Friday, November 7, 2014

స్వచ్చ భారత్...చెత్త మనుషులు...

 ఇలాంటి 'అస్వచ్చ' మనుషుల్ని నమ్ముకుని మోడీ  'స్వచ్చ భారత్' ను తీసుకురాగలరా?!

మొన్న ఢిల్లీలో ఏం జరిగిందో చూడండి. లోడీ రోడ్డు ఢిల్లీలో తుడిచిన అద్దంలా ఉండే ప్రాంతాలలో ఒకటి. అక్కడ ఒక ఇస్లామిక్ సంస్థ ఉంది. దాని దగ్గర మనవాళ్లు స్వచ్చ భారత్ ను అభినయించారు. దానికి ఢిల్లీ బి‌జే‌పి అధ్యక్షుడు ముఖ్య అతిథి అట. అందులో మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న షాజియా ఇల్మీ కూడా పాల్గొన్నారు. కొందరు బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. అందరూ పొడవాటి చీపురు కర్రలు పట్టుకున్నారు. తుడవడం ప్రారంభించారు. మీడియా కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరించాయి.

మీడియా కెమెరాలు అదొక్కటే చిత్రీకరించి ఊరుకోలేదు. అంతకు ముందు ఇంకో దృశ్యాల్ని కూడా చిత్రీకరించాయి. అది, తోపుడు బండిలో కొందరు చెత్త తీసుకొచ్చి అక్కడ పోస్తున్న దృశ్యం. ఆ దృశ్యమే అసలు ఫార్స్ ను ప్రదర్శించింది. ఈ వీఐపీలు స్వచ్చ భారత్ ను అభినయించడానికి అక్కడికి చెత్త తీసుకొచ్చి పోయించారన్న మాట. అంటే చెత్త దగ్గరకు వీళ్ళు వెళ్లలేదు. వీళ్ళ దగ్గరకే చెత్త వచ్చింది.

ఇంకో వింత చూడండి...అందరూ పక్క పక్కనే నిలబడి ఒకేచోట చెత్త తుడుస్తున్నట్టు అభినయించారు. అవును మరి గ్రూపుగా ఉంటేనే కదా ఫోటోలో పడేది!

బహుశా ఈపాటికి వీఐపీలకు చెత్త పోగుచేసి అమ్మి డబ్బులు చేసుకునే వాళ్ళు కూడా రంగప్రవేశం చేసి ఉంటారు. అలా చెత్త కూడా ఓ వ్యాపార సరుకుగా మారిపోయి ఉంటుంది.

ఇందులో పార్టీ తేడాలు లేవు చూడండి...బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ఆప్ మాజీ నేత ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ చేయరు.

ఇదేం దారుణం అని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుని అడిగితే, చిన్న విషయాలు పెద్దవి చేస్తున్నారని ఆయన కోప్పడ్డారు. ఇది చిన్న విషయమా?! ఆయన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్నారు తప్ప దానిని ఆయన నిర్వహించలేదని బీజేపీ ప్రతినిధులు సమర్థించబోయారు.

మొత్తానికి ఇలా స్వచ్చ భారత్ కొంతకాలం జరుగుతుంది. దేశంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. కానీ స్వచ్చ భారత్ నటులకు మాత్రం రాజకీయంగా గుర్తింపు వస్తుంది.

ఇలాంటి చెత్త మనుషులు ఉన్నప్పుడూ దేశం లోని మొత్తం చెత్త నంతనీ తుడవడం మోడీ ఒక్కరి వల్లే అవుతుందా? 

No comments:

Post a Comment