Saturday, June 20, 2015

మౌని మోహన్ లానే నరేంద్ర 'మౌని'!

2009లో యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి కొంచెం ముందే 2జీ ఆరోపణలు బయటికి వచ్చాయి. మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. ఆ తర్వాత ఏడాదిలోనే కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఆరోపణలు వచ్చి చూస్తూండగానే ఉధృతమై ప్రభుత్వానికి చెమటలు పట్టించడం ప్రారంభించాయి. అందులో ప్రతిపక్షం కన్నా మీడియాయే ప్రధానపాత్ర పోషించింది. అలా యూపీఏ రెండో విడత తొలి ఏడాదిలోనే ప్రభుత్వంలో చావుకళ కనిపించింది.  అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. ఆ తర్వాత 2జీ ఆరోపణలు పుంజుకుని 'కామన్వెల్త్' తోపాటు కలసి మండడం ప్రారంభించాయి. అప్పుడు కూడా చాలా రోజుల తర్వాత కానీ మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. అవి కూడా రాజా ఏ తప్పూ చేయలేదన్న సమర్ధింపు మాటలు. ఆ తర్వాత ఆదర్శ్ గృహకుంభకోణం, 2జీపై కాగ్ నివేదిక వరసగా వచ్చాయి. అక్కడినుంచి రాజీనామాలు మొదలయ్యాయి. 2010 అంతా యూపీఏ చరిత్రలో కుంభకోణాల సంవత్సరం. సరే, 2012లో బొగ్గు కుంభకోణం...మొత్తానికి కామన్వెల్త్ తో మొదలుపెట్టి మిగిలిన ఆ నాలుగేళ్ల కాలమూ యూపీఏ గుక్క తిప్పుకోలేకపోయింది. చివరగా అనివార్యమైన అధికారచ్యుతి...

ఇదంతా ఎందుకంటే, ఎన్డీయే ప్రభుత్వం వచ్చి ఏడాది గడవగానే ఇద్దరు ముఖ్య నేతలపై అనౌచిత్యం, ఆశ్రితపక్షపాతం, అవినీతి సంబంధమైన ఆరోపణలు వచ్చాయి. అయినా మన్మోహన్ సింగ్ లానే నరేంద్ర మోడీ మాట్లాడడం లేదు...

ముందుగా సుష్మా స్వరాజ్ విషయం చూద్దాం. ఆమె పార్టీలో సీనియర్ నాయకురాలే కాక, మంత్రిగా అనుభవం ఉన్నవారు. ప్రధాని పదవికి అభ్యర్ధుల జాబితాలో ఆమె పేరు కూడా గతంలో వినిపించింది. మంత్రిగా పాటించవలసిన విధివిధానాలు ఆమెకు తెలియకపోయే అవకాశం లేదు. కానీ ఆర్ధిక నేరాల నిందితుడైన లలిత్ మోడీ విషయంలో వ్యవహరించిన తీరులో ఆమె సుదీర్ఘ రాజకీయ అనుభవం కానీ, మంత్రిత్వ అనుభవం కానీ ఏమైనా వ్యక్తమవుతున్నాయా?

లలిత్ మోడీ నుంచి మానవతాదృష్టితో పరిశీలించవలసిన అభ్యర్ధన వచ్చిందే అనుకుందాం. మంత్రికి వచ్చిన ఏ అభ్యర్ధన అయినా కింది ఉద్యోగులు, అధికారుల స్థాయిలో పరిశీలన జరిగి, వారి సిఫార్సులతో మంత్రి దగ్గరకు వస్తుంది. అప్పుడు మంత్రి తన ఆమోదముద్రో, అనామోద ముద్రో వేస్తారు. ఏ నిర్ణయమైనా రేపు సమాధానం చెప్పుకోడానికి వీలుగానూ,  పారదర్శకంగానూ  జరుగుతుంది. జరగాలి. అందులోనూ లలిత్ మోడీ వంటి నిందితుల విషయంలో మరింత పారదర్శకంగా జరగాలి. పైగా మంత్రికి లలిత్ మోడీతో వ్యక్తిగత పరిచయం ఉన్నప్పుడు; ఆమె భర్త, ఆమె కుమార్తె లలిత్ మోడీకి న్యాయవాదులు అయినప్పుడు పద్ధతిగానూ, పారదర్శకంగానూ జరగడం మరింత అవసరం. సీనియర్ రాజకీయ నేతే కాక, విదేశాంగమంత్రి వంటి కీలకపదవిలో ఉన్న సుష్మాస్వరాజ్ ఇలాంటి పద్ధతులను, ఔచిత్యాలను పాటించకపోవడం ఆశ్చర్యమే. ప్రధాన ప్రశ్నల్లా పద్ధతులు, ఔచిత్యాలను పాటించకపోవడం గురించే. అధికారంలో ఉన్నవారు సక్రమంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరిస్తున్నట్టు కనిపించడమూ అవసరమే. అది ప్రాథమిక పాఠం. అటువంటిది, ఆ విషయం గురించి మాట్లాడకుండా ఆమె జాతీయతావాదిఅనీ, దేశభక్తురాలనీ, ఆమె ఏ తప్పూ చేయలేదనీ పార్టీయే కాక స్వయంగా ఆర్ ఎస్ ఎస్ రంగంలోకి దిగి వెనకేసుకు రావడం ఆ సంస్థ గురించి ఎలాంటి అభిప్రాయం కలిగిస్తుంది? ఆ సంస్థ ఏ విలువలకోసం నిలబడిందనుకుంటాం?

ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై వచ్చిన ఆరోపణలు మరింత తీవ్రం. అందులో ఆర్ధిక కోణం కూడా ఉంది.

యూపీఏ ప్రభుత్వం పై వచ్చిన అవినీతి ఆరోపణలకు, సుష్మా స్వరాజ్ పై వచ్చిన ఆరోపణలకు స్వభావంలో తేడా ఉంది. యూపీఏ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవే, సందేహం లేదు. అయితే అవి ఆర్థిక అవినీతికి, విధానశుద్ధికి సంబంధించినవి. సుష్మాపై వచ్చినవి మౌలిక పాలనా స్వభావానికీ, ఔచిత్యానికీ సంబంధించినవి. ఆర్థిక అవినీతికన్నా పాలనా ధర్మానికీ, ఔచిత్యానికీ జరిగే హాని ఎక్కువ తీవ్రమైనది, ఎక్కువ ప్రమాదకరమైనది. దానికి సుదూరప్రభావం ఉంటుంది. అది ఒక ఒరవడి అయి రాబోయే తరాలను చెడగొడుతుంది. ఇంకో తేడా కూడా ఉంది. యూపీఏ డిఫెన్స్ ను అనుసరిస్తే ఎన్డీయే అఫెన్స్ ను అనుసరిస్తోంది.  ఇది కూడా పైన చెప్పిన సుదూరప్రభావం చూపే ప్రమాదకరధోరణే.


3 comments:

  1. అవునండి.
    పాత జనతా పార్టీ మూన్నాళ్ళ ముచ్చట ప్రభుత్వం గుర్తుకు వస్తోంది.

    హాయిగా వీళ్ళని దించేసి మళ్ళా కాంగ్రెసు పార్టీనే ఎన్నేసుకుంటే బాగుండవచ్చును.
    ఎమర్జన్సీ దారుణాలన్నీ మర్చిపోయి అప్పట్లో ఇందిరమ్మను మళ్ళా గద్దెకెక్కించాం కదా.
    అలాగే అన్నమాట.

    మనకు కాంగ్రెసుమార్కు పాలన అలవాటే కాబట్టి వాళ్ళు తప్పులు చేసినా మనం సరిపెట్టుకొని నెట్టుకు రావచ్చును.

    అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షపార్టీ ఎంత మంచిగా పాలించాలీ ఏమిటీ అని. కొంచెంకూడా తెలివి లేనట్లే పాలన చేస్తున్నారు.

    మరలా కాంగ్రేసు వారు స్వయంగానో యూపీయే అని ఏదో ఒక పేరుతో పగ్గాలు చేపడితే మీడియా ప్రశాంతంగా ఉంటుంది, పాతాఅలవాటు పుణ్యమా అని ప్రజలూ ప్రశాంతంగా ఉంటారు.
    ఏదో అలా జరిగిపోతుంది.

    ఆలోచించవలసిన విషయమే!

    ReplyDelete
    Replies
    1. మీ ప్రకారమే చూసినా, పేర్లే తేడా కానీ కాంగ్రెస్ పాలనకీ, ఈ పాలనకీ తేడా ఏముందండీ తప్పులు చేయడంలో? ఈ పాలన కూడా మీరన్నట్టు ఏదో అలా జరిగిపోతుంది.
      మీడియానే రచ్చ చేస్తోందని మీ అభిప్రాయం కాదు కదా? మీడియా కాంగ్రెస్ పాలనలో చేసిందే ఇప్పుడూ చేస్తోంది. ఆ విషయం మీకు తెలియంది కాదు.
      కాకపోతే కాంగ్రెస్ కు, బీజేపీ కీ ఒక్క తేడా ఉందని మీరూ ఒప్పుకుంటారనుకుంటాను. కాంగ్రెస్ ఎంతైనా ఒక రాజకీయపార్టీ అండీ. టీడీపీ, టీఆర్ ఎస్, ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ లాంటి అనేక పార్టీలలో అది కూడా ఒకటి. కానీ బీజేపీ సాంస్కృతిక జాతీయవాద పార్టీ. సాంస్కృతిక జాతీయవాదాన్ని, దేశభక్తిని, స్వచ్ఛశీలాన్ని బోధించే ఆర్ ఎస్ ఎస్ ఆ పార్టీ వెనుక ఉంది. కాంగ్రెస్ కు అలాంటిదేమీ లేదు. కనుక బీజేపీ చేసే తప్పులు మన సంస్కృతి గురించి బయటి ప్రపంచానికి తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రమాదం లేదంటారా? ఇంతకీ సుష్మా, వసుంధరల వ్యవహరణపై మీ అభిప్రాయం చెప్పలేదు.

      Delete
    2. బీజేపీ వారి తప్పుల వల్ల భారతీయసంస్కృతి గురించి బయటి ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం తప్పకుండా ఉంది కదండీ. అదే విచారం. ప్రస్తుతం రాజకీయనాయకుల మని ఎప్పుకునే వారు చొక్కాలు మార్చినంత సుళువుగా పార్టీలు మారుస్తున్నారు. ఈ పాౠల గంభీరసిధ్ధాంతాలన్నీ పేరుకు మాత్రమే. అంతా ఒక తానులో ముక్కలే.

      కాంగ్రెసు అనేక రాజకీయపార్టీలలో ఒకటి అన్నది నిజమే ఐనా అది భారతదేశానికి పాలనాహక్కుగలవారం తాము మాత్రమే అని భావిస్తూ ఉంటుంది. బీజేపీ ఐతే సాంస్కృతికోధ్ధారకులం అన్నట్లు పోజులు పెడుతుంది. కాని అందరు నందరే తుదకు నందుకు నందరె యందరందరే అన్నదే నిజం.

      ప్రస్తుతం నడుస్తున్న సుష్మా, వసుంధరల వ్యవహరణపై విన్న కొద్దీ వింతగా ఉంది. కేవలం ఒక జబ్బుమనిషికి వైద్యసహాయం వరకూ ఐతే అది తప్పు కాకపోవచ్చును. కాని ఇంకా ఏమన్నా లోపాయకారీ వ్యవహారాలు జాతిప్రయోజనవిరుధ్ధమైనవి ఉంటే మాత్రం క్షంతవ్యం కావు. ఇలాంటి వ్యవహారాలు నిరంతరాయంగా నడిపిస్తూ వచ్చిన కాంగ్రెసువారు నీతులు పలకటం కూడా ఒక వింతే.

      దేశంలో అక్షరాస్యత బాగా పెరిగిన పిదప అవినీతి రాజకీయాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నాను. అది నేను చూడలేక పోవచ్చు. ఒకనాటికి అది జరుగుతుందని నా నమ్మకం. మంచిదో పిచ్చిదో కాలమే తేల్చాలి!

      Delete