Thursday, July 24, 2014

పాండవులు నేటి టిబెట్ లో పుట్టారా?!

పాండవుల పుట్టుక గురించి సంప్రదాయవర్గాలలోనే ఎంతో చర్చ జరిగింది. ఆ వివరాలు చెప్పుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.  ఇటీవలి కాలంలో ఈ చర్చకు తెరతీసిన తెలుగువారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి, చారిత్రక దృష్టి నుంచి మహాభారతాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారే. వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన మహాభారతతత్త్వకథనములో పెండ్యాలవారి అభిప్రాయాలను ఖండించారు.

పెండ్యాలవారి వాదం ప్రకారం, పాండవుల జన్మస్థానమైన శతశృంగం నేటి టిబెట్టే. ఒక స్త్రీ అనేకులను పెళ్లాడే ఆచారం టిబెట్టులోనే ఉందని ఆయన అంటారు. అయిదుగురూ ద్రౌపదిని పెళ్ళాడడం ఎలా ధర్మబద్ధమని ద్రుపదుడు ప్రశ్నించినప్పుడు, మా పూర్వుల ఆచారాన్నే మేము పాటించదలచుకున్నామని ధర్మరాజు జవాబిస్తాడు. ఆ మాట టిబెట్టులోని ఆచారాన్నే సూచిస్తుందనీ పెండ్యాలవారు అంటారు. 

పాండవులు విదేశీయులే కాక, ధర్మరాజుకు విదేశీ భాష (టిబెట్ కు చెందిన భాష) తెలుసు నంటూ మహాభారతంలోని ఒక సందర్భాన్ని ఆయన ఉదహరించారు. అదేమిటంటే:-

Saturday, July 12, 2014

జీఎస్టీ...కాంగ్రెస్...బీజేపీ...

ఒక అసమర్థ, దుర్మార్గ ప్రభుత్వం పోయి, ఇంకో ప్రభుత్వం వస్తే దేశం బాగుపడుతుందని, తమ తల రాత మారుతుందని జనం అనుకుంటారు. అందులో కొంతే నిజం, కొంత అబద్ధం.

ఎందుకంటే, ప్రజల ఆకాంక్షలకు, అవి ఫలించడానికీ మధ్య రాజకీయం అనే విలన్ ఉంటుంది. అలాగని రాజకీయం పనికిమాలినదని, దుష్టమనీ అనడంలేదు. కొన్ని విషయాలలో రాజకీయం అడ్డురాకుండా రాజకీయపక్షాలు అన్నీ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పడమే.

ఉదాహరణకు జీ ఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) ఉంది. ఇది పదేళ్లుగా నలుగుతున్న విషయం.  జీఎస్టీ అమలులోకి వస్తే ఆర్థికతకు అది ఎంతో మేలు చేస్తుందనీ, ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుందనీ ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరి ఇన్నేళ్లలో అది అమలులోకి ఎందుకు రాలేదంటే, బీజేపీ ముఖ్యమంత్రులు కలసి రావడం లేదని యూపీఏ ప్రభుత్వం అంటూ వచ్చింది.

ఇప్పుడు అరుణ్ జైట్లీ జీఎస్టీ అమలులోకి రావడం ఎంత అవసరమో చెబుతూ ఒక ఏడాదిలో దానిని అమలులోకి తెస్తామని అంటున్నారు. అంత మంచి సంస్కరణపై బీజేపీ, యూపీఏ లు ఇన్నేళ్లలో ఎందుకు ఏకీభావానికి రాలేకపోయారో తెలియదు. దీనివల్ల ఆమేరకు ఆర్థికతకు జరిగిన నష్టానికి ఆ ఉభయులూ బాధ్యులే అవుతారు కదా?

ఇంతకాలం బీజేపీ కలసి రాలేదు కనుక ఇప్పుడు ఆ వంతు కాంగ్రెస్ ది అవుతుంది. ఒక చర్చలో మనీష్ తివారీ ఆ మాట నిస్సంకోచంగా అనేశారు కూడా. జీఎస్టీ విషయంలో మీరు మాకు కలిసిరాలేదు కనుక, మా నుంచి మీరూ సహకారాన్ని ఆశించలేరు అనేశారు. రాజ్యసభలో సంఖ్యాబలం లేని మోడీ ప్రభుత్వం ఈ సహాయనిరాకరణను ఎలా అధిగమిస్తుందో, అందుకు ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం.

