నెహ్రూ-బోస్
బోస్ కన్నా నెహ్రూ ఆరేళ్లు పెద్ద. పటేల్ తో ఆయన విభేదాలు
ప్రసిద్ధాలే. గాంధీతో కూడా ఆయనకు భావజాల, వ్యూహపరమైన విభేదాలుండేవి. కొన్ని
సందర్భాలలో, ‘ఇద్దరం తెగతెంపులు
చేసుకుందామా’ అనేవరకూ వెళ్లారు. విచిత్రం ఏమిటంటే, మిగతా ఎవరి మధ్యా లేనంత భావసమైక్యత నెహ్రూ, బోస్ ల
మధ్యే ఉండేది. ఇద్దరూ కాంగ్రెస్ లో రాడికల్స్ గా గుర్తింపు పొంది, ఆ వర్గానికి నాయకత్వం వహించారు. ఇద్దరూ కూడబలుక్కుని గాంధీకి నచ్చని
తీర్మానాలు తెచ్చి నెగ్గించుకున్న సందర్భాలున్నాయి. కాంగ్రెస్ నియమించిన మోతీలాల్
నెహ్రూ కమిటీ అధినివేశప్రతిపత్తిని కోరాలని సూచించినప్పుడు 1927లో మద్రాసు
కాంగ్రెస్ లో దానిని తోసిపుచ్చి, సంపూర్ణస్వరాజ్యాన్ని
డిమాండ్ చేస్తూ వీరు తెచ్చిన తీర్మానం ఒక ఉదాహరణ. 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్
ను వీరిద్దరూ కలసి తమ రాడికల్ భావాలతో ఒక ఊపు ఊపారు. అప్పుడు కూడా
అధినివేశప్రతిపత్తికి బదులు సంపూర్ణస్వరాజ్యానికి ఇద్దరూ పట్టుబట్టారు. గాంధీ
మెట్టు దిగి రాజీకి వచ్చాడు. గాంధీ ఇష్టానికి విరుద్ధంగా బ్రిటిష్ తో పూర్తిగా
తెగతెంపులు చేసుకోవాలని బోస్ సవరణ ప్రతిపాదిస్తే నెహ్రూ దానిని సమర్ధించాడు. గాంధీ
అస్పృశ్యతా నివారణపై మరీ ఎక్కువగా దృష్టి పెట్టడాన్నీ ఇద్దరూ వ్యతిరేకించారు. అలాగే
బ్రిటిష్ పట్ల గాంధీ సామరస్యవైఖరిని వ్యతిరేకించడంలోనూ ఇద్దరిదీ ఏకీభావమే.
అయితే ఇద్దరిలోనూ కొన్ని తేడాలూ ఉన్నాయి. గాంధీతో నెహ్రూ
ఒక్కోసారి తెగతెంపులవరకూ వెళ్ళినా వెనక్కి తగ్గేవాడు. ఆయన మౌలికంగా కాంగ్రెస్,
గాంధీల మనిషి. ఆ రెండు గొడుగుల అంచుల్లో వేళ్లాడేవాడే కానీ పూర్తిగా బయటికి
వచ్చేవాడు కాదు. బోస్ కు కాంగ్రెస్, గాంధీల పట్ల అంత
నిబద్ధతలేదు. నెహ్రూ కాంగ్రెస్ గుంపులో ఉంటూనే కొన్ని సందర్భాలలో ‘అలీనత’ను పాటించేవాడు. బోస్ పూర్తిగా ఒక వైపు
ఒరిగిపోయేవాడు. 1923లోనే కాంగ్రెస్ ‘ప్రో-ఛేంజర్స్’గా, ‘నో-ఛేంజర్స్’గా చీలిపోయి, తన
తండ్రి ‘ప్రో-ఛేంజర్స్’ శిబిరంలో
చేరినా నెహ్రూ రెండు శిబిరాలకూ దూరంగా ఉండడం ఆయన ‘అలీన’తకు ఒక చిత్రమైన ఉదాహరణ. బోస్ రెండోసారి అధ్యక్షుడైనప్పుడు ఆయనతో
అర్ధాంతరంగా రాజీనామా చేయించే ప్రయత్నాలలోనూ నెహ్రూ అలీనంగానే ఉండిపోయాడు. ఇంతకు
ముందు పలు సందర్భాలలో తనూ, బోస్ ఒకరికొకరు మద్దతు
ఇచ్చుకున్నా; కాంగ్రెస్ లో బోస్ ఒంటరి అయ్యే
క్లిష్టపరిస్థితిలో మాత్రం ఆయన నోరు తెరిచి మద్దతు అడిగినా నెహ్రూ ఇవ్వకుండా తటస్థంగా
