Monday, October 1, 2012

అమెరికాను చూసి ఏం నేర్చుకుంటున్నాం?

అమెరికా వెళ్ళి రావడమంటే ఒకప్పుడు చాలా గొప్పగా భావించేవారు. అమెరికా దాకా దేనికి, మన దగ్గరలో ఉన్న దేశాలను చూసి రావడం కూడా ఒకప్పుడు అపురూపమే. బయటి ప్రపంచం చూడకుండానే మన తాత ముత్తాతలు జీవితాలు చాలించేశారు. చివరికి సొంత రాష్ట్రం దాటి  పొరుగు రాష్ట్రానికి  కూడా వెళ్లనివారు ఎందరో?! తీర్థయాత్రలు ఇందుకు మినహాయింపు. అయితే, తీర్థయాత్రలను దేశాటనం కింద పూర్తిగా భావించలేం. తీర్థయాత్రలు ప్రధానంగా భక్తి, ముక్తి సాధనాలే తప్ప ప్రపంచజ్ఞానానికి ఉద్దేశించినవి కావు. కాశీ దాకా వెళ్ళి గంగలో మునిగి, విశ్వేశ్వరుని దర్శిస్తే చాలు పని అయిపోతుందనుకునేవారే ఎక్కువమంది.  నదికి, గుడికి బయట ఉన్న ప్రపంచాన్ని పరిశీలించాలనే ఆసక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది.

భారతదేశాన్ని కనీసం ఒక్కసారైనా చుట్టిరాకుండానే నేటికీ ఎంతోమంది కన్ను మూస్తున్న వాస్తవాన్ని తలచుకుంటే ఆశ్చర్యంగానే కాదు, చాలా బాధగా కూడా ఉంటుంది. స్వదేశం చూడకుండానే ఒక్కసారిగా అమెరికాకో, యూరప్ కో  లంఘించే పరిస్థితి ఇంకెంత వింతగా ఉంటుందో ఊహించుకోండి. అమెరికా వెళ్ళడం ఇప్పుడు ఏమంత గొప్ప కాదు. ప్రతి మధ్య తరగతి కుటుంబం నుంచీ కనీసం ఒక్కరైనా ఇప్పుడు అమెరికా లో ఉంటున్నారు. వాళ్ళ వెనకే తల్లిదండ్రులు కూడా అమెరికా వెళ్ళి వస్తున్నారు. ఈరోజున అట్లాంటిక్ దాటి అమెరికా వెళ్ళడం, మన ఊరి కాలువను బల్లకట్టు మీద దాటడమంత తేలికైపోయింది. కానీ మన దేశాన్నే మనం పూర్తిగా చూడలేకపోతున్న అశక్తత, లేదా అనాసక్తత మాటేమిటి?

ఈ దేశ పౌరులందరికీ భారతదేశం మొత్తాన్ని ఒకసారి చూసొచ్చే అవకాశం ప్రభుత్వం ఉదారంగా ఎందుకు కల్పించడం లేదన్న ప్రశ్న నాలో చాలా కాలంగా ఉంది. చూడాలనుకున్నవారిని ప్రభుత్వం అడ్డుకుంటోందని కాదు. జనం కోరని పథకాలను ఎన్నిటినో  ప్రభుత్వం స్వచ్ఛందంగా ప్రకటిస్తూ ఉంటుంది. కనుక కోరకుండానే ఒక టూరిస్టు ప్యాకేజినీ  ప్రకటించచ్చు. ప్రకటిస్తే సరిపోదు, దానికి విస్తృతమైన ప్రచారమూ ఇవ్వాలి. జనంలో దేశాటనంపై ఆసక్తిని ప్రోత్సహించాలి. నిజానికి, ఎవరి ప్రోత్సాహమూ లేకుండానే ఇటీవలికాలంలో జనంలో సంచార ఆసక్తి పెరిగింది. రైళ్లలో తత్కాల్ సౌకర్యం ప్రవేశపెట్టాక కూడా రిజర్వేషన్ దొరకడం కష్టమైపోతోంది. పండగ రోజుల్లో హైదారాబాద్ బస్ స్టేషన్ ప్రయాణీకులతో కిట కిట లాడి పోతుంటుంది. స్పెషల్ బస్ ల పేరుతో మామూలు బస్ లు నడుపుతూ, 'స్పెషల్' ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణీకుల జేబుకు కన్నం వేయడానికే ఆర్టీసీ ఎక్కువ ప్రాధాన్య మిస్తోంది. మొత్తం మీద వెనకటి కంటే ఇప్పుడు ప్రయాణాలు అనేక రెట్లు పెరిగాయి. ఈ ఆసక్తిని సొమ్ము చేసుకోవాలనే ఆసక్తి ప్రభుత్వంలో పెరగకపోవడమే ఆశ్చర్యం.

ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులకు ఎల్టీసీ పేరిట ఒక సదుపాయాన్నికల్పించిన మాట నిజమే. అయితే, ఇంటి గడప కూడా దాటకుండానే, ఎక్కడెక్కడికో వెళ్ళినట్టు చూపించి ఎల్టీసీని 'క్యాష్' చేసుకునే వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. నేను అనే దేమిటంటే, ఉద్యోగులకే కాకుండా, పౌరులందరికీ ఒక్కసారైనా దేశాటనం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. కొన్ని మినహాయింపులతో దానిని కొంతవరకు నిర్బంధం చేసినా తప్పులేదు. తీర్థయాత్రా స్పెషల్స్ తోపాటు దేశయాత్రా స్పెషల్స్ కూడా అవసరం. విదేశీపర్యాటకులను ఆకర్షించాలనుకుంటే సరిపోదు, దానితోపాటు దేశీయంగా కూడా పర్యాటనను ప్రోత్సహించాలి.

ఇంతకంటే నన్ను వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఈ విషయంలో అమెరికా అనుభవం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామని? మన మంత్రులు, లెజిస్లేచర్లు మంది డబ్బు భారీగా ఖర్చు పెడుతూ రక రకాల పేర్లతో జట్లు జట్లుగా విదేశాలకు వెళ్లొస్తుంటారు. వీళ్లలో ఎవరైనా అమెరికా పర్యాటక రంగాన్ని ఎంతవరకూ పరిశీలించారో, ఎంతవరకు స్ఫూర్తి పొందారో తెలియదు. మన దేశంలో ఆ అనుభవాన్ని వాడుకోడానికి  ప్రయత్నించిన దాఖలాలు కనిపించవు. అమెరికాను చూసి మనం నేర్చుకునేదేమిటని ఆక్షేపించేవారూ మనలో చాలామందే ఉన్నారు. అమెరికా నడకలో మనకు నచ్చని విషయాలు చాలానే ఉండచ్చు. ఏ దేశంలో నైనా ఇంకో దేశం వారికి నచ్చని పోకడలు ఉంటూనే ఉంటాయి. అలాగని మంచిని కూడా తోసిపారేయక్కరలేదు.

