(అక్టోబర్ 2, 2015 గాంధీ జయంతి రోజున ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన నా వ్యాసం)
స్వతంత్రభారతంలో పుట్టినవాళ్ళు గాంధీ శిలా విగ్రహాలు,
గాంధీ చౌక్ లు, గాంధీ నగర్లు, గాంధీ జయంతులు, గాంధీ వర్ధంతుల మధ్య పెరిగారు. అవి లేని భారతదేశాన్ని వాళ్ళు ఊహించలేరు.
అలాగే వాళ్ళలో చాలామందికి ఇప్పుడవి పెద్దగా స్పందనా కలిగించవు. కానీ, చరిత్ర కోణం నుంచి చూస్తే ఈ గాంధీ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ‘గాంధీ భారతం’ జరుపుకుంటున్న శతజయంతివత్సరంలో వచ్చిన గాంధీ పుట్టినరోజు. గాంధీ సరిగ్గా వందేళ్ల క్రితం, 1915లో, తన నలభై ఆరో ఏట దక్షిణాఫ్రికానుంచి భారత్
కు శాశ్వతంగా తిరిగివచ్చాడు. వస్తూనే భారత రాజకీయ, సామాజిక
కార్యక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టాడు. అప్పటినుంచీ 1948లో హత్యకు గురయ్యేవరకూ
వంచిన నడుము ఎత్తకుండా నిర్విరామంగా పనిచేశాడు. 1948 తర్వాత కూడా శిలావిగ్రహాలు, స్థలనామాలు, స్మారకనిర్మాణాలు వగైరాల రూపంలో దేశంలో
మూల మూలలకు వ్యాపించిపోయాడు. మంచికీ, చెడ్డకూ; ఆరాధనకూ, ద్వేషానికీ అన్నింటికీ తనే లక్ష్యంగా
మారాడు. కానీ ఇప్పుడిప్పుడు ఒక విచిత్రమైన పరిణామం సంభవిస్తోంది. ఒక పక్క గాంధీ
ప్రాతినిధ్యం వహించిన భావజాలవిగ్రహాలపైనా, ఆయన ముఖ్య
అనుయాయుల విగ్రహాలపైనా గునపం పోట్లు పడుతున్నాయి. మరోపక్క ఆ చేతులతోనే గాంధీ మెడలో
పూలదండలు పడుతున్నాయి. గాంధీ ఈ రోజున ధృతరాష్ట్రకౌగిలిలో చిక్కుకున్న భీముడి
విగ్రహం అవడం స్పష్టంగా కనిపిస్తోంది.
వందేళ్లు సుదీర్ఘకాలమే. సాధారణంగా అంత నిడివికి చూపుల్ని
విస్తరించే ఓపిక, ఆసక్తి చాలామందికి ఉండదు. విస్తరిస్తే
మాత్రం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు!
అలవాటైన చరిత్రా, పరిసరాల మీదుగా కాలంలోకి వెనక్కి వెడుతున్న
కొద్దీ పాత గతమే కొంగొత్తగా కనిపిస్తూ మనల్ని విస్మితుల్ని చేస్తుంది. మన అవగాహనకు
కొత్త కోణాలను, మెరుపులను అద్దుతుంది. అంతేకాదు, ఒక్కోసారి చరిత్ర వినూత్న వేషంలో పునరావృతమవడమూ కనిపిస్తుంది.
తిలక్, గోఖలేల భారతం
వందేళ్ల గాంధీ భారతానికి ముందు,
అంటే 1914 వరకూ ఉన్నది గాంధీ భారతం కాదు. అది, బాలగంగాధర
తిలక్, గోపాల కృష్ణ గోఖలే, లాలా
లజపతిరాయ్, మదన మోహన మాలవీయ,
చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ,
సావర్కర్, జిన్నాల భారతం. వీరిలో చిత్తరంజన్ దాస్, సావర్కర్, జిన్నాలు గాంధీ కంటే చిన్న. అయినా భారత్
కార్యక్షేత్రంలో గాంధీకి సీనియర్లు. భారత్ కు వచ్చేనాటికి గోఖలేతోనే గాంధీకి సన్నిహితపరిచయం.
గాంధీకి ఆయన గురుతుల్యుడు. తిలక్, లజపతిరాయ్, మాలవీయ, సావర్కర్ లు హిందువుల ప్రయోజనాలకు
ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ముద్రపడ్డారు. బ్రిటిష్ ఛత్రచ్ఛాయలోనే ముస్లిం
ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని జిన్నా భావిస్తున్నాడు. మళ్ళీ నాటి నేతల మధ్య సాత్విక, తీవ్రవాద భేదాలూ ఉన్నాయి. కుల ప్రాతిపదికపై రాజకీయాలు నడిపేవారూ ఉన్నారు.
