Friday, February 27, 2015

'ఎస్సార్' ఆతిథ్యానికి గడ్కరి 'నో సార్' అనద్దా?!

కంపెనీలకు, రాజకీయనాయకులకు మధ్య సంబంధాలు ఉండడం, కంపెనీల ఆతిథ్యాన్ని రాజకీయనాయకులు అందుకుంటూ ఉండడం కొత్తవిషయం కాదు. అయినా అదొక విచిత్రం... బయటపడిన ప్రతిసారీ కొత్తగా అనిపించి ఎంతో కొంత సంచలనాత్మకం అవుతూ ఉంటుంది.

ఇలాంటి సంబంధాలకు దాదాపు ఏ పార్టీ అతీతం కాదనే అనిపిస్తుంది. ఇందులో కూడా దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ దే ఒరవడి అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ దేశంలోని అనేకానేక అవలక్షణాలకు జన్మస్థానంగా కాంగ్రెస్ ఎప్పుడో పేరు తెచ్చుకుంది కనుక ఆ పార్టీకి సంబంధించి ఇలాంటివి బయటపడినప్పుడు అవి అంత కొత్తగానూ, సంచలనాత్మకంగానూ అనిపించవు. అదే బిజెపి విషయంలో అయితే ఒకింత ఎక్కువ సంచలనమే కలిగిస్తాయి. కారణం, రోగగ్రస్త కాంగ్రెస్ కు ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన ప్రత్యామ్నాయంగా బిజెపిని భావించేవారు చాలా మంది ఉన్నారు కనుక; కాంగ్రెస్ కు భిన్నంగా బిజెపి high moral ground తీసుకుంటూ ఉంటుంది కనుక!

ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరి 2013 జూలైలో ఎస్సార్ గ్రూప్ కు చెందిన ఫ్రెంచ్ క్రూయిజ్ లో సకుటుంబంగా మూడు రోజులు విహరించారని ఇండియన్ ఎక్సెప్రెస్ వెల్లడించింది. ఎస్సార్ లో ఉద్యోగం కోసం కొందరిని దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ ఓరా లాంటి కాంగ్రెస్ నేతలు, వరుణ్ గాంధీ లాంటి బిజెపి నేతలు రికమెండ్ చేసినట్టు కూడా వెల్లడించింది.

బయటపడింది కనుక ఔనా అనుకుంటున్నాం. బయటపడనివి ఎన్నో!

ఇది అవినీతి కిందికి వస్తుందా, వస్తే ఎంత పెద్ద అవినీతి అవుతుందన్న ప్రశ్న కన్నా; ఇక్కడ ప్రధానంగా తలెత్తే ప్రశ్న కంపెనీలతో రాజాకీయ నాయకులకు వ్యక్తిగత సంబంధాలు ఉండచ్చా, వారి ఆతిథ్యాన్ని పొందచ్చా అన్నది. విలువల గురించి చెప్పే ఒక పార్టీ ప్రముఖ నేత అయిన  నితిన్ గడ్కరి తనను సమర్థించుకుంటూ ముందుకు తెచ్చిన తర్కం ఆశ్చర్యం కలిగిస్తుంది. తను అప్పుడు బిజెపి అధ్యక్షుడిగా కాదు సరికదా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా లేననీ; కనుక ఎస్సార్ ఆతిథ్యం పొందడంలో quid pro quo ఏమీలేదని ఆయన అన్నారు. ఆయన పార్టీవారు కూడా అదే అన్నారు. ఆపైన ఎస్సార్ యజమానులతో తనకు పాతికేళ్ళ స్నేహసంబంధాలు ఉన్నాయని గడ్కరి అంటున్నారు.

ఇది కేవలం సాంకేతికమైన సమర్థన మాత్రమే. అంతకు ముందు ఏదో  ఒక పదవిలో ఉన్న ఒక రాజకీయనాయకుడు ఆ తర్వాత కొద్ది కాలం ఏ పదవిలోనూ ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఏదైనా పదవిలో ఉండవచ్చు. కానీ అతను పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా రాజకీయనాయకుడే! పదవిలో ఉన్నా లేకపోయినా తన పార్టీకి చెందిన ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి అతనికి ఉంటుంది. అందులోనూ గడ్కరి చిన్నా, చితకా నాయకుడు కాదు. బిజెపికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. కనుక ఆయనకు మరింత ఎక్కువ పలుకుబడి ఉంటుంది. సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందే ఎస్సార్ కంపెని గడ్కరీకి ఆతిథ్యాన్ని ఇచ్చిన సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి. బిజెపి అధికారం లోకి రానున్న విషయం అప్పటికే స్పష్టమైంది. కనుక భవిష్యత్తు అవసరాల కోసం, లాభాల కోసం ఎస్సార్ కంపెనీ గడ్కరిపై తన ఆతిథ్యాన్ని 'ఇన్వెస్ట్' చేసిందన్నమాట.

