Friday, October 21, 2016

ఇంత బేషరంగా ఎలా ఫిరాయిస్తారబ్బా?!

తమ మధ్య ఎలాంటి కీచులాటలు ఉన్నా పాతికేళ్లో, పదేళ్ళో కాపురం చేసిన భార్యను భర్త, భర్తను, భార్య విడిచిపెట్టాలనుకోవడం మనదేశంలో ఇప్పటికీ అంత తేలిక కాదు. చట్టపరమైన అడ్డంకుల సంగతి అలా ఉంచితే, పిల్లాలూ, ఇతర ఎమోషనల్ బంధాలూ అడ్డం వస్తాయి. పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. సర్దు బాటు చేయడానికి ప్రయత్నిస్తారు. అయినా విడిపోవడం లేదని కాదు. విడిపోతున్న కేసులకన్నా సర్దుకుని కలిసే ఉంటున్న కేసులే ఎక్కువ ఉంటాయి. విడిపోవడానికి  మానసికంగా ఎంతో సిద్ధం కావాలి. విడిపోవడమంటే జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే. ఎంత తగవులున్నా కలసి ఉండడానికి భార్యాభర్తలు ప్రయత్నించడమే భారతీయవివాహ వ్యవస్థకు గల బలమని అంటారు. అయితే అదే బలహీనత అని అనే వాళ్ళూ ఉన్నారు.

అదలా ఉంచితే, భారతీయ వివాహబంధం నమూనా మన బహుళ పక్ష ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు ఏమాత్రం పనికిరావడం లేదు. పాతికేళ్లు ఒక పార్టీలో ఉండి దానితో, దాని ఐడియాలజీతో పెంచుకున్న ఎమోషనల్ బంధాన్ని ఒకే ఒక్క ప్రకటనతో పుటుక్కున తెంచుకుని ఇంకో పార్టీవ్రత్యానికి గెంతడానికి నాయకులు ఏమాత్రం వెనకాడడం లేదు.  అందుకు వాళ్ళలో ఎలాంటి అంతర్మథనం జరుగుతున్న ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఇది బహుళపక్ష ప్రజాస్వామ్యానికి బలమో బలహీనతో తెలియడం లేదు.

Tuesday, October 11, 2016

అమ్మవారి పూజ ప్రపంచవ్యాప్తం

చాలా రోజులైంది బ్లాగ్ రాసి. పాఠకులు మన్నించాలి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంలో ప్రైమ్ పోస్ట్ ప్రచురించిన నా వ్యాసం లింకు ఇస్తున్నాను. చూడగలరు. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”
అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. అలాగే, ప్రపంచ పౌరాణికతపై మూడు బృహత్ సంపుటాలు రచించిన క్యాంప్ బెల్  అనే పండితుడు డిమీటర్ అనే గ్రీకుదేవతగురించి The Great Goddess of the Universe అంటాడు. ఆ మాట సూచిస్తున్నది కూడా పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే! ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.
ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.
ఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత, ప్రసూతి దేవత కూడా. ఈమె లాంటిదే  అర్తెమిస్ అనే మరో దేవత.  హెకటేను, అర్తెమిస్ ను త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్ (triprosopos), అంటే మూడు ముఖాలు కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.

Tuesday, July 19, 2016

కాంగ్రెస్ చేసిన తప్పులే బీజేపీ చేయాలా!?

చాలా రోజుల తర్వాత బ్లాగులో రాజకీయ వ్యాఖ్య రాస్తున్నాను.

కాంగ్రెస్ చేయని పనులు కొన్ని బీజేపీ చేస్తుంది(చేస్తోంది). అలాగే కాంగ్రెస్ చేసిన ఎన్నో పనులు కూడా బీజేపీ చేస్తుంది(చేస్తోంది). అలాగే కాంగ్రెస్ కూడా.

