ఎస్. ఎల్. భైరప్ప రాసిన ‘పర్వ’ నవల ఋతుకాల భయాలతో ప్రారంభమవుతుంది.
మద్రదేశాధీశుడైన శల్యుడి మనవరాలు పెద్దమనిషి అవుతుంది. నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ
శల్యుడి కొడుకు ఇంకా ఆమెకు పెళ్లి చేయలేదు. శల్యుడు దీనినే తలచుకుని బాధపడుతూ
ఉంటాడు. మనవరాలు నెల నెలా బయటచేరిన ప్రతిసారీ అతడు మరింత చిత్రవధకు లోనవుతూ
ఉంటాడు. కొడుకుపై కోపం ముంచుకొస్తూ ఉంటుంది. వంశానికి అంతటికీ భ్రూణహత్యా పాపం చుట్టబెడుతున్నాడనుకుంటాడు.
కొడుకుని పిలిచి కోప్పడతాడు. మన వంశ గౌరవానికి తగినట్టు స్వయంవరం ప్రకటించాలని తన
ఉద్దేశమనీ, అయితే, కురు-పాండవ యుద్ధం
జరగబోతోంది కనుక రాజులందరూ యుద్ధ సన్నాహంలో ఉన్నారనీ ,
స్వయంవరానికి రాకపోవచ్చనీ, అందుకే ఆలస్యం చేస్తున్నాననీ
కొడుకు సమాధానం చెబుతాడు.
భ్రూణ హత్యాపాపంతో పాటు మరో భయమూ శల్యుని పీడిస్తూ ఉంటుంది.
అది, మనవరాలిని పొరుగునే ఉన్న ఏ నాగజాతి యువకుడో లేవదీసుకుపోయే
అవకాశం! చివరికి అదే జరుగుతుంది.