అలాగే, బ్రిటిష్ పాలకులకు మహజర్లు సమర్పించుకునే శిష్టవర్గం
ఉంది. ఇక అనుయాయుల్ని చూస్తే, వాళ్లలోనూ కులం, మతం వగైరాల రూపంలో రకరకాల చీలికలు. ఆపైన నిద్రాణంగా అసంఖ్యాక సామాన్యజనం.
దక్షిణాఫ్రికాలో 20 ఏళ్లపాటు పోరాడిన అనుభవాన్నీ,
విజయాలనూ వెంటబెట్టుకుని గాంధీ 1915, జనవరి 15న వచ్చి
వీళ్ళమధ్య పడ్డాడు. అప్పటికాయన పేరు దేశంలోని నాయకులకే తప్ప,
జనసామాన్యానికి అంతగా తెలియదు. బొంబాయిలో ఓడ దిగగానే గాంధీ,
కస్తూర్బాలకు ఘనస్వాగతమే లభించింది. ఆరోగ్యం బాగులేకపోయినా గోఖలే కూడా పూనా నుంచి
వచ్చి స్వాగతం చెప్పాడు. బొంబాయిలో వరసపెట్టి గాంధీ స్వాగతసభలు జరిగాయి. ఒక సభకు
తిలక్, ఇంకో సభకు జిన్నా అధ్యక్షత వహించారు. భారత్ లో ఎలా
ఉండాలో, ఏం చేయాలో గాంధీ ప్రణాళికతో వచ్చాడు. అప్పటివరకూ
వేసుకున్న కాంట్రాక్టు కార్మికుల దుస్తులు వదిలేసి, గుజరాతీ
సాంప్రదాయిక ఆహార్యంలోకి మారిపోయాడు. సభలలో ఇంగ్లీష్ పొగడ్తలకు గుజరాతీ ధన్యవాదాలు
చెప్పి ఆశ్చర్యచకితం చేశాడు. ఈ పిచ్చివాడు త్వరలోనే ఇక్కడి అడవిమాలోకంలో కలసిపోయి
అదృశ్యమైపోతాడని చాలామంది అనుకున్నారు.
అనుయాయిగా ఒక దర్జీ
కలసిపోయాడు కానీ అదృశ్యం కాలేదు. వస్తూనే గోఖలే ఆదేశంపై,
అది కూడా థర్డ్ క్లాస్ బోగీలో, దేశమంతా చుట్టేశాడు. అప్పటికే
అస్పృశ్యతా నివారణ, హిందూ-ముస్లిం ఐక్యత, స్వాతంత్ర్య సాధన అన్న అజెండా ఆయన దగ్గర ఉంది. తను పనిలోకి దిగడానికి ఒక
స్థావరం, కొంత డబ్బు, మెరికల్లాంటి
అనుయాయులు, ఓ పత్రిక అవసరమన్న అవగాహన ఉంది. క్రమంగా ఒకటొకటే
సమకూడాయి. భారత్ లో ఆయనకు తొలి అనుయాయిగా చెప్పదగిన వ్యక్తి ఓ దర్జీ. అతనిపేరు
మోతీలాల్. రైల్లో పరిచయమయ్యాడు. తమ విరమ్ గావ్ రైల్వే స్టేషన్ చుట్టూ కస్టమ్స్
వలయం ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉంది,
తీయించకూడడా అని గాంధీని అడిగాడు. సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లడానికి మీరు
సిద్ధపడితే ప్రయత్నిస్తానని గాంధీ అన్నాడు. మోతీలాల్ ఒప్పుకున్నాడు. గాంధీ
వైస్రాయి దాకా వెళ్ళి ఆ చిన్న సమస్యను పరిష్కరించాడు. అదే భారత్ లో తొలి సత్యాగ్రహ యోచనకు నాంది పలికింది.
