Thursday, November 27, 2014

ఏకలవ్యుడికి అంత విలువిద్య అవసరమా?



ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? అంత విద్యను అతను ఏం చేసుకుంటాడు?! ఈ ప్రశ్నలను ఇంతవరకు ఎవరూ ముందుకు తెచ్చినట్టు లేదు. 

Wednesday, November 19, 2014

స్త్రీ సంబంధం లేకుండా సంతానం సాధ్యమా?!

ద్రోణుని సంహరించగల కొడుకుకోసం ద్రుపదుడు హోమ సన్నాహాలు అన్నీ చేసుకున్నాడు. యాజుడు ఋత్విక్కుగా,అతని తమ్ముడైన ఉపయాజుడు సహాయకుడిగా హోమం మొదలైంది. క్రమంగా పూర్తి కావచ్చింది. 

ఆ దశలో యాజుడు,

“త్వరగా నీ భార్యను యజ్ఞవేదిక దగ్గరికి రప్పించు. ఆమె హవిస్సును స్వీకరించాలి. ఆమెకు కొడుకు, కూతురూ కూడా కలగబోతున్నారు” అంటూ ద్రుపదుని తొందరపెట్టాడు. యాజుడికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉంది.

ద్రుపదుని భార్యకు కబురు వెళ్లింది. కానీ ఆమె రాలేదు.


“నేను రజస్వలనయ్యాను. ఇలాంటి అస్పృశ్యస్థితిలో వెంటనే యజ్ఞస్థలికి రాలేను. స్నానం చేసి వస్తాను. అంతవరకూ ఆగండి” అని కబురు చేసింది. 

Thursday, November 13, 2014

ఋగ్వేదంలో పేర్కొన్న 'పణులు' ఫొనీషియన్లు?!

 ఋగ్వేదంలో పేర్కొన్న పణులు ఫొనీషియన్లే నన్న కోశాంబీ ఊహ సరైనదే ననుకుంటే, దానికి సంబంధించిన చారిత్రక మూలాలు పై వివరాలలో దొరుకుతాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, హీరామ్ అనే ఫొనీషియన్ రాజుకు, యూదుల రాజులు డేవిడ్, సోల్మన్ లతో ఏర్పడిన స్నేహ సంబంధాలలో దొరుకుతాయి. 

అప్పటికి ప్రపంచ వర్తకం అంతా సెమిటిక్కులైన ఫొనీషియన్ల చేతుల్లోనే ఉండేదని, వారి వర్తక నౌకలు బ్రిటన్, అట్లాంటిక్ ల వరకు; ఎర్ర సముద్రం మీదుగా అరేబియాకు, బహుశా భారత దేశానికీ వెళ్ళేవని వెల్స్ అంటారు. అలా వెళ్ళిన సందర్భంలోనే పణులు లేదా ఫొనీషియన్లు ఋగ్వేదంలోకి ప్రవేశించి ఉంటారు. 

తాము వర్తకం జరిపే దేశాలలో వారు కాలనీలు ఏర్పాటుచేసుకునే వారు. మిగతా చోట్లలో సెమెటిక్కులకు, ఆర్యులకు ఘర్షణలు జరుగుతున్నట్టే ఇక్కడా జరగడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఘర్షణలే ఋగ్వేదానికి ఎక్కి ఉండవచ్చు. 

Friday, November 7, 2014

స్వచ్చ భారత్...చెత్త మనుషులు...

 ఇలాంటి 'అస్వచ్చ' మనుషుల్ని నమ్ముకుని మోడీ  'స్వచ్చ భారత్' ను తీసుకురాగలరా?!

మొన్న ఢిల్లీలో ఏం జరిగిందో చూడండి. లోడీ రోడ్డు ఢిల్లీలో తుడిచిన అద్దంలా ఉండే ప్రాంతాలలో ఒకటి. అక్కడ ఒక ఇస్లామిక్ సంస్థ ఉంది. దాని దగ్గర మనవాళ్లు స్వచ్చ భారత్ ను అభినయించారు. దానికి ఢిల్లీ బి‌జే‌పి అధ్యక్షుడు ముఖ్య అతిథి అట. అందులో మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న షాజియా ఇల్మీ కూడా పాల్గొన్నారు. కొందరు బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. అందరూ పొడవాటి చీపురు కర్రలు పట్టుకున్నారు. తుడవడం ప్రారంభించారు. మీడియా కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయి.

మీడియా కెమెరాలు అదొక్కటే చిత్రీకరించి ఊరుకోలేదు. అంతకు ముందు ఇంకో దృశ్యాల్ని కూడా చిత్రీకరించాయి. అది, తోపుడు బండిలో కొందరు చెత్త తీసుకొచ్చి అక్కడ పోస్తున్న దృశ్యం. ఆ దృశ్యమే అసలు ఫార్స్ ను ప్రదర్శించింది. ఈ వీఐపీలు స్వచ్చ భారత్ ను అభినయించడానికి అక్కడికి చెత్త తీసుకొచ్చి పోయించారన్న మాట. అంటే చెత్త దగ్గరకు వీళ్ళు వెళ్లలేదు. వీళ్ళ దగ్గరకే చెత్త వచ్చింది.

