Wednesday, January 28, 2015

సినిమాలలో చందమామ

నేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్ కూడా. ఆయన పూర్తిపేరు పి. సుబ్బిరామిరెడ్డి అని జ్ఞాపకం. రెడ్డిగారనే చిన్నపేరుతోనే ఆయన మాకు తెలుసు. ఆయన నటులు కూడా. విజయవాడలో ఆరోజుల్లో ర.స.న. సమాఖ్య అనే ప్రసిద్ధ నాటక సంస్థ ఉండేది. రెడ్డిగారే కాక ఎందరో ప్రసిద్ధనటులు అందులో సభ్యులుగా ఉండేవారు. నటులు కనుక రెడ్డిగారు మాటలో, నడకలో, ఆహార్యంలో మంచి స్టైల్ గా ఉండేవారు.


విషయమేమిటంటే, రెడ్డిగారి క్లాసు చాలా సరదాగా, నవ్వులు, తుళ్ళింతలతో సాగిపోయేది. కౌమారదశకదా... మగ, ఆడపిల్లల్ని గిలిగింతలు పెడుతూ సిగ్గుల దొంతర్లలో ముంచెత్తే సరసమైన జోకులు అప్రయత్నంగా ఆయన నోట జాలువారుతూ ఉండేవి. మధ్య మధ్య సినిమాల ముచ్చట్లూ దొర్లేవి. ఆయన అప్పుడు అన్న ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. “మీరు ఏ సినిమా చూడండి...చందమామ ఒక్కసారైనా కనిపించకుండా ఉండడు” అనేవారాయన. అప్పటినుంచి ఏ సినిమా చూస్తున్నా పనిగట్టుకుని చందమామ ఉన్నాడా లేదా అన్నది చూడడం నాకు పరిపాటి అయిపోయింది. ప్రతిసారీ, రెడ్డిగారు చెప్పింది నిజమే సుమా అనుకుని ఆశ్చర్యపోయేవాణ్ణి. 

No comments:

Post a Comment