Friday, May 29, 2015

వందేళ్ల క్రితం వరకు అశోకుడి గురించి మనకు తెలియదు!

కొన్ని వాస్తవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, చరిత్రకు తెలిసినంతవరకు ఇంచుమించు భారతదేశం మొత్తాన్ని ఏలిన తొలి రాజు అశోకుడి గురించి వందేళ్ల క్రితం వరకూ మనకు స్పష్టంగా తెలియకపోవడమే చూడండి. ఒక పాశ్చాత్య శాసన పరిశోధకుడు బయటపెట్టిన ఆధారాన్నిబట్టి  ప్రాచీన సింహళ పత్రాలను గాలించిన తర్వాతే అశోకుడు అనే గొప్ప రాజు  గురించి నికరంగా మనకు తెలిసింది. 

('చరిత్ర, అచరిత్రల మద్య మనం' అనే శీర్షికగల పూర్తివ్యాసం  http://magazine.saarangabooks.com/2015/05/28/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%85%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%82/ లో చదవండి)

Saturday, May 23, 2015

శృంగార రసం ఎలా పుట్టింది?

ఏ కన్య అయినా గణపతి శృంగారసామర్థ్యం మీద పెదవి విరిస్తే, గణకన్య లందరూ అతన్ని చుట్టుముట్టి మెడలో వేసిన పూలమాలలు పీకి పారేస్తారు. కిరీటం తీసేసి కొమ్ములు విరుస్తారు. ‘అవమానించడం’ అనే అర్థంలో ‘శృంగభంగం’ అనే మాటకు ఇదే మూలం కావచ్చు. గణదాయీలు అడ్డుపడకపోతే అతని ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ గణపతి ఆచారాలు నిన్నమొన్నటి వరకూ చాలా తండాలలో ఉండేవి. మన సాహిత్యంలో రసరాజు అయిన శృంగారం పుట్టిన వైనం ఇదీ. శృంగారంతోపాటు హాస్యకరుణలు కూడా గణపతి నుంచే పుట్టాయి. 
('గణపతి కొమ్ము కిరీటం చెప్పే శృంగారగాథ' అనే శీర్షికతో పూర్తి వ్యాసం http://magazine.saarangabooks.com/2015/05/21/%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81-%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B1%80%E0%B0%9F%E0%B0%82-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D/ లో చదవండి)

Thursday, May 14, 2015

సుమేరు దేవుడు 'అంకి' వెంకటేశ్వరుడు అయ్యాడా?!

ప్రాచీన సుమేరు పురాణ కథలో ‘అన్’ అంటే స్వర్గం. ‘కి’ అంటే భూమి. దానినే స్త్రీ పురుషులకు అన్వయిస్తే, స్వర్గం పురుషుడు. భూమి స్త్రీ. వీరు మొదట అవిభాజ్యంగా ‘అంకి’ అనే పర్వతరూపంలో ఉన్నారు. ఆ తర్వాత ‘ఎన్ లిల్’ అనే కొడుకు పుట్టి వీరిని రెండుగా విడదీశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం చెప్పుకుని మిగతా వివరాలలోకి తర్వాత వెడదాం. అదేమిటంటే, ఈ సుమేరు ‘అంకి’ నుంచే ‘ఎంకి’, ‘వెంకి’, ‘వెంకటేశ్వరుడు’ అవతరించాడని రాంభట్ల అంటారు.

('సుమేరులోనూ ఉన్నాడు శివుడు' అనే శీర్షికతో పూర్తివ్యాసం  http://magazine.saarangabooks.com/2015/05/14/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AE%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B1%82-%E0%B0%89%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1/ లో చదవండి)

Saturday, May 9, 2015

సల్మాన్ ముందు న్యాయం ధర్మాలు గులాం!

ఇంతకుముందు సంజయ్ దత్ కేసు చూశాం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసు చూశాం. కొత్తేమీలేదు. సంజయ్ దత్ కు శిక్ష పడినందుకు బాలీవుడ్ అంతా పడిపడి ఏడిచింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు శిక్షపడినందుకు గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది.

రెండు కేసుల్లోనూ కోర్టులు, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థా వ్యవహరించిన తీరులో కూడా కొత్తేమీ లేదు. సంజయ్ దత్ కు మాటి మాటికీ పెరోల్ లభించింది. సల్మాన్ ఖాన్ కు గంటల్లో బెయిల్ లభించింది.

కానీ ఈసారి ఒక కొత్తదనం ఉన్నట్టు కనిపించింది. సల్మాన్ కు శిక్షపై కొంతమంది-కొంతమందే ఏమిటి ఎక్కువమందే-స్పందన చూసిన తర్వాత నాకు ఈ దేశాన్ని తలచుకుని కొత్తగా భయం కలిగింది. ఈ దేశం ఏమైపోతోంది, ఎటుపోతోందనిపించి బెంగ కలిగింది. ఇది మనకు తెలిసిన, ఇంతవరకు మన ఊహలో ఉన్న దేశం కాదనిపించింది.

గత మూడు నాలుగురోజులుగా సల్మాన్ పై వ్యక్తమవుతున్న స్పందన నాకు కలిగించిన అభిప్రాయం ఒక్కటే: సల్మాన్ ఈ దేశంలోని చట్టాల కన్నా, రాజ్యాంగం కన్నా, న్యాయవ్యవస్థ కన్నా, సమన్యాయం, సమాన నీతి, సమధర్మం మొదలైన భావనల కన్నా, మరి దేనికన్నా కూడా గొప్పవాడు! సల్మాన్ ఖాన్ అనే గొప్పవాడికి అనుగుణంగా అవి నడుచుకోవాలే తప్ప, సల్మాన్ ఖాన్ అనే గొప్పవాడు వాటి ప్రకారం నడచుకోడు!

ఇవాళ సల్మాన్ ఖాన్ అయ్యాడు. రేపు అతన్ని తల దన్నేవాడు ఇంకొకడు అవుతాడు. అతడు ఎంత పెద్ద  నేరం చేసినా సరే, అతని గొప్పతనాన్ని, అతని దాతృత్వాన్ని, మంచి తనాన్ని, సెలెబ్రటి లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి కానీ అతని నేరాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకూడదు. ఇదీ ఇందులోని సారాంశం.

సల్మాన్ వ్యవహారంలో కొత్తదనం ఏమీ లేదని అంటూనే కొత్తగా భయం కలిగిందని ఎందుకన్నారనే సందేహం మీకు కలగచ్చు. అందులోకే వస్తున్నాను.

వ్యవస్థ సామాన్యుడి పట్ల ఒక నీతినీ, సెలెబ్రటిపట్ల ఇంకో నీతినీ పాటించడం ముందునుంచీ ఉన్నదే. కానీ ఇప్పుడు సల్మాన్ సందర్భంలో కొత్తగా చూస్తున్నదేమిటంటే, దానిని బాలీవుడ్ కు చెందినవాళ్లే కాక, లాయర్లు, ఇతరులూ కూడా నిస్సిగ్గుగా సమర్థించుకోవడం. డబ్బున్నవాడు ఆ డబ్బుతో న్యాయవ్యవస్థలోని వెసులుబాట్లను కొనుక్కోగలగడంలో సత్వర న్యాయం పొందడంలో తప్పేమిటనీ; డబ్బులేనివాడు కొనుక్కోలేక న్యాయం పొందలేకపోవడంలో వింత ఏమిటనీ ప్రశ్నిస్తూ అది అంతే నన్నట్లుగా మాట్లాడడం.

అదీ కొత్తగా భయపెట్టే విషయం.

వ్యవస్థ సామాన్యుడి పక్షం వహించకపోయినా కనీసం ఇంతవరకు పైకి అయినా సామాన్యుడి పక్షం వహించడం అనే పోలిటికల్ కరెక్ట్ నెస్ ను పాటించేవారు. ఇప్పుడు ఆ చిన్న సిగ్గు బిళ్ళ కూడా తీసేస్తున్నారు. అదీ కొత్తగా భయపెడుతున్న విషయం.

ఇంకా కావాలంటే ఈ దారుణం చూడండి...ముంబైకి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు ఈ మూడునాలుగు రోజులుగా అక్షరాలా సల్మాన్ ప్రతినిధి అయిపోయారు!

అంటే, పోలిటికల్ కరెక్ట్ నెస్ ను కూడా కరెక్టు చేసుకోవలసిన రోజులు వచ్చాయన్నమాట. కొత్తగా భయపెడుతున్నది అదే. మొదట్లో అలాగే ఉంటుంది లెండి, క్రమంగా అలవాటుపడిపోతారంటారా...అలవాటు పడక చేసేదేముంది?!


Thursday, May 7, 2015

కుంతి-కర్ణుల కథలు ప్రపంచమంతా ఉన్నాయి!

నదీదేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వీరపుత్రులు కలుగుతారన్నప్పుడు మహాభారతంలోని కుంతికథ, గంగా-శంతనుల కథ చటుక్కున గుర్తొచ్చి ఉండాలి. కుంతి కన్యగా ఉన్నప్పుడే కర్ణుని కని నదిలో విడిచిపెట్టింది. కర్ణుడు వీరపుత్రుడే. అలాగే, గంగ అనే ‘నది’కి శంతనుని వల్ల కలిగిన భీష్ముడు కూడా మహావీరుడే. కాకపోతే, నదిని మనం స్త్రీ రూపంగా భావిస్తే, గ్రీకులు పురుషరూపంలో భావించారు. మెసొపొటేమియాను పాలించిన సారగాన్(క్రీ.పూ. 2350)ను అతని తల్లి రహస్యంగా కని, ఒక బుట్టలో ఉంచి దానిని తారుతో మూసి నదిలో విడిచిపెట్టింది. అతను కూడా వీరుడే. హిబ్రూ మోజెస్ పుట్టుక కూడా ఇలాంటిదే. ఇటువంటి పుట్టుకలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డెబ్బైకి పైగా ఉదంతాలు ఉన్నాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు.

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/05/07/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%E0%B0%95%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A6%E0%B0%82/ లో చదవండి)