Tuesday, October 23, 2012

నాయకన్, యశ్ చోప్రా వగైరా...


విజయదశమి శుభాకాంక్షలు
ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి సహజమైనవంటారు.
ఇరవయ్యో శతాబ్దపు మనిషి వీటికి అదనంగా ఇంకొకటి చేర్చుకోవాలి...అది, సినిమా. వెనకటి శతాబ్దాలలో అది నాటకం. ప్రతి కాలంలోనూ మనిషి ఏదో ఒక కళారూపాన్ని సృష్టించుకుని దానితో తాదాత్మ్యం చెందుతూనే ఉంటాడు. అందులో తన ప్రతిబింబాన్ని వెతుక్కుంటూనే ఉంటాడు.
 కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్యేకాదు; మనం సినిమాల మధ్య కూడా పెరుగుతాం. సినిమాల వెలుగులో మన ఊహాప్రపంచాన్ని నిర్మించుకుంటాం.  వ్యక్తిత్వాన్ని దిద్దుకుంటాం. వేషభాషలు అలవరచుకుంటాం. సినిమా మన మీద చూపించే పరోక్ష ప్రభావం గురించి చెప్పడం ప్రారంభిస్తే అదొక ఉద్గ్రంథమవుతుంది. వానకు తడవని వాడు ఉండనట్టే ఈ రోజుల్లో సినిమా చూడనివాడూ ఉండడు. ఇరవయ్యో శతాబ్దానికి చెందిన దాదాపు ప్రతి వ్యక్తి జీవితచరిత్రలోనూ సినిమా ఒక ముఖ్య అధ్యాయమవుతుంది. అయితే మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి.
ఇంకో విషయం...సినిమా మన సామాజిక పరిణామ చరిత్రను కూడా నమోదు చేస్తుంది.
అప్పుడప్పుడు నా సినిమా ప్రపంచాన్ని మీతో పంచుకునే ప్రయత్నానికి ఇదో చిన్న ఉపోద్ఘాతం.
                                                 *                                                                           
ఆదివారం(అక్టోబర్ 21) పొద్దుటే హిందూ పత్రిక తెరిచేసరికి అందులో నాకు ఆనందం కలిగించే అంశాలు రెండు కనిపించాయి. మొదటిది, నాయకన్(తెలుగులో నాయకుడు’) సినిమాపై కమల్ హాసన్ గతస్మృతులు. రెండోది, వంద కోట్ల వ్యయంతో, రామాయణం ఆధారంగా, రావణుడి కోణం నుంచి  ఒక సినిమా తీస్తున్నామనీ, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనీ మంచు విష్ణు చెప్పడం. ఇది ఆనందంతోపాటు భయమూ కలిగించింది. తెలుగు సినిమా కొత్త వస్తువు వేటలో (వస్తువు పాతదే అయినా కొత్తగా చెబుతారనే ఉద్దేశంతో)పడినట్టు అనిపించి ఆనందం. తగినంత పరిశోధన, లోతు వగైరాలు లేకుండా దానిని కూడా ఓ మూస సినిమాలా ఎక్కడ తయారుచేస్తారోనని భయం.
ఇంతలో ఆదివారం సాయంత్రమే ఒక విషాదవార్త! యశ్ చోప్రా మరణం.
ముందుగా నాయకన్ సినిమా గురించి. తెలుగులో ఆ సినిమా చూసి నేను ఎంత ముగ్ధుణ్ణి అయ్యానో చెప్పలేను. తెలుగులో మన బుద్ధినీ, హృదయాన్నీ కూడా స్పృశించే సినిమాలు చాలా తక్కువ. నాయకుడు ఇందుకు భిన్నం. అథోజగత్తుకు చెందిన నేరస్తులను తెర మీద చూపించడంలో సినిమాలు అనుసరించే మూస పోకడలను అది బద్దలు కొట్టింది. హింస నుంచి హింస ఎలా పుడుతుందో, హింస ఒక జీవిత అనివార్యంగా ఎలా మారుతుందో; హింసాత్మక జీవితం గడిపే వ్యక్తిలో కూడా మానవీయ సంవేదనలు ఎలా ఉంటాయో చాలా వాస్తవికంగా, అద్భుతమైన అవగాహనతో చిత్రీకరించిన సినిమా అది. తండ్రి హింసాత్మక జీవితాన్ని మొదటిసారి చూసిన కూతురు అతనిని అసహ్యించుకుంటుంది. నాన్నా, ఈ హింస మానలేవా?’ అని అడుగుతుంది. మానేస్తే నేను బతకలేనమ్మా అని తండ్రి సమాధానం చెబుతాడు. మధ్యతరగతి విద్యావంత వర్గం విశ్వసించే విలువలకు, ప్రాపంచిక అవగాహనకు; అథో జగత్ జీవితానికి మధ్య నున్న అంతరాన్ని ఆ ఒక్క సంభాషణే బయటపెడుతుంది. అలాగని ఆ సినిమా హింసను సమర్థిస్తుందని కాదు.  హింస పుట్టుక వెనుక నున్న సామాజిక నేపథ్యాన్ని ఎంతో లోతుగా గొప్ప అవగాహనతో మన ముందు ప్రదర్శిస్తుంది.  ప్రధానస్రవంతికి చెందిన ఒక కమర్షియల్ సినిమాలో కూడా మంచి లోచూపును, మేధస్సును రంగరించగలిగిన దర్శకుడు మణిరత్నం మామూలు దినుసు కాదని అప్పుడే అనిపించింది. ఈ సినిమా ప్రత్యేకతను విశ్లేషిస్తూ అప్పట్లోనే నేను ఓ పత్రికలో వ్యాసం రాశాను. తెలుగులో ఇంకెవరైనా రాశారో లేదో నాకు గుర్తులేదు.
టైమ్ మ్యాగజైన్ 100 గొప్ప సినిమాల జాబితాలో నాయకన్ ను చేర్చడం నా అంచనాకు ధృవీకరణ.
మనం సినిమాల మధ్య పెరుగుతామని పైన అన్నాను. కొన్ని సినిమాలు మన హృదయానికి మరీ దగ్గరవుతాయి. మన గతజీవన జ్ఞాపకాల పందిరిని మల్లె పొదలా అల్లుకుంటాయి. వక్త్, దీవార్ లాంటి యశ్ చోప్రా సినిమాలు అలాంటివి. నాకు సంగీతజ్ఞానం తక్కువ. సినిమా పాట విలువ కట్టగల నేర్పు ఉందని చెప్పలేను. అయినాసరే,  మీకు బాగా ఇష్టమైన పాట లేవని అడిగితే మొదట కభీ కభీ అని చెబుతాను. నిజానికి ఆ పాటలోని చాలా మాటలకు నాకు అర్థం తెలియదు. ఆ పాట వింటున్నప్పుడు పాటను మించి అందులో ఇంకేదో ఉందని  అనిపిస్తూ ఉంటుంది. శ్రావ్యతతోపాటు ఆ పాట ఏకాంతాన్ని ధ్వనిస్తూ అర్థం తెలియని ఏదో మధురమైన విషాదాన్ని గుండెల్లో నింపుతుంటుంది.  నాలాంటి ఎంతోమంది గతస్మృతులను నిరంతరం పరిమళ భరితం చేసే పారిజాతాలను సృష్టించిన యశ్ చోప్రాకు నివాళి.


No comments:

Post a Comment