Wednesday, October 10, 2012

అరవింద్ 'అన్నా' కేజ్రీవాల్ చర్చ మరికొంత...

అరవింద్ 'అన్నా' కేజ్రీవాల్ అండ్ కో వ్యాసంపై చాలామంది ఆసక్తి చూపించినట్టు గణాంకాలు సూచించాయి. పలువురు రాతపూర్వకంగా స్పందించారు. అందరికీ కృతజ్ఞతలు.

మధ్యతరగతి విద్యావంత వర్గం అన్నా ఉద్యమంతో కొంతవరకు మమేకమైన సంగతి తెలిసినదే. అలాంటివారు నా వ్యాసం చదివి నేను ఆ ఉద్యమాన్ని సమర్థించడంలేదనే నిర్ణయానికి చటుక్కున రావచ్చు. నిజానికి ప్రజాజీవనాన్ని అన్నివిధాలా కలుషితం చేసి, కొన్ని తరాలపాటు నష్టం కలిగించే అవినీతిని అంతమొందించడం లక్ష్యంగా జరిగే ఏ పోరాటాన్ని అయినా బాధ్యతగల ప్రతి పౌరుడు సమర్థించవలసిందే. అలాగే నేనూ సమర్థిస్తాను. నేను పై వ్యాసంలో చేసిందల్లా ఆ ఉద్యమ గమనాన్ని విశ్లేషించడమే. అందులోని కొన్ని లోపాలను ఎత్తి చూపడమే. ఒక మంచి కారణం తో మొదలైనంత మాత్రాన ఒక ఉద్యమం దానికదే మంచిదీ, ప్రశ్నించడానికి వీలు లేనిదీ అయిపోదని చెప్పడమే నా ఉద్దేశం. దాని మంచి చెడులపై ఒక కన్ను వేసే ఉంచాలి. అవసరమైన హెచ్చరికలు చేస్తూనే ఉండాలి. లేకపోతే ఆ ఉద్యమానికే కాదు, భవిష్యత్తులో అదే అంశం మీద చేపట్టే ఉద్యమాలకు కూడా తీరని నష్టం జరుగుతుంది.

నేనేదో ఉద్యమానికి వక్రభాష్యం చెబుతున్నాననీ, మనం చేయలేని పనిని ఎవరో చేస్తున్నందుకు సంతోషించకుండా అడ్డు చెప్పే నైచ్యానికి పాల్పడుతున్నానని ఒక పాఠకుడు లుంపెన్ భాషలో ఆవేశాన్ని కుమ్మరించుకున్నారు. అంతేకాకుండా విశ్లేషణనూ, లాజిక్కునూ కూడా అవహేళన చేశారు. వర్తమాన రాజకీయాలపై, అవినీతిపై ఉన్న ఏవగింపే ఆ అసహనంలో ఆవేశంలో వ్యక్తమవుతోందనుకున్నా విద్యావంతులు కూడా విశ్లేషణను, లాజిక్కును ఆక్షేపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దగా చదువు సంధ్యలు, అవగాహనాశక్తి ఉండవనుకునే జనసామాన్యంలో కూడా విశ్లేషణ, లాజిక్కు అంతర్లీనంగా ఉంటాయి. వాళ్ళు కూడా గుడ్డిగా ఏ పనీ చేయరు, ఎవరినీ సమర్థించరు. దానినే మనం కామన్సెన్స్ అంటాం. ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపించడంలో ఆ కామన్సెన్స్ వ్యక్తమవుతూనే ఉంటుంది. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి వగైరా కొన్ని మంచి పనులు చేశారనుకుంటాం. అయినా సరే, వరసగా రెండుసార్లు జనం ఆయనను అధికారానికి దూరంగా ఉంచారంటే, తమకు నచ్చనివేవో ఆయనలో ఉన్నట్టు కనిపెట్టడమే కారణం. అప్పటి ఆ  జనహృదయానికి అక్షరరూపం ఇస్తే అందులో విశ్లేషణా, లాజిక్కే కనిపిస్తాయి. ప్రజాక్షేత్రంలో ఉన్న కేజ్రీవాల్ కైనా మరొకరికైనా థింక్ ట్యాంక్, ఆలోచనా వనరులు అవసరమవుతాయి. ఆవేశం అడుగు వేయించచ్చు కానీ ఆ తర్వాత ముందుకు నడిపించవలసింది ఆలోచనే. కామన్సెన్స్  మీద పనిచేసే ప్రజాభిప్రాయమూ;  విశ్లేషణ, లాజిక్కు తప్పనిసరిగా ఉండే మీడియా, ఇతర వర్గాలు సపోర్ట్ బేస్ గా ఉన్నాయి కనుకే అన్నా ఉద్యమం శక్తిమంతమైన ప్రభుత్వాన్ని ఢీ కొనగలిగిందన్న సంగతిని మరచిపోకూడదు. తాము సపోర్ట్ బేస్ గా ఉన్న ఒక ఉద్యమం దారి తప్పుతోందనుకున్నా, తప్పుడు సంకేతాలిస్తోందనుకున్నా ఆ విషయం వెల్లడించి హెచ్చరించే హక్కూ, బాధ్యతా కూడా వాటికి ఉంటాయి. జనాన్ని మైనస్ చేసి ఉద్యమం మొత్తాన్ని వ్యక్తులకు ఆపాదించి వాళ్ళు నిప్పుల్లోకి దూకుతుంటే చప్పట్లు కొట్టి, ఆ తర్వాత  అమరవీరుల్నిచేసి మెడలో దండ వేసే మనస్తత్వమూ మంచిది కాదు.

నా వ్యాసాన్ని మరోసారి నిదానంగా చదివితే, నేను 'పిల్లి' అన్న చోట మీరు 'మార్జాల' మంటున్న సంగతిని మీరే పోల్చుకుంటారు. నేను ఉద్యమం విఫలమార్గం పట్టిందని అంటూ ఎలా పట్టిందో చెబితే, ఉద్యమం తొలి ప్రయత్నాలలో విఫలమైందని మీరూ అంటున్నారు. అలాగే, (రాజకీయ)వ్యవస్థలో స్తబ్దత ఏర్పడినప్పుడు బాహ్యశక్తులు జోక్యం చేసుకుని దానిని వదిలించే ప్రయత్నం చేయాలని మీరంటే; రాజకీయేతరంగా కొంత జాగాను సృష్టించుకోవాలని నేనన్నాను. లోక్ సత్తా కానీ, అన్నా ఉద్యమం కానీ  రాజకీయ పార్టీ గా మారి అదే రాజకీయ మేళంలో చేరడంలోని ప్రయోజకత్వమూ, ఔచిత్యమూ ఏమిటన్నవి ఇప్పటికీ నా ఓపెన్ ప్రశ్న. చటుక్కున నిర్ణయానికి రాకుండా  ఇలాంటి వాటిపై అభిప్రాయాలు కలబోసుకోవచ్చు. అయితే అది ఆవేశాలకు దూరంగా ఆలోచనా సహితంగా జరగాలి.

మరింత స్పష్టత కోసం నా వ్యాసంలోని అంశాలను క్రోడీకరిస్తూ, అవసరమైన చోట అదనపు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

1. అన్నా టీం తాము ఎంత దూరం వెళ్లగలరో ముందుగా అంచనా వేసుకోలేదు. ఉద్యమం రూపురేఖల్ని స్వభావాన్ని నిర్వచించుకోలేదు. అడహాక్ పద్ధతిలో ట్రయల్ అండ్ ఎర్రర్ విధానంలో ముందుకు వెళ్లారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అప్పటికే అనుభవం ఉన్న అన్నా హజారేకు మొదట్లో కొంత స్పష్టత ఉండి ఉండచ్చు. అవతలనుంచి ఎలాంటి దాడి ఎదురవుతుందో, దానిని ఎలా ఎదుర్కోవాలో కొంత అవగాహన ఉండి ఉండచ్చు. అయితే ఢిల్లీ చేరేటప్పటికి అక్కడి అనుచరబృందం వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకుంది. చూస్తుండగానే ఉద్యమం అనుమానాలు, అపోహల మార్గం పట్టింది. రాజకీయేతరంగా ప్రారంభమైనట్టు కనిపించిన ఉద్యమం చివరికి రాజకీయ పార్టీగా పైకి తేలాలనుకోవడం దీని పర్యవసానం.

2. అన్నా ఉద్యమంపట్ల తొలి విశేష స్పందనకు కారణం అది ఫ్రెష్ గా రాజకీయేతర స్వభావంతో అడుగుపెట్టడమే. అప్పటి నేపథ్యం కూడా అందుకు కారణం. కానీ అన్నా బృందం రాజకీయ ధ్వనులు చేయడం ప్రారంభించింది. బీజేపీకి బీ-టీం గా ముందుకొచ్చిందన్న అనుమానాలకు తావిచ్చింది. నేననడం కాదు, ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా మద్దతు ఇచ్చిన మీడియా కూడా మధ్య మధ్య దీనిని ప్రశ్నిస్తూనే వచ్చింది. అన్ని పార్టీలకూ సమాన దూరం పాటిస్తుందని జనం ఊహించుకున్న అవినీతి వ్యతిరేక పోరాటం కాంగ్రెస్-సెంట్రిక్ గా మారడం కొట్టొచ్చినట్టు కనిపించింది. 'ప్రజాపక్షం' అనుకున్న ఉద్యమం 'ప్రతిపక్షం' గా మారిపోయింది. ఇప్పటికే ప్రతిపక్షాలు చాలా ఉన్నాయి కనుక కొత్త ప్రతిపక్షం దేనికని జనం అనుకోవడం సహజం.  ఈ స్థితిలో ఉద్యమానికి మద్దతు పలచబడడంలో ఆశ్చర్యం లేదు. .

3. ఉద్యమంపై రాజకీయ సంబంధమైన ఆరోపణల్లో వాస్తవం ఉండకపోవచ్చు కూడా. ఆ మాట నా వ్యాసంలో కూడా అన్నాను. అయినా అనుమానాలకు కారణం ఇమేజ్ మేనేజ్ మెంట్ లో వైఫల్యం కావచ్చు. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నవారికి ఇమేజ్ మేనేజ్ మెంట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాకలు దీరిన రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో పరాకు చిత్తగించి చిక్కుల్లో పడుతుంటారని మనకు తెలుసు. అద్వానీ ఒక ఉదాహరణ. ఆయన పాకిస్తాన్ వెళ్లినప్పుడు జిన్నా అనుకూల వ్యాఖ్యలు చేసి ఆర్.ఎస్.ఎస్. మద్దతునూ, పార్టీ అధ్యక్షపదవినీ కోల్పోయారు.

4. లోక్ పాల్ అవసరం పట్ల జనంలో చైతన్యం కలిగించడం వరకూ బాగానే ఉంది. అన్నా ఉద్యమం అంతటితో ఆగకుండా లోక్ పాల్ కు సంబంధించిన శాసన ప్రక్రియలో కూడా జోక్యం చేసుకోడానికి ప్రయత్నించింది. పార్లమెంట్ లో క్రిమినల్స్ ఉన్నారా, స్వచ్చచరితులు ఉన్నారా అన్నది వేరే విషయం. అమలులో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రకారం ఒక శాసనం ఎలా ఉండాలన్నది పార్లమెంట్ సమష్టి వివేకమే నిర్ణయిస్తుంది. అది పార్లమెంట్ కు గల రాజ్యాంగ హక్కు. అయితే,  ఆ హక్కును కూడా ప్రశ్నించే భావ ప్రకటనా స్వేచ్ఛ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం లేదని ప్రకటించే వాక్ స్వాతంత్ర్యమూ అన్నా ఉద్యమానికే కాక ఎవరికైనా ఉంటుందనుకుంటే ఆ విషయం చెప్పాలి. కానీ అన్నా ఉద్యమం ఆ పని చేయలేదు. దాంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై అన్నా ఉద్యమ వైఖరేమిటన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోవడమే కాదు, దాని అపరిణత స్వభావాన్ని ఎత్తి చూపించే అవకాశం ప్రత్యర్థులకు ఇచ్చింది.

5. ప్రజాస్వామ్యంలో ఆయా సమస్యలపై జరిగే ఉద్యమాలు అమూర్త(యాబ్స్త్రాక్ట్) పోరాటాలుగా, నినాద ప్రాయాలుగా, ప్లేయింగ్ టు గేలరీ గా, వెలుతురు కాక వేడి మాత్రమే పుట్టించేవిగా మారి తేలిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అవినీతి వ్యతిరేక పోరాటం ఇందుకు మినహాయింపుగా కనిపించడం లేదు. అవినీతి ఉన్న మాట నిజమే, అవినీతిని చూసి ఆవేశ పడవలసిన మాటా నిజమే. అయితే మూలలోకి వెళ్ళి, అవినీతికి అవకాశాలు కల్పిస్తున్న వ్యవస్థాగతమైన లొసుగుల మీదా దృష్టి సారించాలి. టూ జీనే తీసుకోండి. అందులో అవినీతి ఎంత జరిగిందో నికరంగా మనకు తెలియదు. జరిగింది అవినీతా కాదా అన్న విషయంలో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ అవినీతి జరిగిందనడానికి అవకాశమిచ్చిన మంత్రి రాజా వ్యవహార సరళి గురించి మాత్రం నికరంగా తెలుసు. లేదా తెలుసుకోడానికి ఎక్కువ అవకాశముంది. ఉదాహరణకు, ఆయన కొన్ని విధివిధానాలను పాటించలేదు. పారదర్శకంగా వ్యవహరించలేదు. స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి మంత్రుల బృందం సూచనలను, ప్రధానమంత్రి సలహాను పరిగణనలోకి తీసుకోలేదు. పైగా 2000 సంవత్సరం నాటి ధరకు 2007 సంవత్సరంలో స్పెక్ట్రమ్ కేటాయించడం ఇంకో దారుణం. ఆరోపణలపై స్పందించడంలో ప్రధానమంత్రి చేసిన తాత్సారం మరో ఆక్షేపణీయాంశం.  చర్య తీసుకోమని కోరుతూ సుబ్రమణ్యం స్వామి రాసిన లేఖ ప్రధానమంత్రి కార్యాలయంలో ఎన్ని నెలలపాటు, ఎన్ని టేబుళ్ల చుట్టూ తిరిగిందో స్వయంగా ఆ కార్యాలయమే పూస గుచ్చినట్లు కోర్టుకు విన్నవించింది. కనుక మూలాలలోకి వెడితే అవినీతి వెనుక వ్యవస్థాగత వైఫల్యం కళ్ళకు కడుతుంది. జవాబుదారీ, పారదర్శకత లోపించిన ఫలితమని అర్థమవుతుంది. కానీ  లక్షా డెబ్భై వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందన్నదే ఎక్కువ ఫోకస్ అయింది. వ్యవస్థాగతమైన లొసుగులు ఉన్నంతకాలం టెలీ కమ్యూనికేషన్ల శాఖలోనే కాదు ఏ ప్రభుత్వ శాఖలోనైనా అవినీతి జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ కోణం ఎక్కువగా చర్చలోకి రావడం లేదు.

6. అన్నా ఉద్యమం సాటి పౌరసమాజ సంస్థలు, వ్యక్తుల మద్దతును ఎందుకు సమీకరించలేకపోయింది, ఉద్యమానికి విస్తృత ప్రాతిపదికను ఎందుకు కల్పించలేకపోయిందన్న ప్రశ్నలూ ఎదురవుతాయి. అది ఒంటెత్తు పోకడలు పోతోందన్న అభిప్రాయమూ కలుగుతుంది.