ఉదాహరణకు, అమెరికన్లు పురాతన కట్టడాలను, చిహ్నాలను చాలా జాగ్రత్త్గగా కాపాడుతూ గొప్పగా షోకేసింగ్ చేసి ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు, చారిత్రక ప్రదేశాలలో భారీ ఎత్తున స్మారక నిర్మాణాలు చేసి తమ చారిత్రకతను సగర్వంగా చాటుకుంటూ ఉంటారు. ప్రకృతికి సంబంధించిన ప్రాచీన అవశేషాలను, విశేషాలను కూడా అంతే శ్రద్ధతో పదిలపరచి జనానికి చూపిస్తూ ఉంటారు. ఈ దేశంలో ఆకురాలు కాలం(ఫాల్) కూడా పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షించే పర్యాటక విశేషమే. ఆ సమయంలో రక రకాల రంగులు ధరించే చెట్లను చూసి తీరాలనే ప్రచారం ఆ నోటా ఆ నోటా జరిగిపోతూ ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రచారమహిమ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాగని కేవలం ప్రచారంగానే అన్నింటినీ కొట్టి పారేయవలసిన అవసరంలేదు. నిజంగానే అవి ఆహా అనిపించేలానే ఉంటాయి. అలా అనిపింపజేయడానికి ఎంత శ్రద్ధ తీసుకోవాలో అంత శ్రద్ధా తీసుకుంటారు. వినియోగదారుని సంతృప్తి పరిచే పెట్టుబడిదారీ మెళకువలను అన్నింటినీ ప్రయోగిస్తారు. శని, ఆదివారాలలో చూస్తే అమెరికా అంతటా ప్రజల జీవన యాత్ర  హాయిగా హుషారుగా  సాగిపోయే విహారయాత్రలానే ఉంటుంది. ప్రతిచోటా  రోడ్లమీద  రిక్రియేషన్ వెహికిల్స్ కనిపిస్తాయి. కార్లకు, ట్రక్కులకు చిన్న చిన్న బోట్లు కట్టుకుని బోట్ రైడింగ్ కు సకుటుంబ సమేతంగా వెళ్లిపోతుంటారు. ఎక్కడ చూసినా  పెద్ద పెద్ద సరస్సులతో, నదులతో అమెరికా అంతటా జలకళ తాండవిస్తూ ఆహ్లాదం గొలుపుతుంది. ప్రకృతి సిద్ధమైన  వనరులను పాడు చేయకుండా వాటిని వీలైనంతవరకు పర్యాటక ప్రదేశాలుగా తీర్చి దిద్దడానికి అమెరికన్లు ప్రాధాన్యమిస్తారు. అలాగే అమెరికాను పూర్తిగా  'జనారణ్యం'గా ఊహించుకుంటే పొరబడ్డారన్న మాటే. నిజానికి అమెరికా చాలాచోట్ల ఒక అరణ్యంలా కూడా కనిపిస్తుంది. ఒక మహానగరాన్ని అనుకునే ఒక అటవీ ప్రాంతం హఠాత్తుగా దర్శనమిస్తుంది. వేల మైళ్ళ పొడవున విశాలమైన రహదారులు నిర్మించడానికి, నగరాలను అభివృద్ధి చేయడానికి అమెరికన్లు ఏ స్థాయిలో అటవీ విధ్వంసం జరిపి ఉంటారో ఊహించుకోవచ్చు. 'పాపపరిహారం' గానే కాబోలు ప్రతిచోటా పచ్చదనాన్ని కాపాడడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు.

