Friday, October 21, 2016

ఇంత బేషరంగా ఎలా ఫిరాయిస్తారబ్బా?!

తమ మధ్య ఎలాంటి కీచులాటలు ఉన్నా పాతికేళ్లో, పదేళ్ళో కాపురం చేసిన భార్యను భర్త, భర్తను, భార్య విడిచిపెట్టాలనుకోవడం మనదేశంలో ఇప్పటికీ అంత తేలిక కాదు. చట్టపరమైన అడ్డంకుల సంగతి అలా ఉంచితే, పిల్లాలూ, ఇతర ఎమోషనల్ బంధాలూ అడ్డం వస్తాయి. పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. సర్దు బాటు చేయడానికి ప్రయత్నిస్తారు. అయినా విడిపోవడం లేదని కాదు. విడిపోతున్న కేసులకన్నా సర్దుకుని కలిసే ఉంటున్న కేసులే ఎక్కువ ఉంటాయి. విడిపోవడానికి  మానసికంగా ఎంతో సిద్ధం కావాలి. విడిపోవడమంటే జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే. ఎంత తగవులున్నా కలసి ఉండడానికి భార్యాభర్తలు ప్రయత్నించడమే భారతీయవివాహ వ్యవస్థకు గల బలమని అంటారు. అయితే అదే బలహీనత అని అనే వాళ్ళూ ఉన్నారు.

అదలా ఉంచితే, భారతీయ వివాహబంధం నమూనా మన బహుళ పక్ష ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు ఏమాత్రం పనికిరావడం లేదు. పాతికేళ్లు ఒక పార్టీలో ఉండి దానితో, దాని ఐడియాలజీతో పెంచుకున్న ఎమోషనల్ బంధాన్ని ఒకే ఒక్క ప్రకటనతో పుటుక్కున తెంచుకుని ఇంకో పార్టీవ్రత్యానికి గెంతడానికి నాయకులు ఏమాత్రం వెనకాడడం లేదు.  అందుకు వాళ్ళలో ఎలాంటి అంతర్మథనం జరుగుతున్న ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఇది బహుళపక్ష ప్రజాస్వామ్యానికి బలమో బలహీనతో తెలియడం లేదు.

Tuesday, October 11, 2016

అమ్మవారి పూజ ప్రపంచవ్యాప్తం

చాలా రోజులైంది బ్లాగ్ రాసి. పాఠకులు మన్నించాలి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంలో ప్రైమ్ పోస్ట్ ప్రచురించిన నా వ్యాసం లింకు ఇస్తున్నాను. చూడగలరు. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”
అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. అలాగే, ప్రపంచ పౌరాణికతపై మూడు బృహత్ సంపుటాలు రచించిన క్యాంప్ బెల్  అనే పండితుడు డిమీటర్ అనే గ్రీకుదేవతగురించి The Great Goddess of the Universe అంటాడు. ఆ మాట సూచిస్తున్నది కూడా పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే! ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.
ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.
ఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత, ప్రసూతి దేవత కూడా. ఈమె లాంటిదే  అర్తెమిస్ అనే మరో దేవత.  హెకటేను, అర్తెమిస్ ను త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్ (triprosopos), అంటే మూడు ముఖాలు కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.