపై నిఘా ఉంచిన సంగతిని అవి వెల్లడిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ పత్రాలలో ఏముందో వాటిని బయటపెడితే తప్ప తెలియదు. ఎన్నికలముందు వీటి వెల్లడికి హామీ ఇచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడంత ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినచ్చన్న వాదాన్ని సన్న సన్నగా వినిపిస్తోంది.
బోస్ మరణం లేదా అంతర్ధానం గురించి నడుస్తున్న చర్చమొత్తంలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. అది, నెహ్రూకు గురి పెట్టడం! నెహ్రూ, బోస్ ల మధ్య బద్ధశత్రుత్వం ఉండేదనీ, అధికారానికి తనతో బోస్ పోటీ పడతాడనే భయంతో నెహ్రూ ఆయన అడ్డు తొలగించుకునేందుకు కుట్ర చేశాడనే భావనను కలిగించే దిశగా చర్చ సాగుతోంది. నెహ్రూ కన్నా ఎక్కువ ప్రజాదరణ బోస్ కే ఉండేదనీ, బోస్ సజీవంగా దేశానికి తిరిగి వచ్చి ఉంటే నెహ్రూ అధికారపీఠం కదిలిపోయి ఉండేదనీ బోస్ బంధువులు కొందరు నొక్కి చెబుతున్నారు. ఇక మమతా బెనర్జీ బోస్ తాలూకు రహస్యపత్రాలను బయటపెట్టడం వెనుక బెంగాల్ ఆత్మగౌరవకోణాన్ని ఒడుపుగా వాడుకోవాలన్న ఆలోచన ఉండడంలో ఆశ్చర్యంలేదు.
అయితే, బోస్ ను నెహ్రూ తన అధికారానికి పోటీగా నిజంగానే భావించాడా; ఆయన కుట్రదారేనా అన్నది కచ్చితంగా తేల్చి చెప్పగల ఆధారాలు ఏవీ ఇంతవరకు మన ఎదురుగా లేవు. ఈ పరిస్థితిలో చర్చ మొత్తం కొన్ని కాంగ్రెసేతర పక్షాల రాజకీయ లక్ష్యాలూ, బోస్ బంధువుల భావోద్వేగ స్పందనల కలగలుపుగా మారి వాస్తవాలకు పూర్తిగా దూరమై ఊకదంపుడు చర్చగా పరిణమించే ప్రమాదం సహజంగానే ఉంటుంది. కనుక అటో ఇటో ఒరిగిపోవడం కాకుండా అసలు చరిత్ర ఏం చెబుతోందో తెలుసుకుని ఎవరికి వారు ఒక అభిప్రాయానికి రావడం ఒక మార్గం.  రాజ్ మోహన్ గాంధీ రాసిన గాంధీ జీవిత చరిత్ర మోహన్ దాస్ ఆధారంగా ఆ చరిత్ర ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
గాంధీ-బోస్
సుభాష్ చంద్ర బోస్ ది పాతికేళ్ళ(1920-1945) రాజకీయజీవితం. ఇందులో పద్దెనిమిదేళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నాడు. పటేల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి, కృపలానీ, అబుల్ కలామ్ ఆజాద్ లాంటి ఎందరో నాయకుల్లానే ఆయన కూడా మొదట్లో గాంధీ ప్రభావితుడే. సహాయనిరాకరణ సందర్భంలో స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెట్టాడు. గాంధీ ఆయనకు అప్పగించిన పని, మరో బెంగాల్ ప్రముఖ నాయకుడు చిత్తరంజన్ దాస్ కు కుడిభుజంగా ఉండడం. అయితే, గాంధీ అనుకూలుర శిబిరంలో బోస్ ఎప్పుడూ లేడు. 1923లో, మార్పుకు వ్యతిరేకులు(నో-ఛేంజర్స్), మార్పుకు అనుకూలురు(ప్రో-ఛేంజర్స్)గా కాంగ్రెస్ చీలిపోయినప్పుడు, గాంధీ మొగ్గు ఉన్న నో-ఛేంజర్స్ శిబిరంలో కాక, ప్రొ-ఛేంజర్స్ శిబిరంలో చేరి చట్టసభల్లో ప్రవేశాన్ని బోస్ సమర్ధించాడు.
బ్రిటిష్ పట్ల వైఖరిలో కూడా గాంధీ-బోస్ ల మధ్య విభేదాలున్నాయి. బ్రిటిష్ తో గాంధీది మిత్రవైరుధ్యమైతే బోస్ ది శత్రువైరుధ్యం. కాంగ్రెస్ చర్చల్లో, తీర్మానాల్లో గాంధీ కనబరిచే బ్రిటిష్ అనుకూల వైఖరులను బోస్ అడుగడుగునా అడ్డుకునేవాడు. అలాగే హింస-అహింసల విషయంలో కూడా అభిప్రాయభేదాలుండేవి. 1930లో వైస్రాయి ఇర్విన్ ప్రయాణిస్తున్న ప్రత్యేకరైలు కింద బాంబు పేలినప్పుడు దానిని ఖండించాలని గాంధీ ప్రతిపాదించగా బోస్ వ్యతిరేకించాడు. 1933లో శాసనోల్లంఘనకు పాల్పడి కాంగ్రెస్ ప్రముఖనేతలందరూ జైలుకెళ్లినప్పుడు, సర్దార్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ తో కలసి ఆస్ట్రియాలో ఉన్న బోస్, గాంధీ నాయకత్వం విఫలమైందంటూ అక్కడినుంచే ప్రకటన చేశాడు. అయితే, తనతో భావజాల విభేదాలున్న నెహ్రూతో అనుసరించినట్టే బోస్ తో కూడా గాంధీ సర్దుబాటు వైఖరిని అనుసరిస్తూ ఆయన కాంగ్రెస్ గొడుగు కింద కొనసాగేలా వీలైనంతవరకు జాగ్రత్తపడేవాడు. 
1936లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన లక్నో కాంగ్రెస్ సందర్భంలో వర్కింగ్ కమిటీ ఎంపిక బాధ్యతను తనకు అప్పగించినప్పుడు కొందరు సోషలిష్టు నాయకులతోపాటు బోస్ పేరును కూడా గాంధీ చేర్చాడు. 1938లో నెహ్రూ స్థానంలో ఎవరిని అధ్యక్షుని చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, పటేల్ గట్టిగా వ్యతిరేకించినాసరే బోస్ నే చేసితీరాలని గాంధీ పట్టుబట్టి నెగ్గించుకున్నాడు. అయితే, ఇంతకుముందు నెహ్రూ వరసగా రెండు విడతలు అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక, తనకు కూడా మరో విడత అవకాశమివ్వాలని బోస్ అన్నప్పుడు గాంధీ వ్యతిరేకించి, మొదట ఆజాద్ ను; ఆయన తప్పుకోవడంతో భోగరాజు పట్టాభి సీతారామయ్యను ముందుకు తెచ్చాడు. ఆ ఎన్నికలో బోస్ నెగ్గినప్పుడు ఖిన్నుడైన గాంధీ పట్టాభి ఓటమి నా ఓటమి అని ప్రకటించాడు. గాంధీ ఆ తర్వాత పటేల్, రాజగోపాలాచారి తదితరులను ప్రయోగించి బోస్ రాజీనామా చేసే పరిస్థితిని కల్పించాడు. బోస్ కాంగ్రెస్ జీవితానికి దానితో తెరపడింది. 1939లో బోస్ కు గాంధీ ఉత్తరం రాస్తూ, “ఇప్పుడు నా నుంచి నువ్వు దూరమైనా; నేను చేసింది న్యాయమూ, నా ప్రేమ స్వచ్ఛమూ అయితే ఎప్పటికైనా మళ్ళీ నా దగ్గరికి వస్తావు” అన్నాడు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు.
పటేల్-బోస్
మితవాదులుగా పటేల్, రాజగోపాలాచారిల మధ్య భావసారూప్యత ఉండేది. ఇద్దరూ నెహ్రూ, బోస్ ల సోషలిజాన్ని,  రాడికలిజాన్ని వ్యతిరేకించేవారు. ఆపైన బోస్ నిలకడలేని మనిషన్న అభిప్రాయం పటేల్ కు ఉండేది. పటేల్, రాజగోపాలాచారి మొదట్లో నో-ఛేంజర్స్ శిబిరంలో ఉంటే; ప్రో-ఛేంజర్స్లో శిబిరంలో మోతీలాల్, చిత్తరంజన్ దాస్, బోస్ లతోపాటు పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ ఉండేవాడు. బోస్ తో ఆస్ట్రియాలో ఉన్నప్పుడే విఠల్ భాయ్ కన్నుమూశాడు. తన అన్నను బోస్ తప్పుదారి పట్టించాడన్న కోపం పటేల్ కు ఉండేది. బోస్ ను కాంగ్రెస్ అధ్యక్షుని చేయాలన్న గాంధీ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించినా గాంధీ పట్టుబట్టడంతో ఎప్పటిలా శిరసావహించాడు. 
                                                                                                                                 (రేపు 2వ భాగం)