ఒక ఉద్యమం మంచిదైతే సరిపోదు. అనుమానాలకు, అపోహలకు తావివ్వకుండా అది సాగినప్పుడే ప్రయోజనం ఉంటుంది. అది విఫలమైతే అవుతుంది, కానివ్వండని మనం అనుకున్నా యుద్ధక్షేత్రంలో ఉన్న వాళ్ళు అనుకోలేరు.  ఆలస్యంగానైనా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోవలసివస్తుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రియాంకా గాంధీని గృహనిర్మాణానికి అనుమతించడం విషయంలో కాంగ్రెస్ తోపాటు బీజేపీకి  కూడా కేజ్రీవాల్ గురి పెట్టడం ఉద్యమానికి నిష్పాక్షిక స్వభావాన్ని తిరిగి ఆపాదించే ప్రయత్నం కావచ్చు. మీడియా ఊహాగానమే నిజమైతే ఈసారి రాబర్ట్ వద్రా తరహా ఆరోపణలను ఎదుర్కోవడం ప్రతిపక్షం వంతు కావచ్చు. ఆవిధంగా కోల్పోయిన విశ్వసనీయతను ఉద్యమం ఎంతో కొంత కూడదీసుకోవచ్చు. అయినా సరే, ఈ మార్గంలో తన పోరాటాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలుగుతుంది , ఏ మేరకు అవినీతి ముసుగు తొలగించగలుగుతుందన్న ప్రశ్నలు వ్రేలాడుతూనే ఉంటాయి. కాలమే వాటికి జవాబు చెప్పాలి.



  

2 comments:

  1. /లోక్ సత్తా కానీ, అన్నా ఉద్యమం కానీ రాజకీయ పార్టీ గా మారి అదే రాజకీయ మేళంలో చేరడంలోని ప్రయోజకత్వమూ, ఔచిత్యమూ ఏమిటన్నవి ఇప్పటికీ నా ఓపెన్ ప్రశ్న. /

    అది వాళ్ళమీద కాంగ్రెస్ చే రుద్దబడింది. వాళ్ళను బురదలో లాగితే, తమకున్న 60ఏళ్ళ నైపుణ్యంతో పడగొడదామని వారి ధీమా. బురద గట్టు మీద కూచుని బురదంటకుండా అదిలిస్తామనేది హజారే పాలసీ అయితే, బురదలో దిగి బురదపందిని బంధిస్తామనేది అరవింద్ లాంటి యువకులది. దూరంగా ముగ్గురి మీద రాళ్ళేసే పని, టైం-పాస్ అనాలసిస్‌కారులది.

    అంతగా ఏదో ఓ అనాలసిస్ చేయాలనుకుంటే, అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసే వారిని కేద్రమంత్రులతో రిసీవ్ చేయించడం, తిహార్ జైల్లో పెట్టడం, వాళ్ళను బెయిల్ కోరండని కాళ్ళా వేళ్ళా పడడం మీద చేయొచ్చు. 'అవినీతికి నిర్వచనం ఏమిటి?' అనే విషయం మీద మౌనీ సింగ్ గారు నిన్న నోరువిప్పారు చూడండి, దాని మీద చేయండి అనాలసిస్/సింథసిస్. నిర్వచనం లేకనే అవినీతి అంటే ఏమో తెలియక మేధావులు తికమక పడి, 60ఏళ్ళుగా అవినీతి గడ్డి మేసేస్తున్నారన్నది సింగడి గారి అనాలసిస్! నిదానంగా, సావకాశంగా మరో 50ఏళ్ళైనా పరవాలేదు, విశ్లేషించాల్సిన అంశం, మీరోపారి దృష్టి సారించాలి. :)

    ReplyDelete
  2. You may find it useful for your 'Analysis':

    http://www.timescrest.com/coverstory/the-k-factor-9000

    Note, "Kejriwal has consistently maintained that his entry into politics is not about winning or losing elections. It's about changing the way politics functions in the country so that it becomes people-centric and participatory instead of top down."

    ReplyDelete