Sunday, September 27, 2015

సుభాష్ చంద్ర బోస్ వివాదం: చరిత్ర ఏం చెబుతోంది?

[27-9-2015, ఆదివారం సాక్షి దినపత్రిక ఫోకస్(10వ పేజీ)లో, 'బోస్ వివాదం...చరిత్ర ఏం చెబుతోంది?' అనే శీర్షికతో వచ్చిన  నా వ్యాసం ఇది. పెద్దది అవడంవల్ల మూడు భాగాలుగా బ్లాగ్ లో carry చేస్తున్నాను. మొత్తం వ్యాసాన్ని ఒకేసారి చదవదలచుకున్నవారు సాక్షిలో చదవచ్చు]

సుభాష్ చంద్రబోస్ విమానప్రమాదంలో నిజంగా మరణించారా అన్న చర్చ 1945 నుంచి ఇప్పటివరకూ మధ్య మధ్య తలెత్తుతూనే ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ చర్చ మరింత ఉధృతితో ముందుకొచ్చింది.  కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం, గాంధీ-నెహ్రూ వారసత్వాన్ని ప్రజల మనోఫలకం మీంచి పూర్తిగా తుడిచి పెట్టే ప్రయత్నాలు ఈ చర్చకు సరికొత్త రూపును, ఊపును ఇచ్చాయి. బోస్ దగ్గరి బంధువులు కొందరు గట్టిగా గళం విప్పారు. కేంద్రప్రభుత్వం వద్ద ఉన్న బోస్ తాలూకు రహస్యపత్రాలను బయటపెట్టాలన్న డిమాండ్ అలా ఉండగా, పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన వద్ద ఉన్న రహస్యపత్రాలను బయటపెట్టింది. నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాతి కాంగ్రెస్ ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ బంధువులపై, ఆయన నాయకత్వం వహించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యులపై నిఘా ఉంచిన సంగతిని అవి వెల్లడిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ పత్రాలలో ఏముందో వాటిని బయటపెడితే తప్ప తెలియదు. ఎన్నికలముందు వీటి వెల్లడికి హామీ ఇచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడంత ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినచ్చన్న వాదాన్ని సన్న సన్నగా వినిపిస్తోంది.
బోస్ మరణం లేదా అంతర్ధానం గురించి నడుస్తున్న చర్చమొత్తంలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. అది, నెహ్రూకు గురి పెట్టడం! నెహ్రూ, బోస్ ల మధ్య బద్ధశత్రుత్వం ఉండేదనీ, అధికారానికి తనతో బోస్ పోటీ పడతాడనే భయంతో నెహ్రూ ఆయన అడ్డు తొలగించుకునేందుకు కుట్ర చేశాడనే భావనను కలిగించే దిశగా చర్చ సాగుతోంది. నెహ్రూ కన్నా ఎక్కువ ప్రజాదరణ బోస్ కే ఉండేదనీ, బోస్ సజీవంగా దేశానికి తిరిగి వచ్చి ఉంటే నెహ్రూ అధికారపీఠం కదిలిపోయి ఉండేదనీ బోస్ బంధువులు కొందరు నొక్కి చెబుతున్నారు. ఇక మమతా బెనర్జీ బోస్ తాలూకు రహస్యపత్రాలను బయటపెట్టడం వెనుక బెంగాల్ ఆత్మగౌరవకోణాన్ని ఒడుపుగా వాడుకోవాలన్న ఆలోచన ఉండడంలో ఆశ్చర్యంలేదు.
అయితే, బోస్ ను నెహ్రూ తన అధికారానికి పోటీగా నిజంగానే భావించాడా; ఆయన కుట్రదారేనా అన్నది కచ్చితంగా తేల్చి చెప్పగల ఆధారాలు ఏవీ ఇంతవరకు మన ఎదురుగా లేవు. ఈ పరిస్థితిలో చర్చ మొత్తం కొన్ని కాంగ్రెసేతర పక్షాల రాజకీయ లక్ష్యాలూ, బోస్ బంధువుల భావోద్వేగ స్పందనల కలగలుపుగా మారి వాస్తవాలకు పూర్తిగా దూరమై ఊకదంపుడు చర్చగా పరిణమించే ప్రమాదం సహజంగానే ఉంటుంది. కనుక అటో ఇటో ఒరిగిపోవడం కాకుండా అసలు చరిత్ర ఏం చెబుతోందో తెలుసుకుని ఎవరికి వారు ఒక అభిప్రాయానికి రావడం ఒక మార్గం.  రాజ్ మోహన్ గాంధీ రాసిన గాంధీ జీవిత చరిత్ర మోహన్ దాస్ ఆధారంగా ఆ చరిత్ర ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
గాంధీ-బోస్
సుభాష్ చంద్ర బోస్ ది పాతికేళ్ళ(1920-1945) రాజకీయజీవితం. ఇందులో పద్దెనిమిదేళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నాడు. పటేల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి, కృపలానీ, అబుల్ కలామ్ ఆజాద్ లాంటి ఎందరో నాయకుల్లానే ఆయన కూడా మొదట్లో గాంధీ ప్రభావితుడే. సహాయనిరాకరణ సందర్భంలో స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెట్టాడు. గాంధీ ఆయనకు అప్పగించిన పని, మరో బెంగాల్ ప్రముఖ నాయకుడు చిత్తరంజన్ దాస్ కు కుడిభుజంగా ఉండడం. అయితే, గాంధీ అనుకూలుర శిబిరంలో బోస్ ఎప్పుడూ లేడు. 1923లో, మార్పుకు వ్యతిరేకులు(నో-ఛేంజర్స్), మార్పుకు అనుకూలురు(ప్రో-ఛేంజర్స్)గా కాంగ్రెస్ చీలిపోయినప్పుడు, గాంధీ మొగ్గు ఉన్న నో-ఛేంజర్స్ శిబిరంలో కాక, ప్రొ-ఛేంజర్స్ శిబిరంలో చేరి చట్టసభల్లో ప్రవేశాన్ని బోస్ సమర్ధించాడు.
బ్రిటిష్ పట్ల వైఖరిలో కూడా గాంధీ-బోస్ ల మధ్య విభేదాలున్నాయి. బ్రిటిష్ తో గాంధీది మిత్రవైరుధ్యమైతే బోస్ ది శత్రువైరుధ్యం. కాంగ్రెస్ చర్చల్లో, తీర్మానాల్లో గాంధీ కనబరిచే బ్రిటిష్ అనుకూల వైఖరులను బోస్ అడుగడుగునా అడ్డుకునేవాడు. అలాగే హింస-అహింసల విషయంలో కూడా అభిప్రాయభేదాలుండేవి. 1930లో వైస్రాయి ఇర్విన్ ప్రయాణిస్తున్న ప్రత్యేకరైలు కింద బాంబు పేలినప్పుడు దానిని ఖండించాలని గాంధీ ప్రతిపాదించగా బోస్ వ్యతిరేకించాడు. 1933లో శాసనోల్లంఘనకు పాల్పడి కాంగ్రెస్ ప్రముఖనేతలందరూ జైలుకెళ్లినప్పుడు, సర్దార్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ తో కలసి ఆస్ట్రియాలో ఉన్న బోస్, గాంధీ నాయకత్వం విఫలమైందంటూ అక్కడినుంచే ప్రకటన చేశాడు. అయితే, తనతో భావజాల విభేదాలున్న నెహ్రూతో అనుసరించినట్టే బోస్ తో కూడా గాంధీ సర్దుబాటు వైఖరిని అనుసరిస్తూ ఆయన కాంగ్రెస్ గొడుగు కింద కొనసాగేలా వీలైనంతవరకు జాగ్రత్తపడేవాడు. 
1936లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన లక్నో కాంగ్రెస్ సందర్భంలో వర్కింగ్ కమిటీ ఎంపిక బాధ్యతను తనకు అప్పగించినప్పుడు కొందరు సోషలిష్టు నాయకులతోపాటు బోస్ పేరును కూడా గాంధీ చేర్చాడు. 1938లో నెహ్రూ స్థానంలో ఎవరిని అధ్యక్షుని చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, పటేల్ గట్టిగా వ్యతిరేకించినాసరే బోస్ నే చేసితీరాలని గాంధీ పట్టుబట్టి నెగ్గించుకున్నాడు. అయితే, ఇంతకుముందు నెహ్రూ వరసగా రెండు విడతలు అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక, తనకు కూడా మరో విడత అవకాశమివ్వాలని బోస్ అన్నప్పుడు గాంధీ వ్యతిరేకించి, మొదట ఆజాద్ ను; ఆయన తప్పుకోవడంతో భోగరాజు పట్టాభి సీతారామయ్యను ముందుకు తెచ్చాడు. ఆ ఎన్నికలో బోస్ నెగ్గినప్పుడు ఖిన్నుడైన గాంధీ పట్టాభి ఓటమి నా ఓటమి అని ప్రకటించాడు. గాంధీ ఆ తర్వాత పటేల్, రాజగోపాలాచారి తదితరులను ప్రయోగించి బోస్ రాజీనామా చేసే పరిస్థితిని కల్పించాడు. బోస్ కాంగ్రెస్ జీవితానికి దానితో తెరపడింది. 1939లో బోస్ కు గాంధీ ఉత్తరం రాస్తూ, “ఇప్పుడు నా నుంచి నువ్వు దూరమైనా; నేను చేసింది న్యాయమూ, నా ప్రేమ స్వచ్ఛమూ అయితే ఎప్పటికైనా మళ్ళీ నా దగ్గరికి వస్తావు” అన్నాడు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు.
పటేల్-బోస్
మితవాదులుగా పటేల్, రాజగోపాలాచారిల మధ్య భావసారూప్యత ఉండేది. ఇద్దరూ నెహ్రూ, బోస్ ల సోషలిజాన్ని,  రాడికలిజాన్ని వ్యతిరేకించేవారు. ఆపైన బోస్ నిలకడలేని మనిషన్న అభిప్రాయం పటేల్ కు ఉండేది. పటేల్, రాజగోపాలాచారి మొదట్లో నో-ఛేంజర్స్ శిబిరంలో ఉంటే; ప్రో-ఛేంజర్స్లో శిబిరంలో మోతీలాల్, చిత్తరంజన్ దాస్, బోస్ లతోపాటు పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ ఉండేవాడు. బోస్ తో ఆస్ట్రియాలో ఉన్నప్పుడే విఠల్ భాయ్ కన్నుమూశాడు. తన అన్నను బోస్ తప్పుదారి పట్టించాడన్న కోపం పటేల్ కు ఉండేది. బోస్ ను కాంగ్రెస్ అధ్యక్షుని చేయాలన్న గాంధీ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించినా గాంధీ పట్టుబట్టడంతో ఎప్పటిలా శిరసావహించాడు. 
                                                                                                                                 (రేపు 2వ భాగం)

2 comments:

  1. Good post and info, the same am working on the same subject in
    http://theuntoldhistory.blogspot.in/2008/12/blog-post_07.html

    Sridhar

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ శ్రీధర్ గారూ...మీ బ్లాగ్ చూస్తాను.

      Delete