Friday, September 18, 2015

స్లీమన్ కథ-10: భారత్ ను చూసి భయపడ్డాడు!

భార్య ఎకతెరీనాతో అన్యోన్యక్షణాలు మళ్ళీ వెనకబెట్టాయి. ఎప్పటిలా ఎడమొహం, పెడమొహం. వాళ్ళ కాపురం చాలావరకూ భోజనం బల్లకు, ముక్తసరి మాటలకు పరిమితమవుతోంది. అయినా 1858లో రెండో సంతానం కలిగింది. ఈసారి ఆడపిల్ల, పేరు నతాల్య.  భార్యనుంచి దూరంగా పారిపోవాలన్న తహతహ ఆ ఏడాది వేసవిలో అతన్ని మరీ ఊపిరాడనివ్వకుండా చేసింది. మళ్ళీ సంచారానికి సిద్ధమయ్యాడు. ఈసారి తను చూడాలనుకున్న దేశాలన్నీ చూసిరావాలనుకున్నాడు.
( పూర్తి రచన  'భారత్ ను చూసి భయపడ్డాడు...' శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/09/18/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%AD%E0%B0%AF%E0%B0%AA%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-%E0%B0%9A/ లో చదవండి)

Sunday, September 13, 2015

స్లీమన్ కథ-9: విధ్వంసం అంచుల దాకా వెళ్ళాడు!

1854 శిశిరంలో ఏమ్ స్టడామ్ లో జరిగిన నీలిమందు వేలంలో పాల్గొని అతను రష్యాకు తిరిగొస్తున్నాడు. అప్పుడే క్రిమియా యుద్ధం బద్దలైంది. రష్యన్ రేవులను దిగ్బంధం చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరాల్సిన సరకును నౌకల్లో కోనిగ్స్ బర్గ్ కు, మేమల్ కు తరలించి అక్కడినుంచి భూమార్గంలో పంపిస్తున్నారు. ఏమ్ స్టడామ్ లో ఉన్న స్లీమన్ ఏజెంట్ నీలిమందు నింపిన వందలాది పెట్టెల్ని, భారీ పరిమాణంలో ఉన్న ఇతర సరకుల్ని నౌకలో మేమల్ కు పంపించాడు.
(పూర్తి రచన 'గ్రీకు మద్యం సేవించి మత్తెక్కిపోయాడు' శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/09/13/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A4%E0%B1%8D/ లో చదవండి)

Thursday, September 3, 2015

స్లీమన్ కథ-8: విషాదం మిగిల్చిన వివాహం

గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, అష్ట్రఖాన్ కాలర్ తో లాంగ్ కోటు, తార్తార్ తరహా మీసకట్టు, చేతిలో నల్లమద్దికర్రతో చేసిన బెత్తం…విజయశిఖరాలకు ఎగబాకిన ఒక వ్యాపారవేత్తకు ముమ్మూర్తులా సరిపోయే వేషం అతనిది!
[అష్ట్రఖాన్ కాలర్:  నైరుతి రష్యాలో, ఓల్గా డెల్టాలోని ఒక నగరం అష్త్రఖాన్. ఇక్కడి ‘కేరకుల్’ గొర్రెలు మంచి బిగువైన, వంకీలు తిరిగిన ఉన్నికి ప్రసిద్ధి. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉన్న గొర్రెనుంచి తీసిన ఉన్ని మరింత శ్రేష్ఠం.  పిండదశలో ఉన్నప్పుడే ఉన్ని తీయడమూ జరుగుతుంటుంది. అలాంటి ఉన్నితో చేసిన కాలర్ ను అష్ట్రఖాన్ కాలర్ అంటారు. ఆ కాలర్ తో కోటు ధరించడాన్ని సంపన్నవర్గాలు హోదాకు, ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తాయి]
(పూర్తి రచన  'వివాహం జరిగింది...విషాదం మిగిలింది' శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/09/03/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%82-%E0%B0%9C%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82-%E0%B0%AE/ లో చదవండి)

Thursday, August 27, 2015

స్లీమన్ కథ-7: పనామా అడవుల్లో పచ్చిమాంసం తింటూ...

