Tuesday, September 25, 2012

'చిల్లర' రాజకీయాలు

ప్రభుత్వం అన్నాక ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఆ చేసేది కూడా జనానికి భవిష్యత్తు మీద ఆశ కలిగిస్తూ ఉండాలి. ప్రభుత్వం మీద విశ్వాసం పుట్టిస్తూ ఉండాలి. అందులోనూ భారతదేశం ఇప్పుడున్న పరిస్థితిలో ఇది చాలా ముఖ్యం. దేశం ఇప్పుడు ఒక సమూలమైన పరివర్తన దశలో ఉంది. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఈ దశకు ప్రారంభం. అప్పుడు చేపట్టిన అజెండా ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉంది. దానిని పూర్తి చేయనైనా చేయాలి. లేదా అటక ఎక్కించనైనా ఎక్కించాలి. దేశాన్ని త్రిశంకు స్థితిలో నిలబెట్ట కూడదు. అజెండా ఎలాంటి దన్నది వేరే విషయం, అసలు అజెండా అంటూ ఒకటి ఉండడమూ ముఖ్యమే.

ఆర్థిక సంస్కరణలు మొదటి నుంచీ వివాదాస్పదమే. అది సహజమే కూడా. అయితే, సంస్కరణలను  వ్యతిరేకించడంలో అనేక తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు వామపక్షాల వ్యతిరేకతలో వాస్తవిక దృష్టి, హేతుబద్ధత పూర్తిగా ఉండక పోవచ్చు గానీ; అది కనీసం సిద్ధాంత పరంగానూ, స్పష్టంగానూ ఉంటుంది. ఊహించడానికి వీలుగానూ ఉంటుంది. అందులో రాజకీయమైన ఎత్తుగడలు, వ్యూహాలు, అవకాశవాదాల్లాంటివి మరీ అంత ఎక్కువ మోతాదులో ఉండవు. ఇతర పార్టీలు అలా కాదు. అవి అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మాట మారుస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు సంస్కరణలు అవసరమే నంటాయి. అంతేకాదు, మరింత ఊపుతో అమలు చేస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం సంస్కరణలకు వ్యతిరేకంగా అఖిల భారత బంద్ లు, ర్యాలీలు నిర్వహిస్తాయి. ఆర్థిక విధానాల లాంటి విషయాల్లో కూడా మెజారిటీ రాజకీయ పక్షాల మధ్య ఏకీభావం లేకపోవడం ఒక్కోసారి విపరీతంగానే కనిపిస్తుంది. 'ప్లేయింగ్ టు ది గేలరీ' ఆటను దాదాపు అన్ని పార్టీలూ పోటీపడి ఆడేస్తుంటాయి. ప్రజల అవగాహనాశక్తితో పార్టీలు ఆడే ఈ చదరంగాన్నే మర్యాదస్తుల భాషలో 'ప్రజాస్వామ్యం' అంటున్నాం.