'నాతో చేరి చరిత్ర సృష్టించు'
ఆయన ముఖ్య సహచరశ్రేణిలో మొదట చేరింది కృపలానీ. శాంతినీకేతన్ లో ఉండగా గాంధీని కలసి,
చరిత్ర అధ్యాపకుడిగా తనను పరిచయం చేసుకున్నప్పుడు, ‘నాతో కలసి పనిచేస్తూ చరిత్ర సృష్టించు’ అని గాంధీ
ఆయనతో అన్నాడు. ఆ తర్వాత పటేల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి తదితరులు ఆయన
ప్రభావపరిధిలోకి వచ్చారు. ఒకపక్క హిందూ తీవ్రవాదులు,
ఇంకోపక్క ముస్లిం తీవ్రవాదులు, వేరొక పక్క కులవ్యతిరేక
విప్లవకారులు—ఇదీ గాంధీ వచ్చేటప్పటికి ఇక్కడి పరిస్థితి. దక్షిణాఫ్రికాలో అప్పటికే
అహింస, సత్యాగ్రహాలతో గాంధీ ప్రయోగాలు జరిపి ఉన్నాడు. హింసను
వ్యతిరేకిస్తూ, అది పాశ్చాత్యమే కానీ భారతీయం కాదంటూ
హిందువులనూ, హింసావాదులనూ కూడా ఆకట్టుకునే వ్యూహంతో
గుజరాతీలో ‘హింద్ స్వరాజ్’ అనే పుస్తకం
రాసి పెట్టుకున్నాడు. 1915లోనే కలకత్తాలో తీవ్రవాదపంథాకు చెందిన విద్యార్థులు
ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ,
హింసావాదంతో ఎవరైనా దేశాన్ని భయభ్రాంతంచేయాలనుకుంటే వారికి వ్యతిరేకంగా
అహింసాత్మకంగా ఉద్యమిస్తాననీ, ఒకవేళ తనే హింసాత్మకంగా
తిరగబడదలచుకుంటే బహిరంగంగా చెప్పి మరీ చేస్తానన్నాడు. అలీసోదరులుగా ప్రసిద్ధులైన
షౌకత్ అలీ, మహమ్మద్ అలీలు ఆ సమావేశంలోనే గాంధీ ప్రభావంలోకి
వచ్చారు. భవిష్యత్తులో హిందూ-ముస్లిం
సమైక్యతా యత్నాలలో ఒక ముఖ్యపాత్ర పోషించి, అనంతర పరిణామాల
వల్ల క్రమంగా ఆయనకు దూరమయ్యారు.
నిప్పులు చెరిగిన ప్రసంగం
గాంధీ ఎందుకోగానీ భారత్ లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదిలో కొంత
అస్థిమితంగానూ, అశాంతిగానూ ఉన్నట్టున్నాడు. మాట కూడా పరుషంగానూ, దూకుడుగానూ ఉన్నట్టు కొందరికి అనిపించింది. 1916 ఫిబ్రవరి
6న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకదినోత్సవానికి ఆహ్వానితుడుగా హాజరై ఆయన చేసిన
ప్రసంగం ఇంకో ఉదాహరణ. ఎక్కడలేని మురికీ ఈ నగరంలోనే ఉందన్నాడు. ఒంటి మీద జిగేలుమనే
ఆభరణాలతో వేదికమీద కూర్చున్న సంస్థానాధీశులను చూపించి, ఆ
నగలు తీసి పక్కన పెడితే తప్ప ఈ దేశానికి విముక్తి లేదన్నాడు. ఈ దేశాన్ని
రక్షించగలిగింది రైతులే తప్ప న్యాయవాదులో, డాక్టర్లో, జమీందార్లో కాదని తెగేసి చెప్పాడు. ఉత్సవానికి వైస్రాయి రాక సందర్భంగా నగరమంతటా
పోలీస్ పటాలాల్ని దింపడాన్ని ప్రస్తావించి ఇలా భయంతో చస్తూ బతకడం కన్నా చావే నయమని
అనేశాడు. అంతా దిగ్భ్రాంతి చెందారు. అధ్యక్షస్థానంలో ఉన్న అనిబిసెంట్ కలవరపడి
గాంధీ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించింది. ఈ సమావేశంలో ఉన్న ఇద్దరు మాత్రం గాంధీ
ఆకర్షణలో పడిపోయారు. ఒకరు ఘనశ్యామ్ దాస్ బిర్లా, ఇంకొకరు
వినోబా భావే. భవిష్యత్తులో వీరిద్దరూ గాంధీ ముఖ్యసహచరుల్లో భాగమయ్యారు.
