Saturday, February 14, 2015

మోడి సంధించిన ఒక ఆశ్చర్యం, ఒక దిగ్భ్రాంతి!

ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా చేసిన రెండు పనుల్లో ఒకటి ఆశ్చర్యాన్ని, ఇంకొకటి దిగ్భ్రాంతిని  కలిగించాయి.

 ఆశ్చర్యం కలిగించినది, ఢిల్లీలో ఒక క్రైస్తవ విద్యాసంస్థలో దొంగతనం జరగడంతో పోలిస్ కమిషనర్ ను పిలిచి ఇటువంటివి జరగకుండా చూడమని చెప్పడం. చర్చిలపై జరుగుతున్న దాడులపై  ఏమీ మాట్లాడడం లేదనే ఆయనపై మూడు నెలలుగా వినిపిస్తున్న ఆరోపణ. ఎన్నికల సమయంలో కూడా ఆ విమర్శ వినిపించింది. అయినా సరే, ఆయన మాట్లాడలేదు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా పోలిస్ కమిషనర్ ను పిలిపించి మాట్లాడడమే ఆశ్చర్యానికి కారణం.

ఆయన చేసింది అభినందనీయమే. అయితే ఆ చర్య ఆయనను ఇప్పటివరకు చూస్తున్నదానికి భిన్నమైన తీరులో చూపించింది. ఢిల్లీ ఫలితం, అరవింద్ కేజ్రివాల్ ప్రభావం ఆయనచేత ఆ పని చేయించాయన్న అభిప్రాయానికి అవకాశం కలిగింది. ఢిల్లీ ఫలితం ఆయన డీలా పడేలా చేయడమే కాక, ఆలోచనలో పడేసిందన్న సంకేతాన్నీ ఇచ్చింది. ఈ పని ఆయన ఎప్పుడో చేసి ఉంటే ఇటువంటి అభిప్రాయాలకు అవకాశం కలిగేది కాదు. ఎందుకు చేయలేదో! పరిస్థితిని రాజకీయంగా అంచనా వేయడంలో మోడీ విఫలమయ్యారన్న సందేశాన్నే ఇది ఇస్తోంది.ఇది ఆయననుంచి ఊహించనిదే.

దిగ్భ్రాంతి కలిగించినది, ఆయన పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడడం. విదేశాంగ కార్యదర్శిని ఇస్లామాబాద్ పంపుతుండడం. ముంబైపై దాడులకు బాధ్యులైనవారిని శిక్షించేవరకు, మనదేశంలో ఉగ్రవాద చర్యలను విరమించేవరకు పాకిస్తాన్ తో మాట్లాడకూడదన్నది యూపీయే హయాం నుంచీ బిజెపి నొక్కి చెబుతూ వచ్చిన విధానం. మోడీ అధికారంలోకి రాగానే ఆ విధానం నుంచి పక్కకు జరగడం చూశాం. సరే,  కొత్త ప్రభుత్వం విదేశీ వ్యవహారాలను సరికొత్తగా తన చేతుల్లోకి తీసుకుని, పొరుగు దేశాలకు దగ్గరయ్యే సదుద్దేశం దాని వెనుక ఉందనుకుందాం. కానీ ఆ తర్వాత భారత్ లో  పాకిస్తాన్ హై కమిషనర్ కాశ్మీరీ వేర్పాటువాదులతో మాట్లాడడం పై మోడి ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ పాకిస్తాన్ తో ఇక మాటలు లేవన్న విధానం తీసుకుని విదేశాంగ కార్యదర్శుల మధ్య జరగవలసిన  చర్చలను రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో మోడీ పాకిస్తాన్ ప్రధానితో ఫోన్ చేసి మాట్లాడడం దిగ్భ్రాంతికి కారణం. అందులో మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయం క్రికెట్ నెపంగా ఆ పని చేయడం. ఆపైన ఒక్క పాకిస్తాన్ తోనే మాట్లాడారనిపించకుండా సార్క్ దేశాల అధినేతలు అందరితోనూ మాట్లాడడం.  విదేశాంగ విధానం చాలా సీరియెస్ వ్యవహారం. అందులోనూ పాకిస్తాన్ విషయంలో మరింతగా. అందులో క్రికెట్ ను, సార్క్ ముసుగును చొప్పించడం విదేశాంగవిధానాన్ని చాలా పలచన చేస్తాయి. అంతకంటే దారుణం ఏమిటంటే, కాశ్మీర్ లో పిడిపితో కలసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో పాక్ ప్రధానితో మోడి మాట్లాడడం భిన్న సంకేతాలనివ్వడానికి అవకాశముంది. విదేశాంగ వ్యవహారాలలో దేశీయ రాజకీయాలను చొప్పించడం చాలా నేలబారు ధోరణే కాక ప్రమాదకరమైన ధోరణి కూడా.

చర్చలకు బ్రేకు వేసింది భారత్ యే కనుక, చర్చల ప్రతిపాదన వాళ్ళ దగ్గరనుంచే రావాలని పాకిస్తాన్ బెట్టు చేసిందట కూడా. కాశ్మీరీ వేర్పాటు వాదులతో మాట్లాడబోమని పాకిస్తాన్ నుంచి హామీ తీసుకున్నాకే మోడి తిరిగి మాటలు కలిపేందుకు సిద్ధమయ్యారా అంటే అదీ లేదు. ఇది ఏకపక్షంగా మెట్టు దిగడమే. ఇది మోడీ నుంచి కలలో కూడా ఎవరూ ఊహించని విషయం.

ఈ రెండు చర్యలలోనూ మొదటిది ఢిల్లీ ఫలితం నేపథ్యంలో మోడీలోని కలవరపాటును, రెండోది విదేశాంగవిధానంలో అస్థిరతను, అయోమయాన్ని, దానిని పలుచన చేయడాన్ని చూపిస్తున్నాయి.




4 comments:

  1. Amid the raging controversy over the alleged attacks on Christian institutions, Delhi Police has told the Prime Minister’s Office (PMO) that the majority of incidents are merely theft cases and the crimes concern all religious places, including temples, mosques and gurdwaras. Temples have been the easiest targets for burglars. Delhi Police has registered 206 temple theft cases whereas only three cases on churches were registered in 2014. The report says 14 mosques and 30 gurdwaras were also targeted last year.

    Kalibari Temple, CR Park “These are not communal incidents but common robberies. It was alleged that the Church of The Resurrection in Rohini was set afire on January 3 but the probe revealed it was triggered by a short-circuit,” the report suggests.

    http://www.newindianexpress.com/thesundaystandard/Stealing-Communal-Advantage-Leaves-Cops-Fuming/2015/02/15/article2668964.ece

    కాంగ్రెస్ పార్టి వారిలా మోడి సంకేతాలు, సందేశాలు పంపించటం అలవాటైతే బిజెపి పార్టి వచ్చే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టిలా తయారౌతుంది. ఇప్పటికే ఆయన ప్రత్యర్దుల విషయాలలో కఠినంగా స్పందించటం లేదని సోషల్ మీడీయాలో అభిమానులు ఆరోపిస్తున్నారు. మోడిని వ్యతిరేకించిన అమీర్ ఖాన్, బర్ఖ దత్ వంటి సూడో సెక్యులరిస్ట్ లతో పోటొలు దిగినపుడే ఆశ్చర్యపోయారు. వాళ్ళకి విలువలు లేక పోవచ్చు. నమో అలా కాదు కదా!

    ReplyDelete
  2. మోడి ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను పిలిచి మాట్లాడినట్టు వార్త రావడమంటే సంకేతం, సందేశం పంపించడమే నండి. ఢిల్లీలో ఉండే ప్రధాని ఏమనుకుంటున్నారో తమిళనాడు లాంటి దూర ప్రాంతాలవారికి తెలియాలంటే ప్రజాస్వామ్యంలో సంకేతాలు, సందేశాలు తప్పనిసరి. మన్మోహన్ సింగ్ ఆ విషయంలో తప్పు చేశారనే విమర్శ. కనుక మోడి కాంగ్రెస్ చేసిన తప్పే చేసి బిజెపి ని కాంగ్రెస్ లా తయారుచేయడం సమంజసమంటారా?
    మీరు కోట్ చేసిన వ్యాసంలో అన్నట్టు దొంగతనం కేసులే అనుకుందాం. కానీ మూడు నెలలుగా అవి కమ్యూనల్ దాడులనే నన్న అభిప్రాయం, ప్రధాని మాట్లాడడం లేదన్న విమర్శ వస్తున్నప్పుడు అవి దొంగతనం కేసులే నన్న సంగతినే ప్రధాని చెప్పి ఉండవలసింది. ఆ మౌనం ప్రభావం ఢిల్లీ ఫలితంలో ఎంతో కొంత కనిపించే ఉంటుంది.

    ReplyDelete
  3. ఇంకో విషయం. మోడీ ప్రత్యర్థులపై కఠినంగా స్పందించడంలేదని ఎలా అనుకున్నారో కానీ అది నిజం కాదండీ. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను ఆయన స్పేర్ చేయలేదు. ఒకవేళ నేరారోపణలు ఉన్న ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకుని మీరు అలా అని ఉంటే, మోడీ కఠినంగానో మరోలానో కాదు కానీ చట్టబద్ధంగా చర్య తీసుకోవలసిందే. లేకపోతే కాంగ్రెస్, మన్మోహన్ ల పరిస్థితే పునరావృతమవుతుంది.
    మీరన్నట్టు మోడీతో ఫోటో దిగిన అమీర్ ఖాన్, బర్ఖాదత్ లకు విలువలు లేని మాట నిజమే.

    ReplyDelete

  4. మాట్లాడితేను తప్పు ! మాట్లాడక పోతేను తప్పు ! అబ్బబ్బా ! ఈ అన్వేషకులు, అనలిస్టులు కున్న టైము కార్యాచరణ లో దేశం లో ఉంటె దేశం ఎప్పుడో బాగు పడేను కదా ! (మోడీ స్వగతం) ...

    फिर छोडिये, उनका भी रोजका रोटी टिकाना है ना !!

    चियर्स
    जिलेबी

    ReplyDelete