Tuesday, September 29, 2015

బోస్ వివాదం-3: పత్రాలలో దాగిన 'రహస్యం' ఏమిటి?

బోస్ కు పెరిగిన మద్దతు
అహింసతో సహా గాంధీ విధానాలు, వ్యూహాలు అన్నీ విఫలమై కాంగ్రెస్ లోనే కాక దేశం మొత్తంలోనే ఆయన దాదాపు ఒంటరిగా మారిన సందర్భం ఇది. ఒకపక్క జనంలో బ్రిటిష్ వ్యతిరేకత తారస్థాయికి చేరగా, ఆసియా దేశమైన జపాన్ చేతిలో పాశ్చాత్యశక్తులు చిత్తుగా ఓడిపోతుండడం ఆ దేశంపట్ల వారిలో అనుకూలభావాన్నీ అదే స్థాయిలో పెంచింది. ఈ మధ్యలో 1941లో బోస్ తన కలకత్తా నిర్బంధం నుంచి నాటకీయంగా తప్పించుకుని అప్ఘానిస్తాన్ మీదుగా జర్మనీ పారిపోయి, బెర్లిన్ నుంచి చేసిన రేడియో ప్రసంగాలు దానికి మరింత ఊతమిచ్చాయి. కాంగ్రెస్ లో ఎక్కువమంది నాయకులు, కార్యకర్తలు బోస్ వైపు తిరిగారు. జర్మనీనుంచి ఆయన జపాన్ చేరుకుని జలాంతర్గాములను సేకరించబోతున్నట్టు వార్తవచ్చింది. బోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ సేనలతో కలసి భారత-బర్మా సరిహద్దుల్లో వీరోచితపోరాటం చేసింది. అయితే ఓటమిని మూటగట్టుకున్న సందర్భాలే ఎక్కువ. పరిస్థితి పూర్తిగా తన పట్టు జారిపోతోందనుకున్న గాంధీ ప్రజలమనోభావాలకు అనుగుణంగా క్విట్ ఇండియా నినాదాన్ని అందుకున్న తర్వాతే మళ్ళీ జనం ఆయనవైపు మళ్ళడం ప్రారంభించారు.
హిట్లర్ మరణం-జపాన్ లొంగుబాటు
అంతవరకూ యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా, పెరల్ హార్బర్ పై జపాన్ దాడిచేసేసరికి యుద్ధంలోకి అడుగుపెట్టింది. దాంతో బ్రిటన్ యుద్ధపాటవం అనేకరెట్లు పెరిగి బలాబలాలు తారుమారయ్యాయి. 1945 నాటికి హిట్లర్ మరణించడం, అణుబాంబు ప్రయోగంతో జపాన్ లొంగిపోవడం, ఆ వెనువెంటనే తైవాన్ లో జరిగిన విమానప్రమాదంలో బోస్ మరణించినట్టు వార్త రావడం సంభవించాయి. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయపరిణామాల మబ్బులు తొలగిపోయి జాతీయరాజకీయాలు తిరిగి తేటపడడం ప్రారంభించాయి. ఇప్పుడు బోస్ లేకపోవడం ఒక్కటే తేడా.
ఎవరు ఎంత బాధ్యులు?
జాతీయరంగస్థలినుంచి బోస్ నిష్క్రమణ రెండు అంచెలలో జరిగింది. మొదటిది, కాంగ్రెస్ నుంచి నిష్క్రమణ. రెండోది, మరణం లేదా అంతర్ధానం రూపంలో జరిగిన నిష్క్రమణ. ఎలాంటి బాధ్యులన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే; కాంగ్రెస్ నుంచి బోస్ నిష్క్రమణకు గాంధీ, నెహ్రూ తదితరులే బాధ్యులవుతారు. అదే, ఆయన మరణం లేదా, అంతర్ధానానికి బాధ్యులెవరన్నప్పుడు అంతర్జాతీయశక్తులు తప్పనిసరిగా అడుగుపెడతాయి. జర్మనీ, జపాన్ లతో తలపడుతున్న బ్రిటిష్ కు, ఆ రెండు దేశాల నుంచి సాయం పొందుతున్న బోస్ కదలికలపై నిఘావేయాల్సిన అవసరం స్పష్టమే. ఆయన కుటుంబసభ్యులపైకి దానిని పొడిగించడమూ సహజమే. రహస్యపత్రాలు బయటపెడితే  కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బతినచ్చని ఇప్పటి కేంద్రప్రభుత్వం వినిపిస్తున్న వాదన కూడా; బోస్ మరణం’, లేదా అంతర్ధానం వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర గురించిన అనుమానాన్ని బలోపేతం చేసేలానే ఉంది.
కాంగ్రెస్ నుంచి బోస్ నిష్క్రమణకు గాంధీ, నెహ్రూ తదితరులు ఎలాంటి బాధ్యులన్న ప్రశ్న చూద్దాం. అందుకు కారణం వ్యక్తిగత రాగద్వేషాలు, అధికారంలో పోటీ అవుతాడన్న భావనే అన్న నిర్ధారణకు అవకాశంలేకుండా భావజాల పరమైన వ్యత్యాసాలు ఉండనే ఉన్నాయి. బోస్-గాంధీలది హింస-అహింసల మధ్య పెనుగులాట. బోస్-నెహ్రూలది ఫాసిస్టు-ఫాసిస్టు వ్యతిరేకశక్తుల మధ్య స్పర్థ. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి నెహ్రూకు ఇచ్చిన అవకాశాన్ని బోస్ కు గాంధీ నిరాకరించడాన్నీ, బోస్ కు నెహ్రూ మద్దతు ఇవ్వకపోవడాన్నీ అర్థం చేసుకోడానికి ఇదొక కోణం. ఒకవేళ గాంధీ, నెహ్రూలను బోస్ విషయంలో ముద్దాయిలుగా పరిగణించాల్సివచ్చినా పెద్ద ముద్దాయి గాంధీ అవుతాడు కానీ, నెహ్రూ అవడు. బోస్ తో గాంధీకి ఉన్నంత విభేదం నెహ్రూకు లేదని చెప్పుకున్నాం. అయితే, నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ కుటుంబ సభ్యులపై నిఘా ఎందుకు కొనసాగించాయన్న ప్రశ్న వస్తుంది. పరిపాలనా కోణం నుంచి చూస్తే అదేమంత విశేషం అనిపించదు. సంఘపరివార్ వర్గాలు, వామపక్ష తీవ్రవాదులతో సహా కొన్ని రకాల భావజాలాలవారిపై ఇంటెలిజెన్స్ నిఘా ఎప్పుడూ ఉంటూనే ఉంది.  
బోస్ మరణం’, లేదా అంతర్ధానం వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర ఉన్నట్టు కేంద్రం వద్ద ఉన్న రహస్యపత్రాలు వెల్లడిస్తూ ఉంటే, ఆ విషయం నెహ్రూ ఎందుకు బయటపెట్టలేదనే ప్రశ్న వస్తుంది. అందులో కూడా ఆయనను మొదటి ముద్దాయిగా నిర్ధారించాలంటే, ప్రస్తుత ప్రభుత్వం తన దగ్గరున్న అన్ని రహస్యపత్రాలనూ బయటపెట్టాలి!
బోస్ ప్రతిష్టను మసగబార్చారనీ, స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్రను తక్కువచేశారనే ఆరోపణలు, అనుమానాలు  సహజమే కానీ; పూర్వాపరాల అవగాహన లోపించినప్పుడు అవి కేవలం సొంత అభిమాన ప్రకటనలుగానో, రాజకీయఫ్రేరితాలుగానో తేలిపోతాయి. గాంధీకి బోస్ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. తమిద్దరివీ రెండు భిన్నమార్గాలుగానే చూశాడు. బోస్ దేశభక్తిని, సాహసప్రవృత్తిని ఆకాశానికి ఎత్తాడు. నీ మార్గంలో నువ్వు విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తానని కూడా ఒకసారి బోస్ కు రాశాడు. ఒకవేళ జపాన్-జర్మనీ కూటమే గెలిచి ఉంటే ఆ విజయం బోస్ మార్గానికే దక్కి, భారత్ చరిత్రే భిన్నమైన మలుపు తిరిగేది. కానీ అలా జరగలేదు. జపాన్-జర్మనీ ఓటమి బోస్ ను శాశ్వతంగా తెరమరుగు చేసి గాంధీ-నెహ్రూ భావజాలాన్ని విజయతీరం చేర్చింది.
ఒకవేళ కేంద్రం వద్ద ఉన్న రహస్యపత్రాలు కూడా వెల్లడై, అన్నివిధాలా నెహ్రూనే విలన్ గా స్థాపించిన పక్షంలో, అప్పుడది వేరే కథ! 
                                                                                     (అయిపోయింది)

7 comments:


 1. ఒకవేళ ఆ పత్రాలు నెహ్రూని దోషిగా నిర్ధారిస్తే ,కాంగ్రెస్ ప్రభుత్వం దాచి పెట్ట వచ్చు గాని ,ప్రస్తుత B.J.P.ప్రభుత్వానికది ఇష్టమే కదా.అందువల్ల వేరే కారణాలు ఏమైనా ఉండవచ్చు కదా.

  ReplyDelete
  Replies
  1. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయనడంలోనే ఆ వేరే కారణం సూచనగా కనిపిస్తూనే ఉంది కమనీయంగారూ...

   Delete

 2. ఒకవేళ ఆ పత్రాలు నెహ్రూని దోషిగా నిర్ధారిస్తే ,కాంగ్రెస్ ప్రభుత్వం దాచి పెట్ట వచ్చు గాని ,ప్రస్తుత B.J.P.ప్రభుత్వానికది ఇష్టమే కదా.అందువల్ల వేరే కారణాలు ఏమైనా ఉండవచ్చు కదా.

  ReplyDelete
 3. బీజేపీ కీ కాంగ్రెస్ కీ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతవరకూ రామజన్మభూమి విషయం లో అద్వానీ ని అరెష్టు చేయకూడదు అలాగే బిజేపీ అధికారంలో ఉన్నంతవరకూ బోఫోర్స్ విషయం ఎత్తకూడదు.నెహ్రూ దోషి అయితే నిరూపించే ధైర్యం ఉండాలి కదా ?

  ReplyDelete
  Replies
  1. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే నీహారికగారూ...ఏ 'ఒప్పంద'మైనా బయటపడేవరకూ 'రహస్య'మే. నిర్ధారణగా తెలిసినదానికి ఉండే విలువ ఊహాగానాలకు సహజంగానే ఉండదు.

   Delete
 4. కల్లూరి భాస్కరం గారూ,
  ఇప్పుదు ఆ పత్రాలు బయటపడినందు వల్ల దేశం లోపల కొత్తగా విరగబడిపోయే మార్పు యేదీ జరగదు.దేశం బయట మాత్రం కొన్ని ఇబ్బందులు యెదురు కావచ్చు ననేది కూడా నిజమే.ఇప్పుడు భారత్ భద్రతామందలి లో వీటో పవర్ కోసం గట్టిగా అడుగున్నది,దానికి సహకరించాల్సిన కొన్ని దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉంది బోసు వ్యవహారంలో!

  నాకు వ్యక్తిగతంగా కూడా ఈ విషయం మీద అంత ఆసక్తి లేదు.మొదట్లో నేనూ ఒక పోష్టు రాద్దామనుకుని కొంత పని మొదలు పెట్టినా పోను పోనూ ఆసక్తి తగ్గిపోయి వదిలేశాను.మీ ముక్తాయింపు కూడా అలానే ఉంది,కదూ!

  అసలైనవి రెండు నిరూపితమైన విషయాల మధ్యన ఒక అగాధం ఉంది.దామ్మి బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమే.యేది నిజం?!" బ్లాగరు ఒక చిత్రమైన సంగతిని ప్రస్తావించారు.ఆయ్న ఇక్కడ ఇచ్చిన లింకుకి వెళ్ళి చూశాను.మీరు కూడా ఆది చూసారు గదా!అక్కడ ఆయన లేవనెత్తిన "ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 1945 Aug 18న ఫ్లైట్ ఆక్సిడెంట్ లో సుభాష్ మృతి చెందినట్టుగా అప్పటికే అధికారిక సమాచారముంది. అది జగమెరిగిన సత్యం(?).మరి ఈ విషయం లో నెహ్రూ అంత హుటాహుటిన అట్లీకి (1945 Dec) మీ యుధ్ధఖైదీని మీరేమి చేసుకున్నా మాకభ్యంతరం లేదని ఉత్తరం రాయటంలో మతలబు ఏమైవుంటుంది?" అన్న మిలియన్ డాలర్ల ప్రశ్న గట్టిదే!

  విమాన ప్రమాదంలో చచ్చిపోయాడని తనే నిర్ధారించిన వ్యక్తిని గురించి మీరేం చేసుకున్నా మాకు అనవసరం అని చనిపోయాడని చెప్పిన అయిదు నెలల తర్వాత అనటం అర్ధం లేని పని కాదా?

  ReplyDelete
  Replies
  1. "ఇప్పుదు ఆ పత్రాలు బయటపడినందు వల్ల దేశం లోపల కొత్తగా విరగబడిపోయే మార్పు యేదీ జరగదు"-నిజమే. జనజీవితం మీద ఎలాంటి మార్పూ ఉండదు హరిబాబుగారూ. కానీ నెహ్రూ దోషి అని తేలితే దాని ప్రభావం కాంగ్రెస్ మీద, నెహ్రూ కుటుంబ వారసత్వం మీద ఉండచ్చు. రాజకీయంగా అది బిజెపికి లాభించవచ్చు. నెహ్రూ అట్లీకి రాసినట్టు చెబుతున్న ఆ లేఖను దర్యాప్తు కమిషన్లు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది అసలైన మిలియన్ డాలర్ ప్రశ్న.

   Delete