ఉదాహరణకు కాంగ్రెస్ మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. బీజేపీ మీద కూడా కొన్నైనా వచ్చాయి. అప్పుడు బీజేపీని ఆ విషయమై కాంగ్రెస్ అడిగిందనుకొంది, అప్పుడు మీ మీద ఉన్న అవినీతి ఆరోపణల సంగతేమిటని బీజేపీ అడుగుతోంది.

రాజ్యాంగ పదవుల్ని, ఇతర ప్రజాస్వామిక వ్యవస్థలను దెబ్బతీస్తోందని బీజేపీ మీద కాంగ్రెస్ ఆరోపణ చేసిందనుకోండి, మీరు ఆయావ్యవస్థలను భ్రష్టు పట్టించలేదా అని బీజేపీ అడుగుతుంది.

భావప్రకటనా స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందని కాంగ్రెస్ అందనుకోండి, అందులో మిమ్మల్ని మించిన ఘనులు ఎవరుంటారని అంటూ బీజేపీ ఎమర్జెన్సీ ని ఎత్తిచూపుతుంది.

ఇలా చాలా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోవచ్చు...

ఇవాళ లోక్ సభలో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో ఎన్డీయే వ్యవహార సరళి, న్యాయస్థానంలో అది బెడిసికొట్టడం చర్చలోకి వచ్చింది. ప్రభుత్వాలను కుప్ప కూల్చిన చరిత్రలోనూ, వాటి సంఖ్యలోనూ మిమ్మల్ని మించినవాళ్ళు ఎవరున్నారని హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జవాబిచ్చారు.

నాకు వచ్చిన సమస్య ఏమిటంటే, కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ కూడా చేయడం; నువ్వు తప్పు చేయలేదా అంటే నువ్వు చేయలేదా అని ఒకరినొకరు నిందించుకోవడం; ఈ ద్వై పాక్షిక వాగ్యుద్ధానికి జనం నిశ్శబ్ద శ్రోతలుగా ఉండడం... ఇదేనా రాజకీయమంటే?! ఈ జనానికి కూడా కాస్త ఆలోచనాశక్తి, సొంత అభిప్రాయాలూ ఉంటాయని బొత్తిగా తెలియనట్లుగా, లేదా బొత్తిగా పట్టనట్టుగా రాజకీయపక్షాలు ఎలా వ్యవహరిస్తాయి? దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్సే ఇలాంటి రాజకీయచర్చా సరళికి బాధ్యత వహించాలనీ, అదే ఈ ధోరణిని పెంచి పోషించిందనీ అనుకుందాం. కాంగ్రెస్ కన్నా గొప్ప పరిపాలన అందిస్తామనీ, గొప్ప ఒరవడులు కల్పిస్తామనీ చెప్పే బీజేపీ కూడా అలాగే ఎందుకు చేస్తోంది? తను ఈ సరళిని మార్చవచ్చు కదా!

జనంలో అందరూ కాంగ్రెస్ వాదులో, బీజేపీ వాదులో ఉండరు. ఉన్నా మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పేవారు వాళ్ళలో చాలామంది ఉంటారు. ఈ పార్టీలు వాళ్ళ ఉనికినే పట్టించుకోనట్టు ఎలా ఉంటాయి?

ఈ సందర్భంలో నా సొంత అనుభవం ఒకటి చెప్పుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను.

2004-05లో కాబోలు బీహార్ లో లాలూప్రసాద్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి ప్రమాదంలో పడింది. బీజేపీ మద్దతు గల నితీశ్ కుమార్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం  హుటాహుటిన రంగంలోకి దిగి గవర్నర్ నుంచి అనుకూల నివేదికను తెప్పించుకుని రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత రాష్ట్రపతి పాలన విధింపునకు మంత్రివర్గ నిర్ణయం తీసుకుని రష్యాలో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి అర్థరాత్రి ఆమోద ముద్ర తెప్పించుకుని రాష్ట్రపతి పాలన విధించింది.