అంత జాగ్రత్తపరుడూ ఓ పెద్ద తప్పు చేశాడు. బొత్తిగా ప్రయాణానికి అనువు కాని సమయంలో బయలుదేరాడు. విడవకుండా వర్షం పడుతూనే ఉంది.  మీ చావు మీరు చావండని మార్గదర్శకులు మధ్యలో వదిలేశారు. తిండి లేదు. ఉడుముజాతి తొండల్ని చంపీ, తుపాకులతో కోతుల్ని వేటాడి వాటి చర్మం ఒలిచీ పచ్చిమాంసం తిన్నారు. తేళ్ళు, పొడపాములు దాడి చేశాయి. స్లీమన్ కాలికి గాయమై కుళ్లుపట్టింది. దాంతో నరాల్ని మెలిపెట్టేస్తున్నంత నొప్పి. మందులూ, బ్యాండేజీ లేవు. ఇంకోవైపు, ఇండియన్లు ఏ క్షణంలోనైనా దాడి చేస్తారన్న భయం…
(పూర్తి రచన 'పనామా అడవుల్లో...పద్నాలుగు రోజుల నరకంలో...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/08/27/%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%85%E0%B0%A1%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%E0%B0%97 లో చదవండి)

Thursday, August 20, 2015

పనామా సీతాకోకచిలుకలు పావురాలంత!

స్లీమన్ ఓ రివాల్వర్ ను, పొడవాటి బాకును వెంటబెట్టుకుని వెళ్ళాడు. చాగరెస్ నదిలో మొసళ్ళను చూశాడు. అక్కడి సీతాకోకచిలుకలు పావురాలంత పెద్దవిగా ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. అక్కడి ఆదివాసుల గురించి కొంత వ్యంగ్యం మేళవిస్తూ ఇలా రాసుకొచ్చాడు:
పనామా జలసంధి ఓ సువిశాలమైన ఈడెన్. ఇక్కడి ఆదివాసులు అచ్చంగా ఆదమ్, ఈవ్ ల వారసులే. నగ్నంగా తిరుగుతూ, ఇక్కడ విస్తారంగా లభించే పండ్ల మీద ఆధారపడుతూ తమ పూర్వీకుల పద్ధతులను, ఆచారాలను పూర్తిగా పాటిస్తున్నారు. వీళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించేది దారుణమైన సోమరితనం. వేరే ఏ పనీ చేయకుండా ఉయ్యాలలో పడుకుని తింటూ, తాగుతూ గడుపుతారు. మొత్తానికి అద్భుతమైనవాళ్ళు.
(పూర్తి రచన 'అతని డైరీ రాతల్లో మానవ అనుభవాల పచ్చిదనం...' అనే శీర్షికతో http://magazine.saarangabooks.com/2015/08/20/%E0%B0%85%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A1%E0%B1%88%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5-%E0%B0%85%E0%B0%A8/ లో  చదవండి)

Friday, August 14, 2015

స్లీమాన్ కథ-5: పెళ్లి కూతురి వేటలో...

ఎకెతేరీనా అతనికి నచ్చకపోలేదు. ఆమెది కట్టి పడేసే అందమే. కానీ ఎటూ తేల్చుకోలేకపోయాడు. మెక్లంబర్గ్ లో ఉన్న సోదరికి ఉత్తరం రాశాడు. ఒకసారి రష్యా వచ్చి సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన దగ్గర కొన్ని వారాలు ఉండమనీ; ఆ తర్వాత నిన్ను మాస్కో తీసుకెడతాననీ, ఎకెతెరీనాను దగ్గరగా చూసి ఆమె ఎలాంటిదో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆమెకు వంట చేయడం వచ్చో రాదో తెలుసుకుని తనకు చెప్పాలనీ కోరాడు. “పెళ్లికూతుళ్ల కేం చాలామంది ఉన్నారు. వందలమందిలో తగిన అమ్మాయిని ఎంచుకోవడమే అసలు సమస్య. ఈ విషయంలో నీ సహాయం కావాలి. నాకు ఆడవాళ్ళలో గుణాలే కానీ లోపాలు కనిపించవు” అన్నాడు.

(పూర్తి రచన 'వ్యాపార శిఖరంపై...ఒంటరితనం లోయలో...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/08/14/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%96%E0%B0%B0%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8/ లో చదవండి)

Sunday, August 9, 2015

స్లీమన్ కథ-4: ఆరు వారాల్లో రష్యన్ నేర్చుకున్నాడు!

ఓడ మునిగిపోయి, చావు బతుకుల మధ్య వేలాడుతూ అతను హాలెండ్ తీరానికి కొట్టుకొచ్చి అప్పటికి నాలుగేళ్లే అయింది. ఇప్పుడతను పాతికేళ్ళ యువకుడు. ఏమ్ స్టడామ్ లో చెప్పుకోదగ్గ మిత్రులెవరూ లేరు. ఆ నగరాన్ని విడిచి వెడుతున్నందుకు అతనేమంత బాధపడలేదు.  మొదట కోచ్ లోనూ, తర్వాత మంచు మీద నడిచే స్లై బండి మీదా పదహారు రోజులపాటు ఒళ్ళు హూనమయ్యే ప్రయాణం చేసి, ప్రపంచంలోని అతి పెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన ‘బ్రదర్స్ ష్రోడర్’ కు ముఖ్యప్రతినిధిగా 1845 ఫిబ్రవరి 1న సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టాడు.

(పూర్తి రచన 'జోరుగా హుషారుగా జారిస్టు రష్యాలో...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/08/08/%E0%B0%9C%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B9%E0%B1%81%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/ లో చదవండి)

Thursday, July 30, 2015

స్లీమన్ కథ-3: ఏడాదిలో ఏడుభాషలు నేర్చాడు!

డొరోతియా 1841 నవంబర్ 28న హాంబర్గ్ లో బయలుదేరింది. అప్పటికి వాతావరణం బాగుంది. గాలి అనుకూలంగా వీస్తోంది.
హైన్ రిచ్ అంతవరకూ ఓడ ప్రయాణం చేసి ఎరగడు. ఓడ గురించి ఏమీ తెలియదు. ఓడలో పద్దెనిమిదిమంది సిబ్బంది; ముగ్గురే ప్రయాణికులు- హైన్ రిచ్, ఓ వడ్రంగి, అతని కొడుకు. అంత అనుకూల వాతావరణంలో కూడా సముద్రప్రయాణం అతనికి పడలేదు. మూడు రోజుల తర్వాత కక్సావెన్ అనే చోట స్వల్పకాలం ఓడకు లంగరేసారు. అప్పటికే అతను అస్వస్థతతో ఉన్నాడు. అక్కడినుంచి ఓడ బయలుదేరి ఉత్తర సముద్రంలోకి అడుగుపెట్టింది. రెండురోజులకే గాలివాన మొదలైంది. ఓడలోకి నీరు ఎక్కసాగింది. సిబ్బంది అదేపనిగా తోడిపొయ్యడం ప్రారంభించారు.
(పూర్తిరచన 'చావు తప్పి జీవనతీరానికి...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/07/30/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF-%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF/ లో చదవండి)

Friday, July 24, 2015

తాగుబోతు నోట హోమర్ కవిత్వం!