ఇలాంటివే ఇంకా మరి కొన్ని ఉంటాయి.

దేశానికి మేలు చేసే కొన్ని కీలకమైన విషయాలలోనైనా రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలూ(సైద్ధాంతికంగా కాంగ్రెస్, బీజేపీ తదితర పక్షాల విధానాలను వ్యతిరేకించే వామపక్షాలను అలా ఉంచితే) పరస్పరం సహకరించుకుంటే మంచిది కాదా అన్నది ప్రశ్న. 

Thursday, July 10, 2014

పాండవులు ఎక్కడ పుట్టారు?

తనకు క్షేత్రజులను ఇమ్మని కుంతిని కోరుతూ పాండురాజు ఇంకో సంగతి కూడా గుర్తుచేశాడు...

అది, కుంతి చెల్లెలు శ్రుతసేన కూడా క్షేత్రజులను కనడం! కేకయరాజు శారదండాయని భార్య శ్రుతసేన. తనవల్ల పుత్రసంతానం కలగకపోవడంతో నియోగపద్ధతిలో సంతానం కనమని కేకయరాజు భార్యకు చెప్పాడు. అప్పుడు శ్రుతసేన పుంసవన హోమం చేయించి ఋత్విజుల ద్వారా ముగ్గురు కొడుకులను కంది.

అయితే, పాండురాజు ప్రతిపాదనకు కుంతి వెంటనే ఒప్పుకోలేదు. నువ్వు భరతకులశ్రేష్ఠుడివి. నీకు మేము ధర్మపత్నులం. పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటాం?’ అంది.  అదీగాక మా మీద నీ అనుగ్రహం ఉంటే సంతానం అదే కలుగుతుంది. అలాంటి ఒక పుణ్యకథను నేను పౌరాణికుల ద్వారా విన్నాను అంటూ ఆ కథ చెప్పింది.


(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/07/10/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%92%E0%B0%95-%E0%B0%AD%E0%B1%8C%E0%B0%97%E0%B1%8B%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95-%E0%B0%B5%E0%B0%BF/ లో చదవండి)

Sunday, July 6, 2014

వ్యవసాయ, స్త్రీ క్షేత్రాలకు పోలిక

పంటను ఇచ్చే వ్యవసాయభూమి క్షేత్రమైనట్టే, సంతానాన్ని కనే స్త్రీ కూడా క్షేత్రం అయింది. ఆవిధంగా వాటి మధ్య పోలిక కుదిరింది. వ్యవసాయభూమిలానే స్త్రీని కేవలం క్షేత్రంగా గుర్తించడమంటే ఏమిటన్నమాట? వ్యవసాయభూమి ఏ ఒకరి యాజమాన్యం కిందో ఉండకుండా ఉమ్మడి వనరుగా ఉన్న దశ ఉందనుకుందాం. అప్పుడు ఆ భూమిలో విత్తు నాటిన వాడికే పంట మీద హక్కు ఉన్నట్టుగా; స్త్రీ క్షేత్రంలో బీజావాపన  చేసినవాడికే సంతానం మీద హక్కు ఉంటుంది. శర్మిష్ట కథలో చెప్పుకున్నట్టుగా, ఋతుమతి అయిన స్త్రీకి వివాహంతో సంబంధం లేకుండా సంతానం పొందే హక్కు ఉందనుకుంటే, తన క్షేత్రంలో పుట్టే సంతానం మీద ఆ దశలో ఆమెకే హక్కు ఉండడానికీ అవకాశం ఉంది. గంగా-శంతనుల కథలో తనకు పుట్టే సంతానాన్ని ఏమైనా చేసుకునేలా శంతనుడితో గంగ ఒప్పందం చేసుకోవడమే చూడండి. అంటే ఆమె తన క్షేత్ర హక్కును స్థాపించుకోదలచిందన్న మాట. ఎస్.ఎల్. భైరప్ప పర్వ నవలలో ఇచ్చిన అన్వయాన్ని బట్టి చూస్తే, గంగ తనకు కలిగిన ఏడుగురు సంతానాన్నీ తన దగ్గరే ఉంచుకుని; ఎనిమిదో సంతానమైన భీష్ముని విషయంలో శంతనుడు  అడ్డు చెప్పాడు కనుక అతన్ని శంతనుడికి ఇచ్చేసి, ఒప్పందం నుంచి తప్పుకుంది.