పాత-కొత్తల వారధి
పై రెండు ప్రసంగాలూ, వీటి మధ్యలో 1915 డిసెంబర్ లో జరిగిన
బొంబాయి కాంగ్రెస్ లో చేసిన ప్రసంగం గాంధీని మిగతా నాయకులకు భిన్నంగా జనానికి
చూపించాయి. ఈయన తమ తరపున, తమలో ఒకడుగా,
తమ భాష మాట్లాడుతున్నాడనుకున్నారు. అంతేకాదు, అన్ని
పక్షాలవారినీ అధిక్షేపిస్తూనే వాళ్ళకు మద్దతు పలుకుతూ ఈయన వాళ్ళకో పజిల్ లానూ
తోచాడు. గడియారం ముల్లైనా ఆగుతుందేమో కానీ గాంధీ ఆగే ప్రశ్నలేదు. ఆయన నిర్విరామంగా
తిరిగే ఓ పని యంత్రం. దానికితోడు ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళిక ఉంటుంది. 1917లో
చంపారన్, 1918లో ఖెడా రైతు ఉద్యమాలు, ఆ
ఏడాదే అహ్మదాబాద్ జవుళిమిల్లు కార్మికుల పక్షాన జరిపిన సత్యాగ్రహం విజయవంతమై గాంధీ ప్రతిష్టను పెంచాయి. 1918లోనే
రౌలట్ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన సత్యాగ్రహం ఆయనను యావద్భారత నేతగా
ప్రతిష్టించింది. ఒకపక్క తిలక్, లజపతిరాయ్, మాలవీయ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్, జిన్నా(గాంధీ భారత్ కు వచ్చిన కొన్ని వారాలకే గోఖలే కన్ను మూశాడు)లాంటి
పాత కాపులతో స్నేహవారధి కట్టుకుంటూనే తన సహచరశ్రేణిని నిర్మించుకుంటూవచ్చాడు. ఘర్షణ
తలెత్తినప్పుడు సహచరుల బలంతో తన పంథాను నెగ్గించుకుంటూ, వీలు
కానప్పుడు రాజీ పడుతూ ముందుకు వెళ్ళాడు. పాత, కొత్త నేతలతో; వారి భావజాలాలతో తను స్నేహవారధి కట్టుకోవడమే కాదు;
క్రమంగా తనే వారధి అయ్యాడు. ఇటు హిందూ వాదులైన లజపతి రాయ్,
మాలవీయ, స్వామీ శ్రద్ధానంద; అటు
ముస్లిం ప్రతినిధులైన జిన్నా, అలీ సోదరులు ఆయన ప్రణాళికలో
విడదీయలేని భాగాలు అయ్యారు. ఖిలాఫత్ ఉద్యమరూపంలో హిందూ-ముస్లిం ఐక్యత
గట్టిపడుతున్నట్టే కనిపించింది. కానీ 1920 సహాయనిరాకరణ ఉద్యమం దరిమిలా ఐక్యత బీటలు
వారింది. ఆ పగులు పెద్దదవడమే తప్ప మళ్ళీ అతుక్కోలేదు. కాకపోతే గాంధీ ప్రభావంతో
హిందూ-ముస్లిం ఐక్యతను నొక్కి చెప్పే ఒక బలమైన వర్గం రూపొందింది.
సవాలుగా మారిన సావర్కర్, జిన్నా
ఈ నేపథ్యంలో 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్
సంఘ్(ఆర్.ఎస్.ఎస్.)అవతరించింది. అటు ముస్లిం శ్రేణులు కూడా వివిధపద్ధతుల్లో
సంఘటితమవుతున్నాయి. వివిధ భావజాలాలకు వారధి కాగలిగిన గాంధీ నాయకత్వ సరళి అప్పటికీ చెదిరిపోలేదు.
సుభాష్ చంద్రబోస్ వంటి రాడికల్స్ తో; ఆచార్య నరేంద్ర దేవ,
జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టులతో ఒక
మేరకు పని చేయగలుగుతున్నాడు. అలాగే, ఇంతకు ముందు లజపతిరాయ్, మాలవీయ వంటి పాతకాపులైన హిందూవాదులను కూడా కలుపుకోగలిగాడు. కానీ, ఈ కొత్త హిందుత్వ వర్గాలను కలుపుకోవడం ఆయనకు చేతకాలేదు. బ్రిటిష్ కన్నా
ఎక్కువగా ఆయనకు ఇద్దరు పెద్ద సవాలు అయ్యారు: ఒకరు సావర్కర్,
ఇంకొకరు జిన్నా. విశేషమేమిటంటే జిన్నాను కలసుకోవడం కన్నా చాలా ముందే, 1909లో లండన్ లో గాంధీ, సావర్కర్ ఒక సమావేశంలో
కలసుకున్నారు. అంతే, వాళ్ళ మధ్య ఎప్పుడూ మాటా మంతీ జరగలేదు.
జిన్నాతో చర్చలు జరిగినా ఫలించలేదు. అలాగే, గాంధీ
సనాతనవాదులతోనూ తలపడ్డాడు. ఈ వర్గం నుంచి ఆయనపై దాడులు,
హత్యాప్రయత్నాలూ జరిగాయి. చివరికి వీరి భావజాల బంధువుల చేతిలోనే హత్యకు గురయ్యాడు.
