Monday, September 24, 2012

ఇది నా సంతకం

నా ఆలోచనా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ బ్లాగు ప్రారంభిస్తున్నాను.

ప్రతి రచనా... అది కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, నవల కావచ్చు, వ్యాసం కావచ్చు... తన భావ ప్రపంచాన్ని, లేదా ఆలోచనా ప్రపంచాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నమే. నా ఉద్దేశంలో రచన అంటే, తనకు పూర్తిగా అపరిచితమైన ఈ ప్రపంచంలోకి తన ప్రయత్నం ఏమీ లేకుండా అడుగుపెట్టిన ఒక జీవి తను జీవించి ఉన్నంతకాలం ఈ ప్రపంచాన్ని నిరంతరం అర్థం చేసుకోడానికి చేసే ప్రయత్నంలో భూగోళం మీద లిఖించే తనదైన సంతకమే.

అందుకే ఇది నా సంతకం అంటున్నాను.

చాలామంది విద్యార్థిగానే జీవితం ప్రారంభిస్తారు. కానీ త్వరలోనే బెత్తం ఝళిపించే బడిపంతులు పాత్రలోకి మారిపోతూ ఉంటారు. ఒకసారి బడిపంతులు పాత్రలోకి మారిపోయిన తర్వాత ఇక తెలియజెప్పడమే తప్ప తెలుసుకోవడమంటూ ఉండదు. అలా బడిపంతులు రూపంలోని ఒక అసంపూర్ణ జ్ఞానం నిరంతర వికాస దశలో ఉండే  విద్యార్థి జ్ఞానాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునే ప్రయత్నంలోనే మతాలు పుట్టాయి. వ్యవస్థలు పుట్టాయి. సిద్ధాంతాలు పుట్టాయి. సాహిత్యరూపంలోని ప్రబోధాలు పుట్టాయి. చివరికి ప్రజాస్వామికంగా చెప్పుకునే వ్యవస్థల్లో రాజకీయపార్టీలూ పుట్టాయి. అందుకే ప్రపంచమంతా ఇప్పటికీ చాలావరకూ బడిపంతులు-విద్యార్థి అనే రెండు పాత్రల మధ్య నడుస్తోంది.

ఇది చదివి నేనేదో తాత్వికతను నూరిపోయడానికి ప్రయత్నిస్తున్నాననీ, అందుకే ఈ బ్లాగు అనీ అనుకోకండి. బడి పంతులుగా కంటే విద్యార్థిగా ఉండడానికే నేను ఇష్టపడతానని చెప్పడానికే ఈ వివరణ. పుట్టుక నుంచి మరణం వరకు ప్రపంచంతో వ్యక్తికి ఉండేది విద్యార్థి సంబంధమే. విద్యార్థిగా తన అవగాహనకు, ఆలోచనలకు ఎప్పటికప్పుడు  ఒక రూపంకల్పించడానికి అతడు రచనలూ చేస్తాడు. వ్యక్తిగా తన ఉనికిని ఆ విధంగా, లేదా మరో విధంగా  ప్రకటించుకోవడమే అతని పుట్టుక వెనుక పరమార్థమని నేను అనుకుంటాను. అది వ్యక్తికీ, ప్రపంచానికీ మధ్య అజ్ఞాతంగా నిరంతరాయంగా జరిగే ఒక పెనుగులాట.ఉనికిని స్థాపించుకునే ప్రయత్నంలో ఉపయోగించుకునే ప్రతి సాధనమూ ఒక వ్యూహంలో భాగమే అవుతుంది. ఆవిధంగా రచన కూడా ఒక వ్యూహమే.

వ్యక్తి అనే మాటను నేనిక్కడ ఉద్దేశపూర్వకంగానే వాడుతున్నాను. ఎందుకంటే, సమూహపు భాషకు అలవాటుపడిపోయిన ప్రపంచం చంద్రుడి ఒక వైపే చూసే భూమిగా మారిపోయింది. కనుక వ్యక్తి అనే రెండో వైపు చూడడం అవసరమని నేను అనుకుంటాను. అందుకే ఈ బ్లాగుకు నా పేరిటే నామకరణం చేశాను.

అంతేకాదు, ఇది నా సంతకం అనడంలో కూడా ఉద్దేశం అదే. ఈ ప్రపంచంలో ఏ ఇరువురి సంతకాల మధ్య సాధారణంగా పోలిక ఉండదు, ఉండకూడదు, ఉంటే చెల్లదు.

ఈ నా భావప్రపంచంలోకి మీరు కూడా తొంగి చూడచ్చు. మీ భావప్రపంచానికి ఇది దగ్గరగా ఉండచ్చు, లేదా దూరంగా ఉండచ్చు. ఎలా ఉన్నా ఎవరి భావప్రపంచాల ఉనికి వారిది. బెత్తం పుచ్చుకునే బడిపంతుళ్ళు లేని విద్యార్థి ప్రపంచాన్ని సృష్టించుకోడానికి ఎవరికి వారమే ప్రయత్నిద్దాం.

2 comments:

  1. సంతోషం సార్. మీ పుస్తకాలు చదివాను. కొత్త ఆశావహ ప్రపంచాన్ని స్వప్నిస్తున్నందుకు జేజేలు.

    ReplyDelete
  2. కృతజ్ఞతలు సీతారాం రెడ్డి గారు, మీ స్పందన నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అప్పుడప్పుడు అభిప్రాయాలు కలబోసుకుందాం.
    మీ,
    కల్లూరి భాస్కరం

    ReplyDelete