విషయం ఇంత సూటిగా ఉంటే, అప్పుడు ఏ పదవిలోనూ లేనంటూ సాంకేతికంగా సమర్థించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ఐ.ఏ.ఎస్ అధికారి దీర్ఘకాలిక సెలవులో ఉన్నాడనుకుందాం. అప్పుడు ఆయన ఇలాంటి ఆతిథ్యాలను పొందవచ్చా అన్న ప్రశ్నకు ఏం జవాబు చెబుతాం?

క్రోనీ కేపిటలిజం ఎంతోకాలంగా చర్చలో ఉంటున్న స్థితిలో ఎస్సార్ ఆతిథ్యానికి 'నో సార్' అని చెప్పడం కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అనుకుంటున్న బిజెపి విధి కాదా?!







Wednesday, February 25, 2015

కనకదుర్గగుడి నుంచి కాశీకి సొరంగమార్గం

చిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ తలుపు, తాళం బాగా తుప్పు పట్టాయి. మా అమ్మే చెప్పిందో, ఇంకెవరైనా చెప్పారో గుర్తులేదు కానీ, అది కాశీకి వెళ్ళే సొరంగమార్గమట! ఒకప్పుడు సాధువులు, సన్యాసులు ఆ మార్గంలో కాశీకి వెళ్ళేవారట! అది ప్రమాదకర మార్గం కావడంతో తర్వాత తాళం వేసేసారట!


పైగా ఆ తుప్పు పట్టిన తలుపు, తాళం చూస్తే అది నిజమేననిపించేది. 

Saturday, February 14, 2015

మోడి సంధించిన ఒక ఆశ్చర్యం, ఒక దిగ్భ్రాంతి!

ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా చేసిన రెండు పనుల్లో ఒకటి ఆశ్చర్యాన్ని, ఇంకొకటి దిగ్భ్రాంతిని  కలిగించాయి.

 ఆశ్చర్యం కలిగించినది, ఢిల్లీలో ఒక క్రైస్తవ విద్యాసంస్థలో దొంగతనం జరగడంతో పోలిస్ కమిషనర్ ను పిలిచి ఇటువంటివి జరగకుండా చూడమని చెప్పడం. చర్చిలపై జరుగుతున్న దాడులపై  ఏమీ మాట్లాడడం లేదనే ఆయనపై మూడు నెలలుగా వినిపిస్తున్న ఆరోపణ. ఎన్నికల సమయంలో కూడా ఆ విమర్శ వినిపించింది. అయినా సరే, ఆయన మాట్లాడలేదు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా పోలిస్ కమిషనర్ ను పిలిపించి మాట్లాడడమే ఆశ్చర్యానికి కారణం.

ఆయన చేసింది అభినందనీయమే. అయితే ఆ చర్య ఆయనను ఇప్పటివరకు చూస్తున్నదానికి భిన్నమైన తీరులో చూపించింది. ఢిల్లీ ఫలితం, అరవింద్ కేజ్రివాల్ ప్రభావం ఆయనచేత ఆ పని చేయించాయన్న అభిప్రాయానికి అవకాశం కలిగింది. ఢిల్లీ ఫలితం ఆయన డీలా పడేలా చేయడమే కాక, ఆలోచనలో పడేసిందన్న సంకేతాన్నీ ఇచ్చింది. ఈ పని ఆయన ఎప్పుడో చేసి ఉంటే ఇటువంటి అభిప్రాయాలకు అవకాశం కలిగేది కాదు. ఎందుకు చేయలేదో! పరిస్థితిని రాజకీయంగా అంచనా వేయడంలో మోడీ విఫలమయ్యారన్న సందేశాన్నే ఇది ఇస్తోంది.ఇది ఆయననుంచి ఊహించనిదే.

దిగ్భ్రాంతి కలిగించినది, ఆయన పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడడం. విదేశాంగ కార్యదర్శిని ఇస్లామాబాద్ పంపుతుండడం. ముంబైపై దాడులకు బాధ్యులైనవారిని శిక్షించేవరకు, మనదేశంలో ఉగ్రవాద చర్యలను విరమించేవరకు పాకిస్తాన్ తో మాట్లాడకూడదన్నది యూపీయే హయాం నుంచీ బిజెపి నొక్కి చెబుతూ వచ్చిన విధానం. మోడీ అధికారంలోకి రాగానే ఆ విధానం నుంచి పక్కకు జరగడం చూశాం. సరే,  కొత్త ప్రభుత్వం విదేశీ వ్యవహారాలను సరికొత్తగా తన చేతుల్లోకి తీసుకుని, పొరుగు దేశాలకు దగ్గరయ్యే సదుద్దేశం దాని వెనుక ఉందనుకుందాం. కానీ ఆ తర్వాత భారత్ లో  పాకిస్తాన్ హై కమిషనర్ కాశ్మీరీ వేర్పాటువాదులతో మాట్లాడడం పై మోడి ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ పాకిస్తాన్ తో ఇక మాటలు లేవన్న విధానం తీసుకుని విదేశాంగ కార్యదర్శుల మధ్య జరగవలసిన  చర్చలను రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో మోడీ పాకిస్తాన్ ప్రధానితో ఫోన్ చేసి మాట్లాడడం దిగ్భ్రాంతికి కారణం. అందులో మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయం క్రికెట్ నెపంగా ఆ పని చేయడం. ఆపైన ఒక్క పాకిస్తాన్ తోనే మాట్లాడారనిపించకుండా సార్క్ దేశాల అధినేతలు అందరితోనూ మాట్లాడడం.  విదేశాంగ విధానం చాలా సీరియెస్ వ్యవహారం. అందులోనూ పాకిస్తాన్ విషయంలో మరింతగా. అందులో క్రికెట్ ను, సార్క్ ముసుగును చొప్పించడం విదేశాంగవిధానాన్ని చాలా పలచన చేస్తాయి. అంతకంటే దారుణం ఏమిటంటే, కాశ్మీర్ లో పిడిపితో కలసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో పాక్ ప్రధానితో మోడి మాట్లాడడం భిన్న సంకేతాలనివ్వడానికి అవకాశముంది. విదేశాంగ వ్యవహారాలలో దేశీయ రాజకీయాలను చొప్పించడం చాలా నేలబారు ధోరణే కాక ప్రమాదకరమైన ధోరణి కూడా.