అసలు విషయానికి వస్తే, ప్రభుత్వం ఏదో చేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో అంతరించి మూడేళ్లయింది. కామన్వెల్త్ గేమ్స్ చుట్టూ ముసురుకున్న వివాదాలు దీనికొక స్పష్టమైన ప్రారంభం. కామన్వెల్త్ గేమ్స్ బాగానే నిర్వహించామన్న సంతృప్తి కలిగి ఉండచ్చు కానీ దాంతో ప్రారంభమయిన 'పొలిటికల్ గేమ్స్' మాత్రం ఈ మూడేళ్లలో బురదగుంట స్థాయికి దిగజారిపోయాయి. ఇందుకు ఎవరు బాధ్యులన్న ప్రశ్నకు, ఎవరు బాధ్యులు కారన్న సమాధానమే ఎదురవుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చర్మం ఎప్పటిలా మందంగానే ఉండిపోవడం ఒక కారణం. గతంలో లేనంత విస్తృతినీ, వైవిధ్యాన్ని తెచ్చుకున్న మీడియా వాటితోపాటే క్రియాశీలతనూ పెంచుకుందనీ, వెనకటిలా మీడియా ఫోకస్ కు, జవాబుదారీకీ దూరంగా వ్యవహారాలు చక్కబెట్టడం ఇప్పుడు సాధ్యం కాదన్న గ్రహింపు కాంగ్రెస్ నాయకత్వానికి లేకపోయింది. కామన్వెల్త్ గేమ్స్ వెంటనే టూ జీ వివాదం లాంటివి ఒకటొకటే మెడకు చుట్టుకుని పరువు తీస్తున్నా వాటి మీద దుప్పటి  కప్పేసే బండ పద్ధతినే సాగదీస్తూ వచ్చింది. దీనిని  అవకాశంగా తీసుకుని అన్నా హజారే అండ్ పార్టీ రంగప్రవేశం చేసి కొంతకాలం మన్మోహన్ ప్రభుత్వం చెవులు పట్టుకుని ఆడించింది. ప్రభుత్వం వివాదాలతో ఇలా ఊపిరాడక గిలగిల లాడుతున్న పరిస్థితిని ప్రతిపక్షం సొమ్ము చేసుకోవడం సహజం. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ అందుకు యథాశక్తి ప్రయత్నించింది కానీ అది ఫలించిన దాఖలా కనిపించదు. కాంగ్రెస్ కు ఉన్నట్టే కొన్ని రకాల జాడ్యాలు దానికీ ఉండడం అందుకు కారణం. ప్రజల మనసెరిగి మరీ రాజకీయాట ఆడే నేర్పు ఆ పార్టీకి ఇప్పటికీ అలవడలేదు. అందుకే అది ఏ అంశం మీద పోరాడినా జనంలో దాని విశ్వసనీయత మరింత అడుగంటుతూ వస్తోంది తప్ప ఏ కొంచెం పుంజుకోవడంలేదు. ఉదాహరణకు ఆర్థిక సంస్కరణలనే తీసుకుందాం. వాటిపట్ల బీజేపీకి స్థూలంగా వ్యతిరేకత లేదు. అయినా సరే, వామపక్షాలను తలదన్నే స్థాయిలో అది వ్యతిరేకతను చాటుతోంది. ఆ విధంగా ప్రజల మెప్పు పొందుతున్నానని అనుకుంటోంది కానీ, విశ్వసనీయతకు మరింత పెద్ద గొయ్యి తవ్వుకుంటున్నానని తెలుసుకోలేక పోతోంది.

ఏమైతేనేం కాంగ్రెస్ బంతి మళ్ళీ పైకి లేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజకీయేతర పోరాట రూపంలో తెర మీదికి వచ్చిన అన్నా హజారే పార్టీ చివరికి రాజకీయగంగలో కలవాలని నిర్ణయించుకోవడం ఇందుకు కొంత నైతిక ఇంధనాన్ని అందించి ఉంటుంది. మరోవైపు మన్మోహన్ క్రియాశూన్యతపై 'టైమ్' మ్యాగజైన్ ప్రచురించిన కథనం ప్రభుత్వంలో కొత్త వేడి పుట్టించి ఉంటుంది. దాని ఫలితమే చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్.డీ.ఐ)లను అనుమతించాలనే   నిర్ణయం.

నిజానికి ఆ నిర్ణయంలో విశేషమేమీ లేదు. బీజేపీ సహా ప్రతిపక్షాలు దానిని వ్యతిరేకించడంలో అసలే లేదు. ఆ నిర్ణయానికి సమర్థనగా  మన్మోహన్ సింగ్ టీవీ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మరోసారి పోరాట స్ఫూర్తిని చాటుకోడంలోనే ఉంది విశేషమంతా. రాజకీయ పక్షాల కోణం నుంచి కాకుండా ప్రజల కోణం నుంచి చూసి వ్యాఖ్యానించుకోవలసిన విశేషమిది. ప్రభుత్వంలో అసలేమీ జరగడంలేదని అనుకుంటున్న వాళ్ళకు మూడేళ్ళ తర్వాత మొదటిసారిగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయాన్ని మన్మోహన్ సింగ్ తన ప్రసంగం ద్వారా అందించగలిగారు. 2009 నుంచీ ఈ అయిదేళ్ళ కాలాన్ని శూన్య కాలంగా నిర్ధారణకు వచ్చిన ఎంతోమందికి ఇదొక పెద్ద రిలీఫ్. తన తొలి విడత పాలనలో వామపక్షాల తీవ్ర వ్యతిరేకత, మద్దతు ఉపసంహరణల మధ్య అమెరికాతో అణు ఒప్పందాన్ని నెగ్గించుకోడానికి తన అధికారాన్ని సైతం పణంగా పెట్టి మన్మోహన్ సింగ్ గొప్ప పోరాటశీలాన్ని చాటిన తీరే ఇప్పుడు పునరావృతమైంది. కాకపోతే వామపక్షాల పాత్రను ఈసారి మమతా బెనర్జీ పోషించింది. అణు ఒప్పందం విషయంలో మన్మోహన్ చూపించిన తెగువే కాంగ్రెస్ ను మరోసారి అధికారపీఠం ఎక్కించిందని అనుకుంటే,    ఈసారి కూడా అదే జరుగుతుందా?! ఏమో, కాలమే చెప్పాలి.

చిల్లర వ్యాపారంలోకి ఎఫ్.డీ.ఐ ని అనుమతించడం మంచిదా, చెడ్డదా అన్నది వేరే విషయం. దాని గురించి విడిగా చర్చించుకోవాలి. ఆ చర్చకూడా ప్రజల కోణం నుంచి నిష్పాక్షికంగా జరగాలి. రాజకీయపార్టీలు స్పూన్లతో తినిపించే అభిప్రాయాలనుంచి కాక జనం సొంత బుద్ధిని కూడా ఉపయోగించుకుని ఒక అవగాహనకు రావాలి. ప్రభుత్వం అన్నది ఏదో చేస్తోందన్న భరోసా ప్రజలకు చిక్కాలనీ, మూడేళ్ళ తర్వాత మొదటిసారిగా మన్మోహన్ ప్రసంగం ఆ భరోసా ఇవ్వడానికి ప్రయత్నించిందని చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం. 

4 comments:

  1. అసలు విషయం రాయండి : చిల్లర వ్యాపారం లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం మంచిదా కాదా ?

    ప్రపంచీకరణ గురించి ఇదివరకు రాసిన మీ నుండి వినాలని ఉంది.

    ReplyDelete
    Replies
    1. సీతారాం రెడ్డి గారు, మీ స్పందనకు కృతజ్ఞతలు. ఊళ్ళో లేనందువల్ల జవాబు ఆలస్యమైంది, సారీ. చిల్లర వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం మంచిదా కాదా అనే విషయాన్ని విడిగా చర్చించాలనే ఉద్దేశంతో ఆ అంశంలోకి వెళ్లలేదు. త్వరలోనే దానిపై నా అభిప్రాయం రాస్తాను. ఏ అజెండానైనా ముందుకు తీసుకెళ్లడానికి పవర్ పాలిటిక్స్ ఎలా అడ్డుతగులుతున్నాయో సూచించడానికే ఈ వ్యాసంలో పరిమితమయ్యాను. ప్రపంచీకరణపై గతంలో నేను రాసిన వ్యాసాలు మీరు గుర్తుపెట్టుకున్నందుకు సంతోషం.
      మీ,
      కల్లూరి భాస్కరం

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. భాస్కరం గారు, లోపలి మనిషి కాక మీరు రాసిన ఇతర పుస్తకాల వివరాలు చెప్పగలరా? అని నాలుగు నెలల క్రితం అడిగాను. ఇప్పటివరకు మీనుంచి సమాధానం రాలేదు. చాలా సం|| క్రితం ఆ పుస్తకం చదివాను. అందులో అనువాదకులు గా మీ పేరు చూసి గుర్తుంచుకొన్నాను. అంతకుమించి నా కైతే మీగురించి ఎమీ తెలియదు. బహుశ మీరు చాలా పెద్ద రచయితో లేక పాత్రికేయులో అయి ఉంటారు. మీకు సమాధానం ఇవ్వటం వీలుపడి ఉండక పోవచ్చు. ఇది మరచిపోయి నిన్న మీ బ్లాగులో టపా చదివి వ్యాఖరాశాను. దానికి సమాధానం లేదు. అందువలన నా వ్యాఖ్యలను ఉపసంహరించుకొంట్టున్నాను.

    ReplyDelete