Saturday, March 28, 2015

భారతరత్న ముఖానికి సెన్సార్!!!

'వాజ్ పేయి గారు ఎలా ఉన్నారు?' అని ప్రశ్నిస్తూ ఇదే బ్లాగ్ లో దాదాపు గత మూడేళ్లలో రెండుసార్లు రాశాను. మాజీ ప్రధానే కాక, ప్రతిపక్షనేతగా, గొప్ప పార్లమెంటేరియన్ గా, గొప్ప వక్తగా పేరొందిన ఆయన గురించి, ఆయన ఆరోగ్యం గురించి ఏళ్ల తరబడిగా ఏ కొంచెం సమాచారం ఏవైపునుంచీ లేకపోవడం పై ఆశ్చర్యం ప్రకటిస్తూ వాటిని రాశాను. ఆయనతోపాటు మాజీ రక్షణమంత్రి, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, కార్మికనాయకుడు అయిన జార్జి ఫెర్నాండెజ్ గురించి కూడా ప్రస్తావించాను.

ఎట్టకేలకు వాజ్ పేయి గారు వార్తల్లోకి వచ్చారు. అది కూడా దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను ఆయనకు ప్రదానం చేసిన సందర్భంగా.

అయితే ఒక ఆశ్చర్యం......నిజానికి ఆశ్చర్యం చిన్న మాట...దిగ్భ్రాంతి...ఆ వార్తకు సంబంధించిన ఫోటోలో వాజ్ పేయి గారి ముఖం కనిపించలేదు. రాష్ట్రపతి గారు ఒక్కరే పూర్తిగా కనిపిస్తున్నారు. వాజ్ పేయి గారి ముఖానికి అడ్డుగా ఓ వ్యక్తి చేతిలో ఒక పెద్ద ట్రే లాంటిది పట్టుకుని కనిపించాడు. నాకు అతని మీద చాలా కోపం వచ్చింది. అతని మీద కన్నా ఎక్కువగా ఆ ఫోటోగ్రాఫర్ మీద కోపం వచ్చింది. అంత ముఖ్యమైన కార్యక్రమాన్ని సక్రమంగా చిత్రీకరించే చేతనైన ఫోటోగ్రాఫర్  కూడా ప్రభుత్వానికి దొరకలేదా అని ప్రభుత్వం మీద కోపం వచ్చింది. అలాంటి ఫోటో వేసినందుకు నేను చూసిన పత్రిక మీద కూడా కోపం వచ్చింది.

అంతలో ముందురోజు ఆ వార్తను కవర్ చేసిన టీవీ చానెళ్లు కూడా వాజ్ పేయిని చూపించని సంగతి గుర్తుకొచ్చింది. అయినా ఆశ చావక మరికొన్ని పత్రికలు, ఇంటర్నెట్ చూసాను. ఆ ఫోటోయే కనిపించింది.

కావాలనే వాజ్ పేయి గారిని పూర్తిగా చూపించి ఉండరన్న అనుమానం నాలో బలపడింది. ఒక తెలుగు చానెల్ లో ఉన్న మిత్రుడికి ఫోన్ చేశాను. ఆయన కూడా ఆ ఒక్క ఫోటోయే రిలీజ్ చేశారని చెప్పి, బహుశా వాజ్ పేయి గారు జనానికి చూపించే పరిస్థితిలో ఉండి ఉండరని అన్నాడు.

అదే నిజం కావచ్చు. అయితే ఆ కారణం చేతే మాజీ ప్రధానిని జనానికి చూపించకపోతే అది మరింత దారుణం. వృద్ధులను, అనారోగ్యవంతులను జనం చాలామందిని చూస్తూనే ఉంటారు. ప్రత్యేకించి వాజ్ పేయి గారిని వారు చూడకూడదని అనుకోవడంలో ఎలాంటి వివేకమూ లేదు. లేక కుటుంబసభ్యుల ఒత్తిడి మొదలైనవి ఏవైనా ఉన్నాయేమో తెలియదు. ఏమున్నా సరే మాజీప్రధానిని కనీసం ఇలాంటి సందర్భంలోనైనా జనం కంటబడకుండా నిషేధించే హక్కు ప్రభుత్వానికి లేదు. పైగా జనానికి ఆయనను చూపించవలసిన బాధ్యత ఉంది. చూపించకపోగా, చూపించకపోవడంపై కనీసం వివరణ, సంజాయిషీ కూడా లేవు.

అంతవరకు ఎందుకు? మాజీ ప్రధాని ఆరోగ్యపరిస్థితి అప్పుడప్పుడైనా జనానికి తెలియజేయాలన్న ఇంగితం కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. ఇంతకు ముందున్న యూపీయేకూ లేదు, ఇప్పటి ఎన్డీయేకూ లేదు. అసలు బిజీపీకే లేకపోవడం ఇంకా ఆశ్చర్యం.

అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే,  దేశంలోని 120 కోట్ల మంది పట్ల ఇంత ఫ్రాడ్ జరిగినా మీడియాలో ఉలుకూ పలుకూ లేకపోవడం! మీడియా, ప్రభుత్వం కూడబలుక్కుని మరీ ఈ కుట్ర పూరిత మౌనానికి పాల్పడ్డాయా అనిపిస్తోంది.