చర్చలకు బ్రేకు వేసింది భారత్ యే కనుక, చర్చల ప్రతిపాదన వాళ్ళ దగ్గరనుంచే రావాలని పాకిస్తాన్ బెట్టు చేసిందట కూడా. కాశ్మీరీ వేర్పాటు వాదులతో మాట్లాడబోమని పాకిస్తాన్ నుంచి హామీ తీసుకున్నాకే మోడి తిరిగి మాటలు కలిపేందుకు సిద్ధమయ్యారా అంటే అదీ లేదు. ఇది ఏకపక్షంగా మెట్టు దిగడమే. ఇది మోడీ నుంచి కలలో కూడా ఎవరూ ఊహించని విషయం.

ఈ రెండు చర్యలలోనూ మొదటిది ఢిల్లీ ఫలితం నేపథ్యంలో మోడీలోని కలవరపాటును, రెండోది విదేశాంగవిధానంలో అస్థిరతను, అయోమయాన్ని, దానిని పలుచన చేయడాన్ని చూపిస్తున్నాయి.




Wednesday, February 11, 2015

సోషల్ ఇంజనీర్ కృష్ణుడు!

కృష్ణుడికి అమ్మవార్లతో ఉన్న స్పర్థ అనేక కథల్లో కనిపిస్తుంది. అతను బాలుడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి విషపూరితమైన పాలు చేపి అతన్ని చంపడానికి ప్రయత్నించగా అతడే ఆమెను చంపాడన్నది మనకు బాగా తెలిసిన కథ. అయితే, పూతన రాక్షసి కాదనీ, బహుశా పిల్లలకు సోకే ఆటలమ్మ రూపంలోని ఒక అమ్మవారనీ కోశాంబీ(The Culture and Civilization of ANCIENT INDIA in Historical Outline) అంటారు. ఉషస్సనే స్త్రీని ఇంద్రుడు చంపాడని చెబుతున్నా, ఆమె బతికి బయటపడినట్టుగా; పూతనను కృష్ణుడు చంపాడని అన్నా ఆమె చావలేదనీ, మధుర ప్రాంతంలో ఇప్పటికీ పిల్లలకు పూతన పేరు పెడతారనీ ఆయన వివరణ.

Thursday, February 5, 2015

పురుషులు వెళ్లకూడని స్త్రీల రహస్య ప్రదేశాలు

స్త్రీలకు చెందిన రహస్యప్రదేశాల్లోకి, అంటే వనాలు, కొలనులు మొదలైన చోట్లలోకి  పురుషులు ప్రవేశించకూడదనీ, ఒకవేళ ప్రవేశిస్తే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న సంగతిని ఇంతకు ముందు ఒక వ్యాసంలో రెండు గ్రీకు పురాణ కథల ద్వారా చెప్పుకున్నాం. మన దేవీభాగవతం లో కూడా అలాంటి కథే ఒకటుంది:


వివస్వంతుడనే రాజుకు శ్రాద్ధదేవుడనే కొడుకు ఉన్నాడు. అతనికి ఎంతకాలానికీ పిల్లలు కలగలేదు. మగపిల్లవాడి కోసం  వశిష్టుని సలహాపై పుత్రకామేష్టి జరిపాడు. అయితే అతని భార్య శ్రద్ధాదేవి ఆడపిల్ల కోసం హోమం చేయించింది. కొంతకాలానికి ఆమె గర్భవతై ఆడపిల్లను ప్రసవించింది. ఆమెకు ఇల అని పేరుపెట్టారు. ఆడపిల్ల పుట్టినందుకు నిరుత్సాహం చెందిన భర్త ఈశ్వరుని ప్రార్థించాడు. ఈశ్వరుడు అనుగ్రహించడంతో ఇల కాస్తా పురుషుడుగా మారిపోయింది. అతనికి సుద్యుమ్నుడని పేరు పెట్టారు.