ఓ రోజు రాత్రి ఓ తాగుబోతు తూలుకుంటూ దుకాణానికి వచ్చాడు. చమురు దీపం ముందు నిలబడి హఠాత్తుగా హోమర్ నుంచి కొన్ని గ్రీకు పంక్తులు వల్లించడం ప్రారంభించాడు. హైన్ రిచ్ మంత్రముగ్ధుడై వింటూ ఉండిపోయాడు. అతను గ్రీకు చదవలేడు, అర్థంచేసుకోలేడు. కానీ ఆ భాషలోని లయ అతని హృదయతంత్రిని మీటింది. అలా ఆ తాగుబోతు వంద పంక్తులు పూర్తిచేశాడు. హైన్ రిచ్ మరోసారి …అప్పటికీ తనివి తీరక మూడోసారి అతని చేత వల్లింపజేసి విన్నాడు. సంతోషం పట్టలేక మూడు గ్లాసుల విస్కీ అతనికి ఉచితంగా తాగబొశాడు. దాని ఖరీదు, అంతవరకు తను పొదుపు చేసిన స్వల్పమొత్తంతో సమానం.

(పూర్తిరచన http://magazine.saarangabooks.com/2015/07/24/%E0%B0%AC%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%85%E0%B0%AF%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF/ లో చదవండి)

Wednesday, July 22, 2015

బాహుబలి!...అయ్యో రాజమౌళి!!

రాజమౌళి సినిమాల్లో మర్యాద రామన్న ఒకటే చూశాను. అది కూడా టీవీలో! ఉన్నత స్థాయికి చెందిన సృజనాత్మకత, జనరంజకత, విలక్షణత కలిగిన మంచి దర్శకు డనిపించింది. ఒకవిధంగా నేను రాజమౌళి అభిమానిని అయ్యాను. ఆయన నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయని ఆశపెట్టుకున్నాను.

బాహుబలి విషయానికి వస్తే, విడుదలకు ముందు దానికి ఇచ్చిన హైప్ ను రొటీన్ పబ్లిసిటీలో భాగంగా తీసుకుని పక్కన పెడితే, రాజమౌళి మీద నమ్మకంతో ఆ సినిమా అన్నివిధాలా గొప్పగానే ఉంటుందనుకున్నాను. తీరా చూశాక చాలా నిరాశ చెందాను. "అయ్యో, రాజమౌళి" అనిపించింది.

బాహుబలి కొన్ని విషయాల్లో గొప్ప సినిమాయే. ఉన్నత శ్రేణి సాంకేతిక విలువలతో, కెమెరా పనితనంతో, సెట్టింగ్ లతో అది హాలీవుడ్ సినిమాలను తలపించేలానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే  300 కోట్లు రాబట్టిందని వింటున్నాం. బాలీవుడ్ లో కూడా తన ఉనికిని చాటుకుని దేశవ్యాప్త ఆదరణను చూరగొందని కూడా సమాచారం. మంచిదే. అన్ని తరగతుల ప్రేక్షకులను ఔరా అనిపింపజేసే లక్షణాలు ఈ సినిమాకు ఉన్న మాట నిజమే. అయినాసరే నేను ఎందుకు నిరాశ చెందానంటారా? నా కారాణాలు ఇవీ:

1. బాహుబలి పైన చెప్పిన విషయాలలో గొప్ప సినిమాయే కానీ, కథాబలిమి ఏదీ? అది సీరియెల్ సినిమా కావడంలో నాకు ఎలాంటి అభ్యంతరం కనిపించలేదు. కానీ దానిని సీరియెల్ గా తీయదగినంత కథ ఏదీ? కథాబలం ఏదీ?

2. అది  కూడా కల్పిత కథ కావడం నన్ను నిరాశ పరచడమే కాక, చాలా ఉసూరు మనిపింపజేసింది. ఓ చందమామ తరహా కల్పిత కథ తీయడానికి అంత గొప్ప సాంకేతిక విలువలతో,అన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి హాలీవుడ్ తరహాలో సినిమా తీయాలా? అదే ఏ చారిత్రక కథనో, ఇతిహాసకథనో తీయడానికి ఇన్ని వనరులూ వెచ్చిస్తే ఇది చిరకాలం నిలిచిపోయే చిత్రం అయుండేది. జనం ఆ కథతో ఐడెంటిఫై అయ్యే వారు. రాజమౌళి పేరు చిరస్థాయి అయ్యేది. హాలీవుడ్ లో వచ్చిన అలాంటి సినిమాలను గుర్తుచేసుకుని చూడండి...నా అభిప్రాయంతో మీరు కూడా తప్పకుండా ఏకీభవిస్తారు. మనకు ఆ స్థాయి కలిగిన చారిత్రక/ఐతిహాసిక సినిమా లేని లోటు తీరేది. అలాంటి మరిన్ని సినిమాలకు గొప్ప ఒరవడి అయ్యేది.

3. రాజమౌళి మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు కనుక సినిమా అంతటా అది కనిపిస్తుందని ఆశ పడ్డాను. అక్కడా నిరాశే ఎదురైంది. నాకు సినిమా అంతటా పెద్ద పెద్ద శబ్దాలతో సౌండ్ ట్రాకే కొట్టొచ్చినట్టు వినిపించింది. మంచి ఒడ్డూ పొడవూ ఉన్న ప్రభాస్, రాణాల విగ్రహాలే కనిపించాయి. వాళ్ళ మెలితిరిగిన కండలే కనిపించాయి. ప్రభాస్ వేసిన గెంతులే కనిపించాయి. కత్తి శబ్దాలే వినిపించాయి. అన్నీ వినిపించి కనిపించాయి కానీ రాజమౌళి కనిపించలేదు. రాజమౌళి ఎక్కడ పొరపాటు పడ్డారో అర్థం కాలేదు. నా ఉద్దేశంలో రాజమౌళి కాసులు కురిస్తే చాలని సరిపెట్టుకునే దర్శకుడు కాదు. ఒక సృజనశీలిగా తనకు, తన లాంటి వారికి కూడా సినిమా సంతృప్తి కలిగించాలని భావించే దర్శకుడు. కానీ ఈ సినిమా ఆ అవగాహనకు తులతూగేలా లేదు. ఎక్కడో ఎందుకో ఆయన దారి తప్పారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇలా దారి తప్పకూడదు.

4. ఆర్థికంగా సాంకేతికంగా సాధించిన ఈ సక్సెస్ ను అడ్డుపెట్టుకుని రాజమౌళి ఈసారి చారిత్రక లేదా ఇతిహాస కథా వస్తువుతో ముందుకు రావాలి. మహాభారతం సినిమాగా తీద్దామని తన కోరిక అన్నట్టు ఆయన చెప్పారు. తప్ప కుండా తీయాలి. రాజమౌళి ముద్రతో అది తప్పకుండా విలక్షణంగా ఉంటుంది. బాహుబలి రికార్డ్ ను బద్దలు కొడుతుంది. 

Saturday, July 18, 2015

స్లీమన్ కథ: ఏడేళ్ళ వయసులోనే ప్రేమలో పడ్డాడు!

