Wednesday, May 28, 2014

కన్యాత్వం-రాజుగారి దేవతావస్త్రాలు

రాజుగారి దేవతావస్త్రాల కథ చాలామందికి తెలిసే ఉంటుంది. నాకు ఆ కథ పూర్తిగా గుర్తులేదు కానీ, గుర్తున్నంతవరకు ఆ కథ సారాంశం ఇలా ఉంటుంది:  

ఒక నేత కార్మికుడు దేవతావస్త్రాలను నేస్తానని రాజుగారికి చెప్పాడు. నమ్మిన రాజుగారు అతనికి గడువు ఇచ్చాడు. గడువు ముగిసిన తర్వాత నేతకార్మికుడు రాజుగారిని దర్శించుకున్నాడు. ప్రభూ...ఇవిగో దేవతావస్త్రాలు అంటూ ఒట్టి చేతులు చూపించాడు. ఏవీ? నాకు కనిపించడం లేదే అన్నాడు రాజు. ఇవి దేవతావస్త్రాలు కదా, మామూలు కళ్ళకు కనిపించవు అన్నాడు నేతకార్మికుడు. ఓహో, అలాగా, అయితే వాటిని నాకు ధరింపజేయి అని ఆజ్ఞాపించాడు రాజు. చిత్తం మహారాజా అంటూ నేత కార్మికుడు రాజుగారికి దేవతావస్త్రాలను ధరింపజేసినట్టు అభినయించాడు.  ఇదిగో ఇప్పుడు మీరు దేవతావస్త్రాలను ధరించారు అన్నాడు. అప్పుడు రాజు, దేవతావస్త్రాలు ఎలా ఉన్నాయి?’ అని తన పరివారాన్ని అడిగాడు. దేవతావస్త్రాలు కనిపించడం లేదన్నా, బాగులేవన్నా రాజు తలతీసేస్తాడని వాళ్ళకు తెలుసు. అద్భుతం ప్రభూ, వీటిని ధరించిన తర్వాత మీ అందం ద్విగుణీకృతమైంది అని పరివారం ముక్తకంఠంతో అన్నారు.


ఈ కథ ఎందుకంటే,  కన్యాత్వానికి, దేవతావస్త్రాలకు పోలిక ఉందని చెప్పడానికే. 

Thursday, May 22, 2014

కోర్టు కెక్కిన పండిత వివాదం

కాలంలో ఒకసారి ఎనభయ్యారేళ్ళ వెనక్కి వెడదాం...

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1928లో మహాభారత చరిత్రము అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించారు. 1928-33 మధ్యకాలంలో అది రెండు ముద్రణలు పొందింది. 1991లో ఏటుకూరు బలరామమూర్తిగారి పరిచయవాక్యాలతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దీనిని పునర్ముద్రించింది. ఆ ప్రతి నా దగ్గర ఉంది.


అప్పట్లో ఈ పుస్తకం ఒక సంచలనం అన్న సంగతి రచయిత, ఇతరులు రాసిన ముందు మాటలను బట్టి అర్థమవుతుంది. మహాభారతాన్ని చారిత్రక దృష్టినుంచి, హేతు దృష్టినుంచి చర్చించిన ఈ పుస్తకంపై తీవ్ర ఖండనలు వెలువడ్డాయి. దీనిపై ఖండన తీర్మానాలు చేయడానికి పలు చోట్ల పండిత సభలు కూడా జరిగాయి. ఈ పుస్తకాన్ని ప్రప్రధమంగా ఖండించిన వారిలో ప్రసిద్ధులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు. ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి కూడా. పెండ్యాల-శ్రీపాదవార్ల వివాదం చివరికి కోర్టుకు ఎక్కి, ఏడాది- ఏడుమాసాలపాటు కేసు నడిచింది.  రాజమండ్రిలోని ఆనరరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఇద్దరికీ ఇరవై రూపాయల వంతున అపరాధ రుసుము విధించారు. కృష్ణమూర్తిశాస్త్రిగారు రెండుసార్లు తన సాక్షులను ప్రవేశపెట్టని కారణంగా పెండ్యాల వారికి పన్నెండు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మెజిస్ట్రేటు తీర్పు చెప్పారు. 

Wednesday, May 14, 2014

'కన్యాత్వం' అంటే ఏమిటి?

నా కోరిక తీరిస్తే నీ కన్యాత్వం చెడదని మత్స్యగంధితో పరాశరుడు అన్నాడు. (తెలుగు భారతం ప్రకారం) నీకు సద్యోగర్భంలో కొడుకు పుడతాడు, నీ కన్యాత్వం చెడదని సూర్యుడు కుంతితో అన్నాడు. ఒక మహానుభావుడు ఇచ్చిన వరప్రభావం వల్ల నేను కొడుకును కన్నా కన్యగానే ఉంటానని గాలవునితో మాధవి అంది.

ఇంతకీ అసలు ఈ కన్యాత్వం ఏమిటి? నేటి సాధారణ అవగాహనతో చెప్పుకుంటే, కన్య అంటే అవివాహిత. కన్యావస్థలో ఉన్నప్పుడు ఆమె పురుష సంపర్కం పెట్టుకోవడం, సంతానం కనడం తప్పు. అంటే కన్యాత్వం అనేది వివాహం అనే వ్యవస్థతో ముడిపడి ఉందన్న మాట. ఆవిధంగా అది వ్యవస్థ తీసుకొచ్చిన భావనే తప్ప ప్రకృతి సిద్ధంగా వచ్చిన భావన కాదు. ఒక స్త్రీ గర్భం ధరించడానికి ఆమె కన్యా లేక వివాహితా అన్న విచక్షణతో ప్రకృతికి సంబంధం లేదు.


కానీ పైన చెప్పిన మూడు కథలూ ఏం చెబుతున్నాయి? కన్యాత్వం అనేది ఒకటి ప్రకృతి సిద్ధంగా ఉంటుందనీ, కన్య గర్భం ధరిస్తే ఆ కన్యాత్వం పోతుందనీ, కానీ కన్య గర్భం ధరించినా కన్యాత్వం పోకుండా చూడగలిగిన మహిమ కొందరు మహానుభావులకు ఉంటుందనే భావన కలిగిస్తున్నాయి.