Tuesday, July 19, 2016

కాంగ్రెస్ చేసిన తప్పులే బీజేపీ చేయాలా!?

చాలా రోజుల తర్వాత బ్లాగులో రాజకీయ వ్యాఖ్య రాస్తున్నాను.

కాంగ్రెస్ చేయని పనులు కొన్ని బీజేపీ చేస్తుంది(చేస్తోంది). అలాగే కాంగ్రెస్ చేసిన ఎన్నో పనులు కూడా బీజేపీ చేస్తుంది(చేస్తోంది). అలాగే కాంగ్రెస్ కూడా.

ఉదాహరణకు కాంగ్రెస్ మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. బీజేపీ మీద కూడా కొన్నైనా వచ్చాయి. అప్పుడు బీజేపీని ఆ విషయమై కాంగ్రెస్ అడిగిందనుకొంది, అప్పుడు మీ మీద ఉన్న అవినీతి ఆరోపణల సంగతేమిటని బీజేపీ అడుగుతోంది.

రాజ్యాంగ పదవుల్ని, ఇతర ప్రజాస్వామిక వ్యవస్థలను దెబ్బతీస్తోందని బీజేపీ మీద కాంగ్రెస్ ఆరోపణ చేసిందనుకోండి, మీరు ఆయావ్యవస్థలను భ్రష్టు పట్టించలేదా అని బీజేపీ అడుగుతుంది.

భావప్రకటనా స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందని కాంగ్రెస్ అందనుకోండి, అందులో మిమ్మల్ని మించిన ఘనులు ఎవరుంటారని అంటూ బీజేపీ ఎమర్జెన్సీ ని ఎత్తిచూపుతుంది.

ఇలా చాలా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోవచ్చు...

ఇవాళ లోక్ సభలో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో ఎన్డీయే వ్యవహార సరళి, న్యాయస్థానంలో అది బెడిసికొట్టడం చర్చలోకి వచ్చింది. ప్రభుత్వాలను కుప్ప కూల్చిన చరిత్రలోనూ, వాటి సంఖ్యలోనూ మిమ్మల్ని మించినవాళ్ళు ఎవరున్నారని హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జవాబిచ్చారు.

నాకు వచ్చిన సమస్య ఏమిటంటే, కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ కూడా చేయడం; నువ్వు తప్పు చేయలేదా అంటే నువ్వు చేయలేదా అని ఒకరినొకరు నిందించుకోవడం; ఈ ద్వై పాక్షిక వాగ్యుద్ధానికి జనం నిశ్శబ్ద శ్రోతలుగా ఉండడం... ఇదేనా రాజకీయమంటే?! ఈ జనానికి కూడా కాస్త ఆలోచనాశక్తి, సొంత అభిప్రాయాలూ ఉంటాయని బొత్తిగా తెలియనట్లుగా, లేదా బొత్తిగా పట్టనట్టుగా రాజకీయపక్షాలు ఎలా వ్యవహరిస్తాయి? దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్సే ఇలాంటి రాజకీయచర్చా సరళికి బాధ్యత వహించాలనీ, అదే ఈ ధోరణిని పెంచి పోషించిందనీ అనుకుందాం. కాంగ్రెస్ కన్నా గొప్ప పరిపాలన అందిస్తామనీ, గొప్ప ఒరవడులు కల్పిస్తామనీ చెప్పే బీజేపీ కూడా అలాగే ఎందుకు చేస్తోంది? తను ఈ సరళిని మార్చవచ్చు కదా!

జనంలో అందరూ కాంగ్రెస్ వాదులో, బీజేపీ వాదులో ఉండరు. ఉన్నా మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పేవారు వాళ్ళలో చాలామంది ఉంటారు. ఈ పార్టీలు వాళ్ళ ఉనికినే పట్టించుకోనట్టు ఎలా ఉంటాయి?

ఈ సందర్భంలో నా సొంత అనుభవం ఒకటి చెప్పుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను.

2004-05లో కాబోలు బీహార్ లో లాలూప్రసాద్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి ప్రమాదంలో పడింది. బీజేపీ మద్దతు గల నితీశ్ కుమార్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం  హుటాహుటిన రంగంలోకి దిగి గవర్నర్ నుంచి అనుకూల నివేదికను తెప్పించుకుని రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత రాష్ట్రపతి పాలన విధింపునకు మంత్రివర్గ నిర్ణయం తీసుకుని రష్యాలో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి అర్థరాత్రి ఆమోద ముద్ర తెప్పించుకుని రాష్ట్రపతి పాలన విధించింది.

అప్పుడు నేను వార్త దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్నాను. యూపీఏ చర్యను అర్థరాత్రి ప్రజాస్వామ్యహత్యగా వర్ణిస్తూ చాలా ఘాటైన ఎడిటోరియల్ రాశాను. ఆ పత్రిక యజమాని అప్పుడు కాంగ్రెస్ లో ఉండడమే కాదు, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నేతలనుంచి వరసపెట్టి ఆయనకు ఫోన్లు. ఎడిటర్ గా ఉన్న టంకశాల అశోక్ గారిని దీనిపై ప్రశ్నించారు. "అవును. నాకూ అలాగే అనిపించింది. ఆయనకూ అలాగే అనిపించింది. అదే రాశారు. తప్పేమిటి?" అన్నారు.  విశేషమేమిటంటే దానిపై ఆయన ఆ తర్వాత ఏమీ అనలేదు.
                                                                       ***
రోజులు, జనం ఆలోచనలు మారాయన్న సంగతి గతంలో యూపీఏ గమనించుకోలేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. యూపీఏ రెండోవిడత పాలనా కాలాన్నే చూడండి. అప్పటికి మీడియా చాలా వ్యాప్తి చెందింది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాజకీయచర్చల ప్రత్యక్షప్రసారాలు, వాగ్యుద్ధాలు జనం డ్రాయింగ్ రూమ్ లకు చేరిపోయాయి. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో మీడియా శక్తియుక్తులు, పాత్రా సహస్రాధికంగా పెరిగిపోయాయి. ఈ దశలో తనపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై మన్మోహన్ ప్రభుత్వం దీర్ఘమౌనం పాటించి అభాసు పాలయ్యింది. దాని పతనం 2010-11 నాటికే ఖరారు అయిపోయింది. 2014 లో జరిగింది అది క్రియారూపం ధరించడం మాత్రమే.

ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఉదాహరణల ద్వారా బీజేపీ కూడా సరిగ్గా కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తోంది.
                                                                    ***

అందుకే అంటున్నాను...కాంగ్రెస్ తన అరవై ఏళ్ళకు పైబడిన పాలనలో చేసిన తప్పులనే చేసే లగ్జరీ బీజేపీకి లేదు. ఎన్నేళ్లలో వంతెన కింద చాలా నీళ్ళు ప్రవహించాయి. నేటి  జనం నిన్నటి జనం కాదు. నేటి మీడియా నిన్నటి మీడియా కాదు. మనిషికి వయసుతో పాటు లోకజ్ఞానం పెరుగుతుంది, మంచి చెడులను అంచనా వేసే వివేకమూ పెరుగుతుంది. చిన్నప్పుడు చేసిన తెలివితక్కువ పనులను పెద్దయిన తర్వాత చేయడు. అలాగే, ప్రజాస్వామ్య అనుభవమూ అవగాహనా కూడా కాలంతోపాటు పెరుగుతాయి. చిన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్నే ఇప్పుడు మేమూ చేస్తామంటే కుదరదు. అది వితండవాదన అవుతుంది. అంతకన్నా ఎక్కువగా అది ఆత్మహానికి దారితీస్తుంది.



No comments:

Post a Comment