కిరణ్ బేడి నేరుగా బిజెపిలో చేరారనుకోండి...అందులో విశేషం ఏమీలేదు. ఎంతోమంది పోలీస్, సైనికాధికారులు, బురాక్రాట్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. దానికి మనం అలవాటుపడిపోయాం.
అలాగే షాజియా ఇల్మి అనే టీవీ యాంకర్ ఏ కాంగ్రెస్ లోనో, బీఎస్పీలోనో, ఎస్పీలోనో ఉండి బిజెపీకి మారినా-అందులో విశేషం ఏమీ లేదు. దానికి మనం అలవాటుపడిపోయాం. కానీ ఆమె అవినీతివ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన AAPలో చేరి, ఆ తర్వాత తప్పుకుని బిజెపిలో చేరారు.
ఆవిధంగా వీరిప్పుడు బిజెపిలో చేరింది రాజకీయమైన రూట్లోంచి కాదు. రాజకీయేతరమైన 'అవినీతివ్యతిరేక ఉద్యమం' అనే రూట్లోంచి! రాజకీయపార్టీలను అన్నింటినీ-బిజెపితో సహా -కట్ట కట్టి వెక్కిరించి, తిట్టిపోసిన వాళ్ళే ఇప్పుడు అలాంటి పార్టీల రూట్లోకి వచ్చారు. అక్కడుంది విశేషం.
మనం ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా కాసేపు 'అవినీతి వ్యతిరేక ఉద్యమం' అనే పార్టీ కాని పార్టీ తరపున మాట్లాడుదాం. పాపం, అవినీతి వ్యతిరేక ఉద్యమం దీనిని ఎలా ప్రశ్నిస్తుంది? ఇప్పుడు దానికి ఎవరు దిక్కు? వీళ్ళు రేపు పొద్దున రాజకీయాల్లోకి రావడానికి, లేదా రాజకీయాల్లోకి వెళ్లడానికి అవసరమైన ట్రయినింగ్ పొందడానికి తన ప్లాట్ ఫామ్ ను వాడుకున్నారని అనుకోదా? ఏరు దాటి తెప్ప తగలేశారనుకోదా? వీళ్ళను నమ్మి వీళ్ళవెనుక జెండాలు పట్టుకుని ఊరేగినవారు, రామ్ లీలా మైదానంలోనో మరో చోటో పగలు రాత్రి పడిగాపులు పడినవారు ఇప్పుడు ఏమనుకుంటారు? తమను దారుణంగా వెన్నుపోటు పొడిచారని అనుకోరా? అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో వీళ్ళు సాగించిన రాజకీయ రిహార్సల్స్ ను నిజమని నమ్మి చప్పట్లు కొట్టిన జనం ఇప్పుడు ఏమనుకుంటారు?
కిరణ్ బేడి ఇప్పుడు అభివృద్ధి గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి టీవీ చానెళ్లలో నిమిషాల తరబడి జనానికి ఉద్బోధ చేస్తున్నారు. కానీ ఆమె మొదటినుంచి మాట్లాడుతూ వచ్చింది అవినీతి గురించి, లోక్ పాల్ గురించి కదా? ఇప్పుడు అభివృద్ధికి, అడ్మినిష్ట్రేషన్ కు ఎందుకు ఫిరాయించారు? తను బీజేపీలో చేరగానే అవినీతి మాయమైపోయిందా? లోక్ పాల్ ఇప్పుడో అంశం కాదా? conflict of interest ఆరోపణ ఎదుర్కొంటున్న ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ విషయంలో ఆమె ఇప్పుడు గొంతు ఎత్తగలరా?
అప్పుడలా, ఇప్పుడిలా ఏమిటని అడిగితే, మనం ఎప్పటికప్పుడు evolve అవుతూ ఉంటాం, అభిప్రాయాలు మారుతూ ఉంటాయని ఆమె సెలవిస్తున్నారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారే ఈ 65 ఏళ్ల వృద్ధనేత ఇప్పుడు అభివృద్ధి గురించి సుపరిపాలన గురించి ఉపదేశాలు చేస్తుంటే జనం బుద్ధిగా విని జైకొట్టాలి!
అరవింద్ కేజ్రీవాల్ ను ఈ కోవలోకి చేర్చడానికి వీల్లేదు. ఆయనా రాజకీయాల్లోకి వచ్చాడు కానీ పార్టీ పెట్టి వచ్చాడు. ఏ బిజెపిలోనో, కాంగ్రెస్ లోనో చేరలేదు.
ఇక అన్నా హజారే ఒక్కరే మిగిలినట్టున్నారు. ఆయన కూడా ఏదో ఒక పార్టీలో చేరిపోతే పోలా?