Saturday, July 12, 2014

జీఎస్టీ...కాంగ్రెస్...బీజేపీ...

ఒక అసమర్థ, దుర్మార్గ ప్రభుత్వం పోయి, ఇంకో ప్రభుత్వం వస్తే దేశం బాగుపడుతుందని, తమ తల రాత మారుతుందని జనం అనుకుంటారు. అందులో కొంతే నిజం, కొంత అబద్ధం.

ఎందుకంటే, ప్రజల ఆకాంక్షలకు, అవి ఫలించడానికీ మధ్య రాజకీయం అనే విలన్ ఉంటుంది. అలాగని రాజకీయం పనికిమాలినదని, దుష్టమనీ అనడంలేదు. కొన్ని విషయాలలో రాజకీయం అడ్డురాకుండా రాజకీయపక్షాలు అన్నీ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పడమే.

ఉదాహరణకు జీ ఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) ఉంది. ఇది పదేళ్లుగా నలుగుతున్న విషయం.  జీఎస్టీ అమలులోకి వస్తే ఆర్థికతకు అది ఎంతో మేలు చేస్తుందనీ, ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుందనీ ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరి ఇన్నేళ్లలో అది అమలులోకి ఎందుకు రాలేదంటే, బీజేపీ ముఖ్యమంత్రులు కలసి రావడం లేదని యూపీఏ ప్రభుత్వం అంటూ వచ్చింది.

ఇప్పుడు అరుణ్ జైట్లీ జీఎస్టీ అమలులోకి రావడం ఎంత అవసరమో చెబుతూ ఒక ఏడాదిలో దానిని అమలులోకి తెస్తామని అంటున్నారు. అంత మంచి సంస్కరణపై బీజేపీ, యూపీఏ లు ఇన్నేళ్లలో ఎందుకు ఏకీభావానికి రాలేకపోయారో తెలియదు. దీనివల్ల ఆమేరకు ఆర్థికతకు జరిగిన నష్టానికి ఆ ఉభయులూ బాధ్యులే అవుతారు కదా?

ఇంతకాలం బీజేపీ కలసి రాలేదు కనుక ఇప్పుడు ఆ వంతు కాంగ్రెస్ ది అవుతుంది. ఒక చర్చలో మనీష్ తివారీ ఆ మాట నిస్సంకోచంగా అనేశారు కూడా. జీఎస్టీ విషయంలో మీరు మాకు కలిసిరాలేదు కనుక, మా నుంచి మీరూ సహకారాన్ని ఆశించలేరు అనేశారు. రాజ్యసభలో సంఖ్యాబలం లేని మోడీ ప్రభుత్వం ఈ సహాయనిరాకరణను ఎలా అధిగమిస్తుందో, అందుకు ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం.

ఇలాంటివే ఇంకా మరి కొన్ని ఉంటాయి.

దేశానికి మేలు చేసే కొన్ని కీలకమైన విషయాలలోనైనా రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలూ(సైద్ధాంతికంగా కాంగ్రెస్, బీజేపీ తదితర పక్షాల విధానాలను వ్యతిరేకించే వామపక్షాలను అలా ఉంచితే) పరస్పరం సహకరించుకుంటే మంచిది కాదా అన్నది ప్రశ్న. 

No comments:

Post a Comment