అతను ప్రతిచోటా దెయ్యాలు ఉన్న్తట్టు ఊహించుకునేవాడు. ప్రతి సందు మలుపులో ఏదో భయోత్పాతం కాచుకుని ఉన్నట్టు అనుకునేవాడు. రాత్రిపూట విచిత్రమైన గుసగుసలు వినిపిస్తున్నట్టు, తోటలో దీపాలు కదిలి వెడుతున్నట్టు, హోస్టీన్ భూతం కోటలోంచి కిందికి దిగి వస్తున్నట్టు భావించుకునేవాడు. చెట్ల మీదా, బెంచీల మీదా, కిటికీ రెక్కల మీదా, చర్చి గోడల మీదా తన పేరు రాసి, ఉనికిని చాటుకునే అలవాటు అతనికి ఉండేది. యాభై ఏళ్ల తర్వాత అతను ఆ ఊరు వెళ్లినప్పుడు, చిన్నతనంలో చర్చి తోటలోని నిమ్మచెట్టు మీద తను చెక్కిన పేరు ఉందా లేదా అని చూసుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పేరు అలాగే ఉంది!

Thursday, July 9, 2015

స్లీమన్: అతను తవ్వినదంతా బంగారం

ఇలియడ్ కథాస్థలి అయిన ట్రాయ్ లో, మైసీనియాలో తవ్వకాలు జరిపించి పురాచరిత్ర తాలూకు అద్భుత నిధి నిక్షేపాలను వెలికి తీసిన వ్యక్తిగా స్లీమన్(1822-1890) ప్రపంచప్రసిద్ధుడు. విచిత్రమైన మలుపులతో గొప్ప నాటకీయతను పండిస్తూ సాగిన అతని జీవితం కూడా అంతే అద్భుతం. ఆపైన అతని వ్యక్తిత్వంలోనూ, వృత్తిప్రవృత్తులలోనూ ఊహకందని  వైరుధ్యాలు. అవన్నీ కలసి ఒక ఆసక్తికరమైన ఒక ‘టైపు’గా కూడా అతణ్ణి మనకు పరిచయం చేస్తాయి.

THE GOLD OF TROY  పేరుతో ROBERT PAYNE  చేసిన రచన ఆధారంగా  చెప్పబోయే స్లీమన్ జీవితగాథతో అతిత్వరలోనే ‘పురా’గమనం తిరిగి కొనసాగుతుంది…
('స్లీమన్ కథ: అతను తవ్వినదంతా బంగారం' అనే శీర్షికతో పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/07/09/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B0%A5-%E0%B0% 85%E0%B0%A4%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A4%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A6%E0%B0%82/ లో చదవండి)


Wednesday, July 8, 2015

కుంభకోణాలు-'అధికారప్రతినిధు'ల మురికి స్నానాలు!

2జీ...కామన్వెల్త్ క్రీడలు...ఆదర్శ్ గృహాలు...బొగ్గు...
ఇవి యూపీఏ కుంభకోణాల రికార్డ్.

లలిత్ గేట్-సుష్మాస్వరాజ్ ఎపిసోడ్...లలిత్ గేట్-వసుంధరా రాజె ఎపిసోడ్...వ్యాపమ్,,,
ఇవి ఎన్డీయే కుంభకోణాల రికార్డ్.

పాలకులు మారినా కుంభకోణాల చరిత్ర భలే పునరావృతం అవుతోంది.

మీడియా ముందుకు వచ్చి తమ పార్టీ/ప్రభుత్వాలపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడంలో పార్టీ/ప్రభుత్వ అధికార ప్రతినిధులు పడుతున్న అవస్థ కూడా అంతే పసందుగా పునరావృతమవుతోంది.

కుంభకోణాలను, ఆరోపణ ప్రత్యారోపణలను కాసేపు పక్కన పెడితే; స్పష్టంగా తప్పులుగా కనిపిస్తున్నవాటిని కూడా ఒప్పులుగా చిత్రించడానికి, తిమ్మిని బమ్మి చేయడానికి అధికారప్రతినిధులు పడే అవస్థ ఎప్పుడూ జాలి గొలుపుతూనే ఉంటుంది, అయ్యో అనిపింపజేస్తూనే ఉంటుంది. అంతఃకరణను చంపుకుని పార్టీ/ప్రభుత్వ అధికారప్రతినిధిగా వ్యవహరించడానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారో అనిపిస్తుంది. అది స్వచ్చందంగా విధించుకునే శిక్ష. 'ఆత్మ' హత్యలు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. పార్టీ/ప్రభుత్వ అధికారప్రతినిధి కావడమంటే ;అంతరాత్మ'హత్యకు పాల్పడడమే. అందులోనూ  రకరకాల కుంభకోణాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు అధికార ప్రతినిధులు మీడియా ముందుకు రావాలంటే సిగ్గెగ్గులను, ఉచితానుచితాలను, రీజనింగును-అన్నింటినీ వదులుకుని రావలసిందే. అది బహిరంగంగా జరుపుకునే హరాకిరి.

ఆరోపణలకు మూలమైనవారు రాజభోగాలను అనుభవిస్తూ తెరవెనుక బాగానే ఉంటారు. అధికారప్రతినిధులు మాత్రం అభిమానం, సిగ్గు, అంతఃకరణ చంపుకుని జనం ముందుకు వచ్చి తెరవెనుక శక్తులు సృష్టించిన మురికి కాలువలో  మునకలు వేస్తూ ఇంత రోతను, హాస్యాన్ని పండిస్తూ ఉంటారు. పైగా ఇవి ఒక రోజో ఒక నెలో కాదు; అయిదేళ్లపాటు చేయవలసిన మురికిస్నానాలు!

వ్యక్తిత్వాన్ని చంపుకుని ఇంత కంఠశోష ఎందుకంటే పోలిటికల్ కెరీర్ కోసం. అదృష్టం కలిసొస్తే ఏ శాసనమండలి సభ్యత్వమో, రాజ్యసభ సభ్యత్వమో దొరుకుతుంది. అందుకోసం ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాలన్నమాట.


Sunday, June 21, 2015

రాముడు నిజమా, కల్పనా...?

రాముడు నిజమా, కల్పనా; చారిత్రక పురుషుడా, పురాణపురుషుడా; నరుడా, దేవుడా…అని అడిగితే ఏదో ఒకటి తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే, రాముడి వీటిలో అన్నీనూ. దశరథుడనే రాజుకు రాముడనే కొడుకు పుట్టడం, తండ్రి ఆదేశం మీద ఆయన అరణ్యవాసం చేయడం, రావణుడనే వాడు ఆయన భార్యను ఎత్తుకుపోవడం, ఆయన రావణుని చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం నిజం కావడం అసాధ్యమూ కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. దాంతోపాటు నిజం కావడానికి అవకాశం లేని అద్భుతాలు, అతిశయోక్తులు ఆయన కథలో అనేకం ఉన్నాయి. 

('నరు'ని అవతారణా ప్రపంచీకరణలో భాగమే' అనే శీర్షికతో  పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/06/20/%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%85%E0%B0%B5%E0%B0%A4%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B1%80%E0%B0%95%E0%B0%B0/ లో చదవండి)

Saturday, June 20, 2015

మౌని మోహన్ లానే నరేంద్ర 'మౌని'!

2009లో యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి కొంచెం ముందే 2జీ ఆరోపణలు బయటికి వచ్చాయి. మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. ఆ తర్వాత ఏడాదిలోనే కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఆరోపణలు వచ్చి చూస్తూండగానే ఉధృతమై ప్రభుత్వానికి చెమటలు పట్టించడం ప్రారంభించాయి. అందులో ప్రతిపక్షం కన్నా మీడియాయే ప్రధానపాత్ర పోషించింది. అలా యూపీఏ రెండో విడత తొలి ఏడాదిలోనే ప్రభుత్వంలో చావుకళ కనిపించింది.  అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. ఆ తర్వాత 2జీ ఆరోపణలు పుంజుకుని 'కామన్వెల్త్' తోపాటు కలసి మండడం ప్రారంభించాయి. అప్పుడు కూడా చాలా రోజుల తర్వాత కానీ మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. అవి కూడా రాజా ఏ తప్పూ చేయలేదన్న సమర్ధింపు మాటలు. ఆ తర్వాత ఆదర్శ్ గృహకుంభకోణం, 2జీపై కాగ్ నివేదిక వరసగా వచ్చాయి. అక్కడినుంచి రాజీనామాలు మొదలయ్యాయి. 2010 అంతా యూపీఏ చరిత్రలో కుంభకోణాల సంవత్సరం. సరే, 2012లో బొగ్గు కుంభకోణం...మొత్తానికి కామన్వెల్త్ తో మొదలుపెట్టి మిగిలిన ఆ నాలుగేళ్ల కాలమూ యూపీఏ గుక్క తిప్పుకోలేకపోయింది. చివరగా అనివార్యమైన అధికారచ్యుతి...

ఇదంతా ఎందుకంటే, ఎన్డీయే ప్రభుత్వం వచ్చి ఏడాది గడవగానే ఇద్దరు ముఖ్య నేతలపై అనౌచిత్యం, ఆశ్రితపక్షపాతం, అవినీతి సంబంధమైన ఆరోపణలు వచ్చాయి. అయినా మన్మోహన్ సింగ్ లానే నరేంద్ర మోడీ మాట్లాడడం లేదు...

ముందుగా సుష్మా స్వరాజ్ విషయం చూద్దాం. ఆమె పార్టీలో సీనియర్ నాయకురాలే కాక, మంత్రిగా అనుభవం ఉన్నవారు. ప్రధాని పదవికి అభ్యర్ధుల జాబితాలో ఆమె పేరు కూడా గతంలో వినిపించింది. మంత్రిగా పాటించవలసిన విధివిధానాలు ఆమెకు తెలియకపోయే అవకాశం లేదు. కానీ ఆర్ధిక నేరాల నిందితుడైన లలిత్ మోడీ విషయంలో వ్యవహరించిన తీరులో ఆమె సుదీర్ఘ రాజకీయ అనుభవం కానీ, మంత్రిత్వ అనుభవం కానీ ఏమైనా వ్యక్తమవుతున్నాయా?

లలిత్ మోడీ నుంచి మానవతాదృష్టితో పరిశీలించవలసిన అభ్యర్ధన వచ్చిందే అనుకుందాం. మంత్రికి వచ్చిన ఏ అభ్యర్ధన అయినా కింది ఉద్యోగులు, అధికారుల స్థాయిలో పరిశీలన జరిగి, వారి సిఫార్సులతో మంత్రి దగ్గరకు వస్తుంది. అప్పుడు మంత్రి తన ఆమోదముద్రో, అనామోద ముద్రో వేస్తారు. ఏ నిర్ణయమైనా రేపు సమాధానం చెప్పుకోడానికి వీలుగానూ,  పారదర్శకంగానూ  జరుగుతుంది. జరగాలి. అందులోనూ లలిత్ మోడీ వంటి నిందితుల విషయంలో మరింత పారదర్శకంగా జరగాలి. పైగా మంత్రికి లలిత్ మోడీతో వ్యక్తిగత పరిచయం ఉన్నప్పుడు; ఆమె భర్త, ఆమె కుమార్తె లలిత్ మోడీకి న్యాయవాదులు అయినప్పుడు పద్ధతిగానూ, పారదర్శకంగానూ జరగడం మరింత అవసరం. సీనియర్ రాజకీయ నేతే కాక, విదేశాంగమంత్రి వంటి కీలకపదవిలో ఉన్న సుష్మాస్వరాజ్ ఇలాంటి పద్ధతులను, ఔచిత్యాలను పాటించకపోవడం ఆశ్చర్యమే. ప్రధాన ప్రశ్నల్లా పద్ధతులు, ఔచిత్యాలను పాటించకపోవడం గురించే. అధికారంలో ఉన్నవారు సక్రమంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరిస్తున్నట్టు కనిపించడమూ అవసరమే. అది ప్రాథమిక పాఠం. అటువంటిది, ఆ విషయం గురించి మాట్లాడకుండా ఆమె జాతీయతావాదిఅనీ, దేశభక్తురాలనీ, ఆమె ఏ తప్పూ చేయలేదనీ పార్టీయే కాక స్వయంగా ఆర్ ఎస్ ఎస్ రంగంలోకి దిగి వెనకేసుకు రావడం ఆ సంస్థ గురించి ఎలాంటి అభిప్రాయం కలిగిస్తుంది? ఆ సంస్థ ఏ విలువలకోసం నిలబడిందనుకుంటాం?

ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై వచ్చిన ఆరోపణలు మరింత తీవ్రం. అందులో ఆర్ధిక కోణం కూడా ఉంది.

యూపీఏ ప్రభుత్వం పై వచ్చిన అవినీతి ఆరోపణలకు, సుష్మా స్వరాజ్ పై వచ్చిన ఆరోపణలకు స్వభావంలో తేడా ఉంది. యూపీఏ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవే, సందేహం లేదు. అయితే అవి ఆర్థిక అవినీతికి, విధానశుద్ధికి సంబంధించినవి. సుష్మాపై వచ్చినవి మౌలిక పాలనా స్వభావానికీ, ఔచిత్యానికీ సంబంధించినవి. ఆర్థిక అవినీతికన్నా పాలనా ధర్మానికీ, ఔచిత్యానికీ జరిగే హాని ఎక్కువ తీవ్రమైనది, ఎక్కువ ప్రమాదకరమైనది. దానికి సుదూరప్రభావం ఉంటుంది. అది ఒక ఒరవడి అయి రాబోయే తరాలను చెడగొడుతుంది. ఇంకో తేడా కూడా ఉంది. యూపీఏ డిఫెన్స్ ను అనుసరిస్తే ఎన్డీయే అఫెన్స్ ను అనుసరిస్తోంది.  ఇది కూడా పైన చెప్పిన సుదూరప్రభావం చూపే ప్రమాదకరధోరణే.