అనేక కారణాల చేత గాంధీని తప్పు పట్టేవారు అన్ని రకాల
భావజాలాలవారిలోనూ ఇప్పుడున్నారు. ఇందులో రెండు తేడాలు ఉన్నాయి. మొదటిది,
చరిత్రను ఒక స్థిరస్థితినుంచి చూడడం. రెండవది, చలనశీలతనుంచి
చూడడం. ఈ రెండు రకాల చూపులూ రెండు రకాల తీర్పునకు దారి తీయచ్చు. తటస్థంగా చూస్తే, అంతవరకూ శిష్టవర్గం ఆక్రమించుకుని ఉన్న రాజకీయవేదిక మీదికి
జనసామాన్యాన్ని తీసుకురావడం, ఐక్యపోరాటాల నిర్మాణం వగైరాలలో
ఈ వందేళ్ల భారతరాజకీయాలపై గాంధీ ముద్ర కనిపించవచ్చు. అదలా ఉంచితే, నూరేళ్ళ కాలచక్రం ఒక ఆవృత్తిని పూర్తి చేసుకున్నాక ఇప్పుడు గమనిస్తే; గాంధీ 1915లో భారత్ లోకి అడుగుపెట్టడానికి ముందు,
అంటే 1914 నాటికి ఉన్న హిందూవాదుల తరహా రాజకీయాలే ప్రబల స్థితిలో ఉన్నాయి. ‘గాంధీ భారతం’ నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి బిక్క
చూపులు చూస్తోంది. చరిత్ర పునరావృతికి ఇదొక ఆసక్తికరమైన ఉదాహరణ.
This comment has been removed by the author.
ReplyDeleteఆర్యా,
ReplyDelete"నూరేళ్ళ కాలచక్రం ఒక ఆవృత్తిని పూర్తి చేసుకున్నాక ఇప్పుడు గమనిస్తే; గాంధీ 1915లో భారత్ లోకి అడుగుపెట్టడానికి ముందు, అంటే 1914 నాటికి ఉన్న హిందూవాదుల తరహా రాజకీయాలే ప్రబల స్థితిలో ఉన్నాయి. ‘గాంధీ భారతం’ నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి బిక్క చూపులు చూస్తోంది. చరిత్ర పునరావృతికి ఇదొక ఆసక్తికరమైన ఉదాహరణ."
haribabu:చాలా మంచి పాయింటు చెప్పారు.కానీ మీ వ్యాసంలో మీరు సహాయ నిరాకరణోద్యమం గురించి చెప్పినది - యే వ్యక్తి అయితే హిందూ ముస్లిం ఐక్యత కోసం పాతుపడుతున్నాఓ ఆ వ్యక్తి చేస్తున్న పనులే అగాధాన్ని పెంచటం - యెందుకు జరిగింది?విశ్వకవి రవీంద్రుడు రాసిన ఘరే-బైరే నవల జవాబు చెప్తుంది!ఆ నవల పూర్తిగా వాస్త్వాల పుట్ట.సాధారణంగా తన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి పాత్రల్ని తీసుకుంటే యెంతో కొంత కల్పన ఉండటం సహజం.అయితే ఘరే-బైరే మాత్రం వాస్తవానికి చాలా దగ్గిరగా ఉన్నట్టు తెలుస్తుంది.గాంధీ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో యెలాంటి ఫలితాల్ని ఇస్తాయని ఆయన వేసిన అంచనా నూటికి నూరు శాతం నిజమైంది.
P.S:ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితుల్లో నిలబడ్డాం అని సూచిస్తున్నారు,మరి అదే గాంధీ మార్గంలో వెళ్తే మళ్ళీ అదే కధ నడుస్తుందేమో?యెందుకొచ్చిన గోల,ఈసారి మరోలా నడిస్తే పోలా?!
ధన్యవాదాలు హరిబాబుగారూ...మీరన్న మరోలా నడవడం అనేది కొత్తది కాదు. గాంధీకి ముందునుంచీ ఉన్నదే. ఈ మార్గం సరి కాదనుకునే గాంధీ ఇంకో మార్గం ప్రతిపాదించాడు. ఇప్పుడు ఈ పాత కొత్త మార్గంలో కొంత దూరం వెళ్ళాక గాంధీ మార్గమే మంచి దనిపిస్తుందేమో! మీరన్నట్టు ఎందుకొచ్చిన గోల అనుకుంటే ఏ మార్గమైనా మనకు ఒకటే.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete