తమ మధ్య ఎలాంటి కీచులాటలు
ఉన్నా పాతికేళ్లో,
పదేళ్ళో కాపురం చేసిన భార్యను భర్త, భర్తను, భార్య విడిచిపెట్టాలనుకోవడం మనదేశంలో ఇప్పటికీ అంత తేలిక
కాదు. చట్టపరమైన అడ్డంకుల సంగతి అలా ఉంచితే, పిల్లాలూ, ఇతర ఎమోషనల్ బంధాలూ అడ్డం వస్తాయి. పెద్దవాళ్ళు
కూడా చూస్తూ ఊరుకోరు. సర్దు బాటు చేయడానికి ప్రయత్నిస్తారు. అయినా విడిపోవడం లేదని
కాదు. విడిపోతున్న కేసులకన్నా సర్దుకుని కలిసే ఉంటున్న కేసులే ఎక్కువ ఉంటాయి. విడిపోవడానికి
మానసికంగా ఎంతో సిద్ధం కావాలి. విడిపోవడమంటే
జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే. ఎంత తగవులున్నా కలసి ఉండడానికి భార్యాభర్తలు
ప్రయత్నించడమే భారతీయవివాహ వ్యవస్థకు గల బలమని అంటారు. అయితే అదే బలహీనత అని అనే వాళ్ళూ
ఉన్నారు.
అదలా ఉంచితే, భారతీయ వివాహబంధం నమూనా మన బహుళ పక్ష ప్రజాస్వామిక
రాజకీయ వ్యవస్థకు ఏమాత్రం పనికిరావడం లేదు. పాతికేళ్లు ఒక పార్టీలో ఉండి దానితో, దాని ఐడియాలజీతో పెంచుకున్న ఎమోషనల్ బంధాన్ని
ఒకే ఒక్క ప్రకటనతో పుటుక్కున తెంచుకుని ఇంకో ‘పార్టీవ్రత్యా’నికి గెంతడానికి నాయకులు ఏమాత్రం వెనకాడడం లేదు.
అందుకు వాళ్ళలో ఎలాంటి అంతర్మథనం జరుగుతున్న
ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఇది బహుళపక్ష ప్రజాస్వామ్యానికి బలమో బలహీనతో తెలియడం లేదు.