Thursday, June 11, 2015

మన వ్యాసుడు, గ్రీకుల హోమర్...కొన్ని పోలికలు

తూర్పు, పడమరల మధ్య ఆశ్చర్యకరమైన అనేక పోలికల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే…
భాగవతం ప్రకారం; అపారమైన రక్తపాతం, విధ్వంసం నిండిన మహాభారతాన్ని చెప్పిన తర్వాత వ్యాసుడు తీవ్ర మానసిక అశాంతికి లోనయ్యాడు. అప్పుడు నారదుడు ఆయన దగ్గరకు వచ్చి విష్ణుభక్తి ప్రధానమైన భాగవతాన్ని చెప్పమనీ, అప్పుడు నీ మనసుకు శాంతి కలుగుతుందనీ చెప్పాడు. వ్యాసుడు అలాగే చేసి శాంతి పొందాడు.
గ్రీకుల హోమర్ కూడా మొదట యుద్ధ ప్రధానమైన ‘ఇలియడ్’ ఇతిహాసాన్ని చెప్పాడు. ఆ తర్వాత తత్వ ప్రధానమైన ‘ఒడిస్సే’ చెప్పాడు.

('రాముడు, ఒడిసస్... ఇద్దరూ సౌరవీరులే' అనే శీర్షికతో పూర్తి వ్యాసం  http://magazine.saarangabooks.com/2015/06/11/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%93%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%B0%E0%B1%82-%E0%B0%B8%E0%B1%8C%E0%B0%B0/ లో చదవండి)

Monday, June 8, 2015

తెలుగు రాజకీయాలు కంపరం పుట్టిస్తున్నాయి

ఆంధ్ర, తెలంగాణ రాజకీయనాయకత్వాల మధ్య కలహాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?

నాకైతే చాలా కంపరం కలుగుతోంది. మొత్తం తెలుగు ప్రజల బాగోగుల గురించి భయం కలుగుతోంది. అసలు నష్టం విభజన వల్ల కాక ఈ రెండు రాష్ట్రాల రాజకీయనాయకత్వాల కలహాల వల్లనే ననిపిస్తోంది. కలహాలు ఉండచ్చు. ఉండడం సహజమే. కానీ అవి ఉండవలసిన స్థాయిలో ఉండాలి. వాటికి ప్రజాప్రయోజనం ప్రాతిపదిక కావాలి. అవి క్రమంగా సమన్వయానికి రాజీకీ దారి తీసేలా ఉండాలి.  కానీ ఇప్పుడు చూస్తున్న కలహాలు అలా లేవు. అవి మరీ నేలబారుగా అసహ్యంగా ఉన్నాయి. పూర్తిగా రాజకీయ కశ్మలంతో నిండి ఉన్నాయి. ఇవి అంతమయ్యేలా లేవు. సమన్వయానికి, ప్రజాహితమే లక్ష్యంగా రాజీకి అవకాశం ఉన్నట్టే కనిపించడం లేదు.

విభజనకు బాధపడని వారు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. నిన్నటి పెద్ద రాష్ట్రం రెండుగా చీలి పరిమాణంలో చిన్న ముక్కలు అయినట్టే, రాజకీయాలలో కూడా మరుగుజ్జు అయిందా అనిపిస్తోంది. ఈ పతనం ఇక్కడితో ఆగదనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల దృష్టిలో తెలుగువాళ్లు అందరూ సామూహికంగా చులకన అవుతున్నారు. ఈ అధోగతిని ఆపె శక్తులు ఏవైపునా కనిపించకపోవడం మరుగుజ్జు తనానికి మరో దాఖలా!

Thursday, June 4, 2015

మన దేవాలయాల నమూనా సిరియా నుంచి వచ్చింది!

మెసొపొటేమియాలో దక్షిణంగా ఒబెయిద్(Obeid), ఉరుక్(Uruk), ఎరిడు(Eridu) అనే చోట్లా; మెసొపొటేమియాలోనే నేటి బాగ్దాద్ కు ఉత్తరంగా ఉన్న ఖఫజా(Khafajah), దక్షిణంగా ఉన్న ఉకైర్(Uqair) అనే చోట్లా; మెసొపొటేమియాకు దూరంగా తూర్పు సిరియాలో టెల్ బ్రాక్(Tel Brak) అనే చోటా జరిపిన తవ్వకాలలో మొత్తం ఆరు దేవాలయ సముదాయాలు బయటపడ్డాయి. ఇవి ఉజ్జాయింపుగా క్రీ. పూ. 4000-3500 ఏళ్ల నాటివని నిర్ణయించారు. సిరియాలో పుట్టిన మూలరూపమే ఇతర ప్రాంతాలకు విస్తరించినట్టు టెల్ బ్రాక్ ఆలయసముదాయం సూచిస్తోంది.

('నీలగిరి తోదాలు...చరిత్ర విడిచిన ఖాళీలు' అనే శీర్షికతో పూర్తివ్యాసం  http://magazine.saarangabooks.com/2015/06/04/%E0%B0%A8%E0%B1%80%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%BF/ లో చదవండి)

Friday, May 29, 2015

వందేళ్ల క్రితం వరకు అశోకుడి గురించి మనకు తెలియదు!

కొన్ని వాస్తవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, చరిత్రకు తెలిసినంతవరకు ఇంచుమించు భారతదేశం మొత్తాన్ని ఏలిన తొలి రాజు అశోకుడి గురించి వందేళ్ల క్రితం వరకూ మనకు స్పష్టంగా తెలియకపోవడమే చూడండి. ఒక పాశ్చాత్య శాసన పరిశోధకుడు బయటపెట్టిన ఆధారాన్నిబట్టి  ప్రాచీన సింహళ పత్రాలను గాలించిన తర్వాతే అశోకుడు అనే గొప్ప రాజు  గురించి నికరంగా మనకు తెలిసింది. 

('చరిత్ర, అచరిత్రల మద్య మనం' అనే శీర్షికగల పూర్తివ్యాసం  http://magazine.saarangabooks.com/2015/05/28/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%85%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%82/ లో చదవండి)

Saturday, May 23, 2015

శృంగార రసం ఎలా పుట్టింది?

