Thursday, May 22, 2014

కోర్టు కెక్కిన పండిత వివాదం

కాలంలో ఒకసారి ఎనభయ్యారేళ్ళ వెనక్కి వెడదాం...

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1928లో మహాభారత చరిత్రము అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించారు. 1928-33 మధ్యకాలంలో అది రెండు ముద్రణలు పొందింది. 1991లో ఏటుకూరు బలరామమూర్తిగారి పరిచయవాక్యాలతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దీనిని పునర్ముద్రించింది. ఆ ప్రతి నా దగ్గర ఉంది.


అప్పట్లో ఈ పుస్తకం ఒక సంచలనం అన్న సంగతి రచయిత, ఇతరులు రాసిన ముందు మాటలను బట్టి అర్థమవుతుంది. మహాభారతాన్ని చారిత్రక దృష్టినుంచి, హేతు దృష్టినుంచి చర్చించిన ఈ పుస్తకంపై తీవ్ర ఖండనలు వెలువడ్డాయి. దీనిపై ఖండన తీర్మానాలు చేయడానికి పలు చోట్ల పండిత సభలు కూడా జరిగాయి. ఈ పుస్తకాన్ని ప్రప్రధమంగా ఖండించిన వారిలో ప్రసిద్ధులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు. ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి కూడా. పెండ్యాల-శ్రీపాదవార్ల వివాదం చివరికి కోర్టుకు ఎక్కి, ఏడాది- ఏడుమాసాలపాటు కేసు నడిచింది.  రాజమండ్రిలోని ఆనరరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఇద్దరికీ ఇరవై రూపాయల వంతున అపరాధ రుసుము విధించారు. కృష్ణమూర్తిశాస్త్రిగారు రెండుసార్లు తన సాక్షులను ప్రవేశపెట్టని కారణంగా పెండ్యాల వారికి పన్నెండు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మెజిస్ట్రేటు తీర్పు చెప్పారు. 

No comments:

Post a Comment