(జాన్సన్ చోరగుడి రాసిన 'మన విజయవాడ' అనే పుస్తకంపై సాక్షి దినపత్రిక(4 అక్టోబర్ 2015)లో వచ్చిన నా సమీక్ష)
“మొన్నటి వరకూ తెలుగువాళ్ళకు
తమదంటూ చెప్పుకోదగిన ఓ మహానగరం లేదు. నగరం లేకపోతే నాగరికత ఎలా వస్తుంది?” అనేవారు రాంభట్ల కృష్ణమూర్తి. ఇప్పుడు తెలుగువాళ్ళకు రాజధాని రూపంలో మరో
మహానగరం రాబోతోంది. దానిని ‘అమరావతి’
అనే అందమైన, చారిత్రక స్ఫురణ కలిగిన పేరుతో పిలవబోతున్నా
దానికి విశాలమైన దేహాన్ని కల్పించబోయేది మాత్రం విజయవాడే. ఇక్కడో విచిత్రం ఉంది. ‘అమరావతి’ అనే రాజధానిలో విజయవాడ వెళ్ళి కలసిపోవడం
లేదు. రాజధాని నగరమే విజయవాడలో కలిసిపోబోతోంది. ఈవిధంగా విజయవాడ రెండు ‘త్యాగాలు’ చేయబోతోంది. ‘రాజధాని’ అని ఘనంగా చెప్పుకునే అవకాశాన్ని అమరావతికి ధారపోస్తోంది. ఇంద్రుడికి
ఆయుధం కావడం కోసం దధీచి వెన్నెముకను అర్పించినట్టుగా,
రాజధాని కోసం విజయవాడ తన దేహాన్ని అర్పిస్తోంది.
అయితే, తను చేయబోతున్న త్యాగాల గురించీ; రాజధాని ప్రాంతంగా తను సరికొత్త రూపురేఖల్ని తెచ్చుకోబోవడం గురించీ
విజయవాడనగరానికి ఇప్పటికీ తెలిసినట్టులేదు. పూర్వం బాల్యవివాహాలు చేసేవారు. పెళ్లన్నా, పెళ్లికూతురు ముస్తాబన్నా ఏమీ తెలియని వయసు కనుక;
అలంకారానికి యాంత్రికంగా ఒళ్ళు అప్పగించడం తప్ప రేపు తన రూపు ఎలా మారుతుందో, పెళ్లి తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో బాలవధువుకి ఏమీ
తెలియదు. పైగా మన పెళ్లిళ్లు చాలావరకూ
అర్థరాత్రి ముహూర్తాల్లోనే కనుక ఆ చిన్నారి నిద్రలో జోగుతూ ఉంటుంది. రాజధానీ అవతరణ
పూర్వసంధ్యలో ఇప్పుడు విజయవాడ కూడా అలాగే జోగుతున్నట్టుంది.
ఏ జాతిచరిత్రలో నైనా రాజధాని నిర్మాణం ఒక ఉజ్వలఘట్టం. ఒక
ఉత్తేజకరసందర్భం. ఎన్నో కలలు, ఊహలు, ప్రణాళికలతో మనసులు
కిక్కిరిసిపోయి తబ్బిబ్బు పడాల్సిన సమయం. రాజధాని నిర్మాణమంటే కేవలం భూసేకరణ కాదు. రియల్ ఎస్టేట్ పుంజాలు తెంచుకోవడం కాదు. ప్రభుత్వం
ఏదో చేసేస్తుంటే జనం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన ఘట్టం అసలే కాదు. సమాజం
తాలూకు సర్వాంగాలూ కొత్త రక్తం నింపుకుని సరికొత్త ఉత్సాహంతో పాలుపంచుకోవలసిన సన్నివేశం.
కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ సందడి కనిపించడంలేదు. రాజధాని కేవలం భౌతికం కాదు, దానికో మానసికపార్శ్వం కూడా ఉంటుంది. రాజధాని కేవలం రాజకీయ సంబంధి కాదు, దానికి సాంస్కృతిక కోణం ఉంటుంది.
రాజధానిసుందరికి దేహపుష్టితోపాటు చక్కని నడక, నాజూకూ కూడా
అవసరమే. కానీ మీడియా, ఇతర మేధావివర్గాలకు సైతం ఇది పూర్తిగా అర్థమైనట్టులేదు.
అర్థమయ్యుంటే ఈ వర్గాల దృష్టి ఇప్పటికే విజయవాడమీద ఫ్లడ్
లైట్ కాంతితో పడి ఉండేది. ఈ నగర చరిత్రేమిటి, దీని కథేమిటి, దీని
ప్రస్తుత స్థితి గతులు ఏమిటి, దీనికున్న హంగులూ, అవకాశాలూ ఎలాంటివి, రాజధాని ప్రాంతంగా అభివృద్ధి
చెందడానికి దీనికి ఇంకా ఏమేం కావాలి సహా అనేక ప్రశ్నల్లోకి ఇప్పటికే లోతుగా
తలదూర్చి ఉండేవి. కనీసం విజయవాడ మీద చిన్నవో, పెద్దవో
పుస్తకాలైనా ఈపాటికి మార్కెట్ ను ముంచెత్తి ఉండేవి. ఆ దాఖలాలు లేవు. అయితే, ఇంత ఎడారిలోనూ ఒక ఒయాసిస్... అది, జాన్సన్ చోరగుడి
వెలువరించిన ‘మన విజయవాడ’.
తెలుగునాట అభివృద్ధి-సామాజిక అంశాలను ‘కాలికస్పృహ’తో విశ్లేషించి వ్యాఖ్యానించే కొద్దిమంది సీరియస్ రచయితల్లో జాన్సన్ చోరగుడి ఒకరు. విజయవాడపై తను చేసిన
రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ ‘మన విజయవాడ’ పేరుతో తొలి ముద్రణను ఆయన 2000
సంవత్సరంలోనే ప్రచురించారు. ప్రస్తుత రాజధాని సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, దానికే మరికొన్ని అంశాలు జోడిస్తూ పునర్ముద్రించారు. ఆవిధంగా ఈ
పుస్తకానికి ఒక ‘వైతాళిక’(మేలుకొలుపు)
స్వభావం వచ్చింది.
విజయవాడను ‘కలర్ ఫుల్’ గా కాకుండా
‘బ్లాక్ అండ్ వైట్’ లో చూపించడానికి జాన్సన్
ప్రయత్నించారు. నేటి తీరుతెన్నులను ఎత్తిచూపుతూ మెత్తని వాతలూ పెట్టారు. నైసర్గికంగా
విజయవాడ ఉత్తర,దక్షణాలకు కూడలి అవడంవల్ల మొదటినుంచీ
వర్తకకేంద్రంగానే ఉంటూవచ్చిందనీ, ఆ విధంగా ‘వెచ్చాలవాడ’ అయి, క్రమంగా ‘వెచ్చవాడ’, ‘బెజవాడ’ అయిందని ఆయన అంటారు. క్రీ.శ. 10-11 శతాబ్దులలో విజయవాడ వేంగీ చాళుక్యుల
ఏలుబడిలో ఉన్నప్పుడు రాష్ట్రకూటులు, వారి వత్తాసుతో రెండవ
యుద్ధమల్లుడు జరిపిన దండయాత్రలతో విజయవాడ ఓ పెద్ద రణరంగంగా మారి అరాచక శక్తులకు
ఆటపట్టు అయిందనీ; అప్పటినుంచీ ఆ అరాచక స్వభావం కొనసాగుతూ
ఉండడం విజయవాడ ప్రత్యేకత అనీ అంటారు. పంచాయతీగా ఉన్నప్పుడు విజయవాడ రూపురేఖలేమిటి, అది ఎప్పుడు మునిసిపాలిటీ అయింది, విజయవాడకు
ఎప్పుడు రైలొచ్చింది-- మొదలైన వివరాలను ఎంతో ఆసక్తి భరితంగా అందిస్తూనే; వ్యవసాయ ఆర్థికతనుంచి సినిమా, ఆటో మొబైల్ రంగాలకు; రక రకాల మోసాలతో సహా డబ్బు సంబంధ
వ్యాపారాలకూ ఎలా పరివర్తన చెందుతూ వచ్చిందో ఒక సామాజికశాస్త్రవేత్తకు ఉండే లోచూపుతో
విశ్లేషించారు. సామాజికవర్గాల అమరికను, ఊర్ధ్వచలనాన్ని
స్పృశించారు. విజయవాడ పుస్తక ప్రచురణ కేంద్రంగా మారిన నేపథ్యాన్నీ తడిమారు. నాణ్యమైన
చదువుల స్పృహ ఫలితంగా విస్తరించిన విద్యాసంస్థలతో, మేధోవలసలతో
విజయవాడ ‘గ్లోబలైజేషన్’లో భాగమవుతున్నా; “ఇప్పటికీ వెరపు లేకుండా బహిరంగంగా బూతులు(సెక్సు కాదు, తిట్లు) మాట్లాడడం బెజవాడలో సహజ దృశ్యశ్రవణ”మనీ,
“పొలం నగరంలోకి రావడం అంటే ఇదే” ననీ అంటూ ఆ చిన్న వ్యాఖ్యా దర్పణంలోనే కొండంత బెజవాడను
చూపించారు. “మానసిక కాలుష్యం లేని ఒక తరం
కనుక ఆవిర్భవిస్తే...ఇక్కడ అన్ని విధాల ఆరోగ్యవంతమైన రాష్ట్రరాజధాని రూపు
దిద్దుకోవడం ఇప్పటికీ సాధ్యమే” నన్న చారిత్రక ఆశాభావాన్నీ వ్యక్తం చేశారు.
76 పేజీల ఈ సచిత్ర రచన పరిమాణంలో చిన్నదే కానీ
విషయవైశాల్యంలో, లోతులో చిన్నది కాదు. రేపు ఒక సమగ్ర రచనకు
అవకాశమిచ్చే అన్ని రకాల ప్రాతిపదికలూ ఇందులో ఉన్నాయి. రాజధాని నిర్మాణ నేపథ్యంలో రావలసిన
అనేక రచనలకు ఇది వేగుచుక్క అనడం అతిశయోక్తి కాదు.
***
మన విజయవాడ(బొమ్మ కలర్
కాదు బ్లాక్ అండ్ వైట్),
రచన: జాన్సన్ చోరగుడి, పబ్లిషర్స్: కృష్ణవేణి ప్రచురణలు, విజయవాడ-8, ప్రతులకు: కృష్ణవేణి ప్రచురణలు, 54-19-10A, జయప్రకాష్ నగర్,
విజయవాడ-520008; అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలు, వెల: 60రూ.
No comments:
Post a Comment