Thursday, March 26, 2015

దాచేస్తే దాగని మాతృస్వామిక సత్యాలు!

ఒక కోణం నుంచి చూస్తే మన పురాణ, ఇతిహాస, కావ్యాలు మనిషి జీవితంలో ప్రకృతి ఎంత అవిభాజ్యమో, రెండింటి మధ్యా సామరస్యం ఎంత అవసరమో చెబుతున్నట్టు ఉంటాయి. ప్రకృతిలోని ప్రతి అందాన్ని, ప్రతి అద్భుతాన్ని రెండు దోసిళ్లతో అందుకుంటూ జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోమని బోధిస్తున్నట్టు ఉంటాయి. అడుగడుగునా ప్రకృతి సంబంధమైన పదజాలమూ, అలంకారాలకు అదనంగా ప్రకృతివర్ణనలు ఉంటాయి.
అసలు మొత్తం రామాయణ కథనే ప్రకృతి పరంగా అన్వయించుకోవచ్చు...

Wednesday, March 18, 2015

స్త్రీని 'జయించా'కే సీత జాడ తెలిసింది!

స్త్రీవధ విషయానికి వస్తే, తాటకను చంపిన రాముడు, పూతనను లొంగదీసుకున్న/చంపిన కృష్ణుడి పక్కనే  హనుమంతుడు కూడా చేరుతున్నాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోయడం కూడా ఇలాంటిదే. ఒక బాబిలోనియా పురాణకథలో తియామత్ అనే జగజ్జనని లాంటి దేవతను మర్దుక్ అనే దేవుడు చంపుతాడు. సిర్సేను చంపడానికి ఓడిసస్ కత్తి దూస్తాడు.  స్త్రీవధను ‘వీరత్వా’నికి సూచనగానే ఇవన్నీ చెబుతున్నాయి. ఈ ఉదాహరణలు ఏదో ఒక ప్రాంతానికి చెందినవి కాక, భిన్నప్రాంతాలకు చెందినవన్న సంగతిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు, వీటిమధ్య ఉన్న పోలికలు కేవలం యాదృచ్చికాలని కాకుండా, వీటి వెనుక ఒక కచ్చితమైన సరళి ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఒక పరిణామాన్ని ఇవి చెబుతున్నాయి. 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/03/18/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%AF%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%95%E0%B1%87-%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4/ లో చదవండి)

Thursday, March 12, 2015

తాటక రాక్షసి కాదు, యక్షిణి!

తాటక ఒక యక్షిణి అంటుంది రామాయణం. అంటే, యక్షుల తెగకు చెందినది. యక్షులు చారిత్రకత కలిగిన తెగ. తెలుగులో ‘జక్కులు’ అనే మాట, యక్షశబ్దానికి వికృతి. ‘జక్క పురంధ్రి’ అనే ప్రయోగం ‘క్రీడాభిరామం’లో కాబోలు, ఉంది. యక్షప్రశ్నలు అనే మాట యక్షులనుంచే పుట్టింది. అడవిని ఆశ్రయించుకుని ఉండే యక్షులు దారినపోయేవారిని అటకాయించి, యక్షప్రశ్నలు వేసి, వారు జవాబు చెప్పలేకపోతే బలి ఇచ్చేవారట. బుద్ధుడు ఇలాగే తనకు తారసపడిన యక్షులలో ఉపదేశం ద్వారా పరివర్తన తెచ్చి ఆ దురాచారాన్ని మాన్పించాడని కోశాంబీ రాస్తారు. యక్షులకు సంబంధించిన ఈ చారిత్రక వివరం; యక్షుడికీ, ధర్మరాజుకీ మధ్య ప్రశ్నోత్తరాల రూపంలో మహాభారతానికి ఎక్కింది.

Thursday, March 5, 2015

తవ్వకాలలో దొరికిన నగ్నస్త్రీమూర్తులు ఏం చెబుతున్నాయి?

కొన్ని ప్రాంతాలలో ఎగువ పాతరాతియుగా(క్రీ.పూ. 50,000-10,000)నికి చెందిన చిన్న చిన్న నగ్నస్త్రీ మూర్తులు దొరికాయి. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే అతి పురాతనమైనవి. ఈ ప్రాంతాలలో ఆస్ట్రియా దిగువ ప్రాంతం ఒకటి. సన్నని రేణువులతో కూడిన మెత్తని సున్నపురాయితో తయారుచేసిన ఈ మూర్తులు పదకొండు సెంటీమీటర్లు ఎత్తుంటాయి. ఈ స్త్రీమూర్తి  రొమ్ములపై రెండుచేతులూ ముడుచుకుని ఉంటుంది.  ఈ మూర్తిని విల్లెన్ డార్ఫ్ వీనస్ (Venus of Willendorf) అంటారు.  అయితే,  వీనస్ అన్నారు కదా అని, ఈ మూర్తి  ఫ్రాన్స్ లోని లౌరే మ్యూజియంలో ఉన్న Venus of Milo లా అందంగా, ఆకర్షణీయంగా ఉండదనీ, స్థూల కాయంతో, బలిష్టమైన కటిప్రదేశంతో ఉంటుందనీ జార్జి థాంప్సన్ అంటారు. 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/03/05/%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D/లో చదవండి)