ఇంకో వింత చూడండి...అందరూ పక్క పక్కనే నిలబడి ఒకేచోట చెత్త తుడుస్తున్నట్టు అభినయించారు. అవును మరి గ్రూపుగా ఉంటేనే కదా ఫోటోలో పడేది!

బహుశా ఈపాటికి వీఐపీలకు చెత్త పోగుచేసి అమ్మి డబ్బులు చేసుకునే వాళ్ళు కూడా రంగప్రవేశం చేసి ఉంటారు. అలా చెత్త కూడా ఓ వ్యాపార సరుకుగా మారిపోయి ఉంటుంది.

ఇందులో పార్టీ తేడాలు లేవు చూడండి...బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ఆప్ మాజీ నేత ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ చేయరు.

ఇదేం దారుణం అని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుని అడిగితే, చిన్న విషయాలు పెద్దవి చేస్తున్నారని ఆయన కోప్పడ్డారు. ఇది చిన్న విషయమా?! ఆయన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్నారు తప్ప దానిని ఆయన నిర్వహించలేదని బీజేపీ ప్రతినిధులు సమర్థించబోయారు.

మొత్తానికి ఇలా స్వచ్చ భారత్ కొంతకాలం జరుగుతుంది. దేశంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. కానీ స్వచ్చ భారత్ నటులకు మాత్రం రాజకీయంగా గుర్తింపు వస్తుంది.

ఇలాంటి చెత్త మనుషులు ఉన్నప్పుడూ దేశం లోని మొత్తం చెత్త నంతనీ తుడవడం మోడీ ఒక్కరి వల్లే అవుతుందా? 

Thursday, November 6, 2014

సూర్యుని పండుగే క్రిస్టమస్ అయింది!

శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది...
ఆయన ఓ సినిమా పాటలో బతుకు బరువు అని కాబోలు, రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు చూసేవారికి తెలిసిన పేరే. బతుకు బరువు అనే మాట వినగానే ఆయన భారంగా నిట్టూర్చి, బతుకు మా సెడ్డ బరువు అంటే ఇంకా బాగుంటుం దన్నారట. ఆ మాట శ్రీశ్రీకి నచ్చి అలాగే ఉపయోగించారు. దీనికి ఓ బరువైన ముగింపు కూడా ఉంది.  ఆ మరునాడే చదలవాడ కన్నుమూశారు!

Saturday, November 1, 2014

విదేశాల్లో దాచుకున్న నల్లధనం 10 శాతమే?!


ఈ రోజు(1 నవంబర్ 2014) నల్లధనం మీద హిందూ లో ఒక  ఆర్టికల్ వచ్చింది. దాని ప్రకారం:

1. ఏటా ఉత్పత్తి అయ్యే నల్లధనం జిడిపిలో 50 శాతం. అంటే, 65 లక్షల కోట్లు. ఇందులో విదేశాలకు చేరేది 10 శాతం. మిగతాది దేశంలోనే ఉంటుంది. ఇందులో మళ్ళీ కొంత హవాలా, తప్పుడు వాణిజ్య మార్గాలలో విదేశాలకు పోతుంది. 

2. 1948-2012 మధ్యకాలంలో ఉత్పత్తి అయిన నల్లధనం 1.2 ట్రిలియన్ డాలర్లు. 

3. విదేశీ బ్యాంకులలో భారతీయులు దాచుకున్న నల్లధనం నగదు రూపంలో ఎంతన్నది అంచనా వేయడం దాదాపు అసాధ్యం. స్విట్జర్లాండ్ లో హెచ్‌ఎస్‌బి‌సి ఒక్కటే కాక చాలా బ్యాంకులు ఉన్నాయి. మన దగ్గర ఉన్న జాబితాలో ఉన్న 627 పేర్లకు చెందిన అకౌంట్లు కేవలం హెచ్‌ఎస్‌బి‌సి కి చెందినవి మాత్రమే. 

4. అకౌంట్లు బినామీ పేర్ల మీద ఉంటాయి. కనుక అసలు ఖాతాదారులు ఎవరన్నది తెలుసుకోవడం చాలా కష్టం. 

5. ద్వంద్వపన్నుల నివారణ ఒప్పందం(DTAA) వెల్లడించిన ఆదాయానికి సంబంధించినది. దాని ద్వారా నల్లడబ్బు 
వెల్లడి కాదు. ప్రభుత్వం విదేశాలతో ఇంతవరకు చేసుకున్న ఇటువంటి ఒప్పందాలతో ఏ కొంచెం సమాచారం రాలేదు.

6. ఫాన్స్, జర్మనీలు సమాచారం ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. (యూపీఏ) ప్రభుత్వం తీసుకోడానికి తిరస్కరించింది. కోర్టు ఒత్తిడి చేసాకే తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది.

7. అమెరికా స్విస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, బెదిరించి యూబీయెస్ బ్యాంక్ నుంచి 4,500 పేర్లు సంపాదించడమే కాక, దానినుంచి 780 మిలియన్ డాలర్ల జరిమానా వసూలుచేసింది. మనదేశం అలా దృఢంగా వ్యవహరించడం లేదు.

8. మన దేశంలోని అనేక బ్యాంకులు హవాలా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు

http://www.thehindu.com/opinion/lead/lead-article-secrecy-in-the-name-of-privacy/article6553153.ece