అప్పుడు నేను వార్త దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్నాను. యూపీఏ చర్యను అర్థరాత్రి ప్రజాస్వామ్యహత్యగా వర్ణిస్తూ చాలా ఘాటైన ఎడిటోరియల్ రాశాను. ఆ పత్రిక యజమాని అప్పుడు కాంగ్రెస్ లో ఉండడమే కాదు, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నేతలనుంచి వరసపెట్టి ఆయనకు ఫోన్లు. ఎడిటర్ గా ఉన్న టంకశాల అశోక్ గారిని దీనిపై ప్రశ్నించారు. "అవును. నాకూ అలాగే అనిపించింది. ఆయనకూ అలాగే అనిపించింది. అదే రాశారు. తప్పేమిటి?" అన్నారు.  విశేషమేమిటంటే దానిపై ఆయన ఆ తర్వాత ఏమీ అనలేదు.
                                                                       ***
రోజులు, జనం ఆలోచనలు మారాయన్న సంగతి గతంలో యూపీఏ గమనించుకోలేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. యూపీఏ రెండోవిడత పాలనా కాలాన్నే చూడండి. అప్పటికి మీడియా చాలా వ్యాప్తి చెందింది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాజకీయచర్చల ప్రత్యక్షప్రసారాలు, వాగ్యుద్ధాలు జనం డ్రాయింగ్ రూమ్ లకు చేరిపోయాయి. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో మీడియా శక్తియుక్తులు, పాత్రా సహస్రాధికంగా పెరిగిపోయాయి. ఈ దశలో తనపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై మన్మోహన్ ప్రభుత్వం దీర్ఘమౌనం పాటించి అభాసు పాలయ్యింది. దాని పతనం 2010-11 నాటికే ఖరారు అయిపోయింది. 2014 లో జరిగింది అది క్రియారూపం ధరించడం మాత్రమే.

ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఉదాహరణల ద్వారా బీజేపీ కూడా సరిగ్గా కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తోంది.
                                                                    ***

అందుకే అంటున్నాను...కాంగ్రెస్ తన అరవై ఏళ్ళకు పైబడిన పాలనలో చేసిన తప్పులనే చేసే లగ్జరీ బీజేపీకి లేదు. ఎన్నేళ్లలో వంతెన కింద చాలా నీళ్ళు ప్రవహించాయి. నేటి  జనం నిన్నటి జనం కాదు. నేటి మీడియా నిన్నటి మీడియా కాదు. మనిషికి వయసుతో పాటు లోకజ్ఞానం పెరుగుతుంది, మంచి చెడులను అంచనా వేసే వివేకమూ పెరుగుతుంది. చిన్నప్పుడు చేసిన తెలివితక్కువ పనులను పెద్దయిన తర్వాత చేయడు. అలాగే, ప్రజాస్వామ్య అనుభవమూ అవగాహనా కూడా కాలంతోపాటు పెరుగుతాయి. చిన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్నే ఇప్పుడు మేమూ చేస్తామంటే కుదరదు. అది వితండవాదన అవుతుంది. అంతకన్నా ఎక్కువగా అది ఆత్మహానికి దారితీస్తుంది.Friday, June 24, 2016

'అంగా దంగా త్సంభవసి'- కథ

రాత్రి పదవుతోంది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, మొహం కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చున్నాను. ఇంటికొచ్చేసరికి రోజూ ఆ వేళ అవుతుంది.
అంతలో వీధి తలుపు తోసుకుని ఏదో సినిమాపాట కూనిరాగం తీస్తూ మా రెండోవాడు హడావుడిగా లోపలికి రాబోయి నన్ను చూసి తగ్గాడు. నా మీద ఓ ముసినవ్వు పారేశాడు. నేను ఏమైనా అంటానేమోనని ముందుగానే నా మీద జల్లే మత్తుమందు ఆ ముసినవ్వు. తలుపు వెనకనుంచి మూడు తలకాయలు తొంగి చూసి, నేను కనబడగానే వాడితో ఏదో గుసగుసగా అనేసి మాయమయ్యాయి. వాడు తలుపు వేసేసి ఓసారి లోపలికి వెళ్ళి వచ్చి,
“నాన్నా! రేపు ఆఫీసునుంచి త్వరగా వచ్చెయ్యి. సెకండ్ షో సినిమా కెళ్దాం” అన్నాడు. ఆ మాటకు నా గుండెల్లో రాయి పడింది. నోట్లోకి ముద్ద దిగడం కష్టమైంది.