ఉండిపోయాడు. అయితే, నెహ్రూ గతంలోనూ అలా అలీనంగా ఉండిపోయిన
సందర్భాలున్నాయి కనుక, బోస్ అడ్డు తొలగించుకోడానికే మద్దతు
ఇవ్వలేదని చటుక్కున నిర్ధారణకు రావడానికి వీల్లేదు. మొత్తంమీద నెహ్రూ-బోస్
సంబంధాలను పరిశీలిస్తే వారు విరోధించుకుని వీధికెక్కిన ఉదంతాలు లేవనే చెప్పవచ్చు.
అప్పటికి పద్దెనిమిదేళ్లుగా బోస్ తనతో మాటిమాటికీ
విభేదిస్తున్నా, తన నాయకత్వం విఫలమైందని ప్రకటించినా ఆయనతో
సర్దుబాటు చేసుకుంటూ రావడమే కాక; పట్టుబట్టి ఆయన్ను
కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి చేసిన గాంధీ-- రెండో విడత ఆయన అధ్యక్షుడైనప్పుడు దింపేవరకూ
ఎందుకు నిద్రపోలేదు? అలాగే, తనున్న
క్లిష్టపరిస్థితిలో బోస్ నోరు తెరిచి మద్దతు కోరినా నెహ్రూ ఎందుకు ఇవ్వలేదు? ఇవీ ఇక్కడ వేసుకోవలసిన ప్రశ్నలు.
అంతర్జాతీయదృక్కోణాలు
ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలంటే జాతీయరాజకీయాలనుంచి
అంతర్జాతీయరాజకీయాల్లోకి వెళ్ళాలి.
గాంధీ, నెహ్రూ,
రాజగోపాలాచారి, బోస్ తదితరులకు తమవైన అంతర్జాతీయ దృక్కోణాలున్నాయి.
గాంధీది బ్రిటిష్ పట్ల మిత్రవైరుధ్యమైతే, బోస్ ది
శత్రువైరుధ్యమని చెప్పుకున్నాం. నెహ్రూ సోవియట్ యూనియన్ ను అభిమానించేవాడు. 1938-42
మధ్యకాలంలో యూరప్ లో సంభవించిన కల్లోలం భారత్ ను, తదనుగుణంగా
జాతీయనాయకుల అంతర్జాతీయదృక్కోణాలనూ కూడా ప్రభావితం చేస్తూ వచ్చింది. జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు కలగలిసిపోయిన సందర్భమది.
1938లో జర్మనీ(హిట్లర్), ఇటలీ(ముసోలినీ), బ్రిటన్, ఫ్రాన్స్ ల మధ్యజరిగిన మ్యూనిక్ ఒప్పందం
చెకొస్లవేకియా విషయంలో హిట్లర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి అవకాశమిచ్చింది.
బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ ఆత్మగౌరవాన్ని హిట్లర్ కు తాకట్టు
పెట్టిన ఒప్పందంగా దానిని గర్హించిన గాంధీ; చెక్, యూదు జాతీయుల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు మద్దతు తెలిపాడు. ఇందుకు భిన్నంగా బోస్
ను జర్మనీ ‘తెగువా’, ఇటలీ ‘ఆత్మవిశ్వాసం’ ఆకట్టుకున్నాయి. బ్రిటిష్-కాంగ్రెస్ పొత్తును, కాంగ్రెస్ మంత్రివర్గాలను అంతమొందించి సామూహిక శాసనోల్లంఘన చేపట్టడానికి
ఇదొక అవకాశంగా కనిపించింది. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నది
అందుకే. ఆయనకు భిన్నంగా నెహ్రూ అన్ని రకాల ఫాసిస్ట్ శక్తులనూ వ్యతిరేకించే వైఖరి
తీసుకున్నాడు.
బోస్ జర్మన్ సంబంధాలు
ఇదే సమయంలో బోస్ కలకత్తాలోని జర్మన్ కాన్సూల్ తో సంబంధం
పెట్టుకుని ఏవో ఏర్పాట్లలో ఉన్నట్టు కేంద్ర గూఢచారి విభాగం వద్ద ఉన్న సమాచారాన్ని
బొంబాయిలో న్యాయశాఖమంత్రిగా ఉన్న కె.ఎం. మున్షీ సంగ్రహించి గాంధీకి ఇచ్చాడు. ఇటలీ నియంత ముసోలినీపట్ల కూడా బోస్ ప్రశంసాభావంతో ఉన్నట్టు అప్పటికే
ఆధారాలు కనిపించాయి. గాంధీకి ఇవి సహజంగానే కలవరం కలిగించాయి. హిట్లర్ కారణంగా
యూరప్ మొత్తాన్ని యుద్ధ మేఘాలు ఆవరించడం, జర్మనీ-రష్యాల మధ్య
సంధిజరగడం, హిట్లర్ సేనలు పోలండ్ లో అడుగుపెట్టడంతో జర్మనీతో
బ్రిటన్ యుద్ధానికి దిగడం, భారతీయులు వేల సంఖ్యలో యుద్ధంలో
చేరడం, 1941లో హిట్లర్ సోవియట్ యూనియన్ పై దాడి చేయగానే
భారత్ లోని కమ్యూనిష్టులు కూడా బ్రిటన్ కు మద్దతు ఇవ్వడం వగైరా పరిణామాలు వరసగా
జరిగిపోయాయి.
జపాన్ విస్తరణదాహం
ఇదే సమయంలో జర్మనీకి మిత్రరాజ్యంగా ఉన్న జపాన్,
ఆసియా అంతటా కమ్ముకోవడం ప్రారంభించింది. చైనాపై దాడి చేసి, ఆ
తర్వాత భారత్ లోకి కూడా చొచ్చుకువస్తున్నట్టు కనిపించింది. 1939-44 మధ్యకాలంలో
జపాన్ విస్తరణదాహం మనదేశంలో పెద్ద చర్చనీయాంశంగా ఉంటూవచ్చింది. కాంగ్రెస్
సదస్సులలో తరచు ఇది చర్చలోకి రావడం, జపాన్ కు వ్యతిరేకంగా
తీర్మానాలు చేయడం, జపాన్ ను అహింసాయుతంగా ఎదుర్కోవాలని గాంధీ
నొక్కి చెప్పడం జరుగుతూవచ్చాయి. 1942లో బ్రిటిష్ స్థావరమైన సింగపూర్ ను, రంగూన్ ను జపాన్ చేజిక్కుంచుకుని భారత్ గుమ్మంలోకి అడుగుపెట్టింది. బోస్
మద్దతుదారులు జపాన్ సేనలకు సహకరిస్తారన్న వదంతి గాంధీ చెవిన పడింది. జపాన్ కు వ్యతిరేకంగా
అహింసాయుత ప్రతిఘటనను గాంధీ నొక్కిచెబితే; గెరిల్లా
యుద్ధతంత్రాన్ని అనుసరించాలన్న వైఖరిని నెహ్రూ,
కమ్యూనిష్టులు తీసుకున్నారు. తూర్పు బెంగాల్ మొదలైన చోట్ల భూదహనవిధానంతో జపాన్ సేనల్ని
అడ్డుకునే ప్రయత్నం జరిగింది.
(రేపు చివరి భాగం)
No comments:
Post a Comment