తక్కువ జనాభా, ఎక్కువ విస్తీర్ణత, సంపద, ఇతరేతర వనరులు ఉన్న అమెరికాతో మన దేశాన్ని పోల్చడం అన్యాయమనిపించచ్చు కానీ కొన్ని విషయాల్లో పోల్చకుండా ఉండలేం. పురాతనత్వాన్ని పదిలపరచడంలో వారు చూపించే ఆసక్తినే గమనించండి. దేనినైనా అంగడి సరుకుగా మార్చే పెట్టుబడిదారుడి తెలివి సరే,  అదెలాగూ ఉంటుంది. దాంతోపాటు  చారిత్రక  వారసత్వంపై వారి మమకారం  కూడా ఉట్టిపడుతూ ఉంటుంది.  పురాతన నిర్మాణాలు, ప్రదేశాల రూపురేఖలు చెడకుండా జాగ్రత్త తీసుకోవడమే కాదు, వాటి చరిత్రను పొందుపరిచే ఫలకాలను కూడా ఏర్పాటు చేసి, వాటిని పర్యాటక ఆకర్షణలుగా తీర్చి దిద్దుతారు. అందుకే న్యూయార్క్ లాంటి మహానగరాల్లో సైతం మూడు వందల సంవత్సరాలకు పైగా అస్తిత్వం ఉన్న కట్టడాలు, పార్కులు వగైరాలు నేటికీ ఉన్నాయి. చారిత్రక ఘటనలకు సంబంధించిన వివరాలను, సామగ్రిని, చిహ్నాలను భద్రపరచి, ప్రదర్శించడంలో అమెరికన్లు చూపించే శ్రద్ధ కరడు గట్టిన అమెరికా వ్యతిరేకులను కూడా ముగ్ధుల్ని చేసి తీరుతుంది. వలస జ్ఞాపకాలకు అద్దం పట్టే  న్యూ యార్క్ లోని ఎల్లిస్ ఐలాండ్ ఒక ఉదాహరణ. 19 వ శతాబ్ది చివరిలో అట్లాంటిక్ దాటి పశ్చిమ యూరప్, తూర్పు యూరప్ దేశాలనుంచి అనధికారికంగా హడ్సన్ నది ద్వారా అమెరికాలోకి అడుగుపెట్టే వలస జనాల అస్తిత్వ పోరాటం మొత్తం అక్కడ కళ్ళకు కడుతుంది. వాళ్ళు వెంట తెచ్చుకున్న తట్టా, బుట్టా; అప్పటి చాయా చిత్రాలు వలస చిత్రాన్ని, చరిత్రను సజీవంగా ప్రదర్శిస్తాయి. ఏ యే దేశాలనుంచి వలస వచ్చారో సూచించే గ్రాఫిక్స్ ను కూడా అక్కడ చూడచ్చు. అప్పుడు అలా వలస వచ్చిన కోటీ ఇరవై లక్షల మంది వలస జీవులే నేటి 10 కోట్లమంది శ్వేతాజాతి అమెరికన్లకు పూర్వీకులు. అయితే,  కొన్ని స్మారక నిర్మాణాలు వలసపాలనలో మగ్గిన చరిత్ర ఉన్న మన దేశం లాంటి దేశాలవారికి దురహంకార చిహ్నాలుగా కూడా కనిపిస్తాయి. పశ్చిమ ప్రాంతంలోకి విస్తరణకు గుర్తుగా సెయింట్ లూయిస్ లో నిర్మించిన ఎత్తైన తోరణం(ఆర్చ్) అలాంటిదే.

అమెరికాలో  పర్యాటకులు విశ్రాంతి తీసుకోడానికీ, ఆహ్లాదకరమైన పరిసరాలలో గడపడానికీ చేసే ఏర్పాట్లు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. చాలా చోట్ల  పర్యాటక ప్రదేశాలను ఆనుకుని పార్కులు, పచ్చదనంతో కనువిందు చేసే పరిసరాలు ఉంటాయి. పర్యాటక ప్రదేశానికి సంబంధించిన ఏ చారిత్రక వివరాన్నీవాళ్ళు  విడిచిపెట్టరు. దాని అభివృద్ధికి పట్టిన కాలమూ, అయిన ఖర్చూ, నిర్మాణంలో పాల్గొన్న కార్మికుల  సంఖ్య, డిజైన్ చేసిన ఇంజనీర్ల వివరాలతో సహా అన్నింటినీ పూస గుచ్చినట్టు తెలిపే ఫలకాలను ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదేశం అభివృద్ధికి ఆటంకాలు ఏవైనా ఎదురైతే వాటి గురించీ తెలియజేస్తారు. నయాగరా ఫాల్స్ ను పర్యాటక ఆకర్షణగా తీర్చి దిద్దడానికి అవసరమైన స్థల సేకరణ వగైరాలకు స్థానికులనుంచి ఎదురైన ప్రతిఘటన గురించీ, దానిని అధిగమించడం గురించీ తెలిపే సమాచారమంతా అక్కడ కనిపిస్తుంది. వినోదంతో సమానంగానే కాక అంతకంటే ఎక్కువగా విజ్ఞానాన్ని రంగరించడం పర్యాటక ప్రదేశాల అభివృద్ధి వెనుక అమెరికన్లు పాటించే ప్రధానసూత్రంగా కనిపిస్తుంది. జంతు ప్రదర్శన కేంద్రాలు, చరిత్ర, సంస్కృతి, ప్రాకృతిక చరిత్ర, పురామానవ చరిత్ర, శాస్త్రవిజ్ఞాన ప్రగతి వగైరా మానవ అస్తిత్వంతో ముడిపడిన ప్రతి అంశానికి చెందిన మ్యూజియంలు అమెరికాలో దాదాపు ప్రతిచోటా ఉంటాయి. ప్రతి ఏర్పాటు అక్కడ ఒక విజ్ఞానసర్వస్వంలా కనిపిస్తుంది.

ఇంతా చేసి అమెరికన్ల చరిత్ర అంతా అయిదు వందల ఏళ్లను మించి లేదన్న సంగతినీ(స్థానిక తెగల చరిత్రను అలా ఉంచితే) మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ చరిత్రనే వాళ్ళు సగర్వంగా ప్రదర్శించుకుంటుంటే, అయిదువేల సంవత్సరాల చరిత్ర ఉన్న మనమేం చేస్తున్నాం? ఆర్థిక వనరుల దృష్ట్యా అమెరికన్ల స్థాయిలో మనం అన్నీచేయలేక పోవచ్చు, కనీస స్థాయిలోనైనా ఏమైనా చేస్తున్నామా? వాళ్లకూ, మనకూ ముఖ్యమైన తేడా కేవలం వనరుల లోపం కాదు, దృష్టి లోపం. ప్రాచీనతను పదిలపరచాలన్న తపనే మనకుంటే, మార్గాలు వాటంతట అవే స్ఫురిస్తాయి. అమెరికాతో మనకు సాటేమిటనుకుని ఇతరేతర విషయాల్లో చేతులు కట్టుకుని కూర్చుంటున్నామా? ఎన్ని విషయాల్లో వాళ్ళను అనుకరించడానికి ప్రయత్నించడం లేదు? అమెరికాతో పోటీ పడి మనం కూడా అంతర్జాతీయశక్తిగా మారాలని అనుకోవడం లేదా?