ఏ కన్య అయినా గణపతి శృంగారసామర్థ్యం మీద పెదవి విరిస్తే, గణకన్య లందరూ అతన్ని చుట్టుముట్టి మెడలో వేసిన పూలమాలలు పీకి పారేస్తారు. కిరీటం తీసేసి కొమ్ములు విరుస్తారు. ‘అవమానించడం’ అనే అర్థంలో ‘శృంగభంగం’ అనే మాటకు ఇదే మూలం కావచ్చు. గణదాయీలు అడ్డుపడకపోతే అతని ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ గణపతి ఆచారాలు నిన్నమొన్నటి వరకూ చాలా తండాలలో ఉండేవి. మన సాహిత్యంలో రసరాజు అయిన శృంగారం పుట్టిన వైనం ఇదీ. శృంగారంతోపాటు హాస్యకరుణలు కూడా గణపతి నుంచే పుట్టాయి. 
('గణపతి కొమ్ము కిరీటం చెప్పే శృంగారగాథ' అనే శీర్షికతో పూర్తి వ్యాసం http://magazine.saarangabooks.com/2015/05/21/%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81-%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B1%80%E0%B0%9F%E0%B0%82-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D/ లో చదవండి)

Thursday, May 14, 2015

సుమేరు దేవుడు 'అంకి' వెంకటేశ్వరుడు అయ్యాడా?!

ప్రాచీన సుమేరు పురాణ కథలో ‘అన్’ అంటే స్వర్గం. ‘కి’ అంటే భూమి. దానినే స్త్రీ పురుషులకు అన్వయిస్తే, స్వర్గం పురుషుడు. భూమి స్త్రీ. వీరు మొదట అవిభాజ్యంగా ‘అంకి’ అనే పర్వతరూపంలో ఉన్నారు. ఆ తర్వాత ‘ఎన్ లిల్’ అనే కొడుకు పుట్టి వీరిని రెండుగా విడదీశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం చెప్పుకుని మిగతా వివరాలలోకి తర్వాత వెడదాం. అదేమిటంటే, ఈ సుమేరు ‘అంకి’ నుంచే ‘ఎంకి’, ‘వెంకి’, ‘వెంకటేశ్వరుడు’ అవతరించాడని రాంభట్ల అంటారు.

('సుమేరులోనూ ఉన్నాడు శివుడు' అనే శీర్షికతో పూర్తివ్యాసం  http://magazine.saarangabooks.com/2015/05/14/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AE%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B1%82-%E0%B0%89%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1/ లో చదవండి)

Saturday, May 9, 2015

సల్మాన్ ముందు న్యాయం ధర్మాలు గులాం!

ఇంతకుముందు సంజయ్ దత్ కేసు చూశాం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసు చూశాం. కొత్తేమీలేదు. సంజయ్ దత్ కు శిక్ష పడినందుకు బాలీవుడ్ అంతా పడిపడి ఏడిచింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు శిక్షపడినందుకు గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది.

రెండు కేసుల్లోనూ కోర్టులు, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థా వ్యవహరించిన తీరులో కూడా కొత్తేమీ లేదు. సంజయ్ దత్ కు మాటి మాటికీ పెరోల్ లభించింది. సల్మాన్ ఖాన్ కు గంటల్లో బెయిల్ లభించింది.

కానీ ఈసారి ఒక కొత్తదనం ఉన్నట్టు కనిపించింది. సల్మాన్ కు శిక్షపై కొంతమంది-కొంతమందే ఏమిటి ఎక్కువమందే-స్పందన చూసిన తర్వాత నాకు ఈ దేశాన్ని తలచుకుని కొత్తగా భయం కలిగింది. ఈ దేశం ఏమైపోతోంది, ఎటుపోతోందనిపించి బెంగ కలిగింది. ఇది మనకు తెలిసిన, ఇంతవరకు మన ఊహలో ఉన్న దేశం కాదనిపించింది.

గత మూడు నాలుగురోజులుగా సల్మాన్ పై వ్యక్తమవుతున్న స్పందన నాకు కలిగించిన అభిప్రాయం ఒక్కటే: సల్మాన్ ఈ దేశంలోని చట్టాల కన్నా, రాజ్యాంగం కన్నా, న్యాయవ్యవస్థ కన్నా, సమన్యాయం, సమాన నీతి, సమధర్మం మొదలైన భావనల కన్నా, మరి దేనికన్నా కూడా గొప్పవాడు! సల్మాన్ ఖాన్ అనే గొప్పవాడికి అనుగుణంగా అవి నడుచుకోవాలే తప్ప, సల్మాన్ ఖాన్ అనే గొప్పవాడు వాటి ప్రకారం నడచుకోడు!

ఇవాళ సల్మాన్ ఖాన్ అయ్యాడు. రేపు అతన్ని తల దన్నేవాడు ఇంకొకడు అవుతాడు. అతడు ఎంత పెద్ద  నేరం చేసినా సరే, అతని గొప్పతనాన్ని, అతని దాతృత్వాన్ని, మంచి తనాన్ని, సెలెబ్రటి లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి కానీ అతని నేరాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకూడదు. ఇదీ ఇందులోని సారాంశం.

సల్మాన్ వ్యవహారంలో కొత్తదనం ఏమీ లేదని అంటూనే కొత్తగా భయం కలిగిందని ఎందుకన్నారనే సందేహం మీకు కలగచ్చు. అందులోకే వస్తున్నాను.

వ్యవస్థ సామాన్యుడి పట్ల ఒక నీతినీ, సెలెబ్రటిపట్ల ఇంకో నీతినీ పాటించడం ముందునుంచీ ఉన్నదే. కానీ ఇప్పుడు సల్మాన్ సందర్భంలో కొత్తగా చూస్తున్నదేమిటంటే, దానిని బాలీవుడ్ కు చెందినవాళ్లే కాక, లాయర్లు, ఇతరులూ కూడా నిస్సిగ్గుగా సమర్థించుకోవడం. డబ్బున్నవాడు ఆ డబ్బుతో న్యాయవ్యవస్థలోని వెసులుబాట్లను కొనుక్కోగలగడంలో సత్వర న్యాయం పొందడంలో తప్పేమిటనీ; డబ్బులేనివాడు కొనుక్కోలేక న్యాయం పొందలేకపోవడంలో వింత ఏమిటనీ ప్రశ్నిస్తూ అది అంతే నన్నట్లుగా మాట్లాడడం.

అదీ కొత్తగా భయపెట్టే విషయం.

వ్యవస్థ సామాన్యుడి పక్షం వహించకపోయినా కనీసం ఇంతవరకు పైకి అయినా సామాన్యుడి పక్షం వహించడం అనే పోలిటికల్ కరెక్ట్ నెస్ ను పాటించేవారు. ఇప్పుడు ఆ చిన్న సిగ్గు బిళ్ళ కూడా తీసేస్తున్నారు. అదీ కొత్తగా భయపెడుతున్న విషయం.

ఇంకా కావాలంటే ఈ దారుణం చూడండి...ముంబైకి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు ఈ మూడునాలుగు రోజులుగా అక్షరాలా సల్మాన్ ప్రతినిధి అయిపోయారు!

అంటే, పోలిటికల్ కరెక్ట్ నెస్ ను కూడా కరెక్టు చేసుకోవలసిన రోజులు వచ్చాయన్నమాట. కొత్తగా భయపెడుతున్నది అదే. మొదట్లో అలాగే ఉంటుంది లెండి, క్రమంగా అలవాటుపడిపోతారంటారా...అలవాటు పడక చేసేదేముంది?!