Thursday, June 2, 2016

స్లీమన్ కథ-35(చివరి భాగం): రోడ్డు మీద కుప్ప కూలిపోయాడు!

పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి తప్ప, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని చేర్చుకోడానికి నిరాకరించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని ఆనవాలు పత్రాల కోసం, డబ్బు కోసం జేబులు వెతికారు. అవి కనిపించలేదు కానీ, వైద్యుడి చిరునామా దొరికింది. అతన్ని పిలిపించారు. స్లీమన్ గురించి అతను చెప్పిన వివరాలకు  విస్తుపోయారు. అతని దుస్తులు చూసి పేదవాడు అనుకున్నారు. అతను పెద్ద సంపన్నుడనీ, అతని పర్సు నిండా బంగారు నాణేలు ఉంటాయనీ వైద్యుడు చెప్పాడు. తనే అతని చొక్కా లోపలి జేబులోంచి బంగారు నాణేలతో ఉన్న ఒక పెద్ద పర్సును బయటికి తీశాడు.

Thursday, May 26, 2016

స్లీమన్ కథ-34: అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన ఒక పురాతన భూఖండం అట్లాంటిస్!

  1. అట్లాంటిస్-కెనారీ దీవులు: అతి పురాతనకాలంలో, ఒక అంచనా ప్రకారం 9వేల సంవత్సరాల క్రితం, అట్లాంటిక్ సముద్రంలో ఉండేదిగా భావిస్తూ వచ్చిన దీవులు ఇవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో(క్రీ.పూ. 428-348) తన ‘తీమేయస్’ (Timaeus), ‘క్రీషియస్’ (Critias) అనే డైలాగులలో అట్లాంటిస్ గురించి రాశాడు. పెద్ద ఉత్పాతం ఏదో సంభవించి ఈ భూఖండం సముద్రంలో లోతుగా మునిగిపోయిందనీ, ఇందులోని పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలు మాత్రమే నీటిపై కనిపిస్తాయనీ రాశాడు. అప్పటినుంచీ అట్లాంటిస్ అనే భూఖండం నిజంగానే ఉండేదని నమ్ముతూ వచ్చినవాళ్ళు నేటి కెనారీ(Canary) దీవులు, అజోర్స్(Azores)దీవులు, కేప్ వర్ద్(Verde),మదీరా(Madeira)లు భాగంగా ఉన్న మైక్రోనేసియా యే ఆ మునిగిపోయిన ప్రాచీన భూఖండం తాలూకు అవశేషమని భావిస్తారు.

Thursday, May 19, 2016

స్లీమన్ కథ-33: ప్రధాని గ్లాడ్ స్టన్ ఫొటోను పాయిఖానాలో ఉంచాడు!

స్లీమన్ కు గ్లాడ్ స్టన్ బాగా తెలిసినవాడే. తన మైసీనియా కు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసింది ఆయనే. తనను 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన నివాసానికి ఆహ్వానించి విందు ఇచ్చింది ఆయనే. కానీ తన ఆరాధ్యవీరుడు గోర్డన్ మరణానికి కారణమైన గ్లాడ్ స్టన్ పొరపాటును స్లీమన్ క్షమించలేకపోయాడు. అతనిపట్ల ఆగ్రహంతో వణికిపోయాడు. తన అధ్యయన కక్ష్యలో ఉంచిన అతని సంతకంతో ఉన్న ఫోటోను నేలమీదికి విసిరికొడదామా, లేక చించి పారేద్దామా అనుకున్నాడు. చివరికి తీసుకెళ్లి పాయిఖానాలో ఉంచాడు.