చారిత్రక సంపద పట్ల మన అలక్ష్యం గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తే గుండె చెరువవుతుంది. హరప్పా నగర ప్రాకారానికి బయట ఉన్న ప్రాచీన భవనాల ఇటుకలతో దాదాపు వంద మైళ్ళ రైలుకట్టను పోశారనీ, అయిదు వేల జనాభా ఉన్న ఆధునిక గ్రామాన్ని నిర్మించారనే సంగతి మనలో ఎంతమందికి తెలుసు? గార్డెన్ చైల్డ్ రాసిన 'చరిత్రలో ఏం జరిగింది?' అన్న పుస్తకం చదివాకే ఈ విషయం తెలిసింది. మన దేశంలో పురావస్తు పరిశోధనా శాఖ అంటూ ఒకటుంది. అది కూడా పేరుకు తగినట్టే మట్టి కొట్టుకుని, వెలిసిపోయి నిస్తేజంగా పడుంటుంది. మన దేశంలో బౌద్ధ ఆరామాలు, గుహలు, దిబ్బలు చాలా చోట్ల ఉంటాయి. అలాగే, పురాతన దుర్గాలు, కోటలు, గుడులు ఉంటాయి. వాటిలో ఎన్నో నేడు  పశువుల్ని మేపుకునే ప్రదేశాలుగా మారిపోయాయి. ఓసారి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు, దగ్గరలోని జీలకర్రగూడెం అనే గ్రామానికి సమీపంలో 2వ శతాబ్ది నాటి బౌద్ధ ఆరామం ఉందంటే సైకిళ్ళ మీద అక్కడికి వెళ్ళాం. మధ్యాహ్నం వేళ కూడా ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. ఆ ప్రాంత సంరక్షణ దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. విచిత్రం ఏమిటంటే అక్కడ పురావస్తు విభాగంవారి బోర్డ్ ఒకటి పూర్తి శిథిలావస్థలో అక్షరాలు చెరిగిపోయి వెలిసిపోయి ఇతర శిథిలాల మధ్యే పడుంది. అమెరికాలో అయితే ఇటువంటి పరిస్థితిని ఊహించడమే కష్టం. వారు అలాంటి ప్రదేశాన్ని అన్నివిధాలా సంరక్షిచడమే కాదు, దానిని పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్నీ హంగులూ కల్పిస్తారు. దానిని ఆనుకుని ఒక పార్క్ తయారవుతుంది. దుకాణాలు, తినుబండారశాలలు వెలుస్తాయి. హోటళ్లు అవతరిస్తాయి. చూస్తుండగానే అక్కడో పట్టణం ఏర్పడుతుంది. పర్యాటకులను ఆకర్శించేందుకు అవసరమైన ప్రచారం పుంజుకుంటుంది.  వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన దేశం అంతటా ఇటువంటి పురాతన ప్రదేశాలు ఏ సంఖ్యలో ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. వాటన్నింటినీ ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తే దేశంలో పర్యాటక రంగం ఎంతగా పుంజుకుంటుందో ఎంత ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయో ఒకసారి ఆలోచించండి. ప్రకృతి సిద్ధమైన జలపాతం కావడం నయాగరా ప్రధాన ఆకర్షణ కావచ్చు. అంతమాత్రాన మన నాగార్జునసాగర్ ఆకర్షణను కొట్టి పారేయగలమా? సాగర్ ను పర్యాటక కేంద్రంగా మనం ఎంతవరకు అభివృద్ధి చేశాం? మన అరకు లోయ మాటేమిటి?

ముందే చెప్పినట్టు ఇందుకు వనరుల లోపం కాదు, కేవలం దృష్టి లోపమే కారణం. ఆయా చోట్లకు జనాన్ని ఆకర్షించడానికి ఏం చేయాలో మనకు తెలియక కాదు, తెలుసు. అయితే, భక్తి ప్రధానమైన ప్రదేశాలలోనే మనం ఆ పని చేస్తుంటాం. ఉదాహరణకు, ఎక్కడో ఒక విగ్రహం వెలిసిందనే ప్రచారం ప్రారంభమవుతుంది. దానిపై తాత్కాలికంగా ఒక నిర్మాణం జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభిస్తారు. దుకాణాలు వెలుస్తాయి. విగ్రహం ఉంచిన తాత్కాలిక ఆవాసం స్థానంలో చూస్తుండగానే పక్కాగా గుడి నిర్మాణం జరుగుతుంది. రక రకాల వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ఎటొచ్చీ చారిత్రక అవశేషాలే ఎవరికీ పట్టని అనాథలుగా మారి కాలగర్భంలో కలసి పోతుంటాయి. నదులు, ఇతర వనరుల పట్ల నిర్లక్ష్యమూ అదే స్థాయిలో ఉంటుంది. విజయవాడలో కృష్ణా నదిలో స్నానం చేయడానికి ఒకసారి ప్రయత్నించి చూస్తే మీకే అర్థమవుతుంది ఆ పరిసరాలు ఎంత దారుణంగా ఉంటాయో. ఒకసారి బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళి నప్పుడు పిల్లలు సరదా పడితే కృష్ణా నదికి స్నానానికి వెళ్ళాం. తీరా చూస్తే తీరం మొత్తం బహిరంగ పాయిఖానాయే. కంపరం పుట్టి స్నానం చేయకుండానే తిరిగి వచ్చేసాం. నదీ తీరాలను పరిశుభ్రంగా ఉంచలేకపోవడానికి, నదులను స్నానయోగ్యం చేయలేక పోవడానికి కూడా ఆర్థికవనరుల లోపమే కారణమందామా? కానేకాదు, కేవలం జనం పట్ల, సహజ వనరుల పట్ల దారుణమైన నిర్లక్ష్యమే కారణం. అదే అమెరికాలో అయితే జలవనరులను శుభ్రంగా ఉంచడమే కాదు, బోట్ రైడింగ్ వంటి ఏర్పాట్లతో వాటిని చక్కని విహార కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు.

దేశమంతటినీ ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి మన దేశంలో అవకాశాలు పుష్కలం. అయినా సరే, పర్యాటక రంగం అభివృద్ధి చెందకపోవడం తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆవేదన ముంచెత్తుతుంది. ఇందువల్ల నష్టం ఒక రకంగా కాదు బహుముఖాలుగా ఉంటుంది. సంరక్షణ లోపించడం వల్ల పురాతన చిహ్నాలు క్రమంగా పూర్తిగా అదృశ్యమైపోవడం వల్ల జరిగే నష్టం ఒక రకం. హరప్పా విషయంలో ఏం జరిగిందో పైన చెప్పుకున్నాం. ఓసారి సాయం సంధ్యలో విశాఖపట్నం నుంచి సింహాచలం వెడుతూ ఎదురుగా సువిశాలంగా పరచుకున్న పర్వతపంక్తి ఆవిష్కరించిన ప్రకృతి అందాలను చూసి ఆశ్చర్యపోయాం. సొంత రాష్ట్రమై కూడా  ఇంత అందమైన దృశ్యాన్ని ఇంతకాలం ఎందుకు చూడలేక పోయామనిపించింది. అయితే, ఇంకో షాకుకు కూడా మీరు సిద్ధంగా ఉండాలి. మరో పక్క ఆ కొండలను దారుణంగా తొలచి తవ్వి పారేస్తున్న విధ్వంస దృశ్యాలు! ఇలా చారిత్రక, ప్రాకృతిక వనరుల విధ్వంసం పర్యావరణకు, పర్యాటక రంగానికి, ఉపాధి అవకాశాలకు, ఆదాయానికీ కల్పించే నష్టం మరో రకం.

ఈ అత్యాచారాన్నినిరోధించడానికి, పర్యాటక అభివృద్ధిపట్ల అలక్ష్యాన్ని వదిలించడానికి మనమేమైనా చేయగలమా? ఒకసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. ఒక ప్రభుత్వం చేయగలిగిన పనిని వ్యక్తులంగా మనం చేయలేక పోవచ్చు. కానీ జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటే హక్కూ, అవకాశం మనకున్నాయి. దాంతోపాటు ఒక సమస్య పై ప్రజాభిప్రాయాన్ని సమీకరించే అవకాశమూ, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే వెసులుబాటు మనకున్నాయి. ప్రజాస్వామ్య మంటే ప్రజావాణితో ప్రభుత్వం చెవులకు పట్టిన తుప్పును వదలగొట్టడమే. చారిత్రక, ప్రాకృతిక అవశేషాల సంరక్షణను, వాటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఒక ఉద్యమ స్థాయిలో ప్రబోధించే అవకాశం మనకు లేదంటారా? మరి మీరేమంటారు?








1 comment:

  1. మన వాళ్ళ నుండి మీరు జరగనిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు...మన పాలకులు మీరు చెప్పిన విషయాల పై ఎప్పటికీ శ్రద్ద పెట్టరు గాక పెట్టరు......రాష్ట్ర స్థాయి నాయకులు కానీండి..జాతీయ స్థాయి నాయకులు కానీండి...మన వాళ్ళ ఎజెండాలు వేరే ఉంటాయ్...మన వాళ్ళ ద్యాస ఎప్పుడు భుక్తాయాసం వచ్చేట్టు సంపాయించడమే!!!

    ReplyDelete