Friday, October 26, 2012

గడ్కరీ వ్యవహారం: పారదర్శకతా లోపమే అసలు విలన్

మనం చాలాకాలంగా అవినీతి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య మరీ ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవలసిందే.
అలాగే, అవినీతినే అసలు విలన్ గా భావిస్తున్నాం. అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు కూడా అదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. అయితే అవినీతి విలనే కానీ అసలు విలన్ కాదు. అసలు విలన్ పారదర్శకత లోపించడం. అవినీతి చెట్టు అయితే పారదర్శకతా లోపం దానికి వేరు. వేళ్ళు వదిలేసి చెట్టు గురించి ఎంత చర్చించుకున్నా ఉపయోగం లేదు.
అందుకే నేను వెనకటి బ్లాగులలో పారదర్శకత అవసరాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నించాను. దానిని కొంతమంది అపార్థం చేసుకున్నారు కూడా. గడ్కరీ వ్యవహారమూ; బీజేపీ శ్రేణులూ, ఆర్.ఎస్.ఎస్. ఆయనను వెనకేసుకొస్తున్న తీరూ చర్చను పరోక్షంగా  అవినీతి వైపు కాక పారదర్శకతా లోపం వైపే నడిపిస్తూ నా అభిప్రాయానికి మరింత బలం కలిగిస్తున్నాయి.
గడ్కరీ వ్యాపారపు గుట్లు వాయిదాల పద్ధతిలో రోజుకొకటి చొప్పున  రట్టవుతున్నాయి చూడండి, అదే ఒక పెద్ద సాక్ష్యం. పూర్తీ గ్రూప్ గురించిన నిజాలను మీడియా ఒకటొకటిగా 'తవ్వి తీస్తే' తప్ప జనానికి తెలియలేదు. 120 కోట్ల జనాభాకు అన్నీ తెలియడం సాధ్యమా అని అనుకోవచ్చు. కానీ అవసరమైనప్పుడు 'తవ్వి' తీయనవసరం లేకుండానే తెలుసుకునే అవకాశం ఉండాలి. అదే పారదర్శకత. అది లోపించిందనడానికి అంతకంటే కొట్టొచ్చినట్టు కనిపించే సాక్ష్యం, మీడియా గుచ్చి గుచ్చి అడిగినా అన్నీ వివరాలనూ గడ్కరీ అందించకపోవడం, తనను 'వ్యాపారి' అన్నందుకే మొదట ఆయన ఆక్షేపించారు. ఆరోపణలను తీసిపారేస్తూ ఏ విచారణకైనా సిద్ధమన్నారు. పూర్తీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన  కంపెనీల చిరునామాల గురించి, డైరక్టర్ల గురించి అడిగినా ఆయన చెప్పలేదు. పదివేలమంది చిరునామాలు వెల్లడించడం ఇప్పటికిప్పుడు సాధ్యమా అని ప్రశ్నించారు. షెల్ కంపెనీలుగా తేలిన 18 కంపెనీల గురించి అడిగినా ఆయన నోరు విప్పలేదు. ప్రతి అంచెలోనూ పలుగూ, పారా పుచ్చుకుని మీడియాయే శ్రమపడవలసి వచ్చింది. పూర్తీ గ్రూప్ డైరక్టర్లలో గడ్కరీ డ్రైవరూ, బేకరూ, జ్యోతిష్కుడూ కూడా ఉన్నారనీ; ఒక్కొక్కరూ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారనే ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగు చూసింది. ముందు ముందు ఇంకెన్ని నిజాలు బయటపడతాయో తెలియదు. గమనించండి... తీవ్ర ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఈ వివరాలు అన్నీ వెల్లడించి తన వ్యాపార లావాదేవీలను తెరచిన పుస్తకంలా జనం ముందు ఉంచాలని గడ్కరీ అనుకోలేదు.
కారణం, పారదర్శకత గురించిన ఖాతరు లేకపోవడం!
ప్రజాక్షేత్రంలో పారదర్శకత అవసరాన్ని కొద్దో గొప్పో మనం గుర్తిస్తున్నాం కానీ, వ్యాపార వ్యవహారాలలో 'గుట్టు' పాటించడాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం. వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యవహారంగా చూస్తున్నాం. వ్యాపారమే వృత్తిగా ఉన్నవారు అలా అనుకోవడాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ 'రాజకీయ వ్యాపారుల' విషయంలో అదెలా చెల్లుతుందన్నది ప్రశ్న. పబ్లిక్ జీవితంలో ఉన్నవారు తమ ప్రైవేట్ లావాదేవీలలోకి ఎవరూ తొంగి చూడడానికి వీలు లేదంటే కుదరదు. సగం వెలుగులో, సగం చీకట్లో ఉంటామంటే వీలు పడదు.
గడ్కరీ, ఆయన సమర్థకులు చేస్తున్నది ఆ అసాధ్యమైన ఫీటే. షెల్ కంపెనీలు, తప్పుడు చిరునామాలు, తమ చేతికింది మనుషుల్ని డైరక్టర్లుగా నియమించుకోవడం వగైరాలన్నీ నేటి వ్యాపారరంగంలో సహజమే నని వారు భావిస్తున్నారు. అవన్నీ 'కార్పొరేట్ ప్రాక్టీసెస్' లో భాగమే నంటూ ఒక పెద్దమనిషి గడ్కరీని వెనకేసుకు వచ్చాడు. ఏ వ్యాపారసంస్థ ఇలాంటి వాటికి అతీతమో చెప్పండని ఒక ప్రొఫెసర్ ఆవేశపడ్డాడు. పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చడం ముఖ్యం కానీ మిగిలిన వాటిని పట్టించుకోనవసరం లేదని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తేల్చాడు. ఇక్కడ ఒక చిన్న ఔచిత్యాన్ని వీరందరూ విస్మరించడమే ఆశ్చర్యం. గడ్కరీని సాధారణ వ్యాపారులతో పోల్చడానికి వీలులేదు. ఆయన గతంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ తిరిగి అధికారం లోకి వస్తే మరోసారి మంత్రి కాగల అవకాశమూ ఆయనకు ఉంది. అంటే, 'కార్పొరేట్ ప్రాక్టీసెస్' పేరిట తప్పుడు పద్ధతులను, గోప్యతను  తలవంచుకుని అనుసరించే స్థితిలో కాక; వాటిని మార్చగలిగిన రాజకీయస్థానంలో ఉన్నారు. కనుక సాధారణ వ్యాపారులకు వర్తించే ప్రమాణాలు ఆయనకు వర్తించవు. ఇది గుర్తించడానికి కామన్సెన్స్ చాలు.
విలువలకు ప్రాధాన్యమిచ్చేదిగా చెప్పుకునే  పార్టీ స్పందనలో కూడా ఆ కామన్సెన్స్  లోపించడమే వింత. 'శీలనిర్మాణమే' లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పే ఆర్.ఎస్.ఎస్. గడ్కరీపై వచ్చిన ఆరోపణలు చిన్నవంటూ తీసిపారేయడం అంతకంటే విచిత్రం. అందరు వ్యాపారులూ చేసే పనే గడ్కరీ కూడా చేస్తే ఎందుకింత అల్లరి చేయాలని వాళ్ళ ఉద్దేశం. గోప్యతను బద్దలు కొడుతున్నందుకే మీడియా పై అంత అక్కసు. 'కార్పొరేట్ ప్రాక్టీసెస్' పేరిట తప్పుడు పనులను కూడా సహించాలన్న సందేశాన్నే తాము పరోక్షంగా అందిస్తున్నామన్న గ్రహింపు కూడా వీరికి లేదు.  నైతిక భ్రష్టత ఎంత దూరం వెళ్ళిందంటే, గడ్కరీ మంత్రి పదవిలో లేరు సరికదా, పార్లమెంటు సభ్యుడు కూడా కారనీ; అలాంటి ఒక ప్రైవేట్ వ్యక్తిని అల్లరి పెట్టడం న్యాయం కాదనీ రాజ్ నాథ్ సింగ్ అంటారు. మేము అధికారంలో ఉంటే నీతినియమాలను పాటిస్తామని ఆయన చేసిన మరో హాస్యాస్పదవ్యాఖ్య. అలాగే, గడ్కరీ వ్యవహారంలో ప్రజాధనం పాత్ర లేదు కనుక ఆయనను తప్పు పట్ట కూడదని చందన్ మిత్రా ఉవాచ. 'ప్రభువా, ఈ వాచాలతను క్షమించు, తాము ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు' అనడం కన్నా ఏమనగలం?
ఒకవేళ గడ్కరీ అమలులో ఉన్న 'కార్పొరేట్ ప్రాక్టీసెస్' నే గుడ్డిగా అనుసరించారనుకున్నా, ఐడియల్ రోడ్ బిల్డర్స్ నుంచి పెట్టుబడిని, రుణాన్ని తీసుకోవడంలో క్విడ్ ప్రోకోను అనుమానించే అవకాశం ఉండనే ఉంది. నిజంగానే గడ్కరీ వ్యాపార లావాదేవీలలో అవినీతి లేదనుకుందాం. మరి, ఉన్నట్టు అనుమానాలు వ్యాపించడానికి కారణం ఏమిటి?పారదర్శకతా లోపం. అవినీతి జరగడానికీ, జరిగిందన్న అనుమానం కలగడానికీ కూడా కారణం పారదర్శకతా లోపమే.  రాజకీయపార్టీలు ఆ దిశగా చర్చను నడిపించకపోవడానికి కారణం, పారదర్శకతా లోపంలోనే రాజకీయవ్యాపారుల స్వప్రయోజనాలు ఇమిడి ఉండడమా?!

1 comment:

  1. యస్! పారదర్శకతే కావలసింది.

    దానికి సమాధానం సమాచార హక్కు చట్టం వుంది కదా అనిపిస్తుంది. కానీ ఈ చట్టం కూడా పరిమితమైనది. సమాచారం నిర్నిమిత్తంగా ఓపెన్ గా ఉండాలి. కానీ ఇప్పుడు సమాచారం అడిగితే తప్ప దొరకదు. కాగితపు మాధ్యమపు పరిమితే అది. యెవరైనా ఎంతకని సమాచారం కొరకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు.

    సమాచారమూ, వ్యవహార క్రమ నమోదు కూడా ఎలెక్ట్రానిక్ ( కంప్యూటర్ ) మాధ్యమంతో నిర్వహిస్తూ దాన్ని ఓపెన్ గా ఉంచితే అడిగే వాడు దేబిరించకుండా ఇచ్చేవాడికి నొప్పి లేకుండా అవసరం ఉన్న అందరూ చూడొచ్చు. అప్పుడే నిజమైన పారదర్శకత వస్తుంది.

    ReplyDelete