Thursday, April 30, 2015

స్త్రీలు నెల నెలా 'బయట చేరడం' ప్రపంచమంతా ఉండేది!

మన జ్ఞానశూన్యతకు ఎల్లలు లేవు. నెల నెలా మూడురోజులపాటు 'బయట చేరడం' అనేది మనలోనే, అందులోనూ ఒకటి, రెండు పై కులాలలలోనే ఉందని అనుకుంటాం. కానీ ఇది దాదాపు ప్రపంచమంతటా అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉంది. ఇంకా చెప్పాలంటే, మనకు తెలిసినదానికంటే కూడా కర్కశంగా, పట్టువిడుపులు లేనంతగా ఉండేది. కొన్ని చోట్ల మూడు రోజులు కాక, వారం, నెల, చివరికి ఏళ్ల తరబడి ‘బయట’ ఉంచేవారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.
సర్ జేమ్స్ ఫ్రేజర్ ‘The Golden Bough’ లో ఈ ఆచారం ఎక్కడెక్కడ ఉందో విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చారు.

Thursday, April 23, 2015

శంకరాచార్యులు మెటీరియలిస్టట!!!

నేనిప్పుడు రాంభట్ల కృష్ణమూర్తి గారి ‘సొంతకథ’ నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన వాక్యాలను ఉటంకిస్తాను. అవి ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయంటే సాంప్రదాయికమైన ఊహను అవి పూర్తిగా తలకిందులు చేసి, షాకిస్తాయి. తీవ్రవివాదాస్పదంగానూ, చర్చనీయంగానూ కనిపిస్తాయి. ఆయన అంటారు:
“నేను నిరీశ్వరవాదిని, భౌతికవాదిని కూడా. ఈ రెండింటినీ ఒకరి నుంచే నేర్చాను. అతడే శంకరాచార్యుడు. అతడి తత్వం నాలుగు మహావాక్యాల్లో ఉందంటారు పెద్దలు. తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి… ఇవీ ఆ మహావాక్యాలు. ఆయన వాదం నుంచే నేను మరో మహావాక్య చతుష్టయాన్ని ఎంచుకున్నాను. అవి: ఆవిద్య, భ్రాంతి, మాయ, మిథ్య. చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లేడు. క్రీస్తు శకం ప్రథమ సహస్రాబ్దిలోనే మనకు దేశవిజేతల ద్వారా దేవునితో పరిచయం కలిగింది.”

Wednesday, April 15, 2015

పరిచారకులు, రథాలతోనే పాండవుల అరణ్యవాసం చేశారు!

మహాభారత మూలకథలోని కొన్ని ముఖ్యమైన కథాంశాలు ప్రచారంలో లేకపోవడం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, పాండవులు, ద్రౌపది పన్నెండేళ్ళ అరణ్యవాసమూ ఒంటరిగా చేశారనే ఊహకు మనం అలవాటు పడిపోయాం. కానీ అది నిజం కాదు.  వారి వెంట పరివారమూ, పరిచారకులే కాక, రథాలూ, గుర్రాలూ వగైరాలు ఉన్నాయి. ఇందుకు విరాటపర్వం, ప్రథమాశ్వాసమే సాక్ష్యం.

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/04/15/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B1%81/ లో చదవండి)

Wednesday, April 8, 2015

స్త్రీకి తొలి భర్త చంద్రుడే!

స్త్రీలలో ఋతుస్రావా(menstruation)నికి చంద్రుడే కారణం. చంద్రుడు ఒక యువకుడనీ, అతడు స్త్రీలపై లైంగిక చర్యకు పాల్పడి ఋతుస్రావానికి కారణమవుతాడనీ ముర్రే దీవుల్లోని ప్రజలు భావిస్తారు. ఋతురక్తం నుంచే పిండం రూపొందుతుందని విశ్వాసం కనుక, ఋతుస్రావాన్ని ఒకవిధమైన గర్భస్రావంగానూ భావిస్తారు. దానినుంచే ‘moon-calf’ అనే మాట పుట్టింది. అది అంగవైకల్యాన్ని సూచిస్తుంది. ఇలా చూసినప్పుడు స్త్రీ గర్భం ధరించడానికి కారణమూ చంద్రుడే. ఈవిధంగా ‘స్త్రీకి చంద్రుడే భర్త’ అన్న ఆదిమ విశ్వాసం పుట్టింది. మావోరీ తెగవారు స్త్రీకి చంద్రుడే అసలు భర్త అని నమ్ముతారు. స్త్రీ గర్భానికి పురుషుడు కారణమనే భావన, పితృత్వం సాంఘిక ప్రతిపత్తిని సంపాదించుకున్న తర్వాతే మొదలైందని థాంప్సన్ అంటారు. అంతవరకూ స్త్రీ గర్భానికి కారణం చంద్రుడే.


Wednesday, April 1, 2015

'జంట గొడ్డలి' చెప్పే జగజ్జనని తత్వం

చిత్రం మధ్యలో కనిపిస్తున్నది, క్రీటుకు చెందిన జంట గొడ్డలి. దాని ఒక అంచు బలిని సూచిస్తోంది. రెండవ అంచు జీవవృక్షాన్ని సూచిస్తోంది. చెట్టు కింద కూర్చుని ఉన్నదే జంట గొడ్డలి దేవత. ఆమె ప్రసన్నవదనంతో ఉంది. ఆమె ఎదురుగా ఇద్దరు భక్తులు ఉన్నారు. ఆమె కుడి చేతితో ఒక పంట తాలూకు మూడు కంకులు వారికి ఇస్తూ, ఎడమ చేతితో తన స్తనం ఒకదానిని ఎత్తిచూపుతోంది. ఆమె పాదాల దగ్గర ఒక చిన్నపిల్ల ఉంది. కాళ్ళు లేని ఆ పిల్ల భూమిలోంచి పైకి వస్తున్నట్టు ఉంది. ఆ అమ్మాయి ఎడమచేతిలో చిన్న జంట గొడ్డలి, కుడి చేతిలో చెట్టుకొమ్మ ఉన్నాయి.