Saturday, May 9, 2015

సల్మాన్ ముందు న్యాయం ధర్మాలు గులాం!

ఇంతకుముందు సంజయ్ దత్ కేసు చూశాం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసు చూశాం. కొత్తేమీలేదు. సంజయ్ దత్ కు శిక్ష పడినందుకు బాలీవుడ్ అంతా పడిపడి ఏడిచింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు శిక్షపడినందుకు గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది.

రెండు కేసుల్లోనూ కోర్టులు, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థా వ్యవహరించిన తీరులో కూడా కొత్తేమీ లేదు. సంజయ్ దత్ కు మాటి మాటికీ పెరోల్ లభించింది. సల్మాన్ ఖాన్ కు గంటల్లో బెయిల్ లభించింది.

కానీ ఈసారి ఒక కొత్తదనం ఉన్నట్టు కనిపించింది. సల్మాన్ కు శిక్షపై కొంతమంది-కొంతమందే ఏమిటి ఎక్కువమందే-స్పందన చూసిన తర్వాత నాకు ఈ దేశాన్ని తలచుకుని కొత్తగా భయం కలిగింది. ఈ దేశం ఏమైపోతోంది, ఎటుపోతోందనిపించి బెంగ కలిగింది. ఇది మనకు తెలిసిన, ఇంతవరకు మన ఊహలో ఉన్న దేశం కాదనిపించింది.

గత మూడు నాలుగురోజులుగా సల్మాన్ పై వ్యక్తమవుతున్న స్పందన నాకు కలిగించిన అభిప్రాయం ఒక్కటే: సల్మాన్ ఈ దేశంలోని చట్టాల కన్నా, రాజ్యాంగం కన్నా, న్యాయవ్యవస్థ కన్నా, సమన్యాయం, సమాన నీతి, సమధర్మం మొదలైన భావనల కన్నా, మరి దేనికన్నా కూడా గొప్పవాడు! సల్మాన్ ఖాన్ అనే గొప్పవాడికి అనుగుణంగా అవి నడుచుకోవాలే తప్ప, సల్మాన్ ఖాన్ అనే గొప్పవాడు వాటి ప్రకారం నడచుకోడు!

ఇవాళ సల్మాన్ ఖాన్ అయ్యాడు. రేపు అతన్ని తల దన్నేవాడు ఇంకొకడు అవుతాడు. అతడు ఎంత పెద్ద  నేరం చేసినా సరే, అతని గొప్పతనాన్ని, అతని దాతృత్వాన్ని, మంచి తనాన్ని, సెలెబ్రటి లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి కానీ అతని నేరాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకూడదు. ఇదీ ఇందులోని సారాంశం.

సల్మాన్ వ్యవహారంలో కొత్తదనం ఏమీ లేదని అంటూనే కొత్తగా భయం కలిగిందని ఎందుకన్నారనే సందేహం మీకు కలగచ్చు. అందులోకే వస్తున్నాను.

వ్యవస్థ సామాన్యుడి పట్ల ఒక నీతినీ, సెలెబ్రటిపట్ల ఇంకో నీతినీ పాటించడం ముందునుంచీ ఉన్నదే. కానీ ఇప్పుడు సల్మాన్ సందర్భంలో కొత్తగా చూస్తున్నదేమిటంటే, దానిని బాలీవుడ్ కు చెందినవాళ్లే కాక, లాయర్లు, ఇతరులూ కూడా నిస్సిగ్గుగా సమర్థించుకోవడం. డబ్బున్నవాడు ఆ డబ్బుతో న్యాయవ్యవస్థలోని వెసులుబాట్లను కొనుక్కోగలగడంలో సత్వర న్యాయం పొందడంలో తప్పేమిటనీ; డబ్బులేనివాడు కొనుక్కోలేక న్యాయం పొందలేకపోవడంలో వింత ఏమిటనీ ప్రశ్నిస్తూ అది అంతే నన్నట్లుగా మాట్లాడడం.

అదీ కొత్తగా భయపెట్టే విషయం.

వ్యవస్థ సామాన్యుడి పక్షం వహించకపోయినా కనీసం ఇంతవరకు పైకి అయినా సామాన్యుడి పక్షం వహించడం అనే పోలిటికల్ కరెక్ట్ నెస్ ను పాటించేవారు. ఇప్పుడు ఆ చిన్న సిగ్గు బిళ్ళ కూడా తీసేస్తున్నారు. అదీ కొత్తగా భయపెడుతున్న విషయం.

ఇంకా కావాలంటే ఈ దారుణం చూడండి...ముంబైకి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు ఈ మూడునాలుగు రోజులుగా అక్షరాలా సల్మాన్ ప్రతినిధి అయిపోయారు!

అంటే, పోలిటికల్ కరెక్ట్ నెస్ ను కూడా కరెక్టు చేసుకోవలసిన రోజులు వచ్చాయన్నమాట. కొత్తగా భయపెడుతున్నది అదే. మొదట్లో అలాగే ఉంటుంది లెండి, క్రమంగా అలవాటుపడిపోతారంటారా...అలవాటు పడక చేసేదేముంది?!


4 comments:

  1. Read this: http://blog.marxistleninist.in/2015/05/blog-post_10.html

    ReplyDelete
  2. మేధా పాట్కర్ కూడా సంఘ సేవకురాలే. కానీ ఆమె హత్య చేస్తే సంఘ సేవకురాలు కదా అని ఆమెని వదిలేస్తారా? ఆమె ఏ అంబానీ భార్యో అయితే మాత్రం సంఘ సేవకురాలు కాకపోయినా ఆమెని వదిలేస్తారు.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ అతని చుట్టూ కోట్లలో జరిగే వ్యాపారం ఉంది,మేధా పాట్కర్ విషయంలో అది లేదు.కనక మేధా పాట్కర్ కోసం యెవరూ ఆందోళన